Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu

బుధగ్రహ స్థానం  తిరువేంకాడు 

ప్రియంగు కాళికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం 

అన్ని గ్రహాలలోకి అతి సౌమ్యుడు , అతి బుద్ధి గలవాడుగా చెప్పబడే నవగ్రహాలలో నాలుగవ గ్రాహం బుధుని గురించి యీ సంచికలో తెలుసుకుందాం .బుధగ్రహ స్థానం తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో సిరికాళి తాలుకా లో సిరికాళి పుంపుహార్ రోడ్డులో సిరికాళి కి సుమారు 15 కిమీ దూరంలో వున్న తిరువేంకాడు అనే పట్టణం లో వుంది . పచ్చని వరిపొలాల మధ్య వున్న పట్టణం . కుజస్థానమైన వైధీస్వరన్ కోవేలకి సుమారు 15 కిమీటర్ల  దూరంలోవుంది . మాయవరానికి ( మైలదుత్తురై అనేది యిప్పటి పేరు ) 28 కిమీ.. కుంభకోణానికి సుమారు 58కిమి.. దూరంలో వుంది .

బృహస్పతి పత్ని ‘ ధరణి ‘ , చంద్రుల పుత్రుడే బుధుడు . వైవస్వత మనువు కూతురు ఇళ బుధుని భార్య  , వీరి పుత్రుడు పురూరవుడు . బుధ గ్రహాన్ని తెలివైన గ్రహంగా చెప్తారు .

శని , శుక్రుడు యితనికి మిత్రగ్రహాలు  , కుజుడు , బృహస్పతి , చంద్రులతో శత్రుత్వము కలిగివుంటాడు . మిగిలిన గ్రహాలతో తటస్థం గా వుంటాడు . మిధునం , కన్యారాశులకు అధిపతి బుధుడు . మీన రాశికి ప్రతికూలుడు . ఆశ్లేష , జ్యేష్ఠ , రేవతి నక్షత్రాలకి అధిపతి        బుధుని అనుగ్రహం వుంటే వైద్య విద్య , యంత్ర విద్య ,గణితం , శిల్పకళ , బహుభాషా జ్ఞానం కలుగుతాయి .అదే బుధగ్రహం అనుగ్రహం లేకపోతే నరముల బలహీనత , శ్వాస సంబంధ వ్యాధులు , బుద్ధి మాంద్యం , నత్తి కలుగుతాయి .బుధగ్రహం ఆకుపచ్చ వర్ణం , వాహనం పులి , యిష్ఠ మైన రంగు ఆకుపచ్చ , రత్నం జాతిపచ్చ ( ఎమరాల్డ్ ) , ధాన్యం పెసలు . వారం బుధవారం . పువ్వు --- తెల్లరంగు పువ్వులేమైనా  . లోహం యిత్తడి , దిక్కు ఉత్తరం , బుధవారం నాడు తెల్లని పుష్పాలతో పూజించి పెసలు ఆకుపచ్చని బట్టలో కట్టి దానం చేస్తే బుధుని అనుగ్రహం కలుగుతుంది .

తిరువేంకాడు అంటే స్వేతారణ్యం అని అర్ధం . యీ కోవెలలో మూలవిరాట్టు ఈశ్వరుడు శ్వేతారంణ్యేశ్వరుడు గా యిక్కడ పూజలందు కుంటున్నాడు . పార్వతీదేవి  ' బ్రహ్మ విద్యంబాళ్  ' పేరుతో పుజలందుకుంటోంది .

శ్వేతారంణ్యేశ్వరుని కోవెల 275 పాతాళపేత్ర స్థలాలలో ఒకటి , దీనిని నవనాట్యస్థలం అని , ఆది చిదంబరం అనికూడా అంటారు .ఎత్తైన ముఖ్యద్వారం లోపలికి వెళ్ళగానే విశాల మైన ప్రాంగణం , ముందుకి పొతే ఎదురుగా వినాయకుని చిన్న మందిరం ఎడమ వైపు కోనేరు , యింకా ముందుకి వెళితే సభా మంటపం యీ కోవేల చాలా విశాలమైనది . ఈ కోవెల ద్రవిడ శిల్పకళతో నిర్మింప బడ్డది .

ఈ కోవెలని ఆది చిదంబరం అనికూడా అంటారు . ఇక్కడ శివుడు పంచముఖుడు . 1) ఈశానం ముఖం , ఈ ముఖం ఆకాశానికి అభిముఖంగా వుండి  పవిత్రతని సూచిస్తూ వుంటుంది .2) తత్పురుషం , యిది తూర్పుముఖంగా వుండి , భక్తులలోని అహాన్ని నశింపజేసి ఆధ్యాత్మికతని  పెంచుతుంది . 3) వామదేవం ముఖం ఉత్తరాభి ముఖం . 4) అఘోర ముఖం యిది దక్షిణ ముఖం స్థితి లయలకు ప్రతీక , 5) పడమరన వున్న ముఖాన్ని సద్యోజాతం అని అంటారు యిది సృష్ఠికి ప్రతీక .

ఈ కోవెల వున్న వీధిలోనే తప్పని పరిస్థితిలో రాత్రి గడపడానికి వసతి రూములు వుంటాయి , ఓ అరగంట ప్రయాణించి చిదంబరం లో కాని , వైథీశ్వరన్ లో గాని వెడితే మంచి వసతి సదుపాయం దొరుకుతుంది . శ్వేతారంణ్యేశ్వరుని గురించిన స్థల పురాణం తెలుసుకుందాం .       యీ  స్వేతారణ్యాన్ని పరిపాలించే మురుత్వాసురుడు బ్రహ్మ దేవుని నుంచి పొందిన వరగర్వంతో అక్కడి దేవతలను , మునులను , తాపసులను బాధిస్తూ వుంటాడు , దేవతలు మునులు , తాపసులు మహాదేవునితో మొరపెట్టుకోగా శివుడు తన వాహన మైన నందిని మురుత్వాసురుని పై యుద్ధానికి పంపుతాడు . మురుత్వాసురుడు నందిని గాయపరుస్తాడు . నంది గాయపడ్డం చూసిన శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచి మహోగ్రుడై మురుత్వాసురుని వధించి తాండవ నృత్యం చేస్తాడు . శివుని ఉగ్రరూపాన్ని అఘోరముర్తి అవతారం అంటారు . ఇక్కడే శివుడు తాండవ నృత్యం లోని ఏడు ఖంఢాలైన ఆనంద , సంధ్య , సంహార , త్రిపురాంత ఊర్ధ్వ , భుజంగ , లలిత తాండవాలని నర్తించాడుట . చిదంబరం కోవెల కన్నా యిది పురాతనమైనది . అందుకే యీ కోవేలని ఆది చిదంబరం అనికూడా అంటారు . అలా తాండవ నృత్యం చేసేటప్పుడు శివుని మూడు కళ్లనుంచి మూడు చుక్కల నీరు నెలపై పడి మూడు తీర్దాలుగా అవతరించేయి . అవి అగ్ని తీర్ధం , సూర్య తీర్ధం , చంద్ర తీర్ధం గా ప్రసిద్ధి పొందేయి .

మురుత్వాసురుని తో యుద్ధం చేసినప్పుడు నందికి తగిలిన గాయాలకు నిదర్శనంగా నంది పై గాయాలు యిప్పుడు కుడా మనం చూడొచ్చు  . ఈ క్షేత్రాన్ని భారతదేశంలో వున్న ఆరు కాశి క్షేత్రాలలో వొకటి గా చెప్తారు .

శ్వేతారంణ్యేశ్వరుని దర్శించు కొని దక్షిణా మూర్తి , భద్రకాళి , కుమారస్వామి , సంధికేశ్వరుని దర్శించికొని కోవెల వెనుక వైపున వున్న పెద్ద సభా మంటపంలో కి ప్రవేశిస్తాం . అక్కడ పెద్ద అఘోర మూర్తి విగ్రహం వుంటుంది . యీ అఘొరముర్తికి ఆదివారం రాత్రి పూజలు విశేషంగా చేస్తారు . ఆది వారం అఘొరముర్తికి పూజలు చేస్తే సర్వశత్రు నాశనం జరుగుతుందనేది భక్తుల నమ్మకం . ఓ ప్రక్కన  నటరాజ విగ్రహంను చూడొచ్చు . కుడి వైపుకి వెళితే అక్కడ ' బ్రహ్మ విద్యాంబాళ్ ' మందిరంలో కళకళ లాడే మోముతో భక్తులకు విద్యాబుద్ధుల ప్రదాతగా వెలిసిన అమ్మవారిని చూడొచ్చు . దానికి పక్కగా వేరే మందిరంలో బుధుని దర్శించుకోవచ్చు . బుధునికి ఎదురుగా చంద్రుని విగ్రహాన్ని కుడా చూడొచ్చు .

ఈ కోవెలకు ఎదురుగా సూర్య , చంద్ర తీర్ధాలను చూడొచ్చు .

ఈకోవెల యెంత పెద్దదంటే హడావుడిగా దర్శనం చేసుకొని , అన్ని విగ్రహాలను చూసుకొని కోవెల మొత్తం చూడడానికి కనీసం  వో గంట పడుతుంది . యెంత సేపు చూసినా తనివి తీరని మూర్తులతో , కనుల కింపైన శిల్పకళతో , మళ్లీ మళ్లీ రావాలనిపించే కోవెల యిది .

ఈ శ్వేతారంణ్యేశ్వరుడిని సూర్యుడు , చంద్రుడు , బుధుడు , ఇంద్రుడు , ఐరావతం పుజించుకొని తరించేరు . ఇక యీ కోవెల చరిత్ర చూస్తే సంతానకురవ వంశానికి చెందిన అచ్యుతగపనార్ సంతానము కొరకై యీ మూడు తీర్ధములలోను స్నానము చేసుకొని శుద్దుడై ఈశ్వరుని పూజించుకొని సంతానాన్ని పొందేడు .

వేదరశి అనే భ్రాహ్మణుడు యీ శ్వేతారణ్య మార్గం గుండా ప్రయాణిస్తూ తనతో తెచ్చుకున్న భోజనం వొక చెట్టు తొర్రలో నుంచి కాల కృత్యములు తూర్చు కొనుటకై వెళ్తాడు . ఆతోర్రలో వున్న త్రాచుపాము ఆ ఆహారాన్ని విషపూరితం చేస్తుంది . విషయం తెలియని వేదరశి ఆ ఆహారాన్ని ఆకలితో వున్న బ్రాహ్మణునకు యిస్తాడు , విషాహారం తిన్న బ్రాహ్మణుడు మరణిస్తాడు . బ్రహ్మహత్యా పాతకం పొందిన వేదరశి శ్వేతారంణ్యేశ్వరుని పుజించుకొని బ్రహ్మహత్యా పాతకము నుండి విముక్తి పొందేడు .

శ్రీజ్ఞానసంభందార్ ఇతను శివుడిని పూజిస్తే స్వయంగా శివుడు వచ్చి పుజలందుకోనేవాడుట , అంతటి పరమ భక్తుడు . అతను తిరువేన్కాడు వూరి పొలిమేరలో అడుగు పెట్టగానే అతనికి శివలోకంలో వున్న అనుభూతి కలిగిందిట . అడుగు వేద్దామంటే ప్రతి యిసుక రేణువులో శివలింగం కనిపించిందట . అప్పుడు పార్వతీ దేవిని ' పెరియనాయకీ నేను మందిరానికి ఎలా రావాలో ' సెలవియ్యమని అడిగేడుట  , అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై  శ్రీజ్ఞానసంభందార్ ని చిల్లపిల్లవాడిని చేసి వీపుపైన కూర్చోపెట్టుకొని కోవేలలోనికి తీసుకొని వెళ్ళిందిట . పెరియనాకి శ్రీజ్ఞానసంభందార్ ని యెత్తుకున్న విగ్రహం యీ కోవెలలో చూడొచ్చు .

సువేదకుడు అనే బాలుడు పరమ శివభక్తుడు యీ శ్వేతారంణ్యెశ్వరుని సేవించుకుంటూ ఉంటాడు . సువేదకునికి ఎనిమిదవ ఏట మృత్యుగండం వుంటుంది . యెనిమిద ఏడు నిండగానే యముడు సువేదకుని తీసుకొని పోవుటకు వస్తాడు . యముని చూచిన సువేదకుడు శివుని వెనుక దాక్కుంటాడు . శ్వేతారంణ్యేశ్వరుని చూసి యముడు భయంతో పారిపోతాడు . మృత్యుగండం తప్పించుకున్న సువేదకుడు శివధ్యానం లో గడిపి శివసాన్నిధ్యం పొందుతాడు .

యీ కోవెల పొద్దున్న 6 గం నుంచి మధ్యాహ్నం 1 గం వరకు తిరిగి సాయంత్రం 4 గం  నుంచి 9 గం తెరిచి వుంటుంది .

ఈ మందిరంలో మరణించిన వారికి తర్పణాలు విడుస్తారు .

బుధగ్రహం అనుకూలముగా లేని పక్షంలో ముఖ్యంగా విద్య , వ్యాపారాలను , వుద్యోగాలపై ప్రభావం వుంటుంది . వీటి నుంచి బయట పడాలంటే శుచిగా ఆకుపచ్చని వస్త్రములు ధరించి ఈశాన్య ముఖంగా కూర్చొని క్రింది మంత్రాలు జపించి ఒకటిన్నర కిలోగ్రాముల పెసలు ఆకుపచ్చ బట్టలో కట్టి దానమిస్తే బుధగ్రహ దోషం పోతుంది .

బుధగ్రహ మూలమంత్రం

ఓం బ్రాం బ్రిం బ్రౌం సహా బుధాయ నమః

బుధ గాయత్రి

ఆత్రేయాయ విద్మహే యిందు పుత్రాయ ధీమహి
తన్నో బుధ ప్రచోదయాత్ష్మి

మరిన్ని శీర్షికలు
weekly horoscope28th december to 3rd january