Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
vijnata

ఈ సంచికలో >> యువతరం >>

స్నేహధర్మం

snehadharmam

‘’బాబు  మోహన్, నిన్ను ఇపుడు ఎందుకు పిలిపించానంటే  ఈవెల్టీ నుండి నువ్వు మా ఇంటికి మా  శ్రీధర్ తో కంబైన్ స్టడీ కి రావాలి. వాడు స్వతహాగా బద్ధకస్తుడు. సరిగ్గా పరీక్ష ముందురోజు కూర్చుని చదివి అత్తేసరు  మార్కులతో పాసవుతాడు.వాడిలో ఎంచూసి వాడితో స్నేహం చేస్తున్నావో తెలీదు గానీ  నువ్ మాత్రం నాకు మరో బిడ్డలా మాయింట్లో కలిసిపోయావు.వాడు ఎలాగైనా పరీక్ష మంచిమార్కులతో పాసయ్యేలా చేసే బాధ్యత నీది.చిన్నవాడివైనా నిన్ను వేడుకుంటున్నాను. నీకు వీలవుతుందా? నేను వచ్చి మీ నాన్నగారిని అడగనా?’’ అన్నాడు వంశీధర్ మోహన్ని ఉద్దేశించి.

‘’అయ్యో.అంత పెద్దమాట ఎందుకు నాన్నగారు? నామాట ఇంట్లో కాదనరు. ఒకవేళ ఒప్పుకోకపోతే అపుడు మిమ్మల్ని నేను మా ఇంటికి తీసుకువెళ్ళి అడిగిస్తాను.,వాళ్ళకి నేను ఎక్కడ ఎలా  చదువుకున్నాను అనికాదు సర్ కావలసింది. నేను పరీక్ష పాసాయి తీరాలి. పాసవకపోతే మాత్రం ఇంట్లోంచి గెంటేస్తారు. ఆవిషయం లో మాత్రం రాజీ పడరు’’ అన్నాడు మోహన్ వినయంగా. అప్పుడే కిచెన్ లోంచి వేడి వేడి పకోడీలు  మూడు పళ్లాలలో తెచ్చి ఇద్దరికీ చెరోకటి ఇచ్చి తానొకటి తీసుకుని మోహన్ పక్కన కూర్చున్నాడు  శ్రీధర్  నములుతూనే.

‘’ ఈవేషాలకేమీ తక్కువలేదు.చూడు. తినాలనుకున్నది మీ అమ్మచేత  అడిగి  చేయించుకు తింటావే. చదువు మాత్రం అలా చదవ్వు!చూడు. మోహన్ ఈవేల్టీనుంచి మన ఇంటికి నీతో కంబైన్  స్టడీకి పంపిస్తానని వాళ్ళ నాన్నగారు కబురు  పంపారు. అతను ఫెయిల్ అయితే నీ స్నేహం పట్టి పాడైపోయాడన్న చెడ్డ పేరే కాదు.  అతని భవిష్యత్తు కూడా పాడుచేసినవాదివి అవుతావు. అందుచేత అతను పాసయ్యేలా చదివించే బాధ్యత నీది. నువ్వూ పాసవుతావో లేదో నీ ఇష్టం ’’ అన్నారు కొడుకు కేసి చూస్తూ కోపంగా చూస్తూ.

‘ఏరా..నిజమేనా?’’అన్నట్టు చూశాడు. శ్రీధర్ మోహన్ కేసి.

‘’ ఏంటి? అలా మొహం పెట్టావ్. చెప్పవయ్యా వాడికి.’’ గదమాయించాడు మోహన్ని వంశీధర్.

‘’అవునురా.పరీక్షలు నెలరోజుల్లోకి వచ్చాయి.ఒక పక్క పగలు  కుప్పలు నూరుస్తున్నారు.అక్కడ కాపు ఉండాలి. రాత్రిళ్ళు వెళ్ళి పొలంలో డుకోవాలి. అవన్నీ చెయ్యాల్సిందే.చదువూ చదవాల్సిందే.అందుకే నాన్నగారు నన్ను మీయింటికి నీతో కంబైన్ స్టడీ కి రమ్మన్నారని మానాన్నతో చెబితే ‘ మా ఏడుపేదో పాలేళ్ళతో మేం ఏడుస్తాంలే. ఈ వంక పెట్టుకుని పాసవ్వకపోయావో తెలుసుగా శిక్ష.నీ బతుకు నువ్వు బతకడమే.ఫస్ట్ క్లాసు లో పాసైతే పై చదువు. లేకపోతే పొలంలో పాలేరుతనం. అది చిన్నతనమనిపిస్తే ఇంట్లోచి పోయి కూలో నాలో చేసుకుని బతకడం.’ అని  ఒప్పుకుని చెప్పి మరీ  పంపించారు. నేను పాసయేలా చదివించే పూఛీ నీదేరా శ్రీధర్.’’ అన్నాడు మోహన్.

‘’ఇప్పటినుంచి ఎందుకు.పరీక్షలు వారం ఉందనగా మొదలెడదాంలే.’’ అన్నాడు శ్రీధర్ విసుగ్గా .

’ ఈవేల్టీనుంచే నాన్నగారు  రమ్మన్నారని  చెప్పేసానురా.మళ్ళీ వెళ్లకపోతే ఇంకెప్పుడూ రానివ్వరు రా. ప్లీజ్ రా.’’అన్నాడు మోహన్ బతిమాలుతున్నట్టుగా.

‘’నీకసలు సిగ్గుందా. తోటి పిల్లాడు చదువుకోవడానికి వస్తానంటే పరీక్షలకు వారం రోజుల ముందు అంటావెంటీ? నువ్వు రా మోహన్. అవసరమైతే నేను మెలకువగా ఉండి చదివిస్తాను. పరీక్షలు పాసవకుండా ఆడంగిలా మీ అమ్మకు పనుల్లో సాయం చేస్తూ వంట బ్రాహ్మడిలా బతికే యోగం నీ ముఖాన రాసి ఉంటే ఎవరేం చేయగలం?’’ అనేసి వంశీధర్ కోపంగా తనపళ్ళెంతో లోపలికి వెళ్లిపోయాడు. దాంతో  రోషం పొడుచుకు వచ్చింది శ్రీధర్ కి.

‘’ సరేరా. ఆయన చదివిస్తానంటున్నారుగా. చదువుకో. నన్ను మాత్రం తిట్టిస్తే వూరుకొను.ముందు అవినాలుగు నోట్లో వేసుకో. చాలా బాగున్నాయ్.’’ అన్నాడు శ్రీధర్ పకోడీలు నములుతూ

‘’ ఒరేయ్. నాది నీలా పెద్ద బుర్ర కాదురా.  ఒకటికి పదిసార్లు చదివితేనే గానీ గుర్తుండదురా.అర్ధం అయితేనే కానీ చదవ బుద్ధి కాదురా.అర్ధం కానిచోట  నువ్వే అర్ధం అయేల చెప్పాలి మరి.’’

‘’నువ్వు చదువుకుని వెలగబెడుతోంటే నేను పడుకుంటే  బతకనిస్తారా? సరే ఏంచేస్తాం. ఏదో చదివి ఈ ఫైనలియర్ అవ్వగొట్టేద్దామ్.ఈవేల్టీనుంచే దయచేయి నాయనా.’’ అన్నాడు విసుగ్గా శ్రీధర్. పళ్ళెం ఖాళీ చేసి కృతజ్ణతలు చెప్పి, రాత్రికి వస్తానని గుర్తుచేసి వెళ్లిపోతున్న  మోహన్ ని చూసి ‘’నా ఖర్మ ‘’ అని విసుగ్గా తలకొట్టుకున్నాడు శ్రీధర్.

******

శ్రీధర్, మోహన్ ల కంబైన్ స్టడీ మొదలైంది. మోహన్ నాలుగు ప్రశ్నలు చదివి ‘’అప్పగించుకోరా’’ అని శ్రీధర్ కి ఇస్తుంటే ‘’ ఇదేం అలవాటురా?’’ అని విసుక్కున్నాడు మోహన్, ‘’చదివింది అప్పగించకపోతే నాకు గుర్తు ఉండదురా. ప్లీజ్.’’ బతిమలాడాడు మోహన్.

‘’నేను వస్తున్నా మోహన్.’’ అని అరిచాడు వంశీధర్.

‘’అవసరం లేదు. నేను అప్పగించుకోగలను.’’ అని ప్రతిసమాధానం చెప్పి  అప్పగించుకున్నాడు శ్రీధర్. ఆశ్చర్యం. ఒక్క పదం పొల్లుపోకుండా చెప్పాడు మోహన్. అలా ప్రతీ పదం మీద దృష్టి పెట్టడం వల్లే  సగం వచ్చేసింది అనిపించింది శ్రీధర్కి..

‘’నీకు వచ్చేస్తే నాకు అప్పచెప్పారా. నేను మూడోసారి చదివినట్టు అవుతుంది.’’ అన్నాడు మోహన్ ఉత్సాహంగా. చిర్రెత్తు కొచ్చింది. ‘’మనమేమన్నా  ఎలెమెంటరీ స్కూల్ పిల్లలం అనుకున్నావా. తింగారోడా?’’ తండ్రికి వినపడకూడదని నెమ్మదిగా అన్నాడు శ్రీధర్. అప్పటికే గుమ్మంలో నిలబడ్డ వంశీధర్ అన్నాడు.’’ అతను ఫెయిల్ అయితే సమాధానం చేఊఉకోవాల్సింది నేను.చదివింది అప్పగించడం, చూడకుండా రాసుకోవడం ఎక్కువకాలం గుర్తు ఉండేందుకు పెద్దవాళ్ళు చెప్పిన మార్గాలురా పెద్ద తింగారోడా. అలా చెయ్యడం నీకు ఇష్టం  లేదేమో గానీ అది సరి అయిన పద్ధతే.చూడకుండా రాస్తే నాకు చూపించవయ్యా.’’

‘’ వాడికి నన్ను కరక్షన్ కూడా చెయ్యనివ్వరా?నేను చేస్తాను. మీరు వెళ్ళండి.నేను కూడా అలాగే చదివి అప్పగించి చూడకుండా రాసి వాడి చేత కరెక్ట్ చేయించుకుని మీకు ఉదయం చూపిస్తాను. సరేనా.మీరు వెళ్ళి పడుకోండి నాన్న. ‘’ అన్నాడు లాలనగా శ్రీధర్.

‘’మాకు అంత ఆదృస్టమ్ కూడాను. చూస్తానుగా.’’ వంశీధర్ అదోలా కొడుకును చూసి లోపలికి వెళ్లిపోయాడు. మోహన్ చూడకుండా రాసిన జవాబులన్నీ పదం పదం చదువుతూ తప్పులు సరిదిద్దే ప్రయత్న చేస్తే...ఒక్క తప్పు కూడా లేకుండా ఉన్నదున్నట్టు రాశాడు మోహన్.  అది అతనికి ఇచ్చేసి ఆలోచనలో పడ్డాడు శ్రీధర్.తాను అతనంత కాకపోవఛ్చు. కానీ తానూ సాధించాలి.ఏమైనా తండ్రికి తనమీద ఉన్న దురభిప్రాయం పోగొట్టాలి. దానికి సాధన అవసరం. పొలంలో కుప్పల నూర్పిడిలో సాయం చేస్తూ... అయిదు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అలిసిపోకుండా  అతను చదూకుతున్న విధానం చూస్తుంటే అసలు తను అతని కాలి గోటికి సరిపోల్తాడా?

‘’మనిషి అనుకుంటె సాదించలేని పని లేదు. నేనూ అతనితో ఆరోగ్యకరమైన పోటీ పెట్టుకుంటాను. ఎందుకు గెలవలేనో చూస్తాను.అయితే తనకి బద్ధకం . ఆ బద్ధకం పోయి తానూ అతనిలా నిరంతరం చదవాలంటే  తాను నిరంతరాయంగా కష్ట పడాలి. కానీ తనకి కాస్తాపడే మనస్తత్వం తక్కువ. అది నిత్యమూ కొనసాగించాలంటే నియయామం తప్పకుండా అతన్ని ఫాలో అవుతానని తనకిష్టమైన  దైవం మీద  ఒట్టు వేసుకోవాలి అనుకున్నాడు శ్రేధర్. తన కిష్టమైన దేవుళ్లందరినీ తలుచుకున్నాడు. వారందరూ కళ్ళముందు నుంచి మాయమై పోయినా ఒక రూపం అతని కళ్ళముందు ప్రశ్నిస్తున్నట్టుగా నిలబడింది. ఆ రూపమే తన తండ్రిది.

అవును తండ్రిని మించిన దైవం...స్నేహితుడు ఎవరు ఉంటారు కన్నబిడ్డకి. అందునా ఈ వయసులో.అందుకే అతను మనసులో తండ్రి రూపం తలుచుకుని  కళ్ళు మూసుకుని ‘’ నాన్నాగారూ.  ఈ క్షణం నుంచి మీ మీద ఒట్టువేసుకుంటున్నాను. మోహన్ తో పోటీ స్థాయిలో చదివి మీరు కోరుకున్న విధంగా మంచి మార్కులతో పాసై మిమ్మల్ని సంతోషపెడతాను.ఇదే కొడుకుగా మీకు ఇచ్చే కానుక.’’  అనుకున్నాడు.

‘’ఏమిట్రా. కూర్చుని నిద్రపోతున్నావ్.ఈ రెండు వ్యాసాలు అప్పగించేసి పడుకోరా.ప్లీజ్.’’ అన్నాడు మోహన్.

ఈ కాస్త సమయంలోనే  ఆరు ప్రశ్నలు చదివి అప్పగించి చూడకుండా రాసి ‘’ఇక నిద్ర వస్తోందిరా. నిద్రావస్తే కునికి పాట్లు మాత్రం పడకు. వెంటనే పడుకో.నీ చదువు నీకోసం. నాకోసం కాదు. అని మా నాన్న అస్తమాను తిడతాద్రా.అందుకే పడుకుంటాను. సరిగ్గా నాలుగు గంటలకు అలారం పెట్టాను.నాకు మెలకువ రాకపోతే లేపు.’’ అనేసి పడుకున్న అయిదు నిముషాల్లోనే నిద్రలోకి జారిపోయాడు మోహన్. ‘’నీకు ఇంత వ్యక్తి గత క్రమశిక్షణ ఉందని నాకు ఇపుడే తెలిసింది మోహన్. నీ అడుగు జాడల్లో నడిచి నేను నాన్నగారిని సంతోశపెడతాను.’’ అనుకున్న శ్రీధర్, మోహన్ చదివియా ఆరు వ్యాసాలను చదివేసి చూడకుండా రాసి తనకు తానే తప్పులు దిద్దుకుని నిద్రకు ఉపక్రమించాడు.

మూడు నెలల తర్వాత...

‘’నాన్నగారు. ఫలితాలు  వచ్చెసాయి. నాకు తొంభై రెండు శాతం, శ్రీధర్ కి ఎనభై మూడు శాతం తో ఇద్దరం పాసయ్యామ్. ఇదంతా మీ సహకారం, ప్రోత్సాహం. మరో శుభవార్త నాన్నగారు. ఇద్దరమూ కెంపస్ లో సెలెక్ట్ అయ్యాము.మీకు ఎలా కృతజ్ణతలు చెప్పుకోవాలో తెలియడం లేదు సర్.’’ అన్నాడు చమర్చిన కళ్ళతో. పిల్లలిద్దరిని ఒకరి తరువాత ఒకరిని కౌగలించుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు వంశీధర్. ‘’ఏమోయ్. పిల్లలిద్దరూ చక్కగా మంచి గ్రేడ్ లో పాసయ్యారు. అంటే కాదు కెంపస్ ఉద్యోగాలు కూడా సాధించారు. ఫ్రీడ్జ్ లో కలకండ్ స్వీట్ పట్రా.’’ అని అరిచాడు భార్యకు వినపడేలా.

‘’అమ్మ పనిలో ఉన్నట్టుండి నాన్నా.నేను తెస్తాను ఉండండి.’’ అంది లోపలికి వెళ్ళి స్వీట్ బాక్స్ తో రాబోతున్నవాడల్లా  శ్రేధర్ తండ్రి  మాటలు వింటూ ఆగిపోయాడు. ‘’బాబూ.మోహన్. నేను నిన్ను ఎంతో శ్రమకు గురిచేశాను. నా కొడుకు చదువులో బద్ధకస్తుడని ఈ ఫైనలియర్ పరీక్షలో ఖచ్చితంగా ఫెయిల్ అవుటాడని భయపడిన నేను మీ నాన్నగారే నిన్ను ఇక్కడకు చదువుకోవడానికి పంపించారని నాకొడుక్కి అబద్ధం చెప్పి రప్పించాను.నా కోరిక మన్నించి నువ్వు నాకొడుకులో  ఆరోగ్యకరమైన మార్పును తీసుకోచ్చావు. మంచి పోటీ ఇచ్చావు . తన  జీవితానికి ఒక మార్గం ఏర్పరుచుకునే ఆలోచన కలిగించావు. నిన్ను స్నేహితుడిగా పొందిన వాడు ఎంతో అదృష్టవంతుడయ్యా. నాకు పెద్దకొడుకుగా నిలబడిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనయ్యా?’’ అంటున్నాడు వంశీధర్ రుద్ధమైన కంఠంతో.

‘’ తప్పు నాన్నగారు.ఇందులో నేను చేసినది ఏమీలేదు. వాడు అందమైన అమాయకుడు.నా ఇంట్లో నాకున్న స్థానాన్ని బాగా అర్ధంచేసుకుని నాకు స్నేహితుడిగా నిలబడ్డాడు.నేను వాడి విషయం లో అదే స్నేహ ధర్మాన్ని పాటించాను. నన్ను వాడు అనుసరించడం నా ఆదృస్టమ్. మీవంటి మంచి మనసు గల తండ్రి కడుపున పుట్టలేకపోయానే అని బాధ పడుతూ ఉంటాను. నన్ను మీ పెద్ద కొడుకుగా ఆదరించారు. ఇంతకన్నా ఏం కావాలి నాకు?’’ అన్నాడు కళ్ళు  చమర్చగా. తన చేతిలోని స్వీట్ పేకెట్ ని తండ్రికి ఇచ్చి మోహన్ ని అమాంతం గాఢంగా  కౌగలించుకున్నాడు శ్రీధర్. ‘’ ఒరేయ్ ..నిన్ను...నిన్నూ...నువ్వు...’’ ఆపైన మాట్లాడలేకపోయాడు.‘’ముందు స్నేహితులిద్దరూ నోరు తీపి చేసుకోండీ. మిగతా ముచ్చట్లు తరువాత.’’ అంటూ సంతోషాతిరేకంతో స్వీట్ పిల్లల నోటికి అందించిన  వంశీధర్ రామలక్ష్మణుల్లాంటి వారిద్దరిని చూస్తూ ఉండిపోయాడు తన్మయత్వంతో.                                                                  

మరిన్ని యువతరం