Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
naa evarest

ఈ సంచికలో >> కథలు >> కొరివి దెయ్యం.

korivi deyyam

ఒళ్ళంతా బురద తో నిండి పోయి పడతా లేస్తా పరుగెత్తుకొని వస్తున్న నా వెంట కుక్కలు కూడా పరుగెత్తుకుంటూ రావడంతో మా ఇంటి పెద్దగేటు ఎక్కిదూకి, లోపలికి వచ్చాను. వచ్చి భయపడుతూ మా ఇంటి తలుపు కొట్టాను. మా అమ్మ తలుపు తీసి నా అవతారాన్ని చూసి నన్ను గుర్తు పట్టక గట్టిగా అరిసిన అరుపుకు ఊర్లో జనం అంతా కర్రలు తీసుకుని మా ఇంటికి వచ్చేసారు. నేను ఒళ్లంతా నిండి ఉన్న బురద పోవడానికి స్నానము చేసి వచ్చేసరికి మా ఇంటి ముందర ఉన్న జనంలో ఒకరు ఒక్కసారిగా నన్ను చూసి నవ్వి

"ఏరా.. ఏమైంది?. మీ మహేషన్న యాడ."? అని అడిగాడు.

నేను కాస్త భయంతో వణుకుతూ "మహేషన్నను, నన్ను బాయి కాడ కొరివి దెయ్యం చూసింది. మమ్మల్ని చంపడానికి మా వెంట పడింది. నేను తప్పించుకున్నాను. మహేషన్న ఏమైనాడో నాకు తెలీదు" అన్నాను.

అప్పటికే కంగారుగా ఉన్న మా పెద్దమ్మ మహేషన్న పరిస్థితి తలుచుకొని ఏడవడం మొదలు పెడితే మా పెద్దయ్య కసురుకొని "అసలు ఏమైంది రా? " అని అడగడంతో,  ఆరోజు జరిగింది అంతా గుర్తు చేసుకొని వాళ్లకు చెప్పాను.

******"

అప్పటికి నా వయసు పదకొండు ఏండ్లు. మా మహేషన్నకు ఇరవై ఏండ్లు. అనంతపురం జిల్లాలో మాది ఒక మారుమూల పల్లెటూరు. ఎప్పుడు కరువుతో పోరాటం జేసే మా ఊరి రైతులకు ఉన్న నీళ్లను ఎట్లా పొదుపుగా వాడుకోవల్నొ బాగా తెలుసు. కరెంటు కోతలు, రాత్రి పూట బాయి కాటికి పోయి పండుకోని ఎబ్బుడో అర్దరాత్రి లో కరెంటు వచ్చినంక బాయి మోటారు ఏసి పంటకు నీళ్లు పారదిప్పుడు మావోల్లకు ఏమీ అలవాటు లేని పనులు కాదు గానీ చిన్న పిల్లొన్ని అయిన నాకు, పెద్దగా ఉన్న కూడా పిల్లోడే అయిన మా మహేషన్నకు కొత్తే.
మామూలుగా పంటకు నీళ్లు పారదిప్పేకి మా అప్ప ( మేము నాయన్ని, నాయన, అప్ప అని కూడా అంటాంలే) పెదనాయిన పోతారు.
ఎండాకాలం కాలం సెలవుల్లో ఎబ్బుడన్నా నేను కూడా మా అప్పతో కలిసి బాయికాడికి వస్తా అని చానా సేపు ఆగడం చేస్తే, నా పోరు పడలేక నన్ను కూడా పిలుకొని పొయ్యేవాడు. మొబ్బుకు ఏమన్నా పురుగు, పుట్రా ఉంటాయి పిల్లొల్లకు యాల ఈ కష్టాలు అని మా నాయన బాధ.
నాకు మొబ్బు(చీకటి) అంటే శానా భయమైనా ఎట్లొగట్ల గొడవ జేసైనా సరే బాయి కాడికి పోయి మా అప్పతో పాటి  పడుకోవల్ల అంటే నాకు భలే ఇష్టం. మా అప్పతో పాటు నడుస్తా ఉంటే భయం అనేది తెలిసేడిది కాదు.

కానీ ఎబ్బుడు కాలం ఒగటి గానే ఉండదు కదా.

ఆ పొద్దు సాయంత్రం మా అప్ప రేషం గూళ్ళు (మల్బరీ గూళ్ళు)అమ్ముకోని రావడానికి అని ధర్మారం పొయ్యేకి బయలుదేరినాడు. మా ఊరు నుండి ధర్మారం పోవల్లంటే సందకాడ చింతామణి అనే ఒగటే బస్సుండేది.

రెండు రోజుల నుండి కరెంటు సరింగా లేక మా టమోట సెట్లకు కు నీళ్లు పెట్టేకి కుదర్లా..

అందుకని మా అప్ప మా పెద్దయ్య దగ్గరకు పోయి, రాత్రి కి మా టమోట సెట్లకు కూడా నీళ్లు పెట్టమని చెప్పినాడు. పాపం మా పెద్దయ్య కు కూడా ఆ పొద్దు ఒళ్లు నొప్పులుగా ఉండాది నేను ఈ పొద్దు పోలేను అని చెప్పినాడు. ఇప్పటికే పంటకు నీళ్లు పెట్టి రెండు దినాలైంది ఈ పొద్దు కూడా నీళ్లు పారదిప్పక పోతే పంట దెబ్బ తిని పోతాది. రేషం గూళ్ళు కూడా ఆ పొద్దే ధర్మారం కు కూడా ఏసుకోని పోవల్ల ఈ రెండు పనుల్లో ఏది చేయల్లో అర్థం కాక ఆలోచిస్తున్న మా అప్పకు మా పెద్దయ్య కొడుకు మహేష్ వరంలాగా కనబడినాడు. దాంతో మా అప్ప మహేన్నను పిలిచి రాత్రికి ఎట్లన్నగాని టమోట సెట్లకు నీళ్లు పెట్టమని అడిగినాడు. దానికి మా మహేషన్న "రేపు పొద్దున్నేనే నీళ్లు పారదిప్పుతాలే చిన్నాయినా" అన్నాడు.

"రేపు పగలు కరెంటు ఉంటాదో, పోతాదో ఎవడికి తెలుసు? ఈ పొద్దు రావిటాల (రాత్రికి) కరెంటుకు ఎట్లన్నగాని పంటకు నీళ్లు పెట్టాలి. లేకపోతే పంట దెబ్బ తింటాది" అని మా అప్ప మహేష్ అన్నని అడిగాడు.

అప్పుడు మా మహేషన్న అయిష్టంగా ముఖంపెట్టి "ఈ పొద్దు  రాత్రికా" అని నసిగాడు.

"ఔ..అప్ప ఈ ఒగసారి అట్లసూడు. నీకు భయం అయితావుంటే మావోణ్ణి కూడా పిలుచుకోని పో" అని అప్పుడే ఉగాది పండుగ అని ఊరంతా తిరిగొచ్చిన నన్ను మహేషన్నకు చూపించాడు మా అప్ప.

ఎప్పుడూ ఏడిసి గోల చేస్తే గాని తీసుకెళ్లని మా అప్ప బాయి కాటికి పోవల్ల అనే మాట చెప్పగానే నాకు భలే సంతోషం అనిపించింది. అది చూసి మహేషన్న "నాకు భయం ఏమిలా చిన్నాయనా. నువ్వు మళ్లా అంతగా ఏమడుగుతావులే గాని, నేను వాడు పోతాం లే"అన్నాడు.
అది విని మా అప్పకు కాసింత సంతోషపడినాడు.

"సాయంత్రం అన్నతో పాటి బాయి కాటికి పో"అని నాకు చెప్పి మా అప్ప రేషం గూళ్ళు సంచి ఎత్తి 'చింతామణి' బస్సు టాపు మీద పడేసి బస్సులో కుసోని ధర్మారం కు పోయినాడు.

నేను ఆ పొద్దు రాత్రి మా అమ్మ చేసిన రాగి ముద్ద, కొయ్యిగూరకు తాలింపు, పప్పు ఏసుకోని తొందరగా బువ్వ తినేసి మా మహేషన్న ఎబ్బుడొస్తాడా? బాయి కాడికి ఎబ్బుడు పోదామా అని మా ఇంటి ముందు ఉన్న పెద్ద బండ రాతి అరుగుమీద కుసోని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.

ఇంతలో మా మహేషన్న బ్యాటరీ లైటు లోకి పెద్ద సెల్సులు ( అప్పట్లో ఏవెర్య్ దయ్ సెల్స్) ఏసి లైటు సరింగా పనిజేస్తాందా లేదా అని లైటు నా ముఖానికి ఏసినాడు.

నేను ఆ బాటరీ లైటు వెలుతురు నేరుగా సూడలేక కండ్లకు చేతులు అడ్డుపెట్టుకున్నాను.

మహేషన్న బాటరీ లైటు బాగానే పని చేస్తాండాదిలే అనుకొని లైటుఆఫ్ చేసి "ఇంగ పదాంపా ప్పా బాయి కాడికి" అని నన్ను తొడుకోని అర్ద కిలోమీటరు అవతల రైలు రొడ్డుకు ఆనుకొని ఉన్న మా బాయి దగ్గిరికి నన్ను పిల్చుకోని పోయినాడు.

అక్కడికి పోయాక మా దిగుడు బాయి లోపల రాత్రి పూట పడుకోవడం కోసం తయారు చేసుకున్న జాగాలోకి పోయి చాప పరచుకొని పడుకున్నాము.

అదెందుకో కానీ మా ఇంటికాడ మా మిద్ది మింద పడుకునే చూస్తే ఆకాశం లో కనబడే చుక్కలు కన్నా బాయి కాడ పడుకున్నప్పుడు ఆకాశంలో చుక్కలు ఎక్కువగా కనబడేవి.

కాస్త దూరంగా మా బాయి గట్టుమీద ఉన్న పోలుమానుకు ఉన్న బల్బులో నుండి వస్తున్న చిన్న కాంతి, గట్టుమీద ఉండే కొబ్బరి చెట్టుకు వీచే చల్లని గాలి వల్ల వచ్చే ఆకుల శబ్దం మా అమ్మ జోలపాటలా అనిపించేది.

నేను కాసింత పక్కకు తిరిగి నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్న మా మహేషన్నను కదిలించి "అన్నా ఇప్పుడు కరెంటు ఉండాది కదా..! మడె ఇప్పుడే నీళ్లు పారదిప్పొచ్చు కదా" అని అడిగాను. దానికి మా అన్న "ఇప్పుడు కరెంటు రెండు కేసులకు ఉండాది. ఈ కరెంటుకు బాయి మోటర్లు పని చెయ్యవు. పదకొండు ముక్కాలు గంట్లకు కరెంటు పోయి మూడు ఫేసులకు వస్తాది. ఆ కరెంటు వచ్చినప్పుడు మోటార్ ఆన్ చేస్తే నీళ్లు పారదిప్పచ్చు" అన్నాడు.

అప్పుడు నేను "ఓహొ" అని కొంతసేపు గమ్మునా ఉండి "అన్నా.. రెండు ఫేసుల కరెంటు, మూడు ఫేసుల కరెంటు అంటే ఏంది?"అని అడిగాను.

దానికి మా మహేషన్న గట్టుమింద ఉన్న కరెంటు పోలుమాను చూపిస్తూ "అద్దొ ఆ పోలుమానుకు మూడు వైర్లు ఉండాయి కదా..! కరెంటొళ్ళు దాండ్లలో రెండు వైర్లలో కరెంటు వదిల్తే రెండు ఫేసుల కరెంటు, మూడు వైర్లకు కరెంటు వదిలితే మూడు ఫేసుల కరెంటు" అని చెప్పి నిద్ర పోడానికి కండ్లు మూసుకున్నాడు.

అది విని కరెంటు గురించి ఇంగా తెలుసుకోవల్ల అని నాకు అని పించి, "అన్నా.." అంటు మహేషన్నని నిద్రలేపబోతే, ఆయన కళ్లు తెరిచి "ఒరా.. కరెంటు వస్తే పంటకు నీళ్లు పెట్టడానికి అర్ధరేతిరిలో  మళ్లీ నిద్ర లేయల్ల. ఇబ్బుడు గమ్మునా పడుకో, పొద్దున్నేకి మాట్లడుకుందాం"అని అనడంతో నేను ఏమి మాట్లాడకుండా గమ్మునా పడుకొనేసినాను.

మళ్లా ఎప్పుడొ అర్ధరేతిరిలో "రేయ్.. కరెంటు వచ్చిండాది లేయ్యి  నీళ్లు కట్టను పొదాము." అనే సరికి నేను కూడా బద్కంగా లేచి అయిష్టంగానే అన్నతో పాటి పోయాను.

మహేషన్న అంతకు ముందు నీళ్లు పారదిప్పిన రేషం చెట్ల 'కయ్యి'(పొలంలో ఒక భాగం) కాడ పైపు మూత బిగిచ్చి, టమాట చెట్లుండే ఎగువ కయ్యి కాడ పైపు మూత ఇప్పి బాయి మోటారు ఆన్ చేసినాడు.

బాయి పక్కనే ఉండే నీళ్ల తొట్టిలో దాపెట్టిన 'పార' దీసుకొని నీళ్లు మడవ ఏసేకి నేను అన్న ఎగువ కయ్యి కాడికి పరుగెత్తినాము.
ఆడ అప్పటికే మా బాయి మోటారు కొట్టే నీళ్ల స్పీడుకు రెండు 'సాళ్లు' తెగిపోయిండాయి.

ముందుగా మా అన్న నీళ్లు పారాల్సిన సాలుకు మడవ తీసి తర్వాత అప్పటికే తెగిపోయిన సాళ్ళు సరిచేసి నీళ్లు అన్ని సక్రమంగా పారదిప్పుతా ఉండాడు. నేను  అన్న ఎటుబోతే అట్లబోయి చేతులు కట్టుకుని గమ్మున నిలబడుకోని అన్నతో ఎందో ఒకటి పొద్దుపోయేకి (టైం పాస్ అంటారేమో దీనిని) మాట్లాడుతా ఉండాను. అన్న కూడా నేను అడిగేదాండ్లకు అన్నింటికీ ఓపిగ్గా జవాబు చెప్తా ఉండాడు.
ఆ అర్ధరేతిరిలో మొబ్బుకి కాసింత దగ్గిరలో ఉండే మా అన్న కూడా నాకు సరింగా కనబడలేదు.

అట్లా టైం లో "అన్న మన ఊర్లో దెయ్యాలుండాయా"అని అడిగినా అంతే,

సాలుకు నీళ్లు పోయేకి మడవ కట్టి నిలబడి ఉన్న మా అన్న చేతిలో నుండి పార జారిపోయి తపక్కుమని కింద పడిపోయింది.
అప్పుడు మా అన్న ఒంగి పార ఎత్తుకుంటా " ఒరా.. యా టైం లో ఏమడగల్నో కూడా తెలీదా?"అన్నాడు.

దానికి నేను "దెయ్యాలు అంటే నీకేమన్నా భయమా అన్న" అని అడిగినా.

"ఏయ్.. ఏందిపా అట్లంటావు. నాకేంది.! దెయ్యాలంటే భయమేంది? నేను మన ఇప్పటికే ఎన్ని కొరివి దెయ్యాలు చూసినానో నాకే లెక్క లేదు " అని మహేషన్న అన్నాడు.

"అయితే కొరివి దెయ్యాలు ఎట్లుంటాయో చెప్పు నా" అని నేను అడిగాను.

"న..ల్ల.. గుడ్డలు ఏసుకొని, నెత్తిన మూకుడు( ఒకరకమైన మట్టి పాత్ర) లో భగభగ మండే నిప్పులు మంట పెట్టుకొని అమవాసి చీకట్లో తిరుగుతూ ఉంటాయి. అవి అట్లా తిరిగేటప్పుడు ఎవురన్నా మనుషులు కనబడితే, నెత్తి మీద ఉండే కొరివి తోనే మనుషుల్ని తగలబెట్టి సంపేస్తాయి" అని  అన్నాడు.

మా మహేషన్న కొరివి దెయ్యాలు గురించి ఇట్లా చెప్పగానే వాటి ఆకారాన్ని ఊహించుకుని నేను భయ్యంతో బిక్కచచ్చిపోయి చాలా సేపు ఏమీ మాట్లాడలేకుండా పోయాను.ఎందుకో అది విన్నప్పటి నుండి నాకు కాసింత భయం ఎక్కువ అయింది. దాంతో నేను మహేషన్నకు మరింత దగ్గరికి పోయి నిలబడు కున్నాను.

అలా నాలో భయం వల్ల వచ్చిన మార్పుకి మహేషన్న లోపల నవ్వుకున్నట్లుండాడు.

అట్లా చాలా సేపు అయిన తరువాత కయ్యిలో చివరి సాలుకు నీళ్లు పెడుతుండగా నేను నోరు తెరిచి "అన్నా.."అని నేను మహేషన్నను పిలిచాను.

మడవ కడుతున్న మహేషన్న తల కూడా పైకెత్తకుండా "ఏమప్పా?" అని అడిగాడు.

"అదేందో చూడునా, నాకు యాలనో అనుమానంగా ఉండాది" అని నేను చెప్పగానే మడవ కట్టేసి మా అన్న లేచి కాస్త వెనక్కి తిరిగి చూసినాడు. దూరంగా కదులుతూ తమవైపు వస్తూ ఒక నిప్పు మంట కనబడింది. బయటకు చెప్పలేదు గానీ దాన్ని చూడగానే మా మహేషన్నకు చానా భయం వేసింది.

ఆ నిప్పు కొరివి ఏందో మా కల్లనే (వైపు) వస్తాండాది. అది చూసి ఇంగ భయం ఆపుకోలేక మా అన్న వణికిపోతా "రేయ్..! కొరివి దెయ్యం అని ఇప్పటిదాంకా చెప్పుకుంటిమే, అదేరా ఇప్పుడు మన కల్లే వస్తాండాది. ఇంగ ఏమి చెయ్యల్లరా? ఆ కొరివి దెయ్యం కంట్లొ పడినామంటే కాల్చి బొగ్గు చేసేస్తాది" అన్నాడు.

అప్పటి దాంకా మా అన్నను చూసుకోనే అంతో ఇంతో ధైర్నంగా ఉంటి. మా అన్నే భయంతో వణుకుతా ఉంటే ఇంగ నా కథ చెప్పేవు.. పరుగిత్తా పోయి అన్న చెయ్యి పట్టుకోని భయంగా "అదేంది నా,  శానా కొరివి దెయ్యాలు చూసినా వంటివి. దీనికి యాల న్నా అట్లా భయపడతా ఉండావు" అని అడిగినా.

"అంటే అబ్బుడు నేను దాండ్లను చూసినా గాని అవి నన్ను చూడలేదు. ఇది మాత్రం మన కల్లే వస్తాండాది అంటే ఇది మనల్ని చూసేంసుండాదేమో అని అనిపిస్తాంది. ఇప్పుడు ఏంచేయల్లోనే" అని మా అన్న అటుఇటు తిరుగుతా కంగారు పడిపోతుండాడు.
"అన్నా..! అది మన తావుకి(దగ్గరకు) రాకనే మన ఊరికి పరుగెత్తుకొని పోదాం పా " అన్నాను నేను.

"కొరివి దెయ్యాలు మనం పరుగెత్తుకొని పోయేది చూసినాయంటే అవి ఎగురుకుంటా వచ్చి ఇంగా భయంకరంగా చంపుతాయి" అని మా అన్న అనేసరికి,

ఏమీ చేయల్నొ నాకు దిక్కు తెలీక " ఇప్పుడు ఏమి చెయ్యల్ల" అని అన్నను అడిగాను.

"ఆ దెయ్యానికి కనబడకుండా యాడొ ఒక తాన దాక్కొవాలి." మహేషన్న చెప్పినాడు.

అప్పటికే భయంతో వాణికి పోతున్న నేను " అది పాత బాయి దాటుకుని మన కల్లే వస్తాండాది. యాడ దాంకోవల్లో తొందరగా చెప్పు అన్నా" అని అన్నాను.

మహేషన్న కూడా కూడా కంగారుగా అటుఇటు చూసి పక్కనే వరి మడి నాటేకి చాడకు ఏసిన పైడి వాళ్ల కయ్యి చూపిచ్చి ( దున్ని సిద్ధం చేసిన బురద చేను) "అరేయ్.. దాంట్లో దాక్కుందాం" అన్నాడు.

"అదెట్ల అన్నా?"అని నేను అడిగాను.

మహేషన్న చేతిలో ఉన్న పార ఆడ పడేసి పరుగిత్తా పోయి బురద మడిలో పడుకునేసి" నువ్వు కూడా బిరిక్కినా (తొందరగా) రారా" అన్నాడు.

నేను కూడా పరిగెత్తి పోయి అన్న పక్కనే పడుకునేసినాను.నేను, అన్న దెయ్యం యాడ వస్తాందా..! అని మళ్ళీ దాని వంక తల తిప్పి చూసినాము...

దాని ముండమోయా ఆ దెయ్యం అబ్బుడే పాతబాయి దాటుకునేసి దిగవ కయ్యి కాడ నుండి మా వైపే వస్తా కనబడింది.

"అన్నా... అది ఇట్లే వస్తాంది"అని దాదాపు భయము, ఏడుపు కలగలిపి అన్నకు చెప్పినా.

"రేయ్..మన తలకాయిలు దానికి కనబడతాదేమో రా, తల కూడా బురదలో ముంచేయ్ అన్నాడు. అన్న చెప్పగానే బురద పడకుండా ఉన్న తలకాయిలను కూడా అన్న చెప్పినట్లు బురదలో ముంచి లేపినాము. ఇప్పుడు నిండా బురదతో నిండి పోయినాము అనుకో.
మా కర్మ ఏముండాదో కానీ ఈ పొద్దు ఆ కొరివి దెయ్యం కల్లే వస్తాండాది. అదే విషయం భయం తట్టుకోలేక అన్నకు చెప్పినా..
"ఒరా..! ఇప్పుడే భయపడి సస్తా ఉంటే ఇంగా ఎందుకురా అట్లా భయపెడతావు గమ్మున పడుకోరా" అని అన్న భయానికి గొంతు అణచి పెట్టుకుంటా నన్ను నెమ్మదిగా కసురుకున్నాడు.

నేనేమీ మాట్లాడకుండా ఆ కొరివి దెయ్యం యాడ వస్తాందా అని మళ్ళీ దానికల్ల చూసినా అది దిగవకయ్యి కూడా దాటుకోని మా కల్లనే వస్తాంది.

అది ఇంగ మన తాయికి(దగ్గరకు) వచ్చేకి ఒక కయ్యె ఉండేది అని అన్నకు చెప్దాం అని మహేషన్న మింద చెయ్యి ఏయ్యబోతే, చెయ్యి అన్న మీద కాకుండా బురదలో పడింది.

అదేందిరప్పా.. అని పక్కకి జూస్తే ఇంగా యాడుండాడు ఆడ మహేషన్న లేడు. యాటికి పాయిరా ఈ సామి ఇబ్బుడు అని ఎనిక్కి చూస్తే అన్న అబ్బుడే రైలు రోడ్డు ఎక్కి ఆ పక్కకు దూకి ఊరి కల్ల పరిగెత్తుతా ఉండాడు.

ఇంగ నా కథ ఏమి జెప్తావు తీ, అని కొరివి దెయ్యం కల్ల మళ్ళీ ఓ సారి చూసిన అది పైడి వాళ్ల బురద మడి దగ్గిరకి వచ్చేసిండాది.
ఇంగ ఆడనే పడుకోని ఉండేకి నాకు ధైర్యం చాల్లా (సరిపోలేదు). లేచి గట్టిగా అరిసేసిన అంతే ఆ కొరివి దెయ్యం గాల్లోకి ఎగిరింది.
అది చూసి నేను కూడా పడతా లేస్తా రైలు రోడ్డు ఎక్కి దిగి మొబ్బుకి దావా తెన్ను కనబడకున్నా కూడాఊరి వైపు పరుగెత్తినా..! యాడ ఉండే సతవ అంతా పెట్టుకోని ఆ పొద్దు పరిగెత్తినట్లు జెండా పండగ నాపొద్దు పెట్టే పరుగు పందెంలో కూడా పరుగెత్తలా అనుకో పరిగెత్తినా..
ఊరు ముందర చేన్లో (చేనులో) రాళ్ల కటవ కూడా ఎక్కి దూకేసి ఊర్లోకి వచ్చి ఎగపోసుకుంటా  అలుపు తీర్చుకునేకి కొంచెంసేపు అట్లా నిలబడితినో లేదో ఆ వీధిలో ఉండే కుక్కలు అన్ని నా తావుకి వచ్చేసినాయి.

బురదతో నిండి పోయి ఉండే నా ముఖాన్ని అవి గుర్తు పుట్టినట్లు లా..! ఒగటి మొరగడం స్టార్టు చేసాలకే అన్ని మొరుగినాయి. ఇంగ అవిటితాన యాడ కరిపిచ్చు కుంటావు అనుకొని దాండ్లకు దొరక్కుండా మళ్లీ ఊర్లో మా ఇంటి కల్ల పరిగెత్తినా. ఆ కుక్కలు కూడా అరుసుకుంటా నా వెంట పడినాయి. అవి అరిసిండే అరుపులకు ఊర్లో సగం మందికి మెలకువ వచ్చింటాది.

నేను వాటికి దొరక్కుండా పరుగెత్తుకొని పోయి మా ఇంటికి ఉండే పెద్ద ఇనుప కమ్మీల గేటు తీస్తే కుక్కలు కూడా లోపలకు వస్తాయని గేటు ఎక్కి మా ఇంటి ముందరికి దూకినా కుక్కలు లోపలకు రాలేక గేటు బయటే నిలబడి అరుసుకుంటా ఉండాయి.

హమ్మయ్యా అనుకోని నేను మా అమ్మను నిద్ర లేపుదామని తలుపు కొట్టి.. "అమ్మా.. తలుపు తీ అమ్మా "అని అరిచినా.
బయటలైటు ఏసి మా అమ్మ తలుపు తీసి నిద్ర మత్తులో ఉన్న కళ్లు పులుముకొని నన్ను చూడగానే మా అమ్మ అరిసిండే అరుపులకు ఊర్లో మిగిలిన సగం జనాలకు కూడా మెలకువ వచ్చింది. కాక ఊర్లోకి ఎవరు దొంగలు వచ్చిండారను కొని అందరు లేసి కట్లు, కర్రలు పట్టుకుని బైటకు వస్తాండారు.

"అమ్మా.. నేను.. అమ్మా... నేను" అని మా అమ్మ చెయ్యి పట్టుకుని ఊపేదాకా మా అమ్మ అరవడం ఆపలేదు.

అప్పుడు అరవడం ఆపి మా అమ్మ "ఏందిరా.. ఈ అవతారం" అని అడిగింది.

"అదంతా మళ్లా చెప్తా గాని, ముందు నీళ్లు తోడు" అని చెప్పేసరికి పంత (కట్టెల పొయ్యి పక్కనే ఉండే ఒక మట్టి కుండ) లో నీళ్లు బక్కట్లోకి తోడుకోని వచ్చింది.

నేను ఆ బకెట్టు బచ్చలి(బాత్రూం) లోకి తీసుకుని పోతుండగా ఊర్లో జనం అందరూ మా గేటు కాడికి వచ్చేసినారు.

అది చూసి నేను నిలబడితే "ముందు నువ్వు నీళ్లు పోసుకొని రాపో. వాళ్ళతో నేను మాట్లాడతా గాని" అని నన్ను బచ్చలి లోకి తోసింది.
నేను స్నానం చేసి తల తుడుచుకుంటా బయటకు వచ్చేసరికి ఊర్లోని సగం జనం మా అరుగుమీదనే కర్రలు పట్టుకుని కుర్చుని  కనబడినారు. వాళ్లంతా నేను చెప్పింది విని నన్ను చూసి అందరూ ఒకేసారి నవ్వినారు. మా పెద్దమ్మ మాత్రం "మీ మహేషన్న అన్న యాడ సామి"అని భయపడతా అడిగింది.

"అన్న నా కంటే ముందే వచ్చేసినే ఇంగా ఇంటికి రాలేదా?" అని నేను అనేసరికి మా పెద్దమ్మ ఏడుస్తా  " అయితే నా బిడ్డను ఆ కొరివి దెయ్యం ఏమి చెసిందోనే" అని రాగం మొదలెట్టగానే మా పెద్దయ్య లేచి  విదిలిచ్చి"ఆయ్..చీ.. నీ ఏడుపు ఆపు. ఇన్నేండ్ల నుండి మేము ఆ బాయికాడనే సేద్యం చేస్తాండాము. మాకు కనపడని కొరివి దెయ్యాలు ఇప్పుడు కనబడినాయంట. వీడంటే సన్న పిల్లోడు భయపడినాడు అంటే ఒగ అర్థం ఉంది. ఎద్దులా పెరిగినాడు నీ కొడుకు కి ఏమొచ్చింది. భయపడి ఆడాన్న పడుకోని ఉంటాడు. పొద్దున్నేకి వస్తాడులే పా" అంటూ మా పెద్దమ్మను వాళ్ల ఇంట్లోకి తీసకపోయినాడు.

తర్వాత ఒక్కొక్కరు నన్ను చూసి నవ్వుకుంటా వాళ్ళ ఇండ్లకు పోయినారు.

ఆ మరుసటి రోజు మా పెద్దయ్య వాళ్ళ గడ్డి వాములో పడుకోని ఉన్న మహేషన్న పొద్దున్నే గొడ్లకు మేత ఏయ్యను పోయిన పెద్దమ్మకు కనబడి నాడంట. ఊర్లోకి రాగానే కుక్కలకు భయపడి అలా పోయి గడ్డివాములో పడుకున్నాను అని అన్న చెప్పాడు.

ఏమైతే ఏమీ కొడుకు భద్రంగా తిరిగి వచ్చిన దానికి మా అన్నకు దిష్టి తీసి మా పెద్దమ్మ సంతోష పడిపోయింది. ఆ పొద్దు మధ్యానం రేషం గూళ్ళు అమ్ముకోని వచ్చిన మా అప్ప విషయం తెలుసుకుని కొరివి దెయ్యాలు అంట అని నవ్వు కున్నాడు.

కొరివి దెయ్యాలు చూసాము ముర్రో అంటే నా మాట, మా మహేషన్న మాట ఒకరు నమ్మి సావరే అని నాలో నేను రెండు రోజులు బాధ పడ్డాను.

ఆ పొద్దు మా అప్ప నన్ను పిలిచి " ఆ నరసప్ప ఎందుకో రెండు రోజుల నుండి మనం ఆవులు మేపను తీసుకుని పోలేదు. వాడు ఇంటికాడ ఉండడో లేడో చూసి రాపో" అన్నాడు.

నేను నరసప్ప వాళ్ళ ఇంటి కాడికి పోయి సరికి నరసప్ప రగ్గుకప్పుకోని పడుకోని ఉండాడు. రాములమ్మ పక్కనే కుసోని ఉండాది.
నన్ను చూసి రాములమ్మ లేసి నిలబడింది.

"నరసప్ప అన్నకు ఏమైంది.అమ్మా రెండు దినాలనుండి మా ఆవుల కాటికి రాలేదంట ఏమైంది" అని అడిగాను.

"మా ఇంటోడు మొన్న ఉగాది పండక్కి పొలి ఏసిన తర్వాత మనవూరి పోలిమి లో ఉండే కుంటి మారెమ్మ గుడి కాడ ఆచారం ప్రకారం అఖండ్లం (ఒకరకమైన పెద్ద దీపం) ఎలిగిచ్చి మొబ్బుకి కాగడా పట్టుకోని వస్తావుంటే మీ బాయికాడ పైడోల్ల మడిలో దెయ్యాన్ని చూసినాడంట ఆ పొద్దు నుండి ఒకటే జరం సామి. రేపట్నుంచి వస్తాడని మీ నాయనకు అట్లా చెప్పు" అని ఆమె చెప్పేసరికి.

అప్పుడు అర్ధం అయిండాది నాకు... నేను రెండు రోజులకు ముందు మా బాయి కాడ చూసిన 'కొరివి దెయ్యం' ఏందో

మరిన్ని కథలు