ఏదైనా పని చెబితే, పిల్లలు మారాం చేయడం మామూలే. మొండికేయడం కూడా అరుదైన విషయం కాదు. కానీ, అస్సలేమాత్రం మాట వినని పరిస్థితి తరచూ కనిపిస్తోందంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఇటీవల కాలంలో ఈ మొండిఘటాల తీవ్రత అనూహ్యంగా పెరిగిపోతోంది. ఓ అంచనా ప్రకారం, పదేళ్ల నుండి, ఇరవై ఒకటేళ్ల వయసున్న వారిలో ఈ మొండితనం విపరీతంగా కనిపిస్తోందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా 14 నుంచి 18 వయసు మరీ డేంజర్‌గా మారుతోంది. ఆ వయసులోనే విచక్షణని మరింతగా కోల్పోతున్నారట మెజార్టీ ఇడియట్స్. ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకిలా.? అని ఆరా తీస్తే, విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి.
మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్లుగా సొసైటీలో పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. కుటుంబంలో భార్యా భర్తలిద్దరూ వర్కింగ్ అయితే, అలాంటి చోట ఈ మొండిఘటాలు ఎక్కువగా తయారవడం కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. మానసిక వైద్య నిపుణులదీ ఇదే మాట. మా అబ్బాయి మాట వినట్లేదు. మా అమ్మాయి మొండిగా తయారైంది.. అంటూ వచ్చే తల్లితండ్రుల సంఖ్య ఎక్కువైందని వైద్య నిపుణులు అంటున్నారు. మరి ఈ మానసిక సమస్యకి మందెక్కడ.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా తయారయ్యింది. కుటుంబంలో వాతావరణం సరిగ్గా ఉన్నా, బయటి వాతావరణం.. అంటే ఫ్రెండ్స్ పరంగా పొల్యూట్ అయిపోయే ప్రమాదం ఎక్కువ. సినిమాలూ, టీవీలు యువతీ యువకుల మీద ప్రభావం చూపిస్తాయి.. అన్న మాట చిన్నదైపోయింది.
ఇప్పుడంతా, స్మార్ట్ యుగం. సో ప్రపంచమంతా అరచేతుల్లోనే ఉంది. అందులోని చెత్తని బుర్రలోకి ఎక్కించేసుకుంటోన్న యువత, మేమే మేధావులం అని విర్రవీగడంతోనే అసలు సమస్య మొదలవుతోంది. ఉడుకు రక్తం కదా.. కళ్ళెం వేయడం కొంచెం కష్టమైన పనే. కానీ, తప్పదు.. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే ఈ స్మార్ట్ ఇడియట్స్‌తో. బుజ్జగించాలి.. పరిస్థితులు అర్థమయ్యేలా చెప్పాలి. అయితే, అందరూ అలాగే ఉన్నారనుకుంటే, పొరపాటు. చెడుని ఆశ్రయించడానికి అవకాశాలు స్మార్ట్‌గా అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఆ సంఖ్య పెరుగుతోంది. అలాగని ఆ స్మార్ట్ ప్రపంచానికి పిల్లిల్ని దూరంగా ఉంచలేం కదా. అందుకే ఇది మందులేని రోగం. అసలు సిసలు ఇస్మార్ట్ రోగం.
|