Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue338/847/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

(గత సంచిక తరువాయి).... అమ్మకి ముద్దుల కొడుకు వాడు. నేను చాలా మెతకదాన్ని. ఎంత మెతకదాన్నంటే నాకిష్టమైన వాళ్ళు కొద్దిగా మనసు కష్టపెట్టుకున్నా చూడలేనంత మెత్తటిదాన్ని.

“ అదంతా  ‘మౌక్తిక చాలా మంచిపిల్ల’ అని మార్కులు కొట్టేయడం కోసం చేసే యాక్షన్. ఎవరికి తెలియదూ!’’ అంటూ ఉక్రోషం వెళ్ళగక్కేవాడు దినేష్.

“ముక్తను చూడు …ఎంత ఒద్దికగా ఉంటుందో!...ఏనాడైనా మాటకి ఎదురుచెప్పడం ఎరుగుదునా!’’ వాడి దుడుకుతనాన్ని బామ్మ విమర్శించి నప్పుడల్లా నామీద ఇలాగే విరుచుకు పడేవాడు.వాడి ఉడుకుమోత్తనానికి మనసారా నవ్వుకునేదాన్ని.ఇక అమ్మ- బామ్మల విషయానికి వస్తే పొద్దున్నే పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే పేస్టు మొదలుకుని, వండుకునే కూర, వేసుకునే బట్టలు…ఒకటేమిటి… అన్ని చోట్లా వాగ్యుధ్ధాలే.

“ఒసేయ్ శకుంతలా…పైత్యం చేసినట్లుంది. నోరంతా ఒకటే చేదు… కాస్త ఉసిరి పచ్చడి పోపు పెట్టవే…’’ అని బామ్మ అనగానే…భద్రకాళిలా ‘గఁయ్’ మని అంతెత్తున లేస్తూ “ బాగుంది మీ విడ్డూరం…ఆదివారంతోటీ ఉసిరి పచ్చడి పోపు పెట్టమంటారేమొటీ! ‘’ అంటూ కేకలేసేది అమ్మ.
  ఆవిడకి అంత చాదస్తమెందుకో… నాకు బోధపడేది కాదు.

ఆ బ్రహ్మదేముడు…  సృష్టి సమయాన కంగారుపడిపోయి, అమ్మ- బామ్మల దేహాల్లో మెదడు అమర్చే విషయంలో తికమకపడి, మెదళ్ళను తారుమారుగా అమర్చి వాళ్ళని వెనకా- ముందులుగా భూమ్మీదకి వదిలాడేమో!

“చక్కా ఆసీతారామయ్య కూతురుచూడు! లాగూ- చొక్కాలు వేసుకుని ఝామ్మంటూ సైకిల్ మీద కాలేజీకి వెళ్తోంది. నువ్వు మాత్రం మన ముక్తని మూలనున్న ముసలమ్మలా తయారు చేసి పంపిస్తావు.’’ సణిగేది బామ్మ టిప్ టాప్ గా తయారయ్యి, తిప్పుకుంటూ కాలేజ్ కి వెళ్ళే పరంజ్యోతిని చూస్తూ.

“ఏమిటొ! ఆ బురఖాలు తగిలించుకుని అచ్చం మగరాయుడల్లే ఉంటుంది ఆ పిల్ల. ఆడ-మగ లకి తేడా తెలిసేది ఈ వస్త్రధారణలోనేగా!. చక్కా లంగా–వోణీ వేసుకుంటే తెలుగుతనం ఉట్టిపడుతూ ఉంటారు ఆడపిల్లలు.’’ క్షణాలమీద బామ్మ మాటలని ఖండించి పారేస్తుంది అమ్మ.   బామ్మ  సిఫార్సు తో వచ్చే పండక్కి చుడీదార్ కొనుక్కోవచ్చునన్న ఆశ క్షణాలమీద ఆవిరైపోతుంది అమ్మ మాటలు వినేసరికి. సందేహమే లేదు… ఖచ్చితంగా మెదడు మార్పిడి జరిగిపోయుంటుంది. ఆ విధాత కూడా తెలియకుండా.వారి వాగ్వివాదాల్లో పొరబాటున కూడా కల్పించుకునేవారు కాదు నాన్న. మగవాడు సరైన బ్యాలెన్స్ పాటించవలసినదిక్కడే. అమ్మని వెనకేసుకుని వస్తే ఆలి అలుగుతుంది. అర్ధాంగిని సమర్ధిస్తే… మాతృమూర్తి తల్లడిల్లుతుంది. అందుకే… ఆయన తటస్థంగా ఉండిపోయేవారు. కాస్సేపటికి వాళ్ళే రాజీకొస్తారని ఆయనకి తెలుసు.

“పాపం! అత్తయ్యకి కట్టుడు చీరలన్నీ చిరిగిపోయాయండీ…నాలుగు గ్లాక్సో చీరలు కొనండి.’’ అంటూ అమ్మ జాలిని కురిపిస్తే… 

“శకుంతలకి మంచి చీరెలే లేవురా…పెళ్ళిళ్ళకీ, పేరంటాలకీ… ఆ పాత పట్టుచీరతోటే వెళ్తోంది. వీలుచూసుకుని ఓ పట్టుచీర కొందూ… అలాగే… ఆ చేత్తోటే నానుతాడు కూడా చేయించు…’’ అంటూ నాన్నకి చెప్పేది.

అమ్మమెడలో పసుపుతాడు, నల్లపూసల కుత్తికంటు తప్ప మరే ఆభరణమూ లేదు. ఆమెని సర్వాభరణాలంకృతగా చూడాలని బామ్మ కోరిక.
  “అసలు నాకెన్ని నగలుండేవో తెలుసా? నాలుగుపేటల చంద్రహారాలు,ఎర్రరాళ్ళ పట్టెడ, సూర్యుడు- చంద్రుడు, పాపటచేరు, కాళ్ళకి ఇరవై తులాల మట్టెలు, అరవై తులాల కడియాలు, పదహారు తులాల మొగిలి రేకుల జడ, పాతికతులాల వడ్డాణ్ణం, పధ్ధెనిమిది తులాల గాజులు, దండవంకీ…’’ అంటూ కాలగతిలో కరిగిపోయిన తన వైభవ చిహ్నాలని ఏకరువు పెడుతుంది బామ్మ.

ఆ రోజుల్లో, ఆ పరిస్థితుల్ని బట్టి, ఆడపిల్లలని అత్తవారింటికి పంపడానికి, వాళ్ల పురుళ్ళు- పుణ్యాలకి, అచ్చట- ముచ్చట తీర్చడానికి హారతి కర్పూరంలా కరిగిపోయింది ఆ సువర్ణమంతా.

అమ్మ ఏనాడూ కూడా బంగారం మీదగాని, పట్టుబట్టల మీద గాని ఆశ కనబరచేది కాదు. ముఖానికి పచ్చగా పసుపు రాసుకుని, నుదుట నయాపైసంత కుంకుమ దిద్దుకునేది. చేతులనిండా గలగలలాడే మట్టిగాజులు, ఒళ్లంతా కప్పేటట్లుగా ఏడుగజాల నేతచీరా…ఈ ఆహార్యం చాలు… అమ్మ శ్రీమహాలక్ష్మిలా కళకళలాడడానికి.
 అసలు… మా పిల్లలందరికీ అమ్మ అందమే వారసత్వంగా వచ్చిందంటుంది బామ్మ. అందమంటే అమ్మది కాని, స్వభావం మాత్రం నాన్నగారిదే వచ్చింది నాకు.
   నొప్పించక తానొవ్వక అన్నట్లుంటుంది ఆయన వైఖరి .  
   నాది ఇంకా మెత్తని స్వభావం. ‘ నా మనసు కష్టపడినా ఫరవాలేదు…’ నాకిష్టమైన వారు మాత్రం కష్టపడినా, రొష్టుపడినా తట్టుకోలేను నేను.
 “మరీ అంత మెతకదనం పనికిరాదే ముక్తా…మొత్తేస్తారందరూ…’’ నా మీద ప్రేమతో బామ్మ గోలపెట్టినా పట్టించుకునేదాన్ని కాదు.
  మా ఇంటికి కాస్త దూరంగా ఉండేవాళ్ళు పెద్దక్క వాళ్ళు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు. అనేక ఆర్ధిక ఇబ్బందులున్నా అవి అంతరంగాలని క్షోభ పెట్టని విధంగా మసలుకునేవాళ్ళం మేమందరం.
----------------------------                    --------------------------                  ----------------------
  “ముక్తా… కాస్తాగు. నీతో మాట్లాడాలి.’’ కాలేజ్ వదిలిపెట్టాక ఇంగ్లీష్ ట్యూషన్ కి వెళ్ళి ఇంటికి తిరిగొస్తూండగా మా వీధిమలుపులో , నూరు వరహాల చెట్టుకింది క్రీనీడలో నలబడి పిలిచిందో మగ గొంతుక.
  ‘ ఎవరా?’ అని చూద్దును కదా… మా పక్కింటి సీతారామయ్య గారి అబ్బాయి, పరంజ్యోతి వాళ్ళ అన్నయ్య వెంకటేష్.
    సినిమాల్లో వెంకటేష్ మాదిరి డ్రస్ చేసుకోవడం, అతడి మానరిజమ్స్ ని అనుకరించడం మూలాన అతడికి ‘ వెంకటేష్’ అని నిక్ నేమ్ తగిలించేశారు మా వీధి అమ్మాయిలు. అతడి అసలు పేరు ‘ శ్రీధర్’.
  “నాతోటా? ఏం మాట్లాడాలి?’’ విస్మయంగా ఆడిగాను నేను.
 వెంకటేష్ గుటకలు మింగాడు. అతడి చదువు పూర్తయింది. ఉద్యోగాల వేటలో ఉన్నాడు. పాతికేళ్ళ ప్రాయంలో ఉన్న పురుషుడు, పధ్ధెనిమిదేళ్ళ పడుచు పిల్లతో మాట్లాడాల్సిన మాటలేముంటాయి!
  “ఏమిటో చెప్పు? ఇప్పటికే చీకటిపడింది. నేను ఇంటికెళ్లాలి.’’ వాచ్ కేసి చూసుకుంటూ అసహనాన్ని ప్రదర్శించాను.
  ఆ ప్రదేశమంతా చీకటి కీకారణ్యంలా ఉంది. వీధికొసన వెలిగే ట్యూబ్‌లైట్ ని ఏ తుంటరికుర్రాడో రాయిపెట్టి పగలకొట్టినట్లున్నాడు… అదికూడా వెలగడంలేదు.
   ఎక్కడో…కీచురాళ్ళు ‘ గీ’మంటూ రొదపెడుతున్నాయి.
 “నేను… నిన్ను…’’ నీళ్ళు నములుతున్నాడు వెంకటేష్.
  నాకు విసుగ్గా ఉంది వాడి నాన్పుడు ధోరణికి. ఆ కీచురాళ్ళ రొదకి- వీడి సొదకి ఆటే తేడా కనబడడంలేదు నాకు.
 ఏడులోపు ఇంటికెళ్ళకపోతే అమ్మ- బామ్మ  కంగారు పడతారు. బామ్మైతే మరీనూ. ఇంట్లోకి, వీధిలోకి పచార్లు చేసేస్తూ…నాకోసం ఎదురు చూస్తూంటుంది.
   “నేను… నిన్ను…ప్రేమిస్తున్నాను…ఐ లవ్ యు…’’ మనసులోనే వీరాంజనేయుడిని తలచుకున్నట్లున్నాడు…ధైర్యంగా చెప్పేశాడు.
   నాకు అమితమైన ఆశ్చర్యం కలిగింది అతడి మాటలకి. అతడికి నాపట్ల ఇటువంటి అభిప్రాయం ఉన్నదని నేనెప్పుడూ అనుకోలేదు. అప్పటివరకు ‘ ప్రేమ’ అన్న ఆలోచనే నా మనసులోకి ప్రవేశించలేదు.
  నాకు అతడి మాటలు వినబడలేదు అనుకున్నాడో ఏమో…”ఐ లవ్ యు ముక్తా…’’ చెప్పాడు వెంకటేష్ మళ్ళీ.
  “నాకేం చెవుడు లేదు… అయితే?’’ అడిగాను చిరాగ్గా.
“ అదేమిటి ముక్తా… నా మనసులోని మాట చెప్తే అలా అంటావు? నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే బాగుంటుందనీ…’’ ఓసారి మొదలెట్టాక ధైర్యం దానంతట అదే పుంజుకుంటుందేమో…ఈసారి సూటిగానే చెప్పాడు వెంకటేష్.
   “ఆఁ…సరే… ప్రేమిస్తున్నావు. ఆ తరువాత!?’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్