Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

సైరా నరసింహారెడ్డిచిత్రసమీక్ష

sye raa movie review

చిత్రం: సైరా నరసింహారెడ్డి
నటీనటులు: చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, బ్రహ్మాజీ, నిహారిక కొణిదెల, రవికిషన్‌, అనుష్క, రఘుబాబు తదితరులు
సంగీతం: అమిత్‌ త్రివేది, జూలియస్‌ ఫాకియం (నేపథ్య సంగీతం)
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
నిర్మాణం: కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ
కథ: పరుచూరి బ్రదర్స్‌
డైలాగ్స్‌: బుర్రా సాయి మాధవ్‌
దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి
నిర్మాత: రామ్‌చరణ్‌
విడుదల తేదీ: 2 అక్టోబర్‌ 2019

క్లుప్తంగా చెప్పాలంటే..

రేనాడు అనే ప్రాంతాన్ని 61 మంది పాలెగాళ్ళు చిన్న చిన్న సంస్థానాలుగా మార్చుకుని పరిపాలిస్తుంటారు. వాటి మీద పన్నుల హక్కు ఆంగ్లేయులకు వుంటుంది. పంటల్లేక విలవిల్లాడుతున్న ప్రజల నుంచి కర్కశంగా పన్నులు వసూలు చేస్తున్న ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నరసింహారెడ్డి (చిరంజీవి) అనే పాలెగాడు తిరగబడటమే ఈ సినిమా కథ. ఎవరి దారి వారిదే అన్నట్లుండే 61 మంది పాలెగాళ్ళను ఏకం చేసి నరసింహారెడ్డి, ఎలా ఆంగ్లేయులకు ఎరురు తిరిగాడు.? ఈ క్రమంలో నరసింహారెడ్డి ఎలాంటి సంకట స్థితుల్ని ఎదుర్కొన్నాడు.? స్వాతంత్య్ర పోరాటానికీ, ఈ తిరుగుబాటుకీ సంబంధమేంటి.? అన్న ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే..

150 సినిమాలు చేసిన మెగాస్టార్‌ చిరంజీవి, గొప్ప నటుడు.. అని ఇప్పుడు కొత్తగా సర్టిఫై చేయాల్సిన పనిలేదు. అయితే, ఆ వయసేంటి.? ఆ రిస్కీ యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఏంటి.. అని మాత్రం ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. సినిమా కోసం ప్రాణం పెట్టేయడం చిరంజీవికి అలవాటే. తొలి సినిమా నుంచీ ఇప్పటిదాకా చిరంజీవిలో డెడికేషన్‌ పెరిగిందే తప్ప తగ్గలేదనడానికి ఈ సినిమానే నిదర్శనం. యాక్షన్‌ సన్నివేశాల్లోనే కాదు, ఎమోషనల్‌ సన్నివేశాల్లో చిరంజీవి నటన అత్యద్భుతం. ఒక్క డాన్సులు మినహా, చిరంజీవి నుంచి ఆశించే అన్ని అంశాలూ ఈ సినిమాలో వున్నాయి.

నయనతతార పాత్రకి సినిమాలో నిడివి, ప్రాధాన్యత తక్కువే. వున్నంతలో ఆమె బాగా చేసింది. ఆమె అప్పీయరెన్స్‌ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. తమన్నాకి ఇది నిజంగానే వెరీ వెరీ స్పెషల్‌ ఫిలిం. నయనతారతో పోల్చితే, తమన్నాకి ప్రాధాన్యత ఎక్కువ లభించింది.
నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్‌ తనదైన ముద్ర వేశారు. అవుకు రాజు పాత్రలో సుదీప్‌, పాండి రాజు పాత్రలో విజయ్‌ సేతుపతి బాగా చేశారు. వీరారెడ్డి పాత్రలో జగపతిబాబు భిన్న కోణాల్లో సాగుతుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు.

కథ నేటి తరానికి అస్సలేమాత్రం తెలియనిది. వాస్తవిక కథకి కాల్పనికత జోడించారు. డైలాగ్స్‌ బావున్నాయి. దర్శకుడు, కథా రచయిత, మాటల రచయిత మధ్య కమ్యూనికేషన్‌ కరెక్ట్‌గా సెట్‌ అయ్యింది. స్క్రీన్‌ప్లే బావుంది. ఎడిటింగ్‌ పరంగా ఇంకాస్త ఛాన్స్‌ తీసుకుని వుండొచ్చు. పాటలు బావున్నాయి, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగానే వున్నా, ఇంకా బెటర్‌గా వుండాల్సింది. సినిమాటోగ్రఫీ అద్భుతం. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చాలా చాలా బావున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ గురించి స్పెషల్‌గా మెన్షన్‌ చేయాల్సిందే. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు.

నిజానికిది బయోపిక్‌లా ప్రొజెక్ట్‌ అయ్యింది. అయితే, ఆ తర్వాత బయోపిక్‌ కాదు, వాస్తవ అంశాలకు కల్పితం జోడించి తీసిన కమర్షియల్‌ సినిమా అని దర్శకుడు తేల్చేశాడు. చరిత్ర ఏంటన్నది నిజానికి చాలామందికి తెలియదు. మరుగునపడిపోయిన చరిత్ర ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది. దాంతో, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని నేటి తరానికి సరికొత్తగా చూపేందుకు మార్గం సుగమం అయ్యింది దర్శకుడికి. చిరంజీవి ఆ పాత్రలో నటిస్తుండడంతో, కొన్ని చోట్ల నేల విడిచి సాము చేశాడు దర్శకుడు. లాజిక్‌ దాదాపుగా వదిలేసి, వెండితెర అద్భుతం అనదగ్గ స్థాయిలో సినిమా రూపొందించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. మరీ ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించగలిగాడు. ఈ క్రమంలో 'వాస్తవికత' లోపించిన మాట వాస్తవం. ఆ ఒక్కటీ మినహాయిస్తే, సినిమా నిజంగానే ఓ వెండితెర అద్భుతం. సాంకేతిక విభాగాల్ని పెర్‌ఫెక్ట్‌గా దర్శకుడు వినియోగించుకున్నాడు. తండ్రి 'చారిత్రాత్మకమైన' బహుతి ఇవ్వాలనుకున్న తనయుడు రామ్‌చరణ్‌, ఈ సినిమాతో ఆ పని విజయవంతంగా చేయగలిగాడు. ఓవరాల్‌గా ఇది మెగా అభిమానులకి ఓ విజువల్‌ ఫీస్ట్‌. సాధారణ ప్రేక్షకులూ దాన్ని ఒప్పుకుంటారు.

అంకెల్లో చెప్పాలంటే..
3.75/5

ఒక్క మాటలో చెప్పాలంటే..
సైరా నరసింహారెడ్డి.. సై సైరా..!

మరిన్ని సినిమా కబుర్లు
churaka