Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Your inner environment, your external environment

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - - భమిడిపాటిఫణిబాబు

జయంతులు

జూన్ 10

1.శ్రీ పైడిమర్రి  వెంకట సుబ్బారావు : వీరు జూన్ 10, 1916 న అన్నెవర్తి లో జన్మించారు. వీరు రచయిత, బహుభాషావేత్త.  భారత జాతీయ ప్రతిజ్ఞ  ( భారత దేశం నా మాతృభూమి…. ) రూపకల్పన చేసింది వీరే…  వీరు రాసిన ప్రతిజ్ఞలో కాలానుగుణంగా కొన్ని స్వల్ప మార్పులు మాత్రం జరిగాయి. గ్రాంథికంలో కొన్ని పదాల స్థానంలో వాడుక భాష వాడారు. ఇతర భాషల్లోకి అనువదించి 1963 నుంచి దేశ ప్రతిజ్ఞగా అమలులోకి వచ్చింది..

2. ఈదర వీర వెంకట సత్యనారాయణ  :  E V V  గా ప్రసిధ్ధిచెందిన వీరు, జూన్ 10, 1958 న దొమ్మేరు లో జన్మించారు. తెలుగు సినిమా  ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఎంతోమంది నూతన నటీనటులని పరిచయం చేసారు.

 జూన్ 11

శ్రీ  ధారా రామనాధ శాస్త్రి :  వీరు, జూన్ 11, 1932 న ఒంగోలు లో జన్మించారు. నాట్యావధానిగా సుప్రసిధ్ధుడు. నాట్యావధానము అనే నూతన ప్రక్రియను ఇతడు ప్రారంభించాడు. పృచ్ఛకులు సాంఘిక , చారిత్మిక, ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలలో ఏదైనా ఒక సన్నివేశం చెబితే అప్పటికప్పుడు పది నిమిషాలలో ఆ సన్నివేశానికి తగిన ఆహార్యంతో పాత్రోచితంగా నటించడం. సుమారు 500 కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు.

వర్ధంతులు

జూన్ 7

శ్రీ జెట్టి వీర రాఘవులు : జే.వి. రాఘవులు గా ప్రసిధ్ధిచెందిన వీరు, ప్రముఖ సంగీత దర్శకులు.  వీరు స్వరపరచిన ఎన్నో ఎన్నెన్నో సినిమా పాటలు ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాయి. సుమారు 172 సినిమాలకు సంగీతదర్శకత్వం వహించారు.

వీరు జూన్ 7, 2013 న స్వర్గస్థులయారు.

జూన్ 8

శ్రీ దాశరధి  రంగాచార్య :  ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణా సాయుధ పోరాట వీరుడు.
తెలంగాణా సాయుధ పోరాటం నాటి స్థితిగతులు,  ఆ కాలంలోని దారుణమైన బానిస పధ్ధతులను , వీరు రాసిన “ చిల్లరదేవుళు “ “ మోదుగు పూలు “ “ జనపదం “ నవలల్లో చూపించారు. చరిత్రలోనే మొదటిసారి, నాలుగు వేదాలను, తెలుగులోకి అనువదించారు. ఇతర భాషలలోని ఎన్నో గ్రంధాలను తెలుగులోకి అనువదించారు. ఎన్నో కథలు, నవలలు, వ్యాసాలూ రచించి, తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేసారు.

వీరు జూన్ 8, 2015 న స్వర్గస్థులయారు.

జూన్ 9

శ్రీ   గోగినేని రంగనాయకులు :  ఎన్. జి. రంగా గా ప్రసిధ్ధులు. ప్రముఖ స్వాతంత్ర యోధుడు. రైతు  నాయకుడు. రైతాంగ విధానానికి మద్దతునిచ్చిన వీరిని , “ భారత రైతాంగ పిత “ గా భావిస్తారు. ఎన్నో సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందించారు..

వీరు జూన్ 9, 1995 న స్వర్గస్థులయారు.

జూన్ 10

 శ్రీ  కందుకూరి శివానంద మూర్తి  : వీరు ప్రముఖ  మానవతా వాది, ఆధ్యాత్మిక తత్వవేత్త.. వీరికి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో శిష్యులు ఉన్నారు. రాజకీయ, సాంస్కృతిక ఆధ్యాత్మిక చరిత్ర మీద ఆయన రాసిన వ్యాసాలు ఒక తెలుగు డైలీలో ప్రచురితమై తరువాత భారతీయత పేరిట రెండు సంపుటాలుగా ముద్రితమయ్యాయి..  హిందు ధర్మం, దాని చరిత్ర, సంగీత సాహిత్యాలు, నాట్యనాటకాల విషయాల్లో ఆయన ఒక  విజ్ఞాన సర్వస్వం.  పురాణాలు, కావ్యాలు, సాహిత్య గ్రంధాలనుంచి ఆంధ్రదేశ చరిత్రను క్రోడీకరించి, “ మనకథ “ పేరిట  గ్రంధస్తం చేసారు.

వీరు జూన్ 10,  2015 న స్వర్గస్థులయారు.

 

జూన్ 12

శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి :  వీరు సినారె గా ప్రసిధ్ధులు. తెలుగు కవి, సాహితీవేత్త.  తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సాహితీ సేవలకు గుర్తింపుగా,  1988 లో వారి “ విశ్వంభర” కావ్యానికి, జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. తెలుగు చిత్రసీమలో ఆయన రాసిన పాటలు ప్రసిధ్ధి చెందాయి. రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. వీరిగ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి.

వీరు  జూన్ 17, 2017 న స్వర్గస్థులయారు.

 

 

 

 

మరిన్ని శీర్షికలు
Benefits of cashew nuts ..