Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pelli kooturu aligindi

ఈ సంచికలో >> యువతరం >>

మనసులో అడుసు

manasulo adusu

సోమవారం పొద్దున్న నాకు మెలకువ వచ్చి పక్కకి చూసేటప్పటికి, నా రూమ్ మేట్స్ పక్కలు రెండూ  ఖాళీ  ఉన్నాయి. టైం చూస్తే ఎనిమిది న్నర అవుతోంది.  బస్సు స్టాప్  లో తొమ్మిది  గంటల బస్సు వచ్చే టయిముకి చేరాలని బయలు దేరాను . తొమ్మిది గంటల బస్సు నేను ఎక్కడానికి కాదు. ఆ టైం లో రోజూ బస్సు ఎక్కడానికి వచ్చే మాలతి ని చూడడానికి.

ఇవాళ నా మనసు చాల కల్లోలంగా ఉంది.  ముఖ్యంగా రెండు కారణాలు వల్ల  నా మనసు దుఃఖ భరిత మయి పోయింది. మొదటి కారణం, అమ్మకి  ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, రెండోది చాలా కాలం ప్రతిఘటించిన ఒక బలహీనతకి బలవంతగా నయినా  లొంగిపోయి నాన్న కి ఇష్టం లేని పని చేయడం . ఈ రెండూ గత రాత్రి జరిగి పోయాయి. 

బస్సు స్టాప్ చేరి, ఫుడ్ కోర్ట్ బయట కూర్చుని కాఫి తాగి,  బస్సు కోసం, మాలతి కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నా. ఆలోచనలు గతం లోకి పోయాయి 

******

విఐటి యూనివర్సిటీ లో అడ్మిషన్ వ్యవహారాలు  పూర్తి అయిన తరువాత అమ్మనీ నాన్ననీ రైలు ఎక్కించడానికి చిత్తూరు వెళ్ళాను. వాళ్ళు నన్ను అడ్మిట్ చేయడానికి వచ్చారు.   ట్రైన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంటె, స్టేషన్ కి ఎదురుగా ఉన్న ఒక రెస్టారెంట్ లోకి వెళ్లాము . అప్పుడు తినడానికీ ఆర్డర్ చేసి, రాత్రి ట్రైన్లో కీ కూడా పార్సెల్స్ ఆర్డర్ చేశారు  నాన్న

ఇంతలో ఒక మధ్య వయసు దాటినా ఒకావిడ మా  పక్క టేబిల్ దగ్గర వచ్చి కూర్చుంది. ఆవిడ పెరుగన్నం  పార్సెల్ ఆర్డర్ చేసి మా ముగ్గురినీ చూసి నవ్వింది. ఇంకో క్షణం ఆగి, " విఐటి అడ్మిషన్ కోసమా ? అని అడిగింది .అవునని చెప్పగానే లేచి మా  టేబుల్ దగ్గరికి వచ్చింది. అడ్మిషన్ అయిపోయిందా అని ఆవిడ అడిగితే అయింది అని చెప్పరు నాన్న. 

అవక ముందు మిమ్మలిని నేను కలిసి ఉంటె, చేర్చకండి అని చెప్పేదానిని అంది ముఖం లో కి వచ్చిన విషాద ఛాయలని అదుపు చేసుకుంటూ

" అదేమిటి ఎందుకు? " అని అడిగారు  నాన్న  కుతూహలంగా

" మూడేళ్లకిందట  మా అబ్బాయిని చాలా ఆశించి ఇక్కడ చేర్చాము . ఇక్కడికి వచ్చేదాకా మా అబ్బాయి చాలా బుద్ధి మంతుడు. ఎలా పడ్డాడో కొంతం మంది స్నేహితుల ప్రభావం లో పడి, ఎప్పుడూ ముట్టని నాన్ వెజ్ తినడం, తాగడం, సినిమాలు, చాలా పాడయి  పోయాడు. చాలా సబ్జక్ట్స్ ఉండి  పోయాయి. ఎంత చెప్పినా ఉపయోగం లేకుండా ఉంది." అని  కళ్ళ నీళ్లు పెట్టుకుని, మళ్ళీ తమాయించుకుని నా  వైపు చూసి " అడ్మిషన్ అయి పోయింది అంటున్నావు కాబట్టి,స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండు బాబూ. నువ్వు చేడిపోతే అమ్మ, నాన్న ఎంత బాధ పడతారో ప్రతిక్షణం గుర్తు చేసుకో" అంది.

తన కొడుకు పాడయినా, అలా ఇంకొకళ్ళు అవకూడదన్న ఆవిడ ఆత్రుత తో మేము ముగ్గురం  చలించి పోయాము

" చాలా థాంక్స్ అండి. మీరు చెప్పింది మావాడు ఫాలో  చేయడానికి నేను తప్పకుండా జాగ్రత వహిస్తాను" అన్నారు నాఅన్న   కృతజ్ఞతా పూర్వకంగా..

"ఇదిగో మేడం మీ పెరుగన్నం పార్సెల్" అని సర్వర్ తెచ్చి ఇవ్వడంతో, అది తీసుకుని ఆవిడ వెళ్లి పోయింది ఆవిడ వెళ్లిన తరువాత నాన్న మళ్ళీ అదే చెప్పారు. కేస్టు సంఘాలకి దూరంగా ఉండు అని, ఒట్టు వేయించు కోలేదు గాని, ఆయన పధ్ధతి లో చెప్పారు. అమ్మ, సిగరెట్టు, మందు, ముట్టొకొనని ఒట్టు వేసేదాకా వదల లేదు

" అప్పటి నుంచీ ఎప్పుడు ఫోన్ చేసినా  " పెరుగన్నం" ఆంటీ మాటలు గుర్తున్నాయా అంటూ ఉండేది అమ్మ.

అమ్మకీ, నానాకీ ఇచ్చిన మాట నిలబెట్టు కుంటూ ఈ మూడేళ్ళూ అన్నిటికీ దూరంగానే ఉన్నా.

గత ఆరు మాసాలు గా, శని ఆదివారాలు తప్ప నా దినచర్య ఏమిటంటే తొమ్మిదింటికి ముందే బస్ స్టాప్ చేరడం. బస్సు ఎక్కడానికి మిగతా ఆడపిల్లల తో వచ్చే మాలతి ని చూడడం. ఆమె బస్సు ఎక్కి, బస్సు వెళ్లి  పోయిన తరువాత  కాళ్ళు  ఈడ్చుకుంటూ హాస్టల్ కి రావడం. క్లాసులన్నీ మధ్యాహ్నం ప్రారంభమవుతాయి కాబట్టి  ఈ దిన చర్యకి అడ్డు లేదు.

మాలతిని మొట్ట మొదట చూసిన రోజు ఇప్పటికీ గుర్తు. ఎప్పుడయినా మెస్సు ఫుడ్,  బోర్ అనిపించి, కేంపస్ కి దగ్గరగా ఉన్న ఫుడ్ కోర్ట్ కి రావడం మాకందరికీ అలవాటు. ఫుడ్ కోర్ట్ మెయిన్ రోడ్డు మీదే ఉన్నా, బయట కుర్చీలు వేసే  స్థలం ఎక్కువ ఉండడంతో అక్కడ కూర్చునే మేము కాఫీ టిఫిన్లు కానిచ్చే వాళ్ళం. ఫుడ్ కోర్టు కు అతి దగ్గరలోనే శ్రీ పురం వేళ్లే బస్సులు ఆగేవి. మేము కూ ర్చున్న చోటినుంచి బస్సు ఎక్కడానికి వచ్చేవాళ్ళు స్పష్టం గా కనపడే వాళ్ళు. ఆ వేళ ఒక ముగ్గురు అమ్మాయిలతో కలిసి మాలతి కూడా వచ్చి బస్సు కోసం నుంచుంది. అదే ఆమెని మొదటిసారి చూడడం. ఆమెని చూడగానే చాలా కళ గా ఉందనిపించింది. అందరూ కళ్ళు తిప్పుకుని చూసే అపురూప మయిన అందం కాదు ఆమెది. కానీ ఆమె విశాల మయిన కళ్ళల్లో ఒక రకమయిన బెదురూ, విశాల మయిన నుదురు, చామన ఛాయలో ఉన్నా ఆమె లో ఎదో తెలియని ప్రత్యేకత కనిపించింది నాకు. ఆమె బస్సు ఎక్కి వెళ్లి పోయిన తరువాత చాలా సేపు ఆమె ఆలోచనలే మనసులో మెదిలాయి.
ఆ తరవాత ఇంచుమించు  రోజూఆ బస్సు వచ్చే సమయానికి అక్కడకి చేరుకోవడం, బస్సు వెళ్లి పోయిన తరవాత హాస్టల్ కి వెళ్లి పోవడం. అలవాటయింది. 

రూమ్ మేట్స్, కార్తిక్, సెంథిల్ నేనేదో ప్రేమ లో పడ్డానని వేళాకోళం మొదలెట్టారు. " ఏమిట్రా నీ ఉద్దేశ్యం" అని కార్తిక్ అడిగినప్పుడు ఒకటే చెప్పాను " ఏదయినా అందమయిన పువ్వు చూసినప్పుడు, దానిని కోసేసి స్వంతం చేసుకోవాలని పించకుండా, చూస్తూ ఆనందించడం కూడా చేయవచ్చు కదా. ప్రస్తుతానికి అంతకు మించి ఏ ఆలోచన లేదు నాకు" అన్నాను  

ఒక రోజు, బస్సు  వచ్చిన తరువాత, అక్కడికి చేరుకోవడానికి వస్తున్న మాలతి ని చూసి, ఆమె స్నేహితురాలు " మాలతీ త్వరగా రా, బస్సు బయలుదేరుతోందని" పిలిచినప్పుడు ఆమె పేరు మాలతి అని తెలిసింది.

ఒక నెల తరవాత నా పుటిన రోజున, నా రూమ్ మేట్స్ చిన్న పార్టీ అడిగి, పార్టీ అయినతరువాత ఒక గిఫ్ట్ కవర్ నా చేతిలో పెట్టారు. దానిని ఓపెన్ చేస్తే, ఎప్పుడు క్లిక్ చేశారో తెలియదు, మాలతీ ఫోటో. బయట కంటే కూడా చాలా అందంగా ఉంది ఫోటో లో. అప్పటినుంచీ అది నా పర్సులో భద్రం. నాకు అత్యంత ఇష్టమయినది కానుక గా ఇవ్వడం లో నా రూమ్ మేట్స్ ప్రణాళిక నన్ను చాలా ఆనంద పరిచింది.

కానీ నిన్నటి రోజున జరిగిన సంఘటనలు నన్నుచాలా కుదిపేశాయి. అభిమాన హీరో విడుదల సందర్భంగా కుల సంఘం వాళ్ళు చిత్తూరు రమ్మని వత్తిడి చేశారు. ఇంత వరకూ నన్ను అలాంటి వాటికి రమ్మని బలవంతం చేసే వారు కాదు. కానీ నిన్న ఎందుకో చాలా పట్టు పట్టారు.  వాళ్ళల్లో వాళ్ళు నన్ను తీసుకు వస్తామని పందెం కాసుకున్నారన్న సంగతి తరవాత తెలిసింది . సీనిమా విడుదల హడావిడి అయిన తరువాత, సాయంకాలం రివ్యూ రేటింగ్స్ వచ్చినతరువాత ఇంకా రెచ్చి పోయారు. సోడాలో డ్రగ్స్ కలిపి నాకు తాగించారు. వాళ్ళ రూమ్ చేరిన తరువాత, సంబరాలలో భాగంగా నేను ఎప్పుడూ చూడని సినిమాలు చిన్న ప్రొజక్టర్ పెట్టి రూమ్ లో గోడ మీద వేసి తెగ గోల చేశారు. నేను అటువంటి సినిమాలు ఎప్పుడూ చూడ లేదు. సహజంగా ఉండే కుతూహలం తో కొంత సేపు చూసిన తరువాత, స్త్రీ పురుషులు  అంత సిగ్గు లేకుండా తెర మీద ప్రవర్తిస్తుంటే కళ్ళు మూసుకున్నా, శబ్దాలు మాత్రం  నన్ను వీడ లేదు.  నాకు తెలియకుండానే, నా శరీరం లో మార్పులు జరిగాయి. నాలో కట్టలు  తెంచుకుని ఉద్రేకం రావడం అదే ప్రధమం. వాళ్ళు కలిపిన డ్రగ్ వల్ల , మొదటి సారి కారణంగా, ఆపుకోలేని నిద్ర రావడంతో బతికి పోయాను.

నన్ను రూములో దించి, వాళ్ళు ఎక్కడికో పోయారు కోరికలు తీర్చుకోవడానికి. ఇప్పుడు కూడా రాత్రి దృశ్యాలు గుర్తుకు వస్తే వళ్ళు  వేడెక్కి పోతోంది. కుటుంబ సంస్కారం పట్టు తో ఉన్న నన్నే ఇంత కుదిపేస్తుంటే, నిర్భయ కేసుల లో లాగ  దారుణమయిన రేపులకి దిగజారినవాళ్లు ఎందుకు, ఎలా ప్రేరితమయ్యారో, గతం లో ఆశ్చర్య పడే నాకు ఇప్పుడు అర్థమవుతోంది.  కొన్ని కొన్ని విషయాలు  మనసు మీద ఎటువంటి ప్రభావం చూపుతాయో. 

అన్నీ వాళ్ళ బలవంతం మీద జరిగినా, ఎక్కడో నాలో  దాగి ఉన్న కొన్ని కోరికలు నాకు అప్పుడు తెలియడం, ఈ వయసులో అవి సహజం అని సరిపెట్టుకోలేకపోయాను.

" పెరుగన్నం ఆంటీ " కొడుకు ఎలా పాడయాడో  ఇప్పుడర్థం అయింది. గత రాత్రి జరిగిన దాని ప్రభావం నుంచి  ఎలా బయట పడాలి ? అది ఇంకా డామేజ్ చేస్తుందా?

****

మాలతీ, స్నేహితులతో బస్సు స్టాండ్ కి వస్తూ ఉండడం గమనించి ఆలోచనల నుంచి బయట పడ్డాను. ఆమెని చూడగానే, నాలో ఒక్క మాటు గుప్పు మన్న ఆలోచనలు నన్ను కుదిపేశాయి. ప్రతి మాటు నన్ను ఆకర్షించే ఆమె ముగ్ధ సౌందర్యం ఇవ్వాళ మరుగున పడిపోయింది. ఆమె శరీరాన్ని ముఖం దాటి ఎప్పుడూ చూడని నేను, ఇవాళ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి, గత రాత్రి దృశ్యాలతో మిళితమయిపోయి నా మీద నాకే అసహ్య  మేసే స్థితి లో పడ్డాను. ఆమె పక్కన ఉన్న ఆమె స్నేహితులని ఎప్పుడూ పరికించి చూడని నేను, ఇవాళ వాళ్ళని కూడా చూసినపుడు రాత్రి దృశ్యాలు నాకు ఎంత హాని చేశాయో తెలిసింది.

వాళ్ళు బస్సు ఎక్కేదాకా కూడా ఉండకుండా వెంఠనే హాస్టల్ కు వచ్చేశాను. నా ఆలోచనలన్నీ, ఈ మానసిక కల్లోలం నుంచి ఎలా బయట పడటం అన్న దాని మీదే ఉండి పోయాయి .  ఇది తాత్కాలికమా, లేక లోతుగా డేమేజ్ జరిగిందా అన్నది నాకు తెలియలేదు.

క్లాసులకి వెళ్లినా, పాఠాలు ఫాలో అవడం చాలా కష్టమైంది. ఆఖరి పీరియడ్ లో ఆర్గనైజేషన్ థియరీస్ చెబుతున్న నడి వయసు నందినీ మేడం ని కూడా సరిగ్గా చూడ లెకపొయాను. ఒక రాత్రి గడిస్తే కొంత మరుగున పడిపోతాయమో అన్న ఆశతో పడుకున్నా.  రాత్రి కలల లో కూడా అవి  వదలలేదు. ప్రొద్దున్న లేచి మళ్ళీ బస్ స్టాప్ కి వచ్చి మాలతీ వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళని చూసినప్పుడు కూడా పెద్ద మార్పు కనపడ లేదు..

హాస్టలుకి వెనక్కి వస్తోంటే నాన్న గుర్తుకు వచ్చారు. చిన్నప్పుడు నాన్నకంటే అమ్మ దగ్గర నాకు చనువు ఎక్కువ.  నాకు ఏ సమస్య వచ్చినా నాన్నతో సంప్రతించడం అలవాటు. ఏ సమస్య వచ్చిన మఞ్చసీ సలహా ఇచ్చేవారు .

కానీ ఇప్పటి సమస్య  చాలా క్లిష్ట మయినది. అయినా ఇందులోంచి నాన్న సలహా తోటే బయట పడాలి అనుకున్నాను. రాత్రి నాన్నకి ఫోన్ చేసి, వివరాలు అన్నీ స్పష్టంగా చెప్పలేదు గాని, ఆయన సమస్య  అర్థం చేసుకోవడానికి కావలిసింది మటుకు చెప్పాను. ముందు కొంచం ఆయన కంగారు పడ్డారు. " పెరుగన్నం ఆంటీ" కొడుకు లాగ నేను కూడా చెడు సావాసాల్లో పడ్డానేమో నని. నేను భరోసా ఇచ్చిన తరువాత కుదుట పడి, నా సమస్య విన్నారు. ఆయన వెంఠనే ఏమీ  చెప్పలేదు కానీ ఒక సలహా ఇచ్చారు.

"ఒరేయి శ్రీశైలం గురువు గారి శిష్యుడు చైతన్య గారు  నీకు దగ్గరలోనే, శ్రీ పురంలోనే ఉంటున్నారు . ఆయన ఇంకా రెండు నెలలు అక్కడ ఉంటారు. నువ్వు వెళ్లి ఆయనని కలు"  నీ సమస్య ఆయన చిటికలో తీరుస్తారనుకుంటున్నాను" అని ధైర్యం చెప్పారు. ఇంకో రెండు రోజులు చూసి వెడదామని నిర్ణయించుకున్నాను. ఆ రెండు రోజులలోనూ మార్పు లేక పోగా, ఆడ వాళ్ళ వైపు చూడడమే కష్ట మయి పోయింది. ఇంక లాభం లేదని శ్రీపురం వెళ్లి నాన్న చెప్పిన చైతన్య గారి అడ్రసు కనుక్కుని అక్కడికిచేరుకున్నాను.   ఆయన శ్రీపురం గుడికి దగ్గరగా పెద్ద ఇంట్లో ఉన్నారు. ముందు గదులలో ఎవరో ఇద్దరు ముగ్గురు పెయింటింగ్స్ ఏవో వేసుకుంటున్నారు. వాళ్ళని అడిగితే లోపలచైతన్యగారు ఎక్కడ ఉంటారో చెప్పి వెళ్ళ మన్నారు.  చైతన్య గారు ఒక సోఫా లో కూర్చుని, ఎదో విషయాన్ని  అక్కడ వున్న ముగ్గురికి వివరిస్తున్నారు.  నేను ఫలానా అని చెప్పి నమస్కరించాను. ఆయన నాన్న పేరు చెప్పగానే చాలా సంతోషించి అక్కడ ఉన్న వాళ్ళని పంపేసి నన్ను ఆయనకి దగ్గరగా వచ్చి కూర్చోమన్నారు.  ఆయన చూపించిన ఆప్యాయత నాకు చాలా నచ్చింది.

ఆయన, చదువు గురించీ అదీ ప్రశ్నించిన తరువాత, " మీ నాన్న ఫోన్ చేసి రాఘవ వచ్చి కలుస్తాడని చెప్పారు" అని  నాన్న ఫోన్ చేసిన సంగతి చెప్పి సమస్య వివరించామన్నారు. నేను మొత్తం ఏదీ దాచకుండా, మాలతి విషయం తో సహా  అంతా చెప్పాను. ఆయన దగ్గర నాకు ఏదీ దాచాలని అనిపించలేదు.

" ఆయన కాసేపు ఆలోచించి, మాలతి ఫోటో ఉందా అన్నారు. నాకు కొంచం ఆశ్చర్య మేసింది. పర్సు లోంచి మాలతి ఫోటో తీసి ఇచ్చాను. ఆయన దానిని ఎదురుగ ఉన్న టేబుల్ మీద పెట్టి.  " రాఘవా నువ్వు రోడ్డు మీద వెడుతూ ఒక అసహ్య మయిన పదార్ధం మీద కాలు వేశావు అనుకో. ఏమిచేస్తావు ?' అన్నారు నాకేసి చూసి

" కంపు భరించలేము కాబట్టి వెంఠనే నీళ్లతో కడుకుంటాము " అన్నాను

" వెరీ గుడ్. అలాగే మనసు కూడా అసహ్యమయిన వాటిమీద ఒక్కొక్కప్పుడు అడుగు వేస్తుంది. కాలికి అంటిన దాని లాగే దీనిని కూడా కడుక్కోవచ్చు.నువ్వు రేడు రోజుల తరవాత రా ఎలాగో చెబుతాను" అన్నారు.

ఆయన తెప్పించిన ఫలహారం తీసుకుని, నమస్కరించి వచ్చేశాను. మూడో రోజున చైతన్య గారిని కలవడానికి వెళ్లాను. నన్ను చూడ గానే, చైతన్యగారు " కాళ్ళు కడుక్కుని లోపలి  గది లోకి వెళ్లి  అక్కడ 'సరస్వతీ దేవి కి నమస్కరించి రా"  అని గది చూపించారు.

నేను పక్క వరండాలో కాళ్ళు కడుక్కుని ఆయన చూపించిన గది  లోకి వెళ్లాను. అక్కడ ఒక టేబుల్ మీద ఒక సరస్వతి దేవి పెయింటింగ్ ఉంది. దాని ముందు ఒక దీపం వెలుగుతోంది. నేను ఆదేవికి నమస్కరించి ఒక్క నిమిషం ప్రార్థించి చైతన్య గారి దగ్గరికి వచ్చి కూర్చున్నాను.  . " సరస్వతికి నమస్కరించావా అన్నారు "

" చేసే వచ్చాను అన్నాను "

"మళ్ళీ లోపలి కి వెళ్లి సరస్వతీ దేవిని మళ్ళీ చూసి రా" అన్నారు నవ్వుతూ 

నాకు అర్థం కాలేదు. అయినా అయన ఎందుకు చెప్పారో అని మళ్ళీ గదిలోకి వెళ్ళాను. కొంచం దగ్గరగా వెళ్లి దేవిని చూశాను. షాక్ తిన్నాను. మాలతి ముఖాన్నే   సరస్వతి వేషం లో చిత్రించారు. మొదట చూసినప్పుడు ఏ  పూజ్య భావం కలిగిందో, ఇప్పుడు మాలతి సరస్వతి రూపంలో కనపడినా ఆ భావం లో మార్పు ఏమీ  మనసు లో మెదల  లేదు. వెనక్కి వచ్చి చైతన్య గారితో అదే చెప్పాను

" చిత్రం చూశావా ? నువ్వు కాలెండర్ లో ఒక స్త్రీ మూర్తిని, లక్ష్మి గానో సరస్వతి గానో చూసి నమస్కరిస్తావు. అదే స్త్రీ మామూలు డ్రెస్సులో నీ ముందు నిల్చుంటే ' అనేక వికారాలు లోనవుతావు.  ఇప్పుడు ఈ మధ్యన చూసిన అస్లీల చిత్రం వల్ల  ఏ స్త్రీని చూసినా నీ మనసులో అడుసు బయటికి వస్తోంది. అలా జరిగినప్పుడల్లా నువ్వు ఏ  స్త్రీని చూసినా , ఆ స్త్రీ  పటం లో ఉన్న దేవతే మామూలు వేషం లో ఉన్నదన్న భావం మనసుకి తెచ్చుకో. ఇలా కొద్దీ రోజులు చేస్తే నువ్వు అందులోంచి బయట పడిపోతావు. అదే మనసు  కడుక్కోవడానికి మార్గం. " అన్నారు నవ్వుతూ

ఆయన మాటలకి నాకు మంచి ధైర్యం వచ్చింది  . చైతన్య గారికి నమస్కరించి వచ్చేశాను

మరిన్ని యువతరం