Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prema enta madhram

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue325/829/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

 

(గత సంచిక తరువాయి)... “గుడ్ మార్నింగ్ శరత్.’’ విష్ చేసింది మౌక్తిక.

తలెత్తి చూసిన శరత్ పలకరింపుగా నవ్వి” వెరీగుడ్ మార్నింగ్ ముక్తా…  ఎలా జరిగింది మీ పిక్నిక్ ప్రోగ్రాం…’’ అడిగాడు షూ వేసుకోవడం పూర్తి చేసి లేచి నిలబడుతూ.

“ వెరీ నైస్ … చాలా బాగా జరిగింది’’ చెప్పింది మౌక్తిక.

“గుడ్… నేను ఊరెళ్ళి మా అమ్మ నాన్నలని చూసొస్తాను. నీకు, మీ ఫ్రెండ్ కి ఈ రోజంతా పండగే...హ్యాపీగా ఎంజాయ్ చేయండి.’’ అల్లరిగా నవ్వుతూ బెడ్ రూమ్ లోకి నడిచాడు.

శరత్ చాలా సరదా మనిషి. ఎప్పుడూ సంతోషంగా అందరినీ నవ్విస్తూ… జాలీగా ఉంటాడు. రమ్యా అంతే… భార్యాభర్తలిద్దరి స్వభావాలూ ఒకేలా ఉండడం అరుదైన సంగతి అనిపిస్తుంది.

“సాయంత్రానికి వచ్చేస్తారా?’’ రమ్య అడుగుతోంది సన్నగా.

“విత్ ఫ్లై … రెక్కలు కట్టుకు వాలనూ! అసలే రెండు రోజుల విరహం. ఈ రోజు కూడానా! స్వీట్ రివెంజ్ తీర్చుకోక పోతే మన  వయసూరుకుంటుందా!’’  ఎంత చిన్నగా అంటున్నా మోహావేశపు తమకం నిండిన శరత్ స్వరం మౌక్తిక చెవిన పడనే పడింది.
ఏదో…  తెలియని అసౌకర్యం తనని చుట్టుముట్టగా అసహనంగా కదిలింది మౌక్తిక.

కాసేపటి తరువాత బయటకి వచ్చాడు శరత్. అతడి వెనుకే రమ్య. ఆమె ముఖం కందిపోయి ఉంది. మౌక్తిక ముఖంలోకి చూడలేనట్లుగా సిగ్గుతో తలదించుకుంది.

“బై రమ్యా… బై ముక్తా…’’ ఇద్దరికీ వీడ్కోలు పలికి వెళ్లాడు శరత్.

అతడు వెళ్లాక స్నేహితురాళ్ళిద్దరూ వంటగది లోకి నడిచారు.

నేల మీద బాసింపట్టు వేసుకుని కూర్చుని “వాట్ నెక్స్ట్? వంటలో ఏదన్నాసాయం చేయాలా నీకూ’’ అడిగింది మౌక్తిక.

“ఏముందీ…ఏమైనా స్పెషల్ గా చేసుకుని మింగేసి, హాయిగా ఏ సినిమాకో చెక్కేయడమే…’’ రమ్య అంది ఫ్రిజ్ లో నుంచి కూరగాయలు తీస్తూ.

‘మెనూ ఏమిటి?’ కాసేపు తర్జన భర్జన అనంతరం వెజిటబుల్ బిర్యానీ, బంగాళ దుంప లక్ర్ మా, పెరుగు పచ్చడి, క్యారెట్ హల్వా చేసుకుందామన్న నిర్ణయానికొచ్చారు.

రమ్య బియ్యం కడిగితే మౌక్తిక మసాలా నూరింది. ఆమె కూరగాయలు కోస్తే ఈమె హల్వా చేసింది. వంట గదిలో ఓ గంట సేపు కుస్తీలు పట్టి వాళ్ళు కోరుకున్న వంటకాలు సిధ్ధం చేసుకున్నారు.

“అన్నట్లు ముక్తా… నీకిష్టమైన మూవీ మన లక్ష్మీ థియేటర్ లో ఆడుతోంది.’’ చెప్పింది రమ్య సడెన్ గా.

“నాకిష్టమైన మూవీనా’’ ఆశ్చర్యంగా అడిగింది మౌక్తిక.

‘’అవును తల్లీ…మాయాబజార్ ఎన్నిసార్లు చూసినా నీకు తనివి తీరదుగా! పైగా రంగులద్దుకుని సరి కొత్తగా. కిందటి సారి రిలీజ్ అయినప్పుడు చూడడం కుదరలేదని గునిశావు కదా! ‘’ ఊరించింది రమ్య.

పరవశంతో మౌక్తిక ఒళ్ళు పులకరించింది. మాయాబజార్ సినిమాని చూడడంలో ఆమె ఇప్పటికి అర్ధ శతకం పూర్తి చేసి ఉంటుందేమో! టివిలోఅప్పుడప్పుడు చూసింది కాక, ఇలా థియేటర్ లో ఓ ఇరవై సార్లైనా చూసి ఉంటుంది. ఇన్ని సార్లు టివిలో చూసిన మీదట మళ్ళీ థియేటర్ కి వెళ్ళడం ఎందుకని ఎవరైనా భావిస్తారేమో గాని, మౌక్తిక మాత్రం కాదు.

ఇరవై నిముషలకో బ్రేక్ చొప్పున ఆపేస్తూ, వందలాది వ్యాపార ప్రకటనల మధ్యన ప్రసారమయ్యే అటువంటి అపురూప కళాఖండాన్ని చూడడం వలన మధురానుభూతి కాదు కదా… కనీస ఆనందం కూడా మిగలదు.

వీరుండే ఇంటికి దగ్గరలోనే పాత కాలం నాటి ఒక సినిమా హాలుంది. ఆ యజమాని పాపం కాస్త టేస్టున్న వాడే. తన కళాభిరుచిని చాటుకునేందుకు అప్పుడప్పుడు ఇలాంటి‘ మాస్టర్ పీస్’ లని తీసుకొచ్చి ఆడిస్తూ ఉంటాడు. మౌక్తిక లాంటి ‘కళాభిమానులు’ ఆ చిత్రాలను చూసి తరిస్తూ ఉంటారు.

‘మాయాబజార్’ ని తలచుకుంటూ స్వాప్నిక జగత్తులో మౌక్తిక మునిగి ఉండగానే ”హలో అమ్మాయీ… అప్పుడే మాయాబజార్ లోకి ప్రవేశించావా?’’ అంది రమ్య ఆమె ముఖం ముందు చేతులాడిస్తూ.

ఉలిక్కి పడి నవ్వేసింది మౌక్తిక.

“పద పద బిర్యానీ ఘుమఘుమలకి ఆత్మారాముడు ఆవురావురుమంటున్నాడు. త్వరగా లాగించేసి తయారవుదాం’’ మౌక్తికను తొందర చేసింది రమ్య.

కబుర్లు చెప్పుకుంటూ, పదార్ధాల రుచిని ఆస్వాదిస్తూ తినేసి గబ గబ ఇల్లు సర్దేసుకుని తయారై పోయారిద్దరూ. లేత మబ్బు రంగు చీరలో మౌక్తిక మేఘకన్యకలా మురిపిస్తూంటే, లెమన్ ఎల్లో కలర్ వర్క్ సారీలో పసుపు కొమ్ములా కనువిందు చేస్తోంది రమ్య.

“నీకీ కాటన్ చీరల పిచ్చేమిటి ముక్తా…బాబోయ్…వాటిని మెయింటెయిన్ చేయడానికెంత అవస్థ! ఆ ఉతకడాలు, గంజి పెట్టడాలు మన వల్ల కాదు."  పెదవి విరిచింది రమ్య మౌక్తిక కట్టుకున్నకాటన్ చీరను చూసి. సమాధానంగా పెదవులు విడీ విడని నవ్వొకటి రువ్వింది మౌక్తిక. రమ్య టువీలర్ మీద ఇద్దరూ థియేటర్ కి వెళ్లాను. థియేటర్ దగ్గర జనం పలచగా ఉన్నారు.

‘వీళ్లందరూ కూడా తమ లాగా కళా పిపాసులే అయ్యుంటారు…ప్రజలలోకళాభిరుచి పోలేదనడానికి ఇదే నిదర్శనం’ అనుకుంది మౌక్తిక.
కార్నర్ సీట్లు చూసుకుని కూర్చున్నారిద్దరూ. ఏవో వ్యాపార ప్రకటనలు వస్తున్నాయి. మగవాళ్ళు వాడే పెర్ ఫ్యూం తాలూకు యాడ్ వస్తోంది.
ఒక పురుషుడు వాడిన ఆ పెర్ ఫ్యూం కి ఆకర్షించ బడిన అమ్మాయిలు గుంపులు గుంపులుగా వెళ్ళి పోతున్నారతడి వెంటబడి…ఆఖరుకి హాస్పిటల్ లో నర్సుతో సహా.

ఎంత అవాస్తవికంగా…అసందర్భంగా ఉందీ! ఫలానా ఫెర్ ఫ్యూం వాడితే అమ్మాయి ఆ వాడిన వాడి వెనక గంగ వెర్రులెత్తి వెళ్లి పోతుందా! అంటే ఆమెకి ఆలోచనా శక్తి అంటూ ఉండదా! ఎంత అసహజత్వం! అంతా కాల్పనిక మాయాజాలం.

అంటే..ఈ యాడ్ చూసి అబ్బాయిలంతా ఫ్లాట్ అయిపోయి ఆ బ్రాండ్ కొనేస్తారనే కదూ…ఆ ఉత్పాదకుల ఆంతర్యం! నిట్టూర్చింది మౌక్తిక. సినిమా మొదలౌతుందన్న దానికి సూచనగా హాల్లో పెద్ద లైట్లన్నీ ఆపేసి డిమ్ లైట్స్ వేశారు. వీళ్ల ముందు వరసలో ఎవరో అమ్మాయి- అబ్బాయి కూర్చున్నారు.

ఫరవాలేదే… ఇప్పటి యూత్ లో కూడా మంచి టేస్ట్ ఉంది’ అనుకుంది మౌక్తిక అభినందన పూర్వకంగా. సినిమా మొదలైంది. టైటిల్స్ కలర్ లో పడుతూ ఉంటే ఏదో తాదాత్మ్యంతో మౌక్తిక ఒళ్లు పులకరించింది.

“శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా’’ అంటూ పాట మొదలైంది. చిన్నప్పటి శశిరేఖగా వేసిన అమ్మాయి హావభావాలు ఎంతో ముద్దుగా, అందంగా ఉన్నాయి.

‘ఇప్పుడీ అమ్మాయికి ఏ డెభ్భై అయిదో, ఎనభైనో ఉండుంటాయి.’ అనుకుంటూ సినిమాలో లీనమైన మౌక్తికను డిస్ట్రబ్ చేశాయి ముందు వరసలో నుంచి మంద్ర స్థాయిలో వినిపిస్తున్న గుసగుసలు.

పరమ చిరాగ్గా అనిపించిందామెకి. పోచుకోలు కబుర్లాడుకునేందుకు ఈ థియేటర్ లే దొరుకుతాయి కాబోలు వీళ్లకి! పాత సినిమా కాబట్టి హాలు ఖాళీగా ఉంటుంది కనుక ఇష్టానుసారం ప్రవర్తించవచ్చుననుకుంటారో ఏమో!

తమ ప్రవర్తన బట్టి పక్క సీట్ల వాళ్ళు అసౌకనికి గురవుతారని అస్సలాలోచించరు.

ఆ జంట ఇంకొంచెం అడ్వాన్స్ అయిపోయినట్లున్నారు… ఒకటే ముద్దుల చప్పుడు. చాలా ఇర్రిటేటింగ్ గా అనిపించింది.

‘ఛ…ఛ..ఎంతో ఆశగా వస్తే మూడంతా ఆఫైంది. తొందర పడి వాళ్లని కళాభిమానులని తలచినందుకు ఎంతో పశ్చాత్తాపం చెందింది మౌక్తిక.

“పద వెళ్దాం” లేచి నిలబడింది విసుగ్గా ముఖం పెట్టి.

“ఏం” ఆశ్చర్యంగా అడిగింది రమ్య.

“ముందు చూడు… ఆ సినిమా కన్నామంచి పిక్చర్. ఇంగ్లీష్ సినిమాలోల్లా ‘లిప్ టు లిప్ కిస్’ లు.’’ కసిగా అంది మౌక్తిక.

“ఆమె చేయి పట్టుకుని కూర్చోబెడుతూ” కూర్చో ముక్తా… పాత సినిమాలు ఆడే హాళ్లలో ఇలాంటివన్నీ మామూలే. మనం పట్టించుకో కూడదు. అయినా ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాల్లో ఏం ఖర్మ… తెలుగు సినిమాల్లో కూడా ముద్దు సీన్లొచ్చేశాయి.’’ మౌక్తిక మూడ్ మార్చే ప్రయత్నం చేసింది రమ్య.

ఎంతో ఉత్సాహంగా మంచి సినిమా చూద్దామని వస్తే, ఆదిలోనే రస భంగం జరిగింది. చిరాగ్గా నుదురు చిట్లించింది మౌక్తిక. ముందు వాళ్ళు ఏ మాత్రం నెమ్మదించ లేదు. సరికదా మరింత విజృంభించారు. పక్క వాళ్ళకి తమ వలన ఇబ్బంది కలుగుతుందని కూడా ఆలోచించకుండా రెచ్చి పోయి ప్రవర్తించ సాగారు.

“ఇక నా వల్ల కాదు” విసురుగా లేవ బోయింది మౌక్తిక.

“చూడండి…మేము సినిమా చూడడానికి బోలేడంత డబ్బు పోసి టికెట్ కొనుక్కుని వచ్చాము. దయ చేసి మీరు మమ్మల్ని థియేటర్ లో వేస్తున్న సినిమా మాత్రమే చూడనివ్వండి.’’ ముందు వరసలో నుంచి వినబడిందో స్వరం. ఆ స్వరం సుపరిచితమైనదిగా అనిపించింది వీళ్లకి.
ఆ జంట ముఖాలు నల్లగా మాడి పోవడం అంత చీకట్లోనూ స్పష్టంగా వినిపించింది. ఏమనుకున్నారో ఏమో ముఖాలు చాటు చేసుకుని ఇంకోచోటకి వెళ్ళి పోయారు. ఇంతా చేసి వాళ్ల వయసు పదిహేడు- పధ్ధెనిమిది కన్నా ఉండదు. ఆ కుర్రాడికి మీసాలన్నా మొలవ లేదు…ఆ అమ్మాయి ముఖంలో పసిదనమింకా పోలేదు. అప్పుడే ఎంత అడ్వాన్స్ అయి పోయారు వీళ్లు!

ఇదంతా ఏమిటి! దీన్నేనా యువత ప్రేమ అనుకుంటోంది! క్లాసులో పాఠాలెగ్గొట్టి, ఇలాంటి మారుమూల ప్రదేశాలెంచుకుని, చాటు మాటుగా తింగరి చేష్టలు చేయడమేనా ప్రేమంటే! బతుకు పట్ల అవగాహన లేకుండా చేసి, ఈ ప్రేమ అనే మత్తు మందు జల్లి యువతను తప్పు దోవ పట్టించేలా సినిమాలు తీస్తున్న దర్శక, నిర్మాతలను ఏమనాలి!

ఇటువంటి పసి ప్రేమాయణాలు దేనికి నాంది! ప్రణయానికా! ప్రళయానికా!

అసలు ప్రేమకి సరైన నిర్వచనం ఏమిటి! కొందరి దృష్టిలో ప్రేమ కాలక్షేపం బఠాణీ అయితే…

మరి కొందరి దృష్టిలో తాను ప్రేమించిన అమ్మాయి తనను కాదన్నదన్న ఉక్రోషంతో ఆమె మీద యాసిడ్ పోసో…కత్తితో దాడి చేసి గాయ పరచే ఉన్మాదం…

మౌక్తిక మనసు చేదు మాత్ర మింగినట్లుగా తయారైంది.

తనను ఇబ్బంది కరమైన ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించిన ఆ పుణ్యమూర్తి ఎవరా అని ఆత్రుతగా చూసింది మౌక్తిక. అతడు వాళ్లకి కాస్త దూరంగా ఉండడం చేత ఆ మసక వెలుతురులో సరిగ్గా కనబడ లేదు.

“ముక్తా…ప్లీజ్ రిలాక్స్. నువ్వు మరీ ఇంత ఎమోషనల్ అనుకోలేదు.’’ మౌక్తిక చేతిలో చేయి చేయి వేసి నిమిరింది రమ్య. ఆత్మీయమైన ఆ స్పర్శ మౌక్తిక మదిలో ఉద్భవించిన అశాంతిని పారద్రోలింది. 

“చూడు చూడు…ఈ గొడవలో పడి నీకిష్టమైన సినిమానెంతగా మిస్ అయిపోతున్నావో! కమాన్ ఛీరప్…’’ మౌక్తిక దృష్టిని సినిమా వైపు మళ్లించింది రమ్య.

సరిగా అప్పుడే ‘ నీవేనా నను పిలిచినది’ అంటూ తెరపై ప్రత్యక్షమయ్యాడు అక్కినేని. అంతసేపూ తాననుభవించిన అలజడంతా మటు మాయమైనట్లుగా అనిపించింది మౌక్తికకు. కొత్త సొబగులద్దుకున్న అలనాటి అపురూప చిత్ర రాజం ఎప్పటి లాగే ఆమెకు అవ్యక్తానుభూతిని కలుగ జేస్తోంది.

ఇంటర్వెల్ ఇచ్చారు. హాల్లో లైట్లన్నీ వెలిగాయి. సీట్లో చిన్నగా సర్దుకుంటూ యాధాలాపంగా ముందు వరసకేసి చూస్తున్న మౌక్తికకు, తమ వైపే చూస్తున్న మధు కిరణ్ కనబడ్డాడు. ఉలిక్కి పడింది మౌక్తిక.

అంటే…అంటే… ఇందాకా ఆ కుర్ర జంటను మందలించింది ఇతడేనా!‘

ఎందుకో నెర్వస్ గా అనిపించింది ఆమెకి.

(అనుకోకుండా కనిపించిన మధుకిరణ్ తో రమ్య, మౌక్తికల్ సంభాషణ ఎటుదారితీయబోతోంది? ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఎదురుచూడాల్సిందే....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్