Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

చలి చంపేస్తోందా.? దాన్ని చంపేయండిలా.!

Is it cold ? Kill it!

చలికాలమొచ్చిందంటే చాలు చర్మ సమస్యలు మొదలైపోతాయి. ముఖ్యంగా అమ్మాయిలకే ఈ సమస్య ఎక్కువ బాధిస్తుంటుంది. డ్రై స్కిన్‌తో అందవిహీనంగా మారిపోతుంటాయి అమ్మాయిలు అందమైన అరవిందాలు. అందుకే రకరకాల కోల్డ్‌ క్రీములు పూసి, మేనేజ్‌ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ దాంతో వచ్చే ఇంకో అతిముఖ్యమైన సమస్య జిడ్డుతనం. ఇలా చలికాలం చర్మంతో కుస్తీ పడుతుంటారు కుర్రకారు. ఇప్పుడు అమ్మాయిలతో పాటు, అబ్బాయిలు కూడా బ్యూటీపై దృష్టి పెడుతున్నారు. దాంతో ఈ సమస్య కేవలం అమ్మాయిలదే కాదు, అబ్బాయిలది కూడా. మార్కెట్లో లభించే ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ వాడకంతో లేనిపోని స్కిన్‌ అలర్జీల బారిన పడుతుండడంతో మన అమ్మమ్మలు, బామ్మలు చెప్పినట్లుగా పాత కాలపు సున్నిపిండి, కొబ్బరినూనె తదితర నేచురల్‌ ప్రొడెక్ట్స్‌ వైపు యువత మొగ్గు చూపుతోన్న పరిస్థితుల్ని నేడు చూస్తున్నాం. ఇది ఒక రకంగా ఆహ్వానించదగ్గ పరిణామమే.

ఇకపోతే చలికాలంలో మరో తీవ్రమైన సమస్య బద్దకం. చలిగా ఉండడంతో శరీరం బద్దకానికి ఎక్కువగా అలవాటు పడిపోతుంది. దాంతో ఊబకాయ సమస్యలు. అనవసరంగా బరువు పెరిగిపోతుంటాం ఈ చలికాలంలో. అందుకే ఫిట్‌నెస్‌పై కూడా కాన్‌సన్‌ట్రేషన్‌ చేయాలి. స్కిన్‌ సమస్యలుంటే వాతావరణంలో మార్పు వస్తే తగ్గించుకోవచ్చు. కానీ బరువు పెరిగితే తరిగించుకోవడం కష్టమైన పనే సుమీ. అందుకే ఈ కాలంలో కొంత కష్టమైనా, అసాధ్యమైతే కాదు కాబట్టి, ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి. లేచాక జిమ్‌కి పరుగులు పెట్టాలి. ఇది సాధ్యం కాని వారు, కనీసం ఇంట్లోనో, పార్కుల్లోనో జాగింగ్‌లు, వాకింగ్స్‌లాంటి వాటినైనా ఆశ్రయించాలి. ఉదయ్యానే లేచి ఎక్సర్‌సైజులు చేయడం వల్ల బద్దకం నుండి, చలి నుండి కూడా విముక్తి పొందవచ్చు. అదే సమయంలో ఫిట్‌ బాడీ మన సొంతమవుతుంది. వింటర్‌లో చేసే ఎక్సర్‌సైజుల వల్ల మైండ్‌కి ఫ్రెష్‌నెస్‌ చర్మానికి తాజాదనం లభిస్తుంది. అలాగే తినే తిండి, చదువుకునే పిల్లలైతే చదివే చదువు కూడా ఒంటపడుతుంది.

అయితే వ్యాయామం విషయంలోనూ కొంత జాగ్రత్త వహించాలి. అతి ఎంత మాత్రమూ పనికి రాదు. ఒక్కోసారి ప్రాణాలకు ప్రమాదకరం కూడా. అందుకే వ్యాయామం విషయంలో ఖచ్చితంగా టైం కంట్రోల్‌ తప్పనిసరి. 30 నిముషాల నుండి, 60 నిముషాల వరకూ వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అదే సమయంలో కఠినతరమైన వ్యాయామాలను ఒకేసారి చేయకుండా, మెల్లమెల్లగా సామర్ధ్యాన్ని పెంచుకుంటూ పోవాలనేది నిపుణుల సలహా. ఎక్సర్‌సైజులతో పాటు, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం తప్పనిసరి. పిండి పదార్ధాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి. పీచు పదార్ధాలున్న ఓట్స్‌, ఇతరత్రా కాయగూరలకు ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇవ్వాలి. చలిగా ఉండడం వల్ల వాటర్‌ ఎక్కువగా తాగలేం. సో వాటర్‌ కంటెన్ట్‌ ఎక్కువగా ఉండే కీరదోస, క్యారెట్‌ వంటి పచ్చికూరగాయలను తీసుకోవాలి. దీంతో బాడీకి తగినంత వాటర్‌ అందుతుంది. చర్మం తాజాగా ఉండడంతో పాటు, శరీరానికి తగినన్ని పోషక విలువలు కూడా అందుతాయనేది వైద్యుల సూచన.

ఈ చిన్నపాటి సూచనలను పాఠించండి. ఈ వింటర్‌ని ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఎంజాయ్‌ చేసేయండి.

మరిన్ని యువతరం
Away from love.