ఒకానొకప్పుడు వార్తాపత్రికలు చదవడం ఓ నిత్యకృత్యంగా ఉండేది. కొంతమందికైతే అది ఒక వ్యసనమే. తిండైనా మానేసేవారు కానీ, వార్తాపత్రిక చూడకుండా ఉండలేకపోయేవారు. దేశవిదేశాల వార్తలూ,సాహిత్యం, సినిమా, క్రీదారంగానికి సమ్బంధించిన విశేషాలూ, ఒకటేమిటి, ఫలానా రంగంలో ఏం జరుగుతోందో తెలిసేది. రాజకీయాలైతే తప్పదే. ఆరోజుల్లో పత్రికా సంపాదకులకి కూడా, ఓ ఉన్నతమైన స్థానం ఉండేది. ఇంక ఇంగ్లీషు పేపర్లకైతే ప్రత్యేక స్థానం. మనం మాట్టాడే / రాసే ఇంగ్లీషు సరైన పధ్ధతిలో ఉపయోగించడానికి ఈ పేపర్లలో రాసే, వార్తలూ, సంపాదకీయాలే కొలమానంగా ఉండేవి. అందువలనే, ఇంట్లో పెద్దలు, చదువుకునే పిల్లలచేత, ఇంగ్లీషు పత్రికలు ప్రతీరోజూ చదవమనేవారు… చదవడంతో సరిపెట్టక, ఏం చదివారో ఓ పుస్తకంలో చూడకుండా రాయమనేవారు. ఇలాటి ప్రక్రియలుండబట్టే, ఆరోజుల్లో తెలుగు మాధ్యమంలో చదువుకున్నా, ఇంగ్లీషు అంత బాగా ఉండేది. ఆరోజుల్లో, ఇప్పటిలాగ కాన్వెంటులూ, స్పోకెన్ ఇంగ్లీషు సంస్థలూ ఉండేవి కావు. తెలుగైనా, ఇంగ్లీషైనా వ్యాకరణ బధ్ధంగా ఉండేది… అంతదాకా ఎందుకూ, ఇంగ్లీషు టైపింగు కి కూడా , వార్తాపత్రికల్లో , ఏదో ఒకటి చూసి టైపుచేయడమే.
ఆ రోజుల్లో పత్రికలలో రాసినవి ఎంత ప్రామాణికంగా ఉండేవంటే, కొన్ని వార్తలు, వ్యాసాలూ, జాగ్రత్తపరిచేవారు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ( అవిభక్త) ప్రభుత్వం వారు, తెలుగు వార్తాపత్రికలనూ, సచిత్ర వార, నెలసరి పత్రికలనూ , అంతర్జాలంలో పొందుపరిచి, ఇప్పటికీ చదువుకునే సౌలభ్యం కలగచేసారు. ( Press Academy Archives Andhra Pradesh).. పత్రికలో వార్త ప్రాముఖ్యాన్ని బట్టి ప్రచురించేవారు. సంపాదకీయాలైతే నిష్పాక్షికంగా రాసేవారు. యాజమాన్య ఒత్తిడిలాటివి అంతగా ఉండేవికాదుకూడా. ఒక్కోప్పుడు ఆంధ్రపత్రిక లో శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావుగారు, రాసే సంపాదకీయాలు ఆనాటి ప్రభుత్వాలకి తలనొప్పిగా ఉండేవిట.. తలనొప్పికి విరుగుడుగానే , పంతులు గారు “ అమృతాంజనం “ కనిపెట్టారని ఓ జోక్ ప్రాచుర్యంలో ఉండేది.
1975 లో Emergency రోజుల్లో, అన్ని ఇంగ్లీషు పత్రికలూ, ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు ప్రచురించడానికి సిధ్ధపడ్డా, Indian Express యజమాని శ్రీ గోయెంకా , శాయశక్తులా పోరాడి,, పేపరు మొదటిపేజీ ఖాళీగా ఉంచడానికైనా సిధ్ధపడ్డారు.కానీ ప్రభుత్వవిధానాలను మాత్రం సమర్ధించలేదు.అదీ ఆనాటి పత్రికల నియమనిబధ్ధత.
ఈనాటి పత్రికలు చదవడం మాట దేవుడెరుగు, చూడ్డానికే వెగటు పుట్టిస్తున్నాయనడంలో సందేహం లేదు. ప్రతీ వార్తనీ లేనిది ఉన్నట్టుగా చూపించడానికే ప్రాముఖ్యత. వాడే భాష గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదనిపిస్తుంది. ఏ పత్రిక అస్థిత్వానికైనా వ్యాపార ప్రకటనలే ముఖ్యం. అందులోనూ ప్రభుత్వప్రకటనలకి లోటుండదు. ఆ ప్రభుత్వ ప్రకటనలు నిరాటంకంగా సంపాదించడానికి, ఒకే మార్గం- ప్రభుత్వాలు చేసే ప్రతీ పనినీ, నిస్సంకోచంగా సమర్ధించడం, అది ఎంత తప్పైనా. ఇదివరకటిలాగ కాకుండా, ఏదో sensational news కి, తమ ఊహాగానంకూడా జతచేసి హడావిడి చేయడం. ఒకనొకప్పుడు పతాక శీర్షిక ( Banner head line) కి ఒక అర్ధం ఉండేది. ఈ రోజుల్లో అలాటివేవీ కనబడవు. పెపరు తెరవడం తర్వాయి, ఫలానా చోట “ మూకుమ్మడి అత్యాచారం “ కిడ్నాప్పూ” , “ఫలానా వాడు పార్టీ జంపూ “ “ రైతు ఆత్మహత్య “ “ భూకబ్జా”… ఇవే. వార్తలు చదవడంతోనే, మనకి ఒత్తిళ్ళు, వాటివలన లేనిపోని రోగాలూనూ. ఆ పత్రికల్లో ప్రయోగించే భాష గురించి ఎంతక్కువ చెప్పుకుంటే అంతమంచిదీ…
ఏదో ఒక్కటంటే ఒక్కపేజీలో, కొద్దిగా ఉపయోగపడే వ్యాసాలుంటాయి. ఈమాత్రందానికి 6-8 రూపాయలు ఖర్చుపెట్టడంకూడా ఎందుకూ ? అంతర్జాలంలో ఈ పత్రికలు చదవడానికి సౌలభ్యం కలిపించడమొక్కటే, వీళ్ళు చేసిన మంచిపని. ఆదివారాల ప్రత్యేక పుస్తకాలు పరవాలేదు.
పేపర్లలాగే, ప్రచురించిన పుస్తకాలు చదవడంకూడా ఈమధ్య తగ్గిపోయింది. పుస్తకం ప్రచురించడానికి వేలకు వేలు ఖర్చు. పోనీ డబ్బులెక్కువయి ప్రింట్ చేసాడే అనుకోండి, కొనేవాళ్ళు కనిపించరు.ఇంటికొచ్చినవారికో, తెలిసినవారికో చేతిలో పెట్టడం మిగిలింది.
సర్వేజనాసుఖినోభవంతూ…
|