Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Do you know what !!

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaram

మన దేశం లో ఉన్నన్ని Double standards మరే దేశంలోనూ ఉన్నట్టు వినలేదు, చదవలేదు.. ఏ విషయం తీసుకున్నా ఏదో ఒక వివక్షత కనిపిస్తూనే ఉంటుంది. ఒకలా చూస్తే నోరున్నవాడిదే రాజ్యం… దేవాలయాల్లో చూస్తూంటాము పెద్ద పెద్ద బోర్డులు- ‘Switch off your mobiles’ అని ఒకటీ, ‘Photography not allowed’ అని ఇంకోటీ! అవి మనలాటి సామాన్య మానవమాత్రులకి మాత్రమే వర్తిస్తాయ నుకుంటాను!

ఈ మధ్యన చాలా చానెల్స్ లో ఆంధ్రదేశంలోని రమారమి ప్రతీ దేవాలయం గురించీ ( ఒక్క పెద్ద తిరుపతి తప్ప), ఏదో ఒకపేరు- తీర్థయాత్ర, గోపురం, మాఊరి దేవతలు… ఇంకోటేదో-తో కార్యక్రమం చూపిస్తూనే ఉంటారు. మరి ఆ చానెల్ వాళ్ళని అనుమతించగా లేనిది, మనలాటివారిని కూడా ఫొటోలు తీసికోనిస్తే ఏం నష్టంట? ఏ దేవాలయంలోనైనా సరే, ‘ఫొటోలు తీసికొచ్చాండీ’ అని అడగండి, ఠక్కుమని చెప్పేస్తారు, అక్కడివారు, ‘ లేదండీ కావలిసిస్తే, దేవస్థానం వారు తీసిన ఫొటోలు కావలసిస్తే కొనుక్కోండీ’ అంటారు! ఆ తరువాత ఏ చానెల్ లోనో చూస్తూంటాము, మనని ఫొటోలు తీసికోకూడదన్న దేవాలయం గురించి ఓ కార్యక్రమం, కొసమెరుపేమిటంటే, మనల్ని ఏ పూజారైతే ఫొటోలు తీసికోవద్దన్నాడో. ఆయనే ప్రామినెంటు గా కనిపిస్తాడు!!

అలాగే సెల్ ఫోన్ల విషయంలోనూ- మన దగ్గర ఉన్న సెల్ ఫోన్లు గేటుదగ్గరే తీసేసికుంటారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే, దేవాలయ సంబంధిత అధికారో, లేక పూజారో, ఎవరితోనో సెల్ ఫోనులో మాట్లాడుతూ కనిపిస్తాడు! పోనీ అలాటి దృశ్యమేదైనా రికార్డు చేద్దామంటే, మన కెమేరాలూ, కెమెరా ఫోన్లూ అసలు లోపలికే తీసికెళ్ళనీయరే! బహుశా ఇదే కారణం అనుకుంటాను- వాళ్ళు చేసే దుష్కార్యాలని కెమేరా లో బంధించనీయక పోవడానికే! అంతే కానీ ఆ దేముడి sanctity ఏదో కాపాడదామని కాదు! 

అలాగే తిరుమల లో మామూలు యాత్రీకులకి అదేదో  Dress Code  అని ఉంది కదా, అలాటివి మన  so called  VIP  లకి వర్తించవు.వచ్చినవాడితో, వాడి ప్రమధగణాలు కూడా లోపలకి తోసుకొచ్చేస్తూంటారు. సాంప్రదాయ వస్త్రధారణ అన్నదానికి అర్ధం కూడా తెలిసుండకపోవచ్చు. 

అలాగే ఏ ప్రైవేటు డాక్టరు దగ్గరకైనా వెళ్ళండి, అక్కడో బోర్డు దర్శనం ఇస్తుంది- Take off your shoes/chappals- అని. మనం ఏదో దేవాలయంలొకి వెళ్తున్నట్లు, బుధ్ధిగా చెప్పులో/షూసో బయటే విడిచి లోపలకి అడుగెడతాము. మన ముందరే, ఏ నర్సో, ఏ డాక్టరో బయటకీ లోపలకీ చెప్పులతోనో, బూట్లతోనో తిరిగేస్తూంటారు! మరి,అక్కడుండే రూలు వాళ్ళకి వర్తించదా లేక వాళ్ళవేమైనా దేవతా చెప్పులా? వచ్చే రోగాలేవో ఆ డాక్టర్ల ద్వారానూ రావచ్చుకదా? ఏమైనా అడిగినా, ఈ చెప్పులు బయటకి తీసికెళ్ళం కదా అని జవాబూ…

అలాగే పెట్రొల్ బంకుల దగ్గర ‘Switch off your mobiles’ అనే బోర్డు తప్పకుండా చూస్తాము!అక్కడుండే ఎటెండెంట్లు ఎడా పెడా సెల్ ఫోన్లలో మాట్లాడేస్తూంటారు!ఏం వాళ్ళ ఫోన్లలో ఏమైనా ప్రత్యేకమైన సదుపాయం ఉందా,అంటుకోకుండా ఉండేందుకు! అన్నిటిలోకీ పెద్ద జోకు ఏమిటంటే, ఈ మధ్యన ఓ శ్మశాన వాటికకి, ఓ గ్యాసు గోడౌన్ కీ మధ్యన ఓ గోడ మాత్రమే అడ్డు, ఆ గోడమీద పెద్ద పెద్ద అక్షరాలతో ‘ ‘No smoking’ అని. గోడ పక్కనున్నదేమిటో?

విమాన ప్రయాణాలు చేసినవాడిని కాకపోయినా. అక్కడకూడా అదేదో చెకింగ్ చేసినప్పుడు కొందరికి అస్సలు చెకింగే ఉండదూ.. కారణం వారు అధికారంలో ఉన్నారు కాబట్టి. గుర్తుండే ఉంటుంది, అప్పుడెప్పుడో విమానాల్లో సిగరెట్టు, లైటరూ నిషిధ్ధ వస్తువులని చెప్పినప్పుడు, అప్పటి పౌరవిమానశాఖ కేంద్రమంత్రి ( దురదృష్టవశాత్తూ మన తెలుగు తేజమే… విజయనగర వాశి) ఓ పేద్ద ప్రకటన చేసాడు—నా జేబులో సిగరెట్టూ, లైటరూ ఎప్పుడూ ఉంటాయే నన్నెవరూ అడ్డుబెట్టలేదే..” అని.అదేదో ఘనకార్యం గా భావించడం , మన దేశ దౌర్భాగ్యం. చెప్పొచ్చేదేమిటంటే ఈ చట్టాలూ, రూల్సూ ఆంఆద్మీలకి మాత్రమే వర్తిస్తాయని ఆ బోర్డుల కింద పెద్దపెద్ద అక్షరాలతో రాసేస్తే గొడవుండదు.ఇలా వ్రాసుకుంటూ పోతే ఎన్నెన్నో Double standards. చెప్పేవాడికి వినేవాడెప్పుడూ లోకువే !!

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu