Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
vidhya

ఈ సంచికలో >> కథలు >> ఓ ప్రేమ కధ

o prema katha

అది బస్సులు నిలిపే స్థలం. వచ్చే బస్సులు, వెళ్లే బస్సులు, ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉంది. ఆ ప్రాంగణం లో ఉండే ఓ పల్లె వెలుగు బస్సు ఒక వాల్వో బస్సుని ఘాడంగా ప్రేమించింది.

ఎన్నో రకాలుగా తన ప్రేమని వ్యక్తపరుస్తూ చుట్టూ తిరుగుతున్నా వాల్వో పట్టించుకోవడం లేదు.

అటువైపు గా వస్తున్న వాల్వో వైపు చూస్తూ...

"ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరి..అని పాడుకుంటోంది" పల్లెవెలుగు. 

"నీ మగ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. కాస్త అందంగా ఉంటే చాలు వెనక పడి వేధిస్తారు.నీవులేక నేను లేనంటారు..తీరా వలచి వస్తే వద్దు పొమ్మంటారు.

ఎవరైనా చూస్తే బాగుండదు.నీ వెనుక చాలా బస్సులు ఉన్నాయి దారికి అడ్డుగా ఉన్నావు వెళ్ళు వెళ్ళు చూసింది చాలు" అంది వాల్వో కోపంగా.

"నువు చూడూ చూడకపో నే చూస్తూనే ఉంటా....ప్రేమించు..మించకపో .ప్రేమిస్తూనే ఉంటా...నాప్రాణం, నా ధ్యానం నువ్వేలే"..అంటూ పాటతోనే సమాధనమిచ్చింది పల్లెవెలుగు.

"నీ అంతస్తు ఏమిటి?

నా అంతస్తు ఏమిటి ?స్థాయి మరచి ప్రవర్తించకు. అందంగా ఉన్నానని ప్రేమించెయ్యడమేనా? నా ఇష్టాఇష్టాలతో పనిలేదా?" అని సర్రు మంటూ ముందుకు సాగింది..వాల్వో. వెనకాలే వెళ్తూ...

"ప్రేమ అనేది మనసులోంచి పుట్టుకొచ్చేది డబ్బిచ్చి కొనుక్కునేది కాదు. ఎవరిమీద పెడితే వాళ్ళమీద పుట్టదు. పుట్టాక మరి పోదు. ప్రేమ విలువ ప్రేమించే వారికే తెలుస్తుంది. అయినా నీ అందాన్నో అంతస్తునో చూసి ప్రేమించలేదు...ఆ హైవే పై నువ్వు దూసుకు పోతుంటే నా మనసు నీ వెంట పడింది.

ఎంతమంది అమ్మాయిలు వచ్చి వెళ్లినా మొదటిసారి ప్రేమించిన అమ్మాయే మనసులో మిగిలిపోతుంది. అందుకే నిన్ను మరచిపోలేకున్నా!

నేను పల్లెవెలుగునని చిన్నచూపుగా ఉంది కదూ!" అంది పల్లెవెలుగు.

 

"కాక పోతే మరేంటి! గోల గోల నీ దగ్గర కంపు కంపు ఉండలేను. శుచిశుభ్రం లేని మనుషులు నీదగ్గర ఉన్నారు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు.. వెళ్లవయ్యా వెళ్ళు.. అంటూ ముందుకు దూసుకుపోయింది వాల్వో..

 

ప్రయాణీకులతో రద్దీగా ఉన్న పల్లెవెలుగు గోతులు ఎన్నెన్నో మలుపులు దాటుకుంటూ ప్రయాణం చేస్తోందే కానీ మనసంతా వాల్వో మీదే ఉంది..దారిపొడవునా పల్లెవెలుగు మనసుని ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తన ప్రేమ పండే రోజుకోసం ఉవ్విళ్లూరుతోంది పల్లెవెలుగు మనసు.

కలో నిజమో అర్ధం కాలేదు కానీ వాల్వో ని తలుచుకున్న మరుక్షణం తనని తానే మర్చి పోతోంది.. తనకి తెలియకుండానే వేగం పెరిగిపోతోంది..ఈ విషయం డ్రైవర్ కి అర్ధం కాక..

"ఈ రోజు బస్సుకి ఏమైందబ్బా పూనకం వచ్చిన దానిలా పరిగెడుతోంది" అనుకుంటున్నాడు. వాడికేం తెలుసు అది ప్రేమ తమకమని..

ఒకరోజు రెండు బస్సులు ఒకే దారిలో ప్రయాణం చేస్తున్నాయి. రోడ్డు పక్కన జనాలు బస్సులకోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

" నేను తొందరగా తీసుకు వెళ్తాను అందంగా, సౌకర్యంగా కూడా ఉంటాను కాబట్టి ఈ ప్రయాణీకులు నాదగ్గరికే వస్తారు అని మనసులో అనుకుంటూ ఆగింది వాల్వో... కానీ ఆ ఖరీదైన ప్రయాణం చెయ్యలేక అందరూ వెనుక వస్తున్న పల్లెవెలుగు బస్సు ఎక్కారు.

వాల్వో బస్సు ముఖం మాడి పోయింది.

ఒక్క ప్రయాణీకుడు లేక

విల విలలాడిపోయింది.

అప్పుడు పల్లెవెలుగు వాల్వోతో..

"హలో మిస్ అందం ఒక్కటే ఉంటే సరిపోదు. బంధాలు అనుబంధాలు కూడా ఉండాలి. నీ చుట్టూ తురుగుతున్నానని తక్కువగా చూసావు. నా బలం బలహీనత వీళ్ళే..

నా రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. చూపులకన్నా ఎదురు చూపులే తియ్యన అన్నది నీకు తెలియదు.

నాతో ప్రయాణమంటే ప్రయాణీకుల కష్టాలు, కన్నీళ్ళు, చిన్నారుల ఏడుపులు,సీటుకోసం తగువులు, చిల్లర లేక ఇబ్బందులు,

అబ్బాయిల పిచ్చి రాతలు, అమ్మాయిల కొంటె చూపులుంటాయి.

అయితే నేమి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొందరు. కులాసాగా కబుర్లు చెప్తూ కొందరు, వారందరి భావాల్ని పంచుకుంటూ నా ప్రయాణం ఆహ్లాదంగా సాగుతుంది...వాళ్ళు నా నుంచి దూరమైన క్షణం ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అయినా తప్పని నా పయనం క్షేమంగా చేర్చాలి వారిని గమ్యం అంది.

నిజమేరా! అందుకే నువ్వు పల్లెకు వెలుగువి..పల్లె వెలుగువి.. ఇన్నాళ్లు నేను ఆస్థి అంతస్తు అంటూ గొప్పలకి పోయి విర్రవీగాను డబ్బు మత్తులో మునిగి పోయాను. ఆత్మీయత అనురాగాలకు దూరమయ్యాను.నీ ప్రేమని పొందలేకపోయాను. నేను ద్వేషించినా నువ్వుమాత్రం నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు.

నా వెంట పడుతూనే ఉన్నావు..నిన్ను అర్ధం చేసుకోలేక పోయాను. నాకు తెలియకుండానే నా మనస్సుని కొల్లగొట్టేసావ్.

ఐ.లవ్.యు.టూ రా...అంది వాల్వో... మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా? అంటూ వాల్వో పల్లెవెలుగు ని వాటేసుకుంది...మేఘాలలో తేలిపొమ్మన్నది... అంటూ రయ్యిమని చెట్టాపట్టాలేసుకుని దూసుకు పోయాయి రెండు బస్సులూ..

మరిన్ని కథలు