బెంగుళూరు నుంచి వచ్చిన ప్రయాణపు బడలికతో.. నిద్రలోకి జారిన ఉషకి మద్య రాత్రిలో ఉన్నట్లుండి మెలకువ వచ్చింది. ఎక్కడి నుంచో .. వినీవినిపించకుండా, స్పష్టత లేని మాటలు మధ్యలో దుఃఖం తాలూకూ వెక్కిళ్ళు. ఇంత రాత్రి వేళ ఏమిటిదీ? గదిలో బెడ్ లైటు వెలుతురులో కళ్ళు చికిలించుకుని చూసింది. చెల్లెళ్ళు ఎవరన్నా నిద్ర పోకుండా వాదులాడుకున్నారా? తన నిద్రకు భంగం కలగకుండా నెమ్మదిగా గొడవపడుతున్నారా! అన్నట్లు. కానీ అదేమీ లేదు అందరూ ఆదమరచి నిద్రపోతూనే ఉన్నారు. అనుమానం తీరక, చెవులు రిక్కించుకుని పరిశీలనగా వింది. ఆ రణగొణధ్వని ప్రక్క గదిలోనుంచి. అంటే అమ్మా నాన్న ఎందుకో గొడవ పడుతున్నారన్న మాట. ఆవేశంతో కూడిన మాటలు నాన్నవైతే, మద్య మద్యలో దుఃఖాన్ని అదిమిపెట్టుకుంటే వచ్చే వెక్కిళ్ళు అమ్మవి. ఇంత రాత్రి వేళ ఏమిటీ చివరికి అమ్మ ఏడిస్తే గాని పరిపూర్తి కాదు గొడవకి. ఇప్పుడు దేనికో మొదలెట్టాడు నాన్న. పగలంతా ఏమీ ఎరగనట్టు బాగానే ఉంటాడు. రాత్రుళ్ళే టైము దొరుకుతుంది పెళ్ళాంతో వాదన వేసుకోడానికి. ఇక ఉపేక్షించి లాభంలేదని, తన గదిలో లైటు వేసింది. ఈ రూములో మనుషులు ఇంకా బ్రతికే ఉన్నారు సుమా! అన్నట్లు. లైటు వెలుతురికి ఆ రూములో మాటలు ఆగిపోయినాయ్. అంతా నిశ్శబ్దఒ. నిద్ర తేలిపోవడంతో రెండు నిముషాలు చూసి, ఆ బెడ్రూము తలుపు మెల్లగా నెట్టి “అమ్మా! ఏడుస్తున్నావు, ఎందుకు?” అడిగింది.
తండ్రికి తనంటే ఓపిసర గుండెల్లో గుబులే. విషయం ఎలాంటిదైనా తను తల్లి తరఫునే మాట్లాడుతుందని. అయినా తను ఉన్నప్పుడే తల్లి పరిస్తితి ఇలా ఉందంటే, తను లేనప్పుడు ఇంకెంత క్షోభ అనుభావిస్తుందోనని. సోమిదేవి ఏం మాట్లాడలేదు మంచం మీద దిండులో ముఖం దాచుకుంది తనని కాదన్నట్లు. “ మీకు గొడవ పడడానికి ఇప్పుడే టైము దొరికిందా” తండ్రి మంచం కేసి చూస్తూ, తండ్రి నుద్దేశించి కోపంగా.
ఏం లేదులే. మాములే. నువ్వెళ్ళి పడుకో. మీ అమ్మ సంగతి తెలిసిందే కదా. ఆలోచన తక్కువ అపార్ధం ఎక్కవ. వెళ్ళు వెళ్లి పడుకో. రేపు మాట్లాడుకుందాం లే ” నచ్చచెప్పబోయాడు సంగమేశం. భర్త సమాధానం సోమిదేవి లోని దుఃఖం కట్టలు తెంచుకుంది. లేచి కూర్చుని, మరింతగా కన్నీళ్ళు కార్చింది. తల్లిని చూసి విస్తుపోతూ తండ్రి మాటల్ని పట్టించుకోనట్లుగా “అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు” గట్టిగా అడిగింది తనకిప్పుడే తెలియాలన్నట్లు. ఇక నోరు విప్పక తప్పలేదు “ ఏం చెప్పనమ్మా. కొందరి జీవితాల౦తే. ఏడవడానికే పుట్టిస్తాడు ఆ దేవుడు” కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది సోమిదేవి.
తన కష్టానికి కనబడని దేవుడే కారణం అన్నట్టు. ఆ గొడవకి మిగిలిన అమ్మాయిలు కూడా లేచి కూర్చున్నారు. “ వీళ్ళకు పనేం లేదు .. అర్ధరాత్రిళ్ళు మొదలెడతారు” విసుగ్గా అంది రెండో కూతురు ఉమ.పిల్లలకి తెలిసిపోయాక ఇంకా విషయం దాచడం అవసరం అనుకుంది సోమిదేవి. పైట చెంగుతో కళ్ళు వత్తుకుంటూ“ నీ పెళ్లి కోసమేనమ్మా నా ఈ బాధ” చెప్పింది ఉషను ఉద్దేశించి.
“ నా పెళ్లి కోసం నువ్వు ఏడవడం ఎందుకు? నేనసలు పెళ్ళే చేసుకోను. ఆ సంగతి ఇంతకుముందే చెప్పాను” అవతలి వాళ్ళు అడిగే కట్నాలు ఇచ్చి తనకు తగిన వాడ్ని తేలేడు తండ్రి, అలా అని బ్రతుకుతో రాజీపడి సర్డుకుపోవాలనిలేదు. అందుకు అసలు పెళ్ళే వద్దనుకుంది.
“నువ్వేమో! అలాగ .. మీ నాన్నేమో ఇలాగ. మొన్న మీ నాన్న ‘అమలాపురం’ మీ సరస్వతి అత్తయ్యగారి ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆ మామయ్య నీ కోసం ఓ సంబంధ౦ గురించి చెప్పాడట. ఆ అబ్బాయి బొంబాయిలో ఏదో వ్యాపారం. ఆరు లక్షల బ్యాంకు బాలెన్సు పైసా కట్నం అక్కరలేదు. కాకపోతే చిన్నప్పుడే పోలియో వచ్చేయడంతో నడవలేడు. రెండు చంకల్లోనూ కర్రలు పెట్టుకుని ఉన్నాడు. చూడు” అంటూ అక్కడే దిండు క్రింద ఉన్న ఫోటో తీసి తలుపు సందు నుంచి వచ్చే వెలుతురూ లోనే చూపించింది. ‘కాలిపర్స్’ సాయంతో నిలబడ్డాడు.
“ అదేనమ్మా మీ నాన్న చెబుతుంటే ఇంటికి పెద్ద కూతురు దానికి ఈ పెళ్ళిచేసి దాని గొంతు కోయ్యోద్దు అని మొత్తుకుంటున్నా అంతే ” అంటూ జరిగిన దాంట్లో తన తప్పేం లేదన్నట్లు. కూతురికి తెలియాల్సిన విషయం తెలిసిపోవడంతో నిశ్చింతగా ముసుగుతన్ని పడుకున్నాడు సంగమేశం.
***
మర్నాడు ఎప్పటిలా తెల్లవారినా ఆ ఇంట్లో మౌనం ముద్ర వేసుకుని కూర్చుంది. ఎవరు ఎవరితోనూ మాట్లాడుకోవడం లేదు. రాత్రి గొడవకు సోమిదేవికి గుండెల్లో నొప్పి ప్రారంభమై మంచం మీద నుంఛి లేవగలిగే పరిస్తితిలో లేదు. ఉషే మాత్ర ఇచ్చి, పడుకోబెట్టి, వంటకు ఉపక్రమించి౦ది. ఆడపిల్ల పెళ్ళి భాధ్యతని ఎలా తీర్చుకోవాలో తెలియని ఆర్ధిక వెసులుబాటు లేని సగటు తండ్రి ఎలా ఆలోచించాలో అలాగే ఆలోచిస్తున్నాడు సంగమేశం. ఎదురింటి గౌరికి పెళ్లి చెయ్యలేక వయసుమీరిన వాడ్నిచ్చి కట్టబెట్టారు తల్లితండ్రులు. సన్నగా కట్టెలా ఉన్న ఆమెతో ఏం కాపురం చేస్తానని కడుపుతో ఉండగానే వదిలేసాడు కట్టుకున్నవాడు. పుట్టిన పాపని చూసైనా మనసు కరగలేదు అతగాడికి. శ్రీమతి గౌరికి పెళ్లయినా పుట్టిల్లే దిక్కయ్యింది.
నాలుగిళ్ళ అవతల ఉన్న అపర్ణకూ తల్లీతండ్రీ లేకపోవడంతో అటెండర్ పోస్టులో ఉన్నాడు కదా అని ‘దొడ్డి కాళ్ళ’ వాడినిచ్చి చేసారు బందువులు.. ఇష్టం లేకపోయినా. కక్కలేక మింగలేక చేసేదిలేక ఈ జీవితం తనది కానట్టు తయారైపోయింది ఆమె.తమ పరిస్థితీ అందుకు భిన్నం కాకపోయినా తమకి చదువులున్నాయి. చదువే దారి చూపుతుందన్న ‘చిన్న’ ఆశ. అయినా ఓ మద్య తరగతి తండ్రి అసహాయత. ఎవరి మాట ఎలా ఉన్నా.. సంగమేశానికి మాత్రం ఈ స్తబతత మింగుడుపడకుండా ఉంది. మగపిల్లాడి కోసం చూస్తే .. నలుగురూ ఆడపిల్లలు పుట్టేసారు. ప్రస్తుతం అందరూ యుక్తవయసుకు వచ్చేయడంతో వాళ్ళ వయసుకు తగిన అబ్బాయిలు దొరకరని భయం పట్టుకుంది. సంగమేశం స్తానికంగా ఉన్న షుగర్ ఫేక్టరీలో చిన్న గుమస్తా ఎన్నాళ్ళుగానో ఫేక్టరీ నమ్ముకుని బ్రతికేస్తూన్నాడు. అతని జీతంలానే జీవితమూ పెరగలేదు.
ఉష తరువాత ఆడపిల్లలు ఇద్దరూ ఉమా, జ్యోతి డిగ్రీ చదివి, టైలరింగు ఒకళ్ళు, కంపూటర్ కోర్సు ఒకళ్ళూ చేస్తున్నారు. చిన్నది రాధిక ఇంకా డిగ్రీ చదువుతుంది. ఉమ టైలరింగు ద్యారా ఇప్పటికే కొంత సాయంగా ఉంది. కొంతసమయం గడిచే సరికి ఓపిక తెచ్చుకుని లేచింది సోమిదేవి. పెద్దకూతురు నిన్ననే బెంగుళూరు నుంచి వచ్చింది కాబట్టి, ఏమైనా వండిపెట్టాలి. ఎన్నో రోజులు శెలవు దొరకదు అనుకుంటూ. తల్లి లేవడం చూసి ఊరట చెందిన ఉష “ నాన్నా ఎల్లుండి సాయంత్రానికి నాకు టిక్కెట్టు కావాలి” చెప్పింది.“ నిన్నటివరకూ రాలేదనుకుంటే .. అప్పుడే వెళ్ళిపోడానికి తయారా”స్వగతంలా పలికింది సోమిదేవి.
మౌనం భగ్నమై వాతావరణం తేలిక పడడంతో సంగమేశానికి ఉత్చాహం వచ్చింది “ ఇంకో రెండు రోజులుండడానికి వీలౌతుందేమో చూడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఎలా? నీకు పెళ్లి చెయ్యాలనుకుంటున్నా౦. కూడాను” అన్నాడు ఉపొద్ఘాతముగా. మాట్లాడలేదు ఉష.
“రాత్రి విషయం ఏం ఆలోచించావు. చక్కగా స్వంత వ్యాపారం చేస్తున్నాడు. డబ్బుకు లోటులేదు. నువ్వు ఆ ఊరిలో వంటరిగా ఉంటున్నావన్న బాధ మాకూ ఉండదు. నీ తరువాత వాళ్ళకూ పెళ్ళిళ్ళు చెయ్యాలి .. ఓ నిర్ణయం తీసుకునేటపుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి” కూతుర్ని వప్పించే దిశగా మాటలు కలిపాడు. సోమిదేవికి మళ్ళీ ఆందోళన పట్టుకుంది. గుండె వేగం హెచ్చింది. బాధని భరిస్తూ, ఎగిసిపడే గుండెను చేత్తో అదుముకుంటూ ‘ఈయన పట్టుకున్నాడంటే వదలడు. నయాన్నో భయన్నో చెప్పి కూతుర్ని వప్పించేలాగున్నాడు’ అని అనుకుంటుండగా.
“నాకు నా ఉద్యోగమే ముఖ్యం. నా ఉద్యోగానికి ఇబ్బంది కలిగించే పెళ్లి ఏదీ చేసుకోను నేను” ఖచ్చితంగా చెప్పింది ఉష. బెంగళూరు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది ఉష. కూతురి నిర్ణయం ఆమెను తెరిపిన పడేసింది. కూతురు అంతే అంటుందని అనుకున్నాడు సంగమేశం.. అలాగే అంది ఉష కూడా.ఇక తన నిర్ణయం తను చెప్పాలను కున్నాడు.
“ మొన్న ఊరు వెళ్ళినపుడు మా అక్క బాధపడింది. నాలుగేళ్ళ క్రిందట, మన మూడవ పిల్ల .. జ్యోతిని వాళ్ళ పెద్ద అబ్బాయి సుందర రాజు కిచ్చి చెయ్యలనుకుంటే అప్పుడు మీ అమ్మ పడనిచ్చింది కాదని. అందుకు వాళ్ళు వేరే సంబంధ౦ చూసుకోవలసి వచ్చిందని” ఊపిరి తీసుకోవడానికన్నట్లు ఓ నిముషం ఆగి “ఇప్పుడు చిన్నోడు నరేంద్ర కైనా .. నాలుగోదాన్ని రాధికను చెయ్యమని అడుగుతుంది. రక్తసంబంధం కాదనుకోవాలని నాకూ లేదు. నాకున్న తోబుట్టువు అక్క ఒక్కతే. అక్కను దూరం చేసుకోవాలని నాకు లేదు ” చెప్పాడు సంగమేశం.
భర్తను ఏ విధంగా అర్ధం చేసుకోవాలో తెలీడం లేదు సోమిదేవికి మళ్ళీ రాద్దాంతానికి దిగుతున్నాడనిపించి “ మీ పెద్ద మేనల్లుడు సుందరానికి చదువా? సంధ్యా? ఎంత మీకు మేనల్లుడైతే మాత్రం పొలాల్లో పనిచేసుకునే వాడికి .. చదువుకున్న నా కూతుర్నిచ్చిచేస్తానా! అందుకే వప్పుకోలేదు. అయినా మొదటిదానికి మొగుడు లేడు, కడ దానికి కల్యాణమా? రక్తసంబంధం అంటూ ఆ చిన్నోడికి .. ‘ఆస్తమా’ పిల్లాడికి నా చిన్న కూతుర్ని ఇచ్చి చెయ్యడానికి .. నేను చస్తే వప్పుకోను” ఆందోళన పడుతూనే పంటిబిగువున చెప్పింది.
తండ్రి వంక ఆశ్చర్యంగా చూస్తూ “ మీరు దానికి పెళ్లి చెయ్యకపోయినా ఫర్వాలేదు. నరేంద్రకిచ్చి చెయ్యడానికి మాత్రం వీలులేదు” ఉష. కూడా తల్లిని సమర్ధించింది.“నువ్వూ పెళ్ళికి వప్పుకోవు వచ్చిన అవకాశాన్ని నేనైనా సద్వినియోగం చేసుకోవాలిగా” తండ్రి మాటలకు రాధిక భయపడింది.
“ నేనసలే చేసుకోను ఆ నరేంద్రని” బెదురుగా. ఆ పిల్లా తన దారిలోకి రాకపోవడంతో ..“వచ్చిన సంబంధాలు అన్నీ మీ తల్లీ కూతుళ్ళు ఇలాగే తిరగగోట్టేయండి. నేనేమో చేతకానివాడిలా కనిపిస్తున్నాను మీకు. నేనసలే ఒంటరిగాడ్ని.. మరో అన్నదమ్ముడు లేడు నాకు. ఎవ్వరూ కలిసిరాకపోతే నేనేం చేసేది” తోక తొక్కిన త్రాచులా లేచాడు. పేపరు చూస్తూనే బుసలు కొడుతున్నాడు. వాదనలు పెరుగుతున్నాయి. మరో గంట గడచింది.
“ ఇంకా ఎంతసేపులే ఈ మాటలు .. టైము ఒంటి గంట అవుతుంది, భోజనాలకి లేవండి. ఇల్లు చక్కబెట్టుకుని మళ్ళీ కాస్సేపు విశ్రాంతి తీసుకోవాలి నేను” లోగొంతుకతో పలికింది సోమిదేవి. ఆమెకింకా స్వస్థత చేకూరలేదు. అంతా నిమ్మళింఛి కుదుటపడడానికి నాలుగైదు రోజులైనా కావాలి.
ఆ మాటతో కోపం నషాళానికి ఎక్కింది సంగమేశానికి. ఒంటికాలి మీద లేచాడు “ నా మాట అంటే లెక్కలేనపుడు నాకు భోజనం అక్కరలేదు. ఏమీ అక్కరలేదు. నేను ఈ ఇంట్లోనే ఉండను. వెళ్ళిపోతాను. ఎక్కడికైనా వెళ్ళిపోతాను” అంటూ చూస్తున్న పేపరు గిరాటేసి పడక్కుర్చీ లోంచి విసురుగా లేచాడు.ఆ హటాత్ పరిణామానికి అందరూ నివ్వేరపోయారు. పిల్లలు భయంభయంగా చూస్తే, ముందుగా తేరుకున్నది సోమిదేవే. “ఎక్కడికి వెళ్ళిపోతారు. మీరు లేకపోతే మేమేమైపోతాం” కంగారు పడింది. ఈ మనిషి అన్నంత పనీ చేస్తే, ఇల్లేమై పోతుంది. గుట్టుగా సాగే సంసారం వీధిన పడుతుంది. ఒక్క ఊపున బాత్ రూములోకి వెళ్లి ముఖం కడుక్కు వచ్చి అంతే ఊపుగా బట్టలేసుకుని “ మీరేమై పోతారో నాకు తెలీదు. నా మాటకు విలువ లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం అనవసరం ”అంటూ చెప్పులేసుకుని బయలుదేరాడు
“ నాన్నా వెళ్ళకు” దారికి అడ్డంగా వచ్చిది రెండోపిల్ల ఉమ. అయినా ఆగలేదు.సోమిదేవి అలాగే భర్త వెళ్లినవైపే నిస్త్రాణ౦గా చూస్తూ ఉండిపోయింది ఇలా ఎప్పుడూ చెయ్యలేదు ఈ మనిషి అనుకుంటూ.
***
కొంతసేపు తర్జన భర్జనల తరువాత, నాన్న కోపం తగ్గితే తనే వస్తాడు అనుకుంటూ మెల్లగా భోజనాలు కానిచ్చారు అమ్మాయిలు. భర్త వచ్చేంత వరకూ తిండే అక్కరలేదని “ సంపాదించే మీ నాన్నగారు తినకపొతే, నాకు మాత్రం భోజనం అవసరమా” అంటూ సోమిదేవి అభోజనంగానే పడుకుంది. అసలే నీరసం మీద ఉందేమో, గంట గడిచేసరికి ..బి.పి పెరిగి, షుగర్ డౌన్ అయి కళ్ళు తిరగడంతో పిల్లల బలవంతంతో మజ్జిగ అన్నం తినక తప్పింది కాదు. సంగమేశం ఆవేశంతో..ఇంటి నుంచి బయటికి అయితే వచ్చాడు గాని, ఎక్కడకు వెళ్ళాలో తెలీలేదు. కాలనీ మొదట్లో ఉన్న ‘కృష్ణ’ కిరణా కొట్టుకి చేరుకున్నాడు.
అలవాటుగా ఓ సిగరెట్టు కొనుక్కుని .. అక్కడే ఉన్న బల్ల మీద కూర్చుని కాల్చుకున్నాడు. సోమిదేవికి తెలిసి ఎప్పుడూ సిగరెట్టు కాల్చడు. మాములుగా అయితే కృష్ణ వచ్చే కస్టమర్లతో కాస్సేపు బాతాఖానీ వేసేవాడే కానీ ఎందుకో .. ఈ రోజు షాపులోనే ఓ మూలగా అమర్చుకున్న టీ. వీ లో క్రికెట్టు మ్యాచ్ చూడడంలో మునిగిపోయాడు.
బయట ఎండ దంచుతుంది. అలాగే కడుపులో ఆకలి కూడా. ఎంతసేపని ఆగగలడు? ఎప్పుడూ లేనిది హోటల్ గుమ్మం ఎక్కాడు. రోటీ, కపడా ఆవుర్ మంకాన్లో, మనిషికి ముఖ్యంగా కావలసింది ఏమిటే? అంటే .. మొట్టమొదటగా చెప్పేది రోటీ. వీలైతేనే బట్టలు కట్టుకుంటాడు. వీలు కాకపోయినా ఎక్కడో చోట సేదతీరుతాడు. మొదటి ప్రాముఖ్యం మాత్రం తిండికే. ఆకలి మీద ఉన్నాడేమో సుష్టుగా భొంచేసాడు.కడుపు నిండింది.ప్రాణానికి హాయిగా అనిపించింది. మరి ఇప్పుడెక్కడికి వెళ్ళాలి? టైము రెండు కావస్తుంది. ఎండ భరింపశక్యంగా ఉంది. నిలువ నీడ కనిపించలేదు. తన చిన్ననాటి స్నేహితుడు .. ఆచారిగాడి ఇంటికి పోతేనో! ఎప్పటినుంచో రమ్మంటున్నాడు కూడా. ఈ రోజంతా వాడింటిలోనే ఉండిపోవాలి. అప్పటికి గాని కుటుంబయజమాని విలువ తెలిసిరాదు పెళ్ళాం పిల్లలకి. ఆచారి సాదరంగా ఆహ్వానించాడు “ ఈ ఆదివారం ఇలా తీరిక చేసుకున్నావన్న మాట” అంటూ. అప్పటికప్పుడు ‘టీ’ పెట్టించాడు. చక్కటి భోజనం. ఆపై వేడి టీ ఇద్దరూ కలసి చాలాసేపు లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. తెలియకుండా ఉల్లాసంగా చాలాసేపు గడచింది. ఇంతలో సంగమేశానికి ఏదో తెలియని అసౌకర్యం కడుపులో తిప్పినట్టు .. పొట్టఉబ్బినట్లు అనిపించింది. అలవాటు లేని హోటల్ భోజనం వాళ్ళు అన్నంలో సున్నం నీళ్ళు కలుపుతారట. అన్నం ఎక్కువ ఖర్చు కాకుండా. అదే జరిగి ఉంటుంది.
ఆచారి మాటలేవీ బుర్ర కేక్కడంలేదు పోనుపోనూ, కడుపులో గడబిడ ఎక్కువైంది. కూర్చో లేకపోయాడు. సాయంత్రానికి సినిమా ప్రోగ్రాం వేస్తున్నాడు ఆచారి. అయినా, పని ఉందంటూ లేచాడు.
***
టైము మూడున్నర .. పెద్ద శబ్దంతో ‘ధనామని’ గేటు తెరుచుకుంది. అంతే వేగంగా చెప్పులు మెట్లమీదే విసిరేయబడ్డాయి. ఎదురొచ్చిన కూతుళ్ళ వైపు అయినా చూడకుండా .. అమాంతం హాలులో ఉన్న బాత్రూములో దూరిపోయాడు సంగమేశం. గేటు శబ్దానికి మెలకువ వచ్చిన సోమిదేవి గదిలోంచి బయటికి వస్తూ.. “గేటు ఎవరు తీసారు? మీ నాన్నగారు వచ్చారా? అడిగింది పిల్లల్ని ఆత్రుతగా. వచ్చింది భర్తే అయితే బాగుండును అన్నట్లు. “ ఆ వచ్చారు” నవ్వుతూ చెప్పింది రాధిక.
“ వచ్చారా! ఏరీ?” సోమిదేవి ముఖంలో సంతోషం తొంగిచూసింది.
“అందులో” బాత్రూము కం టాయ్లెట్ వైపు వేలు పెట్టి చూపిస్తూ. “ హమ్మయ్యా వచ్చేసారుగా. ఇప్పుడే ఎవరూ ఏం మాట్లాడకండి. బయటికొచ్చిన తరువాత కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వండి” అంటూ పిల్లలకి జాగర్త చెప్పి .. మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది సోమిదేవి. తను ఎదురొస్తే మళ్ళీ ఏం గుర్రు మంటాడోనని. తల్లితోపాటే టీ.వీ చూసే మిషతో రాధిక కూడా గదిలోకి వెళ్ళింది. సోమిదేవి సంతోషంగా పడింది. గుండె నొప్పి కాస్త శాంతించినట్లయ్యింది.“ అవునే. మీ నాన్నగారు .. సాయంత్రానికల్లా ఇంటి కోచ్చేస్తారని ఎలా చెప్పావ్? మనం కాలనీలో నుంచి బయటకు వెళ్ళే దారిలో ఉన్న .. ఆ తుపాకుల బొమ్మలున్న ప్రహరీ గోడ ఇంటి ఓనరు .. ఇలాగే పెళ్ళాం మీద అలిగి ఇంట్లోనుంచి వెళ్లి .. ఆరునెలలు గడచినా ఇంకా ఇంటికి రాలేదట. అలాగే మీ నాన్నగారూ చేస్తారేమోనని భయం పడ్డాను” తన భయాన్ని పైకి చెబుతూ .. కూతురు రాధిక చిన్నదైనా భలేగా ఊహించిందని అబ్బురపడుతూ.
“ఎందుకా! వచ్చీరాగానే చూసావుగా .. ఎవరైనా ఓ పూట భోజనం పెడతారు గాని, ఇలాంటి వాటిలో ‘షేరు’ ఇవ్వరు” చెప్పింది రాధిక జరిగేవి జరగబోయేవి అన్నీ తనకు తెలుసునన్నట్లు. ఇంట్లో ఉండి తండ్రిని బాగానే గమనించింది చెల్లి అనుకుంటూ చిన్నగా రాధిక నెత్తిమీద మొట్టికాయ వేసింది ఉష. అలా సంగమేశం రాక అందరికీ సంతోషాన్నిచ్చింది. జీవితానికి పెళ్ళి ముఖ్యమే. కానీ, పెళ్ళే జీవితం కాకూడదు. చదువు లేని వాళ్ళ మాట ఏమో! గాని .. చదువుకున్న చదువుని సార్ధకం చేసుకుంటూ .. రేపటిరోజు కోసం ఎదురుచూస్తూ విజ్ఞాతగా .. ముందుకు వెళుతున్నారు ఆ ఇంటి అమ్మాయిలు.
|