Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prema enta madhram

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue321/822/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

 

(గత సంచిక తరువాయి)... ఇంతలో బయటి నుంచి మాలతి హడావుడిగా పరుగెత్తుకొచ్చింది.

“మీకీ విషయం తెలుసా?’’ అంది ఆయాసంతో వగరుస్తూ.

“నువ్వు చెప్పనిదే ఎలా తెలుస్తుందీ! మాకేం దివ్యదృష్టి లేదే!’’ దీర్ఘం తీసింది రమ్య కాస్త వ్యంగ్యంగా.

“నిన్నరాత్రి...మన శంకర్రావుకి... ఈ మేడ మీదా......’’ రొప్పుతోంది మాలతి.

“తొందరేం లేదులే...ఆయాసం తగ్గకే చెప్పు...’’ చిరాగ్గా అంది రమ్య.

“నిన్న రాత్రి... శంకర్రావుకి...దెయ్యం కనబడిందట!’’ చెప్పింది మాలతి గభాలున. మౌక్తిక, రమ్యలు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ‘దెయ్యమా! ఈ రోజుల్లోనా! దేన్ని చూసి ఏమనుకున్నాడూ!’

“డోంటాక్ రబ్బిష్.  .దెయ్యమేమిటి నా ముఖం...ఏదో పీడకల వచ్చుంటుంది...’’ విసుగ్గా అంది రమ్య.

“కల్పించి చెప్పడానికి నాకేం అవసరం! అతడు నిజంగా చూశాడుట...ఆ భయానికి ఝడుసుకుని జ్వరం కూడా పెట్టుకున్నాడు...అవతల ఒకటే హంగామాగా ఉంది..’’ మాలతి చిన్నబుచ్చుకుంది.

“అయాం సారీ... నా ఉద్దేశ్యం నిన్ననాలని కాదు...’’ అంది రమ్య నొచ్చుకుంటూ.

“రాత్రి...సుమారు ఒంటిగంట ప్రాంతంలో బాత్ రూమ్ కని లేచాడట! అతడు బయటకి వచ్చేసరికి డాబామీద అటూఇటూ పచార్లు చేస్తూ కనబడిందట ఆ ఆడ దెయ్యం. ఆ దెయ్యం సినిమాల్లో చూపించినట్లుగా తెల్లచీర కట్టుకొని లేదట. తెల్లనైటీ వేసుకుని, జుట్టు విరబోసుకుని, గజ్జెలు శబ్దం చేసుకుంటూ తిరుగుతోందట.

అంతే... గుండె ఠారెత్తిపోయిందట మానవుడికి. ఒకటే ఝడుపు, జ్వరం...సంధి ప్రేలాపనలు కూడా మొదలైనాయట...ఆ గదిలో పిచ్చిచూపులు చూస్తూ, బిగదీసుకు కూర్చున్నాడు.’’ వాచికానికి, ఆంగికాభినయాన్ని కూడా జతపరచి కళ్లకు కట్టినట్లుగా వర్ణించి చెప్పింది మాలతి.

బిత్తరపోయింది మౌక్తిక. రాత్రి నిద్రపట్టక గాలికోసం తిరుగుతున్న తనను చూసి దెయ్యమేమోనని భ్రమించి, భయపడ్డాడా అర్భకుడు. అతగాడిది బలహీనమైన గుండె కాబోలు...భీతావహుడై, జ్వరం తెచ్చుకున్నాడు.

ఏదో... గిల్టీ ఫీలింగ్ లాంటిది కలిగింది మౌక్తికకు.

“అబ్బా తల్లీ...ఇప్పుడు కూడా ఆలోచనలేనా!’’రమ్య తనని పట్టి కుదిపేవరకు అదోరకమైన అలౌకిక స్థితిలో ఉండిపోయింది మౌక్తిక.
కక్కాల్సిందంతా కక్కేశాక మాలతి బయటకు జారుకుంది మళ్ళీ. మౌక్తిక తేరుకుని రాత్రి జరిగిన దాన్ని రమ్యకు చెప్పింది. కాసేపు అలా ఉండిపోయి... ఆ తరువాత పగలబడి నవ్వడం మొదలెట్టింది రమ్య. పొట్ట చేత్తో పట్టుకుని అలా నవ్వుతూనే ఉండిపోయిందెంతసేపో! నవ్వి నవ్వి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.

“ఏయ్ రమ్యా…నీకేమన్నా పిచ్చెక్కిందా? అతడి అవస్థ నీకు నవ్వు తెప్పిస్తోందా?’’ కోపంగా ప్రశ్నించింది మౌక్తిక. నవ్వడం కొనసాగిస్తూనే “మరేమీ లేదు ముక్తా…మా ‘ అంతర్ముఖి’కి కూడా సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం వచ్చునే… ‘ అని నవ్వొచ్చింది’’ అంది రమ్య.
మౌక్తిక ముఖం ముడుచుకుంది.

“నా ముఖం…నేనేం కావాలని చేశానా! నిద్రపట్టక అనీజీగా అనిపిస్తే… గాలికోసం మేడెక్కాను. ఇలా జరుగుతుందని నేను మాత్రం కలగన్నానా!’’ లోలోపల చిరాగ్గా అనిపిస్తున్నా బయటకు మాత్రం స్థిరంగా ఉండడానికి ప్రయత్నించింది మౌక్తిక. జరిగినది తలచుకుంటే ఆమెకు నెర్వస్ గా అనిపిస్తోంది. ఇతరుల బాధకి తాను కారణం కాకూడదు అనుకుంటుందెప్పుడూ కూడా…అందులో తన ప్రమేయం లేకున్నాసరే.

“ఓకే… రిలాక్స్ ముక్తా… మన శంకర్రావుకీ వార్త చెప్పి అతడిని భయవిముక్తుడిని కావిద్దాం…’’ నాటకఫక్కీలో అంది రమ్య. అంతసేపూ… విరగబడి నవ్విన ఆమె అలా … గంభీరతను నటిస్తూ అనేసరికి మౌక్తికకు కూడా నవ్వొచ్చింది. ఈసారి దాన్ని దాచుకునే ప్రయత్నమేదీ చేయలేదామె.

రమ్యతో కలిసి శంకర్రావు ఉన్న గదిలోకి వెళ్ళింది.

గదిలో… మంచంమీద గోడకానుకుని కూర్చుని బిర్రబిగుసుకుపోయి ఉన్నాడు శంకర్రావు. రాత్రి అతడు అనుభవించిన భయానక రస ఛాయలు అతడిని ఇంకా వీడిపోయినట్లు లేదు…మిడుగుడ్లు పడి పిచ్చి చూపులు చూస్తున్నాడు. అతడి వాలకం చూస్తే షాక్ నుంచి ఇంకా తేరుకోనట్లుగా ఉంది.

మౌక్తిక, రమ్యలను చూసి చుట్టూ మూగి ఉన్నవాళ్ళందరూ పక్కకి తొలిగారు. శమంతకం గారిని పక్కకి పిలిచి విషయం మొత్తం వివరించింది రమ్య.

ఆయనకు కూడా నవ్వొచ్చింది జరిగిన ఉదంతం విన్నాక. చిన్నగా నవ్వుకుంటూ శంకర్రావుని సమీపించారు.

“ఇదిగో… శంకర్రావ్…నీ భయావతారం చాలించవయ్యా… తెల్లారిన దగ్గరనుంచీ మా బుర్రలు కొరికేసి ఒకటే టెన్షన్ పెట్టావు. నిన్నరాత్రి నువ్వు చూసినది దయ్యాన్ని కాదు. మన మౌక్తికా మాడమ్ ని.’’ కొయ్యలా బిగుసుకుపోయిన శంకర్రావుని కుదుపుతూ చెప్పారు శమంతకం గారు.
అంతే…అక్కడ ఉన్నవాళ్లందరూ మౌక్తికవైపుకి తిరిగి “వ్వాట్… మన మౌక్తికా మాడమా!’’ అన్నారు ఆశ్చర్యంగా.

వాళ్ల చూపులు, విస్మయం నిండిన వాళ్ల స్వరాలు మౌక్తికను ఎంతో ఇబ్బందిపెట్టాయి. మధుకిరణ్ కూడా విస్మయంగా చూశాడు ఆమెవైపు.  
వాళ్లందరి ముందూ అలా… తప్పుచేసిన దానిలా తలదించుకుని నిలబడాల్సి రావడం ఎంతో ఎబ్బెట్టుగా అనిపించింది మౌక్తికకు. దానితో పాటు  అందరి ఆశ్చర్యానికీ తానే కేంద్రబిందువు కావడం కాస్త అసౌకర్యాన్నీ కలుగజేసింది.
 

 

మౌక్తిక, మధుకిరణ్ మధ్య ఎన్నో సంఘటనలు జరిగినా.. తను ఎటువటి హద్దులు దాటకుండా.. మధుకిరణ్ తో ప్రేమలో పడకుండా వుంటుందా..లేక అతను చూసే చూపులకు, మాట్లాడే మాటలకు, చూపించే శ్రద్ధకు ప్రేమలో పడుతుందా..తెలియాలంటే వచ్చేశుక్రవారం విడుదలయ్యే సంచికలో చూడండి.   

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్