Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agent ekamber

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాప్ అవుట్ గాడి ప్రేమ కథ

o college dropout gadi prema katha

ప్రపంచాన్ని ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చిన ఫేస్‌బుక్‌ సృష్టికర్త జుకెర్‌బర్గ్‌ ఏం చదివారు?
మైక్రోసాప్ట్‌ దిగ్గజం బిల్‌గేట్స్‌ కాలేజ్‌ డ్రాపువుట్‌...
మెక్సికో బిలియనీర్‌ కార్లోస్‌ స్లిమ్‌ ఏం చదివాడు?

అంత మాత్రం చేత చదువు అక్కర్లేదని కాదు. ''ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిందే''

మనదేశమంతటా ప్రజలు చదువుకొనే ఉంటే ఈ రోజు దేశాన్ని దోచుకుంటున్న ఈ నాటి పార్టీలని, ఎంపీల్ని, ఎంఎల్యేల్ని ఎవరైనా ఎన్నుకుంటారా?

నిరక్షరాస్యత మూలంగానే ఆర్థిక నేరస్తులని తెలిసికూడా ఇవ్వాళరేపు ఎవరు తినటం లేదంటూ ఓట్లేస్తామంటుంటే దేశం ఏమైపోతుంది? భవిష్యత్‌ తరాలకు ఏం మిగులుతుంది?

కేవలం నిరక్షరాస్యత మూలంగానే మనమింకా సమస్యల్లో మగ్గుతున్నాం.
నిరక్షరాస్యత మూలంగానే రూపాయి నానాటికి దిగజారిపోతోంది.
కనుక చదువూ ముఖ్యమే. సమయస్ఫూర్తి ముఖ్యమే.
ఈ రెండూ జతకడితే ఆ దేశం ఎంత ఎత్తుకయినా ఎదుగుతుంది.

చదువుకొనే అవకాశాలు లేక కొందరు, చదువు మీద ఆసక్తి లేక మరి కొందరు స్కూల్‌ డ్రాపవుట్స్‌, కాలేజి డ్రాపవుట్స్‌గా రోడ్డుమీద పడ్డా తాము ప్రయాణించదల్చుకొన్న మార్గానికి బంగారంతో తాపడం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

ఇంకొందరు తమ చదువుకి సమయస్ఫూర్తిని జోడించుకొని ప్రపంచ వినువీధుల్లో విజయకేతనం ఎగురవేస్తున్నారు.

***

"ఏమండోయ్‌ వినబడుతుందా? నా మాటలు మీకు విన్పిస్తున్నాయా?''

కిచెన్‌లోంచి మ్యూజికల్‌ అలారంలా భార్య ప్రశాంతి గొంతు వినిపించింది. చదువుతున్న న్యూస్‌ పేపర్‌లోంచి తలెత్తకుండానే నొసలు విరిచాడు గోవిందరావు.

''నాకింకా చెముడు, మూగవంటి అవలక్షణాలేమీ రాలేదు, నీ అరుపులు నాకు చక్కగా, బాగానే వినబడుతున్నాయి'' బదులిచ్చాడు.
ఆయన బదులిచ్చిన రెండో నిముషంలోనే అట్లకాడ చేత్తో పుచ్చుకుని విసవిసా బయటికొచ్చేసింది ప్రశాంతి.

సుమారు నలభై అయిదు, ఏభై మధ్యవయస్కురాలు ఆవిడ, వయసుకు తగిన లావు, పసిమిరంగు ఒళ్ళు, అర్ధరూపాయంత కుంకుమబొట్టు, చేతులనిండుగా గాజులతో నిండయిన విగ్రహం ఆమెది. చెంపలవెంట జుత్తు తెల్లబడుతోంది.

గోవిందరావు వయసు ఏభై, ఏభై అయిదు మధ్య వుంటుంది. ఆరడుగుల ఆజానుబాహుడు. దబ్బపండు రంగులో, దృఢమైన బాడీ, బట్ట తల, గోల్డ్‌ఫ్రేం కళ్ళజోడు. జుత్తు తెల్లబడుతోంది.

మనిషే కాదు...

ఆయన మనసుకూడా మంచిది. ఆయన టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీస్‌లో సీనియర్‌ అధికారి, చాలా స్ట్రిక్టు. లంచం అనేమాట దరికి రానీయని నిజాయితీపరుడు. పరువు ప్రతిష్ఠలంటే ప్రాణం.

గోవిందరావు, ప్రశాంతిలది ఆదర్శదాంపత్యం. ఆవిడ ఆమాయకత్వం, ఆయన తెలివి తేటలతో ఆ కుటుంబం సుఖసంతోషాలతో నందనవనంలా సాగిపోతోంది.

ఆ దంపతులకి మొత్తం ముగ్గురు సంతానం.
పెద్దవాడు త్రివిక్రమ్‌.
ఇతను ఇంటర్‌ రెండుసార్లు తప్పి, ఇక ఈ చదువులు నాకు వద్దు బాబోయ్‌ అంటూ గాలికి తిరుగుతున్నాడు. గోవిందరావు దంపతులకు ఏదన్నా ఒక చింత వుందీ అంటే అది పెద్దకొడుకు త్రివిక్రమ్‌ గురించే.

ఏ తండ్రి అయినా తన కొడుకు బాగా చదవాలని, గొప్పవాడు కావాలని ఆశిస్తాడు. కాని త్రివిక్రమ్‌ విషయంలో అది నిరాశే అయింది. అందుకే పెద్దకొడుకును పట్టించుకోవటం ఆయన మానేసి చాలాకాలమైంది. ఇప్పుడాయన ఆశలన్నీ రెండో కొడుకు చక్రధర్‌ మీదే.

చక్రధర్‌ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌. బెస్ట్‌ స్టూడెంట్‌.
ఇక మూడో సంతానం ఆడపిల్ల....

ఆ అమ్మాయి పేరు రమ్య. డిగ్రీ ఫైనలియర్‌ స్టూడెంట్‌.

రమ్య చాలా అందంగా వుంటుంది. చక్కని తెలివితేటలున్నాయి. పరీక్షలు అయిపోగానే రమ్యకు పెళ్ళిచేసి పంపించేయాలనే ఆలోచనలో వున్నారు గోవిందరావు దంపతులు. రమ్యకు మాత్రం ఇంకా పైచదువులు చదవాలని ఆశ.

చక్రధర్‌, రమ్యలు చాలా కష్టపడి చదువుకొంటుంటే, పెద్దకొడుకు త్రివిక్రమ్‌ మాత్రం పనీపాటాలేకుండా గాలికి తిరగటం ఇంట్లో అందరికీ బాధగానేవున్నా చేయగలిగింది ఏమీలేని పరిస్థితి. త్రివిక్రమ్‌ని మార్చటం ఎవరివల్లా కాలేదు. అతను మారతాడన్న నమ్మకం కూడా ఇప్పుడు గోవిందరావుకి లేదు. అదీ ఆ కుటుంబం పరిస్థితి.

ఆవిడ ఎదురుగా రావటం ఆయన గమనించాడు.
పేపర్‌లోంచి ముఖం పైకెత్తి....

గోల్డ్‌ఫ్రేం కళ్ళజోడు సవరించుకుంటూ చూసాడు భార్యని, అట్లకాడతో ఆవిడ నిరసన ప్రదర్శన చూడగానే ఆయనకు అర్థమైపోయింది ఆమె చాలా కోపంగా వుందని అందుకే తను ఆమె కోపం తగ్గించటానికి చిరునవ్వుల వెన్నెల రువ్వాడు.

''చూడు! నాకు అట్లు తినటం చాలా ఇష్టమని నువ్విలా అట్లకాడతో బెదిరిస్తే ఎలాగోయ్‌ అర్థాంగీ. ఈ కినుకలు అలకలు ఏలనే లలనామణీ?'' అంటూ నాటక ఫక్కీలో ప్రశ్నించాడు.
ఆవిడ రుసరుసలాడుతూ చూసింది.    

''నేను కిచెన్‌లో వుండగానే మీరు ఈ ప్రశ్న అడగాలి. అరిచి పిలిచాను, అయినా ఎందుకని ఒక్కమాట మీరు అడిగారా?'' దబాయించిందావిడ. ఆయన కొంచెం కూడా బెదరలేదు. అదే తొణకని చిరనవ్వు.

''ఎలాగూ నువ్వు చెప్తావని అడగలేదు. అయినా ఇదేమన్నా మైక్‌ టెస్టింగా! నాకు వినబడుతుందో లేదో టెస్ట్‌ చేయటానికి? ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు ఏమిటి విషయం?''

''టిఫిన్‌ రెడీ అవుతోంది. పెద్దాడింకా రాలేదు'' రిపోర్ట్‌ చేసిందావిడ. ఆమె బాధ ఏమిటో -
ఇప్పుడు అర్ధమైపోయింది ఆయనకు పెద్దోడు అంటే ఎవడోకాదు... పెద్దకొడుకు త్రివిక్రమ్‌.

ఆవిడ రిపోర్టు వినగానే అర్జంటుగా మారిపోయాయి ఆయన ముఖంలో రంగులు. కాని ఇవేమీ గమనించని ఆయన భార్య ప్రశాంతి మాత్రం తన మాటల్ని కంటిన్యూచేసిది.

''లేవగానే బుద్దిగా ముఖం కడుక్కున్నాడు. స్నానంచేసి బట్టలు మార్చుకున్నాడు ఇప్పుడే వస్తాను మమ్మీ అంటూ బయటికెళ్ళిన బిడ్డ ఇంకా తిరిగిరాలేదు. వాడసలే ఆకలికి ఆగలేడు. మీతో ఏమన్నా చెప్పాడా? అనడిగింది.

''వాడు నాతో చెప్పడు. చెప్పినా నాకు వినబడదు. వాడి గురించినాదగ్గర మాట్లాడవద్దని నీకు చాలాసార్లు చెప్పాను'' అన్నాడు సీరియస్‌గా.

''మీరు చెప్పారు. అందుకని పట్టించుకోడం మానేస్తానా? వాడు మన బిడ్డండి వాడు ఆకలితో బాధపడితే చూస్తూ వూరుకోగలమా?''

''వాడేకాదు, ఇక్కడ ఇంకా ముగ్గురికి ఆకలేస్తోంది మమ్మీ మమ్మల్ని నువ్వు పట్టించుకోవా?'' అంటూ అక్కడికొచ్చాడు రెండో కొడుకు చక్రధర్‌.

''అదేగదా..... పెద్దన్నయ్య ఏదో మంత్రం వేసాడు. లేకపోతే మనం అంతావున్నా మమ్మీ అన్నయ్య గురించే తలుచుకుంటుందేమిటి?'' అంది తనూ వచ్చి తండ్రి పక్కన కూర్చుంటూ రమ్య.

''అలా అడగండిరా. అప్పుడన్నా మీ మమ్మీకి జ్ఞానోదయం అవుతుందేమో. కష్టపడి చదివే పిల్లలిద్దర్నీ వదిలేసి, ఊరిమీద భలాదూర్‌గా తిరిగే పెద్దకొడుకు గురించే ఎందుకు బెంగ?'' అంటూ విసుక్కున్నాడు గోవిందరావు.

ఇవాళరేపు రాజకీయనాయకులు ఎంత సంపాదిస్తున్నారో చూడు. ''అలా ఎంపి, ఎమ్‌.ఎల్‌.ఎ అవ్వటం ఇలా కోట్లు సంపాదించంటం''. అటు కేంద్రంలో బొగ్గు కుంభకోణంలో గాని, ఇటు భూదందాలో గాని ఇరుక్కోక పాయె. కనీసం ఏర్పాటు వాదంలో ఇరుక్కున్నా కోట్లు సంపాదించేవాడు.

భర్త మాటలకి బాధగా చూసింది ప్రశాంతి.
''ఏమిటండి మీరుకూడాను. తల్లిప్రేమ ఎలాంటిదో మీకు తెలీదా?'' అంటూ కళ్ళు తుడుచుకుంది.

''ముగ్గురూ నా పిల్లలుకారా ఏమిటి? నాకు అందరూ ఒక్కటే. చిన్నోడు బాగా చదివి ఇంజనీరవుతాడు. డిగ్రీపాసయి పెళ్ళి చేసుకొని రమ్య అత్తారింటికి వెళ్ళిపోతుంది. వీళ్ళ గురించి నాకేదిగులూలేదు. కాని త్రివిక్రమ్‌ ఏమవుతాడు? బాగా చదువుకుంటే వాడూ గొప్పవాడయ్యేవాడేమో. ఇంటర్‌లోనే వాడి చదువు ఆగిపోయింది. మనమే వాడ్ని వెలివేస్తే వాడేమయిపోతాడు చెప్పండి'' అంటూ మనసులోమాట బయటపెట్టింది.

''అది వాడి ఖర్మ. నేనేమన్నా వాడ్ని చదువుకోవద్దన్నానా? నా ఇంట్లో ఒక డాక్టరు, ఒక ఇంజనీర్‌ వుండాలనుకున్నాను పెద్దాడ్ని డాక్టర్‌ చేయాలనుకున్నాను. రాజకీయ నాయకుడిగా కూడా పనికిరాని శుంఠ వాడు'' విసుకున్నాడాయన.

''మీరు వాడ్ని తిడితే వూరుకోను...'' వెంటనే డిక్లేర్‌ చేసింది ప్రశాంతి.
''అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. అంటే ఏమిటో తెలుసా?'' తిరిగి తనే అడిగింది.

''నాకు తెలీదులే నువ్వే  చెప్పు'' అన్నాడు బట్టతల తడవుకుంటూ గోవిందరావు. వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటున్నారు చక్రధర్‌, రమ్యలు.

''ఇదికూడా మీకు తెలీదు. కొడుకులేని వాళ్ళకి ఉత్తమగతులు దొరకవట. మనల్ని పున్నామా నరకంనుంచి తప్పించటానికి ముందుగా పుట్టిన కొడుకండి వాడు. వాడ్ని తిడతారేమిటి? అంది.

''హలో భార్యామణి నువ్వు ప్రశాంతివి కాదే, నా పాలిట అశాంతివి. నీ తెలివి సంస్కృతానికి తక్కువ, తెలుగుకి ఎక్కువాను. అపుత్రస్య గతిర్నాస్తి అన్న పెద్దలే జేష్ఠపుత్రా కొంప పీకరా అనికూడా అన్నారు. ఇది తెలుసా నీకు? అడిగాడాయన.

అంతే ఇక ఆపుకోలేక  చక్రధర్‌, రమ్యలు పకపకా నవ్వేసారు. ప్రశాంతి ఉడుక్కొంటూ అట్లకాడతో వాళ్ళకి చెరొకటి యిచ్చింది. 
''నవ్వులాటగా వుందా ? నోరు ముయ్యండి... ...'' అంటూ కసురుకుంది.

''వాళ్ళమీద కోప్పడతావేమిటి? మన జేష్ఠుడు త్రివిక్రమ్‌ చేస్తోంది ప్రస్తుతం అదే. మనకొంప పరువేకాదు. నా పరువు కూడా పీకి వీధిలో పారేస్తున్నాడు. నువ్విలా వాడ్ని వెనకేసుకొచ్చే చెడగొడుతున్నావ్‌? అంటూ హెచ్చరించాడు.

''వాడేం చెడిపోలేదు'' అంటూ కొడుకుని వెనకేసుకొచ్చిందావిడ. ''ఏం చెడిపోయాడు చెప్పండి? క్రిందటిసారి మీరు గొడవచేసినప్పట్నుంచి వాడు మీ దగ్గర్నుంచి ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు. ఆ సంగతి మర్చిపోయారా? వాడి బట్టలువాడు ఉతుక్కుంటున్నాడు. వాడి ఖర్చులకు వాడు సంపాదించుకుంటున్నాడు. అంతేనా? మీరు ఉద్యోగానికి పరుగులు తీస్తారు. వాళ్ళిద్దరూ చదువులకోసం పరుగులు తీస్తారు. ఇంట్లోకి వెచ్చాలు, ఉప్పులు, ఏం కావాలన్నా, ఇంటి నౌఖర్లా ఏం కావాలన్నా తెచ్చిపడేసేది వాడే. అయినా తిట్లు, చివాట్లు వాడికే. ఇంకోసారి రాజకీయ నాయకులతో పోలిస్తే ఊరుకోను. అంతా వాడి ఖర్మ. రండి మీరు టిఫిన్‌ చేద్దురుగాని'' అంటూ కళ్ళు తుడుచుకుంటూ కిచెన్‌లోకి వెళ్ళిపోయిందావిడి.

గోవిందరావు బట్టతల తడవుకుంటూ చిన్నకొడుకు వంక చూశాడు. ''ఏరా చక్రి, మీ మమ్మీకి సెంటిమెంట్‌ ఎక్కువైపోయిందిరా. వాడు వచ్చేదాకా ఈవిడ టిఫిన్‌ చేయదు. మీ అగ్రజుని జాడ మీకయినా తెలుసా?'' అనడిగాడు వ్యంగ్యంగా.

''డాడీ. మమ్మీ పిచ్చిగాని, అన్నయ్య ఆకలితో కూర్చునే ఛాన్సేలేదు. ఈపాటికి ఎవడి జేబునో ఖాళీచేసి, టిఫిన్లు, కాఫీలు లాగించేసి వుంటాడు. పక్షులన్నీ సాయంత్రం గూళ్ళకి చేరతాయి. కానీ వీళ్ళంతా పొద్దున్నే అవతలి వీధిలోని కాకాహోటల్‌ దగ్గర చేరతారు.'' అంటూ అసలు విషయం బయటపెట్టాడు చక్రధర్‌.

''సరిసరి. ఈ మాట మీ మమ్మీతో చెప్పమాక. వెళ్ళి వాడ్ని తీసుకొస్తేనే టిఫిన్‌ అంటూ హఠం చేస్తుంది లేవండి  వాడ్ని అటు నరేంద్రమోడి దగ్గరో, ఇటు చంద్రబాబు నాయుడు దగ్గరో చేరిస్తేగాని బాగు పడడు'' అంటూ కొడుకును హెచ్చరించాడాయన.

చక్రధర్‌, రమ్యలు తండ్రివెంట డైనింగ్‌రూంవైపు అడుగులువేసారు.

చక్రధర్‌ మాటలు అక్షరసత్యాలు. ఇక్కడ వీరంతా డైనింగ్‌రూంలో టిఫిన్‌లు కానిస్తున్న అదే సమయంలో - త్రివిక్రమ్‌ కొంత మంది ఫ్రెండ్స్‌తో అవతలి వీధి కాకా హోటల్‌ సమీపంలోనే వున్నాడు.

***

అది వంకర టింకర వీది.

అ వీధిని అడ్డంగా మరో వీధి క్రాస్‌ చేస్తోంది. ఆ నాలుగురోడ్ల కూడలికి కుడిపక్కన వుంది ఏనాటిదో ఒక శివాలయం. ఆలయం పక్కన పెద్దవృక్షం, దానిచుట్టూ చక్కటి తిన్నె వున్నాయి. త్రివిక్రమ్‌తోబాటు పదిమంది ఫ్రెండ్స్‌ ఆ తిన్నెమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

''ఓ. కే. నేను డ్రాప్‌ అయిపోతున్నారా, వెళ్ళిపోతాను...'' అంటూ లేచాడు శివ. అతను త్రివిక్రమ్‌కి క్లోజ్‌ ఫ్రెండ్‌. పూర్తి పేరు శివశంకర్‌. అంతా శివా అనే పిలుస్తారు.

''ఏమైందిరా ? అంత అర్జంట్‌ పనేమొచ్చిపడింది? ''ఆశ్చర్యంగా అడిగాడు త్రివిక్రమ్‌. ''పనిలేదు, సిగరెట్లు అయిపోయాయి.....'' తన బాధ చెప్పాడు శివ "మన సెల్వం ఉండగా దిగులెందుకురా? వెళ్ళి పాకెట్‌ పట్రా'' సలహా యిచ్చాడు త్రివిక్రమ్‌.

''సర్లే సిగరెట్లు అడిగితే ఆ సెల్వం తరుముకొచ్చేలా వున్నాడు. పాత బాకీ అలాగే వుంది. టిఫిను, సిగరెట్లు అన్నీ కట్‌ అని నిన్నే చెప్పాడు''.   

''అంతమాటన్నాడా, పద చెప్తా'' అంటూ లేచాడు త్రివిక్రమ్‌. ఫ్రెండ్స్‌ అంతా అతడ్ని అనుమానంగా చూసారు.  ''నీ దగ్గర డబ్బులున్నాయా?'' అడిగాడు శివా. ''ఒక్క పైసా కూడా లేదు. ''అయితే వెళ్ళటం వేస్ట్‌, అరచి గీ పెట్టినా ఆ నాడారు అరకప్పు చాయ్‌కూడా అరువు యివ్వడు.

''ఓ. కే. నీ దగ్గర డబ్బులేదు. నాడారు అప్పుపెట్టడు. అయినా మీ అందరికీ టీలు, టిఫిన్లతోబాటు సిగరెట్లు కూడా ఏర్పాటు చేస్తాను బెట్‌ కడతావా?'' నవ్వుతూ అడిగాడు అందర్నీ  చూస్తూ.

''అంటే నీ ఉద్దేశం ఏమిట్రా త్రివిక్రమ్‌. బెట్‌ అంటే  జెట్‌ వేగంతో పారిపోతామనా? నీ పప్పులు నాడార్‌ దగ్గర వుడకవు. కావాలంటే నేను బెట్‌ కాస్తాను'' అంటూ ముందుకొచ్చాడు మౌని అనే ఫ్రెండు.

''ఒరే మౌని. వీడి సంగతి తెలిసి కూడా ఏమిట్రా.... మౌనంగా వుండొచ్చుగా'' విసుక్కున్నాడు శివా. ఫరవాలేదురా. వీడి టాలెంట్‌కి ఇదో పరీక్ష, చెప్పరా. త్రివిక్రమ్‌, పందెం ఎంత?

''వెయ్యి... ఎవరు ఓడినా వెయ్యిరూపాయలు ఇచ్చుకోవాలి. ఇవాళే యివ్వనక్కరలేదు. మనలో మనం గాబట్టి, రేపు రాత్రికి యిస్తే చాలు. ఓకేనా?''

''ఓ.కే. '' అయితే పదండి.''
''అయిపోయాడు. ఇవాళ నాడారు నెత్తికి రెండు చేతులూ వచ్చేసి నట్లే'' అనుకుంటూ వాళ్ళని అనుసరించాడు శివా.
అక్కడికి దగ్గరలోనే వుంది కాకాహోటల్‌. 

నాలుగురోడ్లు కూడలి గాబట్టి స్థానికంగా ఆ ప్లేస్‌ని శివాలయం సెంటర్‌ అంటారు. సిమెంట్‌ రేకులతో నిర్మించిన ఓపెన్‌షెడ్‌లో వుంది ఆ హోటల్‌. దాని ఓనరు తమిళనాడువాడు. పేరు సెల్వం.

సుమారు నలభై సంవత్సరాల వయసులో పొట్టిగా వుండే సెల్వం పూర్తి పేరు పన్నీర్‌ సెల్వం. అతను తమిళనాడుకు చెందిన నాడారు. ఆంధ్రావచ్చి ఆరేళ్ళయినా ఇంకా తెలుగు సరిగా వంటబట్టలేదు.

అక్కడ అరడజను వీధులకి ఇదొక్కటే హోటల్‌ కావటంవలన అతని హోటల్‌ బాగానే సాగుతోంది. అతను చేసే యాలక్కాల టీ సూపర్‌గా వుంటుంది. ఆ టీ కోసమే చాలామంది శివాలయం సెంట్‌ర్‌కు వస్తుంటారు.

సెల్వంకి ఇంకా పెళ్ళికాలేదు అంటారు. పెళ్ళయిందికాని, ఏవో గొడవల కారణంగా భార్యాభర్తలు విడిపోయారు అందుకే సెల్వం ఆంధ్రాకి వలస వచ్చేసాడంటారు కొందరు. ఇద్దరు పనివాళ్ళని పెట్టుకొని, ఆ హోటల్‌మీద ఆధారపడి బ్రతుకుతూ, ప్రస్తుతం బాగానే సంపాదిస్తూన్నాడు సెల్వం.

సెల్వం మంచివాడు. బోళాశంకరుడు, అందరితో కలుపుగోలుగా వుంటాడు. అందుకే అతని హోటల్‌ ఎప్పుడూ కష్టమర్లతో సందడిగా వుంటుంది.

కుర్రాళ్ళందర్నీ వెంటేసుకుని త్రివిక్రమ్‌ రావటంచూసి నొసలు విరిచి అనుమానంగా చూసాడు సెల్వం.
''ఎన్నాచ్చి! సౌక్యమా?'' వస్తూనే పలకరించాడు త్రివిక్రమ్‌.
''సౌక్యందా తంబీ.... ఇనిమేల్‌ దా...... ఎప్పడియో...... ఎన్ను ఎల్లోరుంసేంది వన్నా వందిట్టీంగ?
వీళ్ళ అరవగోల అర్ధంగాక జుట్టు పీక్కున్నాడు శివా.
''అపుతారా మీ గోల... మాక్కూడా అర్ధమయ్యేలా  తెలుగులో మాట్లాడండిరా'' అనరిచాడు.
ఆ మాటలకి నవ్వాడు సెల్వం.

''ఇది కూడా తెల్వదా తంబీ ......... నన్ను వీడు క్షేమమాని విచారిస్తున్నాడు. క్షేమందా........ ఇక నుంచి దా ............. ఎలాగో అంటున్నాను. పాత బాకీ అలాగే వుంది. మీరెల్లోరు కలిసి వచ్చినా ఒక్కరూపాయి కూడా కడన్‌ యివ్వను.... యివ్వను.... యివ్వను'' అంటూ తెగేసి చెప్పాడు నాడారు.

''అడ తమిళ్‌ సెల్వమ్‌........ వీరమే....... తమిళ్‌  తేజమ్‌....... పోదుమ్‌ పోదుమ్‌ ఎనకురల్‌ కొడుత్తాలుమ్‌ అళ్ళి అళ్ళి కొడుత్త వళ్ళల్‌ పురంద తమిళగత్తి లిరుందు వందనీయా ఇప్పడికడన్‌ తరమరుక్కురాయ్‌'' అంటూ బాధగా చూసాడు త్రివిక్రమ్‌.

ముఖముఖాలు చూసుకుంటున్న కుర్రాళ్ళని చూసి పళ్ళికిలించాడు సెల్వం. ''ఆహా ముత్తు ముత్తా తమిళ్‌ వార్త వింటానికి చెవుల్లో తేనెపోస్తున్నంత తియ్యగా వున్నది తంబి. ఏండా. వీడు చెప్పింది అర్ధముకాలేదా పేయ్యాటమా పాకరీంగ... అంటే దయ్యాల్లా చూస్తున్నారని. ఈ త్రివిక్రముడు నన్ను ములగచెట్టు ఎక్కించాలని చూస్తుండప్పా. వద్దు వద్దంటూన్నా దోసిళ్ళతో ధానధర్మాలు చేసిన గొప్పవాండ్లు పుట్టిన అరవదేశం నుంచి వచ్చి అప్పుపెట్టడానికి భయపడుతుండాదాని అడుగుతున్నాడు.  వూహు.... కడన్‌ ఇల్లై...... అప్పులేదు. బాకీ కట్టండి. అప్పు తీసుకోండి. వెళ్ళండి'' అంటూ అందరికీ అర్ధమయ్యేలా వివరించాడు.

సెల్వం సంగతి త్రివిక్రమ్‌కి తెలుసు.   
ఓ పట్టాన లొంగే మనిషి కాదు.

''ఇదిగో తమిళ్‌ సెల్వమ్‌..... నేను అప్పు అడగటంలేదు. యుద్ద భూమిలో శతృవుకు వీపు చూపించని వీరభూమి అరవదేశంనుంచి వచ్చావ్‌. నాతో పోటీపడు.

''పడను...... నేనిక్కడకి వచ్చింది బతకడానికి, పందాలు వేయటానిక్కాదు''

''నీకు అవ్వయ్యార్‌ కథ తెలుసా?''

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్