గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue342/851/telugu-serials/ nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/
(గత సంచిక తరువాయి).... నా చిన్నప్పుడు నేను చూసిన తెలుగుసినిమా ఒకటి నా తలపుల్లో మెదిలింది. మతాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట అందరినీ విడిచి ఎంతో ఆదర్శంగా బతుకుతూంటారు. ఇంతలో వాళ్ళకో బిడ్డ పుడతాడు. ఆ వార్తవిన్నాక వాళ్ళకు దూరమైన ఇరువర్గాల బంధువులు పుట్టినబిడ్డ మీద మమకారం కొద్దీ వారి దగ్గరకు వస్తారు.
అప్పుడు మొదలౌతాయి ఆ జంటకి కష్టాలు. ఇరువైపుల వాళ్ళు వాళ్ళ కాపురంలో కలతలు రేపి, నానా గందరగోళం సృష్టిస్తారు. పిల్లాడికి వాళ్ల ఆచారం ప్రకారం జ్ఞానస్నానం చేయించి పేరు పెట్టాలని భర్తవైపు వారు, లేదూ… బారసాలే చేయాలని భార్యవైపు వారు తగువులాడుకుంటారు. ఆ తగవులు భార్యా- భర్తల మధ్యన విబేధాలు సృష్టించేవరకు వెళ్తాయి. కాని, ఇక్కడ అలాంటి ఉత్పాతాలేమీ లేకుండానే… చిన్నక్క తనకిష్ట మైన పేరు తన బిడ్డకి పెట్టుకుంది.
నా అనుమానాల ఆచూకీ కనిపెట్టినట్లుగా నవ్వింది చిన్నక్క. నవ్వుతూంటే సొట్టలుపడే బుగ్గలు దానికో పెద్ద ఆకర్షణ.
“జోసెఫ్ కి ఎవరూ లేరు.వీడు పుట్టాక తనకి నచ్చిన పేరు పెట్టుకోమని చెప్పాను. దానికి తనేమన్నాడో తెలుసా? ‘ఈ కులాలు-మతాలు వీటి పట్టింపులు తనకేమీ లేవని, నవమాసాలు మోసికన్న నాకే వాడికి పేరు పెట్టే హక్కు ఉందని చెప్పేశాడు.’ నాకెందుకో నాన్న పేరు పెట్టాలని అనిపించింది. అందుకే ‘ విద్యాధర్’ అని పేరు పెట్టాను.’’ బరువుగా నిట్టూర్చింది చిన్నక్క. ఇంతలో రూమ్ సర్వీస్ బాయ్ కూల్‌డ్రింక్స్ తెచ్చాడు.
“తీసుకోండి బామ్మగారూ… మీరు కూడా తీసుకోండి’’ అని మాకు చెబుతూ బామ్మ చేతికి తానే డ్రింక్ అందించాడు జోసెఫ్. అతడి కన్నులు కల్లా కపటమెరుగని స్వఛ్ఛమైన మరుమల్లెల్లా ఉన్నాయి. బహుశా … విలక్షణమైన ఇతడి మానసిక సౌందర్యాన్నే వలచి ఉంటుంది చిన్నక్క.
అందరం కూల్ డ్రింక్స్ అందుకును సిప్ చేయసాగాము. జోసెఫ్ డ్రస్ అయి షూస్ వేసుకున్నాడు.
“సాత్వికా… నేనలా బయటకెళ్ళొస్తాను. కాసేపు ఫ్రీగా మాట్లాడుకోండి.’’ అన్నాడు. “అబ్బే… మీరు మాకేమీ అడ్డుకాదు. మాకోసం మీరు బయటకెళ్లిపోవడం ఏమిటి?’’ పెద్దక్క అంది కంగారుగా. జోసెఫ్ నవ్వాడు. నీలాకాశంలో చంద్రవంకలా అతడి వదనంలో దరహాస రేఖ మెరిసింది.
“అడ్డని కాదండీ…చాలా రోజుల తరువాత అయినవాళ్లందరూ కలిశారు. కాసేపు మనసులు విప్పి మాట్లాడుకుంటారనీ…’’ అన్నాడు బయటకెళ్ళిపోతూ. ఎందుకో తెలియదు…అతడి పట్ల నా మనసులో ఇదివరకున్న ద్వేషభావం సమసిపోతూ, దాని స్థానే గౌరవం అంకురించింది.
“ఒరేయ్ విద్యా… తాతమ్మరా…’’ అంటూ బుల్లి విద్యాధర్ ని బామ్మ ఒళ్ళో కుదేసింది చిన్నక్క. వెండి తీగల్లా పండిపోయిన బామ్మ జుట్టు, ముక్కు మీదకు జారిపోతున్న భూతద్దాల కళ్ళజోడు, ముడుతలు పడిన బామ్మ నుదురు…వీటన్నింటినీ చూసి కేరింతలు కొట్టాడు వాడు. బామ్మ మురిసిపోతూ “వీడచ్చం నీలాగానే ఉన్నాడు. మగ పిల్లాడికి తల్లిపోలికొస్తే అదృష్టమంటారే సాత్వికా.’’ అంది మెత్తటి వాడి బూరిబుగ్గలు పుణుకుతూ.
చిన్నక్క మృదువుగా నవ్వేసి, నెమ్మదిగా లేచి గదిలో అటు-ఇటు పచార్లు చేస్తూ చెప్పడం ప్రారంభించింది.
“నాన్నగారి ఇష్టానికి వ్యతిరేకంగా జోసెఫ్ ని పెళ్లాడినందుకు నేనెంతగానో బాధపడ్డాను. కాని, అతడిలాంటి అమృతమూర్తిని దూరం చేసుకునేందుకు మనసు రాలేదు. అతడికి ఆకట్టుకునే రూపం లేకపోవచ్చు. కాని,సాటి మనిషిని అభిమానించి, ఆదరించే సంస్కారం ఉంది. భార్యని మనస్ఫూర్తిగా ప్రేమించే హృదయ సౌందర్యం ఉంది.అతడు ఇలాగే ఉండితీరాలని నన్నేనాడూ శాసించలేదు. నా పధ్ధతులని, అలవాట్లని అవహేళన చేయలేదు.
అతడు నా ఇష్తాన్ని గౌరవిస్తాడు. నేను అతడి అభిప్రాయాలను ఆదరిస్తాను. ఆడవాళ్ళు అణిగి- మణిగి ఉండాలన్న బూజు పట్టిన భావాలకు అతడు వ్యతిరేకి. అందుకే… ఈనాటికీ… ఏ విషయంలోనూ మా మధ్యన ఘర్షణ అనేదే తలెత్తలేదు. నాది తప్పుడు నిర్ణయమని విచారించే పరిస్థితి నాకెన్నడూ కలగలేదు.’’ మేమెవ్వరం మాట్లాడలేదు.
“అప్పుడప్పుడు అమ్మని- నాన్నని చూడాలని, వారి మనసులు నొప్పించినందుకు మన్నింపులు కోరి, వారి పాదాల మీద పడి మనసారా ఏడవాలనీ చాలా చాలా అనిపిస్తుంది. కాని, ఏం చేయను! నన్ను చూస్తేనే వాళ్ళకి అసహ్యం-కోపం కలుగుతాయి. వారిని ఇంకా బాధ పెట్టకూడదని ఆగిపోతున్నాను.’’ చిన్నక్క గొంతు గద్గదమైంది.దాని కళ్ళనిండా నీళ్ళు. మా అందరి హృదయాలు భారమైనాయి. జోసెఫ్ ఔన్నత్యం అర్ధమైంది.చిన్నక్క అతడిలో ఏంచూసి ప్రేమించిందో తెలిశాక అతడు మా దృష్టిలో హిమవన్నగం అంత ఎత్తుకి ఎదిగిపోయాడు. మనిషికి బాహ్య సౌందర్యం కన్నా…ఆత్మసౌందర్యం మిన్న అని నిరూపించాడు. నా మనసంతా ఆర్తితో నిండిపోయింది.
“క్షమించు చిన్నక్కా…నిన్ను అపార్ధం చేసుకున్నాను. అమ్మ-నాన్నలని కాదని పెళ్ళి చేసుకుని వెళ్ళావని నీమీద కోపం పెంచుకున్నానే గాని, అన్ని సంవత్సరాలు పెంచిన కన్నవారిని కాదని వెళ్లడానికి అతడిలో నిన్ను ఆకట్టుకున్న సుగుణాలు ఏమున్నాయోనని ఆలోచించలేక పోయాను.’’
“ఈట్సాల్ రైట్ ముక్తా… కన్నవాళ్లని ఎదిరించి ఈ పెళ్ళి చేసుకున్నందుకు ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నాను. కాలం కలిసొస్తే వాళ్ళే ఆదరిస్తారని సరిపెట్టుకుంటున్నాను.’’ చెప్పింది చిన్నక్క కళ్ళు తుడుచుకుంటూ. ఆ తరువాత మేమెన్నో కబుర్లు చెప్పుకున్నాం.చిన్ననాటి ముచ్చట్లన్నీ తిరగదోడుకుని సరదాగా గడిపాము. చిన్నక్క మా అందరికీ ఏవేవో కానుకలిచ్చింది. బట్టలు, పెర్ఫ్యూమ్స్, ఇచ్చింది. బామ్మకేవో డబ్బులిచ్చింది. చివరగా మంచి బరంపురం పట్టుపంచెల చాపు, ఖరీదైన పట్టుచీర బయటకు తీసింది. ముదురు నీలంరంగుకి మెజంతా రంగు అంచుతో ఎంతో బాగుంది చీర.
“అక్కా… వచ్చేనెలలో అమ్మ-నాన్నల పెళ్ళిరోజుందని కొన్నాను. వీటిని నువ్వే కొన్నట్లుగా వాళ్ళకి అందజేయి.’’ అంది చిన్నక్క
దాని స్వరంలో దుఃఖపుజీర.. మౌనంగా వాటిని తీసుకుంది పెద్దక్క. అందరి మనసులలో ఏదో తెలియని ఆవేదన.
“అయ్యో! మనతోపాటుగా దినేష్ గాడిని తీసుకురావాల్సింది.’’ బామ్మ అంది నొచ్చుకుంటూ. చిన్నక్క పకపక నవ్వుతూ “నీకా బెంగేం అక్కరలేదులే బామ్మా… అందరికన్నా ముందు వాడే వచ్చాడు. వాళ్ల బావగారి దగ్గర రేబాన్ గ్లాసెస్, లివిన్ జీన్స్ కొట్టేశాడు.’’ చెప్పింది.
“గడుసు వెధవ… దొరకని దొంగ…’’ మురిపెంగా అంది బామ్మ.ఇంతలో బయటకెళ్లిన జోసెఫ్ తిరిగొచ్చాడు. అతడి చేతిలో ఉన్న గుడ్డసంచీలో రకరకాల పళ్ళున్నాయి. వాటిని బామ్మకిచ్చి వంగి ఆవిడ పాదాలకి నమస్కరించాడు.
“దీర్ఘాయుష్మాన్ భవ…’’ దీవించింది బామ్మ.
“ఏమిటీ… నే వెళ్లాక నామీద చాడీలు చెప్పావా మీవాళ్ళకీ!’’ చిన్నక్కకేసి చిలిపిగా చూశాడు జోసెఫ్.
“అవునండీ… చాలా చెప్పింది’’ అన్నాను తొలిసారిగా అతడితో మాట కలుపుతూ.
“నిజంగానా!?’’ అంటూ తమాషాగా కళ్ళు చికిలించి పెద్దగా నవ్వేశాడు అతడు. అందరం నవ్వాము.
“సాత్విక గురించి ఆమె ఎదురుగా పొగడకూడదు గాని, నా వెనకైనా సరే… తను నా గురించి చెడు మాట్లాడదు. ఏనాడూ నన్ను బాధపెట్టే పనిచేయదు.’’ అక్క గురించి చెబుతున్నప్పుడు జోసెఫ్ లో ఏదో పరవశం. అతడి కళ్లలో శతకోటి నక్షత్రాల కాంతి నిండింది. జీవిత భాగస్వామి అంటే ఎంతటి నమ్మకం! ఎంత ప్రేమ! ఇందుకేనా అందరూ ప్రేమో… ప్రేమో… అని తపించిపోతారు! ప్రేమతో పరిపూర్ణమైన దాంపత్యం ఒక రసప్రవాహంలా సాగిపోతుంది.
జోసెఫ్ ని తప్పుగా భావించినందుకు ఎంతగానో విచారించాను. అప్పటికే ఏడు దాటింది.
“పదండే… బాగా పొద్దుపోయింది. మళ్ళీ మీ నాన్నకి అనుమానం వస్తుంది.’’ బయలుదేరదీసింది బామ్మ. చిన్ని విద్యాధర్ ని వదలలేక వదలలేక కదిలాము అక్కడ నుంచి. చిన్నక్క అమ్మనాన్నల కోసమని ఇచ్చిన పట్టుబట్టలు పెద్దక్క దగ్గరే ఉంచి, వారి పెళ్లిరోజు నాడు ఇయ్యమని చెప్పి నేను, బామ్మ ఇంటికొచ్చేశాము.
“ఇవన్నీ ఏమిటి? ఎవరు కొన్నారు?’’ మా చేతుల్లోని సరంజామా చూసి ఆశ్చర్యంగా అడిగింది అమ్మ.
“పెద్దక్క కొనిచ్చిందమ్మా…’’ తడుముకోకుండా అబధ్ధమాడేశాను.
కాని, అమ్మ నా మాట విన్నట్లుగా కనిపించలేదు. ఎందుకంటే పెద్దక్క అంత ఉదారంగా ఎవరికీ ఏమీ కొనివ్వదు. హఠాత్తుగా, ఏ సందర్భమూ లేకుండా అంత సొమ్ము వెచ్చించిందంటే అనుమానం రాదూ మరి!
“బావగారికి ఎరియర్స్ ఏవో వచ్చాయట… మీకెప్పుడూ ఏమీ కొనివ్వలేదంటూ వద్దన్నా ఇవన్నీ కొనిపెట్టింది.’’ అబధ్ధం మీద అబధ్ధం ఆడవలసిన అగత్యం పట్టింది నాకు. ఈ సారి అమ్మకి నమ్మకం కుదిరినట్లుంది…’’ ఇప్పుడేమన్నా పండుగా పబ్బమా! పాపం… ఎందుకింత ఖర్చు పెట్టుకుందీ!’’ జాలిపడింది అమ్మ.
‘ బతుకు జీవుడా!’ అంటూ ఊపిరి పీల్చుకున్నాను. ప్రస్తుతానికీ గండం గట్టెక్కింది. అంతే చాలు. ఇవన్నీ… తమని కాదని ఇంటిగడప దాటిన చిన్నక్క కొనిచ్చిండని తెలిస్తే వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంటుంది!
అమ్మో! ఊహించడానికే భయమేస్తోంది. ఆ విషయాన్ని అక్కడే వదిలేసి బాత్ రూమ్ లో దూరిపోయాను.
--------------
“అన్నయ్యా… పెళ్ళికి వారం రోజుల ముందుగానే మీరందరూ రాజమండ్రి రావాలి. వదిన కూడా మా ఇంటికొచ్చి చాలా రోజులైపోయింది. ఎప్పుడో… పోయిన పుష్కరాలకి వచ్చినట్లు గుర్తు…’’ చెప్పింది పెద్దత్తయ్య నాన్నగారి చేతికి పెళ్ళి శుభలేఖ అందిస్తూ. ఆ రోజు ఉదయమే మా పెద్దత్తయ్య పార్వతి మా ఇంటికి వచ్చింది. వచ్చేనెల నాలుగో తారీకున తన పెద్ద కూతురి పెళ్లి అనీ, ముందుగానే వచ్చి పెళ్ళిసందడిలో పాలు పంచుకోమనీ అందరినీ పేరు పేరు వరసనా ఆహ్వానించింది.
“అన్నయ్యా…పది సార్లు చెప్తున్నాననుకోకు… వదిన్ని ముందుగానే పంపకపోతే ఊరుకునేది లేదు. అసలే రెక్కసాయం లేక అల్లాడుతున్నాను. ఆవిడ సహాయం లేకపోతే ఈ సందడి గట్టెక్కదు.’’ మరీమరీ చెప్పింది అత్తయ్య. మా అత్తయ్యలందరికీ అమ్మంటే ప్రాణం. అమ్మ ఆడపడుచులని కన్నకూతుళ్ల లాగానే చూసి వాళ్ల కథలు, కార్యాలు అన్నీ ఒడ్దెక్కించింది.
“అన్నయ్యా’’ నెమ్మదిగా పిలిచింది పెద్దత్తయ్య.
“ఏమ్మా…’’ ప్రేమగా అడిగారు నాన్న.
“ఆయనకేసి భయం భయంగా చూస్తూ” నువ్వు కోప్పడనంటే ఓ విష్జయం చెబుతాను.’’ అంది.
“నేనెందుకు కోప్పడతానమ్మా… ఏమిటో చెప్పు.’’ లాలనగా అన్నారు నాన్న.అత్తయ్య ఒకసారి భారీగా శ్వాస తీసుకుని “మరి...మరి... నేను…ఈ పెళ్ళికి… మన సావిత్రిని పిలిచానన్నయ్యా…’’ అంది బితుగ్గా చూస్తూ. ఆ తరువాత కొద్దిక్షణాలపాటు అక్కడ మౌనం తాండవించింది.
“నా తరువాత పుట్టిన అదంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు కదన్నయ్యా… నా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం. నావాళ్లందరినీ పిలుచుకుని సంతోషంగా వేడుక జరుపుకోవాలని ఉంది. అందుకే… నీతో మాట మాత్రమన్నా చెప్పకుండా…స్వతంత్రించి ఈపని చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించన్నయ్యా…’’ తల దించుకుని చెప్పింది పెద్దత్తయ్య.
అత్తయ్య మాటలలో నాన్నగారి పట్ల ఎనలేని భక్తిభావన. తామందరికీ పెళ్ళిళ్ళు చేసి, పురుళ్ళు-పుణ్యాలు అన్నీ గడిపారన్న కృతజ్ఞత, తామందరికెన్నా వయసులో పెద్దవారైన ఆయన్ను సంప్రదించకుండానే తనంత తానుగా నిర్ణయం తీసుకున్నానన్న అపరాధభావన అన్నీ కలగాపులగమై వ్యక్తమైనాయి. |