Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - ముఫ్ఫయ్యవ భాగం

anubandhalu telugu serial thirtieth Part

"పక్కన అనంత్ ఉన్నాడా?"

"ఆ... ఉన్నాడు..."

"ఫోన్ బావకివ్వు మహీ మాట్లాడాలంటుంది"

క్షణం తరువాత అనంత్ లైన్ లోకి వచ్చాడు.

"బావా మేమొక గంటలో బయల్దేరి అక్కడికి వస్తున్నాం. రాజీవ్ గాంధీ పార్కు ఎంట్రన్స్ దగ్గర మేం ఎదురుచూస్తుంటాం."

"పర్మిషన్ తీసుకుని మీరిద్దరూ ఒక గంట ముందుగా డ్యూటీ దిగి అక్కడికి వచ్చేయండి" అంటూ వెంటనే వివరించాడు నవీన్.

"అలాగే బావా! మేం సరిగ్గా నాలుగున్నరకి అక్కడ ఉంటాం" అంటూ హామీ ఇచ్చాడు అనంత్.

"ఓ.కె. మహీతో మాట్లాడు" అంటూ ఫోన్ మహేశ్వరికి ఇచ్చాడు నవీన్.

కాసేపే వాళ్ళిద్దరూ ఆప్యాయంగా పలకరించుకొని మాట్లాడుకున్నారు. ఆ తరువాత అరగంట ఆగి, ఇంట్లో ఎవరూ చూడకుండా రెడీ అయి, బైక్ మీద విజయవాడకు బయలుదేరారు.

పండిట్ నెహ్రూ బస్టాండ్ కు సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ పార్కు ఎంట్రన్స్ వద్దకు వాళ్ళిద్దరూ చేరుకున్న అరగంటలోపే అక్కడికి వచ్చి ఆటోదిగారు అనంత్, శివానీలు.

అప్పటికే నాలుగు ఎంట్రన్స్ టిక్కెట్స్ తీసుకువచ్చాడు నవీన్.

వాళ్ళు కూడా రావడంతో అంతా పార్క్ లోకి ప్రవేశించారు.

వస్తూనే నవీన్ చెయ్యి పట్టుకున్న శివానీ ఇక పార్కులోకి వచ్చినా ఆ చేయి వదల్లేదు.

అనంత్, మహేశ్వరిల ఆనందానికి అయితే అవధుల్లేవు. ఉల్లాసంగా నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోతున్నారు వాళ్లు.

"బావా ఎక్కడన్నా కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం" అంది అభ్యర్ధనగా శివానీ.

"తొందరెందుకు... ఎక్కడో ఒకచోట వాళ్లిద్దరూ కూర్చుంటారుగా. మనమెళ్లి అక్కడ కూర్చుందాం." చెప్పాడు నవీన్.

"అక్కడే కూర్చుని వాళ్లని ఇబ్బంది పెట్టాలా? మనం వేరే చోట కూర్చుందాం. నీతో మాట్లాడాలి. మనసు విప్పి మాట్లాడాలి."

"నిజమే. ఇంతకుముందు చెల్లాయి మాత్రమే బావను ప్రేమిస్తుంది అనుకునేవాడిని. ఇప్పుడు బావ కూడా చెల్లాయిని ప్రేమిస్తున్నాడని అర్ధమైంది. కాసేపు వాళ్లని ఏకాంతంగా వదిలేస్తేనే మంచిది."

"వాళ్ల సంగతి అలా వుంచు. నువ్వు నన్ను ప్రేమించడం లేదా? లేదు... ఉంటే ఇన్నిరోజులు ఫోన్ చేయకుండా ఉంటావా...?

"అనవసరంగా నింద వేయకు. ఇవాళ కొత్తగా నిన్ను ప్రేమించాలా ఏమిటి? నా మనసులో ఎప్పుడూ నువ్వే ఉన్నావ్. లేదంటే నా ప్రేమకు ఆమోదముద్ర వేయాల్సిన అధికారం నీ చేతిలో ఉంది. ఈ రోజుకీ మనసులో ఏముందో ఖచ్చితంగా నీకు తెలీదు." తనకు తెలీకుండానే నవీన్ కళ్లల్లో కూడా నీరు నిలిచింది.

ఈ క్షణం కోసమే ఈ మధురమైన క్షణం కోసమే అతడు ఇంతకాలంగా ఎదురు చూసింది. దొరకదనుకున్న పెన్నిధి దొరికినంత సంతోషంగా ఆమెను కౌగిట బంధించేసి ప్రేమగా ఆమె నుదురును ముద్దాడాడు.

"ఐ లవ్ యు శివానీ... నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను" అంటూ మాటిచ్చాడు. అది పబ్లిక్ పార్క్ అనే విషయం కూడా మర్చిపోయి కాసేపు అలానే కౌగిట ఒదిగి ఉండిపోయారు. ఇంతలో ముందుకు వెళ్లిపోయిన అనంత్, మహేశ్వరి వెనక్కి రావడంతో ఉలిక్కిపడి, తేరుకుంటూ కౌగిలి విడిపోయారు. నలుగురూ సమీపంలోని పొదపక్కన వచ్చి పచ్చిక మీద కూర్చున్నారు. కొద్దిసేపు యోగక్షేమాలు, కుశల ప్రశ్నలతో గడిచిపోయింది. అంతలో ఉన్నట్టుండి దిగులుగా ముఖం దించుకున్నాడు అనంత్.

"ఏమైంది బావా...?" అంటూ కంగారుగా అడిగాడు నవీన్.

సిగ్గుపడుతూ "బావా"! అమెరికా నుంచి వచ్చిన కొత్తలో మీ అన్నాచెల్లెల్ని పల్లెటూరు వారని, ఫ్యాషనంటే తెలీదని చిన్న చూపు చూశాం. అమెరికా మత్తు వదలగానే ఎంత అనుచితంగా ప్రవర్తించామో తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఇంతకు ముందు మేం బతికిన విధానం వేరు, ఇప్పుడు మేం బతుకుతున్న విధానం వేరు. చాలా మారిపోయాం. ఇంతగా మారిపోయామంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.

అమెరికాలో ఉన్నంత వరకు చదువులు, స్నేహం, సరదాలు ఇదే జీవితం. మేమంటే ప్రాణం ఇచ్చే అమ్మ మాట కూడా వినేవాళ్ళం కాదు. జుత్తు చెరుపుకొని, పిచ్చి పిచ్చి డ్రస్సులు వేసుకొని, బార్లు, డిస్కోథిక్ లు, పార్టీలు, గుంపులుగా బైక్ మీద, కార్లలో తిరగడం, బీర్లు తాగి తెగ గంతులు వేయడం, అర్ధరాత్రి కొంపకు చేరడం అలా బాధ్యతలు అంటే ఏమిటో తెలీకుండా పెరిగాం. అదే జీవితం, అదే ఆనందం అనుకునేవాళ్లం. ఇంకా ఇక్కడికి వచ్చి కూడా మా అలవాట్లు మార్చుకోలేకపోయాం.

నిజమైన ఆనందం ఏమిటో ఇప్పుడిప్పుడే మాకు అర్ధమవుతోంది. ఈ విషయంలో మేం చెడ్డవాళ్లయినా కూడా ఎం.పి. కొడుకు గణపతికి థ్యాంక్స్ చెప్పాలి. వాడి బారినుండి చెల్లాయిని, నన్ను నువ్వు సమయానికి వచ్చి కాపాడి ఉండకపోయుంటే మాలో ఇంతమార్పు వచ్చేది కాదు. ఆ సంఘటన తరువాత నుంచే మాలో మార్పు ఆరంభమైంది. ఆలోచనలు మొదలయ్యాయి. పెదనాన్న, పెద్దమ్మ, అత్తయ్య, మావయ్య మీరందరూ చూపే ప్రేమాభిమానాలు అర్ధం చేసుకోగలిగాం. ఎంతో కష్టంలో వుండి మనశ్శాంతి కోసం డాడీ ఇక్కడికొచ్చినా అర్ధం చేసుకోకుండా మాటలతో ఆయన్ని బాధపెట్టామంటే మేమెంత మూర్ఖంగా ప్రవర్తించామో తలచుకుంటే సిగ్గేస్తోంది" అన్నాడు అనంత్.

"అవును బావా! అన్నయ్య చెప్పింది నిజం" అంది శివానీ.

"పెదనాన్న, పెద్దమ్మ తమ సొంత బిడ్డల్లా తమను చూసుకున్నారు. అత్తయ్య మావయ్య కూడా ఎంతో బాగా చూసుకున్నారు. అవన్నీ ఇప్పుడు అర్ధమవుతున్నాయి మాకు. ఇన్ని బాధల్లో కూడా ఒక విషయం మాకు అర్ధమైంది. అదేమిటో తెలుసా? ఆత్మీయుల్ని ప్రేమగా పలకరించడం, అభిమానించడం. కష్టసుఖాలు పంచుకోవడం. ఐకమత్యంలో ఉండే సుఖసంతోషాలు ఇవన్నీ అర్ధమయ్యాయి. సంక్రాంతి పండగ రోజుల్ని మర్చిపోలేను. తెలుగుదనం ఏమిటో తెలుగు వారి ఆచార వ్యవహారాల్లోని గొప్పదనం ఏమిటో తెలిసొచ్చింది. అమెరికాలో వున్నా మన భాషని, సంస్కృతిని, ఆచార వ్యవహారాల్ని కాపాడుకుంటూ మనం అలాగే ఉండాలని డాడీ ఎందుకంతగా చెప్పేవారో ఇప్పుడు అర్ధమవుతోంది.

త్యాగం, పరోపకారం, దైవభక్తి, ఇతరులకి సాయం చేయడంలో ఉన్న ఆనందం ముఖ్యంగా ప్రేమంటే ఏమిటో తెలిసివచ్చింది" అంది.

"అవును బావా. అప్పట్లో మిమ్మల్ని, పెద్దవాళ్లని లెక్కచేయకుండా మేం చేసిన అల్లరి మా ప్రవర్తనకు సిగ్గు పడుతున్నాం. నా తరపున, నా చెల్లెలి తరపున కూడా మీ అన్నాచెల్లెళ్ళను క్షమించమని అడుగుతున్నాను" అన్నాడు అనంత్.

"బావా! మనలో మనకు క్షమాపణలేమిటి? అంతా మన మంచికే  జరిగింది అనుకుందాం. మనమిలా ఒకర్నొకరు ఇష్టపడుతున్నామని తెలిస్తే అమ్మమ్మ ఎలా సంతోషిస్తుంది తెలుసా..." అన్నాడు నవ్వుతూ నవీన్.

"ఏం లాభం. ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి. అంతా గందరగోళంగా తయారయింది. మొన్నటిదాకా వాళ్ళు, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసి ఆశీర్వదించాలని ఆశపడ్డారు. తీరా మనం ఒకటయ్యేసరికి వాళ్లు బిగుసుకు కూర్చున్నారు." అంది మహేశ్వరి.

"మనం బావామరదళ్ళం. పైగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం. మనమిదే మాట మీద నిలబడితే ఎవరేం చేస్తారు. నాయనమ్మ అమెరికా నుంచి వచ్చేవరకు ఓపిగ్గా ఉందాం. వచ్చాక వీళ్ల సంగతి తనే చూసుకుంటుంది. ఎవరు కాదన్నా నాయనమ్మ మన రెండు పెళ్ళిళ్ళు దగ్గరుండి జరిపిస్తుంది" అంది శివానీ.

"ఓ.కె. పెళ్ళయ్యాక మా చెల్లాయి, నేను మీతోబాటు అమెరికా వచ్చామనుకో అక్కడ మాకేం చూపిస్తారు." వాతావరణం తేలిక చేయడానికి టాపిక్ డైవర్ట్ చేసాడు నవీన్.

"మీరు రావాలేగానీ ఒక్క అమెరికా ఏమిటి బావా యూరప్ కూడా తిప్పి చూపించేస్తాం. ఏమంటావు అన్నయ్యా?" అంది ఉత్సాహంగా శివానీ.

"అవును బావా! చెల్లాయికి నాకు చిన్నప్పట్నుంచి ప్రయాణంలంటే సరదా. మేం చూడని ప్రదేశాలు లేవు తెలుసా?" అన్నాడు అనంత్. తిరిగి తనే చెప్పాడు.

"అమెరికాలో ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ తీరంలోని లిబర్టీ విగ్రహం, న్యూయార్క్ లోని గొప్ప భవంతులు, వ్యాపారకేంద్రాలు, అమెరికా, కెనడా సరిహద్దు లోని నయాగరా జలపాతం, హాలీవుడ్ లోని స్టూడియోలు, వాల్ట్ డిస్నీ వరల్డ్, ఫ్రాన్స్ లోని ఈఫిల్ టవర్, లండన్ లోని బిగ్ బెన్, జర్మనీ లోని బెర్లిన్ గోడ ఒకటేమిటి? మొత్తం చూపించి వేస్తాం. కాని అప్పటికి డాడీ అమెరికాలో వుంటేనే ఇదంతా జరుగుతుంది" అన్నాడు చివరికి.

"అదేమిటి బావా! మావయ్య ఇక అమెరికా వెళ్ళరా?" అనుమానంగా అడిగింది మహేశ్వరి.

"ఏమో! వెళ్లినా మిగిలిన ఆస్థులు అమ్మేసి ఆ డబ్బుతో అమ్మని, నాయనమ్మని తీసుకొని ఇక్కడికే తీసుకువచ్చేస్తారేమోనని అనుమానంగా ఉంది." చెప్పాడు.

"లేదు ఇప్పట్లో అది జరగదు" అన్నాడు నవీన్.

"ఎందువల్ల?" వెంటనే అడిగింది శివాని.

"ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు సహజంగా లేవు. మనకి తెలియని విషయం ఏదోఉంది. అది తెలిసే వరకు మనం కూడా ఎక్కడి వాళ్లం అక్కడ బుద్ధిగా ఉంటే మంచిది. సమయం వస్తే వాటంతట అవే బయటపడతాయి. వాటి గురించి మనం అనవసరంగా బాధపడడం కన్నా అప్పుడప్పుడు మనం కల్సుకుని సరదాగా గడపడం మంచిది."

సరదాగా చాలాసేపు పార్కులో తిరిగారు. కావాల్సినవి కొనుక్కుతిన్నారు. ఎన్నో ఊసులు, ఎన్నో కబుర్లు. ఎనిమిది గంటలకు శివానీ, అనంత్ లను ఆటోలో పంపించేశాక చెల్లెల్ని తీసుకుని బైక్ మీద మున్నలూరు వెళ్లిపోయాడు నవీన్.

అది మొదలు వారానికి రెండుసార్లు నవీన్, మహేశ్వరిలు విజయవాడ ఏదో వంకతో రావడం అటు మున్నలూరులో గానీ, ఇటు డాక్టర్ గోపాల్ కి గానీ తెలియకుండా పార్కులోనూ, సినిమా హాల్లోనూ  ఉత్సాహంగా తమ డ్యూటీలు చేస్తూ, ఓవర్ టైం వర్క్ చేస్తూ మరీ డబ్బు సంపాదించి తండ్రికి ఇస్తున్నారు.

ఇలా మరో పక్షం రోజులు గడిచిపోయాయి.

***

"ఏమిటే అమ్మాయి ఇది? నువ్విలా బెంగ పెట్టుకొని ఒంటికి తెచ్చుకోవడం నాకేం నచ్చలేదు. అనవసరంగా నన్ను కంగారు పెట్టేస్తున్నావ్." కోడలి నుదుటి మీద తడి గుడ్డని తీసి మరోసారి చల్లటి నీటిలో ముంచి, పిండి తిరిగి నుదుటి మీద వేస్తూ మందలించింది అన్నపూర్ణేశ్వరి.

మౌనంగా విని ఊరుకుంది సత్యవతి. రెండ్రోజులుగా ఆమెకు జ్వరంగా ఉంది. మందులు వాడినా ఫలితం కన్పించలేకపోయేసరికి తనకు తెలిసిన చిట్కా వైద్యం ప్రయోగించింది అన్నపూర్ణేశ్వరి.

నిజానికి సత్యవతికి బెంగగానే ఉంది. పిల్లలిద్దరూ ఇండియా వెళ్లారు. భర్త కెనడా వెళ్లాడు. వారం రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్లినవాడు మధ్యలో ఒకటి రెండు సార్లు ఫోన్ చేశాడంతే. తిరిగి ఫోన్ లేదు. తిరిగి రాలేదు. ఏం జరిగిందో అర్ధం కావడం లేదు. పిల్లలు అనంత్, శివానీలు ఎలా ఉన్నారో తెలీదు. వాళ్లు ఇండియా వెళ్లి మూడు మాసాలు దాటిపోయింది. వెళ్లిన కొత్తలో ఏం ఫోన్ చేశారో అంతే! తిరిగి వాళ్లతో మాట్లాడడం వీలుకాలేదు.

మున్నలూరు ఫోన్ చేస్తే వాళ్లు బాగానే ఉన్నారు. చాలా మారిపోయారు. మన పద్ధతుల్లోకి వచ్చేసారు అంటుంటారు. అంతేగాని వాళ్లని పిలిపించి మాట్లాడడం లేదు. ఎప్పుడూ ఏదో సాకు చెప్తారు అసలు వాళ్లు అక్కడే ఉన్నారా? వేరెక్కడికైనా వెళ్ళిపోయారా? అర్ధం కాదు.

ఇదిలా ఉంటే కెనడా వెళ్లిన భర్త ఎంతకీ తిరిగి రాకపోవడం సత్యవతికి కంగారు పుట్టించడమే కాదు. అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం షేర్లు కుప్పకూలి భారీ నష్టం చవిచూసి, మానసికంగా కృంగిపోయి ఉన్న మనిషి ఆయన. ఆ బెంగతో ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే? ఈ ఆలోచనే ఆమెకు వణుకు పుట్టిస్తోంది.

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
duradrustapu dongalu