Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

“శ్రీదేవి డిగ్రీ కాలేజ్ అధ్యాపక బృందం వారి విహారయాత్ర”

బస్ ముందు భాగాన కట్టి ఉన్న బానర్ చూసిన వారికి అది ఒక పిక్నిక్ పార్టీకి చెందిన బస్ అని అర్ధమైపోతుంది. అది ఒక మినీబస్. దానిలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కలిపి  ఓ పాతిక మంది పైనే ఉంటారు. అందరి కేరింతలు, ఆనందోద్వేగపు అరుపులు కలగలిసి ఆ బస్ లోని వాతావరణం చాలా కోలాహలంగా ఉంది.

కార్తీక మాసపు తొలి రోజులు. నల్లని తారురోడ్డు మీద ఆ వీడియో కోచ్ బస్ మెత్తగా దూసుకుపోతోంది. బస్ కిటికీలు మూసి ఉన్నా , మెయిన్ డోర్ లోనుంచి, కిటికీల సందులలో నుంచి చల్లని గాలి రివ్వున వీస్తూనే ఉంది

రోడ్డుకిరు వైపులా ఉన్న పొదలమీదుగా అల్లిబిల్లిగా అల్లుకున్న అడవి తీగలకి పేరు తెలియని పువ్వులేవో మనోహరంగా విరబూశాయి ఎక్కడ నుంచో ఎప్పుడూ వినని రాగాలలో పక్షులు కిలకిల ధ్వనులు చేస్తున్నాయి వీనులవిందుగా.

కళ్లవిందు కావిస్తున్న అందమైన ప్రక్జృతి దృశ్యాలని అబ్బురంగా వీక్షిస్తున్న మౌక్తిక మనసు ఏదో ఆనంద పారవశ్యానికి లోనైంది. నిజంగా ఈ సృష్టి ఎంత సుందరమైనది! ప్రపంచంలోని సౌందర్యాన్ని అంతా ఈ సృష్టి తనలోనే ఇముడ్చుకుందా!

నీలిమేఘాల్లో ఒక అందం, వాన చినుకుల్లో ఒక అందం, పచ్చని పైరుల్లో ఒక అందం, ఎగిరే పక్షుల్లో ఒక అందం, తేలే మబ్బుల్లో ఒక అందం, వాలే పొద్దుల్లో ఒక అందం,అన్నింటినీ మించి లేత ప్రాయంలో ఒళ్ళంతా మిడిసిపడే యవ్వన శోభతో అలరారుతూ...ఈ ప్రకృతిలోని అందాలన్నింటికీ సవాలు విసిరే కులుకులొలికే పదహారేళ్ళ పడుచు పిల్లది ఒక అందం.

అనంతమైన అందాలని సృజించి ఈ జగత్తుని మురిపిస్తున్నాడా విధాత.

‘రమణీయమైన ఈ ప్రకృతిని చూస్తే తనకి కవిత్వం పుట్టుకొస్తోందేమిటి!’ తన ఊహలకి తానే నవ్వుకుంది మౌక్తిక.

“ఏయ్ అంతర్ముఖీ...ఏమిటాలోచిస్తున్నావు!’’ మౌక్తిక ముఖం మీద చిటికె వేస్తూ ప్రశ్నించింది రమ్య.

తనని ఎవరన్నా ‘అంతర్ముఖి’ అని విమర్శిస్తే మండిపడే మౌక్తిక రమ్యను మాత్రం ఏమీ అనదు. అనలేదు కూడా. రమ్య అలా పిలిచినప్పుడు ఆ పిలుపులో ధ్వనించే ఆత్మీయత మలయసమీరంలా చల్లగా తాకుతుంది మౌక్తిక మనసుని.

ఆ స్వరం లోని అనురాగాలు మాలిమి మేలిమి బంగారమల్లే మెరిసిపోతూ కనబడుతుంది ఆమె అంతశ్చక్షువులకి. ఈ ప్రపంచంలో తనకున్న అతి కొద్దిమంది సన్నిహితుల్లో రమ్యను కూడా ఒకదానిగా భావిస్తుంది మౌక్తిక.

అసలు ఈ లోకంలో చాలా మంది మనుషులు అంతర్ముఖులుగానే జీవిస్తారని మౌక్తికకు గట్టి నమ్మకం. కొందరు కొన్ని సందర్భాలలోనైనా మనసులో మాట బయట పెట్టుకుని గుండెబరువు దించుకుంటారు. కాని, మౌక్తిక అలా కాదు...తన మనసులో ఏముందో ఎవరికీ తెలియనివ్వక గుట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆనందమైనా, విషాదమైనా పది మందిలో ఉన్నప్పుడు ఆమె స్పందన ఒకేలాగా ఉంటుంది. ఆమె ప్రాణ స్నేహితురాలైన రమ్య ఆమె లోని ఈ స్వభావాన్ని చూసి “అంతర్ముఖీ’’ అంటూ ముద్దుగా పిలుస్తూ ఉంటుంది.

“మళ్ళీ నీ ఊహల్లోకి వెళ్ళిపోయావా!’’ మౌక్తిక అలా ప్రకృతిలో లీనమవ్వడం గమనించిన రమ్య విసుగ్గా ముఖం పెట్టింది.సమాధానంగా ఒక చిన్ని నవ్వు చిందించి కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉండిపోయింది మౌక్తిక. బస్సులోని వారంతా జట్లు జట్లుగా విడిపోయి, కబుర్లలో మునిగిపోయారు. ఎవరి లోకం వారిది... ఎవరి చర్చలు వారివి. కొందరు సినిమా పాటలలో అంత్యాక్షరి ఆడుతూ ఉంటే, మరికొందరు బస్ లో వేస్తున్న సినిమా చూస్తున్నారు.

ఎప్పుడూ ఏకాంతాన్ని ఇష్టపడుతూ, తనలోకి తాను ముడుచుకున్నట్లుగా ఉండే మౌక్తిక ఈ హడావుడిని, గోలని భరించలేకపోతోంది. అసలు ఇదంతా తట్టుకోలేకే తాను ఈ పికినిక్ కి రానంటూ మొరాయించింది. కాని, రమ్య వినిపించుకోలేదు. మౌక్తిక బయలుదేరే వరకు చెవిలో జోరీగలా పోరుపెట్టి, తెగ సతాయించి మరీ ఆమెను ఒపించింది.

సిటీకి నలభై కిలోమీటర్ల దూరంలో ఏదో రాజా వారి దివాణం ఉందని తెలిసి అందరూ ఈ విహారయాత్రకి ప్లాన్ చేశారు. అలాగని ఆ దివాణం ప్రసిధ్ధి చెందిన చారిత్రిక స్థలమేమీ కాదు.

వీళ్ళు పనిచేస్తున్న కాలేజ్ లోనే ‘శమంతకం’ గారని ఫిజిక్స్ హెడ్ ఒకాయన ఉన్నరు.

‘మరి సత్రాజిత్తు ఈయనకి ఏమౌతాడూ!’’ అంటు చిలిపిగా ఆట పట్టిస్తూ ఉంటుంది రమ్య అప్పుడప్పుడు.

శమంతకం గారి అమ్మాయి సుమతికి ఈ మధ్యనే పెళ్ళైంది. ఆ అమ్మాయిది  ఈ చుట్టు పక్కలే ఏదో గ్రామం... ఆమెను కాపురానికి దిగబెట్టి రావడానికై ఈ ఊరు విచ్చేసిన శమంతకం గారు , ఖాళీ సమయాల్లో ఏమీ తోచక ఊరంతా చుట్టబెట్టి, విశేషాలన్నీ తానే స్వయంగా అన్వేషించి మరీ వచ్చారు.

అప్పుడే ఆయన ఈ రాజావారి దివాణం గురించి తెలుసుకున్నారు.

రాజవంశాలన్నీ తమ ప్రాబల్యాన్ని కోల్పోయి జనబాహుళ్యం లోకి విస్తరిస్తున్న దశలో, రాచరిక వ్యవస్థ దాదాపుగా అంతరిస్తున్న ఈ రోజుల్లో... ఈ దివాణం గురించి, దానికి సంబంధించిన వ్యక్తుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియడంతో కాలేజ్ స్టాఫందరికీ ఎంతో ఉత్సుకత కలిగింది.

అనాదిగా ... ఆ  రాచవంశంలో ఒక్కో వారసుడు మాత్రమే పుడుతున్నాడట. అది వరమో శాపమో...తెలియని అయోమయ వ్యవస్థలో ఉండేవారట ఆ రాచకుటుంబమంతా.

దానికి తోడు ఈ తరంలో జన్మించిన వారసుడు ‘రాజా కుమారవర్మ’ పెళ్లంటే విముఖతను కనబరచేవారట. ఆయన వైఖరికి బాధపడుతూ, ఆయనతోనే ఈ వంశం అంతమైపోతుందేమోనని అందరూ బెంగపెట్టుకుని, తల్లడిల్లిపోతున్న తరుణంలో లేటు వయసులో... కుమారవర్మ తండ్రికి సుపుత్రికా జననమైంది. కొడుకు పుట్టిన ఇరవై మూడేళ్ళ తరువాత, వంశ లక్షణాలకి వ్యతిరేకంగా, అందాల చంద్రబింబం లాంటి ఆడశిశువు ఆ ఇంట రాజావారు ఆనందపరవశులైనారు.

అయితే... వారి ఆనందం ఎంత కాలమో నిలవలేదు. అమ్మాయి పుట్టిన నెల రోజులకి ...రాజావారు, వృధ్ధులైన వారి మాతాపితరులు అందరూ కలిసి తిరుమల దైవదర్శనానికి వెళ్లివస్తూ... దారిలో కారు యాక్సిడెంట్ లోమరణించారు.

ఆ వార్తను విన్న బాలింతయైన రాణీగారు ఉన్న పళంగా గుండాగి చనిపోయారు నవజాత శిశువును తల్లిలేని పిల్లను చేస్తూ.
వరుసగా ఇన్ని చావులను చూసి విరక్తి చెందిన చిన్న రాజావారు అటుపైన అక్కడ ఉండడానికి మనస్కరించక, తన చిట్టి చెల్లెలిని తీసుకుని విదేశాలకి వెళ్ళిపోయారు. ఆస్తినంతా ఆ ఊరి ప్రెసిడెంటైన సుమతి మామ గారికి అప్పగించి,లావాదేవీలు అన్నీ ఆయన్నే చూసుకోమని ఆదేశించారు.

శమంతకంగారు, తాను స్వయంగా చూసి తెలుస్కున్న విశేషాలకి కాల్పనికతను జోడించి కళ్లకు కట్టినట్లుగా వర్ణించి, వివరించి చెప్పారు.
ఓక అద్భుతమైన సినిమా చూసిన అనుభూతి కలిగింది స్టాఫందరికీ. అలాంటి రాజావారికి చెందిన దివాణాన్ని చూడాలన్న తపన మొదలైంది. దాని ఫలితమే ఈ విహారయాత్ర.

ఈ జనాభాకంతటికీ భోజనాది కార్యక్రమాల ఏర్పాట్లని దగ్గరుండి పర్యవేక్షించడానికి ముందు రోజే బయలుదేరి వచ్చేశారు శమంతకం గారు.
ఊరు చేరడానికి ఇంకా అరగంట సమయం పడుతుంది. బస్ లో చాలా మంది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న స్నాక్స్ పని పడుతున్నారు. కరకరమన్న ధ్వనులు వినబడుతున్నాయి. మౌక్తికకు అలా నమిలేటప్పుడు చప్పుడు చేసే తినుబండారాలు అంటే మహా చిరాకు.
చేగోడీలు, జంతికలు, అప్పడాలు వడియాలు... సాధ్యమైనంత వరకు ఇలాంటి పదార్ధాలకి దూరంగా ఉంటుంది.

అందుకే రమ్య ఆమెను”ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి’’ అంటూ వెక్కిరిస్తుంది. “నా అభిప్రాయం నాది. నీకిష్టమైతే నువ్వు తిను... నేనే వద్దన్నానా?’’ ముఖం ముడుచుకుంటూనే నవ్వేస్తుంది మౌక్తిక.

“ మన ముందు సీట్లో ఒక మహాతల్లి కూర్చుంది చూశావూ! ఎవటి తోటీ కలవదు... సోషల్ మోవింగ్ అస్సలు తెలియదు.’’

“అవునే...  వట్టి జడపదార్ధం... టేస్ట్ లెస్ క్రీచర్... ఏస్పందనాలేని బండరాయి... ఈవిడగారిని ఎవడు చేసుకుంటాడో గాని...మటాష్ అయిపోతాడు.’’

“ఎవరితోనూ కలవలేనప్పుడు ఇలా... పిక్నిక్ లకి గట్రా రావడం దేనికో!’’

ఈ మాటలన్నీ తనని ఉద్దేశించి అంటున్నవేనని మౌక్తికకి తెలుసు. ఆ అంటున్నది... రిసెప్షనిస్ట్ మాలతి, క్లర్క్ నవనీతలని కూడా తెలుసు.. అయినా వాళ్ళు చేస్తున్న ఈ వ్యాఖ్యలు మౌక్తిక మనసుని ఎంత మాత్రం బాధించ లేదు. వాళ్ల నైజం అది కాబట్టి వాళ్ళు బహూకరించిన ఈ బిరుదులని ఆనందంగా స్వీకరించింది ఏ గొడవా లేకుండా.

నిజంగానే తాను జడ పదార్ధమా! టేస్ట్ లెస్ క్రీచరా! ఏమో!...నవ్వుకుంది మౌక్తిక తనలో తానే.

“ఎక్స్ క్యూజ్ మి...అకారణంగా ఎవరినీ ఆడిపోసుకోవడం అంత మంచిపని కాదు మాలతి గారూ, నవనీత గారూ... మనం వచ్చింది విహారయాత్రకి. మన మనసులో టెన్షన్స్ అన్నీ పక్కకు పెట్తేసి , హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనసుని రీచార్జ్ చేసుకోవాలి కాని, ఇలా ఎవరినో ఒకరిని కామెంట్ చేసి ఇన్సల్ట్ చేస్తూ మూడ్ పాడు చేసుకోకూడదు.’’

వాళ్లని మందలించిన ఆ స్వరం ఎవరిదో అర్ధం అయ్యింది మౌక్తికకు. ఆ గొంతు... మాథ్స్ లెక్చరర్ మధుకిరణ్ ది.

అతడి చూపు ఎప్పుడూ మౌక్తికను వెంటాడుతూ ఉంటుంది. ఆ చూపులో భావం బోధపడనంత అమాయకురాలేమీ కాదు మౌక్తిక.
ఆ చూపులో కళ్లవేడుక, కోరిక ఇలాంటి భావనలు ఏమీ కనబడవు.

ఆ చూపులు వెదజల్లే భావన ఇలాంటి భావనల కన్నాఅతీతమైన భావన...అపురూప భావన. అభావన పేరు ‘ప్రేమ’ అని భాష్యం చెప్పింది రమ్య. కాని, మౌక్తిక అందుకు అంగీకరించదు. రమ్య మాత్రం అతడి చూపులు వ్యక్తీకరించేది ఆమె పట్ల గల ఆరాధననే అని ఖచ్చితంగా చెబుతుంది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
prema enta madhram