Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nee peru talachina chalu

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

“నేను బయలుదేరుతున్నాను అమ్మ. వెళ్ళోస్తాను”అంది మిత్రవింద.

“జాగ్రత్తగా వెళ్ళిరా. రాత్రి వేళ బయట తిరగకు. ఎక్కడికి వెళ్ళిన పెందళాడే ఇంటికి చేరుకో”అంది  విశాలాక్షి. ఆమెకు ఏడుపు వస్తోంది. కాని బలవంతంగా ఆపుకుంటోంది. కూతరిని విడిచి ఆమె ఎప్పుడు ఉండలేదు. మొదటి సారిగా ఆమెను విడిచి వెళుతోంది మిత్రవింద. అది ఒక రోజు కాదు. ఏకంగా వారం రోజులు. అందుకే కొంచం ఆందోళనపడుతుంది ఆమె.

తల్లి పరిస్ధితి గ్రహించింది మిత్రవింద. ఆమెకు కొంచం బాధ గానే ఉంది. కాని  తప్పదు. ఏరికోరి ఈ ఉద్యోగం ఎంచుకుంది. ఇప్పుడు భయపడితే దానికి అర్ధమై ఉండదు. అందుకే తల్లి ముందు ధైర్యంగా ఉంటోంది మిత్రవింద.

“నువ్వేం భయపడకమ్మా. నేను జాగ్త్తగానే ఉంటాను. నువ్వు చెప్పినట్టు రాత్రి వేళ బయట తిరగను. ప్రతి రోజు రాత్రి ఎనిమిది గంటలకు నీకు కాల్ చేస్తాను. అక్కడ ఏం జరుగుతుందో నా ట్రయినింగ్ ఎలా సాగుతుందో అంతా వివరంగా చెప్తాను సరేనా”అంది మిత్రవింద.

విశాలాక్షి కళ్ళు తుడుచుకుని సరే అంది. వసంతసేనకు కూడా అక్కా వెళుతుంటే బాధగానే ఉంది.

“అక్కా నీకు మొదటి జీతం రాగానే నాకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనివ్వాలి”అంది వసంతసేన.

తప్పకుండ కొనిస్తాను. నువ్వు మాత్రం అమ్మ నాన్న మాటలు వినాలి. కాలేజి అయిన తరువాత ఎక్కడికి వెళ్ళకు. ఇంటికి వచ్చేయ్. సినిమాలు చూడటం తగ్గించు. నీ దృష్టి అంతా చదువు మీద కేంద్రికరించు. ఏ విషయంలోను అమ్మ నాన్నను ఇబ్బంది పెట్టకు”అంది మిత్రవింద. అలాగే అని తలూపింది వసంతసేన.తరువాత మిత్రవింద చక్రపాణి సామాను తీసుకుని క్యాబ్ దగ్గరకు చేరుకున్నారు. బారముల్లాలో ఏయిర్ పోర్ట్ లేదు. అందుకే మిత్రవింద క్యాబ్ లో శ్రీనగర్ వెళుతోంది. అక్కడ ఫ్లైట్ కాచ్ చేసి ఢిల్లీ చేరుకుంటుంది. షెడ్యుల్ టైం ప్రకారం విమానం  సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు శ్రీనగర్ నుంచి బయలుదేరుతుంది. ఈ లోగా వాళ్ళు శ్రీనగర్ చేరుకోవాలి.

బారముల్లా నుంచి శ్రీనగర్ దాదాపు 250 కిలోమీటర్లు ఉంటుంది. ఎంత వేగంగా ప్రయాణం చేసిన నాలుగు గంటలు పడుతుంది. ఇప్పుడు టైం దాదాపు పన్నెండు కావస్తోంది. ఏ ఆటంకం కలగకపోతే నాలుగు గంటలకు శ్రీనగర్ చేరుకుంటారు. ఎలాగు గంట ముందు ఏయిర్ పోర్ట్ లో రిపోర్ట్ చెయ్యవలసి ఉంటుంది. వాళ్ళు చేరే టైంకు రిపోర్ట్ చెయ్యటానికి టైం చక్కగా సరిపోతుంది.

“జాగ్రత్తమ్మా”అంది ఇంకోసారి విశాలాక్షి.

అలాగే అని తలూపింది మిత్రవింద. వెళ్ళి క్యాబ్ వెనుక సీటులో కూర్చుంది. పక్కన తన సామానులు పెట్టుకుంది. ఒక ఏయిర్ బ్యాగ్ సెల్ ఫోన్ తప్ప ఆమె వేరే సామానులు తీసుకువెళ్ళటం లేదు. చక్రపాణి ఫ్రంట్ సీటులో కూర్చున్నాడు.  కారు వెంటనే వేగంగా ముందుకు కదిలింది. విశాలాక్షి వసంతసేన గుమ్మం దగ్గరే నిలబడిపోయారు. కారు కనుమరుగై పోయేంతవరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. తరువాత భారమైన మనుస్సుతో లోపలికి వెళ్ళారు.

కారు టవున్ లిమిట్స్ దాటి హైవే మీద ప్రవేశించింది. ఆశ్చర్యంగా ఎప్పుడు లేనిది రోడ్డు మీద పోలీసు పెట్రోలింగ్ వ్యాన్స్ కనిపించాయి. వాళ్ళతో పాటు మిలిట్రి జవాను కూడా ఉన్నారు. అందరి దగ్గర తుపాకులు ఉన్నాయి. ఇదంతా ఏదో సెక్యురిటి వ్వవహారమని మిత్రవింద గ్రహించింది. కాని ఎందుకో మాత్రం ఆమెకు తెలియలేదు.

“నాన్న రోడ్డు మీద సెక్యురిటి చాల ఉంది. ఎందుకో తెలియటంలేదు”అంది మిత్రవింద.

“బహుశా ఎవరో విఐపి వస్తున్నట్టుగా ఉంది”అన్నాడు చక్రపాణి. దారి పోడుగున అక్కడక్కడ పోలీస్ వ్యాన్స్ మిలిట్రి జవాన్లు కనిపించారు. కొన్ని చోట్ల వాహనాలు ఆపి తనీఖీ కూడా చేశారు. మిత్రవింద ప్రయాణం చేస్తున్న క్యాబ్ ను కూడా ఆపి చెక్ చేశారు. అంతే కాకుండ మిత్రవింద చక్రపాణి ఐడింటి కూడా చెక్ చేశారు. చివరకు డ్రైవర్ లైసెన్స్ కూడా చెక్ చేశారు. మిత్రవిందకు ఏం అర్ధంకాలేదు. అడిగిన వాళ్ళు జవాబు చెప్పరని ఆమెకు తెలుసు. అందుకే నోరుమూసుకుని కూర్చుంది.

అలా అయిదుసార్లు చెకింగ్ జరిగింది. చివరకు ఏ సమస్య లేకుండ క్యాబ్ శ్రీనగర్ ఏయిర్ పోర్ట్ చేరుకుంది. సమయం నాలుగు పావు అయింది. క్యాబ్ వాడికి డబ్బు ఇచ్చి ఇద్దరు లోపలికి వెళ్ళారు. శ్రీనగర్ వెళ్ళే విమానం ఇంకా రన్ వే మీదకు రాలేదు. అనుకోకుండ విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దాన్ని సరిచెయ్యటానికి విమాన సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇంకో పది నిమిషాలలో విమానం రన్ వే మీదకు వస్తుంది.

ఇద్దరు సెక్యురిటి చెకింగ్ పిలుపు కోసం ఎదురుచూస్తూ లౌంజ్ లో కూర్చున్నారు. ఏయిర్ పోర్ట్ లోపల కూడా సెక్యురిటి విపరీతంగా ఉంది. లోపలికి వస్తున్న వాళ్ళను సెక్యురిటి నిశితంగా చెక్ చేస్తున్నారు. బయటకు వెళ్ళుతున్న వాళ్ళను కూడా విడిచిపెట్టటం లేదు.

ఈ విషయానికి మిత్రవింద పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కాని చక్రపాణికి మాత్రం కొంచం ఇబ్బందిగా తోచింది. ఇది ఒక అపశుకునంలా భావిస్తున్నాడు అతను.

“ఇక మీరు బయలుదేరండి నాన్న”అంది మిత్రవింద.

“ఎందుకమ్మా. నువ్వు లోపలికి వెళ్ళిన తరువాత వెళ్తాను”అన్నాడు చక్రపాణి.

“నేను లోపలికి వెళ్ళేసరికి ఆలస్యం కావచ్చు. నువ్వు మళ్ళి చాల దూరం వెళ్ళాలి. ఈ సెక్యురిటి అంతా చూస్తుంటే నాకు ఎందుకో కొంచం భయంగా ఉంది. మీరు తొందరగా బయలుదేరితే మంచిదని తోస్తుంది”అంది మిత్రవింద.

“ఏం భయం లేదమ్మా. ఇంకో పావుగంట ఉంటాను. తరువాత బయలుదేరుతాను”అన్నాడు చక్రపాణి.

“ఇప్పుటికే దాదాపు అయిదుగంటలు కావస్తోంది. మీరు ఇప్పుడు బయలుదేరితేనే పెందళాడే ఇంటికి చేరుకోవచ్చు. లేకపోతే ఆలస్యమవుతుంది.పైగా రాత్రివేళ ప్రయాణం. కొంచం రిస్క్ తో కూడుకున్నది. పైగా అమ్మ వసు ఒంటరిగా ఉన్నారు. మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు. నా మాట విని వెంటనే బయలుదేరండి. నా గురించి ఆలోచించవద్దు. నేను క్షేమంగా వెళ్ళగలను”అంది బ్రతిమాలుతున్నట్టు మిత్రవింద.

కూతరి మాటలు చక్రపాణికి సబబుగానే తోచాయి.

“అలాగే నమ్మా నేను వెంటనే బయలుదేరుతున్నాను. నువ్వు మాత్రం జాగ్రత్త. ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు కాల్ చెయ్యటం మరిచిపోకు”అన్నాడు చక్రపాణి.

అలాగే అని తలూపింది మిత్రవింద.

కూతురికి టాటా చెప్పి చక్రపాణి వెళ్ళిపోయాడు. భారంగా నిటుర్చి కూర్చిలో కూర్చుంది మిత్రవింద. తరువాత అబ్బాస్ నెంబర్ కు కాల్ చేసింది. సెల్ రింగ్ అవుతుంది కాని అటువైపు నుంచి రెస్పాన్స్ లేదు. మిత్రవింద ఈ రోజు ఢిల్లీ వెళుతున్న విషయం అబ్బాస్ కు తెలుసు. నిన్న మిత్రవింద కాల్ చేసి ఈ విషయం చెప్పింది. ఏయిర్ పోర్ట్ చేరుకున్న తరువాత తనకు కాల్ చెయ్యమని మరిమరి అబ్బాస్ చెప్పాడు. అతను చెప్పినట్టుగానే చేసింది కాని అతని దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. పది నిమిషాల పాటు ప్రయత్నించింది. కాని ఏం లాభం లేకుండ పోయింది. విస్సుగ్గా సెల్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకుంది. పావుగంట తరువాత అన్ని ఫార్మాలిటిస్ ముగించుకుని విమానంలో కూర్చుంది మిత్రవింద.

అబ్బాస్ తన గదిలోంచి బయటకు వచ్చాడు. చుట్టు చూశాడు. చుట్టు పక్కల అంతా నిశబ్ధంగా నిస్తేజంగా ఉంది. ఎటుచూసిన కనుచూపుమేరలో ఒక్క మనిషి కూడా కనిపించటం లేదు.  కాంపౌండ్ వాల్ చుట్టు జవాన్లు గస్తీ తిరుగుతున్నారు. వాళ్ళ బూట్ల చప్పుడు లయబద్దంగా వినిపిస్తున్నాయి. అది పాకిస్ధాన్ డెలిగేషన్ విడిది చేసిన భవనం. ఇంతకు ముందు అబ్బాస్ ఈ భవనాన్ని చూశాడు. అందులో ఏర్పాటు చేసిన సెక్యురిటి హంగులను చూసి ఆశ్చర్యపోయాడు. చాల పటిష్టంగా పకడ్భందీగా ఉంది సెక్యురిటి. ముఖ్యంగా ఆ భవనం లోపల బయట చాల సీసీ కమెరాలు ఉన్నాయి. అంతే కాకుండ మెయిన్ రోడ్డు మీద కూడా ఉన్నాయి.

ఎవరైన లోపలికి వస్తే సీసీ కెమేరాలో క్యాప్చర్ అవుతారు. అలాగే బయటకు వెళితే కూడా సీసీ కెమేరా దృష్టిని దాటిపోలేరు. ఒక మాటలో చెప్పాలంటే పాలాక్షుడు కూడా సెక్యురిటి సిబ్బందికి తెలియకుండ లోపలికి వెళ్ళలేరు. అయిన అబ్బాస్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. చాల చిన్న వయస్సులోనే అతనికి గొప్ప పోస్ట్ వచ్చింది. ఎంతో అనుభవం తెలివితేటలు ఉంటే కాని ఇంత పెద్ద పోస్ట్ వరించదు. కాని అనుకోకుండ అబ్బాస్ కు వచ్చింది. దీన్ని అతను చక్కగా ఉపయోగించుకోదలుచుకున్నాడు. సమర్ధవంతంగా డ్యూటి చేసి అందరు మన్నలను పొందాలనుకుంటున్నాడు. ఈ రెండు రోజులు నిజానికి అతనికి అగ్నిపరీక్ష. ఈ పరీక్షలో విజయం సాధిస్తే అతని కెరీర్ కు తిరిగు ఉండదు. ఇంకా చాల తొందరగా పైకి ఎదగటానికి గొప్ప అవకాశం ఏర్పడుతుంది. అందుకే నిద్రపోకుండ కాపలా కాస్తున్నాడు.

అబ్బాస్ జాగ్రత్తకు ఇంకో కారణం కూడా ఉంది. ఈ సమావేశాన్ని భగ్నం చెయ్యాలని కొన్నితీవ్రవాధ సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి. సమావేశం జరుగుతున్న భవనాన్ని బాంబులతో పేల్చటానికి సన్నహాలు చేస్తున్నాయి. ఈ విషయం భారత్ ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ కు తెలిసింది. వాళ్ళు వెంటనే ఈ సమాచారాన్ని పాకిస్ధాన్ ప్రభుత్వానికి చేరవేశారు.

దాంతో అబ్బాస్ తన సెక్యురిటిని ఇంకా పటిష్టం చేశాడు. ఇది నిజంగా అతనికి కత్తిమీద సాములాంటిది. ప్రతి క్షణం మంత్రిని ఆయన సహచరులను జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ మీద ఈగవాలనివ్వకుండ కాపాడుకోవాలి. ఒక్క చిన్న పొరపాటు జరగటానికి వీలులేదు. దురదృషవశత్తు జరిగితే అబ్బాస్ కెరీర్ పూర్తిగా నాశనం అవుతుంది. అతన పర్సనల్ ఫైలులో బ్లాక్ రిమార్క్ పడుతుంది. అందరు అతన్ని ఇష్టంవచ్చినట్టు విమర్శిస్తారు. ఆ మాటలు వింటు అబ్బాస్ బతకలేడు. అంతకంటే చచ్చిపోవటం నయం అనిపించుకుంటుంది. ఆ అవమానం అతనికి మాత్రమే కాదు. అతని తల్లిని అతని కుటుంబానికి కూడా. జరిగింది విని అతని తల్లి విపరీతంగా బాధపడుతుంది. అవమానంతో రగిలి పోతుంది. ఏ లక్ష్యం ఆశయం కోసం కొడుకును పెంచిందో అది నెరవేరదు. పైగా సూటిపోటి మాటలు వినాలి. అది ఆవిడ ఎంత మాత్రం భరించదు. దానికంటే చనిపోవటం మంచిదని భావిస్తుంది.

అప్పుడే రక్షణ మంత్రి  గది లోంచి టప్ మన్న చప్పుడు వినిపించింది. ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు అబ్బాస్. వేగంగా తలుపు తెరుచుకుని రక్షణ మంత్రి గది లోకి వెళ్ళాడు. అతను ఊహించింది ఒకటి. జరిగింది ఇంకోకటి. రక్షణమంత్రికి ఏం కాలేదు. ఆయన సురక్షితంగానే ఉన్నాడు. రేపు జరగబోయే సమావేశానికి నోట్స్ తయారుచేసుకుంటున్నాడు.  ఆయన టేబుల్ మీద ఏవో కొన్ని ఫైల్స్ పుస్తకాలు ఉన్నాయి. అందులో ఒక పెద్దబౌండ్ పుస్తకం కూడా ఉంది. నోట్స్ రాస్తూ ఉంటే అప్రయత్నంగా ఆయన ఎడం చెయ్యి టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని కొంచం నెట్టింది. అది కాస్తా టేబుల్ మీద నుంచి కిందపడి టప్ మంటు చప్పుడు చేసింది. ఆ చప్పుడే అబ్బాస్ విన్నది.

కంగారుగా లోపలికి వచ్చిన అబ్బాస్ ను చిరునవ్వు నవ్వాడు మంత్రి. అప్పటికే అబ్బాస్ చేతిలో తుపాకి మెరుస్తోంది.

“సారీ ఏం జరగలేదు అబ్బాస్. నా చెయ్యి తగిలి పుస్తకం కింద పడింది”అన్నాడు ఆయన.

“సారీ సర్ అన్నాడు అబ్బాస్.

తరువాత నేల మీద పడిన పుస్తకాన్ని తీసి మళ్ళి టేబుల్ మీద పెట్టాడు. తరువాత గది లోంచి బయటపడ్డాడు. తలుపులు మళ్ళి బయట నుంచి లాక్ చేశాడు. తాళం చెవిని తన జేబులో వేసుకుని ముందుకు నడిచాడు అబ్బాస్. కాంపౌండ్ దగ్గరకు వెళ్ళి చూశాడు. బయట ఆరుగురు లోపల ఆరుగురు కమెండోస్ కాపలా కాస్తున్నారు. వాళ్ళందరి దగ్గర సబ్ మెషిన్ గన్స్ ఉన్నాయి. అబ్బాస్ ను చూసి సెల్యుట్ చేశారు.

“ఎనీ ప్రాబ్లం “అడిగాడు అబ్బాస్ క్యాజువల్ గా.

“నో సార్. అంతా ప్రశాంతంగా ఉంది”అన్నాడు కమెండోలో ఒకడు.

మిత్రవింద ఉద్యోగం కారణంగా తల్లిదండ్రులను వదిలివెళ్ళడం, అబ్బాస్ తన విధి నిర్వహణలో మునిగిపోవడం.. ఇద్దరూ వారి విధులను సక్రమంగా నిర్వహించుకుంటూ  తమ పెళ్ళి ఆలోచనలను మరిచిపోయారా.. అస్సలు వీరిద్దరికీ వివాహం జరుగుతుందా.. లేదా.. తెలుసుకోవాలంటే వచ్చేశుక్రవారం విడుదలయ్యే సంచికలో చూడండి..   

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్