Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వర్ణిక సమీక్ష..!! - మంజు యనమదల

మరుగౌతున్న మధుర లేఖా సాహిత్యపు అరుదైన ఆనవాళ్లు వర్ణికలో ..!!

తెలుగు సాహిత్యంలో బోధన, రాగయుక్తంగా పిల్లల కోసం బాల సాహిత్యపు గేయరచనలు, కవితలు, వ్యాసాలు, గజళ్ళు  ఇలా  పలు రచనా ప్రక్రియలలో అందె వేసిన చేయి, బహుముఖ ప్రజ్ఞాశాలి,  ఎన్నో సన్మానాలు, పురస్కారాలు,  అభిమానులతో పాటుగా ఎందరో విమర్శకుల ప్రశంసలు పొందిన " నుడి గుడి "  సృష్టికర్త " రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి " గారి సాహితీ కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం  " వర్ణిక " లేఖా సాహిత్యం. 

ఒకప్పుడు ఉత్తరాలు మనుష్యుల మధ్యన దూరాలను దగ్గర చేసేవి. అభిప్రాయాలను, అనుబంధాలను పంచుకోవడంలో ప్రముఖ పాత్ర వహించాయనడంలో అతిశయోక్తి లేదు. విభిన్నమైన లేఖలు అందుబాటులో ఉండేవి. కాలక్రమేణా యంత్రాల మాయకు దాసోహమైపోయిన నేటి జీవన విధానంలో ఈ లేఖలు దాదాపు కనుమరుగై పోయాయి. పాత తరాల మాధుర్యాన్ని, మమకారాన్ని ఇప్పటి తరాలతో పాటుగా భవిష్యత్ తరాలకు అందించాలన్న సత్ సంకల్పంతో ఈ " వర్ణిక " లేఖా సాహిత్యానికి శ్రీకారం చుట్టారు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి. 

వర్ణిక లోని ప్రతి లేఖ ఓ ఆణిముత్యమే. వర్ణిక చదువుతుంటే మనకు తెలియని, వాడుకలో లేని ఎన్నో తెలుగు పదాలు పలకరిస్తాయి లేఖలతో పాటుగా. లేఖలు చదివిన ప్రతి ఒక్కరికి తమ మనసు పొరల్లో నిక్షిప్తమైన జ్ఞాపకాలు రాక మానవు. లేఖలలో ఉన్న అన్ని రకాలను స్పృశించారు. లేఖలలో ఎక్కువగా ప్రేమ, విరహం, ఆరాధన కనిపిస్తాయి. స్నేహ సౌగంధికా సుమాలతో ప్రేమ రసధునిలో ఓలలాడిస్తారు కొన్ని లేఖలలో. మరో లేఖలో మనసులోని ప్రేమారాధనను వలపు మధురిమగా అందిస్తారు. దూరాన ఉన్న మనసుల మధ్యన సాంగత్యాన్ని నిరీక్షణలో పలికిన మనసు జతులను అందిస్తారు సున్నితమైన భావావేశంతో. సమాజ శ్రేయస్సు కాంక్షిస్తూ పెద్దరికంతో ఎన్నో కుటుంబాల వినాశనానికి దారితీసిన తాగుడు బలహీనత గురించి ఓ అక్కగా బాధ పడుతూ రాసిన లేఖ హృదయాన్ని కలచివేస్తుంది. ప్రేమను అంతా రంగరించి రాసిన మరో లేఖ తల్లి తన కొడుక్కి గుర్తుచేసిన బాల్య జ్ఞాపకాలు, వెన్నెల్లో ఆరుబయట ఆస్వాదించిన అనుభూతులు. అద్భుతమైన లేఖ ఇది. వృత్తిలో స్నేహితురాలు ఎదుర్కున్న హెచ్చరికలు, ఇబ్బందులను చెప్తూ, ఆ స్నేహితురాలికి చెప్పిన ధైర్య వచనాలు మరో లేఖలో. కలికితనాన్ని, చిలిపితనాన్ని కలిపి కవిత ఎలా ఉండాలో రాసిన కవితా ఓ ఓ కవిత బావుంది. అనారోగ్యాన్ని దాచేసి కుటుంబం కోసం చనిపోవాలనుకున్న ఓ మనసు వ్యథను ఓ లేఖలో చదువుతుంటే కన్నీరు రాణి మనసు, మనిషి ఉండరు. అవార్డులు, రివార్డుల పేరిట సాహిత్యంలో జరుగుతున్న పలు మోసాలు, మధ్యతరగతి కుటుంబాల్లో చదువు, సంస్కారం, తెలివి అన్ని ఉంది కూడా పెళ్ళి కాని ఓ  యువతి ఎదుర్కున్న కన్నవాళ్ళ  వివక్షను, ఇప్పటి వారిలో లోపంచిన భాషపై పట్టును, చదవడం, రాయడంలోని లోపాలను, స్నేహితురాలితో పంచుకున్న మనసు ముచ్చట్ల, బాధలు , వేదనలు, మనిషి ఎలా ఉండాలో, శ్రీవారికి విన్నవించిన నివేదనలు, గజల్ చరిత్రను,  ఎన్నో సామాజిక అంశాలను చర్చిస్తూ రాసిన వివిధ రకాలైన లేఖలు ఈ వర్ణిక లేఖా సాహిత్యంలో మనకు కనువిందు చేస్తాయి. ఇవి మచ్చుకు కొన్నే..ఇలా చెప్పుకుంటూ పొతే చాలా లేఖలున్నాయి ఈ పుస్తకంలో.

స్వతహాగా భావుకురాలైన రచయిత్రి ఈ లేఖలలో చక్కని పద లాలిత్యాన్ని అందించారు. అవడానికి లేఖా సాహిత్యమే అయినా అద్భుతమైన వర్ణనతో, భావ కవిత్వపు మెరుగులు దిద్ది " వర్ణిక " పేరుకు తగ్గట్టుగా అందమైన వర్ణనలతో, ఒయ్యారమైన పదాలను చతురతగా ఒలికించారు. తన భాషా పఠిమ ప్రతి లేఖలోనూ కనిపిస్తుంది. యాంత్రిక జీవితాలకు అలవాటు పడిపోతున్న మన జీవన విధానంలో ఈ " వర్ణిక " మనం కోల్పోయిన ప్రపంచాన్ని సరికొత్తగా మనకు మళ్ళీ పరిచయం చేయగలదని ఘంటాపథంగా చెప్పగలను. వేదనను కూడా సున్నితంగా, సుకుమారంగా చెప్పిన రచయిత్రి ప్రతిభ ప్రతి లేఖలోనూ కనిపిస్తూ, " వర్ణిక " అందరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ.. ఇంత చక్కని లేఖలను వెలుగులోనికి తెచ్చినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను.

మరిన్ని శీర్షికలు
weekly-horoscope august 16th to august 27th