Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prema enta madhram

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue316/811/telugu-serials/katyayani/katyayani/

 

(గత సంచిక తరువాయి)... "ఆంటీ ఈ ఇంట్లో ఉండేవాళ్లు కావాలా" అన్నాడు.

కాత్యాయనికి ఒక్కసారిగా పోయిన ప్రాణాలు తిరిగొచ్చినట్టుగా అనిపించింది.

అతణ్ని పట్టుకుని ఉద్వేగంగా"అవున్నాన్నా..చెప్పవా?" అంది.

అయితే ‘పద’ అన్నాడు. ఆమె కార్ దగ్గరకు వెళ్లి, తనిప్పుడే వస్తానని డ్రైవర్ కు చెబుదామనుకుంది. అయితే ఆ పిల్లాడు "ఈ కార్ మీదేనా" అన్నాడు.

కాత్యాయని అవునన్నట్టుగా తలూపింది.

"అయితే నేను నా సైకిల్ కి లాక్ వేసి కార్లో వస్తాను. మనిద్దరం ఎంచక్కా కారులో వెళదాం. మళ్లీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి దింపాలి. అప్పుడు నేను సైకిల్ తీసుకుని ఇంటికెళతా"అన్నాడు.

కాత్యయని "సరే" అని ఆ అబ్బాయి సైకిల్ కు లాక్ వేసి రాగానే కార్లో ఎక్కించుకుంది. కార్ నాలుగైదు వీధులు తిరిగిన తర్వాత ఆ పిల్లాడు ఓ ఇంటి ముందు కారాపించి, ఇదే అన్నాడు. ఒకే ఒక్క రేకుల గది అది.’తన తల్లిదండ్రులు దాంట్లో ఉంటున్నారా?’ ఆమె హృదయం ద్రవించి పోయింది. డ్రైవర్ తో ఆ పిల్లాణ్ని ఇందాకటి చోటులో దింపి రమ్మని పురమాయించి తలుపుతట్టింది.

యశోదమ్మ తలుపు తీసీతీయడంతోటే కూతుర్ని చూసి కళ్ల నీల్లు పెట్టుకుని "ఏమ్మా, మమ్మల్ని ఎందుకమ్మా దూరంగా ఉంచావు?"అని కౌగిలించుకుని బావురుమంది.

అది విని అచ్యుతరామయ్య "రామ్మా. కాత్యాయని"అని లోపలికి ఆహ్వనించి- అమ్మాయికి కాసిని మంచినీళ్లు ఇవ్వు యశోదా!"అన్నాడు.
ఆవిడ గబ గబ ప్లేట్లో ఫలహారం, గ్లాసుతో పాలు పట్టుకొచ్చింది.

అమ్మ చేతి ఫలహారం కొద్ది కొద్దిగా తింటూ, ఒకప్పటి మధురానుభూతులు నెమరేసుకుంటూ "హఠాత్తుగా, అమ్మా మన ఇంటికి వెళ్లి అక్కడ తలుపులకి వేళాడుతున్న తాళం కప్పను చూసి గుండె ఆగిపోయిందనుకో! అయినా ఇంత దూరం ఉన్నా ఆ పిల్లాడు సరిగ్గా ఇక్కడికే ఎలా తెచ్చాడు నన్ను?"అడిగింది ఆశ్చర్యంగా.

"ఆ పిల్లాడే కాదమ్మా ఏ పిల్లాడు నిన్నక్కడ చూసినా ఇక్కడికి పట్టుకొచ్చేవాడు. ఈ ఏరియాలోని పిల్లలందరకూ ఏవో ఒకటి చేసి పెడుతుంటాను. అందుచేత మేమిద్దరం పిల్లలకి అమ్మమ్మా, తాతయ్యలం" అండావిడ.

"అవునూ మీరు ఈ ఇంట్లోకి ఎప్పుడొచ్చారు? ఎందుకొచ్చారు?"అంది యథాలాపంగా.

"ఆ ఇల్లు ఆనందరావుదని నీకు తెలుసు కదమ్మా! ఆయన తను మారీషస్ నుంచి ఇండియాకి వచ్చేస్తున్నానని, త్వరలో ఇల్లు ఖాళీచేస్తే పెద్ద బిల్డింగ్ కట్టుకుంటారట. అంతకాలం మనలని అక్కడ ఉండనియ్యడమే గొప్ప. అందుకనే ఖాళీ చేసేశాం. ఆయన తన స్థలాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని కాపాడినందుకు డబ్బియ్యబోయాడు. నేనే ‘మేము ఇన్నాళ్లు ఉచితంగానే ఉన్నాం కదండీ’ అంటూ సున్నితంగా తిరస్కరించాను.

"ఇంటి ముందు మొక్కలన్నీ ఎండి పోయి కనిపించాయి నాన్నా..మనసు ఉసూరుమంది"అంది.

"ఇప్పుడు అది మన ఇల్లు కాదు కదమ్మా. అయినా రేపు అక్కడో బిల్డింగ్ ఏర్పడితే, అందులో మొక్కలూ తోటమాలి కూడా ఉంటారమ్మా"అన్నాడు ఆశావహ దృక్పథంతో. తర్వాత నెమ్మదిగా క్లుప్తంగా తన జీవితంలో చోటు చేసుకున్న మలుపులు..తనను ఆదరించిన సోమయాజులుగారు..హేమ పరిచయం..మనోహర్ కలవడం..మారిన అతని నైజం..ఆశ్రమం..దాని నిర్వహణను తనకివ్వడం అన్నీ చెప్పింది. అన్నీ విన్న సోమయాజులుగారు చిన్నగా నిట్టూర్చి.."భగవంతుడు ఎవరికీ అన్యాయం చెయ్యడమ్మా. అందులో అమ్మ..కాత్యాయనివి..నీకు అసలు అన్యాయం చెయ్యడు"అన్నాడు.

తర్వాత వాళ్లిద్దరినీ తనతో పాటూ ఆశ్రమానికి ఆహ్వానించింది.

"మీకు మగ పిల్లాడు లేదని చింతించవద్దు. ఈ వయసులోని..మీలాంటి వాళ్లని ఆదరించడానికే ఆ ఆశ్రమం. చేతనైనంతకాలం అందరికీ సేవ చేద్దురుగాని"అంది.

వాళ్లిద్దరూ ‘సరే’ అన్నారు.

***

అచ్యుతరామయ్యగారు, యశోదమ్మలు ఆశ్రమానికి వచ్చేశారు. అదో కుటుంబం. అక్కడి వాళ్లందరూ బయట ప్రపంచంలోని కుళ్లును, కుత్సితాలను చూసి వచ్చినవారు. అందుకే అక్కడ ఎవరూ అబద్ధాలాడరు. నిజాయితీగానే ఉంటారు. అక్కడి గుళ్లో జరిగే పూజల్లో, సత్సంగాల్లో శుద్ధమైన మనసులతో పాల్గొంటారు. తాము అనాథలైనా, వారానికోసారి బయట ఉన్న ఆస్పత్రికో, శరణాలయాలకో వెళ్లి సేవ చేస్తారు. వాళ్లతో మమేకమైన తన జీవితాన్ని తలచుకుంటే కాత్యాయనికి ఎంతో తృప్తి కలుగుతుంది. సమాజంలో చాలామంది తమకోసం తాము బతుకుతారు. కొంతమంది, తమ జీవితంలో పావుభాగాన్ని సేవాకార్యక్రమాలకోసం వినియోగిస్తారు. కాని తమ జీవితాలను నిస్వార్థంగా దీనజనోద్ధరణ కోసం ఉపయోగించేవాళ్లు చాలా చాలా తక్కువగా ఉంటారు. వాళ్లు మానవుల్లో మహనీయులు.
దేవుళ్లందరూ మనుషుల కోసమే! మనుషుల్లో కొంతమంది దేవుళ్లై అందరి కోసం తాపత్రయపడుతుంటారు. దుష్టుడైన మనోహర్ లో మార్పు వచ్చి, ఆశ్రమ నిర్మాణానికి పూనుకుంటే, మంచివాడైన కమలాకర్ రాక్షసుడయ్యాడు. ఓ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మామృతాం గమయ!

అవాస్తవ స్థితి నుంచి వాస్తవిక స్థితికి నన్ను తోడ్కొని వెళ్లుదువుగాకా! అజ్ఞానాంధకారం నుంచి జ్యోతిస్స్వరూపానికి నన్ను తోడ్కొని పోదువుగాక! మరణం నుంచి మరణరహిత (అమర) స్థితికి నన్ను తీసుకుపోదువుగాక!

గుడిలో జరుగుతున్న సత్సంగంలో ఎవరో మైకులో చెబుతున్నారు.

కాత్యాయని అమ్మవారి అవతారం. అప్పట్లో రాక్షసుల కుత్తుకలు తెగ నరికితే, ఈనాడు వాళ్లలో మార్పు తీసుకువచ్చి సమాజ వికాసానికి పురిగొలుపుతుంది. అందర్నీ అక్కున చేర్చుకుంటుంది.


                           శుభం

 

గోతెలుగు  పత్రిక  కి ముందుగా కృతజ్ఞతలు!
ఎందుకంటే ఇన్ని వారాలపాటు నా సీరియల్ ను శ్రద్ధగా చదివి నన్ను ప్రోత్సహించినందుకు.

మన గోతెలుగు గురించి-ఇంతింతై వటుడింతయై..దిన దిన ప్రవర్థమానమై..ఇవన్నీ ఎదుగుదలను సూచించే పదాలు. వీటికి పర్యాయపదంగా నిలిచేది గోతెలుగు. మొదటి సంచిక నుంచి మొన్నటి కొత్త సంచిక వరకు వారం వారం కొత్త కొత్త మార్పులతో అప్రతిహతంగా ఎదుగుతోంది. మొట్టమొదటి సంచికలో నా కవిత పడింది. ఆ తర్వాత నుంచి దాదాపు వంద కథలు ప్రచురితమయ్యాయి. అలాగే రెగ్యులర్ ఫీచర్ ప్రతాప భావాలు కూడా యాభై దాటాయి. మరొక్కసారి మీ అందరికీ మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ-
 


జరిగిన కథ
మరిన్ని సీరియల్స్