Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
AP Youth Icon YS Jagan!

ఈ సంచికలో >> యువతరం >>

సాంకేతిక ప్రపంచంలో వింత జీవులు.!

Strange creatures in the world of technology.
సాంకేతికత కారణంగా సముద్రపు అంచుల్ని, ఆకాశపు ఎత్తుల్ని చూసేస్తున్నాం. పాతాళలోకం, నాగలోకం.. అంటూ ఇలా ముల్లోకాల గురించి మాట్లాడుకుంటారు. కానీ, సాంకేతికతలో ఉన్న లోపాల్ని సారీ.. లోకాల్ని లెక్క పెట్టగలరా.? ఛాన్సే లేదు. అనంత విశ్వంలో అనంతంగానే భాగమైపోయింది ఈ సాంకేతికత. సాంకేతికత పేరు చెప్పి జనాల్లోకి ముఖ్యంగా పిల్లల మనసుల్లోకి చొచ్చుకొస్తున్న కొన్ని వీడియో గేమ్స్‌ పిల్లల్ని సాంకేతికి వింత జీవులుగా మార్చేస్తోంది. ఒకప్పుడు అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు, పిన్ని, బాబాయ్‌, అత్త, మామ, బావ, వదినా.. అంటూ ఇలా రకరకాల వరుసలు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు రకరకాల పేర్లతో పిలవబడే ఆన్‌ లైన్‌ గేమ్స్‌ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. మానవ సంబంధాలను దాదాపుగా మర్చిపోయారు. మానవాతీత సంబంధాలతో సావాసం చేస్తున్నారు. మనుషుల మధ్యనే ఉంటూ వింత జీవుల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ వింత ప్రవర్తన ఒక్కోసారి అత్యంత ప్రమాదకరంగా మారిపోతోంది. మానసిక నిపుణులకు సైతం తట్టని మాయ రోగమైపోతోంది.

ఈ సమాజానికి ఏమైంది.? ఏంటీ సాంకేతిక సెగ.? మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుందిది. అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ ఫోన్‌లు.. రిమోట్‌ ఏరియాస్‌లోకి కూడా చొచ్చుకుపోయే నెట్‌ వర్క్‌.. తద్వారా అందరికీ ఈజీగా చేరువైపోయిన సాంకేతికత.. ఈ కారణాలతో మనుషులు విచక్షణ కోల్పోతున్నారు. సాంకేతికత కారణంగా తెలివితేటలు మరింత పెరగాలే కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న మతి పోయి, మతి లేని వాళ్లలా మారిపోతున్నారు. పుట్టుకతోనే మతిలేని వాడిగా పుడితే, సాంకేతికంగా వైద్యరంగంలో వచ్చిన మార్పులతో, ఏదో ఒక మందేసి మనిషిగా మార్చొచ్చేమో. కానీ ఈ సాంకేతికత 'కోసం' పిచ్చివాడిలా మారుతున్న మనిషికి మరణమే శరణమవుతోంది. ఇదివరకూ కాన్సర్‌ వంటి మహమ్మారి రోగం వస్తే, ఇక చావుకు దారి సిద్ధం చేసుకోవడమే అనుకునేవారు. కానీ అలాంటి మహమ్మారికి టెక్నాలజీ కారణంగా మందులు కనిపెట్టి, ఎంతో మంది ప్రాణం నిలబెడుతున్నారు. కానీ అదే టెక్నాలజీ అనవసరమైన కారణాలతో ఆ ప్రాణాల్ని తృణ ప్రాయంగా హరించి వేస్తోంది.

ఆన్‌లైన్‌ గేమ్స్‌లో నిమగ్నమైన పిల్లలు ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. అదో రకమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోతున్నారు. జనాల్ని మర్చిపోతున్నారు. రిలేషన్స్‌కి విలువివ్వడమే లేదు. ఆఖరికి తల్లితండ్రుల్ని కూడా మర్చిపోతున్నారంటే అతిశయోక్తి కాదేమో. 
దీన్ని నిరోధించే మార్గమే లేదా.? అంటే ఒక జనరేషన్‌ ఆల్రెడీ ఈ సాంకేతికతకు అడిక్ట్‌ అయిపోయింది. ఆ కారణంగా జరుగుతున్న దుష్పరిణామాల గురించి వింటూనే ఉన్నాం. ఇక నెక్ట్స్‌ జనరేషన్‌ అయినా ఈ మహమ్మారి నుండి కాపాడాలంటే ఒక్కటే మార్గం. 'మొక్కయి వంగనిది, మానై వంగునా.!' అనే మన పెద్దలు చెప్పే సామెతను పాఠించాల్సిందే. ఇది పూర్తిగా తల్లితండ్రులపై ఉన్న బాధ్యతే. విచ్చలవిడిగా మార్కెట్‌లోకి వచ్చిన ఆన్‌లైన్‌ గేమ్స్‌ పట్ల అవగాహన ఉండాలి కానీ, అదే వ్యసనంగా మారిపోకూడదు. ఆ చిన్న గీతను తల్లితండ్రులు పిల్లలకు, వారి భాషలోనే వివరించి చెబితే ఈ మహమ్మారిని కాస్తయినా దూరం పెట్టగలం. 1000 లో 10 మంది, వందలో ఒక కుర్రాడినైనా ఈ ఆన్‌లైన్‌ గేమ్స్‌ నుండి దూరంగా ఉంచగలిగితే, ఆ 10 నెంబర్‌ 100 అవుతుంది. 100, 100 అవుతుంది. అలా లక్షలు, కోట్లు.. భవిష్యత్తును కాపాడగలమనే ధైర్యం వస్తుంది. ఆలోచించుకోండి పేరెంట్స్‌, నేటి పిల్లలే రేపటి పౌరులు. ఈ రోజు, ఈ క్షణం పుట్టిన పిల్లల విషయంలోనైనా ఈ కాస్తపాటి జాగ్రత్తను మీరు పాఠిస్తే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినవారవుతారు. మీ పిల్లల్ని సాంకేతిక ప్రపంచంలో వింత జీవుల్లా కాకుండా, సమాజానికి ఉపయోగపడే పౌరుల్లా పెంచినవారవుతారు. తస్మాత్‌ జాగ్రత్త.
మరిన్ని యువతరం