Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐఏఎస్ పాస్

kittugadu inter fail ias pass

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల...

చింగిచ్చం మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉంటుంది.

ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో విద్య నేర్పిస్తారక్కడ.

మొట్టమొదటి ఉదాహరణ హిందీ మాస్టారు.

ఒక తెలుగు కథతో తన పాఠం మొదలుపెట్టారు.

రాజకుమారుడు... పెద్ద సముద్రం... పెద్ద తిమింగలం... ఇలా ఇంట్రస్టింగ్ గా మొదటివారం గడిచింది. ఎప్పుడెప్పుడు హిందీ క్లాసుకు వెళ్దామా... అని పిల్లలకి అనిపించేటట్లుగా చేశారు... హిందీ మాస్టారు. నెమ్మదిగా 'అ, ఆ, ఇ, ఈ' లతో మొదలుపెట్టి, వత్తులు, గుణకారాలు, మెల్లగా చిన్నచిన్న పదాలను ఎలా కూర్చాలి, ఎలా చదవాలి అనేది అంచెలంచెలుగా విద్యార్థులకే తెలియకుండా వాళ్ల బుర్రల్లోకి ఎక్కించేవారు.

అయితే ఆయన పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం కోరుకునేవాడాయన. అదేమిటంటే 'ఎవడికైనా సరే, తొంభై కంటే తక్కువ మార్కులు వస్తే, తాట తీస్తాను' అనేవాడు.

'దేవులపల్లి రామకృష్ణ శాస్త్రిగారు' తెలుగు పండితులు.

ఒకరోజు ఆయన క్లాసులో, నేలమీద కూర్చున్న కిట్టు రెండు రాళ్లను తీసుకుని, ఆ చేతినుండి ఈ చేతికి మారుస్తున్నాడు. ఇది చూసిన వాళ్ళెవరికైనా అనుమానం వస్తుంది. వీడు 'వినడం' లేదు సరిగ్గా అని...

కాని కిట్టుకి మాస్టారి సౌమ్యత, సరళత, బోధించే విధానం ఎంతగానో నచ్చాయి. జాగ్రత్తగానే వింటున్నాడు. గురువుగారి అనుమానం తీర్చుకోవడానికి... ఆయన కిట్టుని ఉద్దేశించి అన్నారు...

'ఏదీ నేను ఇందాక చెప్పిన పద్యం ఒకసారి చెప్పు?'

కిట్టు, తనకు తెలియకుండానే, ఆయనను అనుకరిస్తూ, ఆయన పద్యం ఎలా చెప్పారో, రాగయుక్తంగా ఎలా ఆలపించారో, అలాగే పద్యాన్ని ఆలాపించాడు. గురువుగారు చాలా ప్రసన్నమైపోయారు.

అప్పటి నుండీ కిట్టుని 'తంబి' అని పిలవడం మొదలుపెట్టారు.

ఈ చిన్న సంఘటన కిట్టు బుర్రలో ఎక్కడో ముద్ర పడిపోయింది.

ఆ చిన్న సంఘటనే భవిష్యత్ లో కిట్టు తీసుకోబోయే కీలక నిర్ణయానికి నాంది పలికింది.

చింగిచ్చం హైస్కూల్ లో ప్రతీ విద్యార్ధీ ప్రతీ సబ్జెక్టుకి నోట్స్ రాయాలి. మాస్టార్లు దగ్గరుండి గంటలకొద్దీ నోట్స్ రాయించేవారు. రాశారా... లేదా...? అని పరిశీలించి, సంతకాలు పెట్టేవారు.

'రాయడం' అనేది చాలా ముఖ్యవిషయం.

రాస్తూ ఉంటే చదివినట్లు కూడా... మనకు తెలియకుండానే గుర్తుండిపోతుంది.

ఇలా నోట్సు రాయడం కిట్టుకి భవిష్యత్తులో ఎంతో మేలు చేసింది.

విద్యార్ధులతో నోట్సు రాయించటమే కాదు, క్లాస్ బయటకు వీళ్లని తీసుకెళ్లి, ప్రశ్నలు, సమాధానాలు, ఒక విద్యార్ధి ఇంకో విద్యార్ధికి అప్పజెప్పేలా చేసేవారు. పదాలు, వాటి అర్ధాలు రాయించి క్లాసులో అందర్నీ వరసగా అడిగేవారు.

సైన్స్ మాస్టారు, ఇంగ్లీష్ చాలా స్టైల్ గా మాట్లాడేవారు.

ఒకరోజు కప్పని కోసి, ఓపిగ్గా అన్ని క్లాసులకి తిరిగి దాని గురించి వివరించారు.

ఆ తర్వాత విద్యార్ధులు ఆ విషయం మాట్లాడుకుంటూ..

'అరే! సైన్సు మాస్టారు కోసిన కప్పని మళ్లీ తిరిగి కుట్టేశారంట...

అది కళ్ళు తెరిచి చూసి, లేవడానికి ప్రయత్నించి మళ్లీ పడిపోయిందంట...'

కాసేపటికి లేచి, చెరువులోకి దూకి ఈదుకుంటూ వెళ్లిపోయిందంట" అని చెప్పుకున్నారు.

కిట్టుకి లెక్కలంటే ముందు నుండీ భయం.

స్కూల్లో కూడా హోం వర్కు చేయకపోవడం, లెక్కల మాస్టారితో తిట్లు తినడం షరా మామూలే.

మాస్టారు బాగా చెప్పినాగానీ, విద్యార్ధి బుర్ర రెడీగా లేనప్పుడు చెప్పిన విషయాలు బుర్రకెక్కవు.

***

కిట్టుకి కథలంటే చాలా మక్కువ.

చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు వంటి కథల పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. ఇంటి దగ్గర ఉన్న అంగట్లో పొట్లాలు కట్టడం కోసం తూకం వేసిన వార పత్రికలు, న్యూస్ పేపర్లు, ఆ అంగడి అరుగు మీద కూర్చొని చదువుతుండేవాడు కిట్టు.

'ఆంధ్రప్రభ పత్రిక' లోని 'బాలప్రభ శీర్షిక' న చక్కని కథలు వేస్తుండేవారు. అవి ఎంతో ఇష్టంగా చదివేవాడు కిట్టు. సరుకులు కొనుక్కెళ్ళడానికి వచ్చిన గ్రామస్థులు ఒకళ్ళతో ఒకళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు 'ఈ పిల్లాడు ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం పట్టుకుని చదువుతూనే ఉంటాడమ్మా' అని. పక్కనే ఉన్న 'గొరగనమూడి'కి నడిచివెళ్ళి, అద్దె పుస్తకాలు తెచ్చుకునేవాడు కిట్టు.

మధుబాబు రాసే డిటెక్టివ్ నవలల్లోని హీరో 'షాడో' గురించి చదువుతూ, ఆశ్చర్యానందాలతో అందులో లీనమైపోయేవాడు. 'డిటెక్టివ్ నర్సన్, డాగర్, టైగర్, కాట్' వంటి హీరోలు చేసే అద్భుతాలు చదువుతూ మైమరచిపోయేవాడు. 'బ్లాక్ అండ్ వైట్' కామిక్ పుస్తకాలు దొరుకుతుండేవి. మాంత్రికుడు మాండ్రేక్, టార్జాన్, ఫాంటమ్ ల సాహసాలు బొమ్మల్తో సహా చదివితే ఎంతో సంతోషంగా ఉండేది కిట్టుకి.

పుస్తకానికి రోజుకి పావలా అద్దె చెల్లించేవాడు.

పాకెట్ సైజులో మందంగా ఉండే కథల పుస్తకాలు వస్తుండేవి. అందులో... రాజా విక్రమాదిత్యుల వారి కుమారుడు, రాజకుమారుడు విక్రమ్, అతని స్నేహితుడు మరియు మంత్రిగారి కుమారుడు విజయ్ లు కలిసి చేసే సాహసయాత్రలు, లోయలు, గుట్టల్లో వాళ్లు ఎదుర్కొన్న వింత ఆకారాలు, వాటితో వీళ్ళిద్దరూ చేసే ఒళ్ళు గగుర్పొడిచే కత్తియుద్ధాలు కిట్టుకి ఎంతగానో నచ్చేవి.

ఇవన్నీ 'సోది' పుస్తకాలు అని కొట్టిపారేయొచ్చు. ఆ సోది కూడా కనబడని ప్రయోజనాన్ని కలగజేస్తుంది.

ఎలాగంటే...

ఒకచోట కూర్చొని అదేపనిగా చదవడం, అక్షరాల వెనుక కళ్ళని పరుగులు తీయించడం, మనిషికి తెలియకుండానే అలవాటవుతుంది.

ఈ అలవాటే కిట్టుకి చాలా సహాయకారిగా నిలబడింది.

ఇతర పుస్తకాలు చదవడం వల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంది.

అదేమిటంటే...

హైస్కూలులో ఒకరోజు సైన్సు మాస్టారు ఒక ప్రశ్న వేశారు.

"శరీరంలో నల్లదనానికి కారణమయ్యే పదార్ధం ఏమిటి?"

ఇది సిలబస్ లో ఎక్కడా లేదు. ఈ విషయం మాస్టారికి కూడా తెలుసు....

ముందుగా క్లాసంతటికీ తెలివైన నెంబర్ వన్ విద్యార్ధి వైపు చూస్తూ, వేలితో సైగ చేశారు మాస్టారు...

ఆ విద్యార్ధి సైలెంట్ గా లేచి నిల్చున్నాడు... సమాధానం లేదు. అలాగే నిలబడమన్నారు మాస్టారు.

తర్వాత ఇంకో తెలివైన విద్యార్ధి... నిలబడ్డాడు...

ఆ తర్వాత ఇంకో విద్యార్ధి... నిలబడ్డాడు... ఎవర్నీ కూర్చోండి అనడంలేదు మాస్టారు...

ఆడపిల్లల్లో తెలివైన వాళ్లూ, తెలివైన వాళ్లుగా గుర్తించబడ్డ వాళ్లూ ఉన్నారు. వాళ్లు కూడా అందరూ ఒకరికొకరుగా లేచి నిలబడ్డారు...

మాస్టారికి పట్టుదల పెరిగింది...

నెక్స్ట్... నెక్స్ట్... అంటూనే ఉన్నారు.

వరసగా క్లాసులోని 'యాభై తొమ్మండుగురు' లేచి నిలబడ్డారు. చివరగా గుర్తింపులేని కిట్టూ మిగిలాడు.

ఓ... కే... సమాధానం ఏమిటంటే... అన్నారు మాస్టారు.

కిట్టులో చలనం వచ్చింది. సార్... నేను సార్... అన్నాడు.

అరే... వీడు చెప్తాడంట... వినండిరా... వ్యంగ్యంగా అన్నారు మాస్టారు.

మాస్టారి వ్యంగ్యానికి కారణం ఉంది. కిట్టు క్లాసులో ఏవరేజ్ కంటే తక్కువ. తెలివి అంతంత మాత్రం.

ఆకారం... రూపం... అంతంత మాత్రం... పిల్లలంతా పకపకా నవ్వారు. క్లాసులో నెంబర్ వన్ నుండి నెంబర్ టెన్ వరకూ చెప్పలేనిది... వీడేం చెప్తాడు? అనుకున్నారు అందరూ...

కిట్టు పైకి లేవకుండానే కూర్చొనే 'మెలానిన్' అన్నాడు.

'సరియైన సమాధానం చెప్పేవాడు నిలబడడు, చెప్పలేకపోతే నిలబడతాడు' ఇది క్లాస్ రూం రూల్...

క్లాసులో నవ్వులింకా ఆగలేదు.

మాస్టారి చెవికి మాత్రం సమాధానం అందింది. ఆయనకు నమ్మబుద్ధి కాలేదు.

ఏంట్రా... మళ్ళీ చెప్పు? అన్నారాయన.

కిట్టుకి భయం వేసింది. కొద్దిగా ఆలోచించాడు. తప్పయితే అయ్యింది... ఎప్పుడూ తినే బెత్తం దెబ్బలే కదా... కొత్తగా ఏం పోయింది?

'మెలానిన్' సార్... అన్నాడు.

'కరెక్ట్' అన్నారు మాస్టారు.

క్లాస్ లో ఆశ్చర్యం వ్యక్తమయింది. వీడికెలా తెలుసు?

ఆ... ఏదో అనుకోకుండా ఒక సమాధానం తగిలిందిలే వీడికి అనుకున్నారు. ఇంతలో బెల్ కొట్టారు. పిల్లలందరూ పొలోమని బయటకు పరుగులుపెట్టారు.

ఇంతకీ విషయం ఏమిటంటే...

కిట్టుకి పత్రికలు చదవడం అలవాటు కదా... ఒకరోజు ఆంధ్రప్రభలో 'ఫెయిర్ అండ్ లవ్లీ' అడ్వర్ టైజ్ మెంట్ చూశాడు కిట్టు. అది రాసుకుంటే తెల్లగా అయిపోవచ్చని రాశారు. నల్లగా ఉండే కిట్టుకి తెల్లగా అయిపోవాలని కోరిక. అందుకని శ్రద్ధగా అడ్వర్ టైజ్ మెంట్ అంతా చదివాడు.

ఆ విధంగా తెలిసింది మెలానిన్ కథ.

*****

పల్లెటూళ్ళల్లో ఒక మనిషిని చూడగానే అతని రూపురేఖల్ని బట్టిగానీ, అవతారాన్ని బట్టిగానీ, వెంటనే ఒకపేరు పెట్టేస్తారు. అసలు పేరు కంటే ఈ రెండో పేరుతోనే ఆ మనిషిని ఎక్కువగా పిలుస్తారు. అలాగని ఆ మనిషిని అవమానించాలనే ఉద్దేశ్యం ఎవరికీ ఉండదు.

అదొక అలవాటు... అంతే...

ఒకడికి ముందు పళ్ళు ఎత్తుగా, ముందుకు పొడుచుకు వచ్చి ఉన్నాయి. వాడికి 'తాట్ర్ పళ్ళోడు' అనే పేరు వచ్చింది. తాట్ర్ - అంటే ట్రాక్టరు. ట్రాక్టర్ అని స్పష్టంగా పలకడం కష్టమని... తాట్ర్ అంటారు. ఊర్లలో ఎక్కువ వినియోగంలో ఉండేది ట్రాక్టర్, అది అందరికీ చిరపరిచితం, రోజూ చూస్తూనే ఉంటారు. ట్రాక్టరు ముందు నిలబడి చూస్తే దాని ముఖం మీద పెద్దసైజు పళ్ళలాగా కనబడుతుంది. దానితో ఇతని పళ్ళను పోల్చేసి, ఆ పేరు ఖాయం చేసేశారు.

ఒకామె సన్నగా, పక్షిలాగా ఉంటుంది.
ఊర్లల్లో పక్షుల్ని 'పిట్టలు' అంటారు. ఆమె 'పిట్టలాగా ఉంది కాబట్టి ఆమెను 'పిట్రూపి' (పిట్ట+రూపి=పిట్రూపి)' అంటారు.
ఒకడి నాన్న పేరు 'వెంకడు'... వెంకడి కొడుకు పిల్ల వెంకడు... అందుకని వెంకడి కొడుకు పేరు 'పిల్లెంకడు' (పిల్ల+వెంకడు).
బాగా నల్లగా ఉండేవాడి పేరు నల్లోడు... తెల్లగా ఉండేవాడి పేరు పండుగాడు...
ఆడపిల్ల అయితే పండు
తెలివితేటలు తక్కువున్న ఆడపిల్ల పేరు పిచ్చమ్మ...

ఒకడి పీక (అంటే మెడ. దీన్ని బూర అని కూడా అంటారు) సన్నగా ఉండి, ముందు వైపు బూర ముందుకు పొడుచుకుని వచ్చి 'క్లియర్'గా కనబడుతుంది. వాడికి "పీకడు" అనే పేరు ఖాయం అయింది.

ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా ఔను, కాదు అనే మాటలు తప్ప ఇంకేమీ వాడని వాడిని 'కొండమ్రుచ్చు' (కోతి)తో పోల్చి, 'ముచ్చోడు' అంటారు.

ఈ పేర్ల వెనక వ్యంగ్యం ఉన్నా లేకపోయినా, పిలిచే వాళ్ళ మనసుల్లో ఏ కల్మషం లేకుండా, బాధించే ఉద్దేశం లేకుండా పిలుస్తుండటంతో... పిలిపించుకున్నవాడు అస్సలు బాధపడడు...

పైగా ఈ పేర్లు ఎంతగా అలవాటైపోతాయంటే... అసలు పేరుతో పిలిస్తే వాడు చచ్చినా పలకడు. ఎవర్నో పిలుస్తున్నాడనుకుంటాడు. పాపులర్ పేరుతో పిలిస్తే ఠకీమని పలుకుతాడు.

****

గ్రామాల్లో 'సంస్కృత' భాష విరివిగా వాడబడుతుంది.

సంస్కృతం అంటే అసలుసిసలైన 'దేవభాష సంస్కృతం' కాదు.

బూతు మాటలను ముద్దుగా ' సంస్కృతం' అంటారు.

ఏదన్నా ఒకమాట మాట్లాడితే దానికి ముందో వెనకో ఒక బూతు మాట ఉండాల్సిందే...

ఈ విషయం వేరే వాళ్లకి విచిత్రంగా ఉంటుంది. కానీ గ్రామాల్లో ఇది సర్వసాధారణం.

అది గ్రామవాసుల జీవన స్రవంతిలో ఒక భాగం. ఎవర్నో నొప్పించాలని కాదు. అదొక అలవాటు.

'జననాంగాల' మీద ఉండే మాటలు, 'రతి'కి సంబంధించిన మాటలు గ్రామవాసుల అనుదిన సంభాషణల్లో చోటు చేసుకుంటాయి.

ఈ బూతు మాటల మీదొక జోక్ ఉంది.

'కడపరెడ్లు' ఈ సంస్కృత భాషని విరివిగా వాడతారు.

'ఒక రెడ్డిగారికి అతని తల్లిదండ్రులు, 'నాయనా నీవు కాలేజీకి వెళ్ళి, నీ మరదల్ని ఇంటికి తీసుకురా, అందరం కలిసి ఒక శుభకార్యానికి వెళ్ళాల్సి ఉంది' అని చెప్పి పంపించారట... ఈ రెడ్డి గారు వెళ్లి కాలేజీలో పర్మిషన్ తీసుకుని, మరదల్ని బయటకు తీసుకుని వచ్చారంట... అమ్మాయి నెమ్మదిగా నడుస్తుందట...

'తొందరగా నడువు, అవతల బస్సు వెళ్ళిపోతుంది, ఆలస్యమైతే మనం వెళ్లినా అనవసరం' అనేమాట, ఆ అబ్బాయి తన మరదలికి ఘాటైన సంస్కృతం జోడించి చెప్పాడట... ఆ అమ్మాయికి తెలిసిన విషయమే... అయినా గానీ... చాలా ఇబ్బందిగా ఫీలయ్యి... ఇంటికి వెళ్లిన తర్వాత అత్తయ్యగారికి కంప్లైంట్ఇచ్చిందట... అత్తయ్యగారు మావయ్యతో చెప్పి, అబ్బాయిని మందలించమన్నారట...' మావయ్యగారి కోపం తారాస్థాయికి చేరుకుందట... "ఎన్నిసార్లు చెప్పినా మాట వినడువాడు" అనే మాటకి మరింత ఘాటైన బూతులు జోడించి తిట్టాడంట...

ఈ కర్ణ కఠోరాన్నిభరించలేక, ఆడవాళ్ళిద్దరూ చెవులు మూసుకుని బయటకు పారిపోయారంట...

మోటు మనుషులే కాదు...
ఉన్నత విద్యావంతులు కూడా ఈ సంస్కృతాన్ని విరివిగా వాడతారు. పెన్నాడ ఆగ్రహారం పక్కనే భీమవరంలో ఉన్న 'దంతులూరి నారాయణ రాజు' కళాశాల. 'పశ్చిమగోదావరి జిల్లా' కే తలమానికం. కళాశాల ప్రిన్సిపాల్ గారు బంగార్రాజు గారు... 'ఆరడుగుల ఆజానుబాహుడు', ఉన్నత విద్యా సంపన్నుడు. ఆయన కోటు వేసుకుని కళాశాలలో తిరుగుతూ ఉంటే విద్యార్ధులంతా హడలిపోయేవారు. ఎవరన్నా స్టూడెంట్స్ క్లాసుకు వెళ్లకుండా 'టైమ్ పాస్' చేస్తున్నారని ఆయనకి అనిపిస్తే... దగ్గరకు వెళ్లి చడామడా తిట్టేసేవారు. ఆ తిట్లలో 'సంస్కృతం' ఉండి తీరేది. ఈ తిట్లకు లింగ భేదం లేదు...

అంటే ఆ స్టూడెంట్ 'ఆడపిల్లయినా, మగవాడయినా' ఆయన లెక్క చెయ్యడు.

ఆయన దృష్టిలో అందరూ సమానమే...

కొంతమంది స్టూడెంట్స్ ఈ తిట్లను భరించలేక వాళ్ల వాళ్ల తల్లిదండ్రులతో మొరపెట్టుకున్నారట...

తల్లిదండ్రులు ఒక బృందంగా వెళ్లి, ప్రిన్సిపాల్ గారిని కలిసి, విషయాన్ని విన్నవించి, బూతుల వాడకాన్ని విసర్జించాల్సిందిగా కోరారట...

ప్రిన్సిపాల్ గారు అంతా విని, తన విచారాన్ని ఈ విధంగా వ్యక్తం చేసారట...
 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
agent ekamber