Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> విద్య

vidhya

జిల్లాస్థాయిలో దాదాపు ఇరవై అయిదేళ్ళు పంతులుగా చేసిన నన్ను ఓ మారుమూల గ్రామంలో వున్న ఓ ప్రాధమిక పాఠశాలకు  బదిలీ చేశారు. తప్పదన్నట్టుగా రెండు రోజుల వ్యవధిలో వెళ్ళి జాయినయ్యాను.

ఆ వూరిలో మొత్తం వందిళ్ళు వున్నాయి. ప్రతి ఇంటికి ఓ పాపో బాబో చదువుకోవటానికి బడికి వస్తే దాదాపు వంద మంది పిల్లలుంటారనుకొంటూ బడి ఆవరణలో కాలు పెట్టాను. చుట్టూ కలియజూశాను.అది ఆస్బెస్టాస్ పెంకుల కప్పుతో వున్న మూడు గదుల కట్టడము. ఆ కట్టడానికి అటూ ఇటూ వేప,చింత చెట్లు వుండడంతో నీడగా వుంది. పర్వాలేదను కొన్నాను. తిన్నగా వెళ్ళి మొదటి గదిలో తరగతి పిల్లలకు పాఠం చెపుతున్న పంతుల్ని చూసి గుమ్మంలో నిలబడి "ఎక్సక్యూజ్ మీ సార్ " అన్నాను.ఆయన నన్ను చూసి "ఎవరండీ మీరు?"అంటూ తరగతినుంచి బయటికి వచ్చాడు .

" సార్ !నేను శ్రీహరి పంతులుగారి ప్లేస్కి బదిలీమీద వచ్చిన కొత్త పంతుల్ని.నా పేరు రామరాజు"అని పరిచయం చేసుకున్నాను.

"ఓకే!రండి.మీ తరగతి పిల్లలకు పరిచయం చేస్తాను.తరువాత హాజరు పుస్తకంలో సంతకం చేద్దురుగాని"అని పంతులు నన్ను చివరి గదికి తీసుకు వెళ్ళి పిల్లలకు పరిచయం చేశాడు. అక్కడ రెండు క్లాసులకు కలసి  ఇరవై మంది పిల్లలున్నది చూసి నేను విస్తుపోయాను.
అంతలో ఇంటర్వెల్ గంట మోగింది.పిల్లలందరూ బిలబిలమంటూ బయటికి వెళ్ళిపోయారు.

జిల్లా స్థాయి బడిలో దాదాపు ఒక్కో తరగతికి కనీసం నలభై మంది పిల్లలుండెడి చోట పాఠాలు చెప్పిన నేను ఇక్కడ రెండు తరగతులకు చేరి ఇరవై మంది వుంటే చోట పాఠాలు చెప్పాలా అని కాస్త బాధపడ్డాను.వెంటనే అయిదు తరగతులకు చేరి అరవై మంది పిల్లలతో సాగుతున్న ఆ బడి,బడిలోని పిల్లలను గూర్చి తెలుసు కోవాలన్న ఆదుర్దాతో "సార్ ! ఈ బడి ఇంత తక్కువ మంది పిల్లలతో నడుస్తోందే కారణమేమిటి?ఈ వూరి పిల్లలు చదువుకోవటానికి బడికి  రారా... లేక వూరిలో బడికొచ్చే పిల్లలే లేరా? "అని ఆ పంతుల్ని అడిగాను.

అందుకు ఆయన నవ్వి "మంచి ప్రశ్నడిగారు.ఖచ్చితంగా మీ ప్రశ్నకు జవాబు చెప్పాలి. వినండి! ఈ వూరి పిల్లలకు చదువుకోవాలన్న ఆసక్తి వున్నా  పిల్లల తల్లిదండ్రులు బడికి రానివ్వరు.వాళ్ళతో పాటు పొలం పనులకు తీసుకువెళతారు.అది సంగతి" సాధారణంగా చెప్పాడు ఆ పంతులు.

"ఏంటండీ మీరు!ఇదెంతటి సీరియస్ మేటరు!పిల్లల్ని చదివించాలి.చదివితేనే భవిష్యత్తు. తద్వారానే వాళ్ళకు ఉద్యోగాలు,జీవితంలో స్థిరపడ్డాలు.కాస్త పెద్ద చదువులు చదివ గలిగితే  దేశాన్ని సైతం శాసించగల శక్తిమంతులౌతారు.ఎటూ వ్యవసాయాన్ని చేసుకోవటానికి వాళ్ళ తల్లిదండ్రులున్నారు కదా? "అని ఇంకేదో చెప్పబోయాను.

"అంతటితో ఆపండి.నేనూ మీలా ఈ బడికి బదిలీ మీద వచ్చినప్పుడు ఈ వూరి పరిస్థితిని, పిల్లలని,వాళ్ళ తల్లిదండ్రులను తలచుకొని ఇలాగే వుద్వేగంతో వూగిపోయి దిద్దుబాటు చర్యలతో వీళ్ళ రూపురేఖల్ను సైతం మార్చేయాలనుకొని ఇక్కడున్న మరో మాస్టారుతో కలిసి ప్రయత్నం చేసి ఓడి పోయాను.ఇప్పుడు నా పాలషీ ఏంటో తెలుసా? బడికొచ్చామా ... తరగతిలో వున్న పిల్లలకు నాలుగు అక్షరాలు చెప్పామా...వెళ్ళి పోయామా... అన్నదే!" అంటూ అటు వీధి వేపు చూశాడు ఆ పంతులు.అల్లంత దూరాన నాగలిని భుజానుంచుకొని మా వేపే వస్తున్నాడు ఓ వ్యవసాయి.

"ఇదిగో మాస్టారూ!ఒక్క నిముషంలో మీ కోరిక ఎంతవరకు సఫలీకృతమౌతుందో ఇప్పుడే తేలుస్తాను"అని అటు తిరిగి "ఓయ్ వెంకన్నా! కాస్త ఇటురా." పిలిచాడు  పంతులు.

ఆ వ్యవసాయి"వస్తున్నానయ్యా"అంటూ దగ్గరకొచ్చాడు.తనతో పాటు ప్రక్కన తన పదేళ్ళ కొడుకున్నాడు.

"ఏంటీ...పొలానికా?"అడిగాడు పంతులు.

"అవునయ్యా!"

"మరి వెంట పిల్లాడెందుకయ్యా...నీకు తోడా?బడికి పంపవయ్యా బాబూ!" అన్నాడు.

"ఇంకెందుకండీ వాడికి బడి.ఉత్తరం రాస్తాడు,చదువుతాడు.కాస్త సేద్యం నేర్చు కుంటే  పావలా డబ్బుల్ను సంపాయించుకోవచ్చు. అందుకే తీసుకు వెళుతున్నాను" అంటూ వెళ్ళిపోయాడు  ఆ వ్యవసాయి.

అంతలో ఒకావిడ అటు వేపు వెళుతూ పంతులు కంట పడింది.వెంటనే పంతులు

"ఇదిగో అమ్మాయ్ !ఏంటి మీ పిల్లాడు నాలుగు రోజులనుంచి బడికి రావట్లేదు.వాడికి ఆరోగ్యం కాని బాగో లేదా ఏం ?"అడిగాడు.

"వాడికేం బాగానే వున్నాడు సార్ ! మా ఆయనే...వాణ్ణి రాఘవ రెడ్డి గారింట్లో పనికి కుదిర్చాడు " చెపుతూ వెళ్ళిపోయింది ఆవిడ.

"విన్నారుగా! ఇది తంతు.ఈ వూరోళ్ళు పిల్లల్ని తొమ్మిది, పదేళ్ళు వయస్సొచ్చేంత వరకూ బల్లో భోజనం కొరకు బడికి పంపుతారు.తరువాత ఆపి పనులకు పంపుతారు.ఇలాంటి పరిస్థితుల్లో మీరేం చేస్తారు?"ఎదురు ప్రశ్న వేశాడు ఆ పంతులు. అప్పటికి నా వద్ద తన ప్రశ్నకు జవాబు  లేక మౌనంగా వుండి పోయాను.అయితే మనసులో ఈ సమస్యకు త్వరలో ఓ మంచి నిర్ణయం తీసుకొని మళ్ళీ పిల్లలందరూ బడికొచ్చి చదువుకునేలా చేయాలనుకున్నాను.అందుకు పిల్లల తల్లిదండ్రుల్లో మార్పును తెచ్చే నిమిత్తం వాళ్ళతో మాట్లాడాలను కున్నాను.వెంటనే ఆ సీనియర్ పంతులుతో స్నేహం కుదుర్చుకొని చర్చలు సాగించాలనుకున్నాను.నెలరోజులు గడిచాయి. పంతులు నాకు బాగా దగ్గరై మంచి స్నేహితుడైయ్యాడు. మా మధ్య అంచలంచలుగా కొన్ని రోజుల పాటు జరిగిన సుధీర్ఘమైన చర్చల తరువాత  పిల్లలు బడికి రాకపోవటానికి గల కారణం వాళ్ళ తల్లితండ్రులు,వూరి పెద్ద మనుష్యులు, డబ్బున్న వాళ్ళని గుర్తించగలిగాము. సదరు వూరి పెద్దమనుష్యులు, డబ్బున్నవాళ్ళు స్వార్థపరులై వాళ్ళ పిల్లలను టౌనులో చదివించుకొంటూ వాళ్ళకున్న పొలాల్లో పనులు చేయటానికి ఈ పేదవాళ్ళను వుపయోగించుకొంటున్నారు.ఈ జనం కూడా డబ్బుకు మరిగి పిల్లలను బడికి పంపడం మాన్పించి పనులకు అలవాటు చేశారని గుర్తించి ఇద్దరం ఓ నిర్ణయానికొచ్చాము.

ఓ రోజు ఇద్దరం  కలిసి కట్టుగా పని చేస్తూ వూరిలోని పిల్లలను బడికి రప్పించే ప్రయత్నంలో భాగంగా  ఆ వూరి ప్రెసిడెంటును, పెద్దలను సంప్రదించాము.ప్రెసిడెంటుగారితో చదువు విలువలను గూర్చి చెప్పి వూరి పిల్లలందరిని బడికి పంపేలా చేయమని అడిగాము.అందుకు ఆయన"పైసలకు మరిగి పనులకు అలవాటు పడ్డ ఈ వూరి పిల్లలను ఇకపై బడికి రప్పించటం కష్టమేమో!అదిగో... అటు చూడండి.ఆ గొడ్లచావిట్లో పని చేస్తున్న వాళ్ళిద్దరు  ఈ వూరి పిల్లలే! నా ఇంట్లో కూలికి పని చేస్తున్నారు.సరేలే! మీరు కోరినట్టు రాబోయే ఆదివారం వూరి వాళ్ళందరిని రచ్చ బండ వద్ద సమావేశపరుస్తాను.మీ ప్రయత్నాలు మీరు చేయండి" అంటూ కండువాను భుజాన వేసుకొని పైకి లేచాడు ప్రెసిడెంటు.

"అలాగేనండి!ఆది దిద్దుబాటో లేక సంస్కరణో కాని దాన్ని మనింటి నుంచి ఈ పిల్లలతోనే మొదలుపెట్టాలి"అన్నాన్నేను ధైర్యంగా.
ప్రెసిడెంటు నవ్వుతూ "అలాగే కానియ్యండి"అంటూ వెళ్ళి ఇంటి ముందున్న వ్యానెక్కాడు.

మేమూ అక్కడినుంచి తిన్నగా బడికి బయలుదేరాము.అయితే అందాకా కథ నడిపిన నాకు మా ప్రయత్నం విఫలమౌతుందేమోనన్న భయం పట్టుకొంది.అవును.వూరి జనం మమ్మల్ని నమ్మి మా మాటలు విని వాళ్ళ పిల్లలను బడికి పంపించాలంటే చదువు విలువ వాళ్ళకు తెలియాలి.చదువే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు మూలమని వాళ్ళు గ్రహించాలి. అంటే వాళ్ళే స్వతహాగా పిల్లల్ని బడికి పంపించేలా చెయ్యాలి.ఆ దిశగా నా మనసు ఆలోచింప సాగింది.

తోటి పంతులు నా ముఖంలోకి చూస్తూ"ఏం చేయాలనుకొంటున్నారు సార్?"  అడిగాడు.

"అందుకు ఓ చిన్న ఉపాయాన్ని ఆలోచించాను.నా వద్ద ప్రాధమిక పాఠశాల చదువును అభ్యసించిన నా శిష్యుడు బాలయ్యని ముంబైలో ఓ పెద్ద కంపెనీలో నిర్వాహణధికారిగా వుద్యోగం చేస్తున్నాడు. .తెలివిగలవాడు.తన మాటల చాతుర్యంతో ఎవ్వరినైనా సరే ఇట్టే ఆకట్టుకోగలడు. అతన్ని పిలిపించి సమావేశంలో మాట్లాడించాలనుకొంటున్నాను"అన్నాను.

"ఓకే !నిజంగా మీ శిష్యుడి ఉపన్యాసానికి ఈ వూరి జనం మారిపోయి చదువులోని మహత్తును తెలుసుకొని పిల్లలను బడికి పంపగలిగితే మనం జయించినట్టే!"అన్నాడు. ఇద్దరం నవ్వుకుంటూ బడి ఆవరణలోకి కాలు పెట్టాము.

©©©©©                       ©©©©©                  ©©©©©

ఆదివారం రానే వచ్చింది.ప్రెసిడెంటుగారి ఆనతి మేర ఉదయం తొమ్మిది గంటలకల్లా వూరి జనం రచ్చబండ వద్దకు చేరారు. ముంబైనుంచి వచ్చిన నా శిష్యుడితో పాటు నేనూ, నా తోటి పంతులు కలసి రచ్చబండ వద్దకు వెళ్ళాము. అందరూ గుసగుసలలో  మా వేపు చూస్తున్నారు.అంతలో వూరి ప్రెసిడెంటుగారొచ్చి కుర్చిలో కూర్చొని మమ్మల్ని కూర్చొమన్నారు.మేము కూర్చొన్నాము.

"వూరిజనం మొత్తం వచ్చినట్టేగా!ఆఁ... మిమ్మల్నందరిని ఇక్కడికి రప్పించినందుకు కారణం మన వూరి బడికి కొత్తగా బదిలీ మీద వచ్చిన ఈ పంతులే! పొలం పనులకు వెళుతున్న మన పిల్లలను చదువుకోవటానికి బడికి పంపించమంటున్నారు.ఇది వీరి అభ్యర్థన.ఈ సమస్యకు ఓ మంచి నిర్ణయం తీసుకునే నిమిత్తమే ఇవాల్టి ఈ సమావేశం. మొదటగా వారి మాటల్ను విందాం. తరువాత మనం నిర్ణయం తీసుకుందాం!ఆఁ... పంతులూ మీరు మాట్లాడండి"అంటూ నాకు హుకుం జారి చేశారు ప్రెసిడెంటు.

కాస్త బెరుగ్గా భయంతో లేచి నిలబడ్డాను.కార్యం మీదే దృష్ఠి అన్న చందాన మాట్లాడ్డానికి వుపక్రమించాను."అయ్యా!నా మాటల్ను బాగా వినండి.నేను బదిలీమీద మీ వూరి బడికొచ్చాను.శిధిలావస్థలో వున్న బడిని,బడిలో వున్న తక్కువ మంది పిల్లలని, వూరి జనాన్ని చూసి బాధపడ్డాను.వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతికే మిమ్మల్ని చూసి జాలి పడ్డాను.ఏదేమైనా ఈ వూరు,మీరు ఈ రెండు నెలల వ్యవధిలోనే నాకు ప్రాణంగా మారిపోయారు. ఇతరులకు సైతం ఈర్ష్యను కలిగించే విధంగా వుండే  మీ ఐక్యతతో కూడుకున్న అనుబంధాలు నన్నూ  మీతో కట్టి పడేశాయి. ఎలాగంటే మీలో ఎవరికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా అందరూ ఒక్కటై ఆదుకునే మనస్తత్వం మీది.అయితే మీ పిల్లలను చదువుకోవడానికి  బడికి రానీకుండ పొలం పనులకు తీసుకు వెళ్ళడం బాధాకరం. అందుకు కారణం మీరే! అవును.ఏరోజుకారోజు గడిస్తే చాలనుకొని కూలి డబ్బుల కోసం వాళ్ళను మీ వెంట పనులకు తీసుకు వెళుతూ మూడవ నేత్రమని చెప్పుకునే చదువుకు  దూరం చేస్తున్నారు.

అందువల్ల వాళ్ళు నిరక్షరాస్యులు అవుతున్నారు.మా లెక్కల ప్రకారం ఈ వూరిలో అయిదేళ్ళనుంచి పదకొండెళ్ళ వయసు గల పిల్లలు నూటా ఇరవై మంది వున్నారు.కాని బడికొస్తున్న వాళ్ళు కేవలం అరవై మందే కనుక నా అభ్యర్థన ఏమిటంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుపడి వాళ్ళు ఉన్నత స్థితికి రావాలంటే  చదువుకోవాలి. చదువు కొని   వుద్యోగాల్లో చేరి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.అందుకని పిల్లల భవిష్యత్తు మీదనుకొని వాళ్ళను పొలం పనుల తీసుకు వెళ్ళడం మాన్పించి  బడికి పంపాలి"అని ఏకధాటిగా ఉపన్యసించి కూర్చొన్నాను .అప్పుడు వున్నట్టుండి ఒకతను లేచాడు."ఇదిగో పంతులూ!నువ్వన్నట్టు చదువైతే వచ్చుద్దేమో కాని వుద్యోగాలు రావు.అందుకే పొలం పనులు చేసుకుంటే పావలా డబ్బులు చూసుకుంటాం"అన్నాడు.

"అది కాదండి!"అని ఏదో చెప్పబోయాను.అంతలో నా శిష్యుడు లేచి "మీరాగండి సార్ ! నేను మాట్లాడతాను" అని లేచాడు.అందరూ అతని ముఖంలోకి చూశారు.

"వూరి ప్రజలకు,పెద్దలకు నమస్కారం.నా పేరు బాలయ్య.ఇంతకన్నా అధ్వానమైన పల్లెటూరిలో పుట్టి పెరిగాను.చదువు వాసన తెలియని ఆ వూరి జనంలో మా నాన్న కాస్త తేడా మనిషి.సంతకం చేయగల ఆయనకు చదువు మీద అవగాహన వుందేమో నన్ను మా వూరినుంచి ఒక మైలుకు ఆవల వున్న ఈ మాస్టారు పని చేస్తున్న బడిలో చేర్పించాడు.

అక్కడ అయిదవ తరగతి ఉత్తీర్ణుడనై చదువు మానుకొని నాన్నతో పాటు పొలం పనులకు  వెళుతుంటే విషయాన్ని ఈ మాస్టారు తెలుసుకొని మా ఇంటికొచ్చి అమ్మా నాన్నలను  ఒప్పించి నన్ను టౌనులో వున్న ప్రభుత్వపు ఉన్నత పాఠశాలలో చేర్పించాడు.నిజానికి నాన్నకు నా వల్ల సంపాదన లేక ఆర్థికం ఇబ్బందులను ఎదుర్కొన్నా ఆయన నాకంటూ పైసా ఖర్చు పెట్టలేదు.నాకు అన్నీ ప్రభుత్వమే చూసుకొంది. హాస్టల్లో వుంచి భోజన వసతులు కల్పించి చదివించింది. ప్రభుత్వపు ఖర్చులతోనే నేను ఎం.ఏ., చదివాను.ముంబైలో వుద్యోగం లో  చేరాను. బాగా సంపాయిస్తున్నాను.అంటే నా ఎదుగుదలకు, పేరు  ప్రతిష్ఠలకు,గౌరవ మర్యాదలకు కారణమైనది ఈ చదువే!అందుకు మార్గదర్శకుడు మా మాస్టారే!.కనుక మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే మనిషి జీవితానికి వెలుగులు నింపి ఎదుగుదలకు తోడ్పడేది చదువని ఆ చదువును మీ పిల్లలు చదవాలని,ఆ చదువుతో నాలా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనీనూ.ఇది మీ అందరికీ నా విన్నపం,అభ్యర్థన కూడా!అని వుపన్యసించాడు. అప్పుడు వూరి జనంలో నా శిష్యుడు ప్రస్తావించిన చదువు,వున్నత శిఖరాలు అన్న రెండు మాటలు అందరిని ఆలోచింపజేసి వాళ్ళలో కదలిక తెచ్చాయి.జనంలోని ఆ కదలికను చూసి పంతుళ్ళమిద్దరం మనసులోనే  ఆనందపడ్డాం.
అయినా ఇంకొకతను లేచి" మా పిల్లాడ్ని బడికి పంపితే వాడికొచ్చే కూలి డబ్బులు పోతాయి.కూలి డబ్బులు పోతే పస్తులు వుండాల్సి వస్తుంది.అప్పుడెలా?" అని అడిగాడు. వంత పాడారు మరో ఇద్దరు.

"అలాంటి పరిస్థితులే వస్తే అప్పుడు నేనాదుకొంటాను.అవును.వీరి మాటల్ను బట్టి చూస్తే చదువెంతటి మహత్తు కలిగిందో నాకు అర్థమైయ్యింది.కనుక మనం పిల్లల్ని బడికి పంపించాలి.ఇక  మీరన్నట్టు  చదువుకున్నవాళ్ళందరికీ వుద్యోగాలు రావు.అయితే ఆ చదువును వుపయోగించుకొని బ్యాంకుల్లో లోను తీసుకొని చిన్న కర్మాగారాలను నిర్మించి మనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించవచ్చు.వ్యాపారాలను చేసుకొంటూ గొప్పగా బ్రతకొచ్చు.ఎటూ తల్లితండ్రులమైన మనం వ్యవసాయాన్ని చేస్తున్నాంగా!అందుకే పిల్లల్ని చదువుకోనిద్దాం.అవును. ఈ చదువన్నది ఖచ్చితంగా మన పిల్లల ఎదుగుదలకు తోడ్పడు తుంది. రేపట్నుంచి పిల్లలు పొలం పనులకు వెళ్ళకూడదు.చదువుకునే పిల్లలందరూ బడికి వెళ్ళాలి.

చివరిగా మన బడి శిధిలావస్థలో వున్నది గమనించాను. అందుకని...నా వంతుగా కొంత డబ్బుతో వీలైనంత త్వరగా బడిని మరమత్తు చేయిస్తాను. పంతుళ్ళూ!మీ ప్రయత్నం  మా పిల్లల భవిష్యత్తు కోసమేనని మేము గ్రహించాము. రేపటినుంచే అందర్ని బడికి పంపించే ఏర్పాట్లు చేస్తాము.అది నా ఇంటినుంచే ప్రారంభం కానుంది"అన్నాడు ప్రెసిడెంటు.

ఆ మాటలకు మా ముఖాల్లో వెయ్య జ్యోతులు వెలిగాయి.పట్టరాని ఆనందంతో మురిసి పోయాము.నా శిష్యుడు బాలయ్య వేపు  కృతజ్ఞతగా చూశాము. బాలయ్య కూడా సంతోషంతో మా చేతులు పట్టుకొని శిధిలావస్థలో వున్న బడిని చూసిన తను ముందే రాసి జేబులో వుంచుకున్న పదివేల రూపాయలకు చెక్కును ఉడతాభక్తంటూ  నా చేతులు మీదుగా వూరి ప్రెసిడెంటుకు ఇప్పించాడు. చెక్కును తీసుకున్న ప్రెసిడెంటు బాలయ్య రెండు చేతులను పట్టుకొని" నా డబ్బుతో పాటు మీరు ఇస్తున్న ఈ డబ్బును చేర్చి బడిని మరమత్తు చేయిస్తాను బాబూ!"అన్నాడు.అప్పుడు నాతోటి పంతులు' భేష్ ' అన్నట్టుగా బాలయ్య భుజాన్ని తట్టాడు. ఇక ముగ్గురం కలసి బడికి బయలుదేరాము సంతోషంగా.

మరిన్ని కథలు
o prema katha