Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> సోషల్ మీడియా

social media

చలపతి సోప్ తో చేతులు కడుక్కుంటున్నాడు. వాష్ బేసిన్ లో నడుస్తున్న నీటి ధార ! రెండో సారి సోప్ రుద్దుకుంటున్నాడు. భార్య సుశీల గట్టిగా అరిచింది .

'ఎన్ని సార్లు రుద్దుతారు? చాదస్తం పెరిగిపోతోంది... నీళ్లు ఖతం చేస్తున్నారు ... సబ్బులు కొనలేక చస్తున్నాను ... '

''డాడీ , నీ సబ్బు స్లో నా ఏంటి?"

‘నా సబ్బు స్లో కాదమ్మా! బాగా రుద్ది కడుక్కోవాలి. స్వైన్ ఫ్లూ , డెంగ్యూ లాంటి వ్యాధుల బారి పడకుండా వుండాలంటే బయటికి వెళ్ళొచ్చినప్పుడల్లా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి . '

'నువ్వు బయటికి ఎప్పుడెళ్లొచ్చావ్ డాడీ?'

'కింద కిరాణా షాపుకి వెళ్ళొచ్చాగా ?'

'దానికే యింత షో నా?'

'ఆ షాపువాడు షేక్ హ్యాండ్ యిచ్చాడమ్మా '

'అయితే డెంగ్యూ అంటుకుంటుందా ?'

'వాడు ఎవెరెవరికి షేక్ హ్యాండ్ యిచ్చాడో తెలియదు కదా!!!' కూతురు ఒకలా చూసి హాల్లో సోఫాలో కూర్చుంది . చలపతి భార్య మాత్రం విసుక్కుంది. 'ఆ సోప్ కి చేతులు నాశనం అవుతాయి . చెప్తే వినరుకదా!' అంది. చలపతి నిట్టూర్చి న్యూస్ పేపర్లోకి తల దూర్చాడు .

******

'పొద్దున్నే పరగడుపున లీటరు నీళ్లు తాగడమేమిటండీ! ఒంటికి నీరు పట్టదూ ?' 'తెలివితక్కువదానా! పొద్దున్నే నిద్రనించి లేస్తూనే లీటరు నీళ్లు తాగితే జీర్ణాశయం శుభ్రమై జీర్ణ శక్తి మెరుగుపడుతుందోయ్!'

'మీ జీర్న శక్తి బాగానే వుందిగా !''ఇప్పుడు బాగుందని వదిలేస్తే ఎలా? ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . మనమేమన్నా టీనేజర్స్ మా?' 'ఎవరు చెప్పారండి ?'

'ఎవరు చెప్పేదేమిటే ? వాట్సాప్ లో డాక్టర్ రామ్ మెసేజ్ పెట్టాడే !'

'డాక్టర్ రామ్ డాక్టర్ కాడండీ ! సోషియాలజీ లో పి హెచ్ డీ !'

'మంచి విషయం ఎవరు పెడితే ఏముందిలే!'

'చంపేస్తున్నారు !'

'నిన్నేం చేస్తున్నానే ? నా నీళ్లు నేనే తెచ్చుకుంటున్నానుగా! . '

******

మూడు నెలల తర్వాత…… 'లీటరు నీళ్లు తాగేవారు పరగడుపునే! ఇప్పుడు గ్లాస్ కి తగ్గించారేమిటి?...'

'నిన్న డాక్టర్ సుమిత్ర వాట్సాప్ లో ఓ మెసేజ్ పెట్టిందే!... పొద్దున్నే ఎక్కువ నీళ్లు తాగితే జీర్ణాశయం శుభ్రమౌతుంది కానీ, మనకు అవసరమైన మినరల్స్ లాంటివి కూడా బయటికి పోతాయిట!... అందుకే ఒక గ్లాస్ నీళ్లు తాగితే చాలట !'

'ఏమిటో యీ పైత్యం ! ... సంవత్సరంగా లీటరు నీళ్లు తాగుతున్నారు . ఏ మినరల్స్ పోయినయ్యని? శుభ్రంగా బరువు పెరుగుతూనే వున్నారు! ... '

******

'ఏమిటీ పొద్దున్నే వంటింట్లో ఏం చేస్తున్నారు?... నాపనికి  అడ్డం !... '

' నీళ్లు వేడి చేసుకుంటున్నానే ... '

'దేనికి?'

'ఎవరో చెప్పారు - ఉత్త నీళ్లు, చల్లటి నీళ్లు తాగకూడదట! కొంచం గోరు వెచ్చటి నీళ్లు తాగాలిట!'

వామ్మో! ఇదేం చోద్యమండీ ! వేణ్ణీళ్ళు హిల్ స్టేషన్స్ లో వుండేవాళ్ళు తాగుతారని విన్నాను .''

'వాళ్ళు వేణ్ణీళ్ళు తాగుతారు ; నేను గోరు వెచ్చని నీళ్లు తాగుతున్నాను .... తేడా తెలియట్లేదా?'

'తెలుస్తోంది లేండి . రేపు వేరెవడో గోరువెచ్చని నీళ్లు తాగితే గోర్లు వూడి పోతై అంటాడు . అది మానేసి మళ్ళీ చల్లటి నీళ్ల కొస్తారు !!!'

'చూద్దాంలే !' వారం తిరక్కుండా చలపతి మరో మార్పు తీసుకొచ్చాడు . ఆరోజు సాయంత్రం ఓ పాతిక నిమ్మకాయలు కొనుక్కొచ్చాడు. 'ఇన్ని నిమ్మకాయలు ఒక్కసారే తెచ్చారేమిటండీ? దిష్టి తగలకుండా గుమ్మానికి కడతారా ఏమిటి?'

'మనకి దిష్టి ఎవరు పెడతారే?... పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు ఓ గ్లాసుడు తాగుతున్నా కదా! అందులో ఒక నిమ్మకాయ పిండుకు తాగితే యిక జన్మలో కాన్సర్ రాదట!'

'రామ రామ... అవేం మాటలండీ!... ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, మీకు కాన్సర్ యెందుకొస్తుంది ?' 'కాన్సర్ యెందుకొస్తుందో యెవరికీ తెలియదు . ప్రివెన్షన్ యీస్ బెటర్ దాన్ క్యూర్ కదా!... అందుకని ... ' తలపట్టుకుని కూర్చుంది చలపతి భార్య . రోజు రోజు కీ పిచ్చి ముదిరిపోతోంది యీయనకి ; యెలాగో దీన్ని మాన్పించడం ! ఏదైనా ఒక పెద్ద వ్రతమో, నోమో చేస్తే ఈ పిచ్చి తగ్గుతుందేమో! ఆలోచించాలి.

******

చలపతి పేస్ బుక్ లో కూడా చురుగ్గానే వుంటాడు . చర్చల్లో పాల్గొంటాడు. ఒక 'హెల్త్ క్లబ్ ' అనే గ్రూప్ లో సభ్యుడు కూడా ! ఒక రోజు ఒక డాక్టర్ ఒక పోస్ట్ పెట్టాడు . లివర్ బాగా పని చేయాలన్నా , కిడ్నీ లో రాళ్లు రాకుండా వుండాలన్నా ఒక జ్యూస్ తయారు చేసుకుని త్రాగాలట ! దాన్ని తయారు చేసే విధంబెట్టిదన్న :

చిన్నగా తొరిగిన రెండు క్యారట్లు, 200 గ్రాముల బొప్పాయి పండు ముక్కలు, అర కప్పు నిమ్మరసం, పది నానించిన బాదం పప్పులు, ఆరు జీడీ పప్పులు, ఒక అరటి పండు  - అన్నింటిని మిక్సర్ లో వేసి జ్యూస్ లా తయారు చేసి రోజూ ఒక కప్పు తాగడమే! దీనివల్ల కిడ్నీ లో రాళ్లు రావు; లివర్ లోని హాని కారకాలని తొలగించి లివర్ 100% సమర్థతతో పని చేస్తుంది . ఆలా లివర్ 100% సమర్థతతో పని చేస్తే యవ్వనం తన్నుకుంటూ వస్తుంది . వృధ్యాప్యం దరి దాపుల్లోకి రాదు.

ఆ రసం తాగితే ముందు నీరసం పోతుందికదా, అనుకున్నాడు చలపతి. వెంటనే  పంచాంగం తిరగేసి మంచి రోజు చూసాడు. ఒకరోజు మంచిదైతే లాభం లేదు. వరసగా రెండు రోజులు మంచివి కావాలి. ఎందుకంటే బాదం పప్పులు ముందు రోజు నానెయ్యాలి కదా! దశమి, ఏకాదశి లని నిర్ణయించి , దశమి రోజు కావల్సిన పదార్ధాలన్నింటిని కొనుక్కొ చ్చాడు. బాదం పప్పుల్ని నానేసాడు . మర్రోజు పొద్దున్నే జ్యూస్ తయారీకి వుపక్రమించాడు . భార్య కి అర్ధం కాక ఏం చేస్తున్నారని అడగడం, దానికి చలపతి పూర్తి వివరణ యివ్వడం , భార్య శాపనార్ధాలు పెట్టడం అన్నీ పది నిముషాల్లో పూర్తయ్యాయి. మొత్తం మీద జ్యూస్ తయారు చేసి ఒక కప్పు తాగాడు. మంచి రుచిగా వుంది. మరో అరకప్పు తాగి మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టాడు. అందులో వుపయోగించిన పదార్ధాలన్నీ రుచికరమైనవే కాబట్టి జ్యూస్ కూడా రుచిగా వుంది. మరో మూడు రోజులు తాగాడు. రెండో రోజు చాలా చాలా హాయిగా వుందనిపించింది . డిటాక్సిఫికేషన్ అంటే యిదే కాబోలు అనుకున్నాడు . మన భారతీయ వైద్య శాస్త్రంలో యిన్ని అద్భుతాలు వున్నట్టు యింతవరకు ప్రజలకి తెలియక పోవడం భారతీయుల దురదృష్టం అనుకున్నాడు. పేస్ బుక్, వాట్స్ అప్ లాంటివి యిందుకు చక్కగా వుపయోగపడుతున్నాయి. భారతీయ నాగరికతని ప్రపంచ వ్యాప్తం చేయడానికి యీ మాధ్యమాలు యింత వుపకరిస్తుంటే , కొంతమంది వీటిని నిషేధించాలంటారెందుకో! స్టుపిడ్ ఫెలోస్!...

మూడో రోజు రాత్రి చలపతికి విరోచనాలు స్టార్ట్ అయ్యాయి. ఆ రాత్రి భార్యా భర్తల మధ్య ఒక చిన్న యుద్ధం జరిగింది. ఆ జ్యూస్ వల్లే యీ మోషన్స్ అంటుంది భార్య. కాదంటాడు భర్త. ఆ రాత్రి తిన్న పుల్కాలకి గ్యాస్ ఫార్మ్ అయ్యి యీ సమస్య వచ్చిందని చలపతి బుకాయించాడు. ఏది ఏమైతేనేం వుదయమే డాక్టర్ దగ్గిరకి వెళ్లడం, అయన కొన్ని టెస్టులు రాయడం, అవి చేయుంచుకుని అయన రాసిన మందులు కొనుక్కురావడం జరిగిపోయాయి. నాలుగు రోజుల తర్వాత కొంచం కుదుట పడ్డాడు చలపతి. ఆలోగా ఫ్రిడ్జ్ లో వున్న జ్యూస్ ని పారబోసింది చలపతి భార్య. భార్యతో ఎంత బుకాయించినా చలపతి మదిలో ఏదో మూల ఆ జ్యూస్ వల్లే లూజ్ మోషన్స్ అయ్యాయని పీకుతోంది . ఆ జ్యూస్ తాగడం మీద కొద్దీ రోజులు స్టే విధించుకున్నాడు.

******

కొన్నాళ్ల తర్వాత చలపతికి ఓ ఫ్రెండ్ వాట్సాప్ లో ఒక వీడియో పంపాడు. అది ఒక పెద్దగా శ్రమ లేని వ్యాయామం. ముందుగా చేతులు ముందుకు చాచడం; తర్వాత అరచేతుల్ని పక్కకి తిప్పి పైకి, కిందికి, వెనక్కి , ముందుకి చాచడం. ఇలా ప్రతి పద్దతిలో పది సార్లు చేయడం. దీనివల్ల మెడ , భుజాల  నొప్పులు రావు. పైగా పొద్దస్తమానం కంప్యూటర్ ముందో, ఫోను పట్టుకుని గంటల సమయం గడపడం వల్లో వచ్చే కీళ్ల నొప్పులు రావు. ఈ వ్యాయామం తనకి చాలా అవసరం అనుకున్నాడు చలపతి. ఇంక మీన మేషాలు లెక్కెట్టకుండా వెంటనే స్టార్ట్ చేసేసాడు . చలపతి భార్య యధావిధిగా ప్రశ్నించింది . సవివరంగా వివరించాడు చలపతి. వ్యాయామమైతే ఫర్వాలేదనుకుంది భార్య. ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. అంటే విని వూరుకుందన్నమాట . దానికే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినంత ఆనందపడ్డాడు .

వ్యాయామాన్ని పది నించి యిరవైకి పెంచాడు. వారం రోజులు చేసాక రోజుకి రెండు సార్లు చేసేవాడల్లా మూడుకి పెంచాడు. మరో నాలుగు రోజుల తర్వాత ఒక రోజు మధ్యాన్నం తల తిరగడం మొదలైంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోందన్న విషయం భయంకరంగా అర్ధమైంది  భయ కంపితుడయ్యాడు. వెంటనే భార్యా సమేతంగా డాక్టర్ దగ్గిరకి వెళ్ళాడు. డాక్టర్ ఒక వెర్టిన్ టాబ్లెట్ యిచ్చి కూర్చోబెట్టాడు. కొంచెం తగ్గిందన్నాక కొన్ని టెస్ట్స్ రాశాడు . ఎమ్ ఆర్ ఐ , ఎక్స్ రే లతో పాటు రక రకాల రక్త పరీక్షలు రాయడంతో ఆ రోజంతా హాస్పిటల్ లో గడిచిపోయింది. అన్నీ రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్ చలపతికి సెర్వికల్  స్పాండిలోసిస్ వచ్చిందని తేల్చాడు. ఒక కాలర్ కొనుక్కుని మెడకి తగిలించుకోమన్నాడు. తల తిరిగినప్పుడు ఒక వెర్టిన్ టాబ్లెట్ వేసుకోమన్నాడు .

ఈ ప్రక్రియ నడుస్తూ వుంది . కొంచం తగ్గాక, మొదటిగా చలపతి చేసిన పని - పేస్ బుక్ లోని హెల్త్ క్లబ్ గ్రూప్ నించి వైదొలిగాడు . తర్వాత వాట్స్ అప్ మెసేజెస్ ని ఎంపిక చేసుకుని చదవసాగాడు. భార్యల మీద వచ్చే కార్టూన్స్, రిడిల్స్ , సుడోకు లాంటివి చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. భార్యకి వంటపనుల్లో కొద్దిగా సాయం చేస్తున్నాడు.  రోజూ దగ్గిరున్న గుడికి వెళ్తున్నాడు . టి వీ లో ప్రవచనాలు వింటున్నాడు . ముందు జాగ్రత్త తనకు అచ్చిరాలేదని తనను తాను సర్దిచెప్పుకున్నాడు.

మరిన్ని కథలు
mata manasu dataledu