Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrydayam

వెండితెర మీద హెవీ మ్యూజిక్ తో తెలుగులోను, ఇంగ్లీషులోను టైటిల్ గా చూడడం కాక, రియల్ గా చూసిన, నేర్చుకొన్న, నన్నాకట్టుకొన్న మొట్టమొదటి నిర్మాత శ్రీ బి. వెంకట్రామిరెడ్డిగారు. ముద్దుగా అందరూ బాజ్జీ గారు అంటారు. సుప్రసిద్ధ విజయ - వాహినీ స్టూడియోస్ అధినేత శ్రీ బి. నాగిరెడ్డి గారి అబ్బాయి - చాలా ఏళ్ల తర్వాత కలర్ యుగంలో, సినిమాస్కోపు, డీటీఎస్ కాలంలో మళ్ళీ విజయావారి జెండాని అవే విలువలతో ఎగరేద్దామని చందమామ విజయా కంబైన్స్ గా ఆ బ్యానరుకి పేరు పెట్టి తన సతీమణి భారతి గారితో కలిసి చిత్ర నిర్మాణం ప్రారంభించారు బాజ్జీగారు.

మొదటి సినిమా తెలుగులో 'బృందావనం'. రాజేంద్రప్రసాద్ గారు, రమ్యకృష్ణ గారు. దర్శకులు శ్రీ సింగీతం గారు. రచన, నిర్మాణ సంచాలకులు శ్రీ రావికొండలరావు గారు. వీరి ద్వారానే నేను అప్రెంటిస్ గా షూటింగు చూడ్డానికి ఆ సంస్థలో ఎంటరయ్యాను. తర్వాత సినిమా 'భైరవద్వీపం' కి అసిస్టెంట్ డైరెక్టరు గా ఎపాయింట్ అయ్యాను. మధ్యలో రజనీకాంత్ హీరోగా తమిళంలో పి. వాసుగారి దర్శకత్వంలో 'ఉళైప్పాలి', తర్వాత తెలుగులో శ్రీ సింగీతం గారి దర్శకత్వంలో 'శ్రీ కృష్ణార్జున విజయం', తమిళంలో సేతు మాధవన్ గారి దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 'నమ్మవర్', మనోబాల దర్శకత్వంలో తమిళంలో 'కరుప్పు - వెల్లై', పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో టీవీ సీరియల్ బేతాళ కథలు, శ్రీ సాంబశివరావు గారి దర్శకత్వంలో టీవీ సీరియల్ 'పరోపకారి పాపన్న' - ఇవికాక నమ్మవర్, ఉళైప్పాళి చిత్రాల్ తెలుగు డబ్బింగ్, భైరవ ద్వీపం చిత్రం తమిళ, హిందీ డబ్బింగులు, బృందావనం చిత్రం తమిళ డబ్బింగు - ఇత్యాదివి అన్నీ కలిపి 1992 మే 18 నుంచి 1996 అక్టోబర్ వరకూ నన్ను చెన్నై లో ఉండనిచ్చాయి. అన్నం పెట్టాయి. మంచి దర్శకుడు అవ్వడానికి కావలసిన పునాదిని బలంగా ఇచ్చాయి. 250 రూపాయల నెల జీతం నుంచి పన్నెండు వేల చిల్లర నెలకి సంపాదించేలా డబ్బుని కూడా ఇచ్చాయ్.

సంపన్న కుటుంబాల్లో పుట్టిన పిల్లలు కొంచెం పొగరుగా, ఎదుటిమనిషికి విలువనివ్వకుండా ఉంటారని అప్పటిదాకా చాలా పుస్తకాల్లో చదివాను, సినిమాల్లో చూశాను. కానీ అందుకు పోఎథి విరుద్ధంగా, చాలా సౌమ్యంగా, చిన్న, పెద్ద అందరితో వినయంగా, విద్యాధికులైనా విద్యార్ధిలా బాజ్జీగారిని చూశాను. జీవితంలో మనం చదివినవి, విన్నవి, సినిమాల్లో చూసినవి అన్నీ నిజ జీవితంలో భిన్నమైనవని నాకర్ధమైంది. ఒక పెద్ద నిర్మాత కొడుకుకి సాధారణంగా దర్శకుడు, హీరో, హీరోయిన్, మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణలందరూ తమవల్లే పైకొచ్చారని అహంకారం ఉన్నా తప్పులేదు. అందరి సమిష్టి కృషి వల్లే మేమంత పైకొచ్చాం అని వినయం ఉంటే... అదే బాజ్జీగారు. రాజేంద్రప్రసాద్, బాలకృష్ణ, రజనీకాంత్, కమలహాసన్ లాంటి కమర్షియల్ స్టార్స్ డేట్స్ దొరకంగానే ఒక మామూలు నిర్మాతే నేలమీద నడవడు ఈ రోజుల్లో... 50లు, 60లలో విజయావారి చిత్రాల నిర్మాణ పద్ధతుల్ని 90లలో పాటించలేదు ఆయన. 90లలో పద్ధతులతోనే సినిమాలు నిర్మించారు. ఇప్పుడు కూడా మళ్లీ తమిళంలో నిర్మిస్తున్నారు. కానీ, తెరమీద విలువలు, కుటుంబ సమేతంగా చూడగలిగిన క్లీన్లీనెస్, అందంగా నవ్వుకోగలిగిన సున్నిత హాస్యంలాంటి కంటెంట్ మాత్రం 60లలో విజయావారి చిత్రాలలో ఉన్నట్టే ఇప్పటికీ ఉండేట్టు చూసుకున్నారు. చూసుకుంటున్నారు. అసిస్టెంట్ డైరెక్టరుగా నిర్మాణ సంస్థ తరపున చేరాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ చనువు వారితో. బాలకృష్ణ గారు ఆయన్ని బంగారంలా చూసినప్పుడు, రజనీకాంత్ ఆయనతో స్నేహంగా మెలిగినప్పుడు, కమల్ హాసన్ ఆయన మీద కోపంతో కాల్చుకుతిన్నప్పుడూ ఎప్పుడూ ఆయన ఎవ్వరి గురించి వెటకారంగాగాని, నెగిటివ్ గాగాని, నిష్టూరంగా గాని, అతి సంబరంగా గాని, అతి నీరసంగా గాని మాట్లాడటం నేను చూడలేదు. అనుకున్నట్టుగా షూటింగ్ అయిపోయినా, వాట్ నెక్స్ట్? అనుకోకుండా షూటింగ్ ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చి భారీగా నష్టం వాటిల్లినా, ఓకే, వాట్ నెక్స్ట్? రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులని పిలిపించి, ఒక్క షాట్ కూడా తియ్యకుండానే, వెండి గిన్నె డిజైన్ బాలేదని కమల్ హాసన్ గారు ప్యాకప్ చెప్పినప్పుడు, కనీసం మాలాంటి ప్రొడక్షన్ తరపు వ్యక్తుల దగ్గర కూడా వీసమెత్తు అసహనంగాని, చిరాకుగాని, కోపంగాని ప్రదర్శించని నిండుకుండ బాజ్జీగారు. స్టూడియో కాంపౌండ్ లోనే ఇల్లు, ఆఫీసు, అన్నీ ఉన్నా కూడా ఉదయాన్నే ఆరింటికి వాకింగ్ లో వచ్చి, ఇంటికెళ్ళి రెడీ అయ్యి మళ్లీ ఎనిమిదింటి నుంచి రాత్రిదాకా ఆఫీసులో పనులు మానిటర్ చేస్తుండేవారాయన.

ఓ రోజు ఆల్ ఇండియా రేడియో, చెన్నై లో 'అవగాహన' అనే నా నాటకం బ్రాడ్ కాస్ట్ అవుతోంది - అది ఆఫీసులో డైనింగ్ హాల్లో మేము వింటుంటే, ఎప్పుడొచ్చారో బాజ్జీగారు వాకింగ్ డ్రెస్ లో వచ్చి కామ్ గా నా వెనకే నుంచున్నారు. నాటకం అయిపోయాక చూసి షాకయ్యాను నేను. తర్వాత రావికొండలరావు గారికి స్క్రిప్టులో కూడా అసిస్టెంటు గా ఉండమని నన్ను పురమాయించారు. ఆ నిర్ణయం నా సహాయ దర్శకత్వ కెరీర్ ని మలుపు తిప్పింది. ఎంత పెద్ద నిర్మాతైనా కూడా నిరాడంబరంగా ఉండడం, కష్టాల్లో కూడా చిరునవ్వు చెరగనీయకపోవడం బాజ్జీగారి దగ్గర నేర్చుకోవాలి.

'ఉళైప్పాళి' సినిమా తెలుగులో 'ఘరానా కూలి' గా డబ్బింగ్ చేసినపుడు మాస్ట్రో ఇళయరాజా రెండు లక్షలు అదనంగా ఇస్తేకానీ రీరికార్డింగ్ ట్రాక్స్ ఇవ్వనని పేచీ పెట్టారు. ఆ సమయంలో వేరెవరైనా అయితే రజనీకాంత్ తోనో, షూటింగ్ లో రోజూ కలుస్తున్న కమల్ హాసన్ తోనో రికమెండ్ చేయించుకునేవాళ్ళు. బాజ్జీగారు ఎవరిసాయం తీస్కోలేదు. నేనీ సినిమా అమ్మలేదు. సొంతంగా రిలీజు చేస్తున్నానని చెప్పండి రాజాగారికి. అయినా ఒప్పుకోకపోతే రెండు లక్షలూ ఇచ్చేయండి - అదాయన బ్రైన్ చైల్డ్. దాన్ని వీలైనంత కమర్షియల్ గా వాడుకునే రైట్ ఆయనకుంది - అని చెప్పారు ప్రొడక్షన్ మేనేజర్ తో.

సినిమా ఆడడం, ఆడకపోవడంతో సంబంధం లేకుండా సినిమా రిలీజయ్యాక కూడా బ్యాలన్స్ పేమెంట్స్ క్లియర్ చేసే కల్చర్ మొదట బాజ్జీగారి దగ్గర చూశాను.

ప్రొడ్యూసర్ ఎంత డబ్బిచ్చినా, ఆ డబ్బు ఖర్చు అయిపోగానే మర్చిపోతారమ్మా... అదే మంచిగా మాట్లాడుతూ, మంచి భోజనం పెట్టి, మర్యాదగా చూస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు - అని చెప్పేవారాయన. చాలా నిజం. ఇప్పటికీ ఆ బ్యానర్ లో నేను పనిచేసిన రోజుల్ని సుమారు 15 సంవత్సరాల తర్వాత నిన్నో మొన్నో జరిగినట్టు గుర్తుంచుకున్నానంటే ఆయన మా అందరి పట్ల చూపిన అభిమానం, మర్యాద, ఆయన ప్రవర్తనే కారణం. నిర్మాతగా అత్యుత్తమ సంప్రదాయాలు నెలకొల్పిన సంస్థ నుంచి సినిమాల్లోకి అరంగ్రేటం చేయడం నా అదృష్టం. ఈ తరంలో ఏ సహాయ దర్శకుడికీ లభించని అరుదైన అవకాశం ఒక సోషల్, ఒక మైథలాజికల్, ఒక ఫోక్ లోర్ (జానపద) భారీ చిత్రాలకి వరుసగా పనిచేయడం మరో అదృష్టం ఆ సంస్థలో పనిచేయడం వల్లే కుదిరింది. కొంత విరామం తర్వాత తమిళంలో ఈ మధ్యే మళ్ళీ సినిమాలు తీస్తున్నారు బాజ్జీగారు. ఈసారి ఆయన సంస్థకి విరామం ఉండకూడదని, ఆ సంస్థ మంచి చిత్రాలకి దివ్యారామంగానే ఎప్పుడూ వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను,

అక్కడుండగానే, దొరై అనే అంబాసిడర్ కారు డ్రైవరు హైదరాబాద్ వెళ్ళాక మీరు దర్శకుడు అయ్యేవరకు రామానాయుడి దగ్గర మాత్రమే పని చెయ్యండి, వేరెక్కడా చెయ్యద్దు. ఆయనే మిమ్మల్ని డైరెక్టర్ ని చేస్తారు - నా మాట మర్చిపోవద్దు అని శ్రీ కృష్ణార్జున విజయం షూటింగప్పుడు రోజుకి పదిసార్లు చెప్పేవాడు. చాలా సీనియర్ డ్రైవరు - నా మంచి గురించే చెప్పుంటాడు అని నేను బ్లైండ్ గా ఫాలో అయిపోయాను. కమల్ హాసన్ పిలిచి, శంకర్ దగ్గర 'భారతీయుడు' సినిమాకి పనిచేయమని అడిగినా వద్దనుకుని హైదరాబాద్ వచ్చేశాను.

అలా, నా మొదటి నిర్'మాత' బాజ్జీగారైతే, రెండో నిర్'మాత' డాక్టర్ డి. రామానాయుడు గారు అయ్యారు. వారి గురించి వచ్చేవారం...
మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
alaa ee cinemalu teesaru