Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి..http://www.gotelugu.com/issue314/808/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

(గత సంచిక తరువాయి).....పాకిస్ధాన్ కు చెందిన ఏయిర్ లైన్స్ విమానం న్యూఢిల్లీ ఏయిర్ పోర్ట్ లో ఆగింది. అది స్పెషల్ విమానం. అందులో జహీర్ అబ్బాస్ మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు. అతను ఒక చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ గా ఇండియాకు వస్తున్నాడు. అతనితో మరో ఇద్దరు ఏజంట్లు మాత్రం ఉన్నారు. అతన్ని ఏయిర్ పోర్ట్ లో ఇండియన్ చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ రిసివ్ చేసుకున్నాడు.   అబ్బాస్ ను చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఇంత చిన్న వయస్సులో చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ కావటం మాములు విషయం కాదు. దానికి ఎంతో తెలివితేటలు అనుభవం ఉండాలి. కాని అబ్బాస్ కు అంత అనుభవం ఉన్నట్టుగా కనిపించటంలేదు. పాతిక సంవత్సరాలు కంటే ఎక్కువ ఉండవు. ఆ వయస్సులో చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ కావటం చాల కష్టం. ఆ మనిషి ఎంతో తెలివైనవాడు కార్యదక్షుడు అయితే తప్ప.
    “వెల్ కం టూ ఇండియా”చేతిని ముందుకు చాస్తూ అన్నాడు ఇండియన్ చీఫ్ సెక్యురిటి ఆఫీసర్.

“ద్యాంక్యు”అన్నాడు అబ్బాస్. తరువాత అబ్బాస్ తన చేతిలో ఉన్న కవరును అతనికి ఇచ్చాడు. ఇండియన్ సెక్యురిటి ఆఫీసర్ దాన్ని తీసి చదివాడు. అందులో పాకిస్ధాన్ ప్రభుత్వం అబ్బాస్ ను చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ గా నియమిస్తున్నట్టుగా ఆర్డర్స్ ఉన్నాయి. దాన్ని పూర్తిగా చదివి తిరిగి అబ్బాస్ కు ఇచ్చేశాడు ఇండియన్ చీఫ్ సెక్యురిటి ఆఫీసర్.

మాములు ఫార్మాలిటిస్ పూర్తయిన తరువాత ఇద్దరు కారులో బయలుదేరారు. సెక్యురిటి కారు వేగంగా ఢిల్లీ రోడ్డు మీద దూసుకుపోతుంది.    “మిస్టర్ మా ప్రభుత్వం సమావేశాన్ని రెండు చోట్ల ఏర్పాటు చెయ్యటానికి నిర్ణయించింది. రెండు చోట్ల ఒకే రకమైన సెక్యురిటిని ఏర్పాటుచేశాం. కాని సమావేశం ఎక్కడ ఏర్పాటుచేస్తామో ఇంకా నిర్ణయించలేదు. ఆ విషయం నిర్ణయించిన తరువాత మీ ప్రభుత్వానికి తెలియచేస్తాం. మనం రెండు చోట్లకు వెళదాం. మేము ఏర్పాటుచేసిన సెక్యురిటి ఏర్పాట్లు చూడండి. మీకు ఏదైన అనుమానాలు ఉంటే చెప్పండి. సరిచేసుకుంటాం”అన్నాడు ఇండియన్ చీఫ్ సెక్యురిటి ఆఫీసర్.

అలాగే అని తలూపాడు అబ్బాస్.అతనికి ఈ ప్రయాణం కొత్త. భారత్ గురించి విన్నాడు కాని ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఇప్పుడు మొదటి సారిగా వచ్చాడు. అది ఒక చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ హోదాలో. ఎంతో ధ్రిల్లింగ్ గా ఫీలవుతున్నాడు. కారు రెండు గంటలు ప్రయాణం చేసిన తరువాత  నేషనల్ హైవే మీద పరుగులు తీసింది. ఇంకో అరగంట ప్రయాణం చేసిన తరువాత ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది.

అది భారత్ ఇటివలే కొత్తగా సమావేశాలకు కట్టిన బిల్డంగ్. అందులో అధునాతనమైన సెక్యురిటి ఏర్పాట్లు ఉన్నాయి. బిల్డింగ్ పైన రెండు వాచ్ టవర్స్ ఉన్నాయి. లోపల ప్రతి అడుగుకు ఒక సీసీ కెమెరా ఉంది.  తలుపులు అన్ని రిమోట్ కంట్రోల్ తో నడుస్తాయి. మెయిన్ గేటు దగ్గర  గోడ చుట్టు ఇరవై నాలుగుగంటలు కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. ఎవరైన అపరిచితులు వస్తే కరెంట్ షాక్ తగిలి చనిపోతారు. అంతే కాకుండ రోడ్డుమీద కూడా చాల సీసీ కెమారాలు ఉన్నాయి.  ఒక్కమాటలో చెప్పాలంటే అధికారుల అనుమతి లేకుండ చిన్న చీమ కూడా లోపలికి రావటానికి వీలులేదు.

కారు చప్పుడు వినగానే మెయిన్ గేటు తెరుచుకుంది. అందరు లోపలికి వెళ్ళారు. ఇండియన్ చీఫ్ సెక్యురిటి అఫీసర్ దగ్గర ఉండి అబ్బాస్ కు అన్నిచూపించాడు. ఏ వస్తువు ఎలా పనిచేస్తుందో వివరంగా వివరించాడు. ప్రతి గాడ్జెట్ ను క్షుణ్ణంగా పరీశీలించాడు అబ్బాస్. బిల్డింగ్ అంతా చూసి రావటానికి అబ్బాస్ కు దాదాపు రెండు గంటలు పట్టింది.

అన్ని సంతృప్తికరంగానే ఉన్నాయి. సెక్యురిటి విషయంలో భారత ప్రభుత్వం చాల శ్రద్ధ తీసుకుంది. అందులో సందేహం లేదు. ఇక్కడ సమావేశం ఏర్పాటుచేస్తే ఎటువంటి సమస్య రాదు. ఒక వేళ వచ్చిన తేలికగా టాకిల్ చెయ్యవచ్చు.

“రండి మరో చోటుకు వెళదాం”అన్నాడు ఇండియన్ చీఫ్ సెక్యురిటి ఆఫీసర్.    ఆ మరోచోటు ఢిల్లీ నగరంలో లేదు. సిమ్లాలో ఉంది. గంట తరువాత అబ్బాస్ తన సహచరులతో సిమ్లా వెళ్ళుతున్న విమానంలో ఉన్నాడు. అక్కడ కూడా భారత్ ఇలాంటి భవనం ఇంకోకటి నిర్మించింది. అందులో కూడా సెక్యురిటి సిస్టమ్స్ దాదాపు ఇలాగే ఉంటుంది. రెండు గంటల తరువాత సిమ్లా చేరుకున్నారు. ఆ బిల్డింగ్ ను కూడా పూర్తిగా చెక్ చేశాడు అబ్బాస్. అతనికి అంతా తృప్తి గానే ఉంది.

ఈ తతంగం అంతా ముగిసిన తరువాత అందరు మళ్ళి ఢిల్లీ చేరుకున్నారు. అబ్బాస్ కు ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ ఏర్పాటుచేశారు.  అతనికి ప్రత్యేకంగా ఒక గది, అతని ఇద్దరు సహచరులకు కలిపి ఒక గది ఏర్పాటు చేశారు. తరువాత ఇండియన్ సెక్యురిటి టీమ్ వెళ్ళిపోయింది. జహీర్ అబ్బాస్ రిఫ్రెష్ అయి టేబుల్ ముందు కూర్చున్నాడు. ఒక ఫైలులో తన రిపోర్ట్ రాశాడు. చివరగా రిపోర్ట్ కింద తన సంతకం చేశాడు.

తరువాత అలసటతో మంచంమీద వాలిపోయాడు. అప్రయత్నంగా అతనికి మిత్రవింద గుర్తుకువచ్చింది. ఆమె గుర్తుకురావటంతో తన ప్రోగ్రాం కూడా గుర్తుకువచ్చింది. శనివారం రాత్రి పన్నెండు గంటలలోగా మిత్రవిందను కాల్ చెయ్యమని మరిమరి చెప్పాడు. ఈ లోగా ఆమె కాల్ చెయ్యకపోతే అబ్బాస్ ప్రోగ్రాం మారిపోతుంది. అతను తిన్నగా ఇస్లామాబాద్ వెళ్ళడు. శ్రీనగర్ వెళతాడు. అక్కడ నుంచి టాక్సిలో బారముల్లా వెళ్ళి మిత్రవింద ఇంటికి వెళతాడు. ఆమె తండ్రిని కలుసుకుని పెళ్ళి విషయం మాట్లాడతాడు. ఇది అతని ప్రోగ్రాం.

భోజనం చేసిన తరువాత టాక్సిలో  బయలుదేరాడు. సిటి అంతా కొంచం సేపుచూశాడు. తరువాత జేబులోంచి ఒక చిన్న కాగితం తీశాడు. అందులో అతను కొనవలసిన లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రకారం ఆ వస్తువులన్ని కొన్నాడు. వాటిని జాగ్రర్తగా ప్యాక్ చేసి తిరిగి హోటల్ రూమ్ కు చేరుకున్నాడు.

ఆ తరువాత మంచంమీద పడుకున్నాడు. పడుకున్నాడు కాని నిద్రపోలేదు అబ్బాస్. మిత్రవింత కాల్ కోసం కాచుకున్నాడు. పన్నెండు దాటింది ఒంటి గంట దాటింది. కాని మిత్రవింద నుంచి కాల్ రాలేదు. అంటే ఆమె తమ విషయం చక్రపాణికి చెప్పలేదని అతనికి అర్ధమైంది.

అబ్బాస్ , మిత్రవింద ఇంటికెళ్ళి తమ ప్రేమ విషయం, పెళ్ళివిషయం మాట్లాడుతాడా.. తెలుసుకోవాలంటే.. వచ్చేశుక్రవారం  వరకు ఎదురుచూడాల్సిందే...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani