Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.....http://www.gotelugu.com/issue315/810/telugu-serials/katyayani/katyayani/

 

(గత సంచిక తరువాయి)...."అమ్మా సొంత కూతురు మమ్మల్ని వదిలి వెళుతున్నంత బాధ మా మనసులను మెలిపెట్టేస్తోంది. మేమా పెద్దవాళ్లమయిపోయాం. ఇంకా ఎంతకాలం ఉంటాం. మాకెందుకో నువ్వు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి, మా తర్వాత నువ్వేమయిపోతావా? అని మదనపడిపోయేవాళ్లం. ఈ రోజు అమ్మవారు నీకో మంచి దారి చూపించింది. పూజారిగా నేను జనుల మంచి కోరుతూ పూజలు మాత్రమే చేస్తాను. కానీ నువ్వు సేవ చేస్తావు. నువ్వు బంగారు తల్లివి. దేవతవు" అన్నాడు సోమయాజులుగారు డగ్గుత్తికతో.

"అవునమ్మా, నా కడుపున పుట్టకపోయినా, నువ్వు అంతకంటే ఎక్కువ. ఈ తల్లిని మర్చిపోవుగా"అంది బేలగా.

"లేదమ్మా..లేదు. నేను దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మీరు నాకు పెద్ద దిక్కయ్యారు. మిమ్మల్ని మర్చిపోతే నాకు పుట్టగతులుండవు. మీకు దేవుడిచ్చిన కూతురొకతె ఉందని మర్చిపోకండి. నేనూ అప్పుడప్పుడూ చూసి వెళతాను. మీలో ఓపిక సన్నగిల్లి, పనులు చేసుకోవడానికి శరీరమ్ సహకరించకపోతే ఆశ్రమానికి వచ్చేయండి. అందరితో పాటే మనమూను"అంది.

సోమయాజులుగారి దంపతులు ఆమెకి పసుపు, కుంకుమ, గాజులు, చీర, ఓ బంగారు గొలుసూ పెట్టారు.

"ఎందుకమ్మా ఇవి" అని ఆమె వద్దని వెనక్కితోస్తుంటే.

"మా అమ్మ కదూ..కాదని మా మనసు నొప్పించకు తల్లీ" అన్నారు.
చేసేదేం లేక మెడలో గొలుసు వేసుకుని మిగతావి పాలిథీన్ సంచీలో సర్దుకుని ఆ పెద్దవాళ్ల కాళ్లకు దణ్నం పెట్టి కారులో బయల్దేరింది.

***

ఆశ్రమంలోకి రయ్యిన దూసుకుపోయిన కారు, సరాసరి ఆమె గదికి కొద్ది దూరంలో ఆగింది. భీం పరిగెత్తుకు వచ్చి ఆమె చేతిలోని కవర్లు అందుకుని లోపలి దారి తీశాడు. అతని వెనకాలే కాత్యాయని తన గదిలోకి వెళ్లింది. ఆమెకి కావలసినవన్నీ ఉన్నాయక్కడ.

***

ఉదయం అయిదింటికి ఆశ్రమం నిద్రలేస్తుంది. కాలకృత్యాలనంతరం, స్నానం చేశాక- ఈశాన్యం వైపున ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి గుడిలో ఒక గంట భజన ఉంటుంది. ఆ తర్వాత అందరికీ పాలు పళ్ల అల్పాహారం పెడతారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక ఆడవాళ్లు వంట కార్యక్రమాల్లోకి, మగాళ్లు తమ శక్తికి అనుగుణంగా మొక్కల సంరక్షణో, లైబ్రరీ లోని పుస్తకాలు తుడవడమో, పెద్ద పెద్ద గిన్నెలు తోమి శుభ్రపరచడమో, తమకు వచ్చిన ఇష్టమైన హస్తకళలతో వివిధ వస్తువుల తయారీనో చేస్తారు.

మధ్యాహ్నం కమ్మటి భోజనం ఉంటుంది. అదయ్యాక కాసేపు కునుకు వేస్తారు. మళ్లీ సాయంత్రం స్నానాలయ్యక గుడిలో సత్సంగం, భజన ఉంటుంది. రాత్రి అల్పాహారం తిని, పాలో మజ్జిగో తాగి హాయిగా ఏ చీకూ చింతా లేకుండా పడుకుంటారు. కాత్యాయని అన్నీ శ్రద్ధగా గమనించింది.

***

నెలరోజులు గడిచిపోయాయి. ఈలోపులో నాలుగైదు సార్లు మాత్రమే వచ్చాడు మనోహర్. బయటే కాత్యాయనితో నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోతాడు తప్ప ఆమె గదికి రాడు.అతని సంస్కారానికి ఆమె మనసులోనే జోహార్లర్పిస్తోంది. రాముడు రాముడుగా ఉంటే గొప్పేముంది? రావణుడు రాముడైతేనే ఉత్తమత్వం.

***

ఒకరోజు మనోహర్ తో ఆశ్రమంలోని పూల మొక్కల మధ్య తిరుగుతూండగా "కాత్యాయనిగారూ, ఎలా ఉంది ఆశ్రమ నిర్వహణ" అన్నాడు.
"పాపం, ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. సమస్యలు బాల్యం నుంచి మధ్యవయసు వచ్చే వరకు ఫర్వాలేదు కాని, జవసత్వలుడిగిపోయిన దశలో రావడం, మన అనుకున్న వాళ్ల నిరాదరణకు గురికావడం..పగవాడిక్కూడా ఇలాంటి జీవితం వద్దు బాబూ" అంది సాలోచనగా.
"మీరన్నది నిజమే కాత్యాయని. మనం దాదాపు మర్చిపోతున్న అతి ముఖ్యమైన పదం ‘ఆసరా’. మీరన్నట్టు ఈ ప్రపంచంలో ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య నిజమే! కాని ఒకరికి మరొకరు ఆసరా ఇచ్చుకోవచ్చు. ఉదాహరణ కు కళ్లు లేనతనికి, మూగతను ఆసరా అవ్వొచ్చు. డబ్బు లేని వాళ్లకు డబ్బున్నవాళ్లు ఆసరాకావచ్చు. కాకపోతే మనసులో ఆ ఫీలింగ్ ఉండాలి. నాలో మార్పు రాబట్టే కదా, ఇంతమంది జీవితాలు తెరిపిన బడ్డాయి. ఇప్పుడు మీరొచ్చి కచ్చితంగా ఓ తల్లిలా వాళ్లకు సాంత్వన చేకూరుస్తారు" అన్నాడు.

కాత్యాయని కాసేపు మౌనం వహించిన తర్వత " మనోహర్ గారూ నాదో చిన్న కోరిక, మా అమ్మనాన్నలకు నేనొక్కతినే సంతానం. గంపెడంత ఆశతో నాకు పెళ్లి చేశారు. అది పెటాకులు అయింది. వాళ్లు వృద్ధులు. దయచేసి మీరు అంగీకరిస్తే వాళ్లను కూడా ఆశ్రమానికి ఆహ్వానిస్తాను. నాతో పాటూ వాళ్లూను" అంది.

"తప్పకుండా కాత్యాయనీ. మీరసలు నన్నడగవలసిన అవసరం లేదు. ఆశ్రమం విషయంలో మనిద్దరం ఒకటే. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది నాకు సమ్మతమే! రేపు ఉదయం ఎనిమిందింటికి కారు పంపిస్తాను. అందులో మీరు మీ అమ్మనాన్నల దగ్గరకెళ్లి వాళ్లను ఇక్కడికి సగౌరవంగా తీసుకు రండి." అన్నాడు.

కాత్యాయని అతని వంక కృతజ్ఞతా పుర్వకంగా చూసింది.

***

మరుసటిరోజు మనోహర్ అన్నట్టుగానే ఉదయం ఎనిమిదికి కారు పంపించాడు. 

కాత్యాయని కారులో తన తల్లిదండ్రుల దగ్గరికి బయల్దేరింది.

తను ఇలా ఆశ్రమ నిర్వహణ చేపట్టినట్టు వాళ్లకు ఇంతవరకూ చెప్పలేదు. తన గురించి వాళ్ళేమనుకుంటున్నారో? అసలు ఇంతకాలానికి ఇదే వాళ్లను చూడడం. ఏరియా పెద్దగా ఏమీ మారలేదు. ఇల్లు దగ్గర పడుతున్నకొద్దీ మనసులో ఏదో తెలీని భావన.

ఇంటిముందు ఆగిన కారు నుంచి ఒక్క ఉదుటన దిగి, గేట్ తీసుకుని లోపలికి వెళ్లింది. మొక్కలన్నీ ఎండిపోయి ఉన్నాయి. గబ గబ ఇంటి దగ్గరకు చేరంగానే తలుపులకు వేళాడుతున్న తాళంకప్పను చూడంగానే ఆమె నిస్త్రాణగా అయిపోయింది. తను వాళ్లని కాంటాక్ట్ చేసి చాలాకాలమయింది. ‘వాళ్లేమయిపోయారో..ఎక్కడికి పోయారో. అసలు వాళ్లకేమన్నా అయిందేమో?’ ఆ ఆలోచన రాగానే నిలువెల్లా వణికిపోయింది.

కొద్దిసేపు అక్కడే నేల మీద చతికిలపడిపోయి, పాత జ్ఞాపకాలతో తల్లడిల్లిపోయింది. నెమ్మదిగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ గేటు దాకా వచ్చి బయటకు అడుగు వేసి గేటు మూసి మరొక్కసారి ఆ ఇంటిని చూసి బయటకు అడుగేసింది. సరిగ్గా అప్పుడే..ఓ పిల్లాడు చిన్న సైకిల్ తొక్కుకుంటూ వచ్చి..

కాత్యాయని తల్లి తండ్రులు ఏమైపోయారు? కాత్యాయని ఆశ్రమ నిర్వహణ ఎంత వరకు బాధ్యతగా నిర్వర్తిస్తోంది తెలియాలంటే వచ్చే శుక్రవారం ముగింపు సంచికలో  తప్పక చూడండి...  

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
prema enta madhram