Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
parishkaram

ఈ సంచికలో >> కథలు >> ద్రోహం

droham

“వెళ్ళి దీనితోనే కులకండి..” కోపంగా చెప్పింది భార్య శాంత, చేతిలో ఉన్న ఫోన్ శేఖర్ మీదకు బలంగా విసిరి. గురి తప్పి మంచం మీద పడ్డ తన ఫోన్ వైపు కంగారుగా చూసాడు శేఖర్. పాతికేళ్ళ అందమైన అసిస్టెంట్ మేరీ ఫోటో తళుక్కున మెరిసింది స్క్రీన్ మీద. ఐదు మిస్డ్ కాల్స్ తన దగ్గర నుంచి. కంగారు ఎక్కువైంది శేఖర్ కి. అందంగా, మైమరపించేలా నవ్వుతుంది మేరీ ఫోటోలో. స్క్రీన్ లాక్ చేసాడు వెంటనే. మైండ్ అంతా ఒక్క క్షణం మొద్దుబారిపోయింది. ఏదో ఒకటి చెప్పి శాంతను ముందు శాంత పరచాలి. కానీ ఏం చెప్పాలి?

ఏంటిది శాంతా నా గురించి నీకు తెలీదు?” బలహీనంగా అడిగాడు ఇంకేం మాట్లాడాలో తోచక.

జవాబివ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది శాంత కోపంగా, బద్దలయ్యేలా గది తలుపు గట్టిగా వేసి. ఓ సారి దీర్ఘంగా నిట్టూర్చాడు శేఖర్ దిగులుగా.

గత కొంత కాలంగా దేని మీదా పెద్దగా శ్రద్ధ పెట్టలేక పోతున్నాడు నలభై ఏళ్ళ శేఖర్. ఒక్కసారి దిగాక ఇలాంటి వాటిలోంచి బయట పడటం అంత తేలిక కాదని తనే ఎన్నోసార్లు ఎంతో మందికి చెప్పాడు గతంలో. చివరకు తన పరిస్థితీ అదే అయింది. ఇలాంటి విషయాల్లో ఎంత బలంగా ఉండేవి తన ప్రిన్సిపుల్స్. మేరీ వచ్చాక వాటన్నిటికీ స్వస్తి చెప్పాల్సి వచ్చింది.

చేతిలో ఉన్న ఫోన్ మోగింది. మళ్ళీ మేరీ నే. కాల్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ ఆలోచనలో మునిగిపోయాడు. ఎంత పని చేసింది మేరీ. ఎలా ఇందులోంచి బయటపడటం? దిగులుగా మంచం మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఎంత హాయిగా ఉండేది ఇంతకు ముందు. చక్కగా ఆఫీస్ పని చేసుకొని ఇంటికి వచ్చి కాసేపు ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పి టైం కి పడుకొని టైం కి లేచేవాడు. సెలవ రోజైతే ఎంత ఉత్సాహంగా ఉండేది? ఇప్పుడంతా గందరగోళంగా తయారయింది. ఎంత సేపూ అదే ధ్యాస. ఆఫీస్ పని మీద కూడా శ్రద్ధ పెట్టడం కుదరటంలేదు. రొటీన్ అంతా చెడిపోయింది.

బయట గదిలో తండ్రి గొంతు వినిపిస్తుంది. శాంతకు ఏదో చెబుతున్నాడు తన ఆరోగ్యం గురించి. ఆలోచనలు ఆయన మీదకు మళ్ళినయ్ వెంటనే. తండ్రితో ఎంత కులాసాగా కబుర్లు చెప్పేవాడు గతంలో? ఆయన కూడా తనలో వచ్చిన మార్పు గమనించే ఉంటాడు. పోయిన వారం ఆయనకి ఒంట్లో బాలేదు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి. రాత్రి తొమ్మిది దాటింది. తనే డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెకప్ చేయించుకున్నాడు. గతంలో అయితే తనని అడిగేవాడు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళమని. ఇప్పుడంతా మారిపోయింది, తనకి దేనికీ టైం లేకపోవటం వల్ల.
ఇంటికి తిరిగి వచ్చి తన ఆరోగ్యం గురించీ, డాక్టరు చెప్పిన విషయాలను గురించీ తండ్రి చేబుతున్నంత సేపూ ఓ వెధవలా తల వంచుకొని ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు తను. ఏంటీ మార్పు జీవితంలో. ఎలా తను కూడా చాలా మందిలా ఈ తప్పటడుగు వేసాడు? పని టైంకి చేయలేకపోవటం వల్ల, ఒత్తిడి పెరిగి రాత్రి లేట్ గా ఆఫీసులో కూర్చోవాల్సి వస్తుంది. చాలాసార్లు ఇంటికి వచ్చాక కూడా ఆఫీసు పని వదలట్లేదు.

తండ్రితో మాత్రమే కాదు. ఒక్కగానొక్క కొడుకు బబ్లూతో కూడా ఇదివరకటిలా టైం గడపలేక పోతున్నాడు.  మొన్న రాత్రి వాడు ఎంత ఆశగా వచ్చాడు చెస్ ఆడదామని. ఎందుకంత విసుగ్గా అనిపించింది? ఎంత ఇష్టం తనకు వాడితో ఆడటం ఒకప్పుడు. వేరే దారిలేక ఆడినట్టుగా, ఎప్పుడు ఓడిపోదామా అన్నట్టుగా ఆడాడు తను. ఏమైంది తనకి? తన కుటుంబం కంటే ఇదంతా ఎక్కువా?

మళ్ళీ ఫోన్ మోగింది. అయితే ఈ సారి మేరీ కాదు. అన్నయ్య దగ్గరనుంచి. మాట్లాడాలనిపించలేదు ఏ మాత్రం. ఫోన్ సైలెంట్ చేసాడు. కాసేపు ప్రశాంతంగా ఉండాలని ఉంది. మొన్న దసరా పండక్కి అన్నయ్య వాళ్ళు వచ్చి మూడు రోజులు ఉన్నారు. గతంలో అయితే అన్నయ్య వస్తున్నాడంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది. తమ చిన్నప్పటి విషయాలు ఎన్నో మాట్లాడుకొని నవ్వుకునేవారు. అన్నయ్య పిల్లలకు కూడా తనంటే ఎంతో ఇష్టం. ఈ సారి మాత్రం ఎందుకో వారితో టైం సరిగ్గా గడపలేకపోయాడు. అన్నయ్య ఖచ్చితంగా ఈ విషయంలో బాధపడి ఉంటాడు. ఎంత సేపూ ఫోన్ లోనే గడుపుతూంటే, వారితో ప్రశాంతంగా గడిపే సమయమేది? ఏదో అర్జెంటు ఆఫీసు పని అని వారికి సర్ది చెప్పాల్సి వచ్చింది. వారికి చెప్పటమైతే చెప్పాడు కానీ, తనకు నిజం తెలీదూ?

ఫ్యామిలీతో షాపింగ్ కు, సినిమాకు వెళ్ళినా ఇంతకు ముందులా లేదు ఇప్పుడు. ఎంతసేపూ అదే ధ్యాస.  తను ఇంత బలహీనుడా మరీ?
దీనంతటికీ కారణమైన మేరీ మీద కోపం వచ్చింది. అసలు తను ఆఫీసులో చేరకపోయి ఉంటే ఎంత బావుండేది. తన పెళ్ళి ఎవరితోనో సెటిల్ అయిందని ఆఫీసు మానేస్తానని చెప్పింది నిన్న, బాధపడుతూ. అదేదో కాస్త ముందుగా చావాల్సింది. అనవసరంగా తనని నమ్మి ఇందులోకి దిగి ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు.

మేరీ గురించిన ఆలోచనలు చుట్టుముట్టినయ్. ఎంత అందంగా చలాకీగా ఉంటుంది. పనిలో కూడా ఎంత చురుకుదనం. పెద్దపెట్టున వర్షం ఆ రోజు సాయంత్రం. తామిద్దరే ఆ రోజు అలా ఆఫీసులో పని మీద ఉండిపోవాల్సి వచ్చింది. ఆ రోజు జరిగింది తనలో ఇంత మార్పు తీసుకు వస్తుందని ఏ మాత్రం ఊహించినా అడుగు ముందుకు వేసేవాడు కాదు. మామూలుగా అయితే తను కూడా అంత తేలిగ్గా కన్విన్స్ అయ్యేవాడు కాదు. ఇలాంటివి ఈ ఫాస్ట్ ప్రపంచంలో ఏమాత్రం తప్పు కాదనీ, తప్పదనీ ఏదేదో చెప్పి కన్విన్స్ చేసింది. ఈ విషయంలో తన ప్రిన్సిపుల్స్ అన్నీ దారి తప్పినయ్.. ఆలోచనలకి బ్రేక్ పడేలా ఫోన్ మోగింది. చిరాగ్గా ఫోన్ వైపు చూసాడు. తన చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ అజయ్. మొహంలో చిరాకు కాస్తా సంతోషంగా మారింది. ఆ సమయంలో స్నేహితుడికి తను గుర్తుకు రావటం అదృష్టం. వీడితో మాట్లాడితే కాస్త రిలీఫ్ గా ఉంటుంది అనుకుంటూ కాల్ ఆన్సర్ చేసాడు.

“ఏరా శేఖర్. ఎలా ఉన్నావ్? ఫోన్ కూడా చేయటం మానేసావ్ ఈ మధ్య? అంత బిజీ ఏంట్రా బాబూ..”

“ఏం లేదురా. కరెక్ట్ టైం కి ఫోన్ చేసావ్ చాలా రోజుల తరువాత. నీకో విషయం చెప్పాలి..” అంటూ ఆ రోజు భార్యతో జరిగిన గొడవ గురించి వివరంగా చెప్పాడు శేఖర్. అయితే మధ్యలో సిగ్నల్ సరిగ్గా లేక శేఖర్ చెప్పింది సరిగ్గా అర్ధం కాలేదు అజయ్ కి.

“రేయ్ శేఖర్. సిగ్నల్ సరిగ్గా లేదు. ఇప్పుడు బాగానే ఉంది. ఏంట్రా నువ్వనేది? నీకూ నీ అసిస్టెంట్ మేరీకి సంబంధం ఉందా? అది నీ భార్యకు తెలిసి పోయిందా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇదేనా నువ్వు చెప్పింది లేక నేనేమైనా తప్పుగా అర్ధం చేసుకున్నానా?” ఎంతో ఆశ్చర్యపోతూ అడుగుతూండగా కాల్ డిస్కనెక్ట్ అయింది.  అజయ్ ఇప్పుడు అర్జెంటుగా ఆలోచనలో పడ్డాడు. శేఖర్ గురించి తనకు బాగా తెలుసు. చాలా కష్టపడి జీవితంలో పైకి వచ్చాడు. ఆర్ధికంగా గట్టిగా నిలదొక్కుకోవాలన్న బలమైన కోరికతో, పని తప్ప వేరే ఏ ధ్యాసా లేకుండా, ఏ చెడు అలవాట్లకు లొంగకుండా, చక్కటి క్రమశిక్షణతో ఉంటాడు. సమయం వృధా చేసే ఏ అలవాట్లు ఇంత వరకూ చేసుకోలేదు. అలాంటి వాడు ఇలా చెబుతాడేంటి? ఏమైంది వీడికి? అంత అందంగా ఉంటుందా మేరీ? ఆలోచిస్తుండగా శేఖర్ నుంచి ఫోన్ వచ్చింది.

“నోర్మూసుకోరా. ఏం మాట్లాడుతున్నావు? నాకూ మేరీ కి సంబంధం ఏంట్రా వెధవ? అదంతా నేనెప్పుడు చెప్పానసలు? 

“నువ్వే కదరా మేరీ నుంచి మిస్డ్ కాల్స్ ఉండటం మీ ఆవిడ చూసి ఫోన్ నీ మీదకు విసిరిందని చెప్పింది?”

“రేయ్ వెధవ. మా ఆవిడకు కోపం వచ్చింది మేరీ కాల్స్ చూసి కాదురా.. నేనెలాంటి వాడినో తనకు బాగా తెలుసు..”

“మరి ఇంకేంటి సమస్య?” ఆశ్చర్యంగా అడిగాడు అజయ్.

“మా ఆవిడ కులకమని చెప్పింది మేరీ తో కాదురా. నా ఫోన్ తో..”

“ఫోన్ తో నా?? అదేంటి?” ఇంకాస్త ఎక్కువ ఆశ్చర్యపోయాడు అజయ్.

“అవున్రా.. నా సంగతి నీకు తెలుసు కదా. మొదటి నుంచీ టైం వేస్ట్ చేసే ఏ విషయం నాకు పడదు. అందుకే అంతకు ముందు దాకా స్మార్ట్ ఫోన్ కూడా కొనలేదు. ఈ ఫేస్ బుక్, వాట్స్ అప్ మొదలైనవి మన టైం ని అడ్డంగా తినేస్తాయనీ, వీటికి దూరంగా ఉండాలని ఎప్పుడూ నీతో కూడా అనేవాడ్ని. మేరీ మా ఆఫీసులో చేరాక, ఓ రోజు  సాయంత్రం ఇద్దరం ఆఫీసులో ఇరుక్కుపోయాం. బయటంతా పెద్ద వర్షం అప్పుడు. చుట్టుపక్కలంతా ట్రాఫిక్ నిలిచిపోవటంతో, ఆఫీసులోనే ఓ గంట సేపు గడపాల్సి వచ్చింది. ఆ టైం లో నా పాత చింతకాయ ఫోన్ మార్చి స్మార్ట్ ఫోన్ కొనుక్కోమని రకరకాలుగా చెప్పి నన్ను కన్విన్స్ చేసిపారేసింది. అంతే కాదు, ఆ మర్నాడే ఓ దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్ నా చేత కొనిపించి, ఫేస్ బుక్, వాట్స్ అప్, ట్విట్టర్ ఇలా అన్నింటిలో అకౌంట్స్ ఓపెన్ అయ్యేలా చేసింది. వీటికి తోడు, ఫోన్లో న్యూస్ పేపర్ దగ్గరనుంచీ, స్టాక్ మార్కెట్, ఆన్లైన్ షాపింగ్, యూట్యూబ్ లాంటివి ఎన్నో నన్ను శనిలా తగులుకొని నన్ను ఫోన్ కి కట్టు బానిసగా మర్చేసినయ్.. ఎంత సేపూ నేను ఫోన్లోనే ఉంటాననీ, ఇంటి పని కూడా పట్టించుకోవట్లేదని శాంతకు మహా కోపం..”

“ఓహో అదా సంగతి.. ఇప్పుడు బాగా అర్ధమైంది.. నేనింకా ఎన్నో ఊహించుకున్నాను అనవసరంగా..” చెప్పాడు అజయ్ తేలిగ్గా.

“ఏంట్రా అంత తేలిగ్గా తీసిపారేస్తావ్.. ఈ వెధవ ఫోన్ చేసిన చేటు మామూలుది కాదురా. శృతి మించిన ఫోన్ వాడకం వల్ల ఇంట్లో వాళ్ళతో, బంధువులతో సంబంధాలు చెడినయి, బద్ధకం పెరిగి పని మీద శ్రద్ధ తగ్గింది, ఆరోగ్యం కూడా పాడైంది, వ్యాయామం, ఈవినింగ్ వాక్ లాంటివి పూర్తిగా అటకెక్కినయ్. ఇంత దాకా అయింది చాలురా, ఈ స్మార్ట్ ఫోన్ ఇంక నాకొద్దు. లక్కీగా మేరీ కూడా ఆఫీసు మానేసింది. అవసరానికి మించిన ఫోన్ వాడకం కుటుంబ సభ్యులకు మనం చేసే ద్రోహం.. ఇక మీదట ఈ ద్రోహం నేను చేయలేను.. నా పాత ఫోన్ లోకి మారిపోతాను ఈ క్షణం నుంచే.. మనిషి ఫోన్ ని అవసరానికి వాడుకోవాలి కానీ, ఫోనే మనిషిని ఎడాపెడా వాడేస్తే కష్టం రా.. సాయంత్రం ఇంటికి వచ్చి మనం మాట్లాడుకున్న విషయం నువ్వే శాంతకు చెప్పి కన్విన్స్ చెయ్యి.. నా మీద యమ కోపంగా ఉంది అసలే..”

“అలాగే రా, మంచి డెసిషన్ తీసుకున్నావ్.. ఆల్ ది బెస్ట్.. మన ఫ్రెండ్స్ వాట్స్ అప్ గ్రూప్ లో నువ్వుండవ్ అయితే..” కాస్త నిరుత్సాహంగా అన్నాడు అజయ్.

“పర్లేదు లేరా. దిక్కుమాలిన గుడ్ మార్నింగ్లు, ఎందుకూ పనికిరాని ఫోటోలు, వీడియోల కన్నా మన:శాంతి నాకు చాలా ముఖ్యం..” తేలిక పడ్డ మనసుతో చెప్పి ఫోన్ పెట్టేసాడు శేఖర్.

మరిన్ని కథలు