Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.....http://www.gotelugu.com/issue347/856/telugu-serials/nee - perutalachina- chalu/nee-peru-talachina-chalu/

(గత సంచిక తరువాయి).... “మనం తొందర పడ్డామేమో శకూ…’’ అర్ధరాత్రి మంచినీళ్ళకని లేచినప్పుడు నాన్న గదిలోనుంచి మాటలు వినబడడంతో ఆగిపోయాను.

 “ఎందుకలా అనుకుంటున్నారు?’’ అమ్మ అడుగుతోంది ఆశ్చర్యంగా.

“ఏమీలేదు… సావిత్రి వచ్చి పిల్లనివ్వమని అడగగానే ముందు వెనకలాలోచించకుండా ఈ సంబంధానికి సై అన్నాము. అబ్బాయి ఎలాంటివాడో ఏమిటో… అని కూడా వాకబు చేయలేదు.

 “మీ రక్తం అయిన మీ చెల్లెలినే సందేహిస్తున్నారా?’’

 “సందేహం నా చెల్లెలి మీద కాదు శకూ…మన అల్లుడిమీద. వచ్చినప్పటినుంచీ చూస్తున్నాను. తుమ్మల్లో పొద్దుగూకినట్లు ముఖం ముట ముట లాడీంచుకుంటు ఉన్నాడుఓ నవ్వు లేదు ఓ మాటాపలుకూ లేదు. అసలు వాడిలో కొత్త పెళ్ళికొడుకు కళ ఏమన్నా కనబడుతోందా! ! ఏదో పోగొట్టుకున్నవాడిలా… అనాసక్తంగా… నాకెందుకో అనుమానంగా ఉంది.’’ నాన్న గొంతు వణికింది.

“మీవన్నీ అర్ధం పర్ధం లేని భయాలే. రోహిత్ కి మనందరమూ కొత్త. కనీసం ముఖ పరిచయమన్నా లేదు. వాళ్ళమ్మ ఉన్నట్లుండి పెళ్ళి చేసేస్తే అతడెలా అడ్జస్ట్ కాగలడు! ప్రతీదీ భూతద్దం లోనుంచి చూడక కాస్త స్తిమితంగా ఆలోచించండి.’’ అల్లుడిని వెనకేసుకుని వచ్చింది అమ్మ.  “అంతేనంటావా!?’ నాన్న అన్నారు.

“ముమ్మాటికీ అంతే…మీరనవసరంగా కంగారు పడక హాయిగా నిద్రపొండి.’’ తెగేసి చెప్పింది అమ్మ. అటుపైన అంతా నిశ్శబ్దం. మెల్లగా వెళ్ళి నా పడక మీద పడుకున్నాను.  నాకెందుకో…నాన్న అనుమానమే నిజమనిపిస్తోంది. చిన్నత్తయ్య అదాటున వచ్చి పెళ్ళి అనగానే ఎగిరి గంతేసి మరీ సిధ్ధపడ్డామే గాని, ఎవరం కూడా బావ గురించి ఆలోచించలేదు. ఒకవేళ బావకి… నేనంటే… అటుపైన ఆలోచించడానికి సాహసించ లేకపోయాను.  వద్దు… వద్దు… ఇలాంటి నెగిటివ్ థాట్స్ కి నా మనసులో తావివ్వకూడదు. ‘యద్భావం తద్భవతి’ అన్నారు. అంతా మంచే  జరుగుతుందని అనుకుంటేనే సుఖంగా ఉండగలము…

మనసులో మొలకెత్తుతున్న ప్రతికూల ఆలోచనలని అక్కడే అదిమేసే ప్రయత్నం చెశాను.

----------------

 ఏం వదినగారూ… పెళ్లైన వెంటనే ముక్తని కాపురానికి పంపేస్తారనుకున్నాను. ఇంకా అట్టే పెట్టుకున్నారేమిటి? ‘’ పరంజ్యోతి వాళ్ళమ్మ, సీతారామయ్య గారి భార్యా అయిన సుందరమ్మ ఆరాలు తీసింది మాకు వాళ్ళకి మధ్యనున్న గోడ దగ్గర నిలబడి.అక్కడే కూర్చు బట్టలుతుకుతున్న నాకు ఆవిడ ప్రశ్నలకి ఒళ్ళు మండింది.

“ఏదీ వదినగారూ… ఇలా పుస్తెముడి పడిందో లేదో… అలా శూన్యమాసం వచ్చింది. పెళ్లైన వెంటనే కాపురానికి పంపేయాలనే అనుకున్నాం. కాని, మా అల్లుడికి ఆఫీసులో తీరికలేనంత పని పడడంతో ఆ ప్రయత్నం వాయిదా పడింది.’’ సంజాయిషీ ఇచ్చినట్లుగా చెప్పుకు పోతోంది.

 “అయినాసరే… ఓమారు తీసుకెళ్లి ఇల్లుమట్టించి తీసుకొచ్చేయవలసింది. వెంటనే ఆ ముచ్చటేదో తీరిపోతే అదో తీరుగా ఉంటుంది. ఇలా వాయిదా పడితే ఏదో… వెలితిగా అనిపిస్తుంది.’’ సుందరమ్మ మాటలు నాలో రేగుతున్న మంటలను ఎగసం తోశాయి. ఆవిడ మీద కోపాన్ని బట్టలమీద చూపిస్తూ బండకేసి దబదబ బాదసాగాను.

అసలీవిడకి ఈ కబుర్లన్నీ దేనికీ! వాళ్లింట సంగతులు మేమేమన్నా అడుగుతున్నామా…పెడుతున్నామా! ఆ మధ్యన పరంజ్యోతికి ఒక సంబంధం కుదిరినట్లే కుదిరి తప్పిపోయింది. ఆ విషయం కర్ణాకర్ణిగా మాకు తెలిసినా సరే… వివరమేమిటని అడగలేదు.జరిగినదానికి వాళ్లు కుమిలిపోతూ ఉంటే ‘ పుండుమీద కారం చల్లినట్లుగా’ ఆ సంగతులని కెలికి మరింత నొప్పించడం ఎందుకని ఊరుకున్నాం. కాని, ఈవిడలా ఊరుకునీ రకంకాదు. బాధ ఎవరికైనా బాధే అన్న ఆలోచన లేకపోగా… నేను కాపురానికి వెళ్ళకపోవడమేదో ఘోరమైన విషయం అన్నట్లుగా వ్యాఖ్యానాలు చేసి పొడుచుకు తింటోంది.

‘ఎద్దుపుండు కాకికి నొప్పా!’ అని ఇందుకే అంటారేమో! నా పిచ్చి గాని, ఎదుటివ్యక్తి స్వవిషయాలలోకి చొచ్చుకుని వెళ్ళి, వాళ్ళ మనసులని కష్టపెట్టకూడదన్న ఇంగింతం అవతల వాళ్ళకి ఉండద్దూ! అయినా ఈ అమ్మ మరీనూ… ఏదో పొడిగా జవాబిచ్చేసి ఊరుకోకుండా, ఏ మాయణమో  మహాభారతమో వినిపించినట్లుగా అన్నీ పూస గుచ్చి మరీ చెబుతోంది. సుందరమ్మ ప్రశ్నావళి అలా సాగిపోతూనే ఉంది.అమ్మ విసుక్కోకుండా చెబుతూనే ఉంది. నాకు నసాళమంటింది. విసవిస నడుచుకుంటూ లోపలికి వెళ్ళి, అక్కడనుంచే అరిచాను “అమ్మా…బామ్మ రమ్మంటోంది.’’పెరటి వసారాలో గడపమీద తల పెట్టుకుని కునుకు తీస్తున్న బామ్మ “ నేనెప్పుడు పిలిచానే?’’ అంది తెల్లబోతూ.

“ష్…ఊరుకో బామ్మా…అలా పిలవకపోతే ఆవిడకి లోపలకి రావాలన్న స్పృహే ఉండదు.ఆ సుందరమ్మ ఏవేవో అడుగుతూనే ఉంటుంది… ఈవిడ హరికథలు వినిపిస్తూనే ఉంటుంది.’’ అన్నాను ఉక్రోషంగా. బామ్మకి విషయం బోధపడింది. సాలోచనగా తలపంకించి, “మీ అమ్మకి లౌక్యం తెలియదే…ఏదో దాటవేసి తప్పించుకోవాలి గాని, ఇలా ఇంటి విషయాలు చెప్పుకుంటారా! వట్టి వెర్రిబాగులది. ‘ సుబ్బీ… అంటే ఉబ్బిపోతుంది.’’ అమ్మమీద జాలి కురిపించింది బామ్మ.

“ఎందుకత్తయ్యా పిలిచారు…’’ అమ్మ వచ్చింది తడిచేతులను కొంగుతో తుడుచుకుంటూ. “ఏమీలేదే శకుంతలా… నీరసంగా ఉంది కాస్త బార్లీజావ కాచిస్తావని…’’ బామ్మ నర్మగర్భంగా నవ్వింది నా వైపు చూసి. “అలాగే అత్తయ్యా’’ అంటూ నా వైపు తిరిగి “ఏమే ముక్తా… మీ బామ్మకి కాసిని బార్లీనీళ్ళు కాచివ్వలేవే?’’ అంది అమ్మ.

“ ఏం నువ్వేం చేస్తావు? గోడ దగ్గర నిలబడి మరిన్ని పోచుకోలు కబుర్లు చెప్పుకునే అవకాశం పోయిందనా నీబాధ!’’ హేళనగా అన్నాను.
అమ్మ నా వైపు మింగేసేలా చూసి “ బాగుందే నీవరసా! ఆవిడకన్నీ తెలుసు… కొత్తగా నేను చెప్పేదేంఉంది?’’ కోపంగా అంది. “ఆహాఁ! అన్నీ తెలిసినావిడకి నువ్వు కొత్తగా సెలవిచ్చేదేమిటి!? “ ఎంత వద్దనుకున్నా నాస్వరంలో వ్యగ్యం పలకనే పలికింది.“ఏమిటే ఆ పెడసరం! ఇరుగు-పొరుగు అన్నాక ఆమాత్రం కష్టసుఖాలు కలబోసుకోమా ఏం?’’ అమ్మ అంది గద్దింపుగా. “ఎంత ఇరుగు-పొరుగులైతే మాత్రం మన పర్సనల్ విషయాలన్నీ వాళ్ళతో చెప్పాలా? ఆవిడలాగే చెప్తోందా అన్నీనూ… అమ్మా నీకిదే చెప్తున్నా… మరొకసారి నా సంగతులు ఆవిడముందు ప్రస్తావిస్తే ఊరుకునేది లేదు.’’ గఁయ్ మన్నాను గొంతుపెంచి. “ఇప్పుడేమైందని అత్తయ్యా… అదలా నా మీద విరుచుకు పడుతోంది!’’ అంది అమ్మ ముఖం మాడ్చుకుంటూ.

“అది అన్నదని కాదు కాని, నువ్వుత్తి అమాయకురాలివే శకుంతలా…దేనికీ గుట్టుగోప్యం లేదు. మన కుటుంబ విషయాలు నలుగురితోటీ చెప్పుకుంటే పలచనైపోతామని దాని బాధ.” బామ్మ అంది నచ్చచెబుతున్నట్లుగా.“ మీరుకూడా నన్నే అంటున్నారూ…అనండి…అనండి…అందరిచేతా మాటలు తినడం నా బతుకైపోయింది.” ముక్కు చీదింది అమ్మ. ఆ క్షణాన అమ్మని చూస్తే జాలి కలిగింది. కాని, ఆపాటి డోస్ పడితే గాని, ఆవిడ మాట వినదు. అసలు నేనేనాడూ అమ్మనంతలా కసురుకోలేదు. నా మీద నాకే కోపం, అసహ్యం కలిగాయి. నేనున్న మానసిక స్థితి అటువంటిది. బావ మీద కలుగుతున్న సందేహాలు నా మనసుని కకావికలు చేస్తూంటే, ఏదో తెలియని ఆందోళన నా మదిని పట్టి కుదిపేస్తూంటే నాకు తెలియకుండానే నాలో కరుకుదనం చోటు చేసుకుంది. అయితే… నావి సందేహాలు కావని, అవన్నీ వాస్తవాలేనని నాకు తెలిసే రోజు అతి తొందరలో వచ్చింది.

----------------------

“కమ్మనీ ఈప్రేమలేఖనీ రాసింది హృదయమే…’’ నా కిష్టమైన రింగ్‌టోన్ వినపడగానే సెల్ తీసి చూశాను. ఏదో అన్‌నోన్ నంబర్. ‘ఎవరై ఉంటారబ్బా…’ అనుకుంటూ ఆన్సర్ చేశాను. “హలో… ముక్తేనా మాట్లాడేది?’’ అవతల నుంచి ఒక అపరిచిత పురుషస్వరం వినిపించింది.

 “ఆఁ…నేను ముక్తనే…మీరెవరో తెలుసుకోవచ్చా?’’ మర్యాదపూర్వకంగా అడిగాను.  “నేను… నేను… రోహిత్ ని” తటపటాయిస్తూనే చెప్పాడతడు.

“రోహితా! ‘’ ఆలోచించబోతే అప్పుడు వెలిగింది…బావ అని. అంతే గొంతు వెళ్ళి కడుపులోకి జారిపోయినట్లనిపించింది. మాట పెగలలేదు. నేనెప్పటినుంచో ఎదురు చూస్తున్న నా బావ పిలుపు…ఈనాడు …ఇలా… గాలి అలలమీద… తేలితేలి… నాకేదో గమ్మత్తుగా అనిపించింది.    తొలిసారి బావ గొంతు చెవులపడగానే ఏవేవో… అనుభూతులు మూకుమ్మడిగా దాడి చేశాయి. 

“గాల్లో తేలినట్లుందే…గుండె పేలినట్లుందే…’’ అంటూ పిచ్చిపిచ్చిగా హమ్ చేయాలనిపించింది.

“హలో… ముక్తా… వింటున్నావా?’’ నా నుంచి ఏ రెస్పాన్సూ లేకపోవడంతో బావకి కంగారు కలిగినట్లుంది.

ఒక్క క్షణంలో తేరుకుని “ఆఁ…వింటున్నాను. చెప్పండి.’’ నేను స్పందించకపోతే బావ ఎక్కడ ఫోన్ పెట్టేస్తాడోనని భయపడ్డాను.

“నీతో మాట్లాడాలి ముక్తా…’’ బావ స్వరంలో ఏ భావాలూ వినబడలేదు. ఆ గొంతు పొడిగా, అభావంగా ఉంది.

“మాట్లాడండి…’’ అన్నాను. ‘ నీ మాటల కోసమే ఈ పిచ్చిముక్త… పడిగాపులు పడుతూ కూర్చుందిక్కడ’ అనుకుంటూ.

“ఫోన్‌లో కాదు. పర్సనల్ గా…’’

“అదెలా? మీరుండేది ముంబై లో కదా!’’ అయోమయంగా అడిగాను.

“లేదు… ప్రస్తుతం నేను వైజాగ్ లో ఉన్నాను.’’

“అయితే ఇంటికి రండి… నాన్న వాళ్ళు కూడా సంతోషిస్తారు.’’ అన్నాను.

“అయ్యో! అలాంటివేమీ పెట్టకు… అసలు… నేనిక్కడికి వచ్చినట్లు అమ్మావాళ్ళకి కూడా తెలియదు.’’ అన్నాడు బావ కంగారుగా. నాకర్ధమైంది బావ ఆంతర్యం… తాను ఇక్కడికి వచ్చిన విషయం అత్తయ్యా వాళ్ళకి, మావాళ్ళకి ఎవరికి తెలిసినా…శూన్యమాసంలో వచ్చావెందుకని చీవాట్లు పెడతారేమోనని బావ భయపడుతున్నాడులా ఉంది. అందుకే… తన రాకని రహస్యంగా ఉంచుదామనుకుంటున్నాడు కాబోలు!
నాలో నేనే ఏవో ఊహాగానాలు చేసేసుకుంటున్నాను. “ముక్తా… నువ్వేమీ అనుకోనంటే… ఇంట్లో ఏదోకటి సర్దిచెప్పి సింహాచలం రాగలవా? అక్కడ మనం అన్నీ డిటైల్డ్ గా మాట్లాడుకుందాము.’’ ప్రాధేయంగా ఆడిగాడు బావ. అతడు నన్ను అంతగా బతిమలాడాల్సిన పనిలేదు. అతడు ఆజ్ఞాపిస్తే…అతడి వెంట నరకానికి వెళ్ళడానికైనా నేను సిధ్ధం.పెళ్ళైన తరువాత మేము కలుసుకోబోయేది ఇదే మొదటిసారి. ఆ కలయిక దైవసన్నిధిలో అయితే బాగుంటుందని ఇలా సింహాచలం ప్రిఫర్ చేశాడేమో! ఏమో అనుకున్నాను గాని, బావ తెలివైన వాడే.
“ఏం ముక్తా… మాట్లాడవూ…ఎనీ ప్రాబ్లం?ప్లీజ్…రేపుదయాన్నే బయలుదేరి వచ్చేయ్. ఎవ్వరికీ చెప్పద్దు…’’

“అలాగే వస్తాను…’’ మనసులో ఏదో బితుగ్గా ఉన్నా మాటైతే ఇచ్చేశాను. అమ్మనాన్నల అనుమతి లేకుండా నేనింతవరకు స్వతంత్రంగా గడపదాటింది లేదు. అందుకే… ఏదో సంకోచం.అంతలోనే మనసు గదమాయించింది … నువ్వేమీ చాటు-మాటు ప్రేమాయణాలు సాగించడానికి  వెళ్లడంలేదు కదా! నీ మెడలో తాళికట్టినవాడి కోరికమేరకు అతడిని కలుసుకోవడానికి వెళ్తున్నావు. దీనికింత కంగారెందుకు?
   అంతరాత్మ ఉపదేశించింది. ఉలికిపడే మనసుని జోకొట్టాను. ఆ రాత్రంతా నాకు కంటిమీద కునుకులేదు.

-------------------  

“అమ్మా… నేను సింహాచలం వెళ్ళొస్తాను.’’ తెల్లవారి పెరటివాకిలి ఊడుస్తున్న అమ్మతో చెప్పాను.చేతిలోని చీపురుని పక్కన పడేసి “సింహాచలమా? ఇప్పుడెందుకు?’’ ఆశ్చర్యంగా అడిగింది అమ్మ.నిజంగానే నాకు చాలా గిల్టీగా అనిపిస్తోంది. అలవాటు లేకపోతే అబధ్ధాలు ఆడడం చాలా కష్టమైన పని. ఏ మాత్రం తేడా వచ్చినా ఇట్టే దొరికిపోతాం.  నేనలా దొరికిపోకూడదని సింహాద్రప్పన్నకి మనసులోనే మొక్కుకుంటూ…” మా ఫ్రెండ్ మంజూష లేదూ…’’ ఉపోద్ఘాతం ప్రారంభించాను. “ఆఁ… ఉందీ… మొన్న నీ పెళ్ళికి కూడా వచ్చిందికదా! ఏమైంది ఆ అమ్మాయికి?’’ అడిగింది అమ్మ ఆదుర్దాగా.“తనకేమీ అవలేదమ్మా…వాళ్ళక్క కొడుక్కి సింహాచలంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తారట…నిన్న రాత్రి ఫోన్ చేసి రమ్మని పిలిచింది. అందుకే… వెళ్లాలనుకుంటున్నాను. స్వామి కార్యం- స్వకార్యం… రెండూ కలిసొస్తాయి.’’ ఠక్కున చెప్పేశాను.

“అలాగా… అయ్యో… ఈ విషయం నిన్నరాత్రే అనుంటే నేను, మీ నాన్న కూడా వచ్చుండేవాళ్ళం కదా!’’ అంది అమ్మ ఆ వరాహ నరసింహ స్వామి దర్శనభాగ్యానికి తాను నోచుకోనందుకు చింతిస్తూ.

“అవుననుకో… కాని, తను నన్నొకర్తినే కదా రమ్మంది?’’ అన్నాను కంగారుగా అమ్మ నాతోపాటుగా ఎక్కడ ప్రయాణం కడుతుందోనని.

“బాగుందిలేవే… దేముడి దగ్గరకు రమ్మనమని ఒకరు పిలవాలా ఏమిటి?’’ కొరకొరా చూసింది అమ్మ నావైపు. గుండెల్లో దడ మొదలైంది నాకు. అప్పుడు వీళ్ళు నాతో పాటు బయలుదేరితే… కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. అందరికీ ‘ టాం…టాం’ చేసినందుకు బావ కోపగించుకుంటాడు ఖచ్చితంగా.

ఏం చెప్పి ఆవిడని ఆపాలా అని ఆలోచిస్తున్నలోపే “అయినా మాకు రావడానికి కుదరదులే…లేడికి లేచిందే పయనమని’ ఉన్నపళంగా నేనెలా రాగలను! బామ్మకి- తమ్ముడికి వంటచేసి పెట్టాలి. ఇప్పటికిప్పుడు కుదిరేపని కాదులే… దేనికైనా ప్రాప్తం ఉండాలి. నువ్వు నాన్నగారి తో ఓ మాట చెప్పేది వెళ్ళు.’’ పక్కన పడేసిన చీపురందుకుని మళ్ళీ తుడవసాగింది అమ్మ. నాన్నగారితో చెబుతున్నప్పుడు కూడా అదే గిల్ట్ నాలో.ఆయన ఏమీ అనకుండా వెళ్లిరమ్మని డబ్బులిచ్చారు. చకచక తయారైపోయి, నా పెళ్లికి పెద్దక్క కొనిపెట్టిన లేత అరిటాకు రంగు ఆర్గంజా చీర కట్టుకున్నాను. నా ఒంటిమీద చేరాక ఆచీర అందం రెట్టింపైంది. మెడలో పెళ్లికి అత్తయ్య పెట్టిన పచ్చలసెట్ పెట్టుకున్నాను. ఎన్నడూ కూడా నేనింత శ్రధ్ధగా అలంకరించుకోలేదు. కాని, తొలిసారి నా ప్రాణానాధుని కలుసుకోబోతున్నాను. సాదాసీదాగా వెళ్తే ఏం బాగుంటుంది! అందుకే ఈ అలంకరణ అంతా. దినేష్ కాంప్లెక్స్ కి వచ్చి నన్ను బస్ ఎక్కించేసి వెళ్ళిపోయాడు.

మనసంతా ఏదో గుబులుగా ఉంది.  సంకేతస్థలంలో ప్రియుడిని రహస్యంగా కలుసుకోబోయే ప్రేయసిలా ఉంది నా మనస్థితి. అగ్నిసాక్షిగా నా మెడలో తాళికట్టిన మొగుడిని ఇలా దొంగచాటుగా కలుసుకోవాల్సిన అగత్యం పట్టింది. ఏమిటో! నా పెళ్ళిమొదలు… నా జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ అత్యంత నాటకీయంగా జరుగుతున్నాయి. మనసులో ఆలోచనలు రొదపెడుతున్నాయి. అసలు… బావ… నన్నెందుకు రమ్మన్నాడు?నాతో ఏం మాట్లాడాలట! నాకు, అతడికి పెళ్లి… అని అనుకున్న దగ్గరనుంచీ నాతో ఒక్కమాట కూడా మాట్లాడనివాడు… ఇలా మాట్లాడాలి రమ్మని అంటే దాని అంతరార్ధం ఏమై ఉంటుంది!  అసలు… పెళ్లిలో కాబోయే బావ్గారిని ఆట పట్టించాలని దినేష్ ఒకటే ఆరాటపడిపోయాడు.ఎన్నో రకాల స్కెచ్ లు గీశాడు. కాని, ఏ సరదాలకి-సరసాలకి తావివ్వని విధంగా గంభీరంగా ఉన్న బావని చూస్తే వాడికి హడలు పుట్టి, కనీసం మాట్లాడడానికి కూడా మొహమాటపడ్డాడు. కనీసం కాశీయాత్ర జరుగుతున్నప్పుడు సైతం బావ ముఖంలో సంబరం కనబడలేదట. పైగా ఉల్లి-బెల్లం రాసినందుకు చిరాగ్గా ముఖం పెట్టాడట.మా పెద్ద బావగారు అలా ఉండరు. వాడితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు. చిన్న బావగారు జోసెఫ్ అయితే చెప్పనే అక్కరలేదు. ఇక రక్తసంబంధీకుడైన ఈ బావ ఇలా… అపరిచితుడిలా మిగిలిపోవడం వాడికి నచ్చలేదు.

“మీ ఆయనేమిటే అక్కా…అంత సీరియస్ గా ఉన్నాడు? అత్తకొడుకని రెచ్చిపోదామనున్నాను. కాని, బావ ఫేస్ చూస్తే…దగ్గరకే పోబుధ్ధి కావడంలేదు. వట్టి మూడీఫెలోలా అనిపిస్తున్నాడు.’’ దినేష్ వాపోయాడు నాదగ్గర.

ఆ క్షణానికి వాడికేదో సర్ది చెప్పాను కాని, బావ వాలకానికి నా మనసూ చివుక్కుమంది.

ఆలోచనల మధ్యన సింహాచలం ఎప్పుడొచ్చిందో గమనింఛనే లేదు. ఇప్పుడు బస్సులు డైరెక్ట్‌గా కొండమీదకే వేయడం వలన దిగి మళ్లీ వేరే బస్ ఎక్కాలన్న టెన్షన్ లేదు. బస్ నేరుగా కొండమీదకి వెళ్లి ఆగింది. నెమ్మదిగా బస్ దిగి బావకోసం దిక్కులు చూస్తూ నిలబడ్డాను.

“వచ్చావా ముక్తా?’’ బావస్వరం వినబడగానే వెనక్కి తిరిగిచూశాను. ఆరడుగుల అందమైన విగ్రహం. పెళ్ళిలో సిగ్గునుంచి అంతగా గమనించలేకపోయాను. బావ అందం అనిర్వచనీయం.ఏదో… బిడియం నన్ను పట్టి వెనక్కి లాగుతూ ఉంటేతల దించుకుని వచ్చానన్నట్లుగా తలూపాను.“పద… అలా కూర్చుని మాట్లాడుకుందాం.’’ అంటూ మళ్లీ కిందికి వెళ్ళే తోవంట కిందికి దిగడం ప్రారంభించాడు నావైపన్నా చూడకుండా.

“ముందు దర్శనం…’’ అంటున్న నాకేసి అదోలా చూసి “ముందు మాట్లాడుకుందాం…అప్పుడే మిగతావి…’’ అంటూ కాస్త దూరం నడిచి రోడ్డు పక్కనున్న గోడమీద కూర్చున్నాడు. బావ వైఖరి నాకు వింతగొలుపుతూ ఉండగా మౌనంగా అనుసరించాను. ఇంతటి అందాలరాశిని… నన్ను చూడగానే బావ ముఖం వెలిగిపోతుందనుకున్నాను. కాని, బావలో ఆ భావనలేమీ కనబడలేదు. ఆ చూపులు ఏవో దూరాలను కొలుస్తున్నంత  దీర్ఘంగా ఉన్నాయి.

నేనూ వెళ్ళి అదే గోడమీద బావకి కాస్త దూరంగా కూర్చున్నాను. కొండపైకి వెళ్తున్న వాహనాలలోనున్న మనుషులు మావైపు విచిత్రంగా చూస్తున్నారేమోనిపించింది. కాసేపు మాట్లాడకుండా కూర్చున్నాడు బావ. గాలిలో తేలితేలి వ్యాపిస్తున్నాయి సంపెంగల సువాసనలు. సింహాచలం సంపెంగలంటే నాకెంతో ఇష్టం. అసలు… ఈకొండ మీద ఉన్న వృక్షసంపద అపారం. నాన్నకి అక్క వరసయ్యే ఒకావిడ ఇక్కడే ఉండేది.అప్పుడప్పుడు చుట్టపు చూపుగా మా ఇంటికి వచ్చిపోయేది. ఆవిడ వచ్చిందంటే మాకు పండగే. పనసపళ్ళు, అనాసపళ్ళు, సంపెంగలు, కనకాంబరాలు, గోరింటాకు ఇవన్నీ మాకోసం తీసుకొచ్చేది. ఆ పనసపళ్ళ రుచే వేరు. అమృతోపమానంగా ఉండేది ఆ పనసతొనల రుచి. ఇదేమిటి! రామాయణంలో పిడకల వేటలా నేనెక్కడికో వెళ్ళిపోతున్నాను…నవ్వుకుంటూ బావ ముఖంలోకి చూశాను.
బావ ముఖం సీరియస్ గా ఉంది. నాకెందుకో భయమేసింది. ఇదేమిటి! బావ ఇలా ఉన్నాడు! అతడి నిశ్చలత చూస్తే తుఫాను ముందరి ప్రశాంతతలా ఉంది.

“అసలు… నిన్ను… ఎందుకు రమ్మన్నానంటే…’’ గొంతు సవరించుకున్నాడు బావ. నేను తదేకంగా అతడి ముఖంలోకే చూస్తూ కూర్చున్నాను. అతడేం చెప్పబోతున్నాడో నా ఊహకి కూడా అందడంలేదు. “నిజానికి…నేనీ విషయం మన పెళ్ళికి ముందే చెప్పుండాల్సింది. కాని, అప్పుడు నాకా ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. కాని, ఇప్పుడు కూడా చెప్పకపోతే నీకు అన్యాయం చేసినవాడినౌతాను.’’ బావ స్వరం మృదువుగా ఉంది.

అయోమయంగా చూశాను. అతడేం చెప్పబోతున్నాడో నాకు బోధపడడంలేదు. కొంపదీసి నేనంటే… అతడికి ఇష్టంలేదని చెబుతాడా !
ఆ ఆలోచనకే గుండె గుభిల్లుమంది.

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్