Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sira chukkalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మృత్యుకేళి - లక్ష్మి పాల

HCG Cancer Hospital, బెంగుళూరు.

సుదీప్తి గార్డెన్ లో నడుస్తూ కళ్ళతోనే అతనికోసం చుట్టూ వెతుకుతోంది. అతనెవరో తనకి తెలియదు. ఎప్పుడూ అతనితో మాట్లాడలేదు. కానీ, ఇక్కడి కాన్సర్ పేషంట్స్ తో తను మాట్లాడుతున్నపుడు, వాళ్ళకి తను సర్వీస్ చేస్తున్నపుడు... దూరంగా కూర్చుని తన మాటలు వింటూ, తన పనులను గమనిస్తూ... ప్రశంసాపూర్వకంగా తనవైపు చూసి, మౌనంగా లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. అతను పేషంటా...? లేక డాక్టరా...? అతనికి తను ఇంతకు ముందు తెలుసా...? కేవలం తన మాటలకు, పనులకు ఇంప్రెస్ అయి, ఏదో అలా వచ్చి, విని వెళ్ళిపోతున్నాడా...?


రోజూ వచ్చి, తనకోసమే ఎదురుచూస్తున్నట్లుగా... గార్డెన్ లోని ఓపెన్ మీటింగ్ హాల్ మెట్లమీద కూర్చుని ఉంటాడు. పేషంట్స్ తో తను చెప్పే మాటలు శ్రద్ధగా వింటూ ఉంటాడు. ఎప్పుడూ ఒక్క సందేహమూ అడగడు. తనను పలకరించాలనే ప్రయత్నం చేయడు. తన గురించి తెలుసుకోవాలనే ఆసక్తినీ కనబరచడు. చూసేందుకు హుందాగా, ఆకర్షణీయంగా ఉన్నా... కొంచెం విచిత్రమైన వ్యక్తి...! మనసులోనే నవ్వుకుంటూ హాస్పిటల్ ఆవరణలోని పార్కింగ్ ప్లేస్ లో ఉన్న తన టూవీలర్ మీద బయటకు వెళ్ళిపోయింది.

ఢిల్లీలో రెండు రోజులుగా జరుగుతున్న “అమ్మ పౌండేషన్ ఫర్ కాన్సర్ పేషంట్స్” వార్షిక కాన్ఫరెన్స్ లో పాల్గొని ఈ రోజు ఉదయమే బెంగుళూరు వచ్చింది సుదీప్తి. తను రెండు రోజులు లేకపోయేసరికి తను ఈ రోజు కూడా రాదు అనుకున్నాడేమో అతడు ఎక్కడా కనబడలేదు.

********

“అమ్మ పౌండేషన్” ప్రారంభకర్త సుదీప్తి. తనకు ఊహ తెలియనపుడే కాన్సర్ తో తల్లి చనిపోతే, సుదీప్తిని తండ్రి, మేనత్త పెంచి పెద్దచేసారు. తనకు పదహారో ఏట తండ్రిని పోగొట్టుకుంటే, తనకు ఏళ్ళు వచ్చేసరికి, తనను ఎంతో ప్రేమగా చూసుకునే మేనత్త సులోచన కూడా కాన్సర్ బారిన పడి కళ్ళముందే మరణించింది. ఇది సుదీప్తిని బాగా కలచి వేసింది. డబ్బు, ఆస్థి ఉన్న తమలాంటి వారే, కాన్సర్ మహమ్మారి నుండి తప్పించుకోలేకపోతే, ఇక పేదల పరిస్థితి ఏమిటీ...? ఈ ఆలోచన ఆమెలో ఒక గొప్ప నిర్ణయానికి నాంది పలికింది.

కాన్సరు వ్యాధిని నివారించేందుకు, వైద్యం చేసేందుకు తను డాక్టర్ కావాలనుకోలేదు. అందుకు చాలామంది ఉన్నారు. మరణం తథ్యం అని తెలిసిన కాన్సర్  పేషంట్స్ మానసికస్థితిలో మార్పు తీసుకురావాలనుకుంది. రాబోయే మృత్యువును కూడా నిర్భయంగా స్వీకరించేలా వారిలో ధైర్యాన్ని నింపాలనుకుంది. అందుకే, కొందరు ఫ్రెండ్స్ తో కలిసి తన ఆస్థి యావత్తూ పేద కాన్సర్ వ్యాధిగ్రస్థులకు కోసం... వెచ్చిస్తూ “అమ్మ పౌండేషన్” ప్రారంభించింది. అదేవిధంగా, ప్రతి సంవత్సరం ప్రపంచమంతా డొనేషన్ల రూపంలో కలెక్ట్ చేసి, దేశంలోని వివిధ కాన్సర్ హాస్పిటల్స్ లోని పేద పేషంట్లకు వైద్యం అందేలా చూస్తోంది.

బెంగుళూరులోని నివాసం ఉంటున్న తను, HCG Cancer Hospital మేనేజ్ మెంట్ తో ఒప్పందం కుదుర్చుకుని, ప్రతిరోజూ ఆ హాస్పిటల్ లో సాయంత్రం... కాన్సర్ పేషంట్స్ తో సమావేశమై వారికి మరణానికి సంబంధించిన సంఘటనలు, బుద్ధుని బోధనలు, ’ఇహలోక వాంఛలను అధిగమించడం ఎలా?’ వంటి చర్చలు జరుపుతూ, వారిలో చావుపట్ల భయాన్ని తొలగించడంలో తనవంతు కృషి చేస్తోంది.

********

“మరణం ఎవరికైనా తప్పదు. అయినా, మనకు చావు అంటే భయం. ఎందుకూ అని ఆలోచించితే... ఈ ప్రపంచంలో ఎవ్వరి దగ్గరా సరియైన సమాధానం లేదు. అప్పటివరకూ అనుభవించిన జీవితం అంతమైపోతుందనా?

సంపాదించిన ఆస్తి అంతా అనుభవించకుండా పోతామనా...? పోయాక ఇవేవీ తీసుకుపోలేమనా...? జీవితమే అంతమైపోయిన తరువాత... ఇవన్నీ ఉన్నా ఉపయోగం ఏమిటీ...? భూమిలో ఒక మొక్క మొలకెత్తుతుంది. కొంతకాలానికి ఎదిగి మహావృక్షమౌతుంది. అయినా, ఏదో ఒకనాటికి దానిలోని జీవకణాలు కృశించి, అది అంతరించిపోతుంది. అదేవిధంగా ఒక పురుగు పుడుతుంది. దానిలోని జీవశక్తి నశించాక, అది మరణించి మట్టిలో కలిసిపోతుంది.

అలాగే మనిషి కూడా... ఒక వయస్సు వరకే అతనిలోని జీవం. ఆ తరువాత... అతని చివరిగమ్యం మరణమే. అతడి మరణం ఎప్పుడో, ఏ క్షణమో అతనికి తెలియదు. అందుకే, ఇహలోక సౌఖ్యాలపై ప్రేమ. మరణం అంటే భయం, దు:ఖం. ’అయ్యో... చచ్చిపోతున్నామే...’ అనే వేదన. ’ఇంకొంతకాలం బ్రతకాలి’ అనే ఆరాటం.

కానీ, మనం అలా కాదు. మన మరణం మనకు ముందుగానే తెలుసు. భగవంతుడు మన జీవితపయనానికి ఆఖరి మజిలీని ముందే ఏర్పాటు చేసాడు. మన బ్రతుకు పరిథిని మనకళ్ళముందే గీసి ఉంచాడు. ఇంక మనకు ఆశలు, నిరాశలు లేవు. భవిష్యత్తు ప్రణాళికలు లేవు. బాధలు, గాధలు అంతకన్నా లేవు. అయినా, మనం దు:ఖపడడానికి ఇక్కడ మనదంటూ ఏముందని...? మనది అనుకుంటున్న ప్రతీది ఆ భగవంతుడు ఇచ్చిందే...ఈ శరీరంతో సహా...! దీన్ని వదిలేయడానికి మనకు భయం ఎందుకు...?”

ఆమె చెపుతున్న మాటలను, ఊపిరి పీల్చుకోకుండా వింటున్నారు పేషంట్స్ అందరు. అంత చిన్నవయసులో జీవితసారాన్నంతా ఔపోసన పట్టినట్లు మాట్లాడుతున్న ఆమెను రెప్పవాల్చకుండా చూస్తున్నారంతా...

“ఈ మందులతో కొన్నాళ్ళు మన బ్రతుకును పెంచుకోవచ్చు. కానీ, దానివలన ఏం జరుగుతుంది...? భరించరాని నొప్పిని అనుభవించడం... భగవంతుడా ఈ ప్రాణం తీసుకుపో... ఈ బాధనుండి నాకు విముక్తినివ్వూ అంటూ... పదే పదే ప్రార్ధించడం... అంతే...! ఆ తరువాతైనా... మనకిది తప్పదు. దానికోసం మనం భయపడడం, దు:ఖించడం, రోధించడం దేనికి...? ఉన్నంతకాలమే మనది. మనల్ని కావాలనుకుంటున్న ఈ కొద్ది కాలమే మనది. మనలను ఒద్దనుకుంటున్న, మనది కాని ఆ తదుపరి కాలం మనకు అక్కరలేదు. దాన్ని మనమే వెలివేద్దాం...!”

అక్కడ కూర్చున్నవాళ్ళలో... కొందరు కన్నీళ్ళు తుడుచుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఒక ధైర్యం.

“మీలో పునర్జన్మమీద నమ్మకమున్నవాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మన ప్రయాణం అక్కడికే. మరో కొత్త జన్మతో... మనం ఈ జన్మలో కోల్పోతున్నదంతా... మళ్ళీ కొత్తగా పొందడానికే...! మనం పొందవలసిన సౌఖ్యమంతా... అక్కడ పరమాత్మలో ఉందని నమ్మేవారూ ఉండొచ్చు. ఇప్పటి మన నడక... ఎప్పటికీ తరగని ఆనందగనిలో మనమూ మమైక్యమవడానికే...! అశాశ్వతమైన ఈ ఇహలోక ఆనందాలను త్యజించడానికే...!” ఆ ప్రదేశమంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

అప్పుడు కనిపించాడతను మళ్ళీ...! ఎప్పటిలాగే చెరగని చిరునవ్వు, చూపులో అభినందన...లేచి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు ఎలా అయినా అతడిని ఆపాలి. అతనెవరో తెలుసుకోవాలి.

“హెలో... ఎక్స్ క్యూజ్ మీ...!” లేచి అతడి దగ్గరకు పరుగెత్తుకెళ్ళింది సుదీప్తి.

అతడు ఆగాడు. “చెప్పండి...” అన్నాడు. అతని గొంతు మధురంగా ఉంది.

“మీరు ఎవరో గానీ, రోజూ వస్తున్నారు. జస్ట్ వింటున్నారు వెళ్ళిపోతున్నారు...” అంది సుదీప్తి.

అతను నవ్వాడు. ఆ నవ్వు మెస్మరైజ్ చేస్తోంది. అతనివంకే చూస్తూ ఉండిపోయింది.

“ఒక కాఫీ...!” అడిగాడతను నవ్వుతూ... “ఓ...ఓకే... నేను రెడీ...” అంది సంబ్రమాశ్చర్యాలతో...

******** “మీ సర్వీస్... చాలా బాగుంది మేడమ్...! ఒక మనిషిలో మరణం పట్ల ఉన్న భయాన్ని ఇంత సులువుగా తొలగించడం... మీకే సాధ్యమయింది. ముఖ్యంగా, మరణానికి దగ్గరవుతున్న మనుషులలో...!” మనస్ఫూర్తిగా చెప్పాడతను  ఖాళీ కప్పు టేబిల్ పై పెడుతూ. నవ్విందామె. “ఆ సమయంలో వారు పడే నరకయాతన ఎలా ఉంటుందో... నాకు తెలుసండీ...! నేను మా ఆంటీని చూసాను. తన బాధంతా... నేను ఒక్కదాన్నైపోతానేమో అని. అప్పుడు ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పే వయసు కాదు నాది. ఆమె వెళ్ళిపోయింది. అప్పుడే నిర్ణయించుకున్నాను. మనల్ని భయపెట్టే ఆ మహమ్మారిని, మన ధైర్యంతో మనమే భయపెడదాం అని...!” చెప్పింది.
“మీ మాటల తరువాత, వాళ్ళల్లో... గొప్ప మార్పు కనబడుతోంది. అలా... వాళ్ళ లైఫ్ టైం పెరిగే అవకాశం ఉంది. వాళ్ళలో డెవలప్ అయ్యే ఆ విల్ పవర్... వారి హెల్త్ కండీషన్స్ లో మిరాకిల్స్ ని సృష్టించవచ్చు.” చెప్పాడతను.

“ప్చ్...!” పెదవి విరిచింది. “ఒక పాముకాటుకు గురైన మనిషి విల్ పవర్... ఆ పాయిజన్ ని వేగంగా స్ప్రెడ్ అవకుండా ఆపవచ్చేమో కాని, ఆల్రెడీ... లోలోపల విషంకన్నా వేగంగా పాకుతూ, శరీరాన్ని మరణానికి సిద్ధం చేసుకుంటున్న కాన్సర్ ని  ఏ మాత్రం ఆపలేకపోతున్నామండి..!  సాయంత్రాలు... నా ఎదురు కూర్చునే వాళ్ళ సంఖ్య, రోజు రోజుకూ...తగ్గిపోతుంటే ఆ విషయం అర్ధమవుతోంది...!” నిరాశగా పలికింది.

అతడు చిరునవ్వు నవ్వాడు. అతడి కళ్ళముందు... సుదీప్తికి ఎదురుగా, ఎడమవైపు కూర్చుని, ఆమె వంకే చూస్తూ ఆమె మాటలకు సంతోశంతో చప్పట్లు చరచిన ’నీలయ్య’ కదిలాడు. వెంటనే చేతికున్న వాచి చూసుకున్నాడు. “టైం అయింది. నేనిక వెళతాను.” చెప్పాడు పైకి లేస్తూ...

సుదీప్తి కూడా... “ఓకే...”  అంటూ లేచింది.

“అన్నట్లు...మిమ్మల్ని ఒకటి అడగాలి... మీరు డాక్టరా...?” వెళ్ళిపోతున్న అతడిని చూస్తూ కేకవేసి అడిగింది.

అతడు వెనుతిరిగి నవ్వాడు...”కాదన్నట్లు’ తల అడ్డంగా ఊపాడు.

“మీ పేరు కూడా చెప్పలేదు.” మళ్ళీ అరచి చెప్పింది.

“నెక్స్ట్ టైమ్...” చేత్తో... సైగ చేస్తూ వెళ్ళిపోయాడు.

*******

ఆ రోజు సాయంత్రం యధావిధిగా హాస్పిటల్ కి వచ్చి, గార్డెన్ లోని  ఓపెన్ మీటింగ్ లో కూర్చుని,  కాన్సర్ పేషంట్స్ తో మాట్లాడుతోంది సుదీప్తి. మళ్ళీ అతడు ఆమెకు కొంచెం దూరంలో కూర్చుని కనబడ్డాడు. అతడిని చూసి చిరునవ్వు నవ్వింది. అతడూ ...”హాయ్...” అన్నట్లుగా చేయి ఊపాడు.

“ఫ్రెండ్స్... ఈ రోజు మనం... బుద్ధ భగవానుడు చెప్పిన ఒక కథ చెప్పుకుందాం...! ఓ రోజు శిష్యగణంతో కూర్చుని ఉన్నాడు బుద్ధుడు. అందులోంచి ఒక శిష్యుడు లేచి, స్వామీ... మనం మరణించిన తరువాత... ఎక్కడికి వెళతాం? అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు చెప్పాడు. “ఎక్కడినుండో ఒక భాణం వచ్చి, నీ చేతికి తగిలి రక్తం కారుతోంది. అప్పుడు దాన్ని ముందు తొలగిస్తావా...? అది ఎక్కడనుండి వచ్చిందని వెతికి ఆరాలు తీస్తావా...? అనడిగాడు. అప్పుడా శిష్యుడు, ముందు భాణాన్ని తొలగించిన తరువాతే, అది ఎక్కడనుండి వచ్చిందని తెలుసుకోడానికి ప్రయత్నిస్తానన్నాడు. అప్పుడు బుద్ధుడు. భాణం తీయడమే ప్రధానం... అంటే...ఇక్కడ కూడా మరణమే... ప్రధానం. బాహ్యవిషయాలు తెలుసుకోవడం అనవసరం. మన దృష్టి, మరణమనే ముక్తిమార్గం మీద మాత్రమే ఉండాలి. అంతేగాని, మరణానంతరం గురించిన ఆలోచన నీలోని మరణభయాన్ని, సూచిస్తుంది. మరణానంతర జీవితాన్ని ఆశిస్తుందని అర్ధం...! అంటూ ముగించాడు.” చెప్పింది సుదీప్తి.

అప్పుడు చూసింది. తనకు ఎడమవైపున నీలయ్య కూర్చునే చోటు ఖాళీగా ఉంది.. ”నీలయ్య ఈ రోజు రాలేదా...?” అడిగింది.
“రాత్రి... నీలయ్య చనిపోయాడమ్మా...!” దిగులుగా చెప్పాడు మరో పేషంటు శేషారావు.

చాలాసేపు నోటమాట రానట్టు కూర్చుండిపోయింది సుదీప్తి.

ఆ రోజు సాయంత్రం మళ్ళీ కాఫీ షాపులో కూర్చున్నారు ఇద్దరూ. “అందరికీ ధైర్యం చెప్పే మీరే.. అలా దిగులుపడితే, వాళ్ళెలా ధైర్యంగా ఉంటారు?” అనునయిస్తూ అన్నాడతను.

“ఏమోనండీ...! వాళ్ళకు చెపుతున్నంత ధైర్యంగా నేను ఉండలేకపోతున్నాను. ఎందుకో నాకే తెలియడం లేదు.” ఖర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది.

“నో...నో... మీరు ఇలా కన్నీళ్ళు పెట్టొద్దు. ధైర్యం అంటేనే... సుదీప్తి. అర్ధం అయిందా... మీరు ముందు వాష్ రూమ్ కి వెళ్ళి ముఖం కడుక్కుని రండి... ఈ లోపు నేను మంచి కాఫీ ఆర్డరు చేస్తాను.” ఆమెను బలవంతంగా పంపించాడు.

వాష్ రూమ్ లో అద్దం ముందు నిలబడి, ముఖం కడుక్కుంటున్న సుదీప్తికి ఎందుకో... కళ్ళు తిరిగినట్లు అనిపించింది. గట్టిగా తలపట్టుకుని, కళ్ళు మూసుకుంది. కొంతసేపటి తరువాత కళ్ళు తెరచిన సుదీప్తి... ఉలిక్కిపడింది. ఆమె ముక్కునుండి రక్తం ధార... చుక్కలు చుక్కలుగా క్రింద సింక్ లో పడి, నీళ్ళతో కలిసి ట్యూబ్ లోకి వెళ్ళిపోతుంది. ఏమైంది తనకు...? టాప్ తిప్పి, నీళ్ళతో ముక్కు శుభ్రం చేసుకుంది. మరోసారి ముఖం మీద నీళ్ళు పోసుకుని, నాప్ కిన్ తో తుడుచుకుంటుంటే... అద్దంలో తన వెనుక ఎవరిదో ఆకారం... మసగ్గా...  అచ్చం... అతనిలా...!

********

“అమ్మా... డాక్టరు దగ్గరకు వెళ్ళారంటా...! ఎందుకు...?” అడిగింది ఎదురుగా కూర్చుని ఉన్న సరోజ.

“ఏమిలేదు. కొంచెం నలతగా ఉంటే... వెళ్ళాను. ఏవో టెస్టులు రాసారు.” చెప్పింది సుదీప్తి.

“ఏం చెప్పారమ్మా....?” అడిగాడు మరో పేషంటు వినాయకరావు కంగారుగా.

“ఇంకా రిపోర్టులు రాలేదు. అయినా కంగారు పడవలసిందేమీ లేదు. ఏదో కాస్త వేడి చేసిందంతే...!వాతావరణం మారుతోంది కదా... ఇలాంటివి సహజం...” నవ్వుతూ చెప్పింది.

ఒకసారి తలెత్తి... అతడికోసం చుట్టూ చూసింది. ఇక్కడికి కొంచెం దూరంలో కూర్చుని ఉన్నాడతను. “ఓహో... వచ్చాడన్నమాట... ఈరోజు అయ్యగారి పేరు ఏమిటో ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి.” అనుకుంటూ... ఇటు తిరిగిన ఆమెకు ఏదో అనుమానం వచ్చి, చప్పున కళ్ళెత్తి మళ్ళీ అతని వైపు చూసింది. ఆమె భృకుటి ముడిపడింది. అతని చూపు... తన ఎదురుగా కూర్చున్న కాన్సర్ పేషంట్ అపర్ణపైన ఉంది. ఎందుకో ఆ చూపు... నార్మల్ గా అనిపించలేదు.

ఆ సాయంత్రం అతడు త్వరగా వెళ్ళిపోయాడు. సుదీప్తి కాస్సేపు కాఫీషాప్ లో ఎదురుచూసి, తన రిపోర్ట్స్ కోసం హాస్పిటల్ లోకి వెళ్ళింది. అక్కడ, స్ట్రెచ్చర్ మీద అపర్ణను పడుకోబెట్టి, ఐ.సి.యూ లోకి తీసుకువెళ్ళడం కనబడింది. ఆమె తల్లిదండ్రులు ఏడుస్తూ ఆమెతోపాటే లోపలికి వెళుతున్నారు.

“అపర్ణకు ఏమైంది...?” అక్కడే ఉన్న నర్సును అడిగింది.

“ఇందాకటివరకు బాగానే ఉంది మేడమ్... సడెన్ గా సీరియస్ అయింది. అందుకే వార్డునుండి ఐ.సి.యు.కి మారుస్తున్నారు.” చెప్పిందా నర్సు. కౌంటర్ లో బిల్ కట్టి, రిపోర్ట్స్ తీసుకుని బ్యాగులో కుక్కుకుంటూ, తను కూడా ఐసియులోకి పరుగెత్తింది.

అపర్ణ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది. బెడ్ మీద ఎగిరెగిరిపడుతోంది. డాక్టర్స్ గబగబా... వెంటిలేటర్ అమర్చారు. ఆమె చుట్టూ ఉన్న డాక్టర్లు హడావుడి చేస్తున్నారు. అక్కడ అతను ఉన్నాడు. ఓ పక్కగా నిలబడి నిశ్శబ్ధంగా అపర్ణను చూస్తున్నాడు. అతడు ఆమెకు ఏమవుతాడు. తనెందుకు ఉన్నాడు ఇక్కడ...? వెళ్ళి, అపర్ణ పక్కన నిలబడింది. సుదీప్తిని చూడగానే... ఆయాసపడుతూ “అక్కా...” అంటూ ఆమె చేయందుకుంది అపర్ణ.

“భయపడకు... నీకేం కాదు... నీకేం అవదు...”  కంగారుగా చెపుతోంది సుదీప్తి.

ఒకటి... రెండు.... మూడో నిమిషంలో అపర్ణ గుండె శాశ్వతంగా ఆగిపోయింది. సుదీప్తి చేష్టలుడిగి ఆమె నిర్జీవదేహం వైపే  చూస్తూ ఉండిపోయింది. ప్రాణం పోవడం ఇంత తేలికా...? ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి.

*******

“ఇన్నాళ్ళూ ఎందుకు గమనించుకోలేదు మీరు...?” డాక్టర్ అమిత్ అడిగాడు. “మీకూ మీ సులోచన ఆంటీలాగే, బ్రెయిన్ ట్యూమర్  లక్షణాలు కనబడుతున్నాయి. మీరు ఫస్ట్... హాస్పిటల్ లో జాయిన్ అవండి.” చెప్పాడు. ఆమె నవ్వింది. తనకు ముందునుండి అనుమానంగానే ఉంది. తరచూ ఉదయాన్నే తలనొప్పి రావడం, ముక్కునుండి, నోటినుండి రక్తం స్రవించడం, మెమరీ లాస్... అత్తయ్యలాగే తనకూ ఏదో అవుతుందని తెలుస్తూనే ఉంది. ఇన్నాళ్ళూ... బ్రతుకు మీద తీపి లేదు. కాబట్టి, తన గురించి తను పట్టించుకోలేదు. కనీసం ఈ సింప్టమ్స్ ఏమిటో తెలుసుకుందామని కూడా ప్రయత్నించలేదు తను. కానీ, కొద్ది రోజులుగా... బ్రతుకు మీద తెలియకుండానే ఒక తీయని ఆశ. అతడు గుర్తొచ్చాడు. అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

“ఏమిటీ... రెండు రోజులుగా కనబడలేదు?” కాఫీ షాపులో అడిగాడు.

ఆమె నవ్వింది. “ఏమీలేదు.” తల అడ్డంగా ఊపింది. చాలా సేపటి తర్వాత అతడిని అడిగింది. ”అపర్ణ మీకు ఏమవుతుంది...?” “మీరు నాకేమవుతారో... ఆమె కూడా నాకు అదే అవుతుంది.” ప్రసన్నంగా చెప్పాడు.

“అంటే...?” అర్ధంకాలేదు సుదీప్తికి.

అతడేమీ చెప్పలేదు. కాఫీ కప్పులో షుగర్ బ్యాగ్ ముంచుతూ, తీస్తూ ఉన్నాడు.

మళ్ళీ తనే అడిగింది. “ఈ రోజు వరకూ మీరు, మీ పేరు చెప్పలేదు ఎందుకు...?”

“తెలుసుకునే సమయం వస్తే... అదే తెలుస్తుంది.” చెప్పాడతను.

“మీ మాటలేమిటో ఈరోజు కొత్తగా ఉన్నాయి.” చెప్పింది.

అతను లేచి... “నేను వెళతాను. మళ్ళీ త్వరలోనే కలుస్తాను.” చెప్పి వెళ్ళిపోయాడు. మనసంతా భారమయ్యింది తనూ లేచి వెళ్ళిపోయింది. ఇంట్లో బెడ్ మీద పడుకుని ఉంది. నిద్ర పట్టడం లేదు. ఏమిటిది... ఎందుకిలా అయింది...? తను కూడా మరణిస్తుందా...? ఈ కాన్సరు తన కుటుంబానికి శాపమా..? ఈ రోజుల్లో వైద్యం... ఎంతో అభివృద్ధి చెందింది. అయినా.. ఇంకా ఈ మరణాలు. ఇవి అన్నీ ఆగేదెపుడు..? కాన్సరును సమూలంగా తుడిచిపెట్టేదెపుడు...? ఏ యాక్సిడెంట్ వలననో, హార్ట్ అటాక్ వలననో ఈజీగా మరణిస్తే ఎంతో బాగుంటుంది. తెలిసి,తెలిసీ మరణించడమంటె... అదెంత నరకం...? ఏమిటీ మరణమంటే, తను భయపడుతోందా...? ఎదుటివారికి  చెప్పడానికి ఎన్నయినా చెప్పొచ్చు. తనదాకా వస్తే... ఇలాగే ఆలోచిస్తారా మనుషులు...?

అతడు మళ్ళీ గుర్తొచ్చాడు. ప్రసన్నమైన అతని నవ్వు, అభినందిస్తూ అతని చూపూ... ఎవరతను...? ఎందుకొచ్చాడు...? ఎందుకు వెళ్ళిపోయాడు... మళ్ళీ ఎప్పుడు కలుస్తాడు...? రేపు కాఫీషాపులోనా...? తను హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాకనా...? లేదా... తను పోయాక, మార్చురీలో తన శవాన్ని చూడటానికి వస్తాడా...? ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది.

సరిగ్గా అదే సమయంలో... అతడు మార్చురీలో నిలబడి ఉన్నాడు. ఎదురుగా స్ట్రెచ్చర్ పై సరోజ శవం. దగ్గరగా వెళ్ళాడు. కాస్సేపు ఆమె ముఖంలోకి దీక్షగా చూసాడు. ఆమె నుదురుపై బొటనవేలు ఆన్చి, కళ్ళుమూసుకుని ఏదో జపించాడు. కొద్ది క్షణాలలో ఆమె కనుబొమల మధ్యనుండి ఏదో చిన్న దీపంలాంటి కాంతి అతని వ్రేలి గుండా ప్రయాణించి అతని అరచేతిలో నిలబడి, అక్కడే అంతర్ధానమయ్యింది.

******

హాస్పిటల్ లో అడ్మిట్ అయిన ఈ వారం రోజులలో సుదీప్తి లో చాలా మార్పు వచ్చింది. వెయిట్ లాస్, హెయిర్ లాస్... తరచూ బ్లడ్ వామిటింగ్, కళ్ళు లోతుకు పోయి... ప్రాణం ఎక్కడో గుండె అడుగున మిణుకు మిణుకుమంటున్నట్లుగా కొట్టుకులాడుతోంది.
ఢిల్లీనుండి “అమ్మ పౌండేషన్” బోర్డ్ ఆఫ్ మెంబర్స్ వచ్చారు. తమ స్నేహితురాలైన సుదీప్తిని అమెరికాకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్వాన్స్ స్టేజిలో ఉన్నా... క్యూర్ అయ్యే అవకాశాలున్నాయని తెలిసి హుటాహుటిని పరుగెత్తుకొచ్చారు వారంతా.

అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ, సుదీప్తి కళ్ళు... పదే పదే గుమ్మం వైపు చూస్తున్నాయి. అతడొస్తాడేమో...! వచ్చేసరికి  తను ఇక్కడ ఉండకపోతే...? త్వరగా వచ్చేస్తే బాగుండు. అతడిని చూడాలని ఆశగా ఉంది. అమెరికా వెళ్ళాక, తను తిరిగి వస్తుందో, లేదో తెలియదు. చివరిసారిగా అతడిని చూడకుండా వెళ్ళాలని లేదు.

సుదీప్తిని అంబులెన్స్ లోకి ఎక్కించారు. అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది. అంబులెన్స్ ఎయిర్ పోర్ట్ వైపు పరుగెడుతోంది. “ప్లీజ్...ఒక్క నిమిషం...” ఆయసపడుతూ అడిగింది. “ఒక్కసారి ఇంటికి వెళదామా...? ఇంకా టైమ్ ఉంది కదా... ఇంట్లో చిన్న పని ఉంది.” చెప్పింది.
అంబులెన్స్ సుదీప్తి ఇంటిముందు ఆగింది. నెమ్మదిగా నడిపించుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్ళారు. ఒక్కసారి,  ఇళ్ళు మొత్తం కలియచూసింది. అమ్మానాన్నల ఫోటోలు, అత్తయ్య ఫోటో... వాళ్లను అక్కడే వదిలించుకుని, తన రూం వైపు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది. ఎలాగో బెడ్ దగ్గరకు వెళ్ళగలిగింది. ఆఖరుసారి అన్నట్లుగా, కాస్సేపు కూర్చుంది. ఈలోపు లోపలి నుండి దగ్గుతెర... తడబడే అడుగులతో సింక్ దగ్గరకు వెళ్ళింది. భళ్ళున రక్తం వాంతి అయింది. టాప్ ఓపెన్ చేసి, నోరు శుభ్రం చేసుకుంది. కళ్ళు మసకబారుతున్నాయి. చేతులు తడి చేసుకుని, ముఖం తుడుచుకుంది.

అద్దంలో ముఖం చూసుకుంటే అనిపించింది, తను ఒకప్పటి సుదీప్తి కాదు... నవ్వొచ్చింది. వెంటనే కళ్ళల్లో నీరు కమ్మింది. కళ్ళు తుడుచుకుంటూంటే, వెనుకనుండి మాటలు వినబడ్డాయి.

“సుదీప్తి... నన్ను వదిలేసి వెళ్ళిపోతావా...?” గిర్రున వెనక్కి తిరిగి చూసింది. అతనొచ్చాడు. తనకేసే చిరునవ్వుతో చూస్తున్నాడు. ఒక్కసారిగా అతడిని గట్టిగా కౌగిలించుకుంది. “రాస్కెల్... ఇన్నాళ్ళూ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు...? నెనెంతగా ఎదురుచూసానో తెలుసా...? నిను చూడడానికే, కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకుని ఉన్నాను. నేను వెళ్ళను... చచ్చిపోతే,  అది నీచేతుల్లోనే...! నేను వెళ్ళను. నువ్వు కూడా నన్ను ఇంకెప్పుడూ వదిలి వెళ్ళిపోకు...” ఏడుస్తూ, ఉన్మాదిలా అతడిని చేతులతో బాదుతూ చెపుతోంది.
అతడు నవ్వుతూ ఆమెను గట్టిగా అదుముకున్నాడు. “నాకు తెలుసు... పద... నాతో వచ్చేయి. ఇంకెప్పటికీ నిన్ను నేను వదలిపెట్టి ఎక్కడికీ వెళ్ళను. నీ శాశ్వత మజిలీ నేనే సుదీ...! రా వెళదాం...” ఆమె చేయి పట్టుకుని, ముందుకు కదిలాడు.

“సుదీప్తీ... సుదీప్తీ...” లోపలికి వచ్చారు ఆమె స్నేహితులు. నేలపై రక్తం మడుగులో వెల్లకిల్లా పడిపోయి ఉంది సుదీప్తి. ముక్కు దగ్గిర వ్రేలు పెట్టి చూసారు. ఆమె శ్వాస ఆగిపోయి చాలాసేపయ్యింది.

అతడు సుదీప్తిని తీసుకుని వెళుతున్నాడు. ఆమె ఆనందంగా ఉంది. వేల దీపాలకాంతి ఆమె ముఖంలో తొణికిసలాడుతోంది. అతని పేరు “మృత్యువు”.

మరిన్ని శీర్షికలు
poems