Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
megha sandesham

ఈ సంచికలో >> కథలు >> మంచి చేసిన మంచి

manchi chesina manishi

“మనం చేసే మంచి పనుల వల్ల మనకు మంచి జరుగుతుంది. ఇది ఈ సృష్టి నియమం. మంచి పనులు అంటే ఏదీ ఆశించకుండా ఇతరులకు సహాయ పడటం. ఇక్కడ ఓ ముఖ్య విషయం మనం తెలుసుకోవాలి. ఏ స్థాయి వారైనా మంచి పనులు చేయాలి. బాగా డబ్బుంటేనే ఇంకొకళ్ళకు సహాయం చేయొచ్చు అనుకోవటం తప్పు..” ఐదవ తరగతి తెలుగు టీచర్పాఠం చెబుతున్నాడు పిల్లలకి. సిలబస్ లో ఉన్నవే కాక, జీవితంలో పనికి వచ్చే ఎన్నో విషయాలు మంచి ఉదాహరణలతో పిల్లలకు బాగా అర్ధమయ్యేలా చెప్పటం ఆయనకు అలవాటు. ఉత్సాహంగా వింటున్నారు పిల్లలు. పదేళ్ళ విజయ్ కూడా.

పేదింటి కుర్రాడు విజయ్. చురుకైనవాడు, బుద్ధిమంతుడు.తండ్రి సూర్యం ఓ ఫాక్టరీలో కార్మికుడు. గుణవంతుడు, సంస్కారవంతుడే కానీ చిన్నతనంలో ఆర్ధిక స్తోమత బొత్తిగా లేక బాగా చదువుకోవాలన్న కోరికను అణచుకొని పదవ తరగతిలోనే చదువు ఆపేసి, కుటుంబం కోసం పనిలో పడ్డాడు సూర్యం. అప్పటినుంచీ జీవితంలో సరిగ్గా నిలదొక్కుకోలేక ఎన్నో కష్టాలు పడ్డాడు. పడుతున్నాడు. తన పరిస్థితి విజయ్ కి రాకూడదనీ, బాగా చదివించి పైకి తీసుకురావాలని,భారమైనా మంచి ఇంగ్లీషు మీడియం స్కూల్లో చేర్చాడు. విజయ్ కి కూడా తండ్రంటే ప్రాణం. తన కోసం ఆయన పడే కష్టం బాగా అర్ధం చేసుకొని అందుకు తగ్గట్టుగా చదువు తప్ప వేరే ఏ విషయం ఈ లోకంలో  లేదన్నట్టుగా ఉంటాడు.

“విజయ్..” స్కూల్ అటెండర్ క్లాసుకు వచ్చి పిలిచాడు గది తలుపు దగ్గర నుంచొని. టీచర్ పాఠం చెప్పటం ఆపాడు ఒక్క క్షణం. పిల్లలంతా తలలు తిప్పి అటెండర్ వైపు చూసారు ఆసక్తిగా. విజయ్ లేచి నుంచున్నాడు.

“ప్రిన్సిపల్గారు రమ్మంటున్నారు..” చెప్పాడు అటెండర్.

విజయ్ కాస్త అయోమయంగా బయటకు రాబోతూంటే మళ్ళీ చెప్పాడు “బాగ్ తెచ్చుకో..”

ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు విజయ్ కి. తరువాత వెంటనే అర్ధమై ఏడుపు వచ్చింది. మొహంలో చెప్పలేని దిగులు. ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ బాగ్ తీసుకొని అటెండర్ వెనుక నడిచాడు క్లాసు బయటకు తల దించుకొని.పిల్లలంతా కుతూహలంగా జరిగేది చూస్తున్నారు. టీచర్ కు క్లాసు వదిలి వెళ్తున్న విజయ్ ని చూస్తే బాధేసింది. చదువంటే ఎంత ఇష్టం వీడికి. ఇంత చిన్న వయసులో కూడా బాధ్యత తెలిసిన వాడిలా ప్రవర్తిస్తాడు. ఎంత కష్టం వచ్చింది పాపం. ఓసారి దీర్ఘంగా నిట్టూర్చి పాఠం కంటిన్యూ చేసాడు.

బయట విజయ్ లాగే క్లాసు నుంచి బయటకు తీసుకురాబడ్డ మరికొందరు స్కూలు పిల్లలు నిలబడి ఉన్నారు. అంతా స్కూలు ఫీజు సరిగ్గా కట్టని పిల్లలు. అందరినీ ఆ వేళ ఇంటికి పంపేసారు ఫీజు కట్టేదాకా స్కూలుకు రానవసరం లేదు అని.

దిగులుగా ఇంటి ముఖం పట్టాడు విజయ్. దాదాపు రెండు కిలోమీటర్లు ఇల్లు స్కూలు నుంచి. రోజూ నడిచి వచ్చి నడిచే వెళతాడు. అయితే, రోజూ ఉండే ఉత్సాహం ఇవాళ ఏమాత్రం లేదు.నడుస్తూ ఆలోచిస్తున్నాడు. ఈ మధ్య నాన్న పరిస్థితి ఏమాత్రం బాలేదు.ఎప్పుడూ దిగులుగా కనిపిస్తున్నాడు. ఎంత బాధగా ఉంటుందో తనకి ఆయన్ని అలా చూస్తే. పొద్దున్నే దేవుడికి కూడా దండం పెట్టుకున్నాడు నాన్నని బాగా చూసుకొమ్మని. తనకి పోయిన సారి పరీక్షల్లో ఫస్ట్ మార్కులు వచ్చినప్పుడు ఎంత సంతోషించాడు నాన్న. ఈసారి కూడా అలాగే సంతోషపెట్టాలి. బాగా చదువుకోవాలి. ఫైనల్ ఎగ్జామ్స్ కి ఇంకా రెండు నెలలు కూడా లేదు. టైం వేస్ట్  చేయకూడదు అస్సలు.

ఆలోచిస్తూ నడుస్తున్నవాడల్లా ఒక్క క్షణం ఆగాడు. తనని స్కూలు నుంచి పంపేసారని గుర్తుకు వచ్చింది. దిగులు ఎక్కువైంది. మళ్ళీ నడవటం మొదలు పెట్టాడు. ఏం చేయాలి ఇప్పుడు?స్కూలు ఫీజు కట్టాలని చెప్పినప్పుడల్లా, నాన్న మొహంలో ఎంత విచారం. తలచుకుంటేనే ఏడుపు వస్తుంది. అందుకే ఈ మధ్య ఫీజు కట్టాలని గుర్తు చేయటం కూడా మానేసాడు. ఇప్పుడిక వేరే దారి లేదు. నాన్నను ఫీజు కట్టమని అడగాల్సిందే. లేకపోతే తను ఎగ్జామ్స్ కూడా రాయలేడు.

******

సూర్యం పని చేసే ఫ్యాక్టరీ మూతబడే స్థితిలో ఉందికొన్నాళ్ళుగా. జీతాలు సరిగ్గా ఇవ్వటం మానేసి చాలా కాలమైంది. ఇంటి ఖర్చులకే డబ్బు సరిపోవడం లేదు.మరుసటి రోజు నుంచీ పనిలోకి రానవసరం లేదనీ, ఫ్యాక్టరీ ఆరోజు నుంచీ మూసేసారని చెప్పాడు ఫ్యాక్టరీ మేనేజర్. కార్మికులంతా తమకు రావలసిన జీతం డబ్బు గురించి మేనేజర్ తో గొడవకు దిగారు.

మౌనంగా అక్కడనుంచి బయట పడ్డాడు సూర్యం. మనసంతా దిగులుగా ఉంది. దగ్గరలో ఉన్న బస్టాండ్ కు వచ్చి ఆగాడు ఇంటికి వెళ్ళే బస్సు కోసం చూస్తూ. ఉన్న ఉద్యోగం కూడా ఊడింది. వేరే ఎక్కడైనా పని వెతుక్కోవాలి ఇప్పుడు. ఖర్చులకి ఎక్కడా అప్పు పుట్టడం లేదు. అంతకు ముందే స్కూలు నుంచి ఫోన్ వచ్చింది విజయ్ ని ఇంటికి పంపేసారనిచెప్పటానికి.పదిహేను రోజులుగా దాదాపు రోజూ ఫోన్ చేసారు స్కూల్ వాళ్ళు ఫీజు కట్టకపోతే విజయ్ ని స్కూలు కు రానివ్వరని. నెల నెలా కట్టాల్సింది నాలుగు నెలలుగా కట్టడం లేదు మరి. వాళ్ళు మటుకు ఎన్నాళ్ళని భరిస్తారు.

కొడుకును తలచుకుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగినయ్. పాపం చిన్న పిల్లాడు. ఫీజు కట్టమని అడగడం కూడా మానేసాడు, బాధ పెట్టడం ఇష్టం లేక. తమ పరిస్థితి ఎంత బాగా తెలుసు వాడికి. పేరుకి పదేళ్ళ పిల్లవాడు కానీ, చేసేవన్నీ పెద్ద ఆలోచనలే. చాలా మంది వాడి వయసు పిల్లల్లా తనకు బట్టలు, ఆట వస్తువులు లాంటివి కావాలని ఎప్పుడూ పేచీ పెట్టలేదు. చదువు తప్ప వేరే లోకం లేదు వాడికి. ఎంత గర్వంగా వచ్చాడు తన దగ్గరకి క్రితం సారి పరీక్షల్లో క్లాసు ఫస్ట్ వచ్చానని చెప్పడానికి. ఎంత సంతోషం వాడి మొహంలో. ఆశలన్నీ వాడి మీదే పెట్టుకొని బతుకుతున్నాడు తను..

ఆలోచనలకి తాత్కాలికంగా బ్రేక్ పడేలా పెద్ద శబ్దం చేస్తూ ఇంటికి వెళ్ళే సిటీ బస్సు వచ్చింది. జనం పెద్దగా లేరు. ఎక్కి కూర్చున్నాడు. కిటికీ అద్దం మీద నీరసంగా తలవాల్చగానే ఆలోచనలు మళ్ళీ మొదలైనయ్. ఏం చేయాలి ఇప్పుడు? ఎలా ఈ డబ్బు సమస్య నుంచి బయటపడటం? పేదరికం ఎంత భయంకరమైంది నిజంగా. ఇంటికి వెళ్ళగానే తన వైపు ఆశగా చూసే భార్య, కొడుకు గుర్తుకు వచ్చారు. ఎంతో దుఃఖంగా అనిపించింది. ఏం చెప్పాలి వాళ్ళకి? ఉన్న ఉద్యోగం కూడా ఊడిందని చెప్పాలా? ఎక్కడా అప్పు పుట్టలేదని చెప్పాలా? విజయ్ లాంటి చురుకైన పిల్లవాడు స్కూలు ఫీజు కూడా సరిగ్గా కట్టలేని ఈ పేదింటి నాన్నకి పుట్టడం వాడి దురదృష్టం అని చెప్పాలా?

******

నాలుగు రోజులైంది సూర్యం ఉద్యోగం, విజయ్ స్కూలు మానేసి.ఎక్కడా డబ్బు పుట్టడం లేదు. ఇలాగే ఇంకొన్ని రోజులు గడిస్తే, పూట గడవటం కూడా కష్టమవుతుంది. సూర్యం ప్రతీ రోజూ ఎంతో ఆశగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎక్కడా పని దొరకడం లేదు. ఒకళ్ళిద్దరు పని ఉందని కబురు చేస్తామని ఫోన్ నెంబర్ తీసుకున్నారు కానీ ఆ తరువాత ఏమీ లేదు.

విజయ్ ని చూస్తూంటే కడుపు తరుక్కుపోతుంది సూర్యానికి. మనసులో దిగులు బయటకు చూపకుండా, ఉత్సాహంగా ఉంటూ తండ్రిని ఉత్తేజ పరచడానికి ప్రయత్నిస్తుంటాడు. క్షణం కూడా ఖాళీగా కూర్చోడు. తల్లికి సాయం చేయటం, ఇంటి పని చేయటం, కాస్త ఖాళీ దొరికితే క్లాసు పుస్తకాలు ముందేసుకొని చదువుతూ కూర్చోవడం చేస్తున్నాడు. వాడికి తెలుసు తనంటే తల్లిదండ్రులకి ఎంతో ఇష్టమని. తను దిగులుగా కనిపిస్తే వాళ్ళు తట్టుకోలేరని స్కూలు మానేసి ఇంట్లో కూర్చున్నాడన్న బాధను ఏమాత్రం బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు.

వేసవి మొదలవడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని మొహమాటం లేకుండా చూపిస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం చేసామనిపించి తమ ఒంటి గది ఇంట్లో ఓ మూలనున్న సగం మడిచిన చాప మీద కూర్చున్నాడు సూర్యం.గోడకు తల ఆనించి ఏదో ఆలోచిస్తున్నాడు.చమటలు పడుతున్నాయి ఇంట్లో ఉక్కబోతకి. ఫాను పాడైపోయి చాలా కాలమైంది. విజయ్ కూడా తండ్రి పక్కకు వచ్చి కూర్చున్నాడు. పాత న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకొని తన కోసం విసురుకున్నట్టుగా చేసి తండ్రికి బాగా గాలి వచ్చేలా విసిరాడు కాసేపు.ఏదైనా మాట్లాడి మూడ్ మర్చాలనుకున్నాడు.అయితే తను మాట్లాడబోయే విషయం తమ జీవితంలో ఓ గొప్ప మార్పు తీసుకురాబోతున్నదని ఏమాత్రం ఊహించలేదు విజయ్.

“నాన్నా, మా తెలుగు టీచర్ పాఠాలు చాలా బాగా చెబుతాడు. మొన్న మాకు ఏం చెప్పాడో తెలుసా?”

“ఏం చెప్పాడు?” అడిగాడు సూర్యం పెద్దగా ఆసక్తి చూపకుండా.

“మనకు మంచి జరగాలంటే, ఇతరులకు మనం ఏదైనా మంచి చేయాలి. అయితే ఏదీ ఆశించకుండా చేయాలి..”

“మన పరిస్థితికి మనం ఇంకెవరికైనా ఏంట్రా చేసేది?”

“అలా అనుకోకూడదు అని కూడా చెప్పారు నాన్నా. ఏ స్థాయి వారైనా, అంతకంటే తక్కువ స్థితిలో ఉన్నవారికి సహాయ పడాలి. బాగా డబ్బుంటేనే చేయొచ్చు అనుకోవటం సరి కాదు..”

“సర్లేరా..” నిరాశగా చెప్పాడు సూర్యం.మౌనంగా ఉండిపోయాడు విజయ్ తను చెప్పింది తండ్రికి పెద్దగా నచ్చలేదనిపించి.

జాలేసింది విజయ్ ని చూస్తే.ఏదో ఒకటి మాట్లాడాలని అడిగాడు సూర్యం.

“ఇంకా ఏం చెప్పార్రా మీ టీచర్?”

“ఇంకా ఏదో చెబుతున్నాడు నాన్న.సరిగ్గా ఆ టైం లోనే అటెండర్ వచ్చి నన్ను క్లాసు నుంచి బయటకు తీసుకెళ్ళిపోయాడు. బాగా ఏడుపొచ్చింది నాకప్పుడు..” అమాయకంగా చెప్పాడు జరిగింది గుర్తుకు తెచ్చుకుంటూ.

అప్పుడు కదిలాడు సూర్యం. అప్పటిదాకా మనసులో గూడు కట్టుకొని ఉన్న బాధ అంతా ఇక ఆగలేనట్టుగా కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది ఏడుపు రూపంలో. విజయ్ ని దగ్గరకు తీసుకొని గట్టిగా హత్తుకొని  ఏడుస్తూ అన్నాడు “ఈ చేతకాని తండ్రిని క్షమించు నాన్న..”.

ఏదో పనిలో ఉన్న భార్య లక్ష్మికూడా ఎప్పుడూ నిబ్బరంగా ఉండే సూర్యం ఏడవటం చూసి ఒక్క క్షణం నిర్ఘాంతపోయి గబుక్కున దగ్గరకు వచ్చింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగినయ్ అంత దీనంగా ఏడుస్తున్న భర్తను చూసి. భర్తను, కొడుకును చేతుల్తో చుట్టేసింది బాధగా.

******

సాయంత్రం ఐదు. ఆ రోజు మధ్యాహ్నం జరిగింది ఇంకా కళ్ళ ముందు మెదుల్తుంది విజయ్ కి. అమ్మా నాన్నా తనని పట్టుకొని ఏడవటం, తరువాత కాసేపటికి నాన్న ఏమీ మాట్లాడకుండా కళ్ళు తుడుచుకొని అంత ఎండలో బయటకు వెళ్ళటం అన్నీ. ఇంకా ఏదో ఆలోచిస్తుండగా బయట నుంచి “విజయ్..” అని గట్టిగా వినిపించడంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. వెంటనే మొహంలో సంతోషం. ఆ గొంతు గుర్తుపట్టాడు. తన క్లాస్ మేట్ రవి వచ్చాడు. బయటకు పరిగెత్తాడు వెంటనే.

రవితో బయట నిలబడి మాట్లాడుతుండగా సూర్యం ఇంటికి తిరిగొచ్చాడు. మొహం అలసటగా ఉంది. వస్తూనే ఓపిక లేక కుర్చీలో కూలబడ్డాడు. భార్య ఇచ్చిన మంచి నీళ్ళు తాగి చెప్పాడు దుఃఖంగా.

“ఎక్కడా ఏ పనీ దొరకడం లేదు. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం మాటలు కాదు. నా దిగులంతా విజయ్ చదువు గురించే.. చక్కగా చదువుకునే పిల్లాడు స్కూలు మానేసి ఇలా ఇంట్లో కూర్చుంటే చూడలేక చచ్చిపోవాలనిపిస్తుంది..”

“ఏం మాటలండీ అవి..” అని లక్ష్మి ఇంకా ఏదో అంటూండగా విజయ్ లోపలకు వచ్చాడు పరిగెత్తుకుంటూ. మొహంలో సంతోషంతో కూడిన వెలుగు.

“నాన్నా మా ప్రిన్సిపల్ సర్ రేపటి నుంచీ నన్ను స్కూలుకు రమ్మన్నారుట. రవి చెప్పాడు. ఫీజు ఫైనల్ ఎగ్జామ్స్ మొదలయ్యే లోపు కట్టమన్నారు..” మెరిసే కళ్ళతో చెప్పాడు.

“ఏంటీ. ఎంత మంచి వార్త చెప్పావురా. ఇంక నాకు ఏ దిగులూ లేదు. బాగా చదువుకో. మొత్తం ఫీజు తొందర్లోనే కట్టేద్దాం.. మీ ప్రిన్సిపల్ గారిని కలిసి థాంక్స్ చెప్పు..” చెప్పాడు సూర్యం పట్టరాని సంతోషంతో. ఎక్కడ లేని శక్తి వచ్చినట్టనిపించింది.

“వీడు బాగా చదువుతాడనే కాబోలు మళ్ళీ రమ్మన్నది. లేకపోతే ఈ రోజుల్లో ఫీజు కట్టకుండా బళ్ళో ఎవరు ఉండనిస్తారు..” చెప్పింది లక్ష్మిసంబరంగా.

******  

విజయ్ తిరిగి స్కూల్ కు వెళ్ళటం మొదలు పెట్టి వారం రోజులు అయిన తరువాత జరిగిందా సంఘటన. ఎక్కడా పని దొరక్క నిరాశ, నిస్పృహలతో ఇంటికి తిరిగి వెళ్తున్నాడు సూర్యం ఆరోజు కూడా ఎప్పటిలాగే. షేరింగ్ ఆటో దొరికితే ఎక్కాడు. మధ్యాహ్నం రెండు. పొద్దుటినుంచీ ఏమీ తినకపోవటంతో బాగా ఆకలిగా ఉంది. ఇంటికి వెళ్ళి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు. ఒంట్లో కూడా పెద్దగా బాలేదు.

విజయ్ చదివే స్కూలు మీదుగా వెళ్తుంది ఆటో. అటు వైపు చూస్తూంటే విజయ్ గుర్తుకు వచ్చాడు. ఎంత చిన్నతనంగా ఫీల్ అయ్యుంటాడు పాపం క్లాసు నుంచి బయటకు పంపేస్తూంటే. కళ్ళు తడి అయినయ్ ఆ దృశ్యం ఊహించుకుంటే. స్కూల్ ప్రిన్సిపల్ కు మనసులోనే కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు ఫీజు కట్టడానికి టైం ఇచ్చినందుకు.ఆటోలో ముందు వైపు కూర్చొని బయటకు చూస్తూ ఆలోచిస్తున్నాడు.

ఆటో ఓ చోట ఆగింది మరి కొంత మందిని ఎక్కించుకోటానికి. ఇంకో ఇద్దరు ఎక్కాక కదిలింది అక్కడనుంచి. కదిలాక ఎందుకో తల తిప్పి వెనక వైపుకు చూసాడు. అక్కడ కనిపించింది చూసి మనసంతా పాడైంది ఒక్క క్షణం. టీకొట్టు దగ్గర ఓ నిరుపేద ముసలమ్మనిలబడలేక ఓ పక్కగా కూర్చుంది. చాలా నీరసంగా, దీనంగా ఉంది. ఎండ మాడ్చేస్తుంది ఓ పక్క. తిండి తిని ఎంతో కాలమైనట్టుగా ఉంది. ఎవరైనా సాయం చేస్తారేమోనని వచ్చీ పోయే వారి వైపు చూస్తుంది ఆశగా. ఎవరూ పట్టించుకోవట్లేదు.

మనసుకు తాకేలా విజయ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చినయ్. “మనం చేసే మంచి పనుల వల్ల మనకు మంచి జరుగుతుంది.. ఏ స్థాయి వారైనా తమ కంటే తక్కువ స్థితిలో ఉన్న వారికి సాయం చేయాలి”. ఆటో దిగేసి వెనక్కివెళ్ళి ముసలమ్మకు తినటానికి ఏదైనా కొనిచ్చి ఓ పది రూపాయలు చేతిలో పెడదామని బలంగా అనిపించింది. వేగంగా వెళ్తుంది ఆటో. నీరసంగా ఉంది ఓ పక్క. ఆటో దిగేస్తే ఇప్పుడప్పుడే ఇంకో ఆటో దొరికేలా లేదు. ఇంటికి నడిచి వెళ్ళాలి ఎండలో. ఏమాత్రం శక్తి లేదు. ఎటూ తేల్చుకోలేక చివరకు ఆటో ఓ పక్కన ఆపమని దిగేసాడు ఏదైతే అదవుతుందని.  

వడివడిగా వెనక్కు వెళ్ళి తను చేయాలనుకున్నది చేసాక చాలా తృప్తిగా అనిపించింది. ముసలమ్మ కళ్ళలో కనిపించిన ఆనందం ఇచ్చిన సంతృప్తి ఎంత డబ్బు పెడితే మటుకు దొరుకుతుంది అనుకున్నాడుమనస్పూర్తిగా.నడిచే ఇంటికి చేరుకున్నాడు.

******

రెండ్రోజుల తరువాత. ఉదయం పదకొండు.

“హలో, మాట్లాడేది సూర్యమా?”

“అవును సర్.. చెప్పండి” నమ్రతగా చెప్పాడు

“వెంటనే మా ఫ్యాక్టరీ కి వస్తారా? మీ జాబ్ గురించి..” అని ఫ్యాక్టరీ పేరు చెప్పాడు. ఆశ్చర్యపోయాడు సూర్యం. అది ఊళ్ళోనే చాలా పెద్ద ఫ్యాక్టరీ. వస్తానని చెప్పి ఫోన్ పెట్టేసాడు. తనలాంటి వాడ్ని అక్కడ అసలు చేర్చుకుంటారా? తన గురించి వీళ్ళ కెలా తెలిసింది? జీతం ఎంతిస్తారు?అయినా ఇదంతా ఉద్యోగం దొరికినప్పుడు కదా అనుకున్నాడు. చిన్నగా నవ్వుకొని ఉన్నంతలో మంచి బట్టలు వేసుకొనిబయలుదేరాడు. తనకు అక్కడ పని దొరకదని ఎందుకో చాలా నమ్మకంగా అనిపించింది. గత కొంత కాలంగా ఎన్నో చోట్ల ట్రై చేసి ఫెయిల్ అవడంతో మనసు పాజిటివ్ గా ఆలోచించడం మానేసింది. 

******

“విజయ్..”

స్కూలు ఎదురుగా ఉన్న ఓ చెట్టు నీడలో పుస్తకాలు ముందేసుకొని కూర్చున్న విజయ్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు తన పేరు విని. గొంతు గుర్తు పట్టి భయంగా తలెత్తి చూసాడు. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నోట మాట రాలేదు.

******

జరిగిందంతా ఒక్కసారి తలచుకున్నాడు సూర్యం. అంతా కలలా అనిపించింది.

చాలా తేలిగ్గా ఉద్యోగం దొరికింది అంత పెద్ద పేరున్న ఫ్యాక్టరీ లో. ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసి తను ఆశించిన దానికన్నా కాస్త ఎక్కువగానే జీతం ఇవ్వటానికి ఒప్పుకున్నారు. సూర్యం ఆనందానికి పట్ట పగ్గాలు లేవు.

జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక మరుసటి రోజు నుంచీ పనిలోకి రమ్మన్నారు. సంతోషంగా అక్కడ నుంచి వెళ్ళబోతుండగా ఇంకాసేపు కూర్చోమన్నారు జనరల్ మేనేజర్ ని కలవాల్సిన పని ఉందని.

ఆశ్చర్యపోయాడు. అంత పెద్ద ఫ్యాక్టరీ జి.ఎం కి తన లాంటి సాధారణ కార్మికుడితో ఏంటి పని? ఇంతకు ముందు పని చేసే చోట కూడా ఆ స్థాయి వ్యక్తిని దూరం నుంచి చూడటమే తప్ప కనీసం ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటిది తనని కలుస్తానంటాడేంటి ఇక్కడ? కాస్త అలజడిగా అనిపించింది.

మొత్తానికి కాసేపటి తరువాత జి.ఎం ఆఫీసు నుంచి పిలుపు వచ్చింది. గబగబా వెళ్ళాడు. ఏ.సి గది అవటంతో గదంతా చల్లగా, ఏ చప్పుడూ లేకుండా ప్రశాంతంగా ఉంది. మెత్తటి కార్పెట్ మీద భయంగా అడుగు పెట్టి లోపలకు వెళ్ళాడు సూర్యం. హుందాగా ఉన్నాడు జి.ఎం టక్ చేసుకున్న మంచి వైట్ షర్టు, బ్లూ కలర్ టై తో. కుర్చీలోంచి లేచి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కూర్చోమని చెప్పాడు. ఏమీ అర్ధం కావట్లేదు సూర్యానికి. టేబుల్ కు ఇవతలి పక్కగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు నమ్రతగా. ఏం జరుగుతుందసలు? ఇంకెవరైనా అనుకొని తనని పిలిచారా కొంపదీసి?

“మీకు ఇక్కడ ఉద్యోగం దొరకటానికి కారణం మీ అబ్బాయి విజయ్.. అఫ్ కోర్స్ మీ పనితనం గురించి ఎంక్వయిరీ చేసాకే తీసుకున్నాం”

“ఏంటి సర్ మీరనేది? మా అబ్బాయి మీకెలా తెలుసు?”

చిన్నగా నవ్వి జవాబిచ్చాడు జి.ఎం.

“మీ అబ్బయి మామూలు వాడు కాదు. మీరనుకున్నట్టు రోజూ మీ వాడు స్కూల్ కు వెళ్ళటం లేదు. ఫీజు కట్టలేక మీరు పడుతున్న బాధ చూడలేక,మీకు అబద్ధం చెప్పి యూనిఫాం వేసుకొని స్కూల్ కు వెళ్ళినట్టుగా వెళ్ళి అక్కడే బయట కూర్చొని టైం అయ్యాక ఇంటికి వస్తున్నాడు.అయితే, అక్కడ ఉన్నంత సేపూ ఊరికే కూర్చోకుండా, గార్డెన్ లో మొక్కలకు నీళ్ళు పోయటం, చిన్న తరగతుల పిల్లలతో హోం వర్క్ చేయించటం, స్నేహితుల దగ్గర పుస్తకాలు అడిగి తీసుకొని మిస్ అయిన పాఠాలు రాసుకోవటం, బయట పిల్లలకు చాక్లెట్లు మొదలైనవి అమ్మే తాతకు సాయం చేయటం లాంటివెన్నో చేస్తున్నాడు.

ఆరోజు కూడా ఆ తాతకు మెడికల్ షాప్ నుంచి ఏదో కావాలంటే దగ్గరలో ఉన్న మార్కెట్ కు వచ్చాడు. ఆ టైం లో అక్కడే ఉన్నాను నేను. మా అబ్బాయి ఐదేళ్ళ వాడు జనంలో ఎక్కడో తప్పి పోయాడు. కంగారుగా అంతా వెదికాను. ఎక్కడా లేడు. ఈ లోగా కాస్త దూరంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ దగ్గరనుంచి లౌడ్ స్పీకర్ లో వినిపించింది మా వాడు అక్కడే ఉన్నాడనీ, వెంటనే నన్ను అక్కడకు రమ్మని. తప్పిపోయి ఏడుస్తూ రోడ్డు మీద తిరుగుతున్న మా అబ్బాయిని విజయ్ గమనించాడు. స్పీడుగా వచ్చి తగలబోయిన ఏదో వెహికల్ నుంచి మావాడ్ని తప్పించటమే కాకుండా ట్రాఫిక్ పోలీస్ దగ్గరకు తీసుకు వెళ్ళి జరిగింది చెప్పి స్పీకర్ లో అనౌన్స్ చేయించాడు.

మీవాడు ఓ జెం. వాడు చేసిన సాయం ఎప్పటికీ నేను మర్చిపోలేను. థాంక్స్ చెప్పి ఏదైనా కొనుక్కోమని డబ్బు ఇవ్వబోతే తీసుకోనన్నాడు. టీచర్ చెప్పాడట ఏదీ తీసుకోకుండా హెల్ప్ చేస్తేనే అది మంచి పని అవుతుందని.

నోట మాట రాలేదు నాకు.ఇంత చిన్న వయసులో అంత మెచ్యురిటీ ఉండటం చాలా అరుదు. ఆసక్తిగా అనిపించి వాకబు చేస్తే మీ విషయాలన్నీ తెలిసాయి. వెంటనే మీకు ఇక్కడ పని దొరికేలా చేసాను. అలాగే మీకు మొదటి నెల జీతం అడ్వాన్సు గా ఇవాళే ఇమ్మని చెప్పాను. వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకోండి. ”

******

లేచి నుంచున్నాడు విజయ్. భయమేసింది ఎదురుగా ఉన్న తండ్రిని చూసి. గట్టిగా వాటేసుకున్నాడు సూర్యం. కన్నీళ్లు ఆగట్లేదు.

కాసేపటికి తేరుకున్నాడు. “పద నాన్న నీ స్కూల్ ఫీజు కట్టేద్దాం” చెప్పి విజయ్ ని తీసుకొని లోపలకి వెళ్ళి ఫీజు కట్టేసాడు. అప్పటికప్పుడే క్లాసు లోకి వెళ్ళాడు విజయ్.

సాయంత్రం ఇంటికి వచ్చాక అమ్మా నాన్నలతో కాసేపు స్కూల్ కబుర్లు చెప్పాడు విజయ్. అంతా సంతోషంగా ఉన్నారు. మొదటినుంచీ జరిగినదంతా చెప్పాడు సూర్యం భార్యకు. విజయ్ కూడా ఉత్సాహంగా విన్నాడు.

“మీ తెలుగు టీచర్ చెప్పెంది నిజం రా. మనకు మంచి జరిగేది మనం చేసే మంచి పనుల వల్లే. అమ్మా నాన్నలను సంతోష పెట్టాలన్న నీ మంచి ఆలోచనే మాకు అబద్ధం చెప్పి స్కూలు దగ్గరకు వెళ్ళేలా చేసింది. అంతే కాక, ఊరికే కూర్చోకుండా నువ్వు మొక్కలకి నీళ్ళు పోయటం, పిల్లలకి పాఠాలు చెప్పటం లాంటి మంచి పనులు చేసావు. ఎవరికైనా సాయం చేయాలి అంటే బాగా డబ్బుండాలి అని తప్పుగా అనుకునే ఎంతో మందికి నువ్వు పాఠం నేర్పావు. నువ్వు చేసిన మంచి పనుల వల్లే ఇవాళ నాకు పని దొరికింది..”

“ఇంకో విషయం నీకు తెలీదు నాన్న. నేను చేసిన దానికంటే నువ్వు చేసిన మంచి పని వల్లే నీకు జాబ్ దొరికింది..” చెప్పాడు విజయ్ ఏదో రహస్యం చెప్పబోతున్నట్టు.

“ఏంట్రా నువ్వనేది..”

“నిన్ను ఆరోజు దూరం నుంచి చూసాను నాన్న స్కూల్ దగ్గర. ఎక్కడికో నడిచి వెళ్తున్నావు. ఎక్కడ నన్ను చూస్తావో అని భయమేసి ఇంకో పక్కకు పరిగెత్తి వెళ్ళాను. అక్కడే నాకు తప్పిపోయిన బాబు కనిపించాడు. ఆరోజు నువ్వు అక్కడ లేకపోతే, నేను ఆ బాబును చూడటం జరిగేదే కాదు..” చెప్పి బయటకు ఆడుకోటానికి వెళ్ళాడు విజయ్.

జరిగినదంతా చాలా విచిత్రంగా అనిపించింది సూర్యానికి. ఆ రోజు తను ఆటో దిగి వెనక్కు వెళ్ళి ముసలమ్మకు సాయం చేయటం గుర్తుకు వచ్చింది.వెనక్కు వెళ్తుండగా విజయ్ తనని చూసాడన్నమాట. ఒకదానికొకటి కనెక్ట్ చేసి చూసుకున్నాడు. మంచి చేస్తే మంచి ఎలా జరుగుతుందో చక్కగా అర్ధమైంది.

భార్యకు తనకు అర్ధమైంది వివరించి చెప్పాడు ఉత్సాహంగా.

“ఇవాళ మనకింత మంచి జరగటానికి ఒకటి కాదు వరుసగా జరిగిన ఎన్నో మంచి పనులు కారణం లక్ష్మీ. సిలబస్ లో ఉన్నవే కాక పిల్లలకు గొప్ప విషయాలు నేర్పాలన్న మంచి ఆలోచనతో తెలుగు టీచర్ మంచి చేయటం గురించి చెప్పటం,అదే విషయం విజయ్ నాకు చెప్పటం, వాడు కూడా వెంటనే ఆచరణలో పెట్టడం,స్కూలు దగ్గర చాక్లెట్లు అమ్మే తాతకు సాయం చేయటానికి మార్కెట్ కు వెళ్ళటం,వాడు చెప్పింది గుర్తుకు వచ్చి నేను ఆ ముసలమ్మకు సాయం చేయటం, నన్ను చూసి ఇంకో పక్కకు వెళ్ళినవిజయ్ అనుకోకుండా జి.ఎం గారి అబ్బాయికి సాయం చేయటం, జి. ఎం గారు మంచితనంతో మన గురించి వాకబు చేసి నాకు ఉద్యోగం ఇవ్వటం.. వీటన్నిటిలో ఏ ఒక్కరైనా, ఏ ఒక్క విషయంలోనైనా మనకెందుకులే అని ఊరుకొని ఇతరులకు నిస్వార్థంగా మంచి చేయక పోయి ఉంటే ఇవాళ నాకీ ఉద్యోగం దొరికేదే కాదు..”

 

మరిన్ని కథలు