Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
merupukalalu

ఈ సంచికలో >> కథలు >> అత్తా కోడలు

attakodalu

నేను మా పెరట్లో వున్న మునగ చెట్టునుంచి మునక్కాయలు కోస్తుంటే  ప్రక్కింటిలో నుంచి కేకలు వినబడినై.అవి ఆ ఇంట్లో అత్తా కోడళ్ళ మధ్య నిత్యం కొనసాగే మాటల యుధ్ధమని గ్రహించాను. మరి ఇవాళ వాళ్ళ మధ్య జరుగుతున్న ఆ యుధ్ధానికి కారణం ఏమిటో ననుకొంటూ చెవులు రిక్కించాను. అది కేవలం ఓ కప్పు కాఫీకి సంబంధించినది. చిన్న విషయమే!కాని ఎందాకా వెళుతోందోనన్న భయం నాకు.

"అమ్మాయ్ !నిన్ను కాఫీ ఇమ్మని గంటనుంచి అడుగుతున్నా" వరాండాలో మంచంమ్మీద దర్జాగా  కూర్చొని కేకలేస్తోంది అత్త అనసూయమ్మ.

"నేను లోపల వూరికే లేను.మీ అబ్బాయి షర్టు ఇస్త్రీ చేస్తున్నాను.మీరే వచ్చి కాఫీని కాస్త వేడి చేసుకొని పోసుకు తాగండి"కోడలు కాంచన జవాబు.

"ఇదిగో!నిన్ను నేను కోడలిగా తెచ్చుకొంది ఇంటి పనులతో పాటు నాకూ పనులూ చేయటానికే పిల్లా..."కాస్త స్వరం పెంచి అంది అత్త.

"నిజమే!కాని మీకు చేయాలని నాకు లేదు.నా మొగుడుకి మాత్రమే చేస్తానత్తగారూ!" వ్యంగ్యంగా అంది కోడలు.

"అమ్మో...అమ్మో ఎంత మాట?అదేంటే అలా అంటావ్ !పెళ్ళయి ఆరునెల్లు కాలేదు.అప్పుడే  నాతో ఎదురు తిరిగి మాట్లాడుతావా?నా పనులు చేయనంటావా?!....అలా అయితే కుదరదమ్మా.మూటా ముల్లె సర్దుకోవలసి వస్తుంది" కోడలిమీద కోపంతో రెచ్చిపోయింది అత్త.

"ఈ తతంగం మనకు రోజూ వుండేదేగా!అయినా మూట ముల్లె సర్దుకోవలసింది నేనా... లేక...మీరా ? మీరైతే ఏ ఆశ్రమానికో  దారి చూసుకోవాల్సిందే! ఇదిగో...! అత్తా ఒకింటి కోడలే నన్నది  గుర్తు చేసుకొండి"కాస్త వాల్యూం పెంచింది కోడలు.

"ఏమిటే రెచ్చిపోతున్నావ్ ! నేను లేశానంటే..."అంటూ పైకి లేచింది అత్త అనసూయమ్మ.

"ఏంటీ!కొడతారా..అలాంటి ప్రయత్నం చేశారంటే నేనూ..."అంటూ గుమ్మం వద్దకొచ్చి ఆగింది కోడలు.

పెళ్ళాం, తల్లి మధ్య జరుగుతున్న హీటెక్కిన ఆ వాదనలను పెరట్లో స్నానం చేస్తున్న కొడుకు సారధి విన్నాడు.వాళ్ళిద్దరి  గొడవ తారస్థాయినందుకోక ముందే నోళ్ళు మూయించాలనుకొని త్వరత్వరగా స్నానం చేసి టవల్తో  ఒళ్లు తుడుచుకుంటున్నాడు సారధి.

అప్పటికే అనసూయమ్మకు కోపం తారస్థాయినందుకొంది.ఇక చేసేది లేక "ఒరేయ్ సారధీ!" అని పెద్దగా అరిచింది వరాండాలోనుంచి. తుండు కట్టుకొని పరిగెత్తినట్టు వచ్చి"ఏంటే అమ్మా మీ గోల!ఉదయం పడకనుంచి లేస్తూనే ప్రారంభించారా అత్తాకోడళ్ళ మాటల యుధ్ధాన్ని.అసలు నీకేం కావాలన్నా నన్నడగమన్నానా! కాఫేగా...తెస్తానుండు" అంటూ వెళ్ళి కాఫీని వేడి చేసి తెచ్చి యిచ్చాడు కొడుకు సారధి. నసూయమ్మ తాగుతూ కోడలి వేపు చూసింది. కోడలు వెక్కిరించినట్టు క్రింది పెదాలను పళ్ల   క్రింద నొక్కిపట్టి మూతిని మూడు వంకలు తిప్పింది.అది చూసిన అనసూయమ్మ ఖాళీ గ్లాసు ప్రక్కన పెట్టి అత్తగా ఆమె  ఆరు వంకలు తిప్పింది కోపంగానే.

అది గమనించిన సారధి " కాంచనా...ఇటు రా!" అని పెళ్ళాన్ని పిలిచి,అటు తిరిగి "అమ్మా! ఇద్దరూ వినండి.ఈ రోజుతో మీ ఇద్దరి మధ్య గొడవలంటూ వుండకూడదు.వాటికి పుల్ స్టాప్ పెట్టాలి.రోజూ మీ మధ్య జరిగే మీ మాటల యుధ్ధాన్ని ఆపు చేసుకొని  మంచిగా నడుచు కోవాలి.ఏ విషయంలోనైనా సరే ఒకరికొకరు సర్దుకు పోవాలి.లేకుంటే నేనూ..."కోపంగా అని ఆగాడు సారధి.

"ఏం చేస్తావురా...ఆఁ...ఏం చేస్తావ్ ?"అంది కొడుకు పైకి దూసుకొస్తున్నట్టు అనసూయమ్మ.

"ఏం చేస్తానా?...నిన్ను ఆ వృధ్ధుల ఆశ్రమానికి, కాంచన్ని వాళ్ళింటికి పంపిస్తానంతే!... ఆఁ "

"ఆహాఁ..అంటే మమ్మల్ని పంపించేసి మీరొక్కళ్ళే ఇక్కడ కూర్చొని హాయిగా కులుకుదామను కొంటున్నారా?..మా తండ్రే.!అలాగేం జరగనివ్వను సుమా!" ఎగతాళిగా అంది భార్య కాంచన.

"అదేం కాదు.రోజూ మీ ఇద్దరి గొడవుల మధ్య నలిగి చావలేక  ఏ సన్యాసుల్లోనో కలిసి పోవాలనుకొంటున్నాను!"తెగేసి చెప్పాడు సారధి.

షాక్ తింది భార్య కాంచన.సారధి అన్నంత పని చేస్తాడు.చేసేవాడే మరి.అందుకే వెంటనే"ఈ మాత్రానికేనాండీ...!అయినా ఇది మా అత్తాకోడళ్ళ మధ్య రోజూ వుండేదేగా!" భయంతో స్వరం  కాస్త తగ్గించి గోముగా అంది.

"అవున్రాబ్బాయ్ !కాస్సేపు గొడవపడ్డా మళ్ళీ మేమే సర్దుకు పోతున్నాంగా!అంతలోనే నీకెందుకొచ్చిందిరా ఆ పిచ్చి ఆలోచన?"అనసూయమ్మ కూడా ఆమె మాటల జోరుకు కళ్ళెం వేసిందప్పుడు.

"అదేం కుదరదమ్మా.ఇది నా పరువుతో కూడిన విషయం.మీరిద్దరూ నిత్యం యిలా పోట్లాడు కొంటుంటే  చూసే  ఇరుగు పొరుగు నన్ను భార్య, తల్లిని కంట్రోల్లో పెట్టుకోలేని అసమర్థుడనని  తక్కువ చేసి మాట్లాడుకొంటున్నారు.కనుక ఇకనైనా మీరిద్దరూ కిమ్మనకుండా వుండాలి. అంతే! ఆఁ...నువ్వు పద. నాకు టిఫన్ పెడుదువుగాని"అంటూ భార్యను లోనికి తోసుకు వెళుతుంటే అనసూయమ్మకు కూడా సారధి అన్నంత పని చేస్తాడన్న భయం పట్టుకొందేమో మరి మౌనంగా లేచి బరబర కిచ్చన్లోకి వెళ్ళి క్యారియర్ కట్టి  ఆఫీసు బ్యాగులో పెట్టి దాన్ని టీపాయి మీదకు సర్ది మళ్ళీ వచ్చి  వరాండాలో కూర్చొంది తనలో తానే ఏదో గొణుక్కొంటూ.

ఆ ఇంట్లో జరుగుతున్న తతంగాన్నంతా చూసిన నాకు నవ్వొచ్చింది.సహజంగా కొన్ని ఇళ్ళలో ...కాదు చాలా ఇళ్ళలో ఇలాగే అత్తా కోడళ్ళ మధ్య ఎడతెరపి లేకుండ (నిద్రపోయే సమయం తప్ప) మాటల యుధ్ధాలు జరుగుతునే వుంటాయి. రేపు నా కొడుక్కీ పెళ్ళయితే నా పరిస్థితి కూడా ఇలాగే వుంటుందేమో!బహుశా ఇందుకు కారణం అత్తాకోడళ్ళ మధ్య ఏర్పడే 'ఈగో ప్రాబ్లెంసేనేమో' అని మనసులో అనుకొంటూ వంట చేయటానికి నేనూ కిచ్చన్లోకి వెళ్ళి పోయాను.

ఓ నెల తరువాత---

మా వీధి చివరున్న ఓ అపార్టుమెంటులో మాకు తెలిసినోళ్ళ పాపకు పుట్టిన రోజు పండుగ జరుపుకొంటూ నన్నాహ్వానిస్తే కాస్త ఆలస్యంగా  వెళ్ళాను. అప్పటికే బర్తుడే కేక్ను కట్ చేసిన తరువాత అందరూ పాపకు బహుమతులను అంద జేస్తున్నారు.నేను పాపకు గిప్టునిచ్చి ముద్దు పెట్టుకొని అనుకోకుండా అటు వేపుకు చూశాను. అక్కడ నాకంట పడ్డ దృశ్యం నన్ను  ఆశ్చర్యంతో పాటు షాక్కు గురి చేసింది.చూస్తే...మా ప్రక్కింటిలో వున్న అత్తాకోడళ్ళు చక్కగా ఇకఇకలు పకపకలతో చిన్నగా శబ్దం చేస్తూ హాయిగా మాట్లాడుకొంటున్నారు.అది చూసి అదిరి పోయిన నేను మెల్లగా వెళ్ళి వాళ్లకు వెనుక వరుసలో ఖాళీగా వున్న ఓ కుర్చీలో కూర్చొన్నాను.వాళ్ళు నన్ను గమనించినట్టు లేరు. నేను వాళ్ళను గమనిస్తూ వున్నాను.

అంతలో "మీరిద్దరూ అత్తాకోడళ్ళు కదూ?"వాళ్ళకు రెండు కుర్చీలకు ఆవల కూర్చొని వున్న ఒకావిడ వాళ్ళను అడిగింది.

"అవును.మీరూ...!?"అడిగింది అనసూయమ్మ.

"నేను... మీ అబ్బాయి సారధికి స్నేహితుడు రాజు వున్నాడే...ఆ రాజుకు అమ్మనండి.నాకు మిమ్మల్ని చూస్తుంటే ఈర్ష్యతో కూడికొన్న ఆశ్చర్యం కలుగుతుందండీ!మీరు అత్తాకోడళ్ళులా లేరు.తల్లి కూతుళ్ళులా వున్నారు"మనసులో మాట బయట పెట్టిందావిడ.

"కరక్టు.మా కోడలు కాంచన నాకు కూతురి కన్నా ఎక్కువే!నన్ను తల్లిలా భావించుకొని ఎంతో ప్రేమతో చూసుకొంటోంది"అంటూ చేత్తో కాంచన బుగ్గల్ని చిదిమి ముద్దు పెట్టు కొంది అత్త అనసూయమ్మ కొడుకన్న మాటలు అప్పుడు ఆమెకు గుర్తుకు రాగా.

"నిజమండి. నాకు మా అత్తగారు మా అమ్మకన్నా ఎక్కువే!అంతగా ప్రేమానురాగాలను పంచి తన కన్న కూతురిలా చూసుకొంటారు"అంది కాంచన ఆమె కళ్ళలోనూ భర్త సారధి లీలగా మెదిలాడప్పుడు.ఆ సమయంలో అత్తాకోడళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని పెదాలపైకి నవ్వు కూడా తెచ్చుకున్నారు మరి.

అయితే నిత్యం ఆ అత్తాకోడళ్ళ మధ్య రకరకాల సమస్యలతో గోల గోలగా మాటల యుధ్ధాన్ని వినే నేను మరోసారి షాక్కు గురైయ్యాను.

అంతలో వాళ్ళతో మాట్లాడుతున్నావిడ నవ్వుతూ అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది.నేను మెల్లగా వెళ్ళి వాళ్ళ ప్రక్కనే వున్న ఓ కుర్చీలో కూర్చొన్నాను నన్ను చూస్తే అత్తాకోడళ్ళిద్దరూ షాక్ అవుతారన్న భావంతో. కాని వాళ్ళు మాత్రం నన్ను చూసి కేవలం పెదాలపైకి నవ్వు తెచ్చుకొని వూరుకొన్నాను.ఇక నాలో టెన్షన్ మొదలైయ్యింది. అలా ఇంట్లో విరోధుల్లా వుంటూ ఇక్కడ ఇంతటి అన్యోన్యమైన అనుబంధంతో అత్తాకోడళ్ళు  పెనవేసుకు పోతున్నారంటే వెంటనే కారణం తెలుసుకోవాలనుకొని "అనసూయమ్మగారూ!మీరు..."అని అంటుండగా ఆమే మొదలెట్టింది.

"చూడండి!మీరేమడగాలనుకొంటున్నారో నాకు తెలుసు.నిజమే...అత్తాకోడళ్ళం చాన్నాళ్ళు అలా పామూ ముంగుసల్లా వున్నమాట వాస్తవమే!కాని ఇప్పుడు ఇంట్లోనే కాదు యిలా బయటి ప్రపంచంలోకి వచ్చినా కూడా మేము తల్లికూతుళ్ళులా వుంటున్నాం.ఇందుకు కారణం మా అబ్బాయే! అవునండీ!వాడికి సమాజంలో గౌరవం పెరిగి పరువుతో కొనసాగా లంటే మేము మా మధ్య నిత్యం జరిగే గొడవలకు స్వస్తి చెప్పి తల్లీ కూతుళ్ళలా వుంటూ మర్యాదగా నడచుకోవాలన్నాడు.ఇద్దరం వాడి మాటల్ను విన్నాం. చక్కగా వాడన్నట్టు మారిపోయాం"అంది అనసూయమ్మ సగర్వంగా.

"అవునండీ!మా వారి పరువు ప్రతిష్ఠలు,మా ఇంటి గౌరవాన్ని నిలపెట్టడంలో మాకూ భాగముందిగా!అందుకే మావారి మాటల్ను  స్ఫూర్తిగా తీసుకొని పూర్తిగా మారిపోయాం. అదేమన్నా తప్పా?" అంది కాంచన.

అంతలో "నిజం కదండీ!ఈ మధ్య మాకు ఎలాంటి ఈగో ప్రాబ్లెంసు లేవు.తగవులూ లేవు.బాగా వుంటున్నాం.కనుకనే కదండీ ఈ సమాజం మా అత్తాకోడల్లనీ,మా అబ్బాయిని గౌరవ పదంగా చూస్తుంది.ఏమంటారు?"అంది అనసూయమ్మ నా ముఖంలోకి చూస్తూ.

ఇక నేనేం మాట్లాడలేదు.అవునన్నట్టు గట్టిగా తలూపాను.అదే సమయంలో నెల క్రితం అనసూయమ్మ కొడుకు సారధి వీళ్ళతో మాట్లాడిన మాటలు  గుర్తుకు రాగా మెల్లగా నాలో నేనే నవ్వుకున్నాను. అంతలో భోజనాలకు రమ్మని పిలిచారు. వాళ్ళు లేచారు.వాళ్ళను వెంబడించాను నేను.

మరిన్ని కథలు