Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> నా ఎవరెస్ట్

naa evarest

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. అని మహానుభావుడు అబ్దుల్ కలాం గారు పాపం ఎన్ని కోట్ల సార్లు చెప్పి వుంటారో... ఏం లాభం... ఎన్నెన్నో అనుకుంటాం.... ఏవేవో కలలు కంటాం..ఆడపిల్ల అనగానే అక్కడి పిల్ల అని మన వాళ్ళ నమ్మకం. నేను సగటు ఆడపిల్లను... చిన్నప్పటి నుండీ కొంచం అల్లరి పిల్లను కూడా. చెట్లెక్కడం, కొండలు, గుట్టలు అలవోకగా ఎక్కడం నాకు సరదా నిజానికి పుట్టుకతో అబ్బిన విద్య.... మా తిరుమల కొండ శ్రీవారి మెట్ల మార్గం మీద నుంచి ఒక్క గంటలో ఎక్కేసేదాన్నీ. అమ్మ ఎప్పుడూ తిట్టేది పొరపాటున ఆడపిల్లగా పుట్టావు అని. నీ కొడుకు కు ఇవేవీ  చేత కాదని నా కూతురిని తిడ్తావా అంటూ నన్ను వెనకేసుకొచ్చి అమ్మకు చీవాట్లు పెట్టేవాడు నాన్న. ఎంతైనా తండ్రుల కు కుతురులంటేనే ఇష్టం..

నాన్న తిరుపతి దగ్గర నారాయణ వనం లో స్కూల్ టీచర్.  మేము నారాయణ వనం లొనే ఉంటాము...మా పెరట్లో వుండే మామిడి చెట్టే నా ఆట స్థలం. మామిడి చెట్టెక్కి ఎవ్వరు చేరుకోలేని చిటారు కొమ్మ ఎక్కేసేదాన్ని. సెలవులొస్తే నాకు వేరే పనే లేదు మామిడి చెట్టెక్కడం అమ్మ తిడితే దిగటం మళ్ళీ ఎక్కటం...అమ్మాయిని కదా అంత ఎక్కువగా బయటకు వెళ్ళనిచ్చేది కాదు..

ఈ ఏడు కొత్తగా మా ఇంట్లో కి టీవీ వచ్చింది. మా తిరుపతి కి టీవీ ఎప్పుడో వచ్చినా మా ఊరికి మా ఇంటికి ఇప్పుడు వచ్చింది..అదొక అద్భుతం అనే రీతిలో టీవీ చూసేవాళ్ళం. ఏవైనా ప్రోగ్రాం వస్తే మేము వార్తలు వస్తే మా నాన్నగారు చూసే వారు. రోజు సాయంత్రాలు టీవీ వచ్చేది అది హిందీ ఇంగ్లీషు భాషల్లో!!! అర్థం కాకపోయినా అదో అద్భుతం అంతే!!!!...ఒక రోజు నాన్న గారితో పాటు నేను వార్తలు చూస్తున్నా.... అప్పుడు ఒక వార్తా విశేషం నా మనసులో నాటుకు పోయింది ఎంతగానంటే నాకు పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లినైనా ఇంకా తాజాగా ఉంది.. అదేనండి ఆరోజు టీవిలో బచేంద్రిపాల్ అనే ఆవిడ ఎవరెస్టు శిఖరాన్నీ అధిరోహించిందని ఆవిడని పొగడ్తలతో ముంచెత్తారు. ఆవిడ తన అనుభవాలను పోగేసి చెప్తోంది. అప్పటికే తను అధిరోహించి 5 ఏండ్లు అయ్యిందట. అప్పుడే మొదటి సారిగా టీవీలో ఎవరెస్టు శిఖరాన్ని చూసా!!!. సోషల్ బుక్కులో చడవడమే తప్ప దాని గురించి ఇంకేమి తెలీదు...  టీవీ నే అద్భుతం అనుకుంటే ఎవరెస్టు అత్యద్భుతం అనిపించింది.. అంతే లవ్ అట్ ఫస్ట్ సైట్....ఎవరెస్టు తో ప్రేమలో పడిపోయా!!!!  పాత పుస్తకాలలో ఎవరెస్టు గురించిన విశేషాలన్ని కంఠత పట్టాక... అప్పటికి తృప్తి రాకపోతే నెమలీకను దాచుకున్నంత భద్రంగా ఆ పేపర్లను దాచుకున్నా!!!... ఇహ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెస్టు ను బచేంద్రి పాల్ లాగా అధిరోహించాలని కోరిక... ఈ కోరిక  ఇష్టం నా వయసుతో పాటే పెరుగుతూ వచ్చింది కానీ ఆవగింజంతైనా తగ్గలా....

నేను ఇంటర్ లో ఉండగా ఒకసారి మా నారాయణ వనం కల్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఒక బృందం వచ్చింది. వాళ్లు యూత్ హాస్టల్ వాళ్లంట.. వీళ్ళు పర్వతాలు ఎక్కే సాహసికులని మా తమ్ముడు నన్ను అక్కడికి పిల్చుకెళ్ళాడు. అప్పుడు తెలిసింది పర్వతారోహణ అని ఒకటుంటుంది అని. ఈ యూత్ హాస్టల్ వాళ్లలో ఒక్క అమ్మాయి కూడా లేదు. వచ్చిన వాళ్లలో ఎవ్వరికి తెలుగురాదు మనకేమో హిందీ ఇంగ్లీష్ రాదు. వచ్చి రాని ఇంగ్లీష్ లో ఒకతన్ని వివరాలు అడిగితే ..పర్వతారోహణ గురించి పుస్తకాలుంటాయని దానికి కూడా కోర్స్ లు ఉంటాయని చెప్పాడు. ఇప్పటి లాగ అప్పుడు గూగుల్ మాత లేదు కదా... అప్పట్లో మాకు గూగుల్ అంటే తిరుపతి లో ఆదివారం నాడు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్మే గోవింద రాజులు స్వామి గుడి వెనక అన్నమాట. అప్పుడప్పుడు అక్కడకు వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవడం అలవాటు.. అతను పుస్తకాలున్నాయన్నదే ఆలస్యం...

ఇంకేం ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా అని ఆదివారం కోసం పడిగాపులు. మామూలుగానే ఆదివారం తాబేలు లాగ వచ్చి కుందేలు లాగ వెళ్ళి పోతుంది. నేను మరీ.... ఎదురు చూస్న్నా కదా ఆదివారం రావడానికి ఒక ఏడాది సమయం పట్టిందనిపించింది... మొత్తానికి ఆదివారం రానే వచ్చింది నాన్న ను విసిగించి గోల పెట్టి, నాన్నను పిల్చుకొని తిరుపతి బయలు దేరాను.. నాన్నకు అర్థం కాలేదు. అప్పటి నుంచి ఏ పుస్తకం కోసం వెతుకుతున్నానో. నాన్న కు తెలిస్తే ఏమంటారో అని అక్కడే మా కిరాణా కొట్టు  మామయ్య దగ్గర నాన్నను కూర్చుబెట్టి వళ్లంతా కళ్ళేసుకొని జల్లెడ పట్టా. ఉహు... ఒక్కటంటే ఒక్కటి కూడా తెలుగులో లేవు ....ఇక తప్పని సరిగా ఇంగ్లీషులో ఉండేదే కొన్నాను..మనమా తెలుగు మీడియం బాపతు. నాన్నకు అనుమానం రాకుండా మరిన్ని పుస్తకలు కొన్నా... అతి కష్టం మీద ఆక్సిఫర్డ్ డిక్షనరీ పక్కన పెట్టుకొని ఒక ఐఏఎస్ పరీక్ష  కు చదివినట్టు చదివా. ముక్క తలకెక్కింటే ఒట్టు. అర్థమైనంత వరకు ఎవరెస్టు ఎక్కడం చిన్న విషయం మాత్రం కాదు. చాలా కష్ట సాధ్యం అని అర్థమయ్యింది...నిరంతరం ఒక్కటే పిచ్చి ఎవరెస్టు ఎవరెస్టు. నా తమ్ముడు గాడు నా ఈ బలహీనతను బాగా ఆటపట్టించేవాడు. నేనే ఒకసారి అమ్మను ఉడికించడానికి... అమ్మ నేను ఒకర్ని ప్రేమించాను అని సరదాగా అంటే..అమ్మ  భయపడి పోయి ఎవరు ఏమిటి అని ఒక్కటే ప్రశ్నల పరంపర... అంతేనా పరుగు పరుగున నాన్నను  పిల్చుకొచ్చింది. ఇది చేసిన నిర్వాకం తెలుసా మీరు నా కుతురు... నా కుతురు... అంటుంటారుగా ఇప్పుడు చూడండి ఇది ఎవరినో ప్రేమిస్తోందిట అని ఒక్కటే ఊగిపోతోంది. పొయ్యే కాలం అంటే ఇదే కాబోలు. ఏదో సరదా అని నేననుకుంటే అది నామెడకే చుట్టుకుంది. వాళ్లకు నేను ప్రేమిస్తున్నది ఎవరెస్టు అని ఒప్పించడానికి తల ప్రాణం తోకకొచ్చింది. నా భాదేంటంటే వాళ్లకు నా ఎవరెస్టు అధిరోహించాలన్న కోరిక తెలియపర్చాలన్నది. నా పప్పులేమి ఉడకలేదు.. పైగా నేను ఎంత చెప్పినా వాళ్ళ మనసులో నుంచి ఆ భయం పోలేదు. నా మీద నిఘా ఎక్కడికి పోయినా తమ్ముడి తోడు. చెట్లెక్కడాలు గుట్టలెంబడి పరిగెట్టడాలు అన్ని కట్ కట్ కట్. నా ప్రేమ పెళ్లి పీటలు ఎక్కలేదు కాని నేను ఎక్కేసా. ఇంకా డిగ్రీ పూర్తి అవ్వక ముందే పెళ్లి నిశ్చయం...డిగ్రీ ఆఖరి పరీక్ష  అవ్వగానే పెళ్లి.

ఇంకేముంది వివాహం విద్య నాశనం. నాకన్నా తక్కువ మార్కులు తెచ్చుకొన్న నా స్నేహితులు లెక్చరర్లుగానో టీచర్లు గానో హాయిగా ఉద్యోగాలు సాధించుకున్నారు. హ్యాపీ గా సంపాదించేస్తున్నారు. నాకు సంపాదన ఉండుంటేనా ఈ పాటికి ఎవరెస్ట్ ఎప్పుడో ఎక్కేసుండేదాన్ని...నేను చేసిన చిన్న హాస్యం ఇదిగో నన్ను ఇలా గృహిణి ని చేసింది. ఏమాటకామాటే చెప్పాలి, మావారు నిజంగా చాల మంచివారు. పెద్ద ఇంజినీరు.... మద్రాస్ లో కాపురం. చిన్న పల్లె నుంచి పెద్ద పట్నానికి మకాం. దేనికి తక్కువ లేదు... నిజం చెప్పాలంటే ఒక మంచి జీవితం... కానీ ఎవరెస్టు తో నా ప్రేమ పెళ్లి పీటలెక్కలేదే అన్న ఒక చిన్న బాధ తప్ప. ఒక్కో సారి పెద్ద బాధ నాకు... ఎంతైనా తొలి ప్రేమ మరి!!! చెసేది యేమి లేక నా తొలి ప్రేమను అదేనండి నేను కొనుక్కున్న ఇంగ్లీష్ ఎవరెస్టు పర్వతారోహణ పుస్తకాన్ని... ఎందుకో ఆ బుక్ అంటే చాల ఇష్టం నాకు, ఎన్ని సార్లు చదివినా కొత్తగా వుంటుంది. దానితో పాటు నేను నా ఎవరెస్టుకు రాసుకున్న ప్రేమ లేఖలన్నీ చుట్ట చుట్టి అటకెక్కించేసా.

ఇంకేమైనా దూర విద్యా విధానంలో చదువుదాము అనుకుంటున్నంతలో బిల బిల మంటూ ఇద్దరు పుట్టేసేసారు. ఇంక తీరికెక్కడిది...సంవత్సరాలు రోజుల్లాగా గడిచి పోయాయి... అప్పుడు ఆదివారం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. అప్పుడు ఆదివారం కోసం ఎదురు చూసేదాన్ని...ఇప్పుడు ఆదివారం ఎందుకు వస్తుందా అనిపిస్తుంది మా పిల్లల అల్లరి భరించ లేక. అపురూపమైన గంట టీవీ కార్యక్రమాల నుంచి 24 గంటలు టీవీలు మోగుతున్నాయి. ప్రపంచం ఎంతగా మారి పోయినా  నాకు ఎవరెస్టు మీద ప్రేమ పోలేదు.  ఎక్కక పోయినా పోనీ... కనీసం ఎవరెస్టు ను రెండు కళ్ళతో తనివి తీరా చూసొస్తే అన్నా బాగుంటుంది అనిపించేది. ఎవర్ని అడగను.....? మా తిరుపతి వెంకన్న కూడా అది మాత్రం అడగొద్దు అంటాడు. చేసేది ఏమిలేక నాతోటి ఆడాళ్ళంతా సీరియళ్లు చూస్తుంటే నేను మాత్రం నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చూస్తా... అదీ దొంగ చాటుగా లేకపోతె నవ్వుతారేమో అని భయం. అప్పుడు ఎవరెస్టు బుక్కు కోసం తిరుపతి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు నన్ను ఇంకా మురిపిస్తూ... ఏడిపిస్తూ... ఊరిస్తూ... ఎవరెస్టు నా చేతుల్లోకి వచ్చేసింది అది కూడా ఏ డిక్షనరీ  అవసరం లేకుండా... అదేనండి ఇంట్లోకి కంప్యూటర్ వచ్చేసింది... గూగుల్ మాత యూట్యూబ్. ఇప్పుడు ఎన్ జీ సీ కూడా అవసరం లేదు. కర్లో దునియా ముట్టిమే!!!!.... అప్పుడు ఇంగ్లీష్ రాదు.. పుస్తకాలు మాత్రం ఇంగ్లీష్ లో తప్ప గతి లేదు...ఇప్పుడు మా పిల్లల పుణ్యమా అని ఇంగ్లీష్ బాగా వస్తుంది కానీ ఎవరెస్టు గురించి అంతా తెలుగులోనే. కాలం మహిమ..ఇలా సాగుతున్న నా జీవితం లో ఒక రోజు....

ఒక రోజు ఉన్నట్టుండి మా వారు "పార్వతీ.. తిరుపతి వెల్దామనుకుంటున్నాను అది కూడా కొండకు నడిచి వెళదామని ఏమంటావు..??" అని అడిగారు..

అయ్య బాబోయ్!!! ఎంత మంచి వార్త. ఎవరెస్టు ఎలాగు ఎక్కలేను అందుకే మా తిరుపతి కొండెక్కి ఎవరెస్టు ఎక్కినంత ఫీల్ అవుతుంటా....అంతేనా... మా స్వామికి లంచం ఆశ కూడా చూపా!!!.. నాకు ఎవరెస్టు ఎక్కే అవకాశం వస్తే నీకు ఎవరెస్టు మీద గుడి కడ్తా అని అదే నండి మంచుతో గుడి. ఆయనేకేం తక్కువ అందుకే నా లంచం పుచ్చుకోలా. ఆయన ఎవరెస్టు చూపించక పోయిన మా శ్రీవారన్నా ఆ శ్రీవారన్నా అదో ప్రేమ... మా నారాయణ వనం వెంకన్న చాల అందగాడు. ఆడపిల్లను కదా ఎవరెస్టుతో ప్రేమలో పడక ముందు నీ అంతటి అందగాడ్ని మొగుడుగా ఇవ్వు అని అడిగే దాన్ని. ఈ కోరికైతే తీర్చాడు. నా స్నేహితులందరి లోకి మావారే అందగాడు మరి... సో... వెంకన్న మీద కొంచెం కోపం మాఫీ చేశా.

"పారూ....! పిలుస్తుంటే పలుకవేమి. నెక్స్ట్ వీక్ వెళ్తున్నాము పిల్లల్ని మీ అమ్మవాళ్ళింట్లో వదిలి మనిద్దరం నడుద్దాము..!"  అన్నారు.

" అయ్యో! ఇంతకంటే భాగ్యమా. పెళ్ళి కాకముందు ఎప్పుడు నడిచే వెళ్లేదాన్ని. పెళ్లయ్యాక పిల్లలు మీరు రామంటారుగా....నేను ఎప్పుడూ రెడీ...!"

" అప్పుడు వేరు ఇప్పుడు వేరు నడవగలవా..?" అని మా ఆయన నా మీద అనుమానం వ్యక్తం చేశారు..

" ఛా..! మన ఇగో కాస్త హార్ట్ అయ్యింది... నా హర్టింగుని మనసులోనే దాచుకొని... అయినా...ఎంత ఒక పది కేజీలు బరువు పెరుగుంటా అంతే... పందెం... మీకంటే ముందే ఎక్కుతాను చూడండి అని నేను మా ఆయనకు సవాల్ విసిరా.... తిరుమల కొండ అసలే నా ఎవరెస్టు...

************

హబ్బా...! తిరుపతి అలిపిరి మార్గం నుంచి కొండ ఎక్కడం మొదలు పెడ్తుంటే నాకు ఎవరెస్టు బేస్ క్యాంపు నుంచి ఎవరెస్టు వైపుకు ప్రయాణం లాగుంది. ఎవరెస్టు ఎక్కుతున్న ఊహ నన్ను 3 గంటల్లో తిరుమల ఎక్కించేసింది. మా వారు నాతో కూడా ఎక్క లేక ఆయాస పడ్తుంటే ఒకింత గర్వంతో  విజయ చిహ్నం చూపించా.. మా వారు నన్ను పొగుడుతుంటే తొలి నాళ్లలో బచేంద్రిపాల్ ను పొగడ్తల్లో ముంచెత్తిన ఫీల్ వచ్చింది. ఎన్నో ఏండ్ల తర్వాత కూడా అదే ఊపు తో ఎక్కినందుకు ఆ శ్రీవారికి మనసులోనే థాంక్స్ చెప్పుకొని దివ్య మంగళ స్వరూపాన్ని తృప్తిగా దర్శించుకొని మళ్లి ఇంకోసారి లంచం ఆశ చూపించి వచ్చా...!

ఇంటికి రాగానే మావారు మరో షాక్ ఇచ్చారు. అవును.. నీవు మీ మామిడి చెట్టు చిటారు కొమ్మ కూడా ఎక్కేస్తాను అని  చెప్తావుగా ఒక్క సారి కూడా నీవు ఎక్కి చూప లేదే అని అనడమే తరువాయి మరు నిమిషంలో చిటారు కొమ్మ మీదున్నా. మా వారు చాటంత కళ్ళేసుకొని బారెడు నోరు తెరుచుకొని చూస్తున్నారు. నా పిల్లలు చప్పట్లు కొట్టి ఎగురుతుంటే ఆ....వద్దులే చెప్పిందే మళ్లి చెప్పినట్లుంటుంది. పెళ్లైయ్యాక ఎన్నోసార్లు వచ్చా కానీ ఈసారి ఏదో తెలియని తృప్తి. ఎందుకంటే నా విద్యను మా ఆయన ముందు ప్రదర్శించాలని చాలా కోరిక. ఇన్నాళ్లకు తీరింది అదీ ఆయనే అడిగారు... కొన్ని కోరికలు చిన్నవే అయినా అవి ఇచ్చే సంతోషం మాత్రం అనంతం...

తిరుపతి ప్రయాణం ముగించుకొచ్చిన వారానికి మావారు  ఇంకో షాక్ ఇచ్చారు.

" పారూ..! నీకు ఎవరెస్టును అధిరోహించాలని చాలా కోరిక కదా...!" అని అడిగారు..." వెంకన్నా..!" నా చెవులను నేనే నమ్మలేక పోయా. ఇది కలా..! నిజామా..! అని నన్ను నేను గిల్లి చూసుకున్నా.. ఇది కల కాదు సుమీ ! నిజమే !

" పారూ..! నిన్నే... " అని మా ఆయన నన్ను కదపటం తో ఈ లోకం లోకి వచ్చి...కోరికా ! అది చిన్న మాట మహా ప్రభు, అది నా పిచ్చి...నా కల!

" మరి పారూ, ఇప్పుడు ఎవరెస్టు ఎక్కే అవకాశం వస్తే ఎక్క గలవా...?"

అయ్య బాబోయ్..! అంత మంచి అవకాశాన్ని ఎలా వదులుకుంటా? మీరు ఒప్పుకోవాలే కానీ తప్పకుండా ప్రయత్నిస్తా అని ఇంత పెద్ద నోరేసుకొని చెప్పా...

" ప్రయత్నిస్తావా.., సాధిస్తావా పారూ? "

" సాధిస్తా... ఖచ్చితంగా సాధిస్తా.." అని చెప్పా.

మా ఆయన ఎవరెస్టు గురించి మాట్లాడుతూ వుంటే నాకేమో ఎవరెస్టు ఎక్కినంత సంబరంగా వుంది..

కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఇంత పెద్ద మనసు మీకు ఎలా వచ్చింది. పెద్దోడు పుట్టక ముందు నుంచి అడుగుతున్నా ఎవరెస్ట్ ను అధిరోహించాలని. ఇంత కాలం తర్వాత ఇప్పుడు సడన్ గా నా కల మీద ఇంత దయ ఎందుకు వచ్చిందో.

" ఎవరెస్టా..?" అని పడి పడి నవ్వే వారు. చాల ఆశ్చర్యంగా ఉంది నాకు.

" ఏమనుకోకే ! నీకు తెలియకుండా నీ తొలిప్రేమ విషయాలు చదివాను. నీవు ఎవరెస్టు కు రాసిన ప్రేమలేఖలు చదివా... నీకు ఈ కోరిక ఇంత బలంగా ఉందని తెలీదు. నీవు నీ డైరీ లో రాసుకున్న విషయాలు చాలా సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. నీవేదో అడుగుతుంటే సరదా అనుకున్నా... నిజమే నీ శక్తిని నమ్మ లేదు. నిన్ను చాలా తక్కువ గా అంచనా వేసా. నీవు రాసుకున్న ఇన్స్ పిరేషనల్ స్టోరీస్ నిజంగా నాలోను ఇన్స్ పిరేషన్ కలిగించింది. నిన్ను నీ కలను నమ్మి ఉంటే ఈ పాటికే మరిన్ని ఎక్కి వుండే దానివి... "

రియల్లి ఐ ఆం వెరీ సారీ.. నీ దగ్గరే డబ్బు ఉండి ఉంటే ఈ పాటికి ఇంట్లో నుంచి వెళ్లి నీ ఎవరెస్టును ఇంటికి తెచ్చే దానివేమో... మొన్న నీవు స్పాన్సర్ షిప్ కోసం అప్లై చేసుకున్న లెటర్ దానికి సారీ అన్న వాళ్ళ రిప్లై చూసి నాకు చాలా బాధేసింది. ఇప్పుడు కూడా నీవు ప్రయత్నాలు కొనసాగిస్తున్నందుకు నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నా. నీ స్థానం లో ఇంకొకరు ఉండి ఉంటే జీవితంతో రాజీ పడుండే వారు. ఒక భర్త గా నిన్ను నమ్మక పోయినందుకు నిజంగా బాధేసింది. ఇప్పుడు కూడా నేను నిన్ను నమ్మక పోతే ఈ బంధానికి అర్థమే లేదు..నీకు నేను చేయ గలిగినంత తప్పకుండా చేస్తా మరి... అందుకే అడుగుతున్నా మరి నీ ప్రేమను సాకారం చేసుకుంటావా...

మీరు నన్ను ఎవరెస్టు ఎక్కించడానికి ఓకే చేస్తారంటే అంత కంటే ఏమి కావాలి....బెటర్ లేట్ దాన్ నేవర్... నా కల  కలగానే మిగిలి పోతుందేమో అనుకున్నా. తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఛా!!! నాలో నేనే నొచ్చుకున్నా మా ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకొనఒదుకు. కొన్ని కోట్ల సార్లు మా వారిని అడిగివుంటా, నేనేదో పెద్ద జోకేసినట్టు పడి పడి నవ్వేవారు. ఎవరెస్ట్ ఎక్కడానికి చాలా ఖర్చవుతుంది అందు వల్ల ఆగి పోయా. కానీ నేణెమి దేవదాసును కాదు నా ప్రేమ కోసం ప్రతి చిన్న అవకాశం కూడా వదల్లేదు. కొన్ని వందల మందికి స్పాన్సర్ షిప్ కోసం లెటర్లు రాసా, ఆఖరికి మహిళా-శిశు సంక్షేమ శాఖకు కూడా ఉత్తరం రాసా. అందరూ దొంగమొహాలే... చెప్పేదొకటి అది నమ్మి అడిగితే సారీ మేడం అని. గృహిణి అంటే అందరికి అలుసే... ఇప్పుడు మా ఆయన నా కల గురించి నా ప్రేమ గురించి... ప్రేమగా మాట్లాడుతుంటే చాలా ముద్దొస్తున్నారు... కళ్ళార్పకుండా ఆయన్నే చూస్తున్నా...

" చూడు పారూ..! ఎవరెస్టు ఎక్కడం అంటే అంత సులభం కాదు...అది ఈ మూడు పదులు దాటిన వయసులో. దీనికి చాలా కఠోర శ్రమ అవసరం. ఒక మిలటరీ శిక్షణలాంటిది ఉంటుంది. నీవు ఆ శ్రమకు ఓర్చుకో గలను అంటే నెక్స్ట్ ఏమిటి అని ఆలోచిద్దాం "

తప్పకుండానండీ. మీరు ఇంత సహకరిస్తుంటే నా వెన్నంటి నడిపిస్తానంటే... ముదితల్ నేర్వగ రాని విద్య కలదే... చెప్పండి అక్కడ ముద్దు ముద్దుగా నేర్పించరు పార్వతి గారు!!! చర్మం వలిచి చేతులో పెడ్తారు.

నాకు తెలుసండి అని.. ఎన్నో ఏళ్లుగా ఎవరెస్టు అధిరోహణకు సంబంధించిన వివరాలు, కష్ట నష్టాలు, తీసుకో వలసిన ట్రైనింగులు అన్ని చక చక చూపించేసా. ఈ సారి నోరెళ్ల బెట్టడం మావారి వంతైంది. ఎప్పుడైనా అవకాశం వస్తే చేజార్చుకో కూడదని ఇంట్లో నే చిన్న చిన్న సాహసాలు చేసేదాన్ని... అదేనండి అవసరం లేక పోయినా మా వంటింటి గట్టు ఎక్కడం పూలు కోసే నిమిత్తం ప్రహారి గోడెక్కడం ఇలా చెప్తూ పోతే మా వెంకన్న బ్రహ్మోత్సవం క్యూ లైన్ అంత. నాకు తెలుసు మా వెంకన్న నా లంచం పుచ్చుకుంటాడాని. ఎవరెస్టు మీద గుడి అంటే కాస్త పెద్ద లంచమే కదా మరి.

ఐ ఆం రేల్లి సారీ పారూ. ఖచ్చితంగా నీ  ఈ గెలుపు ఎంతో మంది గృహిణులకు ధైర్యాన్ని ఇస్తుంది. నాలాంటి భర్తలకు కనువిప్పుకుడా అవుతుంది...సరే ఐతే నాకు తెలిసిన ఒకతను వున్నాడు. అతను ఒక పర్వతారోహకుడు..అతన్ని వెళ్లి కలుద్దాం మనకు మార్గ నిర్దేశనం చేస్తాడు...

సరే అయితే ఎప్పుడు వెళ్ద్మో చెప్పండి అని ఒంటి కాలు మీద నిల్చున్నా...

మా వారు ఒక నవ్వు రువ్వి...లేడికి లేచిందే పరుగంట అంటే ఇదే కాబోలు. సరే ఎందుకు ఆలస్యం అతనికి కాల్ చేద్దాము వస్తున్నామని, అతను సరే అంటే ఇప్పుడే వెళ్దాము అని చెప్పి అతనికి కాల్ చేయడానికి వెళ్లారు. మా వారు...ఇన్నేళ్లకు నా లంచం పుచ్చుకోవడానికి ఒప్పుకున్నందుకు ఆ ఏడు కొండల వాడికి మనసు లోనే దండం పెట్టుకున్నా...

*******************

" హరి..! ఈవిడ నా భార్య పార్వతి...!"

" పారూ..! ఇతను హరి అని చాల పర్వతాలు అధిరోహించాడు ఇప్పుడు ఎవరెస్టు ఎక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు....! "

" నమస్కారం అండి..."

"హరి గారూ..! మా ఆవిడకు కూడా ఎవరెస్టు అధిరోహించాలని కోరిక అని మా వారు చెప్పగానే....మావారి ఈ మాటతో తన పక్కన ఏదో బాంబు పడ్డట్టు ఉలిక్కి పడి నన్ను ఎగాదిగా చూసి మా ఆయన వైపు ప్రశ్నార్థకంగా చూసి మర్యాద కోసం అన్నట్టుగా ఇంత వరకు ఏవైనా పర్వతాలు అధిరోహించారేఅ..? అని అడిగాడు.

చాలా సార్లు మా తిరుపతి కొండెక్కానండి.. పోయిన వారం కూడా 3 గంటల్లో చకచకా ఎక్కేసాను. నా ఈ మాటతో అతనికి పిచ్చి కోపం వచ్చింది.. పాపం, తమాయిఒచుకున్నాడు. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాక దీనికి ఖర్చు చాల ఎక్కువ అవుతుందండి.. తను హౌస్ వైఫ్ కదా స్పాన్సర్స్ ఎవ్వరు రాకపోవచ్చు. మరి మీరు అంత ఖర్చు భరించ గలరా....?"

"ఆ!!  నాకు తెలుసు అందుకే బ్యాంక్ లో లోన్ తీసుకోవాలనుకుంటున్నాను హరిగారు..."

డబ్బైతే పెట్టుకో గలరు కాని శారీరిక శ్రమ చాల ఎక్కువగా ఉంటుంది చాల కఠిన శిక్షణ అవసరం మరి ఇవన్నీ మీరు చేయ గలరా..?"  అని నా వైపు ఎగాదిగా చూసాడు. "ఎందుకలా చూసాడబ్బా..?" అనుకుంటే నేనేమో పేరంటానికి వెళ్లే ముత్తైదువల చీర కట్టుకొని పూలు పెట్టుకొని వచ్చా.

అవునండి తను సిద్ధంగా వుందండి చాలా వరకు వివరాలన్నీ తెలుసుకున్నాము. బట్ కరెక్ట్ ప్రొసీజర్ మీతో తెలుసుకోవాలని వచ్చాము అని మావారు నా వకాల్తా పుచ్చుకున్నారు.అతని వాలకం చూస్తుంటే నన్ను నాచేతే వద్దనిపించాలని... నేనేమో అన్నిటికి సరే అంటున్నా...అతనేమో మా ఆయన హోదా వల్ల అతి కష్టం మీద కోపాన్ని అణచుకొని చాలా అతి మర్యాదగా మాట్లాడుతున్నారు.

చివరకు సరే సార్ ఐతే ఫస్ట్ జిమ్ లో జాయిన్ చేయండి సార్ వాళ్ళు చూసి ఎంత వెయిట్ తగ్గాలో చెప్తారు...ఫస్ట్ వెయిట్ మైంటైన్ అయ్యాక వాట్ నెక్స్ట్ అన్నది చెప్తాను. అని ఒక జిమ్ అడ్రెస్స్ ఇచ్చాడు.

ఆ అడ్రెస్స్ తీసుకొని సరా సరి జిమ్ కెళ్ళి పోయాము. మా ఆయన ఇంట్రెస్ట్ చూసి నాకు పిచ్చి మరి ఎక్కువైంది. జిమ్ ట్రైనర్ను కల్సి విషయం చెప్పే పాటికి మళీ పైన జరిగిన సేమ్ సీన్ రిపీట్ అయ్యింది... ఇతను కూడా నా చీరను చూసి అవాక్కయ్యాడు. ఈ కట్టు బొట్టు ఏమిటి... ఎవరెస్టు ఏమిటి.... నక్కకు నాగ లోకానికి వున్న తేడాలాగుందతనికి... " నాదేం పోయింది నా డబ్బు నాకొస్తుంది కదా..! " అని వాళ్ళ న్యూట్రిషనిస్టుని  పిలిపించాడు. వాళ్ళు అవేవో కొలతలు చూసి " మీరు రెండు నెలల్లో 15 కేజీలు తగ్గాలి " అని చెప్పాడు. డైట్ ప్లాన్ జిమ్ టైమింగ్స్ అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి పంపారు..ఏమైనా ఒక గృహిణి అంటే అందరికి చులకన. వంట చేయడానికి తప్ప దేనికి పనికి రారని వీళ్ళ లెక్క.. ఏడిచారు... తగ్గి చూపిస్తా. హరి గారు కూడా అదే అనుకునుంటాడు. ఈవిడేమి తగ్గుతుందేలే అని.. ఎవరెస్టు నా కల, వీళ్ళకేం తెలుసు నా సంకల్పం. అంతా బాగుంది కానీ మా వారు కూడా ఇలానే అనుకుంటున్నారా కొంపదీసి...? వుండబట్టుకో లేక అడిగేసా...!

మా వారు ఒక అందమైన నవ్వు నవ్వి నిన్ను కొండెక్కించడం మావిడి చెట్టెక్కిండం అందు కోసమే.. కేవలం కలా, లేక సంకల్పమా అని తెలుసుకోవడానికే. నీవు మోకాళ్ళ పర్వతం మోకాళ్ళ పైన ఎక్కినప్పుడే అర్థం చేసుకున్నా..నీది కేవలం మఖ లో పుట్టి పుబ్బలో పోయే కల కాదని ధ్రువుడి లాగా దృఢ సంకల్పం అని....

అయ్యో,  మా వారు నన్ను అలా ఎవరెస్టు ఎక్కించేస్తుంటే ఎంత బాగుందో..!

ఇక కొంచం కూడా సమయం వేస్ట్ చేయకుండా అటునుంచి అటే జిమ్ముకు కావలసిన షూస్, ట్రాక్స్,  డైట్ జ్యూసులు అన్ని తెచ్చేసుకున్నా. మా వారేమో " పారూ..! ఇప్పుడే ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు. ఎందుకంటే వేరే ఏ విషయమైనా నిన్ను ఎంకరేజ్ చేస్తారేమో కాని ఎవరెస్టు అంటే అందరి రియాక్షన్ ఒక్కటే. సో, ప్రయత్నం చేయక ముందే నీవే ప్రయత్నం విరమించుకుంటావు.. అందుకే ఎవ్వరికి చెప్పొద్దు. పిల్లలకు కూడా. వాళ్ళు ఏదో గ్రేట్ గా ఫ్రెండ్స్ కు చెప్పి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కు చెప్పి... ఈ తలనొప్పులు అవి వద్దు కేవలం నీ ఎవరెస్టే నీ గురించి అందరికి  చెప్తుంది సరేనా..."

" అయ్య బాబోయ్!  మీరు ఇంత సపోర్టు చేస్తే చెలరేగిపోను " అని మా వారిని కొండ గాలిలా చుట్టేసుకున్నా. మొదట ఘింకారం,  హుంకారం భర్తల నుంచే వస్తుంది…. నాకు వచ్చిన నా సంకల్పంతో చివరకు సకారలొచ్చాయి.

ఆయన నమ్మకమే సాధించినప్పుడు ఇంకేం ... ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఒక్కటే కాచుకున్నా... రాత్రంతా తెల్లని ఎవరెస్టు మీద రంగురంగుల కలలు...

***************

పిల్లల్ని స్కూలుకు పంపేసి ఆ శ్రీవారి నా శ్రీవారి ఆశీర్వాదం తీసుకొని కరెక్ట్ టైం లో జిమ్ లో రెడీ. నిన్నటి చీర ఆవిడ ఈవిడేనా అని నావైపు కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఫిట్ నెస్ ట్రైనింగ్ స్టార్ట్ చేసాడు...

అక్కడ జిమ్ చేస్తున్నంత సేపు తెలియ లేదు  కానీ ఇంటికొచ్చాక దాని ప్రతాపం చూపించింది... వళ్ళంతా ఒక్కటే నొప్పులు. సలుపుడు.  నీరసం ఈ మాటంటే మా అయన ఏమనుకుంటారో అని దాచిపెట్టా... నిజానికి  ఈ నొప్పులకన్నా నోరు కట్టుకోవడం చాల కష్టంగా వుంది. హాయిగా యూట్యూబ్ లో ఎవరెస్టు వీడియోలు చూసుకుంటూ చిరు తిళ్ళు ఏ అడ్డు లేకుండా లాగించేసే దాన్ని.  ఇప్పుడు మరీ ఊరిస్తున్నాయి.  నిజం చెప్పొద్దూ ఇప్పుడు ఎవరెస్టు కంటే ఎక్కువగా.... హతోస్మి!

మా ఆయన నా అవస్థ చూసి నీకు చిరు తిళ్ళు తినాలనిపించినప్పుడెల్ల ఈ సోంపు కొద్దిగా నములు అని సోంపు తెచ్చిచ్చాడు.  వారనికి పెద్ద డబ్బా అయి పోయింది.  వాళ్లేమో రోజు వెయిట్ చూడడం నా ముఖం చూడడం. అందులో ట్రైనరు గాడు కావాలని నాకు వినపడేటట్టు ఎవరెస్టు ఎక్కడమంటే స్కూటీ వేసుకొని జిమ్ కొచ్చినంత సులభం కాదు అని ఎద్దేవా చేసాడు.  వళ్ళు మండి పోయింది.  ఎంకరేజ్ చేయడం రాదు కాని డిస్కరేజమెంటు  కోర్సుకు ప్రతినిధుల్లాగున్నారు.. గట్టిగా చివాట్లు పెట్టాలనిపించింది.  వెంటనే మా ఆయన అన్న మాట గుర్తుకొచ్చింది.  నేను కాదు మాట్లాడవలసింది, నా గురించి ఎవరెస్టు మాట్లాడాలి.. అంతే.. నాలో కొత్త ఉత్సహం వచ్చింది. ఎవరెస్టు లాంటి భర్త అండ నాకుండగా నేను డీలా పడడం తప్పనిపించింది. కలాం గారి మాటలు నాలో స్ఫూర్తి నింపాయి.

నీ ధ్యేయం లో నీవు నెగ్గాలంటే నీకు ఏకాగ్ర చిత్తంతో కూడిన అంకిత భావం రావాలి. లక్ష్యం ఒక్కటే సరిపోదు దాన్ని సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా కావాలి.

అప్పుడంటే నెట్టు లేదు ఏమిలేదు.. ఇప్పుడు గూగుల్ గురువు వున్నాడు గా...అందులో చదివి టిప్స్ అన్ని తెలుసుకొని సీరియస్ గా ఫాలో అయ్యా! అంతే క్రమంగా వెయిగ్ లాస్ స్టార్ట్ అయింది.. దాంతో మా ట్రైనర్ లో కూడా మార్పొచ్చింది.  మావారేమో " నీవు సన్నగవుతుంటే పెళ్ళైన కొత్తలో వున్నట్టున్నావు పారు!" అని అంటుంటే.. నాకెలా ఉందొ మీకు ఈపాటికే అర్థం అయ్యుంటుంది మళ్ళీ చెప్పక్కర్లే కదా...

మొత్తానికి నా తిండి యావను జయిఒచి ఎవరెస్టు వైపుకు ఒక అడుగు ధైర్యంగా వేశా.  హరి గారిని మళ్ళీ కలవడానికి వెళ్ళాం.  అప్పటి చూపుకి ఇప్పటికి చాల తేడా ఉంది నా పట్టుదలను  మెచ్చుకున్నాడు కానీ అతనికి ఇంకా నా మీద నమ్మకం కుదర లేదు. వాట్ నెక్స్ట్ అది చెప్పు బాబూ తర్వాత నన్ను చూద్దువు కాని అని అనుకొన్నా.  కావాలనే ఈసారి కూడా పేరంటం ముత్తైదువ లానే వెళ్ళా.  నాలో తేడా గుర్తుపట్టాడు.

" సర్ !  ఇప్పుడు ఉత్తర కాశీ లోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోంటెనీరింగ్ లో జాయిన్ కావాల్సి ఉంటుంది. అక్కడ శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. మొత్తం 5 నెలల శిక్షణ. అక్కడే అన్ని వసతులు ఉంటాయి.. ఈ వెయిట్ ఇలాగే మైంటైన్ చేసుకోవాలి.  వాళ్ళ డైట్ ప్లాన్ మీ దగ్గర అలాగే ఉంచుకొని రెగ్యులర్ జిమ్ కంటిన్యూ చేయాలి " అన్నాడు. 

" ఇంకెందుకు లేట్ హరి గారు ఎప్పుడు ఎలా వెళ్లాలో చెప్తే మేము ప్లానింగ్ చేసుకుంటాము..."

" ఒక్క నిముషం " అని ఎవరికో కాల్ చేసి వచ్చి మాకు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి " మీరు వెళ్లి నెక్స్ట్ వీక్ లో డైరెక్ట్ గా జాయిన్ అవ్వొచ్చు... లక్ ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతోంది " అన్నాడు.

అతని దగ్గర సెలవు తీసుకొని ఇంటికొచ్చాము.  ఇంకోక వైపు ప్రయాణం మొదలు పెట్టాలి.  ఏమైనా గృహిణి కి పిల్లలు భర్తే లోకం. పెళ్లయ్యాక మొదటి సారి అందరిని వదిలి వెళ్లడం.  పిల్లల్ని ఎవరు చూసుకుంటారు... ఎందుకో కొంచం దిగులు వేసింది. ఎప్పుడూ లేనిది మొదటి సారి నా ఎవరెస్టు కల తప్పేమో అనిపించింది. ఈ ఆలోచనలతో రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు.

పొద్దున్నే లేచి వాకింగ్ వెళ్లి వచ్చే లోపు ఇంట్లో అత్తయ్య మమ్మయ్య గారు.  నేనేమో ట్రాక్ సూట్  లో నాకు కొంచం సిగ్గేసింది. మా వారు చిలిపిగా చూస్తున్నారు.  వాళ్ళను కుశలమడిగి వెంటనే చీర లోకి మారి పోయా..

పిల్లలు స్కూల్ కెళ్ళి పోయాక వాళ్లిద్దరూ నన్ను అన్ని వివరాలడిగారు... మా వారు ముందే చెప్పినట్టున్నారు.. ఈయనే వొప్పించారో లేక వాళ్ళు ఒప్పుకున్నారో కానీ నన్ను చాల ఎంకరేజ్ చేశారు. నిజంగా ఏ జన్మలో పుణ్యమో ఇలాంటి ఇల్లు దొరకడం. మొత్తం ఏర్పాట్లు మా వారే దగ్గరుండి చూసుకుంటున్నారు. టిక్కెట్లు బుక్ చేయడం దగ్గరనుంచి ఇన్స్టిట్యూట్ వాళ్లతో మాట్లాడ్డం వరకు అన్ని తానే చేశారు. తనకు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే అనిపించింది. నా భుజం తట్టి నన్ను వెన్నంటి నడిపిస్తున్నారు. రేపే ప్రయాణం నన్ను అక్కడ దిగపెట్టి వస్తారు. వెళ్లే ముందు అమ్మ నాన్న కూడా వచ్చారు వాళ్లకు ఎలా చెప్పాడో వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఎందుకో పిల్లలను వదిలి వెళ్తుంటే కళ్ళెంబట నీళ్లొచ్చాయి. అత్తమ్మ " అమ్మా, పిల్లల గురించి నీవేమి దిగులు పడకు వారి బాగోగులు చాలా జాగ్రత్తగా చుసుకుంటా" మని చాలా భరోసా ఇచ్చారు. ధైర్యం చెప్పి నన్ను నా కల సాకారం వైపుకు నడిపించారు. నీ సంకల్పానికి మా ఆశీర్వాదం తప్పక వుంటుంది వెళ్ళు నీవనుకున్నది సాధించు అని ఆశీర్వదించి పంపారు.

************

నెహ్రు ఇన్స్టిట్యూట్ అఫ్ మౌంటెనీరింగ్ ఉత్తర కాశి.. ఇందులో నన్ను జాయిన్ చేసి మా వారు వెళ్లి పోతుంటే కొద్దిగా భయం వేసింది. తనే ధైర్యం చెప్పారు.

" నీ విజయాన్నీ అడ్డుకొనేది నీలోని ప్రతికూల ఆలోచనలే. నైపుణ్యం ఒక నిరంతర సాధన. భయపడి చేసే ప్రయత్నం ఆపితే ఇక నీవు ఎన్నటికీ సాధించ లేవు. ఒక గృహిణి ఎవరెస్టు ను అధిరోహించ గలిగింది అంటే అది నీ ఒక్కదాని విజయం మాత్రమే కాదు ఎందరికో స్ఫూర్తి అంతే కాదు  గృహిణి అంటే చులకన గా చూసే  వ్యక్తుల ఓటమి. వెళ్లు ఏమాత్రం అనుమానం వద్దు. నీ ప్రేమను సాకారం చేసుకో..!" అని నాకు కొండంత బలాన్ని ఇచ్చి తను మద్రాస్ వెళ్లిపోయారు.

అంతా కొత్తగా ఉంది. మొదటి రోజే ఎవరెస్టు అధిరోహణ అంటే తెలిసి తెలిసి మృత్యు ముఖం లోకి వెళ్లడమే అని స్టార్ట్ చేసారు. ఈ మాట వినగానే నాకు నా భర్త పిల్లలు మెదిలారు. నేను చేస్తున్నది కరెక్ట్ కదా అని మళ్ళీ భయం వేసింది. కానీ పోను పోను వీళ్ళ ట్రైనింగ్ నన్ను పూర్తిగా మార్చేసింది. 5 నెలల కఠిన శిక్షణ, అందులో భాగంగా వ్యక్తిత్వ వికాసం తరగతులు కూడా. నాలో చాల మార్పు వచ్చింది. మునపటి బేలతనం, వాగుడు స్థానం లో ఒక డిగ్నిటీ వచ్చిందనిపించింది. చాలా సార్లు ఈ శిక్షణ తీసుకో లేక వెనక్కు వెళ్ళి పోదాం అనిపించేది కానీ ఏదో ధైర్యం నన్ను అక్కడే ఉంచింది. సెల్ ఫోన్ల పుణ్యమా అని రోజు నా వాళ్ళతో వీడియో కాల్స్ అందువల్ల వీళ్ళను ఎక్కువ మిస్ అయ్యాను అని అనిపించ లేదు...

5 నెలల తర్వాత మౌంటెనీరింగ్ లో ఫిట్ అన్న సర్టిఫికెట్ తో ఇంటికి వచ్చా. ఉత్తర కాశీ లో ఉండగానే ఎవరెస్టు సమ్మిట్ హిమాలయన్ ఎక్సపెడిషన్ అన్న సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని వచ్చాను. నాకు తెల్సి మావారు  లేకుండా నేను తీసుకున్న పెద్ద నిర్ణయం ఆఫ్ కోర్సు తన సలహా తోనే. ఇంకో వారంలోనే  మా సమ్మిట్ స్టార్ట్ అని చెప్పారు దానికి అవసరమైనవన్ని  ఈ కంపెనీ వాళ్లే సమకూరుస్తారు. ఒక గైడ్, సామాన్లు మోయడానికి షేర్పాలు, బేస్ క్యాంపు లో టెంట్లు, మా తిండి తిప్పలు, డాక్టర్లు అన్ని వాళ్ళే చూసుకుంటారు. అందరిని ఫలానా తేదీకల్ల ఖాట్మండులో కలవమని మాకు ఐడీ కార్డ్స్ అవి జారీ చేశారు. నేను మద్రాస్ వచ్చి ఒక సారి అందరితో గడిపి వెళ్లాలని నిర్ణయంచుకొన్నా. ఎందుకంటే విజయమో వీర స్వర్గమో తెలియదు కదా. ఈ సారి ఈ తలపు నన్ను భయ పెట్టలేదు.

నాలో మార్పు చూసి మా వారు చాలా ఆశ్చర్య పడ్డారు. అత్త మామలు అమ్మా నాన్నలు నా పిల్లలు అంతా చాల ఎక్సయిటింగ్ గా వున్నారు. మొత్తానికి నేను బయలు దేరాల్సిన సమయం వచ్చింది ఒక సారి హరి గారిని కూడా కల్సి ఆయనకు థాంక్స్ చెప్పాను. ఆయన నాకు సారీ చెప్పి  బెస్ట్ విషెస్ చెప్పాడు. మా శ్రీవారి, పిల్లల ఫోటో మా వెంకప్పకు గుడి కట్టాలి కదా స్వామి పటము ఇంకా కొన్ని జ్ఞాపకాలు  తీసుకొన్నా.. మా వారి సహకారం లేకపోతే ఈ సమ్మిట్ అస్సలు అయ్యేదే కాదు. ఇంత మంచి భర్తను ఇచ్చినందుకు ఆ శ్రీవారికి మా అత్త మామలకు మా అమ్మా-నాన్నలకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నా. చాల ఉద్వేగ భరితమైన వీడుకోలు తీసుకొని చెన్నై నుంచి కాట్మండు కు బయలుదేరా...ఈసారి ఒంటరిగా...

కాట్మండు విమానాశ్రయంకు హిమాలయన్ ఎక్సపెడిషన్ వాళ్ళు టాక్సీ పంపారు. డైరెక్ట్ గా వాళ్ళ హోటల్ కెళ్లా.. సాయంత్రం పశుపతి నాథున్నీ దర్శిఒచుకున్నా.

మా టీమ్ లో మొత్తం  200 మంది వరకు వుంటారు. మరు రోజు ఉదయమే మా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం లో లుక్ల చేరుకున్నాము. ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకొని మరు రోజు ఉదయం కాలి నడకన ఐదు రోజుల ట్రెక్కింగ్ అనంతరం ఎవరెస్టు బేస్ కాంప్ చేరాం. అక్కడ మా కోసం మంచి టెంట్లు మిగితా ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి...బేస్ క్యాంపు లోనే 10 రోజులు పాటు ఉన్నాము. హిమాలయాల వాతావరణానికి అలవాటు పడ్డానికి, ఆ తర్వాత అక్కడ తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నింటి మీద మరోసారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ సెల్ ఫోన్స్ పని చేయవు. ప్రతి రోజూ ఒక సారి మన వాళ్లతో శాటిలైట్ ఫోన్స్  ద్వారా మాట్లాడే అవకాశం ఇస్తారు.

బేస్ కాంప్ నుంచి అల్లంత దూరంలో ఎవరెస్టు చాల గంబీరంగా నన్ను జయించాలనుకుఒటున్నావా!!! అని సవాల్ విసురుతున్నట్టు ఉంది. నాకేమో నా తొలిప్రేమను ముద్దాడాలని కోరిక. వచ్చేసా...! నీ దాకా వచ్చేసా...! ఒక ఉద్విగ్నఒ..ఒక సంతోషం...అసలు ఊహించను కూడా లేదు యూట్యూబ్ లో చేసి మురిసి పోవడం తప్ప. యూట్యూబ్ లో కంటే కోటి రెట్లు అందంగా వుంది. నిజమే హిమగిరి సొగసులు మనసుని మురిపిస్తున్నాయి...  ఆ రోజు రానే వచ్చింది వాతావరణాన్ని అంచనా వేసి వాతావరణం అనుకూలంగా ఉందని నిర్ణయంచుకొని పొద్దున్నే 4 ఎక్సపెడిషన్ స్టార్ట్ అని మా గైడ్ చెప్పాడు..అతనికి దీని మీద అపారమైన అనుభవం వుంది. తీసుకో వలసిన జాగ్రత్తలు అన్నీ మళ్ళీ ఒకసారి వివరించారు. మా సామగ్రి మోయడానికి షేర్పాలు కూడా సిద్ధమయ్యారు. రాత్రి నా వాళ్లందరిని పలకరించా. అందరు అల్ ది బెస్ట్ చెప్తుంటే మనసుకు చాల ఉల్లాసంగా అనిపించింది. ఇకపై వారితో నేరుగా సంభాషించడం కుదరదు. మా బాగోగులు ఎప్పటికప్పుడు ఈ కంపెనీ వాళ్లే మా ఇంటికి చేరవేస్తారు.

పొద్దున్నే అందరు సిద్ధం.. అందరిలో ఏదో ఆనందం, ఒక ఉద్వేగం...  నా వాళ్లని తలచుకొని వేంకన్నకు మొక్కుకొని నడక ప్రారంభించాం... మొదటి రోజు ప్రయాణం బాగా సాగింది. అలా రెండోరోజు ...ఒక్కొక్క క్యాంపు ఎక్కుతూ...అలా 4 రోజులు గడిచాయి... తెల్లవారి 4 గంటలకు అధిరోహణ మొదలవుతుంది, సాయంత్రం 4 గంటలకు స్టాప్ అవుతుంది. తర్వాత టెంట్లలో ఉండి పోవడం... షెర్పాలు మా కోసం తినడానికి తయారు చేసే వాళ్లు.. ఇక మిగతా టైం అంతా టెంట్లలోనే ఉండిపోవడఒ. ఇంత వరకు బాగా గడిచాయి. 4 వ రోజు రాత్రి పడుకొనుంటే  మా చిన్నోడు పిలుస్తున్నట్టు అనిపించి మెలుకువ వచ్చింది.  టెంటు తెరిచి  బయటకు వస్తుంటే ఒకే పెద్ద మంచు చరియ చాల వేగంగా మా వైపు దూసుకొస్తోంది. నేను విజిల్ ఊది అందరిని అలర్ట్ చేసే లోపలే అది మా గుడారాలను తనలో కలుపుకుంటూ వెళ్లి పోయింది.. ఒక అరగంట పాటు కంటి ముందు ప్రళయ బీభత్సము... ఎవరెవరు వున్నారా అని మేము చూసుకుంటే మా టీం లో ఇద్దరు గల్లంతు. ఎందుకో వాళ్ళ ఫ్యామిలీస్ గుర్తుకు వచ్చి చాల బాధ వేసింది భయం కూడా వేసింది. మా గైడ్ ఇలాంటివి ఎన్నో చూసుంటాడు అతడు మామ్మలందర్నీ సమావేశ పరిచి ధైర్యం నూరి పోసాడు. ఇక్కడ భయం చాలా చెడ్డదని షోలే సినిమా డైలాగ్ చెప్పాడు..

జో డర్ గయా సబ్ ఝో ఓ మర్గయా

అని చెప్పి.. ఇది చిన్న చర్యే అని మమ్మల్ని ఊరడించి మాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఇంక ఆ రాత్రికి ఎవ్వరం నిద్రపోలా. పాపం షేర్పాలు ఆ మంచులో నుంచి సామాన్లు మూట గట్టడానికి చాలా కష్ట పడుతున్నారు.. నాకు మాత్రం రియల్ హీరోస్ ఈ షెర్పస్ అనిపించింది..  వారికి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే.

మరుసటి రోజు యధావిధిగా ట్రెక్కింగ్ మొదలైంది. దారి వెంబడి చాలా చోట్ల చెత్త పేరుకు పోయింది. ప్లాస్టిక్ బెడద, ఇక్కడ కూడా తప్పలేదు.. కొన్నిచోట్ల శవాలు కూడా చూసాము.. ఒక చోటైతే లేలేత ప్రాయపు అమ్మాయి మంచు బొమ్మలా అలాగే కూర్చొనుంది. తనను చూడగానే గుండె తరుక్కుపోయింది.

ఇక ఇక్కడి క్యాంపు తో షేర్పాలు ఆగి పోతారు. ఇంక ఎవరెస్ట్ చివరి పీక్. ఇది  ఎక్కితే ఎవరెస్టు ను జయిఒచినట్టే.. ఈ ఒక్కటే చాల భయంకరమైంది. మాకు జాగ్రత్తలు చెప్పి అన్ని కరెక్ట్ గా వున్నాయేమోనని చెక్ చేసుకోమని గైడ్ కూడా ఇక్కడితో ఆగి పోయాడు. ఫైనల్ సమ్మిట్ అయ్యాక ఇక్కడకే చేరుకోవాలి..

ఫైనల్ సమ్మిట్ కు బయలు దేరాము.. చాల కష్టతరమైన దారి. అరవీర భయంకరంగా ఉంది ఎవరెస్టు పీక్ అదేమైతే ఏమి.. మానవుని సంకల్పం ముందు ఓడిపోయింది.  చివరకు చాలా ప్రయసతో  ఎవరెస్టును అధిరోహించా. కళ్ళెంబడి నీళ్లు. ఎక్కేసా.... ఎవరెస్టు పీక్ మీదున్నా.. ఎవరెస్టు చిటారు కొమ్మ  పైన వున్నా... నా వాళ్ళిచ్చిన బలం నా వెంకన్న ఆశీస్సులతో నా ప్రేమను జయిఒచా.... నేను గెలిచా అని దిక్కులు పిక్కటిల్లేలా అరవాలనిపించింది....ఆనందం పట్ట లేక పోయా... నా ఆనందం వర్ణించడానికి మాటలేవి.... పీక్ పైన ఎక్కువ సమయం ఉండదు. నా వాళ్ళ ఫొటోతో ఒక ఫోటో, నా దేశపు జెండాతో ఒక ఫోటో దిగేసి మిగితా వాళ్ళు ఫోటోలు దిగేలోగా చిన్న గుడి కట్టేసి మా వెంకన్నను ఎవరెస్టు మీద ప్రతిష్టించేసా. నాతో కూడా తెచ్చుకున్న కొన్ని జ్ఞాపకాలను ఎవరెస్టు మీద నిక్షిప్తం చేశా. సగర్వఒగా ఈ భూమి మీద అన్నిటి కన్నా ఎత్తైన చోట నేను... అందర్నీ గెలిచా... నన్ను నేను గెలిచా ... ఆ మధుర ఘట్టాలన్నీ ఫొటోలో రూపం లో దాచుకొని దిగడం ప్రారంభించాము. మాములు మనిషిగానే  పుట్టాను కానీ మరణం మాత్రం ఖచ్చితంగా ఘనం...

మొత్తానికి ఏ ఆటంకం లేకుండా ఐదు రోజుల అనంతరం తిరిగి బేస్ క్యాంపు చేరుకున్నాము. మేము అక్కడికి చేరుకో గానే క్యాంపు లో వున్న వాళ్ళంతా చాల ఘనంగా స్వాగతమ్ చెప్పారు. అదో వర్ణనాతీత అనుభవం. ఎవరెస్టును అధిరోహించాక నా వాళ్లు మాట్లాడుతుంటే ఒక్క మాట పెగల్లేదు. నా పిల్లలు నన్ను మెచ్చుకుంటుంటే ఏమని చెప్పను? అది అనుభావిచాల్సిందే కానీ వర్ణించ తరమా..!

నాలుగైదు రోజుల విశ్రాంతి తర్వాత వచ్చిన మార్గం లో లుక్ల....అటు నుంచి కాట్మండు చేరుకున్నాము. ఎప్పుడెప్పుడు నా వాళ్ళను చూస్తానా అనిపించింది. ఖాట్మండు లో  విమానం దిగి బయటకు రాగానే నన్ను సర్ ప్రైజ్ చేస్తూ అత్తా మామ అమ్మ నాన్న నా పిల్లలు మా శ్రీవారు ఘనంగా స్వాగతం పలికారు. నా పిల్లలను గట్టిగ హత్తుకున్న తర్వాత కానీ నేను ఈ లోకం లోకి రాలేదు. నిజంగా మావారు ఎవరెస్టు అంత గ్రేట్. ఇలా సర్ ప్రైజ్ చేస్తారని తెలీదు.... అందరం కల్సి పశుపతి నాధుణ్ని దర్శించుకొని తిరుగు ముఖం పట్టాము.. చాలా సంతోషంగా కొన్ని వేల జ్ఞాపకాల మధురిమలతో నేను..

******************

విమానాశ్రయంలో దిగగానే విలేకర్లు నన్ను చుట్టుముట్టారు... అందరు కంగ్రాట్స్  చెప్తుతుంటే... చిన్నప్పుడు బచేంద్రిపాల్ ఇంటర్వూవులో లో నన్ను ఊహించుకొనేదాన్ని ఇప్పుడు నిజంగానే ఆ ప్లేస్ లో నేను వున్నా. ఇదంతా చూస్తుంటే మళ్లి ఎవరెస్టు ఎక్కినంత ఆనందంగా వుంది. చివరిగా గర్వఒగా అందరికి చెప్పా... ఎప్పటి నుంచో ఈ ప్రపంచానికి గట్టిగా చెప్పాలనుకున్న మాట... నా ఈ ఎవరెస్ట్ అధిరోహణ ఎవరెస్ట్ కొండంత అండగా నిలబడ్డ నా భర్తకు అంకితమని.

మా వారి కళ్ళల్లో ఆనంద భాష్పాలు... అవి దాయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం నా హ్రదయాన్ని తడిపేసాయి.

ఆ క్షణం మళ్ళీ అబ్దుల్ కలామ్ గారి మాటలు గుర్తుకొచ్చాయి.

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి

అదండి ఇప్పటికి ఇది జరిగి 8 సంవత్సరాలు గడిచి పోయాయి. కానీ దాని తాలూకు చల్లటి జ్ఞాపకాలు చాలా పదిలంగా ఉన్నాయి. దాని తర్వాత ప్రపంచ ప్రసిద్ధి చెందిన మరిన్ని పర్వతారోహణలు దిగ్విజయంగా ముంగించా. కానీ ఎవరెస్టు ఎవరెస్టే.... ఇప్పుడు నేను మద్రాస్ లో సాహస క్రీడల మీద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్  ఓపెన్ చేశా. ఇప్పుడు నేను కేవలం గృహిణిని కాదు సాహస యాత్రలు చేసే వాళ్లకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటా.... ఎవరెస్టు నా జీవితాన్నే మార్చేసింది. మన కలలను సాకారం చేసుకోవాలంటే దృఢ సంకల్పం కఠోర శ్రమ అంతే... ఎవరెస్టు నీకు దాసోహఒ అనక మానదు.

నీ ఆశయ సాధన లో ఎన్నిసార్లు విఫలమైనా సరే ప్రయత్నం మాత్రం విడువకు ఏదో ఒక రోజు ఎవరెస్ట్ నీదవుతుంది.

మరిన్ని కథలు
korivi deyyam