Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

ఏపీ యూత్‌ ఐకాన్‌ వైఎస్‌ జగన్‌.!

AP Youth Icon YS Jagan!

ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి పీటం ఎక్కుతున్నారు. సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం వెనుక వైఎస్‌ జగన్‌ పడిన కష్టం అంతా ఇంతా కాదు. అంతా కలిపి పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో వైఎస్‌ జగన్‌ చూడని ఎత్తు పల్లాల్లేవు. కడప ఎంపీగా గెలవడం దగ్గర్నుంచీ, రేపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం వరకూ వైఎస్‌ జగన్‌ వేసిన ప్రతీ అడుగూ ప్రత్యేకమే. సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే, కష్టసాధ్యమైన ప్రయాణాన్ని సైతం ఆత్మ విశ్వాసంతో చేయగలమని నిరూపించారు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.

వైఎస్‌ జగన్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే యూత్‌ ఐకాన్‌గా మారారు. తెలంగాణాలోనూ వైఎస్‌ జగన్‌కి లక్షలాది మంది అభిమానులున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో విడిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, ఇక్కడి రాజకీయ పరిస్థితుల్ని విశ్లేషించుకుని, తనను తాను ముందుకు నడిపించుకున్నారు. అనుకున్నది సాధించే క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అక్రమార్కుల కేసులో జైలుకు వెళ్లొచ్చి, ఇప్పటికీ ఆ కేసులో విచారణల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా కానీ, నమ్మిన సిద్ధాంతం కోసం ముళ్ల బాటలోనూ ముందడుగు వేశారు తప్ప, ఎప్పుడూ చేతులెత్తేయలేదు జగన్‌.

పార్టీ ఫిరాయింపుల దెబ్బకి తెలంగాణాలో వైసీపీ అంతర్ధానమైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ దిక్కు తోచని పరిస్థితిలో పడింది. అయినా కానీ జగన్‌ కుంగిపోలేదు. శక్తినంతా కూడదీసుకుని, పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్లారు. అదే జగన్‌ ప్రభంజనానికి నాంది పలికింది. రాజకీయాలు, రాజకీయ విమర్శలూ పక్కన పెడితే, ఓ యువకుడు సుదీర్ఘ రాజకీయ అనుభం ఉన్న చంద్రబాబులాంటి వ్యక్తిని ఢీకొనడం చిన్న విషయం కాదు. రాజకీయాల్లో ఫార్టీ ప్లస్‌ చాలా చిన్న వయసే. ఆ మాటికొస్తే, థర్టీ ప్లస్‌ వయసులోనే ముఖ్యమంత్రి పదవి లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్‌ జగన్‌ అనుకున్నది సాధించడం ద్వారా నేటి యువతకు స్పూర్తిగా మారారు. అందుకే వైఎస్‌ జగన్‌ 'నయా యూత్‌ ఐకాన్‌'.!

మరిన్ని యువతరం
Strange creatures in the world of technology.