Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prema enta madhram

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue314/807/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి).... సుమారు ఇరవై ఎకరాల్లో రూపు దిద్దుకుంటున్న ఆశ్రమం అది. పేరు ‘జగజ్జనని ఆశ్రమం’.
అమ్మలగన్న అమ్మ పర్యాయపదం జగజ్జనని. అంటే తల్లులకే తల్లి అని. ఆవిడకు తప్ప అందర్నీ చల్లగా కాచుకునే శక్తి ఇంకెవరికుంటుంది? హేమకు ఆ పేరులో కాత్యాయని పేరు అంతర్లీనంగా గోచరించింది.

గేటు దగ్గర సెక్యూరిటీ గది ఉంది. హేమ తనను తను సెక్యూరిటీ అతనికి పరిచయం చేసుకుని తనూ కాత్యాయని ఆశ్రమం చూద్దామని వచ్చామని చెప్పంగానే, అతను కాత్యాయనివైపు వేగంగా కదిలి ’అమ్మగారూ నా పేరు భీం ..మీరెప్పుడైనా ఆశ్రమాన్ని చూడడానికి వస్తారని దగ్గరుండి జాగ్రత్తగా మీకు చూపించమని మనోహర్ అయ్యగారు చెప్పారండి’అని భయభక్తులతో చెప్పి, గేటుకు తాళం వేసి లోపలి నుంచి గొడుగు తెచ్చి ఆమె కి పట్టాడు.

అదంతా చూసిన హేమకు ఆశ్చర్యం కలిగింది. కేవలం మనోహర్ నాలుగు మాటల్లో కాత్యాయని గురించి భీంకి చెబితే వచ్చే గౌరవభావం కాదు అది. మన మధ్య కదిలే ఒక దేవత గురించి శ్రద్ధా భక్తులతో చెబితే కలిగే అత్యున్నత భావన అది.

కాత్యాయని తనకు గొడుగు వద్దని సున్నితంగా దాన్ని మూయించేసింది. లోపలికి వెళ్లాక భీం అక్కడి వాళ్లకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడోగాని, ఆమె వెళ్లే సరికి పల్లెంలో పసుపు, కుంకం, పూలు, అగరొత్తులు, హారతీ తీసుకుని సిద్ధంగా ఉన్నారు పిల్లల నిరాదరణకు గురైన వృద్ధ పుణిస్త్రీలు. కాత్యాయనికి, హేమకు బొట్టుపెట్టి కాళ్లకు పసుపు రాసి, హారతిచ్చి లోపలికి తీసుకెళ్లారు.

అనాధ వృద్ధులకు, వికలాంగులకు, అనాథ పిల్లలకు ఉన్న వివిధ విభాగాలను చూపించింది ఒకావిడ. అక్కడున్న అందరూ ‘అమ్మా, నాన్నా, అక్కా, అన్నా..’ అంటూ కుటుంబ సభ్యులుగా పిలుచుకోవడం గమనించింది హేమ. అందరూ కుటుంబసభ్యులుగా కలసి మెలసి ఉంటే ఆశ్రమం ఆనంద నిలయమే! పైగా ఎవరూ తాము అనాధలమన్న బాధావీచికలున్న ముఖాలతో కనిపించడం లేదు.

బయట పూలు పళ్ల మొక్కలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటున్న ఆనవాలు కనిపించాయి. తన దగ్గరున్న కెమెరాతో ఆ ఆశ్రమాన్ని, విలువలతో నడుస్తున్న వైనాన్ని చెబుతూ, అక్కడివాళ్లని ఇంటర్వ్యూ చేసింది హేమ.సాయంత్రం దాకా అక్కడే గడిపి చీకటి పడే లోపల శివారు నుంచి సిటీకి చేరాలి కాబట్టి వాళ్లిద్దరూ బయల్దేరారు.

***

సోమయాజులుగారింటికి చేరాక ఇద్దరూ అక్కడి విషయాలన్నీ ఆయనకు విపులంగా చెప్పారు.

కాత్యాయని తన తండ్రికి ఫోన్ చేసి అన్నాళ్లుగా జరిగిన సంఘటనలన్నీ ఒక్కటొక్కటిగా ఆయనకు వివరించింది. తన కూతురు జీవితం ప్రశాంతతని పొందబోతున్నందుకు ఆయనకు కలిగిన ఆనందం అంతైంత కాదు. అప్రయత్నంగా దేవుళ్ల గది వైపుగా తిరిగి మసకబారిన కళ్లతో దణ్నం పెట్టుకున్నాడు. భార్యకు కూడ విషయాలు వివరించి చెప్పాడు. కూతుర్ని అప్పటికప్పుడు చూడాలన్న కాంక్ష బలంగా కలిగింది ఆవిడకి.

***

ఆశ్రమం గురించిన ప్రత్యేక కథనం టెలికాస్ట్ అయింది.

అందరూ విపరీతంగా స్పందించారు. విరాళాలందించారు.

‘మీడియా తల్చుకుంటే సాధించలేనిది ఉండదమ్మా. నేను చిన్న దీపాన్ని వెలిగిద్దామనుకున్నాను. నువ్వు అఖండ దీపం చేశావు’ అన్నాడు మనోహర్.

***

ఆరోజు కాత్యాయని సోమయాజులుగారింటి నుంచి ఆశ్రమానికి తరలి వెల్లిపోయే రోజు-

కాత్యాయని ఆశ్రమానికి వెళ్ళాక ఎటువంటి పర్స్థ్తులు ఎదురవుతాయో తెలుసుకోవాలంటే..  వచ్చే శుక్రవారం దాకా ఎదురుచూడాల్సిందే.. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్