Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue295/768/telugu-serials/anveshana/anveshana/

 

(గత సంచిక తరువాయి) ఇప్పుడు ఏది నిజమో... ఏది అబద్ధమో తేల్చుకోలేని విషమ పరిస్థితి. కానీ....?! తనెలా ముందుకెళ్ళాలి?! ఆలోచనలతో మౌనంగా ఉండిపోయాడు.

‘‘మీ సెల్‌ నెంబర్‌ ఇందులో ఫీడ్‌ చెయ్యండి.’ అంటూ తన సెల్‌ ఫోన్‌ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ చేతికి ఇచ్చింది శోభాదేవి.

‘శోభాదేవికి తన సెల్‌ నెంబరెందుకు?’ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌. కానీ, యాంత్రికం గానే నెంబర్‌ ఫీడ్‌ చేసి తిరిగి సెల్‌ శోభాదేవి చేతికిచ్చేసాడు.

‘‘మీరిక నాతో మాట్లాడాల్సింది ఏమీలేదు కదా!’’ కుర్చీలోనుండి లేచి నిబడుతూ అంది శోభాదేవి.

ఏమీ లేదన్నట్టు తల వూపి నిస్సత్తువగా కుర్చీలో నుండి లేచి నిలబడ్డాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు అక్కడ నుండి వచ్చేస్తోన్న వాడల్లా వెనక్కి తిరిగి అడిగాడు. అప్పటికే శోభాదేవి మేడ మీదకు వెళ్ళడానికి మెట్లెక్కుతోంది.

‘‘మేడమ్‌! చైర్‌ పర్సన్‌ శ్వేతాదేవి గారికి పెళ్లయి ఎంత కాలమైంది?’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘పది....పది సంవత్సరాలైంది.’’ మేడ మీదకు వెళ్లడానికి మొదటి మెట్టు మీద కాలేసిన శోభాదేవి ఒక్కసారే వెనక్కి తిరిగి చెప్పింది.

‘‘పిల్లలు....?!’’ అప్రయత్నంగా అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘లేరు....పిల్లలు లేరు.’’ ఆశ్చర్యంగా ఎస్సై అక్బర్‌ఖాన్‌ కేసి చూస్తూ అంది శోభాదేవి. ‘ఈ వివరాలతో ఈయనకి పనేమిటి?’ అనుకుంటూ.

‘‘నమస్తే! వస్తా మేడమ్‌’’ అంటూనే అక్కడ నుండి బయటకు వచ్చాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌. పోర్టికోలో ఎస్సై అక్బర్‌ఖాన్‌ కోసమే అన్నట్లు ఎదురుచూస్తూ నిలబడి వుంది ఆ అమ్మాయి.

‘‘థేంక్యూ మనోరమగారూ!’’ లోపల నుండి బయటకు వస్తూనే పోర్టికోలో నిలబడ్డ ఆ అమ్మాయిని చూసి నవ్వుతూ పలకరించాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘రండి...! మీరు వచ్చిన పని పూర్తయిందా?’’ నవ్వుతూ అంది మనోరమ.    ‘‘సగం అయినట్టే! సగం సందిగ్ధం!’’ ఆ అమ్మాయికేసి నవ్వుతూ చూసి అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘ఊర్లో ఉంటారా? లాగించేస్తారా?’’ అదోలా చూస్తూ అడిగింది మనోరమ. వెళ్లిపోతారా’ అనలేకపోయింది.

‘‘ఉండాలనే ఉంది. మీరు ఉండమంటే....ఆనందంగా ఉంటుంది. ఉంటాను.’’ నర్మగర్భంగా ఆ అమ్మాయి మొహం లోకి చూస్తూ అన్నాడు ఎస్సై.

‘‘అయ్యో! ఎంత మాట. మా నగరంలో కాలుపెట్టిన వాళ్లని నగరం అంతా తిరిగి చూడమంటాం గాని పొమ్మనం కదా! తమిళ పొంగలి రుచి  తెలియాలి కదా. నవ్వుతూ అంది ఆ అమ్మాయి.

‘‘ఈ దగ్గర్లోనే మంచి రూమ్‌ దొరుకుతుందంటారా?!’’ నవ్వుతూ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘పోలీస్‌ అధికారులు మీకు తెలీదా?’’ నవ్వుతూ అంది మనోరమ.

‘‘అది ఆంధ్రాలో. ఇక్కడ ఏమీ తెలీని అమాయకుడ్ని. దారీ తెన్నూ లేని బాటసారిని. చెప్పి పుణ్యం కట్టుకోండి.’’ తెలివిగా అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

ఈ అమ్మాయితో స్నేహం చేయగలిగితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ‘శోభాదేవి’ మాటల్లో ఏదో నిగూఢరహస్యమే దాగి ఉంది. సెల్‌నెంబర్‌ అడిగినప్పుడే ఏదో తెలియని నిజం నివురుగప్పి ఉందనిపించింది. అప్పుడే నిర్నయించుకున్నాడు. ఇక్కడ...చెన్నైలో రెండు రోజులుండైనా ‘రహస్యం’ తెలుసుకోవాలనుకున్నాడు.

‘ఈ అమ్మాయిని బుట్టలో వేసుకోగలిగితే తీగలాగొచ్చు’ అనుకున్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘వడపళిని తెలుసుగా. అక్కడ మంచి హోటల్స్‌ ఉంటాయి. మిడిల్‌ క్లాస్‌కి అందుబాటులో ఉంటాయంటారు.’’ నవ్వుతూ చెప్పింది మనోరమ.

‘‘థేంక్యూ! మిమ్మల్ని మళ్లీ కలవగలనా?’’ బేలగా చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘వడపళిని లోనే నేను ఉండేది. అవసరమైతే కాల్‌ చెయ్యండి.’’ అంటూ తన సెల్‌నెంబర్‌ చిన్న కాగితం బల్ల మీద రాసి ఇచ్చింది మనోరమ.
ఆ అమ్మాయి సెల్‌ నెంబర్‌ రాసిన కాగితం ముక్క తీసుకుంటూ కావాలనే చెయ్యి తాకి చిన్నగా వేళ్లతో గోకుతూ తీసుకున్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘నమస్తే....ఉంటానండి.’’ అంటూ రెండు చేతులూ జోడించి ఎస్సై అక్బర్‌ఖాన్‌కి వీడ్కోలు పలికింది మనోరమ. ఉన్నట్టుండి ఒక్కసారే ఆ అమ్మాయి అలా అని ‘వెళ్లిపొమ్మన్నట్టు’ వెనుదిరిగే సరికి మనసు చివుక్కు మంది ఎస్సై అక్బర్‌ఖాన్‌కి. దిగాలుగా ఆ కాంపౌండ్‌లో నుండి బయటకు వచ్చాడు. లోపల నుండి వస్తున్న ఎస్సై అక్బర్‌ఖాన్‌ని చూస్తూనే గేటు దగ్గరున్న గూర్ఖా తలుపు తెరిచి నిలబడ్డాడు. గేటు బయటకు రాగానే కొంచెం దూరంలో ఒక పాన్‌ షాప్‌ దగ్గర నిలబడ్డాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌తో వచ్చిన లోకల్‌ పోలీస్‌ రామ్‌.

‘‘సార్‌! సక్సెస్సా?’’ ఆనందంగా అడిగాడు రామ్‌.

‘‘లేదు భాయ్‌! నాకు వడపళినిలో ఒక రూమ్‌ కావాలి.’’ వస్తూనే చెప్పాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘ఓకే సార్‌! పదండి. వెళ్దాం.’’ అంటూ బుల్లెట్‌ ఎక్కి స్టార్ట్‌ చేసాడు రామ్‌. ఎస్సై అక్బర్‌ఖాన్‌ బుల్లెట్‌ మీద కూర్చోబోతూ కొద్ది దూరంలో ఒక వ్యక్తి తమనే గమనించడం చూసి గతుక్కుమన్నాడు.

బుల్లెట్‌ వెనుక కూర్చుని తల త్రిప్పి ఓరకంట ఆ వ్యక్తినే గమనిస్తూ ఉన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌. ఆ వ్యక్తి ఎస్సై అక్బర్‌ఖాన్‌ బుల్లెట్‌ మీద వెళ్లిపోవడం చూస్తూనే జేబులో సెల్‌ తీసి ఎవరితోనో మాట్లాడుతూ గబాలున పరిగెట్టుకు వెళ్లి బైక్‌ మీద కూర్చున్నాడు. బైక్‌ స్టార్ట్‌ చేస్తూనే ముందుకురికించాడు ట్రాఫిక్‌ను చీల్చుకుని ముందుకు పరిగెడుతోంది బుల్లెట్‌.

బుల్లెట్‌ మిర్రర్‌లో తమ వెనుక వస్తున్న వాహనాలను కూర్చునే చూడ్డానికి ప్రయత్నిస్తున్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.  అక్కడ తమనే గమనిస్తూ నిలబడ్డ వ్యక్తి బైక్‌ మీద వెంబడించడం మిర్రర్‌లో గమనించగానే అదిరిపడ్డాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్