Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> పరిష్కారం

parishkaram

 సమయం ఉదయం ఆరు గంటలు.అలారం మోగడంతో  లేచి కూర్చొంది శారద.కళ్ళు నులుపుకొని భర్త ముఖంలోకి చూసింది.ఆఫీసులో పని వత్తిడి వల్ల రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఇంటికొచ్చిన తను గాఢ  నిద్రలో వున్నది గమనించిందామె. ఇంటి పనులు పిల్లల సంరక్షణ ఇద్దరూ కలసి చేసుకోవాలన్న ఒప్పందం వాళ్ళిద్దరి మధ్య వున్నా భర్తను లేపాలనుకోలేదామె సరికదా భర్తమీద జాలితో దుప్పటి సర్ది కప్పి తనకు తప్పదన్నట్టు  లేచి జుట్టు ముడి వేసుకొని కిచ్చన్లోకి నడిచింది. ఓ స్టవ్ మీద పాలు,మరో స్టవ్ మీద ఇడ్లి కుక్కరునుంచి కూరలు నరుకుతూ కూర్చొంది.అంతలో ఆమె ముద్దుల కూతుళ్ళు ఇద్దరూ పడగ్గదిలోనుంచి  లేసొచ్చి హాల్లో వున్న సోఫాలో కూర్చొన్నారు. వాళ్ళిద్దరిలో  పెద్దపిల్ల యజ్ఞ.ఆమె అయిదవ తరగతి.చిన్నపిల్ల ప్రజ్ఞ మూడవ తరగతి.వాళ్ళు  వాళ్ళుంటున్న ఆ గేటెడ్  అపార్టుమెంటుకు రెండు కిలో మీటర్లకావల వున్న ఓ ఇంటర్ నేషనల్ స్కూల్లో చదువు తున్నారు.

సోఫాలో కూర్చొని వున్న కూతుళ్ళను గమనించింది శారద."ఏంటమ్మా! అలా కూర్చొన్నారు.లేచి బ్రష్ చేసుకురండి పాలిస్తాను తాగుదురుగాని.మళ్ళీ స్నానాలు చేసుకొని,యూనిఫామ్ వేసుకొని,టిఫన్ తిని బడికెళ్ళాలి"అంటుండగా పిల్లలిద్దరూ బ్రష్లకు పేస్టుంచుకొని బాత్ రూంలోకి నడిచారు.అంతలో పిడియాషూర్తో కలిపిన పాలను టీపాయిమీద వుంచింది శారద. పిల్లలు ముఖాలు కడుక్కొని వచ్చి పాలగ్లాసులను తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చొని తాగి అర్థగంట హోం వర్కు చేసుకొని బ్యాగుల్లో పుస్తకాలను సర్దుకున్నారు.

"ఏమిటీ!స్నానాలు చేయరా?"మిక్సీలో  చట్నీ రుబ్బుతూ అడిగింది శారద.

"నువ్వొచ్చి స్నానం చేయించు మమ్మీ!"చిన్న పిల్ల మారాం చేసింది.

"మమ్మీకి బోలెడు పనుందమ్మా!మీరు పెద్దాలైయ్యారుగా!  స్నానాలు మీరే చేసుకోవాలి.టైం అవుతోంది తల్లీ!త్వరగా కానివ్వండి.స్నానమైన తరువాత యూనిఫామ్ వేసుకొని డైనింగ్ కు రండి"అంటూ పిల్లలను స్నానాలకు పంపింది.వాళ్ళు రడీ అయి డైనింగ్ కు వచ్చేలోపు ఇడ్లీ,కొబ్బరి చట్నీ,సాంబారును తయారుగా టేబుల్ మీద వుంచింది శారద.టిఫన్ తిన్నారు పిల్లలు.అంతలో స్కూల్ వ్యాన్ వచ్చి ఆగింది.డ్రయివర్ హారన్ మోగించడం వింటూనే పిల్లల్ని,బ్యాగులను తీసుకొని లిప్టులో క్రిందికి దిగి వాళ్ళను పంపించి పైకొచ్చింది శారద.
శారద,ఆమె భర్త శ్రీకర్లు చెన్నై ఓ.యం.ఆర్ రోడ్డులో బాగా పేరున్న ఓ సాప్టువేర్ కంపెనీలో వుద్యోగాలు చేస్తున్నారు.ఉభయుల తరపున పెద్దలెవరూ వారితో పాటు లేరు.ఇంటికి,వంటకి సంబంధించి అన్ని పనులను వాళ్ళే చేసుకోవాలన్న నిర్భందంతో కొనసాగిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు,వాళ్ళ సంరక్షణ  ముఖ్యమని అందుకు తల్లితండ్రుల బాధ్యత ఎంతో అవసరమని ఇద్దరికి తెలుసు.

ముఖ్యంగా ఆ పిల్లలను కన్న తల్లిగా శారదకే ఎక్కువ బాధ్యతని కూడా తెలుసు.అయినా లక్షల్లో వస్తున్న జీతాలను పోగొట్టుకోవటానికి ఆమె సంసిద్దంగా లేదు. శ్రీకర్ కూడా పిల్లల భవిష్యత్తు,వాళ్ళ అలనా పాలన కోసం భార్య శారదను పనికి రిజైన్ చేయించి ఇంటివద్ద వుండిమని చెప్పటానికి ఏనాడూ ప్రయత్నించలేదు. కారణం శారదను ఒప్పించి వుద్యోగం మాన్పిస్తే  జీతంగా వచ్చే లక్షా పదివేలు రూపాయల సంపాదన పోతోందన్న భయం తనకు. భార్యభర్తలిద్దరూ కలసి నెలకు దాదాపు రెండున్నర లక్షల వరకూ సంపాయిస్తున్నారు కనుక వేరు గత్యంతరం లేక పిల్లలను,ఇంటిని,సంబంధిత సమస్యలను ఎదుర్కోవడం తప్పని సరైంది వాళ్ళకు.

ఈ మధ్య శారద భర్త శ్రీకర్ ఆఫీసు పనుల వొత్తిడి వల్ల  ఇంటికి సంబంధించిన ఏ పనులను చేయడం లేదు. అది గమనించక పోలేదు శారద.ఆ సంగతి  భర్తను అడగలేక  తప్పని పరిస్ఠితుల్లో  ఇంటి బాధ్యతలను పూర్తిగా తనపై వేసుకొని ఓర్పుతో చేసుకు పోతోంది.అయినా కొన్ని సందర్భాలలో తనూ సహనం కోల్పోయి  చిరాకుతో పిల్లలను, ఒక్కోసారి భర్తను కూడా కేకలు పెడుతోంది.మళ్ళీ ఓ అర్థ గంట లోపే తనకు తానే పశ్చాత్తాపడి క్షమాపణలు కోరుకుంటుంది. ఏదేమైనా పిల్లలకు తను ప్రేమను పంచటంలో  ఫైల్యూర్ అవుతుందన్న భావం ఆమె గుండెల్లో గూడు కట్టుకొని వుందని తనకు మాత్రమే తెలుసు.తద్వారా పిల్లలు ఆమెకు దూరమౌతారేమోనన్న భయం కూడా వుంది. వీటన్నిటికి కారణం పని ఒత్తిడే! అందు వల్ల పిల్లలను ,తిట్టడం విసుక్కోవడం లాంటివి తరచూ చేస్తోంది. పిల్లలు కూడా తల్లితో ప్రేమతో మెలగడం తక్కువైయ్యింది. ఇందుకు పరిష్కారం శారదకు చాకిరి ఒత్తిడి తగ్గాలి.అది తగ్గాలంటే అందుకు ప్రత్యామ్నాయ  మార్గాన్ని వెతుక్కోవాలి.ఆ ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కో గలిగితే ఆమె పూర్తిగా రిలాక్సవుతుంది.అలా అయినప్పుడు  పిల్లలమీద  కోప్పడ్డం,విసుక్కోవడం తగ్గిపోయి వాళ్ళకు చేరువై ప్రేమగా చూసుకొంటుంది. అప్పుడే ఆ తల్లీకూతుళ్ళ బంధం కాస్తైనా బలపడి  కొనసాగ గలదు.

శారదకు 'వర్కు ఫ్రమ్ హోం' అన్న వెసులుబాటు వున్నా పాపం ఇంటి పనులు చేసుకోవడం ఒకెత్తయితే ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఆరు గంటల  వరకూ ల్యాబ్ టాబును ముందేసుకుని ఆఫీసు పనితో ఒక్క క్షణం తీరిక లేకుండా సతమతమవడం మరో ఎత్తు.అయినా పట్టుదలతో జీతంకోసం పోరాడే శారద తన దుస్థితిని ఎవరితోనూ చెప్పుకోలేక అలాగే నెట్టుకు పోతోంది. ఈ మధ్య అంతమంటూ లేని చాకిరితో తనుకూడా బలహీనపడుతూ  చిన్నచిన్న వ్యాధులతో అనారోగ్యం పాలౌవుతోంది .

గంట తొమ్మిది కావస్తుండగా శ్రీకర్ లేచి స్నానమదీ చేసి డ్రస్ చేసుకొని హాల్లోకొచ్చి సోఫాలో కూర్చొన్నాడు.

వంట చేస్తున్న శారదకు సెంటు ఘుభాలింపు తన ముక్కు పుటాలకు తాకుతూనే హాల్లోకి చూసింది భర్త ఆఫీసుకు తయారై వచ్చినట్టున్నాడని. అందంగా హీరోలా తయారై వచ్చి సోఫాలో కూర్చొన్న శ్రీకర్  శారదను చూసి'ఏమిటి?'అన్నట్టు రెప్పలెగరేశాడు.
"ఏముంది.మీ వాలకం చూస్తుంటే ఆఫీసుకు బయలుదేరినట్టున్నారు.కాఫీ,టిఫన్ వగైరాలొద్దా?"అడిగింది.

శ్రీకర్ లేచి ఆమెకు దగ్గరగా వెళ్ళి ఓ కప్పు కాఫీ చాలు మేడం.తాగి వెళ్ళి పోతాను"అంటూ నడుంచుట్టూ చెయ్య పోనిచ్చి హత్తుకున్నాను.
"ఈ పిచ్చి చేష్టలకేం తక్కువలేదు.పనులు చేయమంటేనే మీకు సోమరితనం.పోనీ...కారీర్ కట్టమంటారా... వద్దా?"కాఫీ కలిపి చేతికిస్తూ అంది శారద.

"వద్దు శారదా!ఇవాళ మేనేజరు  లంఛ్ కి  పిలిచారు.వెళ్ళాలి.వస్తానూ"అంటూ కాఫీ కప్పును టీపాయి మీద పెట్టి అక్కడే వున్న హెల్మెట్ తీసుకొని బయలు దేరాడు శ్రీకర్ .

భర్తను సాగనంపిన శారద పావు గంటలో స్నానమదీ చేసి టిపన్ తిని సరిగ్గా పది గంటలకు ల్యాబ్ టాబ్ ను ముందేసుకొని కూర్చొంది.అయితే మైండ్ ఆప్సెంటు-బాడీ ప్రెసెంటు అన్న చందాన పని చేస్తుందే తప్ప  ఆమె మనసు పరిపరి విధాలుగా ఆలోచింప సాగింది. పాపం..ఏమిటో తనకు పట్టిన కర్మ.వుద్యోగం చేయాలను కొన్నంత  మాత్రాన ఇంటి భారాన్ని మొత్తం తనే చెయ్యాలా? వెతుకుతాను.నాలా బోలెడు సమస్యలను ఎదుర్కొని ఇప్పుడు వాటినుంచి బయటపడి హాయిగా రిలాక్సుడుగా సంసారాన్ని సాగిస్తున్న స్నేహితురాలు  నీరజతో సంప్రదించి సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాని కనుక్కొంటాను. ఇవాళ శ్రీకర్ ఆఫీసు నుంచి వస్తూనే తనతో మాట్లాడి  నిర్ఙయాన్ని తీసుకుంటాను అని మనసులో అనుకొంటుండగా అమెరికాలో వున్న ఆఫీసు నుంచి మీటింగుకు కాల్ వచ్చింది దాన్ని అటెండు కావడంలో నిమగ్నమైయ్యింది శారద.

రాత్రి భోజనాలైన తరువాత పిల్లలిద్దరు వాళ్ళ గదికెళ్ళి పడుకున్నారు.పాపం బాగా పొద్దుపోయొచ్చిన శ్రీకర్ లుంగీ కట్టుకొని ముఖం కడుక్కొని వచ్చి డైనింగ్ టేబుల్లో కూర్చొన్నాడు.భోజనం వడ్డించింది శారద. భోంచేసి పడగ్గదిలోకి వెళ్ళి పోయాడు శ్రీకర్ .శారద కూడా భోంచేసి గిన్నెలను సర్ది పెట్టి శ్రీకర్ కు  పాలు తీసుకొని గదిలోకి అడుగు పెట్టి భర్తవంక చూసింది.. పాపం... దాదాపు పన్నెండు గంటల సేపు ఆఫీసులో పని చేసొచ్చిన శ్రీకర్ నిద్రపోకుండా మళ్ళీ ల్యాబ్ టాబ్ను ముందేసుకొని ఏదో పని చేస్తున్నాడు. "ఏంటీ నిద్ర రావట్లేదా... ల్యాబ్ టాబులో పనిచేస్తున్నట్టున్నారు!ఇందా పాలు"అని చేతికిచ్చి మంచం మ్మీద కూర్చొంది.

"చేస్తున్న ప్రాజెక్టులో తప్పులు దొర్లాయి శారదా!ఉదయానికల్లా రెక్టిఫై చేసి పంపించాలి"అంటూ పాలు తాగి గ్లాసును ప్రక్కనే వున్న డ్రసింగ్ టేబుల్ మీద పెట్టాడు.

"పాపం!మీ బాధలు మీకు.నా ఆలోచనలు నాకు.అవునండి !మనం మన కుటుంబ నిర్వహణ కోసం అవసరంతో తప్పుడు నిర్ణయం తీసుకున్నామనిపిస్తుంది.నాకు కంపెనీ వాళ్ళు'వర్కు ఫ్రమ్ హోం'అన్న వెసులుబాటు కల్పించినా వాళ్ళిస్తున్న బోలేడు పనితోనూ,అంతకన్నా మించిన ఇంటి చాకిరితో సతమతమై పోతున్నాను.ఈ గొడ్డు చాకిరి వల్ల పిల్లల చదువులు,వాళ్ళ భవిష్యత్తును గూర్చి మనం ఆలోచించలేక పోతున్నాము.పూర్తిగా వాళ్ళపై మన కాంషెన్ట్రేషన్ వుంచలేక పోతున్నాము. ఈ విషయంలో తండ్రిగా మీరు,తల్లిగా నేనూ ఫైల్యూర్ అవుతున్నామండి.ఏదో కన్నాము వాళ్ళూ పెరుగుతున్నారన్న భావంతో యాంత్రికంగా జీవితాలను సాగిస్తున్నామే తప్ప తల్లి తండ్రులుగా  పిల్లలకు పంచాల్సిన మన వంతు ప్రేమను అస్సలు పంచటం లేదు.

మనకున్న పని ఒత్తిడివల్ల  కనీసం అర్థ గంటైనా వాళ్ళతో గడపలేని పరిస్ఠితి మనది.పిల్లలుకూడా సైకలాజికల్ గా ఎవరికి వారేనన్నట్టు టి.వి.చూడ్డం,ఆడుకోవడం, కొట్టుకోవడమంటూ వున్నారండి!.మొన్నో రోజూ చిన్నపిల్లకు ఆమెను నేను  సరిగా చూడలేదన్న భావంకలిగిందేమో వున్నట్టుండి టి.వి.చూస్తున్నదల్లా దగ్గరకొచ్చి 'అమ్మా!ఇలాగే పొద్దాక నీకు నువ్వే ఆ ల్యాబ్ టాబులో మాట్లాడుకొంటూ వుంటావే స్కూల్ నుంచి వచ్చిన మాతో కాస్పేపు ప్రేమతో మాట్లాడి మేమెలా చదువుతున్నామని,ఇంకా  స్కూల్లో జరిగిన విషయాలను గూర్చి అడిగి తెలుసుకోవా?'అని ప్రశ్నించింది. చిన్న పిల్ల అడిగిన ఆ మాటలకు షాకైన  నాకు ఎంతో బాధనిపించింది.అవునండి! ఇద్దరం సంపాయిస్తున్నది వాళ్ళకోసమే ననుకొంటూ వాళ్ళను గూర్చి  అస్సలు పట్టించుకోకపోతే ఎలా? కనీసం రోజుకో గంట సమయాన్ని వాళ్ళ కోసం కేటాయించి శ్రద్దతో, ప్రేమతో చూసుకోవాలికదా?నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ మనపై  అసంతృప్తిలో వున్నారన్న సందేహం నాకుందండి.ఇక మీ గూర్చి మాట్లాడాలంటే ఇరవై నాలుగ్గంటలు సమస్యలతో కూడికొన్న ఆఫీసు పనులను  ఎదుర్కొంటూ నెమ్మదిని కోల్పోతున్నారని గ్రహిస్తున్నాను.అలాంటి పరిస్థితుల్లో ఇంటి పనులకు,పిల్లల సంరక్షణకు మీరెలా సహాయపడగలరు?" అంటూ శ్రీకర్ ముఖంలోకి చూసింది శారద.

"అంటే నేనేం చేయ్యాలి శారదా?అడావుడితో కూడికొన్నపని,దాని ద్వారా నాకు కలిగే టెన్షన్ను చూస్తున్నావుగా!?  పని మానుకోమంటావా!చెప్పు?" అన్నాడు కళ్ళజోడు చేతికి తీసుకొని శ్రీకర్ .

" అఖ్ఖరలేదండి.పని మానుకోవలసి వస్తే నేనే మానుకొని ఇంటిని,పిల్లలను చూసుకొంటాను. మొత్తానికి మనం  పిల్లలకు చేరువవ్వాలంటే  వాళ్ళను అక్కున చేర్చుకొని ప్రేమను పంచి శ్రద్దతో  భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దాలి.అవునండి!ఇప్పుడు మన ముందు రెండు ఆప్షన్లు వున్నాయి.ఒకటి...మీరన్నట్టు నేను పని మానుకొని పిల్లలను ఇంటిని చూసుకోవాలి.పని మానేయకూడదు సంపాదన కావాలనుకుంటే.... రెండవ ఆప్షన్. వంట చేయడానికి,బట్టలుతికి అంట్లు తోమడానికి ఇల్లు శుభ్రంగా వుంచటానికి మనకు నమ్మకమైన పని మనుష్యులను పెట్టుకోవాలి.అప్పుడు కాని మనం రిలెక్సవుతూ సమయాన్ని హాయిగా పిల్లలతో గడపగలం.అందుకే వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రత్యామ్నాయ మార్గంగా పని మనుష్యులను పెట్టు కోవాలనుకొంటున్నాను"అంది శారద ఓ నిర్ణయానికొచ్చినట్టు.

"నీ ఇష్టాన్ని నేనెప్పుడు కాదన్నాను  శారదా.అలాగే చెయ్!బాల్ ఈజ్ ఎట్ యువర్ కోర్టు.కనుక నిర్ణయం నువ్వే తీసుకోవాలి" అంటుండగా గంట పన్నెండు కొట్టిండి.ల్యాబ్ టాపును మూసేశాడు శ్రీకర్. లైట్ ఆఫ్ చేసింది శారద.ఇద్దరూ ఏదో సమస్యనుంచి రిలీఫ్ అయినట్టు దీర్ఘంగా నిట్టూరుస్తూ కళ్ళు మూసుకున్నారు.

మరుసటి రోజు పిల్లలను బడికి, భర్తను ఆఫీసుకు పంపిన శారద తనూ తయారై టిఫన్ తిని పని చేయటానికి ల్యాబ్ టాబ్ ను ముందేసుకొని కూర్చొంది. అంతలో తన ఫోన్ రింగయ్యింది.ఎవరా ఫోన్లో అని చూసుకుంటే బెంగుళూరు ఆఫీసునుంచి తన  స్నేహితురాలు నీరజ,
"హల్లో...ఎలా వున్నావ్ నీరజా?"అడిగింది.

"నాకేం భర్త పిల్లలతో బాగానే వున్నాను.వూహించనంతగా లక్జూరియస్ లైఫు నాది.బోలెడు టైంను పిల్లలతో స్పెంట్  చేస్తూ ఆనందంగా వున్నాను."

"నీకెలా కురురుతుందే!అటు ఆఫీసు,ఇటు ఇళ్ళు పిల్లలకంటూ బోలెడు చాకిరి చేయాల్సి వుంటుందే! మీ అత్తా మామయ్యలను వద్దుంచుకున్నావా?"సందేహంతో అడిగింది.

"నో...ఆ పని నేనెప్పుడూ చేయను. అలాని మా నాన్న అమ్మను కూడా నా వద్ద వుంచుకోలేదు.లైఫును ఎంజాయ్ చేసే సమయంలో మా వారి తల్లిదండ్రులనో లేక అమ్మానాన్ననో మా వద్ద వుంచుకొని సమస్యలను కొని తెచ్చుకోను.అంటే. వాళ్ళు ఎవరు మనవద్దున్నా సమస్యలను ఎదుర్కోవలసిందే!ఒకవేళ వస్తే వారం పదిరోజులుంచుకొని గౌరవంగా చూసి పంపిస్తే మనపై గౌరవంతో కూడికొన్న అనుబంధం చక్కగా కొనసాగు తుంది. తెలుసా"అంది నీరజ.

"ఎలా !మీతో పెద్దలెవరూ లేకుండా బోలెడు చాకిరి చేసుకొంటూ ఆనందంతో ఎలా వుండ గలుగుతున్నావే?"

"చాకిరా....నేనెప్పుడూ చేయలేదే!అందుకు పని మనుష్యులను పెట్టుకొన్నాను.వంట చేయటానికి ఒకావిడ.అంట్లు తోమి, ఇల్లు వూడ్చి, బట్టలుతకటానికి ఒకావిడని ఇద్దరున్నారు.చూడూ!మనం లక్షల్లో సంపాయిస్తున్నాం. అందులో ఓ పది వేలు జీతంగా పనివాళ్ళకివ్వగలిగితే మన పని హాయి.ఆఫీసు పని తప్ప ఇంటి చాకిరి పూర్తిగా తగ్గి పోతోంది.తద్వారా నీకు బోలెడు సమయం కలిసొస్తుంది. ఆ సమయం నువ్వు పూర్తిగా నీ పిల్లలు,వాళ్ళ చదువులకోసం వుపయోగించుకోవచ్చు.అప్పుడు నీకూ పిల్లలతో అనుబంధం పెరుగుతుంది .వాళ్ళూ నిన్ను ప్రేమతో హత్తుకు పోతారు. తల్లీ పిల్లల బంధం అలా వుండాలే తప్ప నిన్ను చూస్తే భయపడుతూ వాళ్ళు,అయ్యో పిల్లలొచ్చేశారే ఇక ఆఫీసు పని యెలా చేసుకోవాలోనంటూ నువ్వూ టెన్షన్తో వుండకూడదు.

"అంటే నువ్వూ....".

"పని మనుష్యులను పెట్టుకున్నాను.నేనూ పని మానుకోకుండా చేసుకొంటూ భర్త పిల్లలతో హాయిగా వుంటున్నాను.మా అపార్టుమెంటులో నన్ను కొందరంటారూ...దానికి లక్షలు సంపాయిస్తుందన్న గర్వం, డాంబికాలకు పోతోంది,డబ్బును నీళ్ళలా ఖర్చు పెడుతూ పోజులు కొడుతోందని.నేను ఎవరి మాట లెక్కచేయను.ఎవరేమనుకున్నా నా మటుకు నేను ఒత్తిడికి గురి కాకుండా  పిల్లల భవిష్యత్తుకోసం,నేను సుఖంగా,నెమ్మదిగా వుండడానికోసం కొంత డబ్బును పోగొట్టుకొని హాయిని పొందగలుగుతున్నాను.అలాగే  నావల్ల మరో ఇద్దరికి ఉపాధి కలిగిస్తున్నానని తృప్తి పడుతున్నాను.అవునే శారదా!ఇప్పుడు ఇంటి పని గూర్చి దిగులన్నది నాకు  అస్సలు లేదు"అని ముగించింది నీరజ.
ఆలోచనల్లో పడింది శారద. నిజానికి నీరజ ఇంటి చాకిరికి దూరంగా వుండి తను సుఖపడుతూ మరో ఇద్దరికి ఉపాధి కూడా కల్పించిందంటే అది గొప్పే మరి అనుకొంది.వెంటనే "నీరజా యువార్ గ్రేట్ "అంది షేకండ్ యిస్తూ శారద.

"థేంక్యూ!మొత్తానికి ఎవరేమనుకున్నా నేను  నా సుఖంకోసం చేసింది కరక్టనుకొంటున్నాను.నువ్వూ నాలా చేసుకో... సుఖ పడతావు.వుద్యోగాన్ని పోగొట్టుకోనవసరం లేదు"

"నీకులా నమ్మకమైన పని మనుష్యులు దొరకాలే!"

"కావాలంటే చెప్పు!మా ఇంటి వద్ద భర్తలను  కోల్పోయిన తల్లీ కూతుళ్ళున్నాదు. వాళ్ళు విడోలన్న సెంటిమెంటు మీకులేకపోతే రెపటినుంచే పనిలోకి వచ్చేలా చేస్తాను.కూతురు రుచికరంగా వంట చేస్తోంది.తల్లి ఇంటి పనులు చూసుకుంటుంది.ఏం పిలిపించనా"అంది నీరజ.
"మాకు సెంటిమెంట్లేమీ లేవు నీరజా!రేపటినుంచే పనిలోకి రమ్మను.జీతంగా చెరో మూడువేలిస్తాను.నేనూ ఇంటి పనులనుంచి రిలీవై పిల్లలు, వాళ్ళ చదువులమీద దృష్ఠి సారిస్తాను"ఓనిర్ణయానికొచ్చి అంది శారద.

"ఓకే !రేపే వాళ్ళను తీసుకువస్తాను.పొద్దు పోయింది. నేనూ బయలుదేరుతాను"అంటూ బ్యాగు తీసుకొని బయటికి నడిచింది నీరజ.ఎన్నో ఇబ్బందులనుంచి బయటపడ్డట్టు  మెల్లగా నవ్వుకొంటూ వచ్చి సోఫాలో కూర్చొంది  టెన్నిసు ఆడ్డానికి వెళ్ళిన పిల్లలను ఎదురు చూస్తూ శారద.

మరిన్ని కథలు
droham