Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prema enta madhram

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue320/820/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

 

(గత సంచిక తరువాయి)....  “మన మనసులో ఏదన్నా బాధ ఉంటే సన్నిహితులతో పంచుకోవాలి. అప్పుడే హృదయభారం తీరి మనసు తేలికపడుతుంది.కళ్ళుమూతలు పడతాయి...’’ అంటూ ఉంటుంది రమ్య తరచుగా.

అయితే తనమనసులో ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకునేందుకు అంతగా ఇష్టపడదు మౌక్తిక...అది ఎంత దగ్గరవారైనా సరే. ఆనందమైనా, ఆవేదనైనా...తనకే పరిమితం చేసుకుని జీవిస్తుంది. ఆమెసంగతి తెలిసిన రమ్య ఎప్పుడూ ఏ విషయమూ తనతో చెప్పమని బలవంతం చేయదు.

ఆదమరచి నిదురిస్తున్న రమ్య పక్కనే చోటు చేసుకుని పడుకుంది మౌక్తిక. కాని, నిద్రపట్టి చస్తేనా!

వాళ్ళపక్కనే శయనించిన మాలతి, నవనీతలు నాన్ స్టాప్ గా అలా బాతాకానీ కొడుతూనే ఉన్నారు.

ఆవకాయ నుండి అణుబాంబుల వరకు, సీమచింతకాయల నుండి అవినీతిపరుల స్విస్ బ్యాంకు అకౌంట్స్ వరకు... ‘కాదేదీ చర్చకనర్హం’అన్నరీతిలో అన్ని విషయాల గురించి ఆమూలాగ్రం విశ్లేషించుకుంటున్నారు.

‘వీళ్ల ముఖాలుమండా! అంతసేపు జర్నీ చేసి ఒళ్ళు పులిసిపోయి ఉండికూడా..కబుర్లు చెప్పుకునేందుకు వీళ్ళకి ఓపిక ఎక్కడినుంచి వస్తోందో!’ అక్కసుగా అనుకుంది మౌక్తిక.

నిద్రలోనే బధ్ధకంగా కదిలి అటువైపు తిరిగి పడుకుంది రమ్య.

ప్రపంచాన్ని చుట్టచుట్టి తమ చర్చలలో ఇరికించి అనేకరకాల కబుర్లు చెప్పుకున్నాక, రైలింజన్ లెవెల్లో గురకపెట్టి మరీ నిద్రపోయారు వాళ్ళు. అంతసేపూ...అవిరామంగా వాగివాగి తననిద్రను పాడుచేసిన వాళ్ళు...నిముషాలమీద మొద్దునిద్రలోకి జారిపోవడం చూసి ఉక్రోషంగా అనిపించింది మౌక్తికకు.

కేవలం వాళ్ళమీదే కాదు...ఈ భూప్రపంచంలో హాయిగా, ప్రశాంతంగా నిద్రపోయేవాళ్లందరిమీదా మౌక్తికకు అసూయ కలిగింది. అది ఒక్క క్షణంసేపు మాత్రమే.

తనసమస్య అందరిమీదా అసూయపడడంతో తీరిపోతుందా! నవ్వుకుంటూ  సెల్ తీసి టైమ్ చూసింది. అర్ధరాత్రి ఒంటిగంటా పది నిముషాలు. డిస్ ప్లే లో డేట్ మారిపోయి కనిపిస్తోంది.కన్ను పొడుచుకున్నా నిద్ర రావడంలేదు. మంచంమీద నుంచిలేచి, చెప్పులు తొడుక్కుని చప్పుడు కాకుండా గది తలుపులు తీసుకుని వరండాలోకి వచ్చింది

మౌక్తిక.మెల్లగా అడుగులు వేసుకుంటూ వరండాలో ఓపక్కగా ఉన్న మెట్లమీదుగా మేడపైకి చేరుకుంది. ఆరోజు అమావాస్య వెళ్ళిన పంచమో, షష్టో కాబోలు వెన్నెల పలచపలచగా పరుచుకుంది. ఆఇంటికి కాస్త దూరంగా కనిపిస్తున్న రాజావారి దివాణం తెల్లని దిస్టెంపర్ పైపూతతో వెండికొండలా మెరుస్తోంది ఆమసకవెలుతురులో.

ఆ దివాణప్రాంగణంలో... నిటారుగా నిలబడ్డ అశోక వృక్షాలు లీలగా కనిపిస్తున్నాయి అంత దూరానికి కూడా. చల్లని పరిసరాలు, ఆప్యాయంగా చిరుగాలి వీస్తున్న వింజామరలు, ఎంతో మనోజ్ఞంగా ఉంది వాతావరణం.

మేడపై కుండీలలో పెంచిన చేమంతిపులు నిండుగా విరబూసి, మంచుబిందువుల ఆభరణాలను ధరించి మురిసిపోతున్నట్లుగా ఉన్నాయి.కార్తిక మాసపు చలిగాలి రివ్వుమని వీస్తూ చాచి కొడుతున్నట్లుగా దేహాన్ని తాకుతోంది. ఆచలి మౌక్తికను ఎంతమాత్రం బాధించలేదు. అలా...అలా... ఆచిరువెన్నెలలోనే పరిసరాలను వీక్షిస్తూ ఒక అరగంతసేపు పచార్లు చేసింది.

నీరవ వాతావరణంలో వినిపిస్తున్న కప్పల బెకబెకలు, వీచేగాలి పాడుతున్న సంగీతం, కీచుకీచుమని అరుస్తూ అదోరకమైన ధ్వని సృష్టిస్తున్న కీచురాళ్ల అరుపులు, మృదువుగా రవళిస్తున్న మౌక్తిక కాలిమువ్వల శబ్దం...ఇవన్నీ వివిధవాద్యాల సమ్మేళనంలా అనిపిస్తున్నాయి.
అలా... కాసేపు హాయైన వాతావరణంలో గడిపాక...అనుభూతులన్నీ ఆస్వాదించాక... మెల్లమెల్లగా మౌక్తిక కనురెప్పలమీద అధిష్టించింది నిద్రాదేవత.

‘నీలల కన్నుల్లో మెలమెల్లగా ...నిదురా రావమ్మా...రా రా...నెమ్మదిగా రా...’ అంటూ ఆప్రకృతి ఆమెకు జోలపాడి లాలించిందేమో! ఆవులింతలు ఆగకుండా వచ్చేశాయి.

గబగబ మేడదిగి, గదిలోకి నడిచి, తలుపు గడియపెట్టీ, రమ్య పక్కనే పడుకుని ఐదే నిముషాల్లో గాఢ సుషుప్తిలోకి జారిపోయింది మౌక్తిక.

-------------------             ----------------------------------                --------------------

“ముక్తా..లే...ఏమిటా మొద్దునిద్ర!’’ రమ్య పిలుపుతో ఒళ్ళు విరుచుకుంటూ లేచింది మౌక్తిక. కళ్ళు తెరవగానే సుందరమందస్మితయైన రమ్య ముఖారవిందం దర్శనమిచ్చింది.

“త్వరగా లేచి తయారవ్వు... అందరూ రెడీ అయిపోయారు. నీదే ఆలస్యం. దివాణం అంతా చుట్టి చూసేసరికి చాలా సేపు పడుతుందట. పక్కనే పెద్దతోట కూడా ఉందట. అదీగాక ముందు ఊళ్ళోఉన్న రాముడి కోవెల చూడాలట...’’ అంది రమ్య మౌక్తిక కప్పుకున్న దుప్పటి లాగిపారేస్తూ.

రాత్రి ఆలస్యంగా పడుకున్నా...హాయిగా నిద్రపట్టడం మూలాన మౌక్తిక ఒళ్ళంతా తేలిగ్గా ఉంది. ముందురోజు పడిన అలసట అంతా ‘ఉఫ్’ మని ఊదేసినట్లుగా ఎగిరిపోయింది.

ఛెంగున మంచం దిగి బ్యాగ్ లోనుంచి బట్టలు తీసుకుని బాత్ రూమ్ లోకి పరుగెత్తింది. సరిగ్గా అరగంటలో స్నానాదికాలు పూర్తిచేసుకుని బయటపడింది అప్పుడే మొలిచొచ్చిన మొక్కలా. చకచక తయారైపోయి, జడను రబ్బర్ బాండ్ తో బిగించింది.

“వ్వావ్... యుఆర్ లుకింగ్ సో క్యూట్...’’ అంది రమ్య  చప్పున మౌక్తిక బుగ్గను ముద్దాడుతూ.

“ యుసిల్లీ...రాన్రానూ చిన్నపిల్లవైపోతున్నావు...’’ మురిపెంగా విసుక్కుంది మౌక్తిక.

అసలు నిజంగా దెయ్యం వుందా..లేదా.. తెలుసుకోవాలంటే వచ్చేశుక్రవారం విడుదలయ్యే సంచికలో చూడండి.. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్