Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nee peru talachina chalu

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue317/813/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

 

(గత సంచిక తరువాయి).... ఆ రోజు ఆదివారం. చక్రపాణికి ఆఫీసు సెలవు. వసంతసేనకు కాలేజి సెలవు. ఆ రోజు అందరు కలిసి భోజనం చేశారు. తరువాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వసంతసేన మంచం మీద పడుకుని ఏదో తెలుగు నవల చదువుతోంది. చక్రపాణి తన గదిలో పడుకుని పేపర్ చదువుతున్నాడు. యధా ప్రకారం విశాలాక్షి వంటింట్లో ఏదో పనిచేసుకుంటుంది.

మిత్రవింద కిటికి దగ్గర నిల్చుని ఉంది. ఆమె ఫలితాల గురించి ఆలోచిస్తోంది. పరీక్ష బాగానే రాసింది. ఖచ్చితంగా తను సెలక్ట్ అవుతానని ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. అయిన ఏదో తెలియని భయం ఆమెను ఇబ్బంది పెడుతోంది. అందుకే చాల అసహనంగా ఉంది.

అప్పుడే పోస్ట్ అన్న కేక వినిపించింది. మిత్రవింద ఆలోచనల నుంచి తెప్పిరిల్లి బయటకు వచ్చింది. గుమ్మం ముందు కొరియర్ బాయ్ కనిపించాడు. అతని చేతిలో ఏదో కవరు ఉంది.

“మిత్రవింద అంటే ఎవరు”అడిగాడు అతను.

“నేనే “అంది మిత్రవింద.

“మీకో రిజిస్టర్ కవరు వచ్చింది. ఈ కాగితంలో సంతకం చేసి తీసుకోండి”అంటు కాగితంలో ఎక్కడ సంతకం చెయ్యాలో చూపించాడు. అతను చెప్పిన చోట సంతకం చేసి కవరు తీసుకుంది. కొరియర్ బాయ్ వెళ్ళిన తరువాత నింపాదిగా కవరు విప్పి చూసింది.

అది విదేశాంగశాఖ నుంచి వచ్చిన ఆర్డర్. మిత్రవిందను పొలిటికల్ అటాచిగా అపాయింట్ చేస్తూ పంపిన ఆర్డర్ అది. వారం రోజుల పాటు ఆమెకు ఢిల్లీలో ట్రయినింగ్ ఉంటుంది. ఆ తరువాత పోస్టింగ్స్ ఆర్డర్స్ వస్తాయి. విషయం తెలుసుకున్న మిత్రవింద ఆనందంతో ఊగిపోయింది. తన కష్టం వృధా కానందకు ఎంతో ధ్రిల్ ఫీలయింది. ఇంట్లో వాళ్ళందరిని లేపి తన అపాయింట్ మెంట్ ఆర్డర్ చూపింది. అందరు ఆమెను అభినందనలతో ముంచేత్తారు.

“అనుకున్నది తప్పకుండ సాధిస్తావని నాకు తెలుసు తల్లి”అన్నాడు చక్రపాణి.

అతని కళ్ళలో కించిత్ గర్వం కనిపించింది. కూతరు సాధించిన విజయం అతన్ని ఎంతో ఆనందానికి గురిచేసింది.

ఆ రోజు సాయంత్రం అందరు ఒక మంచి హోటల్ కు వెళ్ళారు. అక్కడ భోజనం చేసి కొంచం సేపు తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ శుభవార్త వెంటనే అబ్బాస్ కు చెప్పాలని మిత్రవింద అనుకుంది. కాని హడావిడిలో మరిచిపోయింది. పైగా అందరిముందు అబ్బాస్ తో మాట్లాడటానికి ఆమెకు ఎంతో సిగ్గువేసింది.

అందుకే ఓపికతో అందరు నిద్రపోయేంత వరకు కాచుకుంది. అ సమయం పన్నెండు గంటలకు వచ్చింది. చివరగా చక్రపాణి పడుకున్నాడు. అతను అంత వరకు ఏదో పుస్తకం చదువుతున్నాడు. తండ్రి పడుకున్నాడని నమ్మకం కలిగిన తరువాత గది లోంచి బయటకు వచ్చింది మిత్రవింద.  అబ్బాస్ కు కాల్ చేసింది. ఆమె కాల్ కోసమే అతను ఎదురుచూస్తున్నాడు. అందుకే వెంటనే రెస్పాండ్ అయ్యాడు.

“నాకు ఉద్యోగం వచ్చింది అబ్బాస్. ఇంకో రెండు రోజులలో నేను ట్రియినింగ్ కోసం ఢిల్లీ వెళ్ళాలి”అంది మిత్రవింద.

“కంగ్రాట్స్. నువ్వు సాధిస్తావని నాకు తెలుసు మిత్రవింద”అన్నాడు అబ్బాస్.

“ట్రయినింగ్ అయిన తరువాత నాకు పోస్టింగ్ ఇస్తారు. కాని ఎక్కడ వేస్తారో తెలియదు. కాని నాకు మాత్రం ఇస్లామాబాద్ లో పోస్టింగ్ ఉండాలని ఆశపడుతున్నాను”అంది మిత్రవింద.

“తప్పకుండ నీకు ఇస్లామాబాద్ లో పోస్టింగ్ ఇస్తారు. అందులో సందేహం లేదు.”

“అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?”

“నా సిక్స్త్ సెన్స్ చెప్పుతోంది.”

“నీకు అలాంటి వాటిమీద నమ్మకం లేదు కదా. ఇప్పుడు ఎలా నమ్మావు?

“నా విషయంలో నమ్మకం లేదు. కాని నీ విషయంలో నమ్ముతున్నాను

“సమయానికి తగినట్టు మాటలు మార్చటంలో నీకంటే గొప్పవాడు ఇంకేవరు లేరు. సరే ఆ విషయం పక్కన పెట్టు. ఏంచేస్తున్నావు? అడిగింది మిత్రవింద.

“నిద్రరాక సతమతమవుతున్నాను”అన్నాడు అబ్బాస్.

“నిద్ర రాకపోతే నిద్రమాత్రలు వేసుకుని పడుకో. హాయిగా నిద్రపడుతుంది”అంది చలోక్తిగా మిత్రవింద.

“నువ్వు నా పక్కన ఉంటే వేరే నిద్రమాత్ర ఎందుకు.”

“నీ ఉద్దేశం అర్ధమైంది. నీ కోరిక తీరాలంటే ఇంకా కొన్నిరోజులు ఆగాలి.”

“ఇంకా ఎన్ని రోజులు ఆగాలి. నేను చెప్పినట్టు చేసి ఉంటే నాకు ఇంత కష్టం వచ్చేది కాదు”అన్నాడు అబ్బాస్.

“నేనేం చేశాను”అంది చిరుకోపంతో మిత్రవింద.

“మన విషయం నువ్వు వెంటనే మీ నాన్నగారితో చెప్పలేదు. చెప్పిఉంటే మన పెళ్ళి ఎప్పుడో జరిగిపోయేది. ఈ టైంలో నువ్వు నా పక్కన ఉండేదానివి”అన్నాడు.

“నీకు పిచ్చిపట్టినట్టుంది. నాకు నిద్రవస్తుంది. బై మళ్ళి రేపు కంటిన్యు చేద్దాం”అతని మాటకు అవకాశం ఇవ్వకుండ లైన్ కట్ చేసింది మిత్రవింద. అబ్బాస్ నవ్వుతూ తన సెల్ ఆఫ్ చేశాడు.తల్లి గదిలోకి వెళ్ళి చూశాడు. ఆవిడ ఒళ్ళు మరిచి నిద్రపోతుంది. మెల్లగా తలుపులు దగ్గరగా వేసి తన గదిలోకి వెళ్ళాడు. ర్యాక్ దగ్గరకు వెళ్ళి అందులోంచి ఒక పుస్తకం తీసుకున్నాడు. దాన్ని తీసుకుని మంచం మీద పడుకున్నాడు. అది ప్రఖ్యాత ఇంగ్లీష్ నవల పాపిలాన్. ఈ నవల ఇంతకుముందే నాలుగుసార్లు చదివాడు అబ్బాస్. అయిన అతనికి ఏమాత్రం బోర్ కొట్టలేదు. ఇప్పటికి ఆ నవలను చాలసార్లు చదివాడు. కాని ఒక్కసారి కూడా విసుగు కలగలేదు. దీక్షగా చదవసాగాడు. ఇరవై పేజిలు పూర్తి చేసేసరికి విపరీతమైన ఆవలింతలు వచ్చాయి. పుస్తకం పక్కన పెట్టి లైట్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఒక్కసారిగా గదంతా చీకటితో నిండిపోయింది. ఒక చిన్న జీరోవాట్ బల్బ్ మాత్రం గుడ్డిగా వెలుగుతోంది. అప్పుడే అతని సెల్ చప్పుడు చేసింది. అది రింగ్ టోన్ కాదు. మెసెజ్ చెప్పుడు. ఇంత రాత్రి వేళ ఎవరు మెసెజ్ చేశారా అనుకుంటు సెల్ తీసి చూశాడు. కింద ఒకే ఒక లైన్ మెసెజ్ కనిపించింది.
“రేపు మీరు రక్షణమంత్రిని ఆయన చాంబర్స్ లో కలవండి”అని ఉంది.

అబ్బాస్ నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. ఒక్కసారిగా నిటారు అయ్యాడు. రక్షణమంత్రిని కలుసుకోమని మెసెజ్ వచ్చింది అంటే చాల అర్జంట్ అని  అతనికి అర్ధమైంది. అది బ్రిగేడియర్ పంపించాడని అతనికి అర్ధమైంది. సెల్ఆన్ చేసి బ్రిగేడియర్ కు కాల్ చేశాడు. అబ్బాస్ దగ్గరనుంచి కాల్ వస్తుందని ఆయనకు తెలుసు. అందుకే సిద్దంగా ఉన్నాడు. వెంటనే రెస్పాండ్ అయ్యాడు.

“బ్రిగేడియర్ సార్ నాకు ఇప్పుడే మెసెజ్ వచ్చింది. కాని ఎన్ని గంటలకు వెళ్ళి కలుసుకోవాలో మెసెజ్ లో లేదు. అందుకే మీకు కాల్ చేశాను”అన్నాడు.

“సారీ క్యాప్టన్. ఆ మెసెజ్ నేనే పంపించాను. టైం చెప్పటం మరిచిపోయాను. రేపు పదకొండుగంటలకు నీకు అపాయింట్ మెంట్ ఉంది”అన్నాడు బ్రిగేడియర్.

“ఓకే సార్”అన్నాడు అబ్బాస్.

“గుడ్ నైట్”అని లైన్ కట్ చేశాడు బ్రిగేడియర్.

అబ్బాస్ కూడా సెల్ ఆఫ్ చేసి పడుకున్నాడు. కాని ఎంత ప్రయత్నించిన అతని కళ్ళు మూతలుపడటం లేదు. రక్షణమంత్రిని కలుసుకోమని బ్రిగేడియర్ మెసెజ్ పంపించాడు. అంతవరకు బాగానే ఉంది. కాని ఎందుకు కలుసుకోవాలో చెప్పలేదు. కనీసం చూచాయిగా హింట్ అయిన ఇవ్వలేదు.

అబ్బాస్ మిలిట్రిలో ఒక చిన్న ఆఫీసర్. అలాంటిది రక్షణమంత్రి  ఎందుకు తనని కలుసుకోవాలనుకుంటున్నాడో అతనికి అర్ధం కాలేదు. కాని ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్ధమైంది. బహుశా చాల ముఖ్యమైన పని అయిఉంటుంది. అందుకే రమ్మని చెప్పి ఉంటాడు అని సరిపెట్టుకున్నాడు అబ్బాస్.

ఆ రాత్రి అబ్బాస్ కు నిద్రపట్టలేదు. రక్షణమంత్రి గురించే ఆలోచిస్తూ గడిపాడు. మరునాడు పెందళాడే లేచి తయారయ్యాడు. యూనిఫారమ్ వేసుకుని తల్లి గదిలోకి వెళ్ళాడు. ఆవిడ అప్పుడే టీ నాష్టా చేసి వచ్చి గదిలో కూర్చుంది.

“అమ్మా నేను ఆఫీసుకు బయలుదేరుతున్నాను”అన్నాడు.

“అలాగే వెళ్ళిరా”అంది నవ్వుతూ.

తల్లికి బై చెప్పి వచ్చి జీపులో కూర్చున్నాడు. గంట తరువాత జీపు అతని అఫీసు ముందు ఆగింది. జీపు దిగి తన చాంబర్స్ లోకి వెళ్ళాడు. అతని టేబుల్ మీద కొంతమంది ఉగ్రవాదులకు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ లో ఉన్న వాళ్ళంతా కరుడుగట్టిన ఉగ్రవాదులు. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని కర్కోటకులు.   

ఇటివల వాళ్ళ మామెంట్స్ మీద దృష్టి పెట్టింది పాకిస్ధాన్ ప్రభుత్వం. ఆ నేపధ్యంలో కొన్ని విషయాలు తెలిశాయి. రాబోయే వారం రోజులలో భారత్ భూభాగం మీద వరుస బాంబ్ బ్లాస్ట్ లు చెయ్యాలని ఆ ఉగ్రవాదులు భావిస్తున్నారు.ఈ విషయం పాకిస్ధాన్ ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ తెలుసుకుంది. ఎలాగైన ఆ దాడులను అరికట్టాలని అబ్బాస్ డిపార్ట్ మెంట్ నిర్ణయించుకుంది. ఆ బాధ్యతను అబ్బాస్ కు అప్పగించింది.
గంటపాటు ఆ ఫైల్స్ ను క్షణ్ణంగా చదివాడు అబ్బాస్. తరువాత టైం చూశాడు. దాదాపు పదిన్నర కావస్తోంది. రక్షణమంత్రిని కలుసుకునే టైం దగ్గర పడింది. ఫైల్స్ తీసి జాగ్రత్తగా బీరువాలో పెట్టి తాళం వేశాడు. చాంబర్స్ తలుపులు దగ్గరగా వేసి వచ్చి జీపులో కూర్చున్నాడు. డ్రైవర్ జీపు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. పావు తక్కువ పదకొండుగంటలకు అతను రక్షణమంత్రి చాంబర్స్ చేరుకున్నాడు.
సెక్యరిటికి అబ్బాస్ గురించి ముందే చెప్పారు. అందుకే వాళ్ళు అతన్ని చెక్ చెయ్యకుండ లోపలికి వంపించారు. లోపల చాంబర్స్ లో రక్షణమంత్రి దీక్షగా తన ముందు ఉన్న ఫైల్స్ చదువుతున్నాడు. అబ్బాస్ అయన ముందు నిలబడి సెల్యుట్ చేశాడు.

“కూర్చో అబ్బాస్ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే పిలిపించాను”అన్నాడు ఫైలుమూసి రక్షణమంత్రి. “చెప్పండి హానరబుల్ మినిస్టర్”అన్నాడు అబ్బాస్.

“ఎల్లుండి నేను ఇండియా వెళుతున్నాను”అన్నాడు మంత్రి. ఉలిక్కిపడ్డాడు అబ్బాస్. ఆశ్చర్యంగా మంత్రి వైపు చూశాడు.

“నువ్వు విన్నది నిజమే అబ్బాస్. ఎల్లుండి స్పెషల్ విమానంలో నేను కొంతమంది అధికారులు ఢిల్లీ వెళుతున్నాం. భారతప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించింది. రెండు దేశాలు కొన్ని విషయాలను చర్చించటానికి సమావేశం అవుతున్నాయి. ఆ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం. వాటిలో ముఖ్యమైంది సరిహద్దు గోడ గురించి. ఆ విషయం నీకు ముందే తెలుసు. నువ్వు  తయారుచేసిన ఎస్టిమేషన్ రిపోర్ట్ ను ప్రభుత్వం అంగీకరించింది. దాన్ని భారత ప్రభుత్వానికి పంపించింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నాతో పాటు మరో ఇరవైమంది ఈ సమావేశంలో పాల్గోంటున్నాం. నువ్వు మాకు చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ గా వ్యవహరించాలి. ఈ విషయం చెప్పటానికే పిలిచాను”అన్నాడు మంత్రి.

ఆశ్చర్యంగా చూశాడు అబ్బాస్. ఈ పరిణామం అతను ఊహించిందే. కొన్ని రోజులకు ముందే అతను ఢిల్లీ వెళ్ళాడు. సెక్యురిటి ఏర్పాట్లు చూసి వచ్చాడు. సెక్యురిటి ఏర్పాట్లు చాల పకడ్భందీగా ఉన్నాయని తన రిపోర్ట్ లో రాశాడు. ఇంకో నెల రోజుల తరువాత సమావేశం జరుగుతుందని అనుకున్నాడు. కాని అతను అనుకున్నది ఒకటి జరిగింది ఇంకోకటి. భారత్ ప్రభుత్వం చాల తొందరగా సమావేశం ఏర్పాటుచేసింది. కారణం ఏమిటో అతనికి చూచాయిగా తెలుసు. బహుశా ఉగ్రవాదల దాడికి భయపడి ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది. తమ ప్రభుత్వానికి సమాచారం అందినట్టుగానే భారత్ కు కూడా ఇలాంటి సమాచారం వచ్చి ఉంటుంది.

నిజానికి ఈ వార్త అబ్బాస్ కు ఆశ్చర్యం మాత్రమే కాదు. ఆనందం కూడా కలగచేసింది. ఆశ్చర్యం ఇంత తొందరగా మళ్ళి ఢిల్లీ వెళుతున్నందుకు. అది ఒక చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ హోదాలో. ఆనందం ఇంకో రెండు రోజులలో మిత్రవింద ఢిల్లీ వెళుతోంది. అతను కూడా అదే టైంకు ఢిల్లీ చేరుకోబోతున్నాడు. దాదాపు వారంరోజులు మిత్రవింద ఢిల్లీలో ఉంటుంది. ఆమెతో మాట్లాడటానికి అతనికి చాల టైం దొరుకుతుంది.

“ఎల్లుండి మన ప్రయాణం. నీ టీమ్ ను నువ్వే సెలక్ట్ చేసుకోవాలి”అన్నాడు అతని ఆలోచనలకు బ్రేక్ వేస్తూ రక్షణమంత్రి.

“ యస్ సార్ “అన్నాడు అబ్బాస్.

“ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకల్లా నీ టీమ్ సిద్ధం కావాలి. వాళ్ళ పేర్లు రెండు కాపీలు తయారుచేయి. ఒక కాపీ నాకు ఇంకో కాపీ డిఫెన్స్ సెక్రటరికి పంపించు. ఇంతకంటే చెప్పవలసింది ఏం లేదు. ఇక నువ్వు వెళ్ళవచ్చు”అన్నాడు రక్షణమంత్రి. తిరిగి ఆయన ఫైల్స్ స్డడి చెయ్యటంలో మునిగిపోయాడు.

అబ్బాస్ ఆయనకు మరోసారి సెల్యుట్ చేశాడు. తరువాత బయటకు వచ్చాడు. ఒక నిమిషం పాటు ఉన్నచోటునే ఉండిపోయాడు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయాడు. తరువాత ఏదో తట్టినట్టు తలపంకించి తన జీపు వైపు నడిచాడు. డ్రైవర్ డ్రైవింగ్ సీటులో కూర్చుని జీపు స్టార్ట్ చేశాడు.  

డిల్లీ వెళ్ళిన అబ్బాస్ తన విధులలో మునిగిపోయి మిత్రవిందను కలుస్తాడా.. కలవడా,,తెలియాలంటే వచ్చేశుక్రవారం విడుదలయ్యే సంచికలో చూడండి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్