Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue295/769/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)... అలా ఎంత సేపుందో కాని"ఏవండీ, కాత్యాయనిగారూ అలా రిసెప్షన్ లో నుంచుని ఆలోచనలో పడిపోతే, హాస్పిటల్ వాళ్లు ఊర్కోరండి. మిమ్మల్ని కూడా అడ్మిట్ చేస్కుని ఖరీదైన ట్రీట్ మెంట్ స్టార్ట్ చేసేస్తారు"అని నవ్వుతూ కాత్యాయని దగ్గరకు వచ్చాడు మనోహర్.

ఆమె కళ్లలో నీళ్లు, శరీరం కంపించడం చూసి ఏదో జరగకూడనిది, జరిగిందనుకుని "ఎందుకలా ఉన్నారు? కమలాకర్ గారు బానే ఉన్నారు కదా?"ఆందోళనగా అన్నాడు.

"మా ఆయనకు ఛారిటీ ట్రీట్ మెంట్ జరుగుతోందని ఎందుకు అబద్ధం చెప్పారు. మానుంచి ఏవాశించి అలా చెప్పారు?"అంది ఏడుస్తూ.
నిజం తనకు తెలిసిపోయిందని అర్థం చేసుకుని "మీరు ఇక్కడ ఎంట్రన్స్ లో ఏడుస్తూ నన్ను నిలదీస్తె అందరూ నన్నో అపరాధిలా చూస్తున్నారు. మీకంతా మంచే జరిగింది కదా! అన్నీ చెబుతాను. మీరూ నేనూ అలా బైటకెళ్లి పార్క్ లో కూర్చుని మాట్లాడుకుందాం. నా మాట వినండి"అన్నాడు ముందుకు కదులుతూ.

అందరూ తమని చూడ్దం గమనించి, అది సభ్యత కాదని తలచి, చేసేదేం లేక అతనేం చెబుతాడో వినాలని అతణ్ని వెంబడించింది.
పార్క్ లో కొంత ఇంటీరియర్ గా నడిచాక, నున్నటి రాళ్లున్న చోట తను కూర్చుని అతనికి కొద్ది దూరంలో ఉన్న రాయిని ఆమెకి చూపించి కూర్చోమని సైగ చేశాడు.

రాయిపై కూర్చున్న కాత్యాయని ఆకుపచ్చ చీరలో వనకన్యలా భాసిస్తోంది. ఆమె అందాన్ని కళ్లతో జుర్రుకుంటూన్న మనోహర్ ’చెప్పండి’అన్న ఆమె మాటతో ఈ లోకంలోకి వచ్చాడు.

"చూడండీ కాత్యాయని నేను చెప్పేది సావధానంగా వినండి. ప్రపోజల్ మీకు నచ్చితే ‘ఊ’ అనండి. లేదంటే లేదు. అంతేకాని అరచి గగ్గోలు చేయొద్దు. అఫ్కోర్స్ అలా చేసే మనస్తత్వం మీది కాదనుకోండి. విషయం ఏంటంటే- నేను పెద్ద సంస్థలో మంచి స్థాయిలో పని చేస్తున్నాను. డబ్బుకు కొదవలేదు. మనమాటల్లో చెప్పాలంటే, ఆడింది ఆట, పాడింది పాటలాంటి జీవితం నాది. ఎక్కడ ఏదేశానికి వెళ్లినా మందు, మగువ, విచ్చలవిడి జీవితం నా స్టైల్ ఆఫ్ లైప్. అలాంటిది మా ఏరియాలోనే ఒక మాల్లో మిమ్మల్ని చూశాక నా ఆలోచనలకు కేంద్రం మీరయ్యారు. అప్పటిదాకా కృతకత్వానికి అలవాటు పడిన నా జీవితానికి మీ సహజత్వం జీవం పోసింది. మీకు పెళ్లి కాకపోయుంటే, ఏవైనా చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాణ్ని. కాని దురదృష్టవశాత్తూ మీకు పెళ్లైపోయింది. మీమీది అభిమానంతో, ప్రేమతో ఎక్కడో పాష్ ఫ్లాట్ లో ఉండాల్సిన నేను
మిమ్మల్ని రోజూ గమనించొచ్చని మీ ఇంటి పక్కన ఉన్న ఫ్లాట్ లో దిగాను. మీకు తెలియకుండా మీకు సంబంధించిన ఎవ్విరి డిటేయిల్ కాప్చర్ చేశాను. మీ  హజ్బెండ్ కున్న ప్రాబ్లమ్..మీ ఫైనాన్సియల్ స్టేటస్ అన్నీ అన్నీ నాకు తెలుసు. నాక్కావాలనుకున్నదానిమీద నా ఇంటెలిజెన్స్, అవేర్నెస్, పొటెన్షియల్ అన్నీ అక్కడే ఫోకస్ చేస్తాను కాబట్టి, ఇంతవరకు నేను కావాలనుకున్నదేదీ నాకందకుండా లేదు. అందుచేత.."ఆమె వంక సూటిగా చూస్తూ ఆగాడు.

ఆమెకి విషయం చూచాయగా అర్థమవుతోంది. ఆమె గుండెలు గుబ గుబ లాడుతున్నాయి.‘అతని నోటినుంచి ఏం వినాల్సొస్తుందో’ అని.
ఉన్నట్టుండి పక్షుల కువకువలు చాలా డిస్ట్రబ్ద్ గా వినిపించాయి. ఆమె మనసులో తీవ్ర భావసంచలనం.

కొంత సేపటి తర్వాత ఎండుటాకు కదలిక కూడా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది. బహుశా ప్రకృతికి కూడా అక్కడ జరిగేది విని, చూడాలన్న కుతూహలం కలిగిందేమో.

"నాది బిజినెస్ మైండ్, నిజానికి నాదేంటి? అందరిదీ అంతే, అవసరాలు తీరే వరకే ఎవరికి ఎవరైనా. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా, తన అవసరాలు తీర్చని భర్తని అంటిపెట్టుకుని ఉండదు భార్య. అలాగే ఇంటి పనులు ‘తన అవసరాలు’ తీర్చని భార్యనీ సహించడు భర్త. తల్లిదండ్రుల అవసరం తీరంగానే విదేశాలకు తరలిపోయి తమదైన జీవితం సృష్టించుకుంటారు పిల్లలు. ఈ ప్రపంచంలో మానవ సంబంధాలన్నీ అవసరార్థం ఏర్పడే ఆర్థిక బంధాలే. అవి రక్త సంబంధాలైనా, ఏర్పరచుకున్నవైన ఒక్క మాటలో చెప్పాలంటే, రిలేషన్స్ అన్నీ బుల్షిట్" అన్నాడు.

"అందుచేత ఊభయకుశలోపరిగా..అంటే ఇద్దరికీ బెనిఫీసియల్గా ఒక ప్రొపోజల్ పెట్టబోతున్నాను. నేను ముందే చెప్పినట్టుగా మీకు సమ్మతమయితేనే యాక్సెప్ట్ చేయండి. మీరంటే నాకు అమిత ఇష్టం కాబట్టి, మీకు మాత్రమే నేనిస్తున్న అవకాశం ఇది. అదే మరొకరి విషయమో, మరొకటో అయితే ఈపాటికి అచీవ్ చేసి తీర్దును" అన్నాడు.

కాత్యాయని మ్రాన్పడిపోయింది. "ఏం..టం..డి అది"అంది వణకుతున్న గొంతుతో.

ఆమె వంక సూటిగా చూసి"మీరు ముందు వైబ్రేట్ అవకుండా స్టేబుల్ అవ్వండి. మనసును ప్రశాంతం చేసుకోండి. మీరేం వర్రీ అవ్వల్సింది లేదు. ఎందుకంటే మీరొప్పుకుంటేనే అన్నానుకదా!"అన్నాడు.

కొద్ది క్షణాల తర్వాత ‘అయ్యేది ఎలాగు అవకమానదు’ మనసులో అనుకుని కొంతవరకూ శరీరాన్ని, మనసును స్వాధీనంలోకి తెచ్చుకుంది.
అతను "కాత్యాయనీ.."అంటూ ప్రారంభించాడు.

*****

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana