Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue344/853/telugu-serials/ nee- perutalachina-chalu/nee-peru-talachina-chalu/

 

(గత సంచిక తరువాయి)....“ఏమే సావిత్రీ… పిల్లలు రాలేదేం? ఆరాగా అడిగింది బామ్మ.

“నాకు ఒక్కడే కొడుకమ్మా… ముంబైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.’’ గొప్పగా చెప్పింది అత్తయ్య.

“అంతటి వాడున్నాడే నీ కొడుకూ!’’ బామ్మ అనుకుంది తనలో తానే అనుకున్నట్లుగా. కుశలప్రశ్నలయ్యాక మా పిల్ల జట్టందరినీ పరిచయం చేశారు నాన్న. నన్ను చూసిన తరువాత అత్తయ్య కళ్ళు ఒకింత సంభ్రమంతో మెరవడం నేను గమనించకపోలేదు.

“అన్నయ్యా… నీ కూతురు బంగారుబొమ్మలా ఉంది.” మెచ్చుకుంది అత్తయ్య నా అందాన్ని ప్రశంసిస్తూ. బిడియంగా తల దించుకున్నాను.
    చిన్నత్తయ్య రాక ఆపెళ్ళికి నిండుదనాన్ని తెచ్చింది. ఎన్నో సంబరాలు, సంరంభాల నడుమ పెళ్ళితంతు అట్టహాసంగా ముగిసింది. పెళ్ళికి వచ్చిన బంధువులందరికీ బట్టలుపెట్టారు పెద్దత్తయ్య వాళ్ళు.

నవ్యకి ఎవరి స్తోమతను బట్టి వారు కానుకలు చదివించారు. నవ్య భర్త ఆమెకి తగినట్లే పొడుగ్గా- అందంగా ఉన్నాడు,

పెళ్లిసందడి కాస్త సద్దుమణగగానే చిన్నత్తయ్య బయలుదేరిపోయింది. వెళ్ళేముందు అందరినీ కౌగలించుకుని బావురుమంది. ఎందుకో అర్ధంకాలేదు గాని… చూపులతోనే ఎంతో ఇష్టంగా తడీమింది నన్ను.

“వీలు చూసుకుని ఓసారి రండి శేఖరం…’’ అన్నారు నాన్న కంఠం రుధ్ధమవ్వగా.

“అలాగే బావగారూ… ఇన్నేళ్ళూ సావిత్రి ఈ రోజుకోసమే ఎదురు చూస్తూ తపించిపోయింది..నాకు రావడానికి కుదరకపోయినా మీ చెల్లెలిని మాత్రం తప్పక పంపుతాను.’’ అన్నాడు మామయ్య.నా దగ్గరకొచ్చి బుగ్గలు రెంటినీ పుణికి ముద్దాడింది అత్తయ్య. వాళ్ళ కారు కనుమరుగయ్యేవరకూ చూస్తూండిపోయాము అందరం కూడా.

‘’అన్నీ మంచి రోజులే’ అని నాన్న ఎందుకన్నారో గాని, ఇకముందు నా జీవితంలో అన్నీ దుర్దినాలే. ఈ రోజు ఆ ప్రళయానికి నాంది’’ అని ఆరోజు నాకు తెలియదు. తెలిసుంటే ఆరోజు చిన్నత్తయ్యను కలిసి ఉండేదాన్నేకాదు.

అత్తయ్యను తొలిసారి చూసినప్పుడు మదిలో ఉత్పన్నమైన ఆనందహేల… నా మది రగిల్చే దుఃఖాగ్నికీలగా మారనుందని ఎవ్వరమూ ఊహించలేదు ఆక్షణం. పెళ్ళి హడావుడి సద్దుమణిగి , నవ్య అత్తవారింటికి వెళ్ళిపోయేవరకు ఉండి బామ్మ కోరిక మేరకు చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలన్నీ చూసేసి బయలుదేరాం మేము.

--------------

రోజులన్నీ అతి సాధారణంగా గడచిపోతున్నాయి. మేము ఇంటికి వచ్చేసిన పదిరోజుల తరువాత చిన్నత్తయ్య ఫోన్ చేసింది... తొందరలోనే తాను మా ఊరు రాబోతున్నానని చెప్పింది.  ఆమె అంత హఠాత్తుగా ఎందుకు వస్తోందో నాకైతే బోధపడలేదు. ఆమాటే అమ్మతో అంటే” పుట్టింటికి వచ్చి ఏళ్ళైపోయింది కదమ్మా… అందుకే రావాలనుకుంటోందేమో!’’ అంది అమ్మ నవ్వుతూ.

‘అంతే అయ్యుంటుంది’ అనుకున్నాను. మరి నాలుగు రోజులకి వచ్చిన చిన్నత్తయ్యని సాదరంగా ఆహ్వానించారు నాన్న. అమ్మ ఆప్యాయంగా పలకరించింది.

మామయ్యకి ఏవో ముమ్మరమైన పనులున్నందువలన రాలేదని చెప్పింది చిన్నత్తయ్య. ఆవిడ దిగి ఇంట్లోకి రాగానే డ్రైవర్ అరటిపళ్ళగెల, ద్రాక్షపళ్ళ బుట్ట ఓ రెండు సూట్‌కేసులు తెచ్చి లోపల పెట్టాడు. బామ్మ కూతురిని చూసి పదహారేళ్ళ పడుచుపిల్లలా ఎగురుకుంటూ వచ్చి ఆమెని కౌగలించుకుంది. ఆడపడుచుకోసం ఏవేవో ప్రత్యేకమైన వంటకాలు చేసింది అమ్మ. చిన్నత్తయ్యకి పెరుగు గారెలంటే ఇష్టమని అప్పుడెప్పుడో బామ్మ అందట… అది గుర్తుంచుకుని మినప్పప్పు నానేసి , పెరుగ్గారెలు చేసింది అమ్మ.

అత్తయ్య కళ్ళు సంతోషంతో చెమ్మగిల్లాయి. ఎంత వయసొచ్చినా…పుట్టింట్లో లభించే అవ్యాజమైన ఆత్మీయతానురాగాలు ఆడపిల్లలకి వెలకట్టలేని ఆభరణాలతో సమానం కాబోలు! దానిముందు ఎన్ని ఆస్తిపాస్తులున్నా దిగదుడుపే. మా అందరికీ కొత్తబట్టలు తెచ్చింది అత్తయ్య. నాన్నకి మంచి వాచ్ బహుమతిగా ఇచ్చింది. ఆయనకి ఇప్పటికీ వాచ్ లేదు. కొనుక్కోమని అమ్మ ఎన్నోసార్లు పోరినా అశ్రధ్ధ వలన కొనుక్కోలేదు.

కాని, చెల్లెలు అంత ప్రేమగా వాచ్ ప్రెజెంట్ చేసేసరికి నాన్న సంతోషసంద్రమే అయ్యారు. ఎంతో బాగుందని ఒకటికి పదిసార్లు చూసుకుని మురిసిపోయారు.సాయంత్రం కాఫీలయ్యాక ఏదో విషయం గురించి మాట్లాడాలని అందరినీ రమ్మని పిలిచింది అత్తయ్య.ఇంటిల్లిపాదీ పెరటి వరండాలో  సమావేశమయ్యాము. ఆవిడ మాట్లాడబోయే విషయం ఏమై ఉంటుందోనని అందరిలోనూ ఒకటే ఉత్కంఠ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్