Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
marpu rani maro nirbhaya

ఈ సంచికలో >> కథలు >> దేవుడు తీర్చిన కోరిక

devudu teerchina korika

“ఈ మధ్య తరగతి జీవితం ఏ పనికిమాలిన వాడు కనిపెట్టాడోగానీ, కనిపిస్తే కుళ్ళబొడవాలి..” కసిగా, అలవాటుగా అనుకున్నాడు సత్యమూర్తి విసుగ్గా ఫోను పెట్టేస్తూ. పదిహేనేళ్ళ పుత్రరత్నం రవి చదివే స్కూలునుంచి ఫోను, ఫీజు అర్జెంటుగా కట్టమని. వాడు ఎంతో కష్టపడి తెచ్చుకునే అత్తెసరు మార్కులకు యాభై వేలు కట్టాలంటే మనస్సు, పర్సు రెండూ ఒప్పడం లేదు. ఏంటీ వెధవ జీవితం.. ఎప్పుడూ ఏదో సమస్య.. విసుగ్గా ఆలోచనలో పడ్డాడు.

అప్పు పుట్టడం కూడా కష్టమైపోయింది ఈ మధ్య. అదేదో బ్యాంకులో నోటికొచ్చిన అబద్ధం ఆడి తీసుకన్న పర్సనల్ లోన్ సరిగ్గా కట్టడంలేదని బ్యాంకు వాళ్ళు ఆల్రెడీ వేధిస్తున్నారు. ఎగ్గొట్టడానికే   అప్పు చేసే జాతి రత్నాలకి నీరాజనాలు పడుతూ వేల కోట్లు కుమ్మరిస్తారు.. తీర్చడం తప్ప ఎలా ఎగ్గొట్టాలో కూడా తెలియని తన లాంటి వాడ్ని మాత్రం వేధించి చంపుతారు. ఎప్పటికి ఈ బ్యాంకులన్నీ బాగుపడతాయో?    
సత్యమూర్తి ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. చాలని జీతం, ఎలా తీర్చాలో తెలియని చిల్లర అప్పులు, తృప్తి లేని ఉద్యోగం, భార్యతో నిత్యం జరిగే గొడవలు, జులాయిగా తిరిగే కొడుకు. ఓ మధ్య తరగతి మనిషికి సాధారణంగా ఉండే కష్టాలు ఏ మాత్రం డిస్కౌంట్ లేకుండా ఉన్నాయి సత్యమూర్తికి.

మనస్సంతా చిరాకుగా ఉండటంతో చేస్తున్న పని పక్కనబెట్టి ఆఫీసులో కళ్ళు మూసుకొని కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఎలా ఈ జీవితం బాగు చేసుకోవటం? అసలు బాగు చేసుకోవటం అనేది అయ్యే పనేనా? ఏం తప్పు చేసాడని తనకిన్ని కష్టాలు? అందరి పరిస్థితీ ఇదేనా లేక తనకొక్కడికే దేవుడు ఇలాంటి బంపర్ ఆఫర్ ఏమైనా ఇచ్చాడా?           

“ఎంటండీ మూర్తి గారు. బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకుఒటున్నారా?” అప్పుడే అక్కడకు వచ్చిన బాసు అడిగాడు వెటకారంగా.

“లేదు సర్. కాస్త తలనొప్పిగా ఉంటే..” తత్తరపడుతూ జవాబిచ్చాడు.

“ఆ ఆడిట్ పని త్వరగా కానివ్వండి.. ఆడిటర్ గొడవ చేస్తున్నాడు మీరు సరిగ్గా డేటా ఇవ్వడంలేదని..” కాస్త విసుగ్గా చెప్పి వెళ్ళాడు బాసు.

“ఈ బాసుగాడే ఓ వెధవంటే, ఆ ఆడిటర్ వీడికి మించిన వాడు. అన్నీ నేనే చేసిస్తే ఇక వాడు చేసేదేంటి, చెత్త వెధవ..” కసిగా అనుకొని విసుగ్గా పని మొదలుపెట్టాడు సత్యమూర్తి. రోజంతా పని ఒత్తిడితో బిజీగా గడిచిపోయింది. మధ్య మధ్యలో చిరాకు పెట్టే ఆలోచనలు వేధిస్తూనే ఉన్నాయి.  

“మన:శాంతిగా రిలాక్స్ అయి ఎన్నాళ్లైందో కూడా సరిగ్గా గుర్తులేదు. వెధవ జీవితం..”  ఆఫీసు అయ్యాక సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ అనుకున్నాడు. గత కొన్ని రోజులుగా పని ఒత్తిడి ఎక్కువై సరైన నిద్రలేక తల నొప్పిగా ఉంది.

ఇల్లంతా చిందరవందరగా ఉంది ఎప్పటిలాగే. సోఫా నిండా గుడ్డలు, పుస్తకాలు, ఫోన్ చార్జర్ వగైరాలు. కుర్చీల మీద స్టీలు, ప్లాస్టిక్ సామాన్లు, గట్టిగా మోగుతున్న టీవీ సౌండు, ఆ రోజు ఇంట్లో ఏఒ వండారో ఎవరైనా ఇట్టే చెప్పేలా నట్టింట్లో తరిగేసిన కూరగాయల చెక్కు, ఉల్లిపాయ పొట్టు ఇంకా  పట్టకార.

“ఇల్లు కాస్త శుభ్రంగా ఉంచలేవూ? ఇలా అడవిలా ఉంచొద్దని నీకు లక్ష సార్లు చెప్పాను..” కోపంగా అన్నాడు భార్యతో.

“అవును మన అద్దె కొంప ఓ ఇంద్రభవనం, ఇంటి నిండా పని వాళ్ళు మరి శుభ్రంగా ఉంచడానికి..” కోపంగా, నిర్లక్ష్యంగా జవాబిచ్చింది భార్య శాంత, ‘భర్తే సర్వస్వం’ టీవీ సీరియల్ కన్నార్పకుండా చూస్తూ.

“...............” అన్నాడు సత్యమూర్తి.

“.........................................” జవాబిచ్చింది శాంత.

“...............”

“..................................    .......................................”

ఇలా కాసేపు కొట్టుకున్నాక, శాంతలో ఏమాత్రం శాంతంలేదని కాస్త ఆలస్యంగా గుర్తుకు వచ్చింది సత్యమూర్తికి. జవాబివ్వటం మానేసి, భార్యకు ‘శాంత’ అన్న అద్భుతమైన పేరు పెట్టిన అత్తమామలను తలచుకుంటూ కోపంగా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు.

“భగవంతుడా, ఏంటీ కుళ్ళిపోయిన, దిక్కుమాలిన జీవితం? ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావ్? ఇంకా ఎన్నాళ్ళు ఈ నరకం? నా బతుకు ఇక ఇంతేనా?” బట్టలు మార్చుకుంటూ అనుకున్నాడు దిగులుగా.

మంచం మీద వాలబోతూ పక్కనే బల్లమీద కనిపించిన లావాటి పుస్తకాన్ని చూసాడు. దేవుడి మీద ఎక్కడలేని కోపం వచ్చింది వెంటనే.
ప్రతీ సమస్యకూ ఈ పుస్తకంలో సమాధానం దొరుకుతుంది అంటూ తన స్నేహితుడు ఈ మధ్య బహుమతిగా ఇచ్చాడు. దేవుడి గురించిన పుస్తకం అది. మూడు వంతులు పైగా చదివేసాడు ఎంతో ఓపిగ్గా. పెద్దగా అర్థం కాలేదు. ఏ ఒక్క సమస్యకూ సమాధానఒ దొరకలేదు. పూర్తిగా చదివి అసలు ఏ ఉద్దేశంతో తనకా పుస్తకం ఇచ్చాడని స్నేహితుడ్ని నిలదీయాలనుకున్నాడు.

పుస్తకం అట్ట మీద ఉన్న దేవుడి బొమ్మ వైపు ఓ సారి చూసాడు. “నీకు నేనున్నాను.. ఏం పర్లేదు..” అన్నట్టుగా చిరునవ్వుతో చూస్తున్నాడు దేవుడు.

“నా లాంటి పరమ అమాయకుడికి ఇన్ని కడుపు మండే కష్టాలు పెట్టి ఏంటి దేవుడా నువ్వు సాధించింది?” కోపంగా, కసిగా అనుకుంటూ దిగులుగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు మంచం మీద.

“కళ్ళు తెరువు మూర్తి.. నీ కష్టాలు పోగొట్టడానికి వచ్చాను..” అని వినిపించి ఉలిక్కిపడి, కంగారుగా కళ్ళు తెరిచి చూసాడు. ఎదురుగా దేవుడు. ముమ్మూర్తిలా తను రోజూ దండం పెట్టుకునే ఫోటోలో ఉన్నట్టుగా! గదినిండా ఎన్నడూ చూడని ఓ వింత వెలుగు!

చప్పున లేచి కూర్చున్నాడు మంచం మీద. ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా, వెంటనే తేరుకొని తన కళ్ళని పూర్తిగా నమ్మాడు సత్యమూర్తి. తనకున్న కష్టాలు అలాంటివి మరి. దేవుడు తప్ప ఎవ్వరూ తీర్చలేరు. పైగా మూసి ఉన్న గదిలోకి ఇంకెవరైనా ఎలా వస్తారు?

“దేవుడా ఏమిటీ అన్యాయం? ఎందుకు నాకీ దిక్కుమాలిన కష్టాలు?” నేరుగా మేటర్ లోకి వచ్చాడు కాస్త ఉక్రోషంగా.

“మూర్తీ, నాకు రోజూ నువ్వు భక్తిగా దండం పెడుతున్నావు. ఎన్నో కష్టాల్లో ఉన్నానని అనుకుంటున్నావు. నేను తప్ప ఎవ్వరూ నీ కష్టాలు తిర్చలేరని నిజాయితీగా నమ్ముతున్నావు. అందుకే ఇలా వచ్చాను.. చెప్పు నీకు ఏ విధంగా సహాయం చేయమంటావ్?” శాంతంగా చిరునవ్వుతో అడిగాడు దేవుడు, తాను కూడా ఓ వైపు మంచం మీద కూర్చుంటూ.  

“కష్టాలు ఉన్నాయని అనుకోవటమేంటి స్వామీ? పిచ్చెక్కిపోతుంటే..” ఇలా అంటూనే తన కోరికలేంటో హడావిడిగా ఆలోచిస్తున్నాడు సత్యమూర్తి. తను ఎన్నో కధల్లో చదివినట్టు, దేవుడ్ని ఓ మూడు కోరికలు తీర్చమని అడగాలి. సఖ్యతగా, ప్రేమగా ఉండే భార్య, చక్కగా చదువుకొని జీవితంలో పైకి వచ్చే కొడుకు, చేతినిండా డబ్బు. ఈ మూడూ కోరుకుంటే సరి. అటో ఇటో తేలిపోతుంది. 

“ఏంటి మూర్తి ఆలోచిస్తున్నావు?” అడిగాడు దేవుడు పూర్తిగా ఆలోచనలో మునిగిపోయిన సత్యముర్తిని చూసి.

“ఏమీ లేదు స్వామీ. మీ దగ్గర డొంక తిరుగుడెందుకు.. ఎలాగూ ఇంత దూరం వచ్చారు. నా కష్టాలు తీరడానికి ఓ మూడు కోరికలు తీర్చండి..” అడిగాడు సూటిగా.

“తప్పకుండా మూర్తి. చెప్పానుగా నువ్వు నా భక్తుడివి. నీ కోరికలు తీర్చడం నాకు చాలా సంతోషం కలిగించే విషయం..”

“ధన్యుడ్ని స్వామీ..” సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ చెప్పాడు సత్యమూర్తి. కొంపదీసి ఇదంతా కల కాదు కదా? ఈ మధ్య ఇలాంటి కలలు రావడం ఓ ఫాషన్ అయిపోయింది. అనుమానంతో ఓ సారి భుజం గిల్లుకొని చూసుకున్నాడు.

“మూర్తీ, ఇదేమీ కల కాదులేవయ్యా.. నీ కోరికలు తక్షణం తీరుస్తాను. అయితే ఓ విషయం. నేను మనిషిని కాదు కాబట్టి, ఏ విధమైన అన్యాయాన్నీ చేయలేను. నీ కోరికలు న్యాయమైనవి అయి ఉండాలి.” చెప్పాడు దేవుడు.

తన మూడు కోరికలు గుర్తుకు తెచ్చుకున్నాడు సత్యమూర్తి. సఖ్యతగా ఉండే భార్య, చక్కగా చదువుకొని పైకి వచ్చే కొడుకు, చేతి నిండా డబ్బు. ఇవి అన్యాయమెలా అవుతాయి? మనిషన్నాక ఈ మాత్రం కూడా లేకపోతే ఎలా? ఇవి అన్యాయమైన కోరికలైతే ఇక న్యాయమైనవి అంటూ ఏమైనా ఉంటాయా అసలు? ఎందుకైనా మంచిదని చేతి నిండా డబ్బుండాలి అన్న మూడవ కోరికను కాస్త మార్చి, ఉద్యోగంలో పైకి రావాలి అని అడుగుదామనుకున్నాడు.

ఇలా అలోచించి “స్వామీ నా మూడు కోరికలు ఎంతో న్యాయమైనవి. కోరమఒటారా?” అడిగాడు ఉత్సాహంగా.

“ఓ..” జవాబిచ్చాడు దేవుడు కూడా అంతే ఉత్సాహంగా.

“మొదటి కోరిక.. నా భార్య శాంత పేరుకు తగ్గట్టుగా శాంతంగా, సఖ్యతగా, ప్రేమగా ఉండాలి. నేను కావలసినట్టుగా ప్రవర్తించాలి.” అడిగాడు దేవుడికి మనస్పూర్తిగా కళ్ళు మూసుకొని దండం పెడుతూ.

“తధాస్తు..” అంటాడని ఊహించిన సత్యమూర్తి, దేవుడి దగ్గరనుంచి జవాబు లేకపోవటంతో ఆశ్చర్యపోయాడు. కొంపదీసి మాయమవలేదు కదా అనుకుంటూ కళ్ళు తెరిచి చూసాడు.శాంతంగా, మౌనంగా అక్కడే ఉన్నాడు దేవుడు.

“ఏమైంది స్వామీ మౌనంగా ఉండిపోయారు? శాంతను బాగు చేయడం మీ వల్ల కూడా కాదా?”

“నీ కోరిక న్యాయమైనది కాదు మూర్తి” చెప్పాడు దేవుడు సూటిగా.

“అదేంటి స్వామీ? నా భార్య నాతో సఖ్యతగా ఉండాలనుకోవటం అన్యాయమెలా అవుతుంది?” ఎంతో ఆశ్చర్యంగా అడిగాడు.

“నీ భార్య నీతో సఖ్యతగా, ప్రేమగా ఉండాలంటే, నువ్వు కూడా ఆమెతో అలాగే ఉండాలి. అప్పుడే నీ కోరిక న్యాయమైనదవుతుంది. కని, పెంచిన తల్లిదండ్రులనీ, బంధువులనీ వదిలి నీతో ఉండటానికి వచ్చి, నీకో కుటుంబాన్ని ఇచ్చిన భార్యపై నీకెంత ప్రేమ ఉండాలి? రోజంతా ఇంటి పని, వంట పని చేసి, పిల్లలతో విసిగిపోయి, అలసిపోయి ఉండే భార్యకు విశ్రాంతి, స్వాంతన కలిగేలా ఏనాడైనా ప్రేమగా పలకరించావా? నీకు నేను తోడుగా ఉన్నాను అన్న భరోసా ఆమెకు కలిగించావా? ఎంతసేపూ నువ్వు ఆశించిన విధంగా ఆవిడ లేదనుకుఒటావుగానీ, ఆవిడ ఆశించే విధంగా అసలు నువ్వు ఉన్నావా?”దేవుడు చెప్పింది శ్రద్ధగా విన్న సత్యమూర్తి ఆలోచనలో పడ్డాడు. దేవుడు చెప్పింది నిజమే. మొదట్లో శాంత బాగానే ఉండేది.

తనకున్న విసుగు, పని ఒత్తిడితో అసలు భార్యను సరిగ్గా, ప్రేమగా పలకరించడం కూడా మానేసాడు. తన ప్రవర్తన అర్జెంటుగా బాగు చేసుకోవాలి. తనకు ఆఫీసు, స్నేహితులు ఇలా ఎన్నో ఉన్నాయి రోజంతా గడవటానికి. పాపం శాంత మాత్రం రోజంతా ఇంట్లోనే ఉండి మగ్గిపోతుంది.. తను తప్ప శాంతకు కూడా ఎవరున్నారని? కాస్త ప్రేమగా, స్వాంతన కలిగించేలా మాట్లాడటానికి ఏం ఖర్చవుతుంది? భార్యను సరిగ్గా చూసుకోవట్లేదని దేవుడు గుర్తుచేసే దాకా తనకు తెలియకపోవటం ఎంత సిగ్గు చేటు? 

“నన్ను క్షమించండి స్వామి. నా కోరిక అన్యాయమైందే. నా భార్యతో మొదట నేను శాంతంగా, ప్రేమగా ఉండి ఆపైన ఆమెలో మార్పు అశించండం న్యాయం” ఒప్పుకున్నాడు.

“మంచిది. ఇక నీ రెండవ కోరికేంటో చెప్పు” ఇంకా మౌనంగా ఉండి ఆలోచిస్తున్న సత్యమూర్తిని అడిగాడు దేవుడు.

“నా సుపుత్రుడు రవి చక్కగా చదువుకొని, బుద్ధిగా ఉండి, జీవితంలో పైకి రావాలి..” సంకోచిస్తూనే అడిగాడు. మొదటి కోరిక కోరినప్పుడు ఉన్న తన కోరిక న్యాయమైనదే అన్న ఆత్మ విశ్వాసం ఇప్పుడు కాస్త తగ్గింది.

“ఇదీ అన్యాయమైన కోరికే మూర్తి..”

“ఎలా స్వామీ?” ఆశ్చర్యంగా, ఒకింత కుతూహలంగా అడిగాడు.

“రవితో రోజుకు ఎంత సమయం నువ్వు గడుపుతున్నావు? ఎందుకు చదువులో వెనకబడుతున్నాడో ఏనాడైనా నువ్వు విచారించావా? ఏ సబ్జెక్టులో మార్కులు తక్కువగా వస్తున్నాయి? ఎందుకు? అని ఎప్పుడైనా ఓపిగ్గా అర్థం చేసుకోటానికి ప్రయత్నం చేసావా? వాడికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఎప్పుడైనా గమనించావా? వాడు జీవితంలో పైకి వచ్చేలా ఓ తండ్రిగా నువ్వు చేసిన కృషి ఏమిటి? వాడికి తగినంత సమయం కేటాయించు. స్కూల్ ఫీజు కట్టినంత మాత్రాన నీ బాధ్యత తీరిపోదు. ఓ తండ్రిగా నువ్వు వాడికి కేటాయించే సమయమే జీవితంలో నువ్వు పెట్టగలిగే ఉత్తమమైన పెట్టుబడి. ఇవేవీ చేయకుండా, నీ కొడుకు చక్కగా చదివి జీవితంలో పైకి రావాలన్న నీ కోరిక అన్యాయమైనదే..”
 “చక్కగా అర్థమైంది స్వామీ” మనస్పూర్తిగా చెప్పాడు.

“ఇప్పుడు చెప్పు నీ మూడవ కోరికేంటో. ఈసారి బాగా ఆలోచించుకొని న్యాయమైనది అడుగు. వెంటనే తీరుస్తాను. నాకూ నీ కోరిక తీర్చాలని కోరికగా ఉంది” చెప్పాడు దేవుడు నిజాయితీగా.

సత్యమూర్తి ఆలోచనలో పడ్డాడు. దేవుడు చెప్పింది ఎంత నిజం. ఇన్నాళ్లూ తను చేయాల్సింది గాలికి వదిలి ఎంతసేపూ తన జీవితాన్ని నిందించుకున్నాడు. నిజానికి ఎంత చక్కటి జీవితం. చక్కటి ఆరోగ్యం. ఏ దురలవాట్లూ లేవు. అద్దె ఇల్లయితే ఏం? ఓ ఇల్లంటూ ఉంది. శాంతా, రవి విషయంలో తను చేయవలసిందేంటో తెలిసింది. ఇక డబ్బు విషయానికి వస్తే, నిజాయితీగా, తెలివిగా పని చేసి, పనికిమాలిన ఖర్చులు తగ్గించుకుంటే, డబ్బు సంపాదించడం, మిగల్చడం పెద్ద సమస్య కాదు. పైగా సమయం వృధాగా గడపటం మానేసి ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులో చేరి మంచి డిగ్రీ సంపాదిస్తే, తనే పదిమందికి బాసుగా ఎదగొచ్చు.  

“ఏంటి మూర్తి? ఇంతగా ఆలోచిస్తున్నావు?” అడిగాడు దేవుడు ఆసక్తిగా.

“ఏమీ లేదు స్వామీ. మీరు నా కళ్ళు తెరిపించారు. మూడవ కోరిక వినండి. ఇది న్యాయమైందే అనిపిస్తుంది”

“ఏంటది?” ఉత్సాహంగా అడిగాడు దేవుడు.

“జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఇతరులను, పరిస్థితులను, దేవుడ్ని నిందించడం మానుకొని చేయవలసిన దాని మీద శ్రద్ధ పెట్టి, ఇప్పటికన్నా జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అన్న తాపత్రయం, ఉత్సాహం, శ్రమించే గుణం నాలో ఎల్లప్పుడూ ఉండేలా వరమీయండి స్వామీ” కళ్ళు మూసుకొని నిజాయితీగా ప్రార్థించాడు సత్యమూర్తి.  

“తధాస్తు..”.

కళ్ళు తెరిచి చూసాడు సత్యమూర్తి. ఎదురుగా ఎవరూ లేరు. అప్పటిదాకా గదిలో ఉన్న వెలుగూ ఇప్పుడు లేదు. ఓసారి చుట్టూ చూసాడు. అంతా మామూలుగానే ఉంది. జరిగినదంతా నిజామా? కలా? కాసేపు ఆలోచించాడు. ఏదైతే ఏంటి. భగవంతుడు తనకో చక్కని దారి చూపించాడు.

మంచం దిగి ఉత్సాహంగా బయటకు వెళ్ళబోతూ యధాలాపంగా పక్కన ఉన్న బల్ల వైపు చూసి నిర్ఘాంతపోయాడు ఒక్క క్షణం. దేవుడి పుస్తకం ఈ సారి సరిగ్గా చదివి పూర్తి చేయాలనుకున్నాడు. అయితే బల్ల మీద ఉండాల్సిన పుస్తకం ఇప్పుడు లేదక్కడ. గదంతా వెతికాడు. ఎక్కడా లేదు. బాగా వెతికాక మంచం వెనకున్న అరలో కనిపించిందది. ఆశ్చర్యపోయాడు. పూర్తిగా చదివేసిన పుస్తకాలు మాత్రమే అక్కడ ఉంచుతాడు తను. ఇంతకు ముందు బల్ల మీద నిజంగానే పుస్తకాన్ని చూసాడా అసలు? ఏంటీ మాయ? కాసేపటికి ఏదో అర్థమైనట్టుగా తృప్తిగా తలాడించాడు. దేవుడే నేరుగా వచ్చి చేయాల్సింది చెప్పాక ఇక ఆ పుస్తకంలో తను చదివి పూర్తి చేయటానికి ఏమీ లేదు! స్నేహితుడు చెప్పింది నిజమే. తనకున్న ప్రతీ సమస్యకూ పరిష్కారం దొరికింది.

దేవుడి పటం వైపు ఓ సారి చూసాడు. “మాయ చేసి పుస్తకాన్ని అరలో పెట్టింది నేనే..” అన్నట్టుగా కొంటెగా చూస్తున్నాడు దేవుడు పటంలోంచి. మనస్పూర్తిగా దండం పెట్టుకున్నాడు.

అంతకుముందు వరకూ ఉన్న తలనొప్పి చేత్తో తీసేసినట్టుగా మాయమైంది. ఇక మీదట తను చేయవలసిందేంటో  చాలా స్పష్టంగా తెలిసింది.
తలుపు తీసి బయటకు వెళ్లి వంటింట్లో ఉన్న భార్యతో “శాంతా నన్ను క్షమించు...” అన్నాడు ప్రేమగా తను చెప్పదలచుకున్నది మొదలుపెడుతూ.

మరిన్ని కథలు