Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

పెళ్ళికూతురు అలిగింది

pelli kooturu aligindi

పెళ్ళి కూతురని ప్రత్యేకంగా కట్టిన ఎర్రని పట్టు చీర కన్నాఎక్కువగా నీరజ మొహం కోపంతో ఎర్రబడి పోయింది. బ్యూటీషియన్ మేకప్ వేస్తూ బుగ్గలకు అద్దిన గులాబీరంగు నీరజలో బుసలు కొడుతున్న కోపానికి  తనని తాను ఎర్రగా మార్చేసుకుంది. కంటికి దిద్దిన నల్లని కాటుక ఆమె కళ్ళలోకి చేరిన ఎరుపు ముందు చిన్నబోయింది. మనసు ఉక్రోషంతో మండిపోతుంటే, ఆ ఆవేశానికి పెదవులు అదురుతుంటే, ఇంత పొడుగున వేసిన పూలజడని తన కదలికలకి అడ్డుగా ఉందంటూ ఒక్క విసురున వెనక్కి విసిరిన ఊపుకి, ఆ జడలో చుట్టిన గులాబీలూ, మల్లెలు బెదిరిపోయి, చెదిరిపోయేయి. పెళ్ళికూతురైన నీరజ పెళ్ళి సమయానికి నాజూకైన  సరస సల్లాపాల సత్యలా కాకుండా నరకాసుర సంహార సమయాన కనిపిస్తున్న వీరనారి సత్యభామలా కనపడుతుంటే ఎదురుగా ఉన్న ఆమె తల్లీ, తండ్రే కాకుండా దగ్గరి బంధువులందరూ బెదిరిపోయేరు. 

అంతకు సరిగ్గా గంట ముందు..

ఆ సిటీలోనే అది చాలా ఖరీదైన కళ్యాణ మండపం. అక్కడ తమ పిల్లల పెళ్ళిళ్ళు చేసామని ఎంతో మంది గొప్పగా చెప్పుకునే ఆ చోట అంగరంగ వైభోగంగా జరుగుతోంది అ సిటీలోనే గొప్ప పేరూ, హోదా, డబ్బూ ఉన్న ఆదిశేషయ్య గారమ్మాయి పెళ్ళి. పెళ్ళికొడుకు కూడా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిన ధర్మతేజా గారి ఒక్కగానొక్క కుమారుడు, సాఫ్ట్ వేర్ ఇంజనీరూ అయిన సుధాకర్. అందుకే ఆ హాలంతా సిటీలోని పెద్దమనుషులనబడేవాళ్ళతో కిటకిటలాడిపోతోంది.

సరిగ్గా సుముహూర్త సమయం. “అయమ్ముహూర్త స్సుముహూర్తమస్తు..” అంటూ ఒకరి శిరస్సుమీద మరొకరితో వధూవరులిద్దరి చేతా జీలకర్ర, బెల్లం కలిపిన ముద్దని పెట్టించాడు పురోహితుడు.

ఒక్కసారిగా పూలజల్లులాగా వారిద్దరి తలలమీద అక్షింతల వర్షం కురిసింది. తొందరపనులమీద వెళ్ళవలసిన పెద్దమనుషులుకూడా నూతన వధూవరులపై అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి  అరగంటపైగా క్యూలో నిలబడవలసి వచ్చిందంటే అదెంత గొప్పవారింట్లో పెళ్ళో అర్ధమై పోతుంది. సుముహూర్తం అవగానే వెళ్ళినవాళ్ళు వెళ్ళిపోగా ఇంకా హాల్లో మూడొంతులమంది జనం ఉండనే వున్నారు. వాళ్లందరూ మంగళ సూత్రధారణ, తలంబ్రాలు కూడా చూసి, పెళ్ళిభోజనం చేసి వెళ్ళాలని  అనుకుంటున్నవారు. ఎందుకంటే వారందరికీ కూడా ఆది శేషయ్య గారి తోనూ,  వారి వియ్యంకులు ధర్మతేజగారితోనూ కూడా కావల్సిన పనులు చాలా వున్నాయి మరి.

తల్లి తండ్రులిచ్చిన మథుపర్కాలు కట్టుకు రావడానికి పెళ్ళికూతురు నీరజని ముత్తైదువులు లోపలికి తీసికెళ్ళారు. మథుపర్కాలు మార్చుకురాగానే మంగళ సూత్రధారణ. ఆ పైన తలంబ్రాలు అవగానే పెళ్ళిభోజనం అనుకుంటూ చుట్టపక్కాలు గుంపులు గుంపులుగా చేరిపోయి కబుర్లలో పడ్డారు.

కాలం గడుస్తోంది. పావుగంటయింది. పెళ్ళికూతురు రాలేదు. ఇంకా రాలేదేమిటా అని వేచి చూస్తున్నారు అందరూ. అరగంటయింది. ఊహు, రాలేదు. అసహనం తలెత్తుతోంది అందరిలో.

“అయినా ఈ కాలం పిల్లలు ఇలాగే ఉన్నారమ్మా. సుముహూర్తానికి ఒక మేకప్పూ, సూత్రధారణకి మరో మేకప్పూనూ.. ఈ వీడియోలు వచ్చేక మేకప్పులవాళ్ళూ, బట్టలవాళ్ళూ మహ బాగుపడిపోతున్నారు.” ఒక నడివయసావిడ  దాచుకోలేక  బైటకే గట్టిగా అనేసింది. ఆ మాట పట్టుకుని అక్కడున్న కొందరు రెండు గ్రూపులుగా మారిపోయి ఆ టాపిక్ మీదే చర్చలు మొదలుపెట్టేసారు.

ముప్పావుగంట దాటిపోయింది. పెళ్ళికూతురు నీరజ ఎక్కడా అయిపూ అజా లేదు. ఇంక ఆహూతుల్లో సహనం నశించిపోతోంది. అందరికన్న ఉడికిపోతున్నవాడు పెళ్ళికొడుకు సుధాకర్. తెల్లారకుండా అతన్ని లేపేసి, తలంటేసి, అలవాటులేని పంచె కట్టేసి అక్కడ కూర్చోబెట్టారు. పిల్లాడు బుధ్ధిమంతుడు కనక ఎదురు ప్రశ్నించకుండా పురోహితుడు ఏం చెయ్యమంటే అది చేస్తున్నాడు. ఇప్పటికప్పుడే పది దాటింది. అతని గొంతులో కాస్త కాఫీ పోద్దామన్న ఆలోచన కూడా అక్కడెవరికీ కలగటం లేదు. ఇంకెంత, సుముహూర్తం అవనే అయింది, తర్వాత సూత్రధారణ, తలంబ్రాలే కదా అనుకుంటూ అతనికి తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో ఓపిగ్గా కూర్చున్నాడు. కానీ, ఇది మరీ విడ్డూరంగా ఉంది. చీర మార్చుకురావడానికి పెళ్ళికూతురికి గంట కావాలా! ఏమైనా మాట్లాడదామంటే ఆ సమయంలో బాగుండదేమోననుకుంటూ తల్లి వైపు చూసాడు సాభిప్రాయంగా.

పెళ్ళికొడుకు తల్లి సుభద్ర ఓసారి స్టేజి చుట్టూ చూసింది. ఎక్కడా పెళ్ళికూతురి తల్లి కానీ, తండ్రికానీ కనిపించలేదు. ఇంకిలా లాభం లేదని కూతురు హేమని పిలిచి లోపలికెళ్ళి చూసి రమ్మంది.

అయిదు నిమిషాల్లో ఆ కూతురు పరిగెట్టుకొచ్చింది. పెళ్ళికూతురూ, తల్లీ తండ్రీ, వారి తరఫు దగ్గరి చుట్టాలూ అందరూ ఓ గదిలో చేరి, తలుపు లేసేసుకుని ఏదో మాట్లాడుకుంటున్నారుట. సుభద్రకి అర్ధంకాలేదు. ఈ టైమ్ లో అంత రహస్యంగా తలుపులేసుకుని మాట్లాడుకునే విషయం ఏమైవుంటుందీ..

ఇవతల తాళి కట్టడానికి పెళ్ళికొడుకూ, అది చూడడానికి ఇంతమంది అతిథులూ హాల్ నిండుగా కూర్చుని వేచి చూస్తుంటే వాళ్ళు లోపల ఏం మంతనాలాడుతున్నట్లూ! కొంపతీసి ఈ పెళ్ళి కానీ ఆ పిల్లకి ఇష్టం లేకుండా బలవంతంగా చేసారా.. అలాగయితే మరి సుముహూర్తానికి మటుకు ఎందుకు కూర్చునట్టూ! మనిషి కూడా సంతోషంగానే కనిపించింది కానీ ఎక్కడా  ఇష్టం లేనట్టు లేదే.

కొడుకు వైపు చూసింది. అప్పటికే గంట నుంచీ ఆ సన్నటి పెళ్ళిపీట మీద కూర్చోలేక అవస్థ పడుతున్న సుధాకర్ ఇంక లేవడానికి సిధ్ధపడుతున్నాడు.  వెంటనే భర్త ధర్మతేజనీ, తమ్ముడు గిరిధర్ నీ పక్కకి పిలిచింది. ఆడపెళ్ళివాళ్ళ రూమ్ వైపు వెళ్ళి అసలు సంగతేమిటో కనుక్కు రమ్మంది.

పెద్దమనుషులిద్దరూ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ పెద్దమనిషి తరహాని ఓ పక్కన పెట్టేసి, తలుపులు గట్టిగా డబడబా బాదేసారు. అయిదు నిమిషాలకి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. పెళ్ళికూతురి మేనమావ తల బైటకి పెట్టి వీళ్ళని చూసి, ఓ వెర్రినవ్వు నవ్వి “ఒక్క అయిదు నిమిషాలు..” అంటూ మళ్ళీ ఢబాలున తలుపు వేసేసాడు. వీళ్ళకేం అర్ధం కాలేదు. అయినా పట్టు విడవకుండా మళ్ళీ తలుపులు బాదేసారు. ఈసారి పెళ్ళికూతురి తండ్రి ఆదిశేషయ్య తలుపు కొద్దిగా తెరిచి చూసాడు. అంతే.. ఆ అవకాశం వదులుకోకుండా పెళ్ళికొడుకు మేనమావ ఆయన్ని చేయి పుచ్చుకుని బలవంతంగా బయటికి లాగేసాడు. ఆ లాగుడికి కింద పడబోతున్న ఆయన బలవంతంగా ఆపుకుని, “బావగారూ, ఆలస్యానికి క్షమించండి. ఇదిగో, అమ్మాయి వచ్చేస్తోంది. ఏమే.. “ అంటూ మళ్ళీ రూమ్ లోకి దూరబోతున్న అతని వెనకాలే వీళ్ళిద్దరూ కూడా ఆ రూమ్ లోకి దూరారు.

అక్కడ నరకాసుర సంహార సమయాన వీరనారి సత్యభామలా రోషంతో బుసలు కొడుతున్న పెళ్ళికూతురు నీరజని చూసి హడిలిపోయేరు ఇద్దరూ.  ఇంకా మథుపర్కాలు మార్చుకున్నట్టు లేదు. సుముహూర్తానికి కట్టిన పట్టుచీరలోనే ఉంది.

“ఏంటమ్మా ఆలస్యం? అవతల అందరూ ఎంతసేపని వెయిట్ చేస్తారూ?” ధైర్యం తెచ్చుకుని సూటిగా పెళ్ళికూతురినే అడిగేసారు ధర్మతేజ.
మామగారిని చూసి నీరజ జుట్టూ, బట్టలూ కాస్త సర్దుకుని,  “నేను రెడీయేనండీ, మా నాన్న నేను చెప్పినదానికి ఒప్పుకుంటే..” అంది నెమ్మదిగా అయినా ఖచ్చితంగా.

“ఏం కావాలి నీకు?” అని అడిగిన వియ్యంకులు ధర్మతేజ ప్రశ్నకి అడ్డం వస్తూ

“బావగారూ, దానికి చిన్నతనం. దాని మాటలు మీరు పట్టించుకోవద్దు.“ అన్నాడు ఆదిశేషయ్య.

“చిన్నతనం యేంటీ? బీ. టెక్ పాసైంది. ఎమ్ ఎన్ సి లో నాలుగేళ్ళనుంచీ జాబ్ చేస్తోంది. ఆమాత్రం తెలీదూ! ఈ పెళ్ళేదో అయ్యాక, అవతల వచ్చిన అతిథులు వెళ్ళాక మీరిద్దరూ కూర్చుని తేల్చుకోండి మీ గొడవ. అంతేకానీ ఈ టైమ్ లో ఇలా అలస్యం చెయ్యడం బాగుండదమ్మా.” అన్న ధర్మతేజ మాటలకి,

“మీకు తెలీదు మామగారూ, ఇప్పుడు కనక నేను పట్టుదలగా ఉండకపోతే తర్వాత మా నాన్న అస్సలు నా మాట వినరు. అందుకే ఆయన ఒప్పుకునేదాకా తాళి కట్టించుకోనని నేనింత పట్టు పట్టాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మన్నించండి.” అంది నీరజ మర్యాదగా మామగారితో.

“నీ వినయం మండినట్టే ఉంది కానీ, అసలింతకీ తాళి కట్టించుకుందుకు వస్తావా  రావా.. అది చెప్పు ముందు. “ వీళ్ళ వెనకాలే వచ్చిన పెళ్ళికొడుకు తల్లి సుభద్ర విసుగ్గా అడిగింది.  “వస్తా నత్తయ్యగారూ, నేనడిగింది చేస్తానని మా నాన్నని చెప్పమనండి. నిమిషంలో వచ్చేస్తా.” అందా అమ్మాయి.

“ఇంతకీ ఏమడిగిందండీ?” అన్న గిరిధర్ మాటలకి పెళ్ళికూతురి తండ్రి ఆదిశేషయ్య నిట్టూరుస్తూ, “అదంతా ఓ పెద్ద కథలెండి.” అంటూ మొదలుపెట్టబోయాడు.

వీళ్ళ వెనకాలే వచ్చిన సుధాకర్ “ఇప్పుడు మీరు ఆ ఫ్లాష్‍బాక్ లోకి వెళ్ళొద్దు. ఇంకాస్త ఆలస్యమైతే అక్కడ మాకు అక్షింతలు వెయ్యడానికి పిట్ట కూడా ఉండదు.” అంటూ నీరజ ఎదురుగా వెళ్ళి, “నీకు నా మీద నమ్మకముంటే వెంటనే రా. నువ్వు మీ నాన్నగార్ని అడిగింది సబబుగా ఉంటే కనక దాన్ని ఆయన చేత చేయించే పూచీ నాది.” అన్నాడు. నీరజ సుధాకర్ కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ కళ్ళలో నిజాయితీ కనిపించిందామెకి. అంతే. ఇంకేం మాట్లాడకుండా పక్కనే ఉన్న మథుపర్కాలు చేత్తో పట్టుకుని మార్చుకుందుకు లోపలిగది వైపు వెళ్ళిపోయింది.

అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. సుధాకర్, ధర్మతేజ, గిరిధర్, సుభద్ర, హేమ అందరూ ఆదిశేషయ్యని సందేహంగా చూస్తూ అక్కడినుంచి హాల్ వైపు నడిచారు. మరో అరగంటలో సూత్రధారణ, తలంబ్రాలు హాయిగా, ఆనందంగా జరిగిపోయాయి. ఆహూతులందరూ నూతన వధూవరులను ఆశీర్వదించి, కానుకలు చదివించి పెళ్ళిభోజనానికి వెళ్ళిపోయారు. తన వెనకాల ఉన్న హేమని చూస్తూ సుధాకర్, “అక్కా, కాస్త పాలైనా, కాఫీ అయినా తెచ్చిపెడతావా..” అనడిగాడు. హేమ అప్పటిదాకా ఆ విషయం పట్టించుకోనందుకు నొచ్చుకుంటూ, “ఇదిగో.. ఇప్పుడే.” అంటూ వెళ్ళింది.

నిజానికి పెద్ద గొప్పగా రూమ్ లో నీరజకి మాటిచ్చేసాడు కానీ తాళి కట్టించుకుందుకు కూడా రాకుండా ఇంత హడావిడి చేసిన ఆమె కోరిక ఏమిటా అని ఆలోచించుకుంటుంటే సుధాకర్ కి మనసులో గుబులుగానే ఉంది. పెద్దవాళ్ళు కుటుంబాలూ, జాతకాలూ చూసి ఈ పెళ్ళి కుదిర్చారు. ఆ టైమ్ లో అమెరికాలో ఉన్న సుధాకర్ ఆన్ లైన్ లో నీరజని చూసి మాట్లాడేడంతే. తర్వాత ఈ పెళ్ళికి మూడువారాల శెలవుకోసం ఇద్దరూ కూడా ఎక్కువ పని చేయవలసి వచ్చింది. అందుకే పెళ్ళికి ముందు ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోడానికి అవకాశం లేకపోయింది. అందుకే కన్నతండ్రే ఒప్పుకోడానికి అంత ఆలోచిస్తున్న నీరజ కోరిన కోరిక యేమైవుంటుందా అని సుధాకర్ కి ఆదుర్దాగా ఉంది.
 నీరజవైపు తిరిగి నెమ్మదిగా “ఇంతకీ నువ్వు మీ నాన్నగార్ని ఏవడిగావూ?” అన్నాడు.

నీరజ చిన్నగా నవ్వుతూ, “ముందు కాస్త కాఫీయో, పాలో తాగండి. మాటిచ్చారుగా. నెమ్మదిగా చెప్తాను.” అంది.

ఇందాక అంత రౌద్రంగా కనిపించిన అమ్మాయేనా ఇంత నెమ్మదిగా మాట్లాడుతోందీ అని సుధాకర్ ఆశ్చర్యపోతుండగానే  హేమ ఇద్దరికీ వేడిగా స్ట్రాంగ్ కాఫీ తెచ్చిచ్చింది. అది తాగుతుంటే ఆదిశేషయ్య వచ్చాడక్కడికి. సుధాకర్ ని చూస్తూ, “చూడు బాబూ, మా అమ్మాయి చదువుకుని ఉద్యోగం చేస్తోందన్న మాటే కానీ బొత్తిగా లోకజ్ఞానం లేని పిల్ల. లేకపోతే ఇన్నేళ్ళనుంచి ఇంత మంచి జాబ్ చేస్తున్న ఎవరైనా ఇలా చేస్తారా?” అన్నాడు.

తెలుగు సీరియల్స్ లో లాగా అసలు విషయం తప్పించి అఖ్ఖర్లేని డైలాగుల్లాగా తెగలాగుతున్న మమగారి మాటలను మధ్యలో ఆపేస్తూ, “ఇంతకీ నీరజ మిమ్మల్ని ఏవడిగిందండీ?” అన్నాడు.

“అదేకదా బాబూ చెప్తున్నాను. ఏదో ఇన్నేళ్ళనుంచి ఇంత పెద్ద ఉద్యోగం చెస్తూ రిటైర్ మెంట్ కి దగ్గర పడ్డాను. నా హోదాకి తగ్గట్టు పిల్ల పెళ్ళి చెయ్యాలని లక్షల డబ్బు దాచాను. ఇంతమంది పెద్దమనుషులు వచ్చారంటే ఎంత గొప్ప చెప్పూ. కానీ ఈ పిల్లకొచ్చే జీతం నా జీతం కన్నా ఎక్కువ. నాలుగైదేళ్ళ నించీ చేస్తోందా.. ఆడబ్బేం చేసిందో అడుగు.” కంప్లైంట్ చేస్తున్నట్టు అన్నారాయన. సుధాకర్ కి మొహ మాట మనిపించింది. ఆయనకి స్వంత కూతురు. తను తాళికట్టి ఇంకా గంట కూడా కాలేదు. నీరజ జీతం ఏం చేసిందో చెప్పమని ఎలా అడగగలడూ!
సుధాకర్ మొహమాటాన్ని కనిపెట్టిన నీరజ, “అసలు సంగతి నేను చెప్తాను వినండి..” అంది. హమ్మయ్య అనుకుంటూ నీరజ వైపు తిరిగాడతను.

“మా నాన్నగారికి తన పరువూ, హోదా, గొప్పలూ ప్రదర్శించుకోవడం చాలా ఇష్టం. తన కూతురి పెళ్ళి ఇంత పెద్ద కళ్యాణమండపంలో, ఇన్ని లక్షలు ఖర్చుపెట్టి నూటపదిరకాల వంటకాలతో విందు చేసుకుంటేనే ఆయనకి సంతోషం. కానీ ఒక్కపూట కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టడం, అందులో సగం వృథాగా పోవడం నాకు నచ్చవు. మనం ఈ రోజు పడేసిన పదార్థాలు ఎంతోమంది పేదలకు కడుపు నింపుతాయి.  
   నేను నాతోపాటు చుట్టూ ఉండే సమాజం కూడా సంతోషంగా ఉంటేనే ఇష్టపడతాను. అందుకే నా జీతం, నాకు మటుకు సింపుల్ గా గడవడానికి మటుకు అట్టిపెట్టుకుని, మిగిలినదంతా అవసరమైనవాళ్లకి ఉపయోగపడేలాగా చారిటీకి ఇచ్చేస్తుంటాను. అందుకే ఇన్నేళ్ళనుంచీ ఇంత సంపాదిస్తున్నా కూడా నాకు అవసరం లేదనే ఉద్దేశంతో కారు కూడా కొనుక్కోలేదు.

నా పధ్ధతి మా డాడీకి నచ్చదు. ఇంత డబ్బుండి కూడా ఒక మామూలు అమ్మాయిలా బస్సు లెక్కివెళ్ళడం అయనకి నామోషీ. ఇప్పుడీ పెళ్ళి కూడా అంతే. ఆడంబరాలకి పోకుండా సింపుల్ గా చెయ్యమన్నాను. నా దగ్గర సరే నన్నారు. అలాగే చేస్తారనుకున్నాను. కానీ ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారని నేను నా ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని రెండ్రోజులక్రితం ఇంటికి వచ్చేవరకూ నాకు తెలీలేదు. అది నాకస్సలు నచ్చలేదు. అందుకే ఈ పెళ్ళికి ఎన్ని లక్షలు ఖర్చుపెట్టేరో అన్ని లక్షలూ ఏదైనా చారిటీకి ఇస్తేనే ఈ పెళ్ళి చేసుకుంటానని కండిషన్ పెట్టాను. సరేనంటూ అప్పుడు నాకు మాటిచ్చారు మా నాన్నగారు.”

నీరజ మాటలకి అడ్దంవస్తూ ఆదిశేషయ్య “ఇవ్వకేం చేస్తానూ, ఇంత మంచిసంబంధం చెయ్యిజారి పోతుందేమోనని నీ తలతిక్క షరతులకి మాటివ్వాల్సొచ్చింది. ఏదో చిన్నతనం, ఆవేశంతో అన్నావనుకున్నాను కానీ నువ్వు ఆ మాటే పట్టుక్కూర్చుంటావనుకోలేదు. ” అన్నాడు విసుగ్గా. నీరజ సుధాకర్ తో, “చూసారా, చూసారా.. ఇలా నాకు మాటిచ్చి, దాన్ని తేలిగ్గా తీసుకున్నారని  సుముహూర్త మయ్యాక చీర మార్చుకుందుకు లోపలికి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది.

లోపల మా అమ్మతో,  “ఏదో ఈ పెళ్ళయిపోతే తర్వాత నీరూకి మటుకు ఆ మాట గుర్తుంటుందేవిటీ..” అంటుంటే విన్నాను. అందుకే ఇన్ని లక్షలకీ ఒక ఫౌండేషన్ పెట్టి, అనాథ పిల్లలకీ, అవసరమైన వాళ్ళకి తిండీ,బట్ట ఇచ్చి చదువు చెప్పించమన్నాను. అలా చదివిస్తే ఎన్ని జీవితాలు నిలబడతాయి చెప్పండి! కానీ దానికి మటుకు ఒప్పుకోరే.”

“ఎలా ఒప్పుకోమంటావ్? ఈ డబ్బులేమైనా ఉట్టినే వచ్చాయా ఊళ్ళోవాళ్ళకి పెట్టడానికి! నువ్వు నా కూతురివి కనక నీ పెళ్ళి గ్రాండ్ గా చేసాననిపించుకోవాలని నేనెంత ఆశపడ్దానూ! అది తప్పా!” మధ్యలో కల్పించుకున్న తండ్రిని చూసి,

“మనం గొప్పగా బతికితే వచ్చే సంతోషం కన్న పదిమంది జీవితాలు నిలబెడితే కలిగే సంతోషం ఎంత బాగుంటుంది నాన్నా!” అంది నీరజ.
మళ్ళి సుధాకర్ వైపు తిరిగి, “మీరే చెప్పండి, అందులో ఎంత ఆనందముంటుందీ! అందుకే దాని కొప్పుకుంటే  కానీ మళ్ళీ పెళ్ళిపీటల మీదకి రానన్నాను. ఊహు, ఎంత చెప్పినా ఆయనకి అర్ధం కాదే! పెళ్ళిటైమ్ లో ఇంక గొడవ పెట్టనని ఆయన అభిప్రాయం. కానీ మా నాన్నగారు మాటంటూ ఇవ్వాలంటే ఈ టైమ్ కన్నమంచి  సందర్భం దొరకదని నా ఉద్దేశ్యం. అందుకే కావాలని అంత కోపం తెచ్చుకున్నాను.  అప్పుడు మీరొచ్చి మా నాన్న తరఫున మాటిచ్చేరు. నాకు మీమీద నమ్మకం ఉంది. ఇంక ఆ మాట మీరే నిలబెట్టాలి..”

నీరజ చెప్పిన విషయం వింటున్న అక్కడున్న అందరూ ఒక్కసారిగా “హమ్మయ్య..” అని నిట్టూర్చారు. . అంత చిన్న వయసులోనే నీరజకున్న పెద్ద మనసుకి ఎంతో సంతోషించాడు సుధాకర్. ఈ విషయానికా ఎంత గొడవ చేసారూ తండ్రీకూతుళ్ళిద్దరూ అని చుట్టూ వున్నవాళ్ళు నవ్వుకున్నారు. 

ఎంతసేపూ మూడుతరాలకి సరిపోయేలా ఇంకా ఇంకా కూడబెట్టాలనే కొంతమంది పెద్దల ఆత్రం కన్న చిన్నపిల్ల అయినా  నీరజ పెద్దమనసుతో తీర్చుకోవాలనుకున్న ఈ కోరిక ఎంత గొప్పగా ఉందీ! ఇప్పటి యువతలో వస్తున్న ఇటువంటి ఆశలూ, ఆదర్శాలూ ఎంత గొప్పవీ!
అటువంటి భార్య దొరికినందుకు మురిసిపోతూ,  “నీకెందుకు, నేనున్నాగా, చూసుకుంటాను..” అన్నట్టు నీరజ చేయి నెమ్మదిగా నొక్కి వదిలేసాడు సుధాకర్. నీరజ మొహం మందారంలా విచ్చుకుంది.

 

మరిన్ని యువతరం
manasulo adusu