Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
dakshina kailasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

రాత్రి బడి - ఆర్ . సి. కృష్ణస్వామి రాజు

ratribadi
రైతుల రాజ్యమైన ప్రవాళంలోని రైతులందరినీ విద్యావంతులుగా చేయడం  ద్వారా రాజ్యం అభివృద్ధి చెందుతుందని రాజు అయిన పురందర వర్మ భావించాడు. విద్య లేని వాడు వింత పశువు, విద్య కొద్దీ వినయం అని పెద్దలు చెప్పినారు కదా! అని పండితులతో మాట్లాడి రాజ్యమంతా రాత్రి బడులు ఏర్పాటు చేసాడు.

చదువుకుంటే ఏమి వస్తుంది?  చదువుకున్న వాడికి కూడా సేద్యగాడే అన్నం పెట్టాలి కదా అని రైతులు రాత్రి బడులకు వేళ్ళ లేదు.
రాత్రి బడులను రైతులు సద్వినియోగం చేసుకోకపోవడం రాజుగారికి బాధను కలిగించింది. చదువు రాని మొద్దు- కదల లేని ఎద్దు ఒకటే కదా, అన్న విషయం జనాలకు ఎందుకు  బోధపడటం లేదో అర్థం కావడం లేదని మంత్రి మణిచంద్రతో చెప్పి బాధ పడినాడు.

మంత్రి రాజు గారి అనుమతి తీసుకొని ప్రవాళం రాజ్యమంతా పది రోజులపాటు పర్యటించి రాజుకి నివేదిక సమర్పించినాడు. విద్య అనేది ఒక సంపద అని, విద్య ద్వారా పేదరికం అజ్ఞానం అనారోగ్యం వైదొలగుతాయని రైతులు విశ్వసించక పోవడం వల్లనే వారు రాత్రి బడులకు వెళ్లి చదువుకోలేదని తెలియజేశాడు.  రాజుగారు మంత్రి తెలియజేసిన విషయాలను విని అర్థం కానట్లుగా ముఖం పెట్టినాడు.

వెంటనే మంత్రి రాజుగారికి అర్థం అయ్యేట్లుగా చెప్పడానికి సేవకులను పిలిచి మూడు ఇటుక రాళ్లను తెప్పించాడు.వాటిని  మందిరం మధ్యలో తివాచీ పైన ఉంచి అక్కడే ఉన్న నలుగురు  భటులను ఇటుకరాళ్ళపై నుంచి దాటుకొంటూ వెళ్ళమన్నాడు. మంత్రి చెప్పిందే, భటులు గబగబ వెళ్లి ఇటుక రాళ్లను దాటినారు. వెంటనే మంత్రి ఇటుకరాళ్ళను నీళ్ళతో శుభ్రంగా కడిగి, పొడి గుడ్డతో తుడిచి పసుపు పూసి కుంకుమ బొట్లుపెట్టినాడు.  ఇటుకులకు పూలు పెట్టి కర్పూరం వెలిగించి కొబ్బరి కాయ కొట్టి నమస్కరించి నాడు. భటులను పిలిచి మరలా ఇటుకులను దాటమని కోరినాడు. ఐతే భటులు ఎవ్వరూ పూజింపబడిన ఇటుకులను దాటడానికి సాహసించలేదు.  భయం భయంగా దూరంగా జరిగినారు.
అప్పుడు మంత్రి రాజునుద్దేశించి  “రాజా! ఎవ్వరైనా దేనినైనా  నమ్మితే ఎంత దూరమైనా వెళ్తారు. నమ్మకం కుదరక పోతే దగ్గరకి కూడా రారు. విద్య వారి వ్యక్తిగత  అభివృద్ధికి, జీవన  ప్రమాణాల ప్రగతికి  తోడ్పడుతుందని రైతులు నమ్మ లేదు. అందుకే వారు రాత్రి బడులకు వెళ్ళడం  లేదు” అని సవినయంగా చెప్పాడు.

మంత్రి మణిచంద్ర తెలివితేటలకు సభికులంతా చప్పట్లు చరిచినారు.మంత్రి మాటల్లోని లోతు తెలుసుకున్న రాజు వెంటనే గ్రామాలలో హరికథలు బుర్ర కథలు తోలు బొమ్మలాటలు ఏర్పాటు చేసినాడు. ప్రచార సాధనాల ద్వారా కళాకారులు విద్య యొక్క  విశిష్ఠత తెలియజేశారు. రైతులు  విద్య  మేలును  గుర్తించి రాత్రి  బడులకు వెళ్లడం ప్రారంభించారు.  మొదట్లో మనసు పెట్టి చదవడం కాస్త కష్టం అనిపించినా,చదువుల చెట్టుకు వేళ్ళు చేఁదుగా ఉంటాయి,పండ్లు తియ్యగా ఉంటాయి అని తెలుసుకున్నారు.రాత్రి బడులకు వెళ్లి నూతనవ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకొన్నారు. దీనితో  జల సంపద వృక్ష సంపద పశు సంపద పెరిగి ప్రవాళం ఐయింది రాజ్యం సస్య శ్యామలం.                                          
మరిన్ని శీర్షికలు
Kaushik Babu and Ratnaprabala's wedding