Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly-horoscope- december13th to december 19th

ఈ సంచికలో >> శీర్షికలు >>

గోదారి పలకరింపు సమీక్ష..!! - మంజు

godari palakarimpu book review

 "   వెన్నెల గోదారి పరవళ్ళు ఈ గోదారి పలకరింపులు "

మన తెలుగు భాష గొప్పదనమంతా ఆయా ప్రాంతపు యాసలోనే ఉందని నమ్మే కొందరిలో నేనూ ఒకదాన్ని. మనముండే ప్రాంతపు భాషలోని యాసకు ఉన్న ఒంపుని పలకరింతల్లో చేర్చి స్వచంగా ఆత్మీయతను పంచే వారిలో గోదారి వారిది ఓ ప్రత్యేకత. కల్మషం లేని మనసులకు మారుపేరు గోదారి వారు. ఆ "గోదారి పలకరింత"లను పులకరింతలుగా చేసి అక్షరాలను ఆప్యాయంగా గుమ్మరించిన వర్మ కలిదిండి " గోదారి పలకరింపు " లను మనమూ మనసుతో విందాం. వర్మ చిన్నప్పటి డిమాండ్ ను, మన డిమాండ్ కూడా అదే అనుకోండి అప్పుడు. అదేనండి ఆవకాయ పచ్చడి కలిపేటప్పుడు స్కూలుకి సెలవు కావాలన్న డిమాండ్. ఆవకాయ ముద్దలోని అమ్మప్రేమ, ఆ కమ్మదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. తప్పకుండా ఆవకాయ, One Demand కవిత చదవాల్సిందే. గోదారి మొదటి పలకరింపుకి పులకించాల్సిందే. అందరి ఆవకాయ జ్ఞాపకాలు గుర్తుకు రావాల్సిందే. వరద గోదారి వినయాన్ని, ఒద్దికను చెప్తూ, ఆకాశంలోని వెన్నెల్లో చందమామను తన కొప్పులో ముడుచుకోవడాన్ని వర్ణిస్తూ, అలల హోరులో వేద నాదాన్ని వినిపించే తమ ఇంటి ఆడపడుచు, ఆకు పచ్చని నది గోదారంటారు ప్రేమగా. మిత్రుడు అరుణ్ సాగర్ కి నివాళిగా ఒక సన్నివేశము ఛాయాచిత్రమై ఘనీభభవించింది అంటూ ఆ గురుతులను పంచుకుంటారు.

" చూడు ! నిన్ను తలుచుకోగానే  మంచు కురిసిన తోట ఎలా నీరుగారిపోయిందో ఇప్పటికీ మించి పోయింది లేదు " నీ రాక కోసం ఎలా ఎదురుచూస్తున్నానో చూడమంటూ తన ఆరాధనలో ప్రేమను ఎంత అద్భుతంగా తెలిపారో చెప్పడానికి పై భావాలు చాలు.

" నిద్ర పట్టిన ప్రతి రాత్రీ ఒక మరణం మెలుకువ వచ్చిన ప్రతి వేకువా ఒక జననం.." అంటూ ఎంత చక్కని భావాన్ని అందించారో జనన మరణం కవితలో. రైతు గొప్పదనాన్ని బ్రతుకు బ్రతికించు రైతన్నా కవితలో చెప్తారు. ఆయ్, అలాగేనండి, మరండీ...మాది గోదారండి.. ఈ పలుకులు వినని తెలుగువారు బహు అరుదు. ఆ మాటల్లోని అమాయకత్వం, స్వచ్ఛత తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి లేదు. యాండే మాది గోదారండి రావడం మర్చిపోకండే అంటూ గోదారి పలకరింపు ఓ ఆనందహేలగా వినబడుతుంది. ఆకుపచ్చ కలను అంతరాలు లేని అంతర్వాణిలో మట్టి జ్వరంలో వినిపిస్తారు వైతరిణి నదిని ఆసరా చేసుకుని. !?.,- గుర్తులను వివరిస్తారు ఈ కవితలో సరికొత్తగా. మానసిక పరిస్థితి బాగోని 13 ఏళ్ళ అమ్మాయి చేసిన నాట్యం చూసిన తరువాత అక్కడి దృశ్యాన్ని మన మనసులకు తాకేటట్టుగా, కళ్ళకు కట్టినట్టుగా రాసిన నవ్వుతూ...నవ్వునై కవిత అద్భుతం. ఈ కవిత చదివిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవకుండా ఉండలేరు అని ఘంటాపథంగా చెప్పగలను. activa కవిత యాక్టివ్ గా ఉంది. Feb 14th ఎర్ర గులాబి వర్ణన బావుంది. నదిలో నీళ్ళున్నప్పుడు నాదంటే నాదని కొట్టుకుంటాం. మరి నీళ్ళు లేనప్పుడు ఎవరిదని అడుగుతారు ఏ నది కవితలో. మొండి గోడల జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తెలంగాణా రాష్ట్ర ఖజానా నింపిన బొగ్గుని గుర్తు చేస్తారు బొగ్గు కవితలో. సహచరితో జీవన ప్రయాణాన్ని హృద్యంగా, పదిలంగా తన మనసాక్షరాలతో పొందుపరిచారు ప్రయాణం కవితలో. బంధం దూరమైన ఎడబాటుని తీరని కోరికగా చాలా బాగా రాశారు. వెంకట రమణా సంకట హరణా అంటూ ఎర్రిబాగుల వాణ్ణి, ఎరుకలేని వాణ్ణి ఏడిపించవద్దంటారు. ఐదునొక్కటి అంటూ చావుల వెనుక చేతలను చెప్తారు. ఓరిమిని ప్రశ్నించి, ఓటమిని గెలిపించడం వెనుక అంతరార్థాన్ని పరదేవతలో చెప్తారు. ఆరాత్రికి కవిత ఇద్దరి మధ్య దగ్గరితనాన్ని అందంగా చెప్తుంది. కొల్లేటి ప్రయాణపు అందాలను, మనోహర దృశ్యాలను వదులుకోలేనంటూ ప్రేమగా వర్ణిస్తారు. శేషాన్ని పరిపూర్ణం చేసుకోవడమెలాగో శేషం కవితలో చెప్తారు. సంక్రాతి సందడులను, సంబరాలను పెద్ద పండుగ కవితలో చెప్తారు.  రైతన్న మాఇంటి శివుడు అని కీర్తిస్తారు. సహజ మరణమే సహజ జీవనమంటారు. విరామాన్ని, వలస రైలుని తనదైన శైలిలో చెప్తారు. ఓ ఆలింగనాన్ని తడిసిన పేజీలు ఆరబెట్టి చిత్తు పుస్తకం కుట్టుకోవడమేనంటూ ఓ తాత్వికతని చెప్తారు. మొక్క మోడు కావడం వికృతి కాదు విపత్తులే నేటి ప్రాకృతం అంటారు ఇది మనిషి కాలం కవితలో. ఎవరు చెప్పని పంటబోదు గురించి ఆ.. పంటబోది కవితలో చెప్తారు.

కవి మిత్రునికి నివాళిగా వెళ్ళిపోయావా మిత్రమా కవిత, ఇంతే సంగతులంటూ వందేళ్ళకు మారని చరిత్రను, నాణాలు, పెంకుటిల్లు, ఈసారి ఎవరో, కార్తీక పక్షం, మరమరాలుండ  కవితల్లో అప్పట్లో వాటిలో దాగిన జ్ఞాపకాలను చెప్పడం బావుంది. ఉదయాన్ని ఈ ఉదయం కవితలో వర్ణించారు. అతడెవరో అతడు కవిత చెప్తుంది. అబ్దుల్ కలాం గారి గురించి ప్రవక్త కవిత జనించింది. గోరింటాకు చెట్టు గురించి అద్భుతంగా చెప్పిన కవిత నక్షత్రాలు దూసిన ఆకాశం. వనం నిర్మితమయ్యే చోట మొక్కై పుట్టాలని ఆఖరి కోరిక కలవాడే కవి అంటూ కవికి కొత్త భాష్యాన్ని చెప్తారు. ఒక్క మాటా తూలని ఆమెకి అంటూ ప్రకృతిని గొప్పగా పొగుడుతారు. తలుపుచెక్క మనసుని మన మనసులు తాకేలా చెప్తారు. స్కూల్ బస్, ఆ బస్ లో పిల్లల గురించి పిల్లల కోడి కోరిక కవితలో భలే చెప్తారు. ఓ ప్రేమ కథ కవిత చదవగానే ఓ విషాద వీచిక మనల్నీ తాకుతుంది. సరికొత్తదైన ద్రాక్ష పళ్ళ కూర కవిత బావుంది. కొసరు గుర్తు చేసే కబుర్లు, వృద్ధాప్యం గురించి అబ్బులుకి తెలవకుండా కవిత, రెండక్షరాలుగా మిగిలిపోవాలన్న కోరికను, నదులను, సశేషాన్ని, దగా పడ్డ వృక్షాన్ని, వయసుకు తగట్టుగా కాకుండా మితిమీరిన అలంకరణ చేసుకున్న వారిని చూసి అమ్మను గుర్తు చేసుకున్న కవితగా ఐ లవ్యూ మమ్మీ, శృంగవృక్షం మురళి కి నివాళిగా మురళి కవిత, మంచి పనులు చేసే మంచి మనిషి వేటుకూరి వెంకట శివరామరాజు గారికి వనాన్ని నిర్మిస్తున్న వృక్షం కవిత, అంబులెన్స్ వాహనాన్ని చూసి దానిలోని వారు త్వరగా కోలుకోవాలని దేవుడికి దణ్ణం పెట్టుకోవాలని, పిల్లల మాట దేవుడు వింటాడని అమ్మ చెప్పిందని దండం కవితలో చెప్పడం చాలా చాలా బావుంది.

తేలికైన పదాలతో, చక్కని వచనాన్ని కవితల్లో చొప్పించి, చదువరులను మెప్పింపజేసే కవిత్వం వర్మ కలిదిండి గారిది. గోదారి వారి అమాయకత్వంతో, ఆత్మీయంగా మనల్నిఈ పుస్తకంలోని ప్రతి కవిత ఆకట్టుకుంటుంది. జీవితపు ఆలోచనలను, భావావేశాలను హృద్యంగా సరళమైన శైలిలో రాశారు. ఈ అక్షర " గోదారి పలకరింపు "  కు హృదయపూర్వక అభినందనలు.

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu