Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని పేరు తలచినా చాలు  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి..

(గత సంచిక తరువాయి)...“నీ ముఖం... వయసులో అందంగా ఉన్న ఏ ఆడపిల్లను చూసినా మగవాడు అలాగే కన్నార్పకుండా చూస్తాడు... దానికి నువ్వు ప్రేమా దోమా అంటూ డెఫినిషన్సేమీ ఇవ్వకు.’’ అంటూ కొట్టి పారేస్తుంది మౌక్తిక.

కాని, తాను కనబడినప్పుడల్లా అతడి కళ్లలో ప్రస్ఫుటించే మెరుపులను చూస్తే రమ్య మాటలు కరెక్టేననిపిస్తాయి. ఆ కళ్ళు... తనను చూసి ఏవో ఊసులు చెప్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కాని, అవేమీ రమ్య ముందు బయటపెట్టదు.

కాని, అతడు ఎదురైన ప్రతి సందర్భం ఆమెలో ఏదో అలజడి రేపుతూ, మౌక్తిక అస్థిమితాన్ని కలుగజేస్తుంది.

మధు కిరణ్ వర్ధమాన రచయిత కూడా. అడపాదడపా అన్ని పత్రికలలో అతడి రచనలు ప్రచురితమౌతూ ఉంటాయి. అతడి రచనల్లో భావుకత్వం పాళ్ళు కూడా ఎక్కువే. అతడి కథల్లో స్త్రీ పాత్రల వర్ణనలు మౌక్తికనే పోలి ఉంటాయని అంటూ ఉంటుంది రమ్య. కాదని ఖండించదు మౌక్తిక.అంతేకాదు పనిగట్టుకు మరీ అతడి గుణ గణాలను కీర్తిస్తూ ఉంటుంది రమ్య. అతడు చేసే సేవా కార్యక్రమాల గురించి అదే పనిగా మెచ్చుకుంటుంది. అనాధ బాలల కోసం తన జీతంలో నుంచి కొంత మొతాన్ని కేటాయిస్తాడని, ఫీజులు కట్టలేని పేద విద్యార్ధులకి తన వంతు సాయం అందించి వాళ్ల చదువులు ముందుకు సాగేలా చేస్తాడు అనీ..ఇలాంటివే ఏవేవో...

“వాళ్ళ మాటలకి హర్ట్ అయ్యావా ముక్తా...’’ మౌక్తికనే తదేకంగా గమనిస్తున్న రమ్య అడిగింది.

“అబ్బే.. లేదే... ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. అయినా నాకిది అలవాటే కదా! హర్ట్ అయ్యేందుకేముంది?’’ నిర్లిప్తంగా అంది మౌక్తిక.

“ఎవరి అభిప్రాయాలైనా పక్క వాళ్ళని నొప్పించేట్లుగా ఉండగూడదు కదా! పైగా వాటిని అలా పది మందిలో ఎక్స్ ప్రెస్ చేయకూడదు కదా! అయినా నీ మౌన ప్రేమికుడేం ఊరుకోలేదులే... మెత్తగా అంటించాడు.’’ చిలిపిగా ఆమె చెవిలో గుసగుసలాడింది రమ్య. మౌక్తిక కోపంగా చూసింది ఆమె వైపు.

“నువ్వు మరీ అలాంటి అర్ధాలేమీ వెతక్కు...’’కసురుకుంది విసుగ్గా.

ఫకాలున నవ్వింది రమ్య. చుట్టు పక్కలున్నవారు వీళ్లవైపోసారి చూసి మళ్ళీ వాళ్ళ వ్యాపకాల్లో మునిగి పోయారు.

అలానవ్వుతూ ఉన్న రమ్య రూపం సొట్టలు పడిన బుగ్గలతో, ఎంతో మనోజ్ఞంగా ఉంది.

మౌక్తిక, రమ్య ఇద్దరూ విభిన్నమైన అందాలకి నమూనాలని చెప్పుకోవచ్చును. ‘అందం’ అంటే ఇలాగే ఉండాలన్న నిబంధనలేమీ లేవనిపిస్తుంది వారి రూపాలని చూస్తే.

రమ్య అందమంతా నవ్వుతున్నప్పుడు సొట్టలు పడే ఆమె బూరె బుగ్గలలో ఉంటే, చిరునవ్వు నవ్వినప్పుడు బయటపడే పలు వరసలో ఓ మూలగా కనిపించే దొంతర పన్నులోనే మౌక్తిక సోయగమంతా దాగి ఉన్నట్లనిపిస్తుంది.

ఆడపిల్ల అందానికి కొలబద్దలు కోలకళ్లు, వాలుజడ, కోటేరు వేసిన నాసిక, తీర్చిదిద్దిన శరీర సౌష్టవం, పచ్చని పసిమి దేహఛాయ... ఇత్యాది కవుల వర్ణన లేమీ కానక్కరలేదు. అటువంటి లక్షణాలేమీ లేకున్నా చూపరుల మనసులని అయస్కాంతంలా ఆకట్టుకునే కొన్ని ప్రత్యేకతలుంటాయి కొంత మంది ఆడ పిల్లలకి.

మౌక్తిక, రమ్యలు ఆ కోవకే చెందుతారు.

“ఏమండీ... టీ తాగుతారా?’’ మధు కిరణ్ స్వరం విని అటు వైపు చూశారు మిత్రురాళ్ళిద్దరూ.

చేతిలో పెద్ద వాక్యూమ్ ఫ్లాస్క్, డిస్పోజబుల్ పేపర్ గ్లాసులతో నిలబడి ఉన్నాడు మధుకిరణ్.

“అబ్బే...వద్దులెండి’’ రమ్య అంది ఒకింత మొహమాటంగా.

మౌక్తిక బదులే చెప్పలేదు. ఎందుకో తెలియదు గాని, అతడు ఎదుట  పడగానే ఆమె పక్షవాతం  వచ్చి మాట పడిపోయినట్లుగా మూగవోతుంది. గుండె తాను కొట్టుకునే వేగాన్ని రెట్టింపు చేసుకుని నిముషానికి నూట నలభై నాలుగు సార్లు కొట్టుకుంటుంది.

“భలేవారే...  నేను మీకొక్కరికే ఆఫర్ చేయలేదు. కావలిస్తే చూడండి... అందరూ తాగుతున్నారు.’’ అంటూనే ఫ్లాస్క్ లోని టీని పేపర్ గ్లాసు ల్లోకి వంచి వాళ్లకి అందించాడు.

“టీ చాలా బాగుంది మధు కిరణ్ గారూ...మీ మిస్సెస్ చేశారా?’’ రమ్య ఆ ప్రశ్న కావాలనే అడిగింది అనిపించింది మౌక్తికకు. పెదవులు విడీ విడకుండా మనోహరంగా నవ్వాడు మధుకిరణ్. ..”లేని మిస్సెస్ టీ ఎలా చేసివ్వగలదు రమ్య గారూ...నేనే చేశాను...’’.

“అయితే మీరు ఇంకా బాచిలరేనన్నమాట!’’

“ఎస్ రమ్య గారూ... ఇప్పటి వరకు నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు. నా అన్వేషణ ఫలించినప్పుడు తప్పకుండా చేసుకుంటాను.’’ ఓరకంట మౌక్తికనే చూస్తూ చెప్పాడు మధుకిరణ్.

ఆ చూపు ఒక విరిశరమై తనను తాకిన అనుభూతి కలిగింది మౌక్తికకు. కలవరంగా తన దృష్టిని ఇంకోవైపు తిప్పుకుంది.

“అయినా ఇదేం బాగా లేదండీ... కేవలం ఆడవాళ్ళు మాత్రమేనా ఇంత బాగా టీ తయారు చేసేదీ! మగవాళ్లం ఎందులో తీసిపోయాము చెప్పండి. నలుడు, భీముడు మా జాతి వారేగా!’’ అన్నడు మధుకిరణ్ చాలెంజింగ్ గా.

అతడి వాక్కు ఎంతో మృదువుగా, వీనులకి ఇంపుగా అనిపిస్తోంది. మౌక్తికకేదో ఇబ్బందిగా అనిపించింది. అతడు తన సమక్షంలో ఉంటే ‘ఇదీ’ అని వ్యక్తపరచలేని వింత భావనేదో కలుగుతోంది.

యవ్వన మొచ్చాక ఏ మగవాడి మాటలూ కూడా ఆమె మీద ఇంతగా మత్తు జల్లలేదు. ఏ పురుషుడి ప్రవర్తనా ఇంతలా ఆకట్టుకోలేదు. ఇంత బలీయంగా ఆమె మనో నిగ్రహానికి పరీక్ష పెట్టలేదు.

కాని, ఇప్పుడెమిటి ఇలా!

అతడి స్వరం తేనెలో నానబెట్టి, పంచదార పాకంలో రంగరించి, చెరుకు పానకంలో ఊరించి మలచినంత మధురంగా ఉంటుంది. పేరు లోని ‘ మధువు’ ను తన గొంతులో నింపుకున్నాడా అన్నంత తీయగా ధ్వనిస్తాయి అతడి పలుకులు.

అతడి ముఖంలోకి సూటిగా చూస్తే కనక... తన ప్రమేయం లేకుండానే అతడికి వశమైపోతుందని మౌక్తికకు భయం. అందుకే... అతడు ఎదుట పడినప్పుడు తప్పించుకుని తిరుగుతుంది సాధ్యమైనంత వరకు. తన మనసు లోని ఘర్షణ రమ్యకు తెలియనివ్వకుండా మసలుకుంటుంది.

రవి కిరణాలు సోకగానే కమలాలు, చంద్రకాంతి తమను స్పృశించినప్పుడు కలువలు ఎందుకు విచ్చుకుంటాయో, కారు మొయిల్ని చూసిన మయూరం హర్షాతిరేకంతో పులకించి, ఎందుకు పురివిప్పి నర్తిస్తుందో, సన్నగా వీచే మలయానిల స్పర్శకి శ్రావణ మేఘాలు ఎందుకు కరిగి వర్షిస్తాయో... మౌక్తికకు తెలియదు.

వాటి ప్రమేయం లేకుండానే జరిగే ఆ అసంకల్పిత ప్రతీకార చర్యలకు కారణం లేనట్లే, మధుకిరణ్ ని కాంచినా... అతడి తీయని స్వరం చెవిన పడ్డా తన మదిలో వేనవేల ప్రకంపనలు చెలరేగి, సుమధుర స్పందనలు ఎందుకు రేకెత్తుతాయో కూడా ఆమెకి తెలియదు.

అది కూడా ఒక అసంకల్పిత ప్రతీకార చర్యలా అనిపిస్తుంది ఆమెకి.

అతడు తన ఎదుట నిలబడితే అతడి ఆకర్షణలో పడిపోతుందేమోనన్న భయం మౌక్తికను అంతర్లీనంగా వెంటాడుతూ ఉంటుంది. అలా జరగకూడదని... తన మనసుకి తానే సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉంటుంది. అయినా సరే... అప్పుడప్పుడు ఆమె ఊహల్లోకి చొరబడుతూనే ఉంటాడతడు ఆమె అనుమతి లేకుండానే.

అతడి వెంట పరుగులు దీసే తన మనసుకి కళ్లాలు వేసి ఆపడానికి విఫలయత్నం చేస్తూ ఉంటుంది మౌక్తిక.

“ఏయ్! మళ్ళీ పరధ్యానమా! పాపం కిరణ్ గారు చూడు... ముఖం వేలాడేసుకుని ఎలా దూరంగా వెళ్లారో! అతడంత ఇష్టంగా నీతో మాట్లాడడానికి ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటే నువ్వలా ముడుచుకు పోతావేమిటి అత్తిపత్తిలా!’’ మందలింపుగా అంది రమ్య అతడు వెళ్ళిన వైపు చూస్తూ. బదులు చెప్పలేని అసహాయతతో మౌనంగా ఉండి పోయింది మౌక్తిక.

మౌక్తిక అతని నుంచి తప్పించుకునే  ప్రయత్నాలు ఎటువైపు దారితీస్తాయో తెలుసుకోవాలంటే.. వచ్చేశుక్రవారం విడుదలయ్యే సంచికలో చూడండి..

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
prema enta madhram