Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue325/830/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

(గత సంచిక తరువాయి).... ఆ రోజు అంబాసిడర్ ఊళ్ళోలేడు. అర్జంట్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి ఆయన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ను కలవటానికి వెళ్ళాడని మిత్రవిందకు అర్ధమైంది. అందుకే పెద్దగా పని లేక పోయినా తన చాంబర్స్ లోనే కూర్చుంది మిత్రవింద. కొన్ని పెండింగ్ ఫైల్స్ చూస్తూ బిజిగా ఉండి పోయింది. నిన్న అబ్బాస్ తో మాట్లాడిన మాటలు పదే పదే ఆమెకు గుర్తుకువస్తున్నాయి. ఆమెకు చాల సంతోషం గాను ఉద్వేగం గాను ఉంది. ఇస్లామాబాద్ వచ్చి ఎన్నో రోజులైంది. కాని ఒక్కసారి కూడా అబ్బాస్ తో ఏకాంతంగా గడిపే అవకాశం దొరక లేదు. కాని ఈ రోజు అది దొరక బోతుంది. అందుకే  ఈ పుట్టిన రోజు తన జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా భావిస్తోంది ఆమె. ఈ శుభ సందర్భంలో ఏ డ్రస్సు వేసుకోవాలో ముందే నిర్ణయించుకుంది మిత్రవింద. చాలా రోజులకు ముందు తన కొలిగ్స్ తో కలిసి ఒక పెద్ద మాల్ కు వెళ్ళింది. అక్కడ ఒక ఖరీదైన చూడీదార్ ఆమె దృష్టిని ఆకర్షించింది. మంచి డిజైన్ తో జరితో చాల అందంగా ఆకర్షణీయంగా ఉంది అది. ఆ డ్రస్సును చూడగానే మిత్రవింద దాని మీద మనస్సు పారేసుకుంది. రాబోయే పుట్టిన రోజున వేసుకోవటానికి ఈ డ్రస్సు చక్కగా సరి పోతుందని భావించింది. అందుకే ఖరీదు ఎక్కువ అయినా వెంటనే కొనుక్కుంది. తరువాత దాన్ని జాగ్రర్తగా బీరువాలో పెట్టి తాళం వేసింది. ఈ రోజు అదే డ్రస్సు వేసుకుని అబ్బాస్ కు కనువిందు చెయ్యబోతుంది. ఆ విషయం తలుచుకుంటే మిత్రవింద శరీరం దూదిపింజలా ఎగిరి పోతోంది.

ఈ రకమైన ఆలోచనలతో ఆమె సతమతమవుతుంటే లంచ్ టైమ్ వచ్చింది. ఫైలు మూసి తన చాంబర్స్ నుంచి బయటకు వచ్చింది మిత్రవింద. అప్పుడే మిగత స్టాఫ్ లంచ్ చెయ్యటానికి క్యాంటిన్ వైపు నడుస్తున్నారు. కాని మిత్రవింద మాత్రం వాళ్ళతో కలవలేదు. సాయంత్రం పార్టి గురించి తలుచకుంటుంటే ఆమె కడుపు నిండిపోయింది.

బ్యాగ్ లోంచి సెల్ తీసి అబ్బాస్ కు కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది కాని అబ్బాస్ వైపు నుంచి రెస్పాన్స్ లేదు. సెల్ ఆఫ్ చేసి మళ్ళి చేసింది. ఈసారి కూడా రింగ్ పోతుంది కాని అవతల నుంచి రెస్పాన్స్ లేదు. విసుగ్గా సెల్ ఆఫ్ చేసి తన క్వార్టర్స్ వైపు దారితీసింది. క్వార్టర్స్ చేరుకుని లోపలికి వెళ్ళింది. అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది. మెడలో ఠీవిగా వేలాడుతోంది అబ్బాస్ కట్టిన తాళిబొట్టు. మిత్రవింద పూర్తిగా క్లోజ్ నెక్ బ్లౌజ్ వేసుకుంటుంది. అందుకే ఎవరికి తాళబొట్టు కనిపించే అవకాశం లేదు.

తాళిబొట్టును జాగ్రత్తగా తీసి మంచం మీద పెట్టింది. తరువాత రిఫ్రెష్ అయి కిచెన్ లోకి వెళ్ళింది. కాఫీ తాగుతూ బీరువాలో లోంచి డ్రస్సు తీసి మంచం మీద పెట్టింది. అ డ్రస్సు అబ్బాస్ కు కూడా నచ్చుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. దాదాపు ఇద్దరి అభిరుచులు అభిప్రాయాలు ఒక్కటే. కొంచం సేపు ఇంట్లో గడిపి తిరిగి తన చాంబర్స్ కు వచ్చేసింది మిత్రవింద. నాలుగు గంటల వరకు రొటీన్ పనులు చూస్తూ ఉండి పోయింది. ఆ రోజు వచ్చిన న్యూస్ పేపర్స్ అన్ని క్షుణ్ణంగా చదివింది. వాటిలో పాకిస్ధాన్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తన డైరీలో నోట్ చేసుకుంది. కొన్ని క్లిప్పింగ్స్ కట్ చేసి ఒక ఫైలులో ఫైలు చేసింది. ఈ తతంగం అంతా ముగిసే సరికి నాలుగు గంటలవుతోంది. ఆమె బయలు దేరే సమయం వచ్చింది. ఫైల్స్ మిగత డాక్యుమెంట్స్ జాగ్రత్తగా బీరువాలో పెట్టి తాళం వేసింది. తరువాత చాంబర్స్ నుంచి బయటకు వచ్చింది. తిన్నగా అంబాసిడర్ తరువాత ఆఫీసర్ చాంబర్స్ లోకి వెళ్ళింది.

“హల్లో మిత్రవిందగారు ఏమిటి విషయం నా చాంబర్స్ లో అడుగుపెట్టారు” చలోక్తిగా అడిగాడు ఆ జూనియర్ ఆఫీసర్. “మీ పర్మిషన్ కోసం వచ్చాను”అంది నవ్వుతూ మిత్రవింద.

“ఏ విషయంలో” అడిగాడు అతను.

“ఈ రోజు నేను ఒక గంట ముందే వెళ్ళి పోవాలనుకుంటున్నాను. దానికి మీ అనుమతి కావాలి” అంది మిత్రవింద.

“ఎనీ స్పెషల్ అకేషన్?

“అలాంటిది ఏం లేదు. కొంచం ఇంట్లో పని ఉంది” అంది మిత్రవింద.

“అలాగే వెళ్ళండి” అన్నాడు అతను.

మిత్రవింద అతనికి ద్యాంక్స్ చెప్పి గదిలోంచి బయట పడింది. తన చాంబర్స్ తలుపులకు తాళం వేసి క్యార్టర్స్ చేరుకుంది. తలుపులు గడియ పెట్టి గబగబ తయారైంది. మాల్ లో కొన్న డ్రస్సు వేసుకుంది. తరువాత బయటకు కనిపించకుండ తాళి కట్టుకుంది. తరువాత అద్దంలో తనని తాను చూసుకుంది. తాళి కనిపించటం లేదని నిర్ధారణ చేసుకున్న తరువాత గదిలోకి వెళ్ళింది. బ్యాగ్ లో బురఖా డ్రస్సు పెట్టుకుని క్వార్టర్స్ లోంచి బయట పడింది. ఇంకా స్టాఫ్ ఎవరు బయటకు రాలేదు. చుట్టూ నిశబ్ధంగా ఉంది. మెల్లగా పార్కింగ్ స్పేస్ లో ఉన్న తన కారు దగ్గరకు చేరుకుంది.

“నన్ను రమ్మంటరా మేడం” అక్కడే నిలబడి ఉన్న డ్రైవర్ అడిగాడు.

“అవసరం లేదు. నేనే డ్రైవ్ చేస్తాను. ద్యాంక్స్“ అని చెప్పి కారు స్టార్ట్ చేసింది. బ్యాగ్ ను తన పక్కనే పెట్టుకుంది. మరు క్షణం కారు వేగంగా మెయిన్ గేటు లోంచి బయటకు దూసుకు పోయింది. కారు కొంచం దూరం వెళ్ళిన తరువాత పేవ్ మెంట్ పక్కన కారు ఆపింది. కారు కిటికి తలుపులు మూసి బ్యాగ్ లోంచి బురఖా డ్రస్సు తీసి వేసుకుంది. తరువాత కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చింది.  ఒక్కసారి అబ్బాస్ ఇంటికి వెళ్ళినా తేలికగా అతని ఇల్లు గుర్తు పట్ట గలిగింది.  పోర్టికోలో కారు అపి లోపలికి వెళ్ళింది. పోయిన సారి అబ్బాస్ ఇంటికి వచ్చినప్పుడు బురఖా లోనే వచ్చింది. అందుకే సెక్యురిటి వెంటనే గుర్తు పట్టి సెల్యుట్ చేసి గేటు తెరిచాడు.

లోపల ఆమె రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అబ్బాస్ షబ్నమ్.

“ఏం ప్రాబ్లం లేదు కదా” అడిగాడు అబ్బాస్.

“ఏం లేదు నువ్వు చెప్పినట్టుగానే బురఖా వేసుకుని వచ్చాను కదా” అంది మిత్రవింద.

“తొందరగా తయారవ్వండి. ముందు అమ్మని ముస్తాబు చెయ్యి. తరువాత నీకు నీ పుట్టిన రోజు ప్రెజెంటేషన్ ఇస్తాను” అన్నాడు అబ్బాస్.

“నాకు ఎందుకు ఈ ముస్తాబు అంతా. నన్ను నేనుగా ఉండనివ్వండి” అంది షబ్నమ్ ఇబ్బందిగా చూస్తూ.

మిత్రవింద ఆవిడ మాటలు పట్టించుకోకుండ గదిలోకి తీసుకు వెళ్ళింది. పది నిమిషాల తరువాత షబ్నమ్ ను వెంటపెట్టుకుని బయటకు వచ్చింది. తల్లిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు అబ్బాస్. మిత్రవింద ఆవిడను ఎంతో అందంగా డిగ్నిఫైడ్ గా ముస్తాబు చేసింది. ఒక పెద్ద మిలిట్రి అధికారి తల్లి ఎలా ఉండాలో అచ్చంగా అలాగే ఉంది షబ్నమ్.

అబ్బాస్ ఒక్క క్షణం పాటు తల్లి వైపు అలాగే చూస్తూ ఉండి పోయాడు. షబ్నమ్ మాత్రం సిగ్గుగా నవ్వింది.

“చాల బాగుంది మిత్రవింద. ఇదిగో నీ బర్తడ్ ప్రెజెంటేషన్” అని ఒక పాకెట్టు మిత్రవిందకు అందించాడు. అతనికి ద్యాంక్స్ చెప్పి అది తీసుకుని గదిలోకి వెళ్ళింది. అయిదు నిమిషాల తరువాత అబ్బాస్ తెచ్చిన డ్రస్సు వేసుకుని బయటకు వచ్చింది మిత్రవింద. తల్లి కొడుకులు ఇద్దరూ మెస్మరైజ్ అయినట్టు చూస్తూ ఉండిపోయారు. అతను తెచ్చిన డ్రస్సు చక్కగా మిత్రవిందకు సూట్ అయిపోయింది. అతికినట్టుగా సరిపోయింది.

“చాల బాగుంది కోడలు పిల్ల. నీ వల్ల బట్టలకు అందం వచ్చిందో లేక బట్టల వల్ల నీలో ఆకర్షణ ఎక్కువైందో చెప్పటం కష్టం” అంది షబ్నమ్ నవ్వుతూ.

అబ్బాస్ కూడా నిజమే అన్నట్టుగా తలూపాడు.

“ఇలాగే ఒకరినొకరు పొగడ్తూ ఉంటే టైం అయిపోతుంది. నేను ఇంకా మీ కోడలుగా ఇంట్లో అడుగు పెట్టలేదు. ఇంకా ఇండియన్ ఎంబసిలో పని చేస్తున్న పొలిటికల్ అటాచిని. అది మీరు మరిచి పోయినట్టున్నారు” అంది మిత్రవింద.

షబ్నమ్ ఒక్కసారిగా గట్టిగా నవ్వింది. చాలా సంవత్సరాల తరువాత తల్లి మనసారా నవ్వటం ఇప్పుడే చూస్తున్నాడు అబ్బాస్. అతనికి ఎంతో సంతోషం కలిగింది.

“సరే బయలు దేరండి” అంటు గదిలోంచి బయటకు వచ్చాడు అబ్బాస్. అతని వెనుక షబ్నమ్ బయలు దేరింది. చివరగా పైన బురఖా వేసుకుని మిత్రవింద బయలు దేరింది. ముగ్గురు వెళ్ళి కారులో కూర్చున్నారు. డ్రైవర్ ముందుకు రాబోతుంటే అబ్బాస్ వారించాడు.
“ఈ రోజు నేనే డ్రైవ్ చేస్తాను. నువ్వు అవసరం లేదు” అన్నాడు అబ్బాస్. డ్రైవర్ అక్కడే నిలబడి పోయాడు. అబ్బాస్ డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. షబ్నమ్ వెనుక సీటులో కూర్చుంది. మిత్రవింద కూడా వెనుక కూర్చోబోతుంటే వారించింది షబ్నమ్.

“నా దగ్గర కూర్చోవటం ఎందుకు. వెళ్ళి అబ్బాయి పక్కన కూర్చో” అంది నవ్వుతూ.

మిత్రవింద కూడా నవ్వి వెళ్ళి అబ్బాస్ పక్కన కూర్చుంది. క్షణం తరువాత కారు స్టార్ట్ అయి వేగంగా ముందుకు దూసుకు పోయింది. గేటు దాటి మెయిన్ రోడ్డు మీదకు ప్రవేశించింది. చాల రోజుల తరువాత భర్తతో కారులో వెళ్ళటం ఆమెకు చాల ఆనందంగా ఉంది. అంతకు పై పెచ్చు ఉద్వేకంగా కూడా ఉంది. ఇది ఒక మంచి శకునంగా భావిస్తోంది ఆమె. త్వరలోనే ఇద్దరు కలిసి జీవించే అవకాశం వస్తుందని నమ్మకంగా ఉంది ఆమెకు.

అరగంట తరువాత కారు షాలిమార్ రెస్టారెంటు ముందు ఆగింది. అప్పటికే హోటల్ పార్కింగ్ స్పేస్ కార్లతో నిండి పోయింది. ఎలోగో సందు చూసుకుని తన కారు పార్క్ చేశాడు అబ్బాస్. తరువాత ముగ్గురు లోపలికి వెళ్ళారు. లోపల టేబుల్స్ అన్ని దాదాపు నిండిపోయాయి. అంతకు ముందే అబ్బాస్ తమ కోసం ఒక టేబుల్ రిజర్వ్ చేశాడు. అందరు వెళ్ళి ఆ టేబుల్ ముందు కూర్చున్నారు. అ ప్రాంతంలో పెద్దగా వెలుతురు లేదు. కాని ప్రతి టేబుల్ పైన ఒక నీలం రంగు బల్బ్ వెలుగుతోంది. అందు లోంచి వస్తున్న కాంతి టేబుల్ మీద పడుతోంది. అంతకు మించి చుట్టు పక్కల ఎలాంటి వెలుతురు లేదు.

అబ్బాస్ కు ఎదురుగా షబ్నమ్ మిత్రవింద కూర్చున్నారు. హోటల్ లో అడుగు పెట్టిన వెంటనే తన మొహం మీద ఉన్న బురఖాను తీసేసింది మిత్రవింద. బల్బ్ లోంచి వస్తున్న కాంతి ఆమె మొహం మీద పడతోంది. దాని వల్ల ఆమె మొహం వింత కాంతితో మెరిసి పోతుంది.

“ఏం ఆర్డర్ చెయ్యమంటావు మిత్రవిందా” బేరర్ ఇచ్చిన మెను కార్డ్ చూస్తూ అడిగాడు అబ్బాస్.

“పుట్టిన రోజు ఫంక్షన్ నాదే అయినా పార్టీ ఇస్తుంది మీరు..అందుకే మీరు ఆర్డర్ చెయ్యటం బాగుంటుంది” అంది మిత్రవింద.
అబ్బాస్  ముగ్గురికి సౌత్ ఇండియన్ తాలీ ఆర్డర్ చేశాడు.

పది నిమిషాల తరువాత బేరర్ భోజనం తీసుకు వచ్చాడు. వాళ్ళ మద్య వాటిని సర్ది వెళ్ళి పోయాడు. ముగ్గురూ భోజనం చెయ్యటం మొదలు పెట్టాడు. అప్పుడే అబ్బాస్ కాని మిత్రవింద కాని ఊహించని అనూహ్యమైన విషయం జరిగింది.

అబ్బాస్ టేబుల్ వెనుక కూర్చున్న ఒక వ్యక్తి అప్పుడే టిఫిన్ చేసి లేచి నిలబడ్డాడు. క్యాజువల్ గా వెనక్కి తిరిగి చూశాడు. భోజనం చేస్తున్న అబ్బాస్ ను చూడగానే అతని మొహం విప్పారింది.

“హల్లో క్యాప్టన్” అన్నాడు ఆ వ్యక్తి. “హల్లో అమానుల్లా” అన్నాడు అబ్బాస్ కూడా నవ్వుతూ.

“చాల రోజులైంది మనం కలుసుకుని కదూ” అన్నాడు అమానుల్లా.

“రోజులు కాదు సంవత్సరాలు. నిన్ను చూసినందుకు నాకు చాల సంతోషంగా ఉంది అమానుల్లా” అన్నాడు అబ్బాస్.

“నాకు కూడా ఫ్యామిలితో ఎంజాయ్ చెయ్యటానికి వచ్చినట్టుగా ఉన్నావు. మద్యలో ఇబ్బంది పెట్టినట్టున్నాను. వస్తాను” అని అమానుల్లా వెనక్కి తిరిగ బోయాడు.

“ఎలాగు వచ్చావు కదా. నా వాళ్ళను పరిచయం చేస్తాను. ఈవిడ నా కన్న తల్లి పేరు షబ్నమ్. ఇతను అమానుల్లా అని నాకు మంచి స్నేహితుడు. వేరే డిపార్ట్ మెంట్ లో క్యాప్టన్ గా ఉంటున్నాడు” అని ముందు తన తల్లికి పరిచయం చేశాడు. తరువాత మిత్రవిందను పరిచయం చేశాడు.

“ఈమే పేరు బెనజీర్. మాకు దూరపు చుట్టం. ఇస్లామాబాద్ కు సైట్ సీయింగ్ కు వచ్చింది” అని మిత్రవిందను పరిచయం చేశాడు.

“హల్లో “ అన్నాడు అమానుల్లా” నవ్వుతూ మిత్రవింద వైపు చూసి.

మిత్రవింద కూడా "హలో" అంది. క్యాజువల్ గా ఆమె మొహం వైపు చూసిన అమానుల్లా ఆశ్చర్య పడ్డాడు. మిత్రవిందను ఇంతకు ముందు ఎక్కడో చూసిన అనుభూతి కలిగింది.

“మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా ఉంది” అన్నాడు అమానుల్లా.

మిత్రవింద షబ్నమ్ కమ్చీ దెబ్బ తిన్నట్టు ఉలిక్కి పడ్డారు.“అలా జరిగే అవకాశం లేదు. బెనజీర్ ఇంతకు ముందు ఒక్కసారి కూడా ఇస్లామాబాద్ రాలేదు. తను తన అమ్మ నాన్నలతో కరాచిలో ఉంటుంది” అన్నాడు అబ్బాస్.

“అఫ్ కోర్స్ అది నిజమే కావచ్చు. కాని ఈ మద్యనే ఈ అమ్మాయి లాంటి అమ్మాయిని ఎక్కడో చూశాను. కాని ఎక్కడ చూశానో మాత్రం గుర్తుకు రావటం లేదు” అన్నాడు అమానుల్లా. అబ్బాస్ తేలికగా నవ్వాడు.

“మనిషిని పోలీన మనిషి ఉండటం సహజం. ఏ మాత్రం రక్త సంబంధం లేకుండ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండటం మనం తరుచు చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళను డోపుల్ గ్యాంగర్ అంటారు. నిజానికి ఆ వ్యక్తుల మద్య ఎలాంటి రక్త సంబంధం ఉండదు. వాళ్ళు చుట్టాలు కానీ బంధువులు కాని కారు. ఇద్దరి కుటుంబాలకు కొంచం కూడా సంబంధం ఉండదు. అయిన ఇద్దరు దాదాపు ఒకేలా ఉంటారు. అలాంటి మనుష్యులు చాలా మంది ఉన్నారు. బహుశా నువ్వు బెనజీర్ డోపుల్ గ్యాంగర్ ను చూసిఉంటావు” అన్నాడు అబ్బాస్ నవ్వి.
అమానుల్లా కూడా నిజమే సుమా అన్నట్టుగా తల ఆడించాడు. దాంతో మిత్రవింద షబ్నమ్ కూడా తేలికగా నిట్టూర్చారు.
రెండు క్షణాల తరువాత అమానుల్లా బై చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ముగ్గురూ భోజనం ముగించారు. వాళ్ళు బిల్ చెల్లించి హోటల్ నుంచి బయటకు వచ్చే సరికి దాదాపు తొమ్నిది గంటలు అవుతుంది. మామూలుగా అయితే ఎంబసి రూల్ ప్రకారం ఉద్యోగస్ధులు ఎనిమిది గంటలకు ఎంబసి చేరుకోవాలి. ఒకవేళ ఆలస్యం అవుతుందని అనుకుంటే సంబంధిత అధికారికి కాల్ చేసి చెప్పాలి. అంబాసిడర్ ఆఫీసులో లేడు. అర్జంట్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు. రావటానికి రెండు రోజులు పడుతుంది. అందుకే మిత్రవింద ఇన్ చార్జ్ అధికారి పర్మిషన్ తీసుకుంది.
ఆ విషయం కాదు మిత్రవింద ఆలోచిస్తుంది. అమానుల్లా గురించి మధన పడుతోంది. ఇంత వరకు ఆమెకు అబ్బాస్ కు ఉన్న సంబంధం గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆనుకోకుండా విలన్ లా ఈ అమానుల్లా వచ్చి ఉడి పడ్డాడు. ఆమెను ఎక్కడో చూసినట్టు తన అనుమానం వెలిబుచ్చాడు. అతను ఎక్కడ చూశాడో మిత్రవింద ఊహించింది. కొన్ని రోజులకు ముందు అంబాసిడర్ కొత్తగా తను చార్జ్ తీసుకుంటున్నప్పుడు పెద్ద పార్టీ ఇచ్చాడు. దానికి పాకిస్ధాన్ రాజకీయ నాయకులతో పాటు చాల మంది పెద్ద అధికారులు కూడా వచ్చారు. ఆ ఫంక్షన్ కు అమానుల్లా కూడా వచ్చి ఉంటాడు. అక్కడే ఆమెను ఒక ఇండియన్ పొలిటికల్ అటాచిగా ఆమెను చూసి ఉంటాడు. అది విషయం.

“ఏమిటి ఆలోచిస్తున్నావు” అన్నాడు అబ్బాస్.

మిత్రవింద ఆలోచన నుంచి తేరుకుని “అమానుల్లా గురించి ఆలోచిస్తున్నాను. అతని వల్ల మనకు ప్రమాదం వస్తుందేమో అని భయపడుతున్నాను” అంది.

“ఆ రోజు నాతో పాటు అతను కూడా ఆ పార్టీకి వచ్చాడు. అప్పుడు నిన్ను చూసి ఉంటాడు. అందుకే ఎక్కడో చూశానని అనుమానం వ్యక్తం చేశాడు” అన్నాడు అబ్బాస్.

“నాకు చాల భయంగా ఉంది అబ్బాస్” అంది మెల్లగా మిత్రవింద.

అబ్బాస్ ఏదో మాట్లాడ బోయాడు. అప్పుటి వరకు మౌనంగా ఉన్న షబ్నం అందుకుంది.

“నువ్వేం భయపడకు. ధైర్యంగా ఉండు. అంతా అబ్బాస్ చూసుకుంటాడు. ఇంకా కొన్ని రోజులు మీరిద్దరు ఈ అవస్ద పడాలి. తరువాత మీ పెళ్ళి అట్టహాసంగా అందరి సమక్షంలో జరుగుతుంది. ఆ తరువాత మీరు ఎవరికి భయ పడవలసిన పని లేదు. అంత వరకు కొంచం అప్రమత్తంగా ఉంటే చాలు.”

“అమ్మ చెప్పింది సబబుగానే ఉంది. ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టు చాలు. ఈ లోగా ఆ ముష్కరులను పట్టుకుని మీ ప్రభుత్వానికి అప్పగిస్తాను. తరువాత మన రెండు దేశాల మద్య ఉన్న అపార్ధాలు తొలగి పోతాయి. మళ్ళి మన రెండు దేశాలు స్నేహ భావంతో మెలుగుతాయి. ఇది చెప్పినంత తేలిక కాదని నాకు తెలుసు. కొంచం కష్ట పడ వలసి వస్తుంది. అయిన ఏం ఫర్వాలేదు. తప్పకుండా సాధిస్తాను. నువ్వు మాత్రం లేని పోని భయాలు మనస్సులో పెట్టుకుని బాధ పడకు” అన్నాడు అబ్బాస్.

మిత్రవింద తేలికగా నిట్టూర్చి పలచగా నవ్వింది. ఆమె నవ్వు చూసి షబ్నం కూడా రిలాక్స్ అయింది. ఆ తరువాత ముగ్గురు బయలు దేరారు. ఇంటికి చేరుకున్న తరువాత షబ్నమ్ ఉన్నట్టుండి మిత్రవిందను దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అబ్బాస్ ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. మిత్రవిందకు మాత్రం ఆ స్పర్శ తల్లి స్పర్శను మరిపిస్తోంది. అచ్చంగా ఆమె కన్న తల్లి ముట్టుకున్నట్టుగానే ఉంది. అందుకే తన్మయత్వంతో కొన్ని క్షణాలు అలౌకికమైన ఆనందం అనుభవిస్తూ అచేతనంగా ఉండి పోయింది.

“జాగ్రత్తగా ఉండు కోడలు పిల్లా. ఏం భయపడకుండ వెళ్ళు” అంది షబ్నమ్.

మిత్రవిందకు కొంచెం కూడా వాళ్ళను విడిచి వెళ్ళాలని లేదు. అక్కడే ఉండిపోవాలని ఉంది. అందుకే బయలుదేరటం ఇష్టం లేక పోయినా బలవంతంగా వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకుని బయలు దేరింది. తన కారులో కూర్చుని స్టార్ట్ చేసింది. క్షణం తరువాత కారు వేగంగా ఇండియన్ ఎంబసి వైపు దూసుకు పోయింది.

ఆ రోజు చలి విపరీతంగా ఉంది. రోడ్డు మీద జన సంచారం కూడా తక్కువగా ఉంది. అప్పుడప్పుడు లారీలు బస్సులు మాత్రం వేగంగా దూసుకు పోతున్నాయి. ఆకాశంలో చంద్రుడు మెరిసి పోతున్నాడు. మేము కూడా ఉన్నామంటూ దూరంగా నక్షత్రాలు సన్నగా వెలుతురును చిమ్ముతున్నాయి. అయిదు నిమిషాల తరువాత మిత్రవింద తన కారును పేవ్ మెంట్ మీద ఒక పక్కగా ఆగింది. పైన వేసుకున్న బురఖా తీసి జాగ్రత్తగా మడిచి సంచిలో పెట్టుకుంది. తరువాత కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చింది. ఇంకో పావు గంట డ్రైవ్ చేసిన తరువాత ఆమె ఎంబసి పరిసర ప్రాంతంలోకి వచ్చింది. అక్కడ పోలీస్ చెకింగ్ జరుగుతోంది. అటుగా వస్తున్న కార్లను పూర్తిగా తనీఖీ చేస్తున్నారు. అందకే వాహనాలు ఒకదాని వెనుక ఒకటి నిలబడి చెకింగ్ కోసం కాచుకుని ఉన్నాయి.

మిత్రవింద కారును ఒక పోలీస్ అధికారి చూశాడు. వెంటనే స్టిఫ్ గా నిలబడి సెల్యుట్ చేసి దారి ఇచ్చాడు. రూల్ ప్రకారం ఎంబసిలో పనిచేస్తున్న ఉద్యోగస్ధుల కార్లను వాహనాలను తనీఖీ చెయ్యరు. అందుకే ఆమెను వెళ్ళమని సైగ చేశాడు పోలీస్ అధికారి. బ్రతుకు జీవుడా అనుకుంటు తన కారును వేగంగా ముందుకు పోనిచ్చింది. అయిదు నిమిషాల తరువాత ఆమె కారు ఎంబసి మెయిన్ గేటు ముందు ఆగింది. సెక్యురిటి గార్డ్ ఆమె కారును చూసి గేటును బార్లాగా తెరిచాడు. మిత్రవింద తన కారును పార్కింగ్ స్పేస్ లో పార్క్ చేసి దిగింది. సంచి తీసుకుని పక్కకు తిరిగి చూసింది. పైన మేడ మీద అంబాసిడర్ చాంబర్స్ లో లైట్లు వెలుగుతున్నాయి. అంబాసిడర్ సిటిలో లేనప్పుడు ఎవరు ఆ చాంబర్స్ లోకి అడుగు పెట్టరు. ఆ అధికారం ఎవరికి లేదు. కాని ఇప్పుడు లైటు వెలుగుతుంటే బహుశా అంబాసిడర్ ఢిల్లీ నుంచి వచ్చి ఉండాలనుకుంది.

తన క్వార్టర్స్ చేరుకుని లోపలికి వెళ్ళింది మిత్రవింద. తలుపులు గడియ వేసి తన బెడ్ రూంలోకి వెళ్ళింది. అద్దం ముందు నిలబడి తాళి బొట్టును జాగ్రత్తగా తీసి బీరువాలో దాచి పెట్టింది. దాంతో పాటు బురఖాను కూడా బీరువాలో పెట్టి తాళం వేసింది. తరువాత బట్టలు మార్చుకుని కిచెన్ లోకి వెళ్ళింది. వేడి కాఫీ తయారు చేసుకుని బెడ్ రూంలో కూర్చుంది.

ఎంబసిలో దాదాపు సద్దుమణిగింది. చుట్టూ నిశబ్దం పరుచుకుంది. అప్రయత్నంగా మిత్రవిందకు సాయంత్రం గడిపిన క్షణాలు గుర్తుకువచ్చాయి. చాల రోజుల తరువాత సంతోషంగా ఆనందంగా గడిపే అవకాశం ఈ రోజు ఆమెకు వచ్చింది. అది జహీర్ అబ్బాస్ తో గడపటం ఆమెకు ఇంకా ఆనందం కలిగించింది.

ఆ రోజు చాల సేపటి వరకు అదే విషయం గురించి ఆలోచిస్తూ నిద్ర పోలేదు మిత్రవింది. చాంబర్ లో లైట్లు వెలగడానిక్కారణం అంబాసిడర్ రావడమేనా? ఇంకేదైనా అనుమానాస్పదమా? మిత్రవింద ఊహించనిదేమైనా జరగబోతోందా?? తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఎదురు చూడాల్సిందే......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nee peru talachina chalu