కాలేజి ఆడిటోరియంలో 'షేక్సప్పియర్స్ ఒత్తెల్లో' నాటక ప్రదర్శనాంతరం గ్రీన్ రూంలో మేకప్ తీసి వేసుకొంటున్నాడు శ్రీహర్ష .నాటకం బాగా రక్తి కట్టిందని కాలేజీ పిల్లలు,ప్రేక్షక జనం ప్రశంస లతో తన్ను పొగిడి పారేసింది మనసులో అనుకొంటూ ఆనంద పడుతున్నాడు. అంతలో బిలబిలమంటూ గ్రీన్ రూంలోకి ప్రవేశించారు తన క్లాస్ మేట్స్ భారతి, సాహితి, పారిజాత.అప్పుడు వాళ్ళ ముఖాల్లో గర్వంతో కూడికొన్న సంతోషం తొంగి చూసింది. అందుక్కారణం వాళ్ళ క్లాసుమేటు,మంచి నేస్తం శ్రీహర్ష కధానాయకుడిగా ప్రేక్షకులనుంచి ప్రశంసలను పొందడమే!
"హర్షా కంగ్రాట్సు!పాత్రను బాగా రక్తి కట్టించావు."భారతి అంది.
"ఇందుకు మాకో స్టార్ హోటల్లో ట్రీటిచ్చి ఐమాక్సులో మూవీ చూపించాలి"సాహితి కోరింది.
"అలాగే! కాని నా ఈ సంతోషానికి తోడు నేను కోరుకునేవాళ్ళ వద్దనుంచి ఎలాంటి స్పందన రాలేదే!"అంటూ అటు వెనుకమాలే వున్న పారిజాత వేపు చూశాడు శ్రీహర్ష.ఆ మాట వింటూనే పారిజాత ఒక అడుగు వెనక్కు వెళ్ళి భారతి చాటున నిలుచుంది.అది గమనించిన సాహితి "నువ్వు ప్రశంసిస్తే హర్ష ఆనందిస్తాడేమో ఎదేని చిన్న కాంప్లిమెంటు పడేయ్యవే... హాస్టలుకు వెళ్ళిపోదాం"అంది ఒత్తిడి చేస్తూ.
"అవునే పాపం"అంది భారతి. వాళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక పారిజాత కాస్త ముందుకొచ్చి"కంగ్రాట్సు.యువర్ పెర్ఫామెన్సు ఈజ్ సుపర్బ్ !" అని శ్రీహర్ష కళ్ళనుంచి తప్పుకొని వడివడిగా ముందుకు సాగింది. హర్షకు 'బై'చెప్పి పారిజాతను వెంబడించారు భారతి,సాహితీలు.
"ఒరేయ్ !నేను బయటినుంచే గమనించా! మరీ అంతలా పిచ్చాడివై పోకు.పారిజాత కాంప్లిమెంటుకు ప్లాటై పోయావు కదూ?"అన్నాడు ప్రశాంత్ "ఇన్నాళ్ళగ్గాను పారిజాత నోరు విప్పిందిరా"సంతోషాన్ని వెలిబుచ్చాడు శ్రీహర్ష.
"ఏమో!నేనూ దాదాపు గత రెండేళ్ళనుంచి చూస్తున్నాను!మీ యిద్దరి మధ్య మౌనంతో కూడికొన్న చూపులు,సైగలు,ముసిముసి నవ్వులే తప్ప ఆ కోణంలో నాకేమీ కనబడలేదు. సమయం చూసుకొని నీలోని ప్రేమను పారిజాత ముందుంచు"అన్నాడు ప్రశాంత్ ప్రక్కనే వున్న ఫిల్టర్ లోని నీళ్ళు తీసుకొని తాగుతూ.
"నాకు భయంగా వుందిరా!పారిజాత గొప్పింటి పిల్ల"ఆలోచనా ధోరణితో అన్నాడు హర్ష.
"నిజమైన ప్రేమకు గొప్పలన్నవి అడ్డురావు.నీకు ధైర్యంతో కూడికొన్న సాహసం వుండాలంతే!" అంటూ శ్రీహర్ష చేయి పట్టుకొని స్టాండులో వున్న బైకు వద్దకు దారి తీశాడు ప్రశాంత్ .
©©©©©
ఆ రోజు కాలేజి క్యాంటీన్లో కాఫీ తాగుతున్నారు పారిజాత,ఆమె స్నేహితురాళ్ళు. అప్పుడే తన స్నేహితులతో శ్రీ హర్ష కూడా లోనికొచ్చి ఓ టేబుల్లో కూర్చొని కాఫీ ఆర్డరివ్వగా కాఫీ తెచ్చాడు బేరర్ .అందరూ అలా అమ్మాయిలా వేపు చూస్తూ పోజులు కొడుతూ కాఫీ చిప్ చేస్తున్నారు.శ్రీ హర్ష తన సెల్ ఫోన్ నొక్కి పారిజాతవేపు చూస్తుండగా రింగవుతున్న ఫోన్ నొక్కి'హల్లో' అని అటూ ఇటూ చూసింది పారిజాత.తనలో తానే నవ్వుకొంటూ పారిజాత వేపు చూశాడు శ్రీహర్ష. తనకు కాల్ చేసింది శ్రీహర్షేనని నిర్ధారించుకున్న పారిజాత కళ్ళతో చిరు కోపాన్ని ప్రదర్శించి ఫోన్ ఆఫ్ చేసి బయటికి నడిచింది.ఆమెను వెంబడించారు స్నేహితురాళ్ళు.
"ఏరా!పారిజాతకు మిస్డు కాల్ యిచ్చావు కదూ?" అడిగాడు ప్రశాంత్ కాఫీ చిప్ చేస్తూ. 'అవున'న్నట్టు తలూపాడు శ్రీహర్ష. "ఇలా ఎన్నాళ్ళురా... కను సైగలతో,ముసిముసి నవ్వులతో!మరీ...నువ్వు ఇబ్బంది పడి పారిజాతను కూడా ఇబ్బంది పాల్జేస్తున్నావ్ !నా మాట విని ముందు నువ్వే తన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పేయ్ !కాలేజి కూడా ఇంకో వారమే వుంది"ధైర్యాన్నిస్తూ అన్నాడు ప్రశాంత్ .
"వాడంది కరెక్టు. కాలయాపన చేయక ఇద్దరూ ఒక్కటై మీ ప్రేమకు శుభం కార్డు వేయండి" అన్నాడో ఫ్రెండు.
"ఓకేరా!ట్రయ్ చేస్తాను"అన్నాడు శ్రీ హర్ష.అందరూ నవ్వుకొంటూ బయటికి నడిచారు. శ్రీహర్షకు పారిజాతంటే చచ్చేంత ప్రేమ.అయితే తన ప్రేమను గడిచిన రెండేళ్ళలో ఏనాడూ ఆమెకు చెప్పలేదు.పారిజాతకూ శ్రీహర్షంటే ప్రేముందేమో కాని అలాంటి భావాన్ని అతని పట్ల ఏనాడూ తను కనుబచినట్టు ధాఖలాలు లేవు.మరి వీళ్ళిద్దరి మధ్య చోటు చేసుకొన్నది ప్రేమా....మూగ ప్రేమా....లేక ఇంకేదోనా అన్నది యెవ్వరికీ అర్థం కాని పరిస్థితి.ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య వున్నది ప్రేమే అయితే అది త్వరగా ఫలవంతం కావాలన్నది స్నేహితుల కోరిక. కారణం వీళ్ళ తరువాత ప్రేమించుకొన్న మరో జంట పెళ్ళి చేసుకొని కాపురం చేసుకొంటూ మళ్ళీ మామూలుగా కాలేజికి వస్తున్నారు.దాన్నిబట్టి చూస్తే ఒకవేళ పారిజాత గొప్పింటి అమ్మాయని శ్రీహర్ష భయంతో సంశయిస్తూ వెనుకంజ వేస్తున్నాడేమోనన్న అనుమానం కలుగుతుంది.... అలా అయితే... అదే నిజమైతే తను తప్పుకోవడం మంచిది కదా!ఇలా మౌనం సాధిస్తూ పిచ్చిగా ఆమెను వెంటాడ్డమెందుకూ!?.
ఆరోజు కాలేజీ చివరి రోజు.---
క్లాసు పిల్లలందరూ ఆటోగ్రాపులు తీసుకొంటున్నారు.శ్రీహర్ష,పారిజాతలు కూడా ఆ పనే చేస్తున్నారు.అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు యెదురు పడడం తప్పలేదు.అయితే ఇద్దరిలోఎవరు ఆటోగ్రాపు ముందు అడుగుతారో నన్న సమస్య స్నేహితుల మధ్య చోటు చేసుకోగా ఆ సుందరమైన అద్భుత దృశ్యాన్ని చూడాలన్న ఆసక్తితో, ఆదుర్దాతో అందరూ వాళ్ళనే చూస్తున్నారు,
"ఒరేయ్ !పారిజాత ఆటోగ్రాపును నువ్వే ముందడుగు"ఓ ఫ్రెండు సలహా.
"నో...లేడీస్ ఫస్టు.నువ్వే అడగవే"పారిజాతను ముందుకు నెట్టింది ఓ స్నేహితురాలు. పారిజాత ఒక అడుగు ముందుకొచ్చింది .అప్పుడు తొందరతొందరగా రెండడుగులు ముందుకొచ్చిన శ్రీహర్ష "ఆటోగ్రాఫ్ ప్లీజ్ !"అన్నాడు తన బాల్ పాయింట్ పెన్ పారిజాత చేతికిస్తూ.ఏదో రాసి సంతకం పెట్టి చిన్న పుస్తకం లాంటి తన ఆటోగ్రాఫ్ బుక్కును శ్రీహర్ష ముందుంచింది పారిజాత.శ్రీహర్ష కూడా ఏదో రాసి సంతకం పెట్టి ఆమె చేతికిచ్చాడు.అప్పుడు అందరూ ఘొల్లున నవ్వుతూ, షెకండ్లిస్తూ క్లాసునుంచి బయటికి నడిచారు.పారిజాత కూడా వాళ్ళ వెనుకే నడుస్తూ శ్రీహర్షను క్రీకంట చూసి స్నేహితురాళ్ళతో కలిసిపోయింది.
©©©©©
"ఏమిట్రా అదోలా వున్నావ్ ?"ఇంట్లో తన గదిలో కూర్చొని పరధ్యానంగా కిటికిలోనుంచి బయటికి చూస్తున్న శ్రీహర్షను అడిగాడు అప్పుడే లోనికొచ్చిన ప్రశాంత్ . ఉలిక్కి పడ్డట్టు తిరిగి చూసి "నాకేమీ పాలుపోవడం లేదురా ప్రశాంత్ !భోజనం సహించటం లేదు.నిద్ర రావటంలేదు.నిత్యం పారిజాతే గుర్తుకొస్తోంది."అన్నాడు శ్రీహర్ష.
"అనుకున్నానురా నీ మనసు ఇంకా పారిజాత చుట్టే తిరుగుతుందని. ఏం లాభం?గడిచిన రెండేళ్ళు మీరిద్దరూ ఒకే క్లాసులో ప్రక్క ప్రక్క బెంచీలో కూర్చొని చదువుకున్నారు.అంతటి సుదీర్గ కాలవ్యవధిలో కూడా నువ్వు నీలోని ప్రేమను తనకు చెప్పలేకపోయావంటే నువ్వెంతటి పిరికివాడవో! తను కాలేజి వదిలి వెళ్ళిపోయి మూడునెల్లు. ఇప్పుడేం చేయగలవు?" ప్రశాంత్ నోటినుంచి ఎగతాళి చేస్తున్నట్టు వచ్చాయా మాటలు. మొదటే మానసికంగా బాధపడుతున్న శ్రీహర్షకు కోపం వచ్చింది.అయినా తమాయించుకొని "నేనిప్పుడేం చెయ్యాలో సలహానివ్వరా బాబూ అంటే..ఏదో మాట్లాడు తున్నావ్ !
" బ్రతిమాలాడు శ్రీహర్ష."సలహా కావాలా?ఓకే! తిన్నగా చెన్నైలో వున్న పారిజాత ఇంటికి వెళ్ళు.తన్ను కలిసి నీ ప్రేమను బయట పెట్టి ఒప్పించి ఇద్దరూ ఒక్కటై పెళ్ళి చేసుకొని దంపతులుగా వచ్చి నాక్క నబడండి.నేను ఆశీర్వదిస్తాను. ఏం?"వ్యంగ్య ధోరణితో అని పకపక నవ్వేశాడు ప్రశాంత్. ."నవ్వకురా!నువ్వా మాటలు వ్యంగ్యంగా అన్నా అలాగే చేయాలనిపిస్తోంది నాకు.ఎని హౌ నీ మంచి సలహాకు నా ధన్యవాదాలు.నేను రేపే చెన్నైకి వెళుతున్నాను. ఓకే!"అంటూ లేచి ప్రశాంత్ బుగ్గమీద ఓ ముద్దు పెట్టుకొన్నాడు ఆనందంతో వుక్కిరి బిక్కిరై పోతూ శ్రీహర్ష.
©©©©©
సమయం రాత్రి పదకొండు గంటలు--- విజయవాడ నుండి వచ్చిన జన శతాబ్ది ఎక్సప్రెస్ ఒకటవ నంబరు ప్లాట్ ఫాంకు వచ్చి ఆగింది.శ్రీహర్ష చిన్న సూట్ కేసు చేతుంచుకొని దిగాడు.వైటింగ్ హాల్లోకి నడిచాడు.ఆ వేళప్పుడు తన సెల్ ఫోన్లో వున్న పారిజాత నంబర్ను నొక్కాడు.రింగౌతోంది.ఆమె రెస్పాండు కాలేదు.తనకప్పుడు ఏం చెయ్యాలో పాలుపోక బయటికొచ్చి వాల్టాక్సు రోడ్డులో వున్న ఓ లాడ్జిలో దిగాడు.మంచంమ్మీద సూట్ కేసును గీరాటేసి ముఖం కడుక్కొని కూర్చొని రిలాక్సవుతూ మరోసారి పారిజాతకు ఫోన్ చేశాడు. ఈసారి "హల్లో"అంది పారిజాత. పోయిన ప్రాణం లేసొచ్చినట్టు ఫీలయి"పారిజాతా...నేనే...నేనే మాట్లాడుతున్నాను"అన్నాడు ఆదుర్దాతో శ్రీహర్ష. "ఈవేళప్పుడు 'నేనేనంటే'...ఎవరండీ మీరు?"ఎదురు ప్రశ్న వేసిందామె.
"నేనే...నీ క్లాసుమేట్ శ్రీహర్షని"ఒత్తిపలికాడు తన్ను గుర్తు పడుతుందన్న ఆశతో శ్రీహర్ష అభ్యర్థించినట్టు.
"ఓఁ...నువ్వా!"అంది పారిజాత మామూలుగా. "అమ్మయ్య!ఎలాగో గుర్తు పట్టావ్ !ధ్యాంక్సు."అన్నాడు కాస్త రిలాక్సు ఫీలవుతూ. "గుర్తున్నావ్ !నువ్వు నా క్లాసుమేటు శ్రీహర్షవు, ఒతెల్లో నాటకం కధానాయకుడివి.ఎలా వున్నావు హర్షా?" "బాగున్నాను.నువ్వూ?" "నాకేం బాగున్నాను.ఇంతకు ఏం పనిమీద చెన్నైకొచ్చావ్ ?""నిన్ను చూడాలని..."ఇంకేదో చెప్పబోయాడు శ్రీహర్ష. "నన్ను చూడాలనా!?షాక్కు గురైంది పారిజాత. "ఆఁ."అన్నాడు శ్రీహర్ష. "సరే! గంట పన్నెండయ్యింది.నిన్ను మా ఇంటికి పిలిపించుకోలేను, అది బాగోదు.ఆఁ...ఒకపని చెయ్! రేపు వుదయం పది గంటలకు ఎగ్మోరులో వున్న కన్నెమెరా లైబ్రరీకి రా!ఇద్దరం అక్కడ కలుసుకుందాం"అని చెప్పి ఫోన్ కట్ చేసింది పారిజాత. ఫోన్ కట్ చేసినందుకు కాస్త బాధపడ్డా రేపు తన్ను కలుసుకునేందుకు వస్తుందని చెప్పినందుకు సంతోషపడ్డాడు శ్రీహర్ష. అదే సమయంలో ఎప్పుడూ అమాయకంగా కనబడే పారిజాత మాటల్లో ఇప్పుడు ఎంతో పరిపక్వతను గమనించాడు.ఆమెకు తన భవిష్యత్తు పట్ల ఆవగాహన,మెలుకువలు కూడా బాగా వున్నట్టు గ్రహించాడు. ఏదేమైనా సరే రేపు పారిజాతపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసి ఆమెను తన స్వంతం చేసుకోగలడన్న నమ్మకంతో వూహా లోకంలో విహరిస్తూ మంచంమ్మీద అడ్డంగా పడుకొని కళ్ళు మూసుకున్నాడు శ్రీహర్ష.
©©©©
శ్రీహర్ష ఉదయం తొమ్మిదికల్లా ఆటోలో ఎగ్మోరులో వున్న కన్నెమెరా లైబ్రరీకి వెళ్ళాడు.తెలుగు విభాగంలో కూర్చొని ఏవో పుస్తకాలను త్రిప్పి చూస్తున్నడే కాని మనసంతా పారిజాత చుట్టే తిరుగుతోంది.ఇక లోపల వుండలేక బయటికొచ్చి చెట్టుక్రింద వేసి వుంచిన సిమెంటు బల్లమీద కూర్చొన్నాడు రోడ్డు వేపు చూస్తూ. అంతలో ఓ ఆటో వచ్చి ఆగింది.అందులో నుంచి శ్రీహర్ష మనసులో తిష్ఠ వేసుకొని కూర్చొని వున్న పారిజాత దిగి పెదాలపైకి నవ్వు తెచ్చుకొని తన వద్దకు వచ్చింది.అప్పుడు పులకరింతతో కూడికొన్న ఏదో వుద్వేగం తనలో చోటు చేసుకోగా నోటివెంట మాటరాక 'కూర్చో'మన్నట్టు సైగ చేశాడు తను కాస్త జరుగుతూ శ్రీహర్ష.
"ఏమిటీ...నన్ను చూడాలని విజయవాడనుండి చెన్నై వరకూ వచ్చావా!?"అప్పుడామెకళ్ళు మెరుపులతో రెపరెపలాడాయి.మందహాసంతో పెదాలు మిలమిల మెరిశాయి.
"ఆఁ"అని తడుముకొన్నట్టు అన్నాడు శ్రీహర్ష. పారిజాత మెల్లగా నవ్వి"చూశావు.ఓకే!మరి ఏదేని మాట్లాడు"అంది చెక్కిళ్ళ మీదకు జారిపడుతున్న ముంగురులను ఎడమచేత్తో సర్దుకొంటూ. "నేను చెప్పబోయే విషయానికి నీ జవాబు పాసిటీవ్ గా వుండాలని ఆశిస్తున్నాను పారిజాతా!"చిన్నపాటి ధైర్యంతో వచ్చాయా మాటలు శ్రీహర్ష నోటినుంచి. "అసలు విషయం చెప్పకుండానే...!"అంటూ అటు రోడ్డు వేపుకు చూసింది ఎవరినో ఎదురు చూస్తున్నట్టు పారిజాత. "మనం చదువుకున్న ఆ కాలేజీ రోజులు చాలా మధురమైనవి కదూ?"శ్రీహర్షకు తన ప్రేమను ఎలా చెప్పాలో అర్థంకాక ఆ మాటలన్నాడు.
"ఆఁ...నాకూ ఆ రోజులు అప్పడప్పుడు గుర్తుకొస్తుంటాయి.పోనీ...నువ్విప్పుడు ఏం చేస్తున్నావ్ ?"అడిగింది.
"వుద్యోగాన్వేషణలో వున్నాను. నువ్వూ...?"
"నేనూ అంతే!అయితే మా ఇంట్లో ఓ ప్రక్క నాకు..."అని ఆమె అంటుండగా అది ఆమెకు పెళ్ళి ప్రయత్నాలే నన్నట్టు అర్థం చేసుకున్న తను 'ఇక లాభం లేదు.చల్లకొచ్చి ముంత దాచుకున్నట్టు ముసుగులో గుద్దులాటెందుకూ ...వెంటనే ఆమెను ప్రేమిస్తున్నట్టు తన మనసులోని మాటను చెప్పాలని గొంతుని సర్దుకొని దగ్గరగా జరిగి, "పారిజాతా!నా మనసులో ఇన్నాళ్ళు గూడు కట్టుకొని వున్న ఆ మాటను నీ ముందుంచాలి. అది ఫ్రూట్ పుల్ కావాలి!"అని గబగబ అనేశాడు శ్రీహర్ష. పారిజాత నవ్వి"అదేమిటో చెప్పు హర్షా!"అంది శ్రీహర్ష కళ్ళలోకి చూస్తూ...
"పారిజాతా! నేను...నేను..."అంటుండగా బైకుమీద ఓ కుర్రాడు స్పీడుగా చ్చి 'హాయ్ ' అన్నాడు పారిజాతను చూసి. పారిజాత కూడా బదులుకు 'హాయ్ 'చెప్పి ఇటు తిరిగి శ్రీహర్షతో "హర్షా!ఇతను అరవింద్ . నా...వుడ్బీ!"అని పిడుగులాంటి వార్తను బయట పెట్టి మళ్ళీ అటు తిరిగి "అరవింద్ !ఇతను శ్రీహర్ష. పి.జీ లో నా క్లాసుమేటు.సో బ్రిల్లియంట్ అండ్ కాలేజీలోనే హాండ్సం గై."అని మళ్ళీ హర్షవైపు తిరిగి"హర్షా!వచ్చే నెల్లోనే మా పెళ్ళి.మాది ప్రేమ పెళ్ళి కాదు సుమా! పెద్దలు కుదిర్చిందే!.."అంటూ ఏదో చెప్పుకు పోతోంది పారిజాత. పారిజాత మాటలతో శ్రీహర్ష అథః పాతాళానికి కృంగి పోయాడు.ఎదురు చూడని ఆమె మాటలు విన్న తను తట్టుకోలేక పోయాడు.అందుక్కారణం కూడా తనే! తను తప్పు చేశాడు.అవును రెండేళ్ళు తనతోనే చదువుకున్న పారిజాతకు ఏ రోజూ పారిజాతను ప్రేమిస్తున్నట్టు చెప్పుకోలేని నిస్సహాయ పరిస్థితుల వల్లే ఇవాళ ఈ పరిణామాన్ని యెదుర్కోవలసి వచ్చిందని తన్ను తానే నిందించుకున్నాడు. పారిజాతను తను ప్రేమిస్తున్నాడన్న మాట తన మనసు దాటి రాని కారణం చేతనే ఈ రోజు తనకీ చేదు అనుభవం మిగిలిందని, ' ప్రేమ' అన్న విషయంలో తను ఓడి పోయాడని మనసులోనే మదన పడ్డాడు. తన కనుకొలకల్లోంచి నీటి బిందువు ఒకటి బయటికి రాగా కర్చీఫ్ తో తుడుచుకున్నాడు పారిజాతకు తెలియకుండా. "అన్నట్టు..ఏదో నీ మనసులోని మాటను చెప్పాలన్నావ్ !" గుర్తు చేసింది పారిజాత.
"ఇప్పుడు కాదులే!మరోసారి వచ్చినప్పుడు చెపుతాను"అని రిలాక్సుడుగా ఏదో భారం దించుకున్న వాడిలా అన్నాడు శ్రీహర్ష గతంగతః అన్న ధోరణితో.
"ఓకే!మరి కాఫీకి వెళదాం రా!"అంది పారిజాత అరవింద్ చేయి పట్టుకొని.
"కాఫీ కూడా ఇంకోసారి వచ్చినప్పుడు మీతో కలసి తాగుతానులే!"అని పారిజాత కళ్ళలోకి చూశాడు శ్రీహర్ష, "ఓకే..బై!"అంటూ ముందుకు నడిచారు పారిజాత అరవిందులు .వాళ్ళను చూస్తూ అక్కడే నిలుచుండి పోయాడు శ్రీహర్ష.
|